రచన: అనిల్ ఎస్. రాయల్

‘కౌముది’, డిసెంబర్ 2009
‘రచన’, ఆగస్ట్ 2010


“ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. ఏ మెడికల్ షాపులోనైనా దొరుకుతాయివి. రోజుకొక్కటే వేసుకోండి”

మళ్లీ ఎప్పుడు రమ్మంటారు డాక్టర్?”

“రెండు నెలలు రెగ్యులర్‌గా ఈ మందులు వాడి చూడండి. అప్పటికీ తేడా కనిపించకపోతే ఓ సారి కలవండి. గుడ్ లక్”

ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకుంటూ డాక్టర్‌కి థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చాను. పార్కింగ్ లాట్లో ఉన్న కారు దగ్గరికి నడుస్తూ సెల్ ఫోన్లో సమయం చూశాను – ఎనిమిదీ ఇరవై ఒకటి. 

డోర్ తెరిచి లోపల కూర్చుంటూ సెల్ ఫోన్ పక్క సీట్లోకి విసిరి కారు స్టార్ట్ చేసి పోనిచ్చాను. హాస్పిటల్ గేట్ దగ్గరికొస్తుండగా ఫోన్ మోగింది. తలతిప్పి ఫోన్ అందుకోబోతుండగా లిప్తపాటులో జరిగిందది ….

కారుకి ఎదురుగా అతను .. గాల్లోండి ఊడిపడ్డట్లు. అదిరిపడి స్టీరింగ్ రెండు చేతుల్తో బిగించి పట్టుకుంటూ బలమంతా ఉపయోగించి బ్రేక్ నొక్కాను. కీచుమన్న శబ్దం .. దాంతోపాటే పెద్ద కుదుపు.    

(5:23 AM)

ఎవరో పట్టుకుని కుదిపేస్తున్న ఫీలింగ్‌తో ఉలిక్కి పడి నిద్ర లేచాను. కాసేపది కలో నిజమో అర్ధం కాలేదు. నిజం లాంటి కలా, కల లాంటి నిజమా? చెమటలు ధారగా కారిపోతున్నాయి. అది కలే, ప్రస్తుతం నేనున్నది వెలుపలే …. అని తెలీటానికి అర నిమిషం పట్టింది.

మళ్లీ లూసిడ్ డ్రీమ్. డాక్టర్ వివరణ గుర్తొచ్చింది.

“ఎక్కువ శాతం కలల విషయంలో మన మెదడు స్వప్నానికీ సత్యానికీ తేడా గ్రహించలేదు. అటువంటి సందర్భాల్లో, ఆ వచ్చింది పీడ కలైతే, అది వాస్తవమేనని భ్రమ పడి నిద్రలోనే తీవ్ర భయాందోళనలకు గురవుతాం. ఏ లాటరీ తగిలినట్లో కలొస్తే ఆనందమూ అనుభవిస్తాం. అయితే కొన్నిసార్లు మనం కల కంటున్నామన్న గ్రహింపు మెదడుకి ఉంటుంది. వీటినే లూసిడ్ డ్రీమ్స్ అంటాం. ఈ తరహా కలలొచ్చినప్పుడు, నిద్రలో కలగంటున్నామన్న నిజం తెలిసుండటంతో అవి పీడకలలైనా, తీపికలలైనా అంతగా స్పందించం”

ఇప్పుడు నాకొచ్చింది అలాంటి కలే. నేను గాభరాగా బ్రేక్ మీద పాదం మోపటం వరకూ గుర్తుంది. వెంటనే కీచుమన్న శబ్దం, దానితో పాటే పెద్ద కుదుపు. తూలి ముందుకు పడుతున్న ఫీలింగ్తో మెలకువ వచ్చేసింది. తర్వాతేమయింది? అతనికి తగిలిందా?. ఏమో. ఒకవేళ తగిలే ఉంటే? అంత వేగంతో ఢీకొట్టాక అతను బతికుండే అవకాశాల్లేవు. 

