అనువాదం: అనిల్ ఎస్. రాయల్

‘కినిగె’, అక్టోబర్ 2014

మూల కథ: “All You Zombies –”
మూల కథకుడు: రాబర్ట్ ఎ. హెయిన్‌లిన్
మూలకథ రచనా కాలం: 1958


 

(సమయం: 1985, నవంబర్ 7. రాత్రి 10:17 గంటలు. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)  

బ్రాందీ గ్లాసు శుభ్రం చేస్తుండగా దానికి తగిలి ఖంగుమంది నా వేలికున్న ఉంగరం.

చేస్తున్న పని ఆపి దానికేసి చూశాను: వలయాకారంలో, తన తోకని తానే మింగుతున్న కాలసర్పం.

అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దమయింది. దృష్టి అటు మరల్చాను. కుంతీకుమారి బార్‌లోకి అడుగుపెడుతున్నాడు.

అతని వయసు పాతికేళ్లు. సరిగా నా ఎత్తుంటాడు. అనాకారి. ఆ ఆకారం నాకు నచ్చదు. కానీ అతని అవసరం నాకుంది. అందుకే అయిష్టత దాచిపెట్టుకుని అతనివైపో నవ్వు రువ్వాను. అతను తిరిగి నవ్వకుండా నేరుగా నేనున్న కౌంటర్ వద్దకే వచ్చి కుర్చీ లాక్కుని అందులో కూలబడ్డాడు.

తన గురించెవరన్నా ఆరా తీస్తే “నా పేరు కుంతి. నేనో పెళ్లికాని తల్లిని” అంటాడతను ముక్తసరిగా. మూడ్ బాగుంటే “దినపత్రికల్లో ఆడాళ్ల బాధల గురించి వ్యాసాలు రాస్తా. బదులుగా పదో పరకో పుచ్చుకుంటా” అనీ అంటాడు, కానీ అతని మూడ్ సాధారణంగా బాగోదు కాబట్టి ఈ వివరం ఎక్కువమంది చెవినపడదు. అతని సమాధానం ఎంత పొడుగున్నా, అది విన్నోళ్ల ముఖాల్లో విభ్రమం తొంగిచూస్తుంది. అతని ముఖంలో మాత్రం ఎప్పుడూ చిరాకు, సాటి మనుషులంటే విరక్తి కనిపిస్తాయి. ఆ రోజు అవి ఎప్పటికన్నా ఎక్కువ మోతాదులో అగుపించాయి. మౌనంగా ఓ పెగ్ నింపి గ్లాస్ అతని ముందుకు నెట్టాను. ఒకే గుక్కలో ఖాళీ చేశాడు.  కౌంటర్ మీదే ఉన్న సీసా అందుకుని తనే రెండో పెగ్ నింపుకున్నాడు.

బార్ కౌంటర్ తుడుస్తూ యధాలాపంగా అడిగినట్లు అడిగాను, “పెళ్లికాని తల్లి కథలెలా నడుస్తున్నాయి?”

గ్లాస్ చుట్టూ అతని వేళ్లు బిగుసుకున్నాయి. కళ్లెర్రబడ్డాయి. క్షణం పాటు – ఆ గ్లాసు నావైపు విసురుతాడేమోననిపించింది. అసంకల్పితంగా నా చెయ్యి కౌంటర్ కిందనున్న పట్టాకత్తి అందుకోబోయి ఆగిపోయింది.

“సారీ. ఊరికే అడిగాను. ఏంటి సంగతులు? రోజులెలా గడుస్తున్నాయి?”, క్షమాపణ కోరుతున్నట్లుగా చెప్పాను.

అతను మెత్తబడ్డాడు. “ఎప్పట్లాగే, ఏదో అలా అలా నడుస్తున్నాయి. నేను రాస్తాను, వాళ్లు వేస్తారు. అంతో ఇంతో ఇస్తారు. వాటితో కడుపు నింపుకుంటా”

నేనూ ఓ పెగ్ నింపుకుని కుర్చీలో వెనక్కి వాలుతూ చెప్పాను, “నువ్వు రాసినవి కొన్ని చదివాను. ఆడవాళ్ల కోణం నుండి అద్భుతంగా రాస్తావు”

అతడ్నుంచి హుంకరిస్తున్నట్లు బదులొచ్చింది, “ఆడవాళ్ల కోణం .. నాక్కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది?”

లేని ఆసక్తి ప్రదర్శిస్తూ “అక్కా చెల్లెళ్లెవరన్నా ….?” అని అర్ధోక్తిలో ఆగాను.

లేరన్నట్లు తల అడ్డంగా ఊపాడు.

“మరెలా రాస్తావు అంత కచ్చితంగా, అంత వివరంగా .. అవన్నీ అనుభవించిన ఆడవాళ్లకే సాధ్యమయ్యేలా?”

“నేను చెప్పినా నువ్వు నమ్మవు”

“అలాంటివి నాకేం కొత్త కాదు. ఇక్కడికొచ్చే కస్టమర్లనుండి విచిత్రమైన కథలెన్నో విన్నా. నమ్మశక్యం కాని కథలు”

“అవేంటో నాకు తెలీదు కానీ నా కథకి అవేవీ సాటి రావు. చెబితే నీ బుర్ర తిరుగుద్ది”

“తిరుగుద్దో లేదో నువ్వు చెబితే కదా తెలిసేది”

అతనో నిమిషం సాలోచనగా చూసి ఆపై ఓ నిర్ణయానికొచ్చినట్లు దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు, “సరే మరి. ఈ సగం బాటిల్ బెట్ కడతావా?”

“సగమే ఖర్మ, ఫుల్లే ఇచ్చేస్తా. మొదలెట్టు”, ఫుల్ బాటిల్ తీసి కౌంటర్ మీదుంచాను ఊరిస్తున్నట్లు.

“సరే” అంటూ మొదలు పెట్టాడతడు, బాటిల్ చూసి నాలుకతో పెదాలు తడుపుకుంటూ. “నేనో దిక్కుమాలిన వెధవని”

“ఇక్కడందరూ అలాంటోళ్లే, నాతో సహా”, అన్నా నేను అడ్డొస్తూ.

