రచన: అనిల్ ఎస్. రాయల్

ఆంధ్రజ్యోతి‘, 20 జూలై 2014


 

గేటు తెరుచుకున్న శబ్దానికి ఆ వృద్ధ దంపతులిద్దరూ తలెత్తి చూశారు.

ఓ యువకుడు లోపలకి అడుగుపెట్టి తిరిగి గేట్ వేస్తున్నాడు. 

“మీ కోసమే అనుకుంటా” అంటూ లేచి పనున్నట్లు ఇంట్లోకి వెళ్లిందామె. విశాలమైన వరండాలో ఆయనొక్కడే మిగిలాడు. 

పండుటాకులా ఉన్నాడాయన. కనబడని భారమేదో మోస్తున్నట్లు భుజాలు కిందకి ఒంగిపోయి ఉన్నాయి. కళ్లలో కాంతిపుంజాలకి బదులు బాధేదో కదలాడుతోంది. చేతిలో బాగా నలిగిపోయిన పాత పుస్తకం ఉంది. ఇరవై నాలుగో పేజ్ చదువుతున్నాడప్పుడు. ఎదురుగా కాఫీ టేబుల్. దాని మధ్యలో ఉన్న రేడియో క్లాక్ తేదీతో సహా సమయాన్ని చూపిస్తోంది. అందులో గురువారం ఉదయం తొమ్మిది గంటలయింది. 

యువకుడు నేరుగా వృద్ధుడి వద్దకు నడిచాడు. పుస్తకం మూసేసి టేబుల్ మీదుంచుతూ అడిగాడాయన. “ఎవరు బాబూ నువ్వు? ఏం కావాలి?”

యువకుడు బదులీయకుండా ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. అతడికేసి పరీక్షగా చూశాడాయన. ముప్పై ఐదుకి అటూ ఇటూగా ఉన్నాడతడు. ముఖంలో కారుణ్యం కనిపిస్తోంది.

“గుర్తుపట్టలేదా?”, పది క్షణాల తర్వాత కూడా అలాగే పరికించి చూస్తున్న ఆయన్ని అడిగాడతడు, చిరునవ్వుతో.

“ఎవర్నీ గుర్తుపట్టేది. నిన్నా? ఎప్పుడూ చూడలేదే” అన్నాడాయన కొంచెం విసుగ్గా. 

“ప్రయత్నించండి. గుర్తుకు రావచ్చు”

“బాబూ. నువ్వెవరో కానీ నా గురించి ఏమీ తెలీదనుకుంటా. నేనేదైనా ఒకసారి చూస్తే జన్మలో మర్చిపోను. హైపర్‌తైమీషియా పేరెప్పుడన్నా విన్నావా? నా కండిషన్‌కి వైద్యులిచ్చిన పేరది. చూసిన ప్రతి విషయమూ కళ్లకి కట్టినట్లు గుర్తుంటుంది నాకు. ఒక తేదీ తల్చుకుంటే ఆ నాడు నాకెదురైన సంఘటనలన్నీ చిన్న చిన్న వివరాలతో సహా ఆటోమేటిక్‌గా గుర్తొచ్చేస్తాయి. కొందరు డాక్టర్లు దీన్నో అద్భుత శక్తి అన్నారు, ఇంకొందరు ఇదో అంతుపట్టని వ్యాధి అన్నారు. ఎవరేమన్నా, దాని వల్ల నేను అనుభవించే క్షోభ మాత్రం ఎవరికీ అర్ధం కాదు”, విసురుగా చెప్పాడాయన.

“నిజమే. హైపర్‌తైమీషియా ఉన్న వాళ్లకి మాత్రమే ఆ బాధ అర్ధమవుతుంది. ప్రపంచంలో అలాంటివారు ఇరవై మందికి మించి లేరు”.

వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. “ఓహ్. నీకు దాని గురించి తెలుసా! కొంపదీసి, నీకూ ఆ జబ్బుందా?”, అన్నాడు. ఈ సారి ఆయన గొంతులో విసుగు లేదు.