రెండు నిమిషాలు మంచమ్మీదనే కదలకుండా కూర్చున్నాను. గొంతులో తడారిపోయింది, వంట్లో వణుకు. అది కలేనన్న గ్రహింపున్నా అంత భయపడటానికి కారణం – నా ఫోబియా.

యాక్సిడెంట్లంటే నాకెప్పుడూ భయమే…. ఎవరిక్కాదు? అయితే నా భయం గుద్దుకున్నాక అతని పరిస్థితేమిటని కాదు, నా పరిస్థితేమిటని. అతనికేమైనా అయితే – నాకిక జైలే గతి. కలలో సైతం ఊహించుకోలేని ప్రదేశమది. నాకు నాలుగైదేళ్ల వయసులో దొంగ-పోలీస్ ఆటాడుతూ కోళ్ల గూడులో దాక్కున్నాను. రెండు చదరపు అడుగుల కన్నా తక్కువుండే చోటది. తోటి ఆటగాళ్లలో ఆకతాయొకడు బయటినుండి గడె పెట్టి పారిపోయాడు. తర్వాత ఎవరో వచ్చి విడిపించేవరకూ, రెండు మూడు గంటల పాటు ఊపిరి కూడా సరిగా ఆడని ఆ గూటిలో భయంతో కేకలు పెడుతూ గడిపాను. అప్పట్నుండీ నాకు చీకటి గదులన్నా, ఇరుకు చోట్లన్నా చెప్పలేనంత భయం. అలాంటి ప్రాంతాలకు వెళ్లక్కర్లేదు, కేవలం తలచుకున్నా ఊపిరాడనట్లు ఉక్కిరిబిక్కిరైపోతాను. జైలు గదులంటే ఈ రెండింటి సమ్మేళనమని నా నమ్మకం. అందుకే అవంటే అంత భయం. ఏ కారణం చేతన్నా ఇరుకు సెల్లో ఉండాల్సి వస్తే .. అన్న ఊహే చెమటలు పట్టిస్తుంది.

నుదుటిపై చెమటలు అరచేత్తో తుడిచేస్తూ అతనెవరో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. హఠాత్తుగా జరగటంతో అతని ముఖం చూసే అవకాశం రాలేదు, అయినా బాగా తెలిసినవాడే అన్న భావన. కానీ ఎంతాలోచించినా ఎవరో తట్టలేదు. నేనెరిగిన వారందరినీ వరసగా గుర్తు చేసుకున్నా, వాళ్లలో అతనెవరో అంతు పట్టలేదు. అతనికి సంబంధించిన దాన్ని దేన్నో చూసినట్లూ అనిపించింది కానీ అదేమిటో కూడా అంతు పట్టలేదు.

ఆలోచనలు బలవంతంగా పక్కకి నెడుతూ మెల్లిగా మంచం దిగి బాత్రూమ్లోకి నడిచాను.

(5:45 AM)

స్నానం చేస్తున్నా, నా ఆలోచనలన్నీ కలల చుట్టూనే తిరుగుతున్నాయి. కడలిలో అలల్లా, కలగాపులగంగా. ఎక్కడ మొదలై ఎక్కడ తేలతాయో తెలీకుండా .. ఆలోచనలు.

రెండు నెలలుగా తరచూ కలలొస్తున్నాయి. ఎప్పుడూ చూడని ప్రదేశాలకీ, దేశాలకీ వెళ్లినట్లు. ఆ కలలు మొదలైనప్పట్నుండీ కొన్ని కొత్త  ప్రాంతాలకి వెళ్లినప్పుడు వాటిని ఇంతకు ముందే చూసిన ఫీలింగ్! అప్పుడప్పుడూ అపరిచితుల చూపుల్లో నన్ను గుర్తుపట్టిన భావం. అయితే నేను ఆలోచిస్తుంది వాటి గురించి కాదు – మా నాన్న గురించి.