“నీ కర్ధం కాలేదు. అనాధ వెధవన్నేను. నాకంటూ ఎవరూ లేరు”, అన్నాడతను చిరాగ్గా చూస్తూ.

“నేనూ అంతే. పెళ్లాం బిడ్డల్లాంటి బాదరబందీలు లేనోడ్ని” అంటూ ముందుకొంగి రహస్యం చెబుతున్నట్లు “నిజానికి, నా వంశంలో ఎవరికీ పెళ్లీ గిళ్లీ ఉండదు” అని ముక్తాయించాను.

“నిజమా?” అన్నాడతడు విస్తుపోయినట్లు. అతడి కళ్లలో చిరాకు స్థానే సాదరభావమేదో ప్రవేశించింది. “అలాగయితే నీకు నా బాధ బాగా అర్ధమవుతుంది. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు …”

“చిన్న పిల్లగా ఉండటమేంటి?”, అర్ధం కానట్లు చూశాను.

“అవును. పుట్టుకతో నేనో ఆడపిల్లని”

“అంటే …. తర్వాత లింగ మార్పిడి చేయించుకున్నావా?”

“ప్రశ్నలేయకుండా వినలేవా? ఇలాగైతే చెప్పను” అతను విసుక్కున్నాడు.

అత్యుత్సాహం చూపిస్తే మొదటికే మోసమొచ్చేలా ఉంది. అనవసరమైన ప్రశ్నలేయకుండా వినటం ఉత్తమం. “సరె, సరె …. చెప్పు” అన్నాను.

“నేను పుట్టింది 1960లో, ఇప్పటికి పాతికేళ్ల క్రితం. నెలల పసిగుడ్డుగా నన్నో అనాధ శరణాలయం ముందు వదిలేసి పోయారు”

“పాపం”. సానుభూతి ప్రకటించాను.

“చిన్న పిల్లగా ఉన్నప్పుడు నాకు తల్లిదండ్రుల పెంపకంలో హాయిగా పెరిగే పిల్లలంటే చెప్పలేనంత కసి, ఈర్ష్య ఉండేవి. దాంతో, టీనేజ్‌కొచ్చాక ఓ కఠోరమైన నిర్ణయం తీసుకున్నా – నాకు పిల్లలంటూ పుడితే వాళ్లకి తల్లీ తండ్రీ ఇద్దరి ప్రేమా లభించి తీరాలని. అయితే కొంచెం పెద్దయ్యాక తత్వం బోధపడింది. నేనేమీ అందగత్తెని కాను, నా కోసం కలల రాకుమారుడెవరూ రెక్కల గుర్రం మీద రాడని అవగతమయింది”, చేతిలో గ్లాసుకేసి చూస్తూ చెప్పుకుపోసాగాడు కుంతి.

“నువ్వు నాకన్నా అందవికారంగా లేవులే”

అతను చివ్వున తలెత్తి నా ముఖంలోకి తీక్షణంగా చూశాడు. అప్రయత్నంగా కుడిచేత్తో ఎడమ చెంపమీదున్న గాట్లని తడుముకున్నాను.1978 యుద్ధంలో నా ముఖాన్ని నేనే గుర్తుపట్టలేనంతగా మార్చేసిన గాయాలవి. 

కుంతీకుమారి మళ్లీ చేతిలోని గ్లాసు మీదకి దృష్టిసారించాడు. “నీలాంటి బార్ టెండర్ రూపలావణ్యాలు ఎవడు పట్టించుకుంటాడు? చిన్నపిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునేవాళ్లు నీలి కన్నులుండే బూరె బుగ్గల బాలకురాలికోసమే చూస్తారు. కుర్రాళ్లేమో ఎత్తు గుండెలుండే మత్తు కళ్ల మగువ కోసమే చూస్తారు. నాలాంటి అనాకారి అమ్మాయి ఎవడికీ అక్కర్లేదు. అందుకని పెళ్లి, పిల్లలు లాంటి కలలకి వీడ్కోలు చెప్పేశాను. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ ఇంట్లో ఆయాగా కుదురుకున్నాను. పగలంతా వంటావార్పూ చేసి పెట్టి వాళ్ల పిల్లల్ని సాకేదాన్ని, రాత్రి పూట నైట్ కాలేజ్‌లో కుట్లు, అల్లికలు, టైప్ రైటింగ్ లాంటివి – ఒకటేమిటి, ఏది నచ్చితే అది నేర్చుకునేదాన్ని. ‌ఓ రాత్రి కాలేజ్‌కి వెళుతుండగా తగిలాడతడు”. అక్కడి దాకా చెప్పి ఆగాడు కుంతీకుమారి. అతడి ముఖం ఎర్రబడింది.

నేను మౌనంగా ఉండటం చూసి కొనసాగించాడు.

“అతడి వాలకం చూస్తే పిచ్చివాడిలా ఉన్నాడు. చీకట్లో పోలికలు సరిగా కనబడలేదు కానీ, తెగ తాగి ఎర్రబడ్డ కళ్లు మాత్రం నిప్పుకణికల్లా కనిపించాయి. చేతిలో డబ్బుల కట్టొకటి పట్టుకుని ఉన్నాడు. నన్ను చూడగానే ఆ కట్ట గాల్లో ఊపుతూ తీసుకోమని అభ్యర్ధించాడు. నేను తీసుకోలేదు. అయితే నాకెందుకో అతడు నచ్చాడు. బహుశా, వయసుకొచ్చాక నా రూపాన్ని అసహ్యించుకోకుండా మాట కలిపిన తొలి మగాడు అతడే కావటం వల్లనేమో. మర్యాదస్తుడిలా అనిపించాడు. మొహమాటస్తుడిలానూ అనిపించాడు. ఆ రాత్రి తరగతులు ఎగ్గొట్టి మరీ అతనితోనే గడిపాను. అతనిలో ఏదో ఆకర్షణ. అదేంటో నేను వివరించలేను. చెప్పలేని వింత మోహమేదో  కలిగింది. అర్ధరాత్రి ప్రాంతంలో, అతను వారిస్తున్నా వినకుండా మీద పడ్డాను. కాలు జారాను”

“తర్వాత?”

