నమస్కారం.

కథాలయం వెబ్‌సైట్ సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఈ వెబ్‌సైట్ ప్రధానంగా నా ముద్రిత రచనలన్నిట్నీ (కథలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు, కథలపై నేను రాసిన వ్యాసాలు, మొదలైనవన్నీ) ఒకే చోట అందుబాటులో ఉంచటానికి ఉద్దేశించినది. అయితే ఇది కేవలం నా రచనలకి పరిమితమైనది కాదు. ఇతరుల రచనల్లో నాకు నచ్చినవి కూడా ఆయా కథకుల అనుమతితో ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచటం జరుగుతుంది. 

ఇది వెబ్ పత్రిక కాదు. కాబట్టి వారానికో, మాసానికో క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి కొత్త కథలు ప్రచురించే కార్యక్రమమేదీ లేదు. దీన్నొక అంతర్జాల తెలుగు కథ సంకలనంగా భావించవచ్చు. కథాలయంలో మీకు నచ్చిన కథలేవైనా చేర్చమని – అవి మీ రచనలైనా, లేక ఇతరులవైనా – కోరవచ్చు, సూచించవచ్చు. కథావస్తువు ఏదైనా కావచ్చు. నిర్ణీత ప్రమాణాలు తప్పనిసరి. ఇక్కడున్న కథలు చదివితే ఆ ప్రమాణాలపై మీకో అవగాహన కలుగుతుంది. దానికి మీ విచక్షణ జోడించి కథలు సూచించండి. 

కథాలయంలో చేర్చబడే ప్రతి కథా నేను సునిశితంగా పరిశీలించి, అక్షరదోషాలు, ఇండెంటేషన్, ఇతరత్రా ఫార్మాటింగ్ సమస్యలు పరిహరించాక మాత్రమే వెలుగుచూస్తుంది. ఈ నియమం కథల నాణ్యత మెరుగు పరచటానికి, వాటితో పాటుగా కథాలయం స్థాయిని పై ఎత్తున నిలపటానికి ఉద్దేశించినది. 

కథాలయంలో ప్రస్తుతానికి ఈ క్రింది విభాగాలున్నాయి:

అనిల్ ఎస్.రాయల్ కథలు: నా కథలన్నీ ఇక్కడ లభిస్తాయి

అతిధి కథలు: ఇతర రచయిత/త్రుల కథలు

అనువాద కథలు: పరభాషల నుండి తెలుగులోకి చేసిన అనువాదాలు

కథాయణం: కథ రచనా విధానంపై వ్యాసాలు

సంభాషణం: ఇంటర్వ్యూలు

కథకులం: కథకుల జాబితా

ఇది ఫలాపేక్షతోనో, వ్యాపార కాంక్షతోనో చేసే పని కాదు. కాబట్టి కథాలయంలో వాణిజ్య ప్రకటనలు ఉండవు. ఇందులో పొందుపరచిన కథలకి పారితోషకాలూ ఉండవు. ఇక్కడ కేవలం కథలు మాత్రమే ఉంటాయి. వాటి కింద వ్యాఖ్యానించే సదుపాయమూ ఉంటుంది. దాన్నుపయోగించుకుని కథలపై – కథలపై మాత్రమే – ఆలోచింపజేసే వ్యాఖ్యానాలు, ఆరోగ్యకరమైన చర్చలు, సహేతుకమైన విమర్శలు చేయమని మనవి.

చివరగా – కథాలయంలో తమ కథలు కొలువుదీరటానికి అనుమతించిన సాటి కథకులస్తులందరికీ ధన్యవాదాలు.

అనిల్ ఎస్. రాయల్

 

 


సలహాలు, సూచనలు, సందేహాలు, సందేశాలు, వగైరా: anil.s.royal@kathaalayam.com