“లేదండి. కానీ దాని గురించి కొద్దిగా తెలుసు. మెదడుకి సంబంధించిన ఈ కండిషన్‌ని హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫికల్ మెమొరీ అని కూడా అంటారు. ఇది ఉన్నవాళ్లు చూసిన ప్రతి విషయాన్నీ గుర్తుంచుకోవటమే కాదు,  తలచుకున్న వెంటనే ఆ సన్నివేశాలు మళ్లీ తమ కళ్లెదురుగా కనిపిస్తున్న అనుభూతికి గురవుతారు. దీని వల్ల కొన్నిసార్లు ప్రస్తుతానికీ, గతానికీ తేడా తెలుసుకోలేని గందరగోళంలో పడిపోతారు. ఈ జబ్బుకి చికిత్స లేదు. ఇది ముదిరేకొద్దీ రోగులు అదే పనిగా పాత సంఘటనలేవో తలచుకుంటూ అవి కలగజేసే భావోద్వేగాలు మళ్లీ మళ్లీ అనుభవిస్తూ బతుకుతుంటారు”

“సరిగా చెప్పావు. అయితే ‘బతుకుతుంటారు’ అని కాదు. అనుక్షణమూ నరకయాతన అనుభవిస్తుంటారు అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అదే పనిగా గుర్తుచేసుకుని ఆనందించటానికి మనుషులకన్నీ మధుర జ్ఞాపకాలే ఉండవు కదా. మరచిపోవాలనుకునేవీ ఉంటాయి. నాకూ ఉన్నాయి అలాంటివి. ఎన్నోకాదులే …. ఒకే ఒకటి. కానీ ఆ శక్తి మాత్రం పైవాడు నాకివ్వలేదు. మీకందరికీ పాతబడేకొద్దీ గతపు జ్ఞాపకాలు మసకబారతాయి. కానీ నా జ్ఞాపకాలెప్పుడూ పచ్చిగానే ఉంటాయి. పదునుగా గుచ్చుకుంటూనే ఉంటాయి. పాతర వేయాలనుకునే గతంలో పదే పదే జీవించటం ఎంత నరకమో ఊహించగలవా?”. వృద్ధుడి గొంతు బొంగురుపోయింది. వదలని జ్ఞాపకపు నీడేదో కమ్ముకున్నట్లు ఆయన ముఖం వేదనాభరితమయింది. 

యువకుడి వదనంలో సానుభూతి కవళికొకటి కదలాడింది. మంద్రమైన స్వరంతో మెల్లిగా అన్నాడు. “పంచుకుంటే సంతోషం రెట్టింపు, బాధ సగమూ అవుతాయంటారు కదా. ఆ పని చేసి ఉండాల్సింది”

వృద్ధుడు గొంతు పెగల్చి గొణుక్కుంటున్నట్లు చెప్పాడు. “నిజమే. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందో లేదో, భారం మాత్రం తగ్గొచ్చు. కానీ ఎవరికి చెప్పను? నా కోసం ప్రాణమిచ్చే భార్యుంది. రత్నాల్లాంటి పిల్లలిద్దరున్నారు. మంచి స్నేహితులున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోలేను. ఎందుకు? వాళ్ల దృష్టిలో నేనో మచ్చలేని మనిషిని కాబట్టి. నా తప్పు బయట పెట్టి తప్పుడు మనిషినయ్యే ధైర్యం లేక ఇన్నేళ్లూ నాలోనే దాచుకున్నా. డెబ్భై రెండేళ్లు నాకు. ఇక ఎన్నాళ్లో ఉండను. పోయేలోగా ఎవరితోనన్నా పంచుకోకపోతే ఈ బరువంతా నాకు తోడుగా సమాధిలోకొస్తుందనే ఊహ భయపెడుతుంది. కానీ నా భార్యకు జరిగింది తెలిస్తే గుండె పగులుతుంది. అందుకే ….”

చెప్పేది మధ్యలో ఆపేసి యువకుడివైపు చూస్తూ అన్నాడాయన. “ఇదంతా నీకెందుకు చెబుతున్నానో తెలీదు. ఆప్తమిత్రులతోనూ పంచుకోని సంగతులివి. ఓ కొత్తవాడితో చెబుతున్నానంటే ఆశ్చర్యంగా ఉంది”