“తర్వాతింకేం లేదు. అతడు నన్ను భద్రంగా ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. నుదుటి మీదో ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. మళ్లీ కనబడలేదు”. కాసేపు ఆగి మళ్లీ చెప్పాడతడు. “కనిపిస్తే మాత్రం వాడిని చంపి పాతరేస్తా”

“నీ కోపం అర్ధం చేసుకోగలను”, గొంతులో సానుభూతి పలికిస్తూ చెప్పాను. “కానీ, ఆ మాత్రానికే చంపాలనుకోవటం ఎందుకు?”

“చంపటం చాలా చిన్న శిక్ష. నా కథ పూర్తిగా వింటే నువ్వే ఒప్పుకుంటావు. ఎందుకంటే, అసలు కథ ఇక్కడే మొదలయింది”

“అంటే … కడుపు?”

“అవును. నేను పనిచేసే ఇంట్లోవాళ్లకి అదేం సమస్య కాలేదు, మొదట్లో. చెయ్యగలిగినంతకాలం పని చెయ్యనిచ్చారు. తర్వాత బయటికి గెంటారు. నేను పెరిగిన అనాధ శరణాలయం కూడా నన్ను చేరదీయలేదు. అక్కడా ఇక్కడా తిరిగి చివరికెలాగో నాలాంటి దిక్కుమాలినోళ్ల కోసం ఎవరో పుణ్యాత్ములు నడిపే ఆశ్రమంలో పడ్డాను. నెలలు నిండాక కాన్పు కష్టమవటంతో వాళ్లే ఓ ధర్మాసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు సిజేరియన్ చెయ్యాలంటూ మత్తు మందిచ్చారు. ఆ తర్వాతేం జరిగిందో తెలీదు. రెండు రోజుల తర్వాతే మళ్లీ కళ్లు తెరిచాను. బెడ్ దిగే పరిస్థితిలో లేను. వళ్లంతా పచ్చిపుండులా ఉంది. అంతకు మించి, ఏదో తేడా. ఏదో కోల్పోయిన భావన. వేరెవరి శరీరంలోనో నేనున్నట్లు, నేను నేను కానట్లు, పిచ్చి పిచ్చిగా అనిపించింది ….”

నేను వింటుందీ లేనిదీ పట్టించుకుండా చెప్పుకుపోతున్నాడు కుంతి.

“…. కానీ నా గురించి పట్టించుకునేకన్నా, బిడ్డ ఎలా ఉందోనన్న ఆరాటమే ఎక్కువుంది నాలో. నేనున్న గదిలో ఉయ్యాలేదీ కనబడలేదు. ఏమయిందోననే ఆందోళనతో కనబడ్డ నర్సులందర్నీ అడిగా. కానీ ఎవరూ నోరు విప్పరే! ఆఖరుకి అసహనంతో కేకలు పెట్టసాగితే, ఆ గొడవకి పెద్ద డాక్టరొచ్చాడు. పాప పుట్టిందనీ, ఆరోగ్యంగానే ఉందనీ చెప్పాడు. తెచ్చి చూపించమంటే మాత్రం తర్వాతంటూ దాటేశాడు. అంతకంటే ముందు నాకు చెప్పాల్సిందొకటుందంటూ నేను దిమ్మెర పోయే విషయం చెప్పాడు”

“ఏమిటి?”

“సిజేరియన్ కోసం పొత్తికడుపు కోసి తెరిచినప్పుడు డాక్టర్లకి నా లోపల రెండు జతల జననావయవాలు కనబడ్డాయి. ఆడ, మగ …. రెండు రకాలూ. అందులో ఏదీ పూర్తిగా ఎదగలేదు కానీ గర్భసంచి, వగైరా స్త్రీ లింగ సంబంధిత ఆవయవాలు మాత్రం కొద్దిగా మెరుగ్గా, పిల్లలు కనేందుకు సరిపడేంతగా పరిణితి చెందాయి. అయితే సిజేరియన్ చేసే క్రమంలో అనివార్య పరిస్థితిలో వాటిని తొలగించాల్సి వచ్చింది. అంటే నాలో పురుషాంగాలు మాత్రమే మిగిలాయన్నమాట. ఒకట్రెండు ఆపరేషన్ల సాయంతో వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా మార్చటం తేలికే. అందుకు కావలసిందల్లా నా అనుమతే. ఇదీ పెద్ద డాక్టర్ చెప్పిన విషయం” 

“….”

“ఈ నిజం జీర్ణం చేసుకోటానికి నాకు చాలా సమయం పట్టింది. ఏడుస్తూ, నా పాప సంగతేమిటని అడిగాను. బిడ్డకి పాలిచ్చి పెంచే అవకాశమిక నాకు లేదు, అసలు నేనున్న పరిస్థితిలో బిడ్డ మంచీ చెడూ చూసుకోటమూ నావల్లయేది కాదన్నాడు డాక్టర్. పాపని ఎవరికన్నా దత్తత ఇచ్చేయమని సలహా కూడా ఇచ్చాడు. నేనొప్పుకోలేదు. డాక్టర్ మరి వత్తిడి చెయ్యలేదు. మరుసటి రోజు పాపని నాకు చూపించారు. అంత చిన్న పాపని అదే మొదటి సారి దగ్గరగా చూడటం. నా పోలికలే వచ్చాయేమో, మరీ ముద్దుగా లేదు. కానీ అది నా బిడ్డ. నా కళ్లకి అందంగానే కనపడింది. ఎన్ని కష్టాలైనా పడి నా బిడ్డని గొప్పగా పెంచాలనుకున్నా. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది”

“??”

“రెండో నెలలో పాపని ఎవరో కాజేశారు ….”

“అయ్యో”

కుంతీకుమారి కళ్లు ఎర్రబడ్డాయి. “…. నాకు మిగిలిన ఒక్క భాగ్యాన్నీ కాజేశారు” అన్నాడు పిడికిళ్లు బిగిస్తూ.