ఆయన పోయి నాలుగు నెలలవుతుంది. చివరి నిమిషంలో ఆయన చేసిన ఫోన్ ఎత్తి ఉంటే ఆయన దక్కి ఉండేవాడన్న భావన ఈ నాలుగు నెలల్లోనూ నన్ను వదల్లేదు. ఆఫీసు పని వత్తిడిలో పడిపోయి, తర్వాత తీరిగ్గా మాట్లాడదాములే అనుకుంటూ ఫోన్ ఎత్తకపోవటం అంత పని చేస్తుందనుకోలేదు. గుండెనొప్పితో విలవిల్లాడుతూ నాకు ఎమర్జెన్సీ కాల్ చేసుంటాడని ఎలా ఊహించగలను? నేనా ఫోన్ తీసుంటే ఆయనకి సమయానికి వైద్య సహాయం అందేలా చేసేవాడినేమో – అన్న గిల్టీ ఫీలింగ్.

ఈ రెండు నెలల్లో ఆయన ఆయన గురించే ఎక్కువ కలలొచ్చాయి. ఆయన బతికే ఉన్నట్లు, కులాసాగా తిరుగుతున్నట్లు, నాతో ముచ్చట్లు చెబుతున్నట్లు. ఒకటో రెండో సార్లైతే పట్టించుకునేవాడిని కాదు. ఏడెనిమిది సార్లు అటువంటి కలలు రావటంతో నా గిల్టీ ఫీలింగ్ మరీ పెరిగిపోయింది. డిప్రెషన్ మొదలయింది. సరిగా నిద్ర పట్టదు. పట్టిన కలత నిద్ర నిండా కలలు. ఆ ఫోన్ తీసున్నా ఆయన బతికుండేవాడా? తెలీదు. ఈ అపరాధ భావన మాత్రం ఉండేది కాదేమో. అదీ తెలీదు. తెలిసిందొక్కటే – ఆయన లేడన్న సత్యం. 

సత్యం. ఏది సత్యం? ఏదసత్యం? 

“సత్యం అంటూ ఏదీ లేదు. ఉన్నవన్నీ దృక్కోణాలే. మనకు తెలీని కోణాలూ ఉన్నాయి” అన్నాడు డాక్టర్. అతని కోణంలో నాన్న బ్రతికే ఉన్నాడు – మరెక్కడో.

“మన లోకంలో మీ నాన్న లేరు కానీ, వేరే లోకంలో ఎక్కడో బ్రతికే ఉన్నారాయన”

వాట్ డూ యూ మీన్, డాక్టర్?”

“అర్ధం కాలేదా? ఆ ఫోన్ మీరు తీసి ఉంటే ఆయన బ్రతికేవారని బాధపడుతుంటారు కదా. అది ఇక్కడ – మనమున్న ఈ లోకంలో – జరిగింది. అదొక్కటే మీరు చూసిందీ, మీకు తెలిసిందీ. నిజానికి, ఆ ఫోన్ కాల్ వచ్చిన క్షణంలో మరో లోకం ఏర్పడింది. ఆ లోకంలో మీరాయన ఫోన్ కాల్ అందుకున్నారు, ఆయన బ్రతికారు. ఆ ఇంకో లోకంలో ఆయన ఇప్పుడు కులాసాగా తిరుగుతుంటారు”

డాక్టర్ చెప్పింది సాధ్యమేనా? సాధ్యాసాధ్యాల సంగతేమో కానీ, ఆ ఊహ మాత్రం చాలా బాగుంది.

ఊహ అనేది ఆశావాదుల ఆవిష్కరణ కాబోలు. అందుకే వాటిలో అధికం అందంగానే ఉంటాయి. దేవుడూ అలాంటి ఊహేనా? అనునిత్యం మనల్ని కాపాడే మహాశక్తి ఏదో ఎక్కడో ఉందన్న అందమైన భావన మాత్రమేనా .. లేక దేవుడనేవాడు నిజంగానే ఉన్నాడా. ఉంటే, ఆయన ఆలకించే ప్రార్ధనలకన్నా వినిపించుకోనివే ఎక్కువెందుకు? చావబోతూ వేడుకున్నా అరుదుగా తప్ప కరుణించడెందుకు?