యువకుడు చిరునవ్వుతో చెప్పాడు, “నన్ను చూస్తే వేరెవరన్నా గుర్తొచ్చారేమో. బహుశా, మీరు మర్చిపోవాలనుకునే ఆ గతానికి చెందిన వారు. అదొదిలేయండి. కొన్ని సంగతులు దగ్గరివారితో చెప్పుకోటానికి ఏవో మొహమాటాలు అడ్డురావచ్చు కానీ కొత్తవారితో ఆ సమస్య ఉండదు కదా. ఎటూ మొదలు పెట్టారు కాబట్టి, మొత్తం చెప్పేయటానికి మీకు అభ్యంతరం లేకపోతే, వినటానికి నేను సిద్ధం”

వృద్ధుడు అనుమానంగా చూస్తూ అన్నాడు. “అసలింతకీ ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? అది చెప్పకుండా నన్ను మాటల్లో పెట్టి చాలా మాట్లాడించేశావిప్పటికే. చెప్పు. ఎవరు నువ్వు?”

“నా గురించి చెప్పేస్తే ఇక నేను కొత్తవాడినెలా అవుతాను? అప్పుడిక మీ భారం పంచుకోలేరు. కాబట్టి నా సంగతొదిలేసి మీ గుట్టు విప్పండి ముందు. తర్వాత నేనెవర్నో చెబుతా. మీ రహస్యం నా వద్ద భద్రంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఏమంటారు?”

తల గోక్కున్నాడాయన. తర్వాత దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి తల విదిలిస్తూ చెప్పాడు. “నువ్వనేది తర్కబద్ధంగా అనిపించటం లేదు కానీ నిన్ను నమ్మొచ్చని నా మనసు చెబుతోంది. గట్ ఫీలింగ్ అంటారు చూడు, అదన్నమాట.  వ్యాపారంలో కీలక సమయాల్లో చాలా సార్లు ఈ గట్ ఫీలింగే నన్ను గట్టెక్కించింది. ఇప్పుడూ నా అంచనా తప్పదన్న నమ్మకంతో నా చీకటి గతం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నా”

యువకుడు వినటానికి సిద్ధమైనట్లు కుర్చీలో ముందుకి వంగి కూర్చున్నాడు. 

వృద్ధుడు గుండె నిండా గాలి పీల్చుకుని వదిలి చెప్పటం మొదలు పెట్టాడు.

“ముప్పయ్యేళ్ల పైమాటిది. నేను వ్యాపారంలో వరుస విజయాలు చవిచూస్తూ పైకెదుగుతున్న రోజులవి. డబ్బు, పరపతి, చక్కటి కుటుంబం. తోడుగా, మంచివాడినన్న పేరు. నా తరంలో మంచివాడంటే మందు ముట్టనివాడు, పరకాంత పొందు కోరనివాడు, పేకాట రానివాడు. ఇప్పట్లో ఇవన్నీ మామూలైపోయి మంచితనానికి నిర్వచనం మారిపోయిందనుకో. అప్పటి లెక్కల ప్రకారం నేను మంచివాడినే. అందరికీ తలలో నాలుకలా ఉండేవాడిని. ఎవరినీ నిందించేవాడిని కాదు. వ్యాపారంలో నిజాయితీగా ఉండేవాడిని. ఎరిగిన వాళ్లంతా నన్నో సంపూర్ణ మానవుడని కొనియాడేవాళ్లు. మొత్తమ్మీద చీకూ చింతా లేకుండా జీవితం సుఖంగా గడుస్తుండేది. అయితే, అలవాటు పడితే సుఖం కూడా ముఖం మొత్తుతుంది కదా. అదే జరిగింది నా విషయంలో. అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారో తెలుసా?”

“మార్పు కోరుకుంటారు. దాని కోసం ఏదైనా పిచ్చిపని చెయ్యటానికైనా సిద్ధమవుతారు”

“పిచ్చిపని ….. ఎక్జాక్ట్‌లీ. అదే చేశానప్పుడు. ఆ రోజు నేను గోవాలో ఉన్నాను. పగలంతా తీరికలేకుండా ఒక వ్యాపార ఒప్పందం మీద పనిచేశాను. సాయంత్రానికి ఒప్పందం ఖరారయింది. నా వ్యాపారంలో అదో పెద్ద ముందడుగు. చాలా సంతోషకరమైన సందర్భమది. నాకే కాదు, అవతలి పక్షానికి కూడా. ఇలాంటప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం కద్దు. ఆ సాయంత్రం మా సెలబ్రేషన్ ‌ఓ ప్రముఖ బార్‌లో జరిగింది. మందు ఏరులై పారింది. ఎప్పుడూ దాన్ని ముట్టని నాకు, జీవితంలో మొదటిసారి, ఆ రుచేదో చూడాలనిపించింది. ‘ఈ ఒక్క సారే’ అనుకుంటూ ఓ గ్లాస్ పుచ్చుకున్నాను”

“తర్వాత?”