నేను మౌనంగా అతన్నే చూస్తున్నాను. గట్టిగా గాలి పీల్చి వదిలి కొనసాగించాడతడు.

“పాపాయికి బాబాయినంటూ ఎవరో వచ్చి, నర్సు వేరేపని మీద అవతలకి వెళ్లగానే పాపని తీసుకుని ఉడాయించాడని హాస్పటల్ వాళ్లు చెప్పారు”

“అతని పోలికలు?”

“గుర్తు పెట్టుకునేంత గొప్ప పోలికలేం కాదని నర్సు చెప్పింది. నీలాగా, నాలాగా సాధారణమైన ముఖ కవళికలట. పాప తండ్రే ఎత్తుకుపోయాడని నా అనుమానం. నర్సేమో అతని వయసు యాభైకి దగ్గర్లోనే అనింది. బహుశా మారు వేషంలో వచ్చుంటాడు. తప్పకుండా నా బిడ్డ తండ్రే. వేరెవరికి ఆ అవసరముంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లు నాలుగు రోజులు హడావిడి చేసి దొరకలేదని కేసు మూసేశారు”

“మరి తర్వాతేం చేశావు?”

“ఏం చేస్తాను? కన్నీళ్లు దిగమింగటం చిన్నప్పట్నుండీ అలవాటేగా. అదే చేశాను. మూడ్నాలుగు నెలల్లో మామూలు మనిషినయ్యాను. ఆ లోగా గడ్డాలూ, మీసాలు పెరగనారంభించాయి. పదకొండు నెలలు, మరి కొన్ని ఆపరేషన్ల తర్వాత నేను పూర్తిగా మగాడిగా మారిపోయాను. పుట్టకతో అమ్మాయినని నేను చెప్పినా ఎవరూ నమ్మని రీతిలో మారిపోయాను” అంటూ నిట్టూర్చాడతడు.

“పాపం చాలా బాధలే పడ్డావు. ఐతేనేం, ప్రస్తుతం బాగానే ఉన్నావుగా. అంతో ఇంతో సంపాదించుకుంటున్నావు. చెప్పుకోదగ్గ కష్టాల్లేకుండా బతికేస్తున్నావు. అన్నిటికీ మించి, నువ్విప్పుడో మగాడివి. ఆడదానిగా ఉంటే ఎదురయ్యే కష్టాలు మరిక నీకుండవు”, ఓదారుస్తున్నట్లు చెప్పాను.

అతను చిరాగ్గా చూశాడు. “అవన్నీ నువ్వే అనుభవించినట్లు చెబుతున్నావు. నీకేం తెలుసు ఉన్నట్లుండి మగాడిగా మారటమంటే ఎంత నరకమో”.

“చెప్పు మరి”, భుజాలెగరేశాను.

“ఆ వెధవ నన్ను సర్వనాశనం చేశాడు. మొదట నా కన్యత్వాన్ని దోచుకున్నాడు. తర్వాత నా బిడ్డనెత్తుకుపోయాడు. ఆఖరికి, వాడి మూలాన, నేను నేను కాకుండా పోయాను. ఆడదాన్ని కూడా కాకుండా పోయాను. మగాడిగా ఉండటం ఎలాగో తెలియక నరకం అనుభవించాను”

“అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుందనుకుంటాను ….”

“అనుకున్నంత తేలిక్కాదు. మగాడిలా మాట్లాడటం, నడవటం, దుస్తులు ధరించటం … వాటి గురించి కాదు నేననేది. అవన్నీ హాస్పటల్ వాళ్లు తర్ఫీదునిచ్చారు. కానీ బయటకొచ్చాక బతకటానికి అవి మాత్రమే చాలవుగా. మగాళ్లు చేసే ఏ పనీ నాకు రాదు. అన్ని ఆపరేషన్ల తర్వాత, శ్రమ చేసేందుకు నా శరీరం సహకరించదు. రెండేళ్ల పాటు చెప్పలేనన్ని కష్టాలు పడి, ఆఖరికి ఈ నగరానికొచ్చి పడ్డాను. ఇక్కడో చిన్న రెస్టారంట్‌లో వంటవాడిగా ఉద్యోగం సంపాదించాను. ఆయాగా ఉన్నప్పుడు వంటలు చేసిన అనుభవం ఇక్కడ పనికొచ్చింది. నాలుగు డబ్బులు సంపాదించాక ఓ పాత టైప్ రైటర్ కొనుక్కుని సాయంత్రాలు స్టెనోగ్రాఫర్ పని చేసి మరి నాలుగు డబ్బులు సంపాదించుకోటం మొదలెట్టాను. ఐతే అందులో పెద్ద గిరాకీ ఉండేది కాదు. నాలుగు నెలల్లో నేను టైప్ చేసింది మూడు ఉత్తరాలు, ఒక కథ. ఈ కథ ఉందే …. దాన్నిండా ఏడుపుగొట్టు కబుర్లే. అంత తలాతోకా లేని కథ నేనెప్పుడూ చదవలేదు.  ఐతేనేం, అది రాసిన శుంఠ దాన్నో సాయంకాలం పత్రిక్కి రెండొందల రూపాయల మొత్తానికి అమ్మగలిగాడు. అది చూశాకే నాకూ రాయాలనిపించింది. కుంతీకుమారి పెరుతో అమ్మాయిల దీనగాధలు రాయటం మొదలు పెట్టాను. పెద్ద గొప్ప సాహిత్యమేం కాదనుకో. స్త్రీవాద ఉద్యమాలేవో నడుస్తున్నాయిగా. ఆ మోజులో ఇలాంటి రాతలకి గిరాకీ పెరిగింది. వీటి నాణ్యత ఎవరికీ పట్టదు. సమయానికి సరుకు అందిస్తే చాలు. నాసిరకంగా ఉన్నా వేసేస్తారు. నాకు నాలుగు డబ్బులొచ్చిపడుతున్నాయి”

అంతవరకూ చెప్పి ఓ క్షణం ఆగి మళ్లీ అన్నాడతనే. “ఇప్పుడర్ధమయిందా, ఆడాళ్ల కోణం నేనంత బాగా ఎలా పట్టుకున్నానో?”