“ఎందుకంటే …. ఇన్ని లక్షల కోట్ల విశ్వాలని మేనేజ్ చేసేవాడికి ప్రతి ప్రాణి కోరికలూ తీర్చేంత తీరికుండదు కాబట్టి, తీరికున్నా ఆ అవసరం లేదు కాబట్టి… ఒక్కో జీవికీ లక్షలాది నకళ్లున్నాయి కాబట్టి, వాటిలో ఒకటి నశించినా పోయేదేమీ లేదు కాబట్టి. అంతకన్నా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి దేవుడికి”

నా ప్రశ్నకి డాక్టర్ సమాధానం అది. దేవుడున్నాడనే డాక్టర్లనీ, సైంటిస్టులనీ చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమేస్తుంది. సైన్సుకీ, దేవుడికీ చుక్కెదురని నా నమ్మకమేమో. నేను నాస్తికుడిని కాను, అలాగని ఆస్తికుడినీ కాదు. అవసరమైనప్పుడే దేవుడిని నమ్మే అవకాశవాదిని. దేవుడూ నాలాగే అవకాశవాది, హుండీలో డబ్బులేస్తేనే కోరికలు తీర్చే మెటీరియలిస్టు అనుకునేవాడినిన్నాళ్లూ. డాక్టర్ మాటలు నాకు దేవుడి మరో కోణాన్ని పరిచయం చేశాయి. అతను చెప్పిందీ నిజమే కావచ్చనిపించింది.

(7:19 AM)

అపార్ట్‌మెంట్‌కి తాళమేసి ఎలివేటర్లో కిందికొస్తూ సెల్ ఫోన్లో సమయం చూసాను. ఇంకో గంటా పది నిమిషాలుంది. ట్రాఫిక్ జామ్ ఏదన్నా ఎదురైతే తప్ప, తేలిగ్గా పావు గంట ముందే వెళ్లిపోవచ్చు. 

నా కలల పీడ, అవి తెచ్చిపెట్టిన డిప్రెషన్ వదిలించుకోటానికి పది రోజుల క్రితం మొదటిసారిగా నా మేనేజర్ బలవంతమ్మీద కౌన్సిలింగ్ కోసం ఈ డాక్టర్ దగ్గరికెళ్లాను. మొత్తం మూడు సెషన్లు అవసరమౌతాయన్నాడతను. వాటిలో రెండు పూర్తయ్యాయి. ఇప్పుడు నేనెళుతుంది ఆఖరి దానికోసం. ఇందాకటి కలేమో నేనా చివరి సెషన్ ముగించుకుని వస్తున్నట్లు!  

ఎలివేటర్లోంచి బయటికొచ్చి పార్కింగ్ గరాజ్లోకి నడిచాను. ఎలివేటర్ నుండి ఎనిమిదో లాట్ నాది.  

కార్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేస్తూ బ్రేక్ కిందకి నొక్కిపట్టాను. ఎందుకయిందో కానీ, అవసరం లేకున్నా అలా బ్రేక్ కిందకి నొక్కి ఇంజిన్ ఆన్ చెయ్యటం అలవాటయింది. బ్రేక్ పైనుండి మెల్లిగా పాదం తీసేస్తుండగా ఇందాకటి కల కళ్లలో మెదిలింది. ఎవరతను? అతనికి సంబంధించినది ఏదో ఎక్కడో చూసిన ఫీలింగ్. ఏమిటది? బాగా ఎరిగినదే కానీ గుర్తుకురావటం లేదు .. తల విదిలిస్తూ బండి బయటికి తీశాను. రెండు నిమిషాల్లో కారు రోడ్డెక్కింది. రోడ్డు పక్కనే లోకల్ ట్రైన్ ట్రాక్స్ .. సమాంతరంగా సాగుతూ. అలా సాగి .. సాగి .. సుదూరంగా పట్టాలు రెండూ ఏకమౌతున్న భ్రమ కల్పిస్తూ.

అసంకల్పితంగా నవ్వొచ్చింది – సమాంతర రేఖలు కలవటం అన్న భ్రమకి. జరిగే పనేనా అది? వెంటనే డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి.