“ఇలాంటి పార్టీల్లో కొందరు మగాళ్లు మందు దగ్గరే ఆగకుండా ఇంకా ముందుకు పోతారు. వాళ్ల కోసం వలపు వలలతో సిద్ధంగా ఉండే వారకాంతలకి కరువుండని ప్రదేశమది. కానీ నా మనసులో నా భార్య తప్ప ఎవరూ అడుగుపెట్టింది లేదు …. ఆ రేయి వరకూ. ఆ వేళ …. నషాలో నా నరాలు వానరాలయ్యాయి. అప్పటికే కొన్నాళ్లుగా పిచ్చిపనేదో చెయ్యమని రెచ్చగొడుతున్న మనసుని అవి మూకుమ్మడిగా కమ్ముకున్నాయి. అలాంటి స్థితిలో ఉండగా ఓ అమ్మాయి …. పాతికేళ్లుంటాయేమో ….  చిలిపిగా పలకరించింది. ఆ బాపతే అని అర్ధమయింది. మరో ఆలోచన లేకుండా ఆమె చెయ్యందుకున్నాను. ఎవరూ గమనించకుండా ఆమెతో బయటికి జారుకున్నాను. కాసేపటి తర్వాత నా జీపులో ఇద్దరం కలసి నా కాటేజ్ దిశగా ప్రయాణిస్తున్నాం”

“ప్లీజ్, కంటిన్యూ”

“బిజినెస్ ట్రిప్స్ కోసం వెళ్లినప్పుడు నగరాల్లో విలాసవంతమైన హోటళ్లలో కాకుండా జనావాసం తక్కువగా ఉండేప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడేవాడిని. ప్రకృతి ఒడిలో సేదదీరటం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ట్రిప్‌లో కూడా అలాగే సమీపంలో ఉన్న అడవిలో ఓ కాటేజ్ తీసుకుని ఉన్నాను. అక్కడికే తీసుకెళుతున్నానామెని. అర్ధగంటలోపే అడవిలో ప్రవేశించాం. ఇరుకు రహదారి మీద దాదాపు వాహన సంచారం లేదు. చుట్టూ చీకటి. హెడ్ లైట్ల వెలుగులో రోడ్డొక్కటే కనిపిస్తుంది. సాధారణంగా అతి జాగ్రత్తగా బండి నడిపే నేను ఆ రాత్రి మాత్రం మితి మీరిన వేగంతో వెళుతున్నాను. ఆమె తన సంగతులేవో చెబుతుంది. ఎప్పుడెప్పుడు కాటేజ్ చేరదామా అన్న ఆత్రంలో ఆమె మాటలు అన్యమనస్కంగా వింటూ డ్రైవ్ చేస్తున్నాను. అప్పుడు జరిగిందది”

యువకుడి స్పందన కోసమన్నట్లు ఆగాడాయన. అతడు ‘కానీయండి’ అన్నట్లు చూడటంతో కొనసాగించాడు.

“ఉన్నట్లుండి గాల్లోంచి ఊడిపడ్డట్లు రోడ్డు మధ్యలో కనబడిందా జంతువు …. అడవి పంది. హెడ్‌లైట్ల కాంతికి దాని కళ్లు బైర్లు కమ్మాయో ఏమో, దిమ్మెరపోయి అక్కడే పాతేసినట్లు నిలబడిపోయుంది. మామూలుగానైతే దాని పక్కనుండి జీప్ పోనివ్వటానికి తగిన సమయమే ఉంది. కానీ మద్యం మత్తులో ప్రతిస్పందించటానికి మామూలుకన్నా ఎక్కువ సమయం పట్టింది. అసంకల్పితంగా ఆఖరిక్షణంలో సడన్ బ్రేక్ వేశాను. జీప్ కీచుమనే శబ్దం చేస్తూ రోడ్డు మీంచి జారిపోయి పది మీటర్ల దూరం అలాగే ప్రయాణించి ఆగిపోయింది. ఈ హఠాత్సంఘటనకి నా వళ్లంతా వణికిపోయింది. కాసేపు స్టీరింగ్ పట్టుకుని అలాగే కూర్చున్నాను. స్థిమితపడే సమయానికి మత్తు పూర్తిగా దిగింది. అప్పుడు చూస్తే, పక్క సీట్లో ఆమె లేదు. ఏం జరిగిందో తెలుసా?”