నా మనసు భారమయింది. కానీ విచారిస్తూ కూర్చునే సమయం లేదు. ఇంకా చాలా పని మిగిలే ఉంది. మాట ప్రకారం మందు సీసా అతని ముందుకు తోస్తూ అడిగాను. 

“మిత్రమా. వాడు …. అదే నీ ప్రియుడు …. ఇప్పుడు నీకళ్లబడితే ఏం చేస్తావు?”

అతను పళ్లు నూరాడు. “చెప్పాగా, చంపి పాతరేస్తాను. కానీ ఆ అవకాశం లేదే”. 

“ఉంది”

“వాట్?”

“వాడెవడో, ఎక్కడుంటాడో నాకు తెలుసు”

కుంతీకుమారి ఆవేశంగా లేచి బార్ కౌంటర్ పైగా నా కాలర్ అందుకున్నాడు. “ఎక్కడున్నాడు? చెప్పు” అంటూ ఊగిపోయాడు. 

“రిలాక్స్. చెబుతాను. ముందు నా చొక్కా వదులు”

అతను చటుక్కున చొక్కా వదిలేసాడు. “క్షమించు. కోపం ఆపుకోలేకపోయాను. ఇంతకీ, వాడు నీకెలా తెలుసు?”

“ఆధారాలున్నాయి మిత్రమా. అన్నిటికీ ఆధారాలున్నాయి. హాస్పటల్ రికార్డులు, పోలీస్ రికార్డులు, అనాధ శరణాశ్రయం రికార్డులు. నువ్వు పెరిగింది సెయింట్ ఆగ్నెస్ ఆర్ఫనేజ్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అక్కడ నిర్వాహకురాలి పేరు సిస్టర్ రెజీనా. ఆమె తరువాత ఆ బాధ్యత్ స్వీకరించింది సిస్టర్ ఫిలోమినా. ఇక, నీకు వాళ్లు పెట్టిన పేరు …. నీ అసలు పేరు …. జేన్. అవునా?”

అతని కళ్లతో విభ్రాంతి, భయం కలగలిసి కనబడ్డాయి. “ఎవరు నువ్వు?” అన్నాడు గొంతు వణుకుతుండగా.

“భయపడొద్దు. నేన్నీ శ్రేయోభిలాషినే. నీ ప్రియుడిని తెచ్చి వళ్లో పడేస్తాను. వాడిని ఏమన్నా చేసుకో. కసి తీరా తిట్టుకో, కొట్టుకో. కానీ వాడిని చంపే పిచ్చిపని మాత్రం చెయ్యనని మాటివ్వు. ఇస్తావా?”

“ఎక్కడున్నాడు వాడు?”, నా ప్రశ్నకి బదులీయకుండా అసహనంగా అడిగాడతడు.

“అప్పుడేనా? ముందు నాకా మాటివ్వు”

“అలాగే. చంపను. ఎవాడెక్కడో చెప్పు”

“చెప్పటం కాదు. చూపిస్తా. ఐతే నాకేంటి లాభం?”

కుంతీకుమారి అయోమయంగా చూశాడు. నేను మళ్లీ అడిగాను. “నీ పగ తీరే దారి చూపిస్తే, బదులుగా నాకొచ్చేదేంటి?”

“ఏం కావాలి?”

“ఈ కథలు రాస్తే నీకొచ్చేది బొటాబొటి మొత్తం. ఇంతకన్నా మంచి ఉద్యోగం చూపిస్తా. నిలకడైన ఉద్యోగం. ప్రస్తుతం నీకొచ్చేదానికి పదింతలు జీతం. ఇతర సదుపాయాలు, సౌకర్యాలు. సాహసోపేతమైన జీవితం. ఇవన్నీ ఇప్పిస్తా. ఏమంటావు?” 

“ఇదా నేన్నీకు ఇవ్వాల్సిన బదులు? నమ్మశక్యంగా లేదు”

“నీకు పోయేదేమీ లేదుగా. సింపుల్‌గా చెప్పాలంటే మన మధ్య ఒప్పందం ఇదీ: నీ ప్రియుడిని నీకు చూపిస్తా. వాడితో నీ వ్యవహారం తేల్చుకో. తర్వాతొచ్చి నేను చూపించే ఉద్యోగంలో చేరు. నచ్చితే అందులోనే కొనసాగొచ్చు. నచ్చకపోతే మానేయొచ్చు. ఎలా చూసినా నీకు లాభమే తప్ప పోయేదేమీ లేదు”

అతను అనుమానంగా చూశాడు. “ఇంతకీ ఇందులో నీకొచ్చేదేంటి?”

“నిన్నా ఉద్యోగంలో చేర్చినందుకు నా కమీషన్ నాకొస్తుంది. అదే నాక్కలిగే లాభం. డీల్?”

అతను తలూపాడు. “డీల్”. 

“స్టోర్‌రూమ్ లోకెళ్లి వెంటనే వచ్చేస్తా. నా కౌంటర్ కూడా చూసుకో” అంటూ సహాయకుడికి కేకేసి చెప్పి, కుంతీకుమారిని వెంటబెట్టుకుని కౌంటర్ వెనకున్న ద్వారం గుండా స్టోర్‌రూమ్‌లోకి దారితీశాను. 

(సమయం: 1985, నవంబర్ 7. రాత్రి 10:45 గంటలు. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)  

స్టోర్‌రూమ్ మసక వెలుగుతో నిండి ఉంది. దాని వెనకున్న ద్వారం ఓ చీకటి కారిడార్‌లోకి తెరుచుకుంటూంది. అందుగుండా తడుముకుంటూ ముందుకు సాగాను, కుంతీకుమారి అనుసరిస్తుండగా. కారిడార్ రెండో చివర పెద్ద ఇనుప తలుపుంది. దానికి రెండే తాళాలుంటాయి. వాటిలో ఒకటి నావద్దనుంటే, మరోటి బార్ మేనేజర్ వద్ద ఉంటుంది. ఆ తలుపు తెరుచుకుని లోపలకి పోతే ఓ మూల ఇంకో చిన్న తలుపుంది. దానికున్న ఏకైక తాళం చెవి సదా నాదగ్గరే ఉంటుంది. ఆ తలుపు తెరుచుకుని, బాగా వంగి లోపలకెళ్లాను. నా వెనకే కుంతీకుమారి అడుగుపెట్టాడు. 

అదో చిన్న గది. చుట్టూ ఉన్న గోడలకి కిటికీలు కానీ, వెంటిలేటర్లు కానీ లేవు. 

సీలింగ్‌కున్న గుడ్డి బల్బ్‌నుండి పల్చటి ప్రసరిస్తున్న పల్చటి వెలుగులో ఆ గదిని పరికించి చూస్తూ అడిగాడు కుంతీకుమారి. “ఏడి వాడు?”

నేను బదులీయకుండా గది మధ్యలో ఉన్న చిన్న సూట్‌కేస్ వంటి వస్తువుని సమీపించి దాని మీదున్న మీటలు నొక్కాను. శబ్దం లేకుండా తెరుచుకుందది. ఆ ఉదయాన్నే దానికి అవసరమైన సెటప్ అంతా చేసి సిద్ధంగా ఉంచాను. ఇప్పుడు నేను చేయాల్సిందంతా అందులో ఉన్న లోహపు వల విసరటమే. దాన్ని బయటకు తీసి విదిలించాను. 

“ఏంటది?”, కుంతీకుమారి కుతూహలంగా అడిగాడు.

“టైమ్ మెషీన్”, అంటూ నేనా వల మా ఇద్దరి పైనా పడేలా పైకి విసిరాను.

కుంతీకుమారి “హేయ్!” అంటూ గాభరాగా ఓ అడుగు వెనక్కేశాడు. నేనతన్ని పట్టించుకోకుండా వల ఇద్దరి చుట్టూ బిగించి పట్టుకుని దాని మధ్యలో ఉన్న చిన్న బటన్ వత్తాను. 

(సమయం: 1978, ఏప్రిల్ 3. రాత్రి 9:30 గంటలు. ప్రాంతం: బృందావన్ లాడ్జ్, నారాయణగూడ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్)

“హేయ్!”. కుంతీకుమారి మళ్లీ అరిచాడు. “తీసేయ్ దీన్ని”.

 “వాడెక్కడున్నాడో చూపించమన్నావు కదా” అంటూ నేను వల తీసి మడతపెట్టి భద్రంగా బ్రీఫ్‌కేసె్‌లో ఉంచాను.

“కానీ…. కానీ అది టైమ్ మెషీన్ అన్నావు. ఏం నాటకమిది?”

నేను కిటికీ వైపు చూపించాను. “కొద్ది క్షణాల క్రితం ఈ గదికి కిటికీ ఉన్న గుర్తుందా నీకు?‌” 

అతనా కిటికీని నోరు తెరుచుకుని చూస్తూండగా నేను బ్రీఫ్‌కేస్ లోనుండి వంద రూపాయల కట్టొకటి బయటికి తీశాను. అవి 1963లో చెలామణిలో ఉన్న నోట్లేనని రూఢిచేసుకున్నాను. ఎంత డబ్బు ఖర్చు చేసినా మా ఏజెన్సీ పట్టించుకోదు, కానీ కాలవ్యతిక్రమాలని మాత్రం ఉపేక్షించదు. అలాంటి తప్పులు పునరావృతమైతే కోర్ట్ మార్షల్ చేసి ఏ దరిద్రగొట్టు కాలంలోకో ఏడాదిపాటు బహిష్కరిస్తారు. నా తోటి ఏజెంటొకడు ఇలాంటి తప్పులకి ప్రతిఫలంగా 1978 లోకి – అదే, ఎమర్జెన్సీ ఏడాదిలోకి – గెంటబడ్డాడు. నేను మాత్రం అలాంటి తప్పులు ఎప్పుడూ చెయ్యను.

కుంతీకుమారి కిటికీని చూడటం చాలించి వెనక్కి తిరిగి అడిగాడు. “ఎక్కడ వాడు?”

అతనికి నోట్ల కట్ట అందిస్తూ చెప్పాను. “ఇక్కడే ఉన్నాడు. బయటికెళితే కనిపిస్తాడు. ఖర్చులకి ఈ డబ్బు ఉంచు. జాగ్రత్త. అతన్ని చంపనని మాటిచ్చావ్. గుర్తుందిగా? నేను మళ్లీ వచ్చి నిన్ను వెనక్కి తీసుకెళ్తాను”

పెద్ద మొత్తాలు చూసెరగనివాడికి ఒక్కసారిగా అంత డబ్బు చేతిలో పడితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అతను మంత్రించినవాడిలా ఆ నోట్లకట్టకేసి చూస్తూండగా, గదిలోంచి బయటికి నెట్టి తలుపు వేశాను. 

కాలంలో నా మరుసటి గెంతు కడు తేలిక. ప్రస్తుతం నుండి కొంచెం ముదుకెళ్లటమే.

(సమయం: 1979, మార్చ్ 10. ఉదయం 11:00 గంటలు. ప్రాంతం: బృందావన్ లాడ్జ్, నారాయణగూడ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్)

క్షణం క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందీ గది. ఆ కాలానికి చెందిన కొన్ని నోట్లు జేబులో కుక్కుకుని హడావిడిగా గదిలోంచి బయటపడ్డాను. కనబడ్డ మొదటి ఖాళీ ఆటోలో ఎక్కి హాస్పిటల్‌కి వెళ్లాను. నర్సుని మాయచేసి పాపని సమీపించటానికి, తర్వాత ఎవరూ చూడకుండా పాపనెత్తుకుని బయటపడటానికి పావుగంటకన్నా పట్టలేదు. అట్నుండి తిన్నగా బృందావన్ లాడ్జికి వెళ్లాను. 

తర్వాతి గెంతు, 1960 లోకి. అప్పటికి బృందావన్ లాడ్జ్ ఇంకా కట్టలేదు. వేరే చోటుకి దూకాలి.