“అది ఓపెన్ టాప్ జీప్ అయుంటుంది. సడెన్ బ్రేక్ వేసేసరికి ఆమె ఎగిరి బయటపడిపోయి ఉంటుంది”

“గుడ్ గెస్. అక్కడుండి చూసినట్లే చెప్పావు. జరిగిందదే. గాభరాగా జీప్ దిగి గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లోంచి టార్చ్ లైట్ తీసుకుని వెదకటం ప్రారంభించాను. ఎక్కువగా వెదికేపని లేకుండానే కనబడిందామె. పదడుగుల వెనక, రోడ్డు పక్కనున్న తుప్పల్లో, పెద్ద కొండరాయి పైన వెల్లకిలా పడుంది. తల వెనుక కపాలం పగిలిపోయుంది. రక్తం ధారగా కారిపోతోంది. శ్వాస సరిగా పీల్చుకోలేక ఆమె ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. మాట్లాడే శక్తి లేక నాకేసి దీనంగా చూస్తోందామె. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే బతికే అవకాశాల్లేవని అర్ధమైపోయింది. అప్పుడేం చేశానో తెలుసా?”

“ఏం చేశారు?”

“ఏమీ చెయ్యలేదు. జీప్‌లో వచ్చిన దారినే వెనక్కెళితే పావుగంట దూరంలోనే ఆసుపత్రొకటుంది. కానీ అక్కడికి తీసుకెళితే ఆమె ఎవరు, తనతో నాకేం పని లాంటివన్నీ బయటికొస్తాయి. అప్పుడు నా పరువేంగాను? ఆ విషయం బయటపడితే నా భార్య తట్టుకోగలదా? అందుకని ఆసుపత్రికి తీసుకెళ్లే ఆలోచన మానుకున్నాను. అలాగని, ఆమెనక్కడే వదిలేసి నా దారిన నేను వెళ్లలేకపోయాను. మిగిలింది, నేను చెయ్యగలిగింది, ఒకటే”

యువకుడు కళ్లార్పకుండా చూస్తున్నాడు. వృద్ధుడు కొనసాగించాడు.

“ప్రార్ధన చేశాను. ఇతరులెవరో చూసి కాపాడే ప్రయత్నం చెయ్యకముందే ఆమె చనిపోవాలని నేను నమ్మే దేవుళ్లందరినీ పేరు పేరునా కోరుకున్నాను. అలాగైతేనే నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఆమె పక్కనే మోకరిల్లి గంటసేపు ప్రార్ధించాను. నా జీవితంలోనే అతి దీర్ఘమైన అరవై నిమిషాలవి. అంత సేపూ ఆమె చిత్రవధ అనుభవిస్తూ వేడికోలు నిండిన కళ్లతో నా ముఖంలోకి చూస్తూనే ఉంది. సరిగా అరవై ఒకటో నిమిషంలో ఆ కళ్లలో వెలుగు ఆరిపోయింది. ఆమె ఛాతీ ఆఖరుసారిగా ఎగిరిపడి నిశ్చలమైపోయింది. ఆ క్షణంలో నన్నో గొప్ప ఉపశమనం ఆవరించింది. చివాలున పైకి లేచి జీపెక్కి కాటేజ్ దిశగా సాగిపోయాను. ఆమెతో నన్నెవరూ చూడలేదు కాబట్టి నా వద్దకి ట్రేస్ చెయ్యలేరన్న ధీమా ఓ పక్క, ఓ పడుపుగత్తె మృతిపై విచారణ జరిపే తీరిక గోవా పోలీసులకి ఉండదన్న నమ్మకం ఇంకో పక్క ఉన్నా, ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న భయం మరో పక్కనుండి తొలిచేస్తుంటే ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపి, వెళ్లిన పని పూర్తికావటంతో మరుసటి రోజే గోవా నుండి వెనక్కి తిరిగొచ్చేశాను”

“ఆ రాత్రి జరిగింది మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. అవునా?”