(సమయం: 1960, సెప్టెంబర్ 1. ఉదయం 5:00 గంటలు. ప్రాంతం: జింఖానా హోటల్, బషీర్‌బాగ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్)

పాపని పొదివిపట్టుకుని ఈ పాత హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యాను. ఇంతకు ముందే ఈ గదిని వేరే పేరుతో బుక్ చేసుకుని ఉండటంతో, ఇప్పుడు మేమొచ్చే సమయానికి అంతా సిద్ధంగా ఉంది. కిటికీలు మూసి వేసున్నాయి. కుర్చీలు, టేబుల్, మంచం, ఇతర సామాన్లన్నీ ఓ మూలకి నెట్టబడున్నాయి. గది మధ్యభాగం ఖాళీగా ఉంది, మేము భవిష్యత్తునుండి రావటానికి వీలుగా.

పాప గాఢ నిద్రలో ఉంది. వేకువఝాము చలి ఇబ్బంది పెట్టండకుండా పాపని మందపాటి దుప్పట్లో చుట్టి ఎత్తుకుని బయటికొచ్చాను.  వడివడిగా నడుస్తూ పదినిమిషాల్లో ఆర్ఫనేజ్ చేరుకున్నాను. ‘జేన్’ అని రాసున్న కాగితం ముక్క దుప్పటి మడతల్లో ఇరికించి పాపని ఆర్ఫనేజ్ మెట్ల మీద పడుకోబెట్టి, కాలింగ్ బెల్ రెండు సార్లు నొక్కి పరుగందుకున్నాను. వీధి చివరకు చేరి వెనుదిరిగి చూసేసరికి అప్పుడే ఆర్ఫనేజ్ తలుపు తెరుచుకుంటోంది. వాళ్లు పాపని లోపలకు తీసుకెళ్లేదాకా అక్కడే గోడ చాటున నక్కి చూసి, తర్వాత వేగంగా జింఖానా హోటల్ చేరుకున్నాను. 

మరుసటి గెంతు, 1978 లోకి.

(సమయం: 1978, ఏప్రిల్ 4. తెల్లవారు ఝాము 03:26 గంటలు. ప్రాంతం: బృందావన్ లాడ్జ్, నారాయణగూడ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్)

లాడ్జి నుండి బయటికొచ్చి ఎదురుగా ఆటోలో కునికిపాట్లు పడుతున్న డ్రైవర్ని నిద్రలేపి జేన్ ఆయాగా పనిచేస్తున్న ఇంటి అడ్రస్ చెప్పి పోనిమ్మన్నాను. ఇంటికి అల్లంత దూరంలో ఆపి, ఆటోవాడికి అవసరమైనదానికన్నా ఎక్కువ డబ్బులిచ్చి నే వచ్చేదాకా ఉండమని చెప్పి ఇంటివైపు నడిచి ప్రహరీ గోడ పక్కనున్న చీకట్లలో నక్కి నిరీక్షించసాగాను. కాసేపట్లోనే అటుగా వస్తూ కనబడ్డారిద్దరూ – ఒకరినొకరు హత్తుకుని నడుస్తూ. నిశీధిలో దాగిన నన్ను గమనించకుండా ముందుకు సాగిపోయారు. ప్రహరీ గేటు ముందాగి కాసేపు ముచ్చట్లాడుకున్నాక జేన్ లోపలికెళ్లింది. వెళ్లబోయే ముందు ఆమె నుదిటిని చుంబించాడతడు. ఆమె ఇంట్లోకి వెళ్లిపోయేదాకా అక్కడే నిలబడి చూసి, తర్వాత వెనుదిరిగి జేబులో చేతులు పెట్టుకుని వెనక్కి తిరిగి నడవసాగాడు. 

నా సమీపంలోకి రాగానే ఒక్కడుగు ముందుకేసి అతని చెయ్య పట్టుకుని చెప్పాను. “వచ్చేశాను మిత్రమా. చెప్పినట్లే, నిన్ను వెనక్కి తీసుకెళ్లటానికొచ్చేశాను”.

కుంతీకుమారి ఉలికిపడ్డాడు. తమాయించుకున్నాక “నువ్వా!” అన్నాడు. 

నవ్వి చెప్పాను. “అవును నేనే. ఇప్పుడర్ధమయిందా ‘వాడు’ ఎవడో? కొంచెం ఆలోచిస్తే నువ్వెవరనేదీ అర్ధమవుతుంది. ఇంకొంచెం ఆలోచిస్తే నువ్వు పోగొట్టుకున్న బిడ్డ ఎవరో అర్ధమవుతుంది. మరి కొంచెం ఆలోచిస్తే నేనెవరో కూడా అర్ధమవుతుంది ….”

కుంతీకుమారి మాట్లాడలేదు. అతను పెద్ద షాక్‌లో ఉన్నాడు. నేను బయటపెట్టిన రహస్యం వల్ల కాదు; తనపై తనకే తమాయించుకోలేని కోరిక పుట్టిందన్న నిజాన్ని జీర్ణించుకోలేక. అతన్ని ఆటోలో ఎక్కించి బృందావన్ లాడ్జికి తీసుకొచ్చాను. 

తర్వాతి గెంతు, 2020 AD లోకి.

(సమయం: 2020, ఆగస్ట్ 12. రాత్రి 11 గంటలు. ప్రాంతం: రణ్ ఆఫ్ కచ్ సైనిక స్థావరం, కాలపాలక విభాగం)

డ్యూటీ ఆఫీసర్‌కి నా గుర్తింపు కార్డు చూపించాను. చటుక్కున లేచి నిలబడి సెల్యూట్ చేశాడతను. అధికారం కాలాతీతం. నేనేకాలం నుండొచ్చినా నాకింది ర్యాంక్ ఆఫీసర్ నాకు మర్యాదీయాల్సిందే. 

కుంతీకుమారి ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. అతడిని డ్యూటీ ఆఫీసర్‌కి అప్పగించి “ఇతడికో మత్తు బిళ్లిచ్చి పడుకోబెట్టు. రేపు ఉదయాన్నే కాలపాలకుడిగా నియామక ఉత్తర్వులు ఇచ్చి శిక్షణకి పంపించు” అంటూ ఇతర వివరాలు ముద్రించబడున్న పత్రం అందజేశాను. 