“యెస్. కానీ ఎంత ప్రయత్నించినా ఆ రాత్రి నా తలపుల నుండి తొలగిపోలేదు. కాపాడమని మౌనంగా అర్ధిస్తున్న ఆ కళ్లు గుర్తుకు రాని రోజు లేదు. జీపులో ప్రయాణిస్తుండగా ఆమె చెప్పిన తన ఐదేళ్ల కొడుకు కబుర్లు, వాడికో మంచి బతుకునీయాలనే తన తపన …. నేను సగమే విని వదిలేసిన మాటలు …. నన్నిప్పుడు వదలకుండా వెంటాడుతున్నాయి. వ్యాపారంలో తలమునకలై ఉన్న రోజుల్లో ఈ జ్ఞాపకాల బారి నుండి కొంతైనా తప్పించుకోగలిగేవాడిని. బిజినెస్ పిల్లలకప్పగించి పక్కకి తప్పుకుని పన్నెండేళ్లయింది. తీరిక ఎక్కువ కావటానో, వయసుతో పాటు హైపర్‌తైమీషియా ముదరటం మూలానో, ఈ పన్నెండేళ్లుగా ఆ దృశ్యం అనునిత్యమూ కళ్లలో కదులుతూ చిత్రహింసలు పెడుతుంది. ఎప్పుడా జ్ఞాపకం తలుపు తడుతుందో తెలీదు. వెంటనే ఆ రాత్రిలోకి జారిపోతాను. ఆ సన్నివేశంలో మళ్లీ మళ్లీ జీవిస్తాను. ఆమె చివరి చూపులు గాజు పెంకుల్లా నా దేహాన్ని చీరేస్తున్నట్లుంటోంది. లోపల నరకయాతన అనుభవిస్తూ పైకి మాత్రం మామూలుగా కనబడటానికి ఎంత కష్టపడాలో ఊహించగలవా? ఆమె కొడుకు తరచూ నా కలలోకొచ్చి తన తల్లినెందుకు చంపానని నిలదీస్తుంటాడు. అటూ ఇటూగా నీ వయసులోనే ఉంటాడేమో. బహుశా నిన్ను చూస్తే అతడు నా అంతఃచేతనలో మెదిలాడేమో. ఎవరికీ చెప్పని రహస్యం నీ ముందు విప్పటానికి అదీ ఓ కారణమేనేమో. ఏదేమైనా, ఇప్పుడు నా మనసు తేలికపడింది. ఈ మాత్రానికే నా పాపం తొలగిపోదు, కానీ ముప్పయ్యేళ్లకి పైగా మోసిన భారాన్నుండి విముక్తుడినైనట్లుంది. ఆమె కొడుకే నా ఎదురుగా ఉన్నాడనుకుని అడుగుతున్నాను. నన్ను క్షమిస్తావా బాబూ?”

వృద్ధుడి గొంతు గాద్గదికమయింది. అన్నాళ్లుగా అదిమిపెట్టిన శోకాన్ని ఇంకేమాత్రం ఆపుకోలేనట్లు పెద్దగా రోదిస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. యువకుడు మౌనంగా ఆయన్ని చూస్తూ ఉండిపోయాడు.

తేరుకున్నాక కన్నీళ్లు వేళ్లతో అద్దుకుంటూ అన్నాడాయన. “ఇక నేను నిశ్చింతగా చనిపోవచ్చు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు బాబూ”

అప్పుడు నోరు విప్పాడా యువకుడు. “రుణం తీర్చుకోవాల్సింది మీరు కాదంకుల్, నేను. అలాగే మిమ్మల్ని నేను క్షమించటం కాదు. మీరే నన్ను క్షమించాలి”

వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. “ఏమిటి బాబూ నువ్వనేది!?!”

“మీ రహస్యం చెప్పేశారు కదా. నాదీ చెబుతాను వినండి” అంటూ చెప్పటం మొదలు పెట్టాడా యువకుడు.

“పదేళ్ల నాటి సంగతిది. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిన తొలిఏడాది. నా పని గంటలు మధ్యాహ్నం నాలుగు నుండి అర్ధరాత్రి వరకూ ఉండేవి. ఓ రాత్రి ఆఫీస్‌లో ఉండగా, పదిన్నర ప్రాంతంలో, ఇంటికి అర్జెంట్‌గా రమ్మని ఫోనొచ్చింది. నెలలు నిండిన నా భార్యకి నొప్పులు ప్రారంభమయ్యాయట. ఇంట్లో తానొక్కటే ఉంది. సన్నిహితులెవరూ సమీపంలో లేరు. వెంటనే బయల్దేరాను. భార్యకి సెల్ ఫోన్‌లో ధైర్యం చెబుతూ వేగంగా బైక్ పోనిస్తూ, ఓ ఇంటర్‌సెక్షన్లో రెడ్‌లైట్ పట్టించుకోకుండా క్రాస్ చేశాను. అట్నుండి వేగంగా వస్తున్న కారు సడెన్ బ్రేక్ వేసిన శబ్దానికి పరధ్యానంలోంచి బయటపడి చూసేసరికి …. ఆ కారు అదుపు తప్పి సిగ్నల్ పోస్టుకి గుద్దుకుని ఆగిపోయుంది. నేను వెంటనే బైక్ ఆపి దిగి కారువైపు పరిగెత్తాను. అందులో డ్రైవింగ్ సీట్‌లో మీరున్నారు”

“ఓహ్. ఆ రోజు బైక్ మీద వెళుతుంది నువ్వా? నీ ముఖం చూడకపోవటంతో గుర్తుపట్టలేకపోయాను”, అన్నాడాయన.

“నేను చూసేటప్పటికే మీరు స్పృహలో లేరు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లటం మనిషిగా నా కర్తవ్యం. మరోపక్క నా భార్యని పట్టించుకోవాల్సిన బాధ్యత. ఎటూ తేల్చుకోలేకపోయాను. చివరికి, కృతజ్ఞతాభావాన్ని బంధం జయించింది. మీ కార్ నంబర్ నోట్ చేసుకుని, అటుగా పోయే ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకంతో వేగంగా ఇంటికి వెళ్లిపోయాను. సమయానికి నా భార్యని ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాను. ఆ రాత్రే మాకో అబ్బాయి పుట్టాడు – మా తొలి సంతానం”

“చాలా సంతోషం బాబూ”, అన్నాడా వృద్ధుడు ఆనందం నిండిన వదనంతో.

“కానీ తండ్రినైన సంతోషం కన్నా, నన్ను కాపాడబోయి ప్రమాదానికి గురైన మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయానన్న గిల్టీ ఫీలింగ్ చాన్నాళ్లు వెంటాడింది. ఒకరోజు, ఎలాగైనా మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పాలనుకున్నాను. కార్ నంబర్ సాయంతో మీ అడ్రస్ తేలిగ్గానే సంపాదించగలిగాను. కానీ ఆ తర్వాత కూడా మీకు ఎదురుపడటానికి ధైర్యం చాలక కొన్ని సంవత్సరాలు తాత్సారం చేశాను. ఈ లోగా నా కళ్లముందు పెరుగుతున్న కొడుకుని చూసినప్పుడల్లా మీరే కళ్లలో మెదిలేవారు. వాడో తండ్రిలేని బిడ్డగా మిగలకుండా ఉన్నాడంటే అది మీవల్లేనన్న గ్రహింపు నన్ను దహించివేసేది. దాంతో, ఇంకా ఆలస్యం చెయ్యకుండా మిమ్మల్ని కలుసుకుని తీరాలన్న నిర్ణయానికొచ్చాను. తర్వాత …. “

చెయ్యెత్తి వారిస్తూ అన్నాడాయన. “ఇక చెప్పాల్సిన అవసరం లేదు బాబూ. నీ పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేవాడిని. ముప్పయ్యేళ్లుగా అపరాధ భావన కడుపులో దాచుకుని కుమిలిపోయినవాడిని, పదేళ్ల పాటు నీవెంత బాధపడ్డావో అర్ధం చేసుకోగలను. అంతకాలం ఆగకుండా ముందే కలిసి ఉండాల్సింది”

“తప్పుగా అర్ధం చేసుకున్నారంకుల్. పదేళ్ల పాటు బాధ పడ్డానని నేనెప్పుడు చెప్పాను?”

“మరి??”