తర్వాత కుంతీకుమారివైపు తిరిగి చెప్పాను. “మిత్రమా. వెళ్లి హాయిగా నిద్రపో. రేపట్నుండీ నీ జీవితం మారిపోతుంది. ఇకపై నీకంతా మంచే జరుగుతుంది”. 

మరుసటి గెంతు, మొదట్లోకి. 

(సమయం రాత్రి 10:27. తేదీ నవంబర్ 7, 1985. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్) 

స్టోర్‌రూమ్ నుండి బయటికొచ్చాను. సహాయకుడు ఎవరో తాగుబోతు కస్టమర్‌తో ఏదో వాదనలో ఉన్నాడు. ఆ గొడవేంటో తెలుసుకునే ఓపిక లేదు. ప్రయాణాలతో పూర్తిగా అలసిపోయాను. 

ఈ ప్రయాణాలు …. ఇవో తప్పనిసరి తద్దినం. ఇలాంటి సైనికోద్యోగాలకి నియామకాలు చెయ్యాలంటే తలప్రాణం తోకకొస్తోంది. ఎప్పుడే కాలంలో ఉండేదీ తెలీని పని చెయ్యమంటే ఎంత డబ్బిస్తామన్నా ముందుకొచ్చేవాళ్లు మొదటికే తక్కువ; అయినా ఒకప్పుడు లోకహితం కోసం కాలపాలకుల అవతారమెత్తటానికి కొందరు ఉత్సాహవంతులు ముందుకొచ్చేవారు. కానీ, 1987లో ఆ ప్రమాదం తర్వాత పరిస్థితి మారింది. నా రిక్రూట్స్‌లో ఒకడు కాలంతో ఆడే ఆటలో చేసిన చిన్న పొరపాటు, ప్రపంచాన్ని మార్చేసింది. మళ్లీ వెనక్కెళ్లి ఆ తప్పుని సరిదిద్దటానికి వీల్లేని రీతిలో మార్చేసింది. ఆ దెబ్బతో ఇతరులపై నమ్మకం పోయింది. ఇకపై నన్ను నేనే నమ్ముకోవాలన్న నిర్ణయానికది పురిగొల్పింది. ఆ తర్వాత ఇది నలభయ్యో నియామకం. దీనితో నా కోటా పూర్తయింది. రేపట్నుండీ నాకిక్కడ పనిలేదు.

రాజీనామా పత్రం రాసి భద్రంగా కవర్‌లో పెట్టి సీల్ చేసి సహాయకుడికిచ్చి, రేపు ఉదయమే దాన్ని మేనేజర్ చేతిలో పెట్టమని చెప్పి మళ్లీ స్టోర్‌రూమ్‌లోకెళ్లాను. 

చివరి గెంతు, 2008లోకి.

(సమయం రాత్రి 10:30. తేదీ జనవరి 12, 2008. ప్రాంతం: రణ్ ఆఫ్ కచ్ సైనిక స్థావరం, కాలపాలక విభాగం)

డ్యూటీ ఆఫీసర్‌కి గుర్తింపు కార్డ్ చూపించి నా గదికి వెళ్లాను. తలుపులు మూసి మంచమ్మీద అలసటగా కూలబడ్డాను. నాతో తెచ్చుకున్న సీసా …. అదే, పందెంలో గెలిచిన సీసానే …. తెరిచి రెండు గుక్కలు గొంతులో ఒంపుకుని గుటకేశాను. కాసేపలాగే కూర్చుని సేదదీరాక లేచి బదిలీ కోరుతూ పై అధికారికి లేఖ రాసి టేబుల్ మీదుంచాను. ఈ రిక్రూటింగ్ ఉద్యోగమింక నా వల్ల కాదు. 

చొక్కా విప్పి గదిలో ఓ మూలకి విసిరేస్తూ వెల్లకిలా మంచమ్మీద వాలిపోయాను. పైకప్పు మీద చెక్కినట్లున్న అక్షరాలు వెక్కిరించాయి: “కాలయాత్రికుడి నిబంధన: రేపటి పని నేడే చేయకు”.

ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆ వాక్యాలు రగిలించిన ఉత్సాహం నేడు కలగలేదు. ముప్పయ్యేళ్ల కాలప్రయాణాలు ఎంతటివారినైనా కరగదీసేస్తాయి. 

చేత్తో పొత్తికడుపు మీద తడుముకున్నాను. పాతగాయాల జాడలు తగిలాయి …. సిజేరియన్ కుట్లు. వళ్లంతా ఒత్తుగా జుత్తు పెరగటం మూలాన పరీక్షగా చూస్తే తప్ప కనపడవిప్పుడు.

ఉంగరపు వేలికేసి చూశాను. మిలమిల మెరుస్తోంది – తన తోకని తానే మింగుతున్న కాలసర్పం.

ముంచుకొస్తూన్న నిద్రకి సూచనగా నా కళ్లు మూతలు పడుతుండగా, గది మసకబారింది. ఆ మసకల్లో వాళ్లు కనబడ్డారు – మొత్తం నలభై మంది. 

నేనక్కడి నుండొచ్చానో నాకు తెలుసు. 

వాళ్లెక్కడి నుండొచ్చారు?

తలనొప్పి మొదలయింది. దాన్ని వదిలించుకోటానికన్నట్లు తల గట్టిగా విదిలించాను. నలభై మందీ మాయమైపోయారు. 

చెయ్యి చాపి మంచం పక్కనే ఉన్న బెడ్‌ల్యాంప్ ఆపేశాను. గదినిండా చీకట్లు కమ్ముకున్నాయి.

మూసుకున్న నా కనురెప్పల వెనకున్న శూన్యంలో నీ వదనం కనబడింది – సుదూరంగా …. చెదరని జ్ఞాపకంలా.

నాకంటూ మిగిలిందా జ్ఞాపకాలే.

ఐ మిస్ యు, జేన్.