“తటపటాయింపుతో తాత్సారం చేసింది మూడేళ్లే. నేను మిమ్మల్ని ఏడేళ్ల కిందటే కలిశాను. మీ రహస్యం ఆ రోజే తొలిసారిగా విన్నాను. అప్పటి నుండీ ప్రతి గురువారమూ మళ్లీ మళ్లీ వింటున్నాను …. ఏడేళ్లుగా”

“అర్ధం లేకుండా మాట్లాడుతున్నావబ్బాయ్”, వృద్ధుడి గొంతు అయోమయంతోనూ, అందులోనుండి తన్నుకొచ్చిన ఆవేశంతోనూ వణికింది. 

“నిజమంకుల్. ఆ రాత్రి నన్ను కాపాడే ప్రయత్నంలో మీ తలకి గాయమయింది. సకాలంలో చికిత్స అందకపోయేసరికి మెదడు లోపలుండే టెంపొరర్ లోబ్‌లో రక్తం గడ్డకట్టింది. దానితో మీకు షార్ట్ టెర్మ్ మెమొరీ లాస్ వచ్చింది. అప్పట్నుండీ, గంట క్రితం జరిగిన సంగతులేవీ మీకు గుర్తుండవు”

“నాన్సెన్స్. ముప్పయ్యేళ్ల కిందటి విషయాలే అంత బాగా గుర్తుంటే గంట క్రితం సంగతులెందుకు మర్చిపోతాను?”

“పాత విషయాలు ఆల్రెడీ మీ లాంగ్ టెర్మ్ మెమొరీలో నిక్షిప్తమైపోయాయి. వాటికేం సమస్య లేదు. యాక్సిడెంట్ తర్వాతి విషయాలే మీకు జ్ఞాపకముండనివి”

“నేన్నమ్మను. ఈ విషయం నువ్వు చెబితే తప్ప నాకు తెలీకపోటమేంటి?”

“మీకు తెలుసు. మీ మతిమరుపుని ఎప్పుడూ ఎవరో ఒకరు గుర్తుచేస్తూనే ఉంటారు. కానీ కాసేపట్లో అదీ మర్చిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తే. మీ దుస్థితికి కారణం నేనే. అందుకు ఎన్నిసార్లు క్షమాపణ కోరినా సరిపోదు” అంటూ యువకుడు ఆయన చేతులు పట్టుకున్నాడు. ఆయనేమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూశాడు, ఏదో గుర్తుచేసుకోటానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు.

సరిగా అప్పుడే ఆయన భార్య ఇంట్లోనుండి వరండాలో అడుగుపెట్టింది, చేతిలో కాఫీ కప్పుతో. “ఈ వేళకి కబుర్లైపోయాయా?” అని నవ్వు ముఖంతో కప్పు ఆ యువకుడి చేతికందించింది.

వృద్ధుడామెకేసి బేలగా చూశాడు. “ఇంకాసేపట్లో నేనిదంతా మర్చిపోతానా?” అన్నాడు శక్తిహీనమైన స్వరంతో. బదులుగా, ఆమె ఆయన భుజమ్మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరింది. ముగ్గురి మధ్యా చాలాసేపు మౌనం రాజ్యమేలింది. 

యువకుడు కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టి లేచి ఇక సెలవన్నట్లు ఆ దంపతులకేసి చూశాడు.

“మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలీదు కానీ, వారానికో పూట, నువ్వు వచ్చి వెళ్లిన కాసేపటిదాకా ఆయన ముఖంలో ఏదో ప్రశాంతత చూస్తాను బాబూ. ఆ తర్వాత మళ్లీ గురువారం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తాను. వచ్చేవారం కూడా తప్పకుండా వస్తావుగా బాబూ?” కళ్లు తడిబారుతుండగా అడిగిందామె. 

అలాగే అన్నట్లు తలాడించి బయటకి నడిచాడా యువకుడు. అతడు వెళ్లేదాకా దంపతులిద్దరూ అటే చూస్తూ ఉండిపోయారు. నిమిషం గడిచాక ఆవిడో నిట్టూర్పు విడిచి ఖాళీ కప్పు తీసుకుని కళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి నడిచింది. వృద్ధుడు కాఫీ టేబుల్ మీంచి పుస్తకం అందుకుని అట్టమీది బొమ్మనోసారి తేరిపారా చూశాడు.

తర్వాత మొదటి పుట తెరచి చదవటం ప్రారంభించాడు.