 “ఈ లోకంలో మనకి అసంభవమైనవిగా అనిపించేవి మరో లోకంలో అతి సాధారణం కావచ్చు – ఎందుకంటే అక్కడి భౌతిక నియమాలు మనమెరిగిన వాటికి భిన్నంగా ఉండొచ్చు”

మన ప్రపంచంలో కాకపోయినా, ఏదో ఒక పారలల్ యూనివర్స్లో సమాంతర రేఖలు కలవటం అతి సాధారణమైన విషయమన్న మాట.

పారలల్ యూనివర్సెస్! వింతగా అనిపించింది మొదటిసారి విన్నప్పుడు. లక్షల కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలతో నిండి ఆదీ అంతమూ లేకుండా ఉండే ఈ ఒక్క విశ్వాన్ని అర్ధం చేసుకోటమే నావల్ల కాని పని. ఇలాంటి విశ్వాలు ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయని, అనుక్షణం ఇంకెన్నో పుట్టుకొస్తూనే ఉంటాయని మొదటిసారి విన్నప్పుడు తల తిరిగిపోయింది.

“సమాంతర విశ్వం …. మరో ప్రపంచం అనీ అనుకోవచ్చు. మన విశ్వానికి సమాంతరంగా, అచ్చు ఇలాంటివే కానీ చిన్న చిన్న తేడాలతో మరి కొన్ని లక్షల కోట్ల విశ్వాలు ఉన్నాయి. తేడాలంటే – మనం ఊహించగలిగేవే కాక ఊహకందనివీ ఉండొచ్చు. ఉదాహరణకి, ఒక్కో విశ్వంలోనూ కాలం ఒక్కో వేగంతో నడవచ్చు. ఒక చోట క్షణం మరోచోట యుగం కావచ్చు. ఆ విశ్వాల్లోనూ మనకున్నట్లే భూమీ, సూర్యుడూ, సౌర కుటుంబం, పాలపుంత .. అన్నీ ఉన్నాయి. ఉత్తి అవే అనేమిటి, మీరూ, నేనూ కూడా ఉంటాం వాటిలో. ఈ లోకంలో మనకి అసంభవమైనవిగా అనిపించేవి మరో లోకంలో అతి సాధారణం కావచ్చు – ఎందుకంటే అక్కడి భౌతిక నియమాలు మనమెరిగిన వాటికి భిన్నంగా ఉండొచ్చు”

అంటే .. ఊహా లోకాలా డాక్టర్?”

“ఊఁహు. నిజమైన లోకాలే. మనం ఎంత నిజమో, అవీ అంత నిజం”

నిజం .. అంతకన్నా సాపేక్షమైనది మరొకటి లేదేమో. ఒకరికి నిజమైనది మరొకరికి అబద్ధం. ఏది నిఖార్సైన నిజం? పోనీ, ఏది నిజం కాదు? కలలు .. కలలు నిజం కావు, నిజమైనవి కావు .. నిజంగానే కావా? ఏమో. పోనీ అవి నిజమౌతాయా? కలలు నిజమౌతాయా?

“కలలు నిజమౌతాయా అంటే .. చెప్పలేం. నిజాలే కలలవుతాయని మాత్రం చెప్పగలం”

ఏంటో డాక్టర్. తికమకగా ఉంది

“తికమకేం లేదిందులో. చాలా సింపుల్. మనకి అనేకానేక పారలల్ యూనివర్సెస్ ఉంటాయనుకున్నాం కదా. కలలనేవి వాటిలోకి తొంగిచూసే కిటికీల్లాంటివి. కలలో మీరేదో పని చేస్తున్నట్లు చూశారనుకోండి; నిజానికి మీరు చూస్తుంది మిమ్మల్ని కాదు – మీకున్న వేలకొద్దీ నకళ్లలో ఒకదాన్ని. అంటే, మీరు కల అనుకునేది మీ నకళ్లలో ఒకతని దినచర్య. అతనికి నిజమయిందే మీకు కలయ్యింది. అదీ సంగతి. ఇంతకీ మీరేమనుకుంటారు, కలలు నిజమవటం గురించి?”

నిజమౌతాయని కానీ, కావని కానీ నాకు స్థిరమైన నమ్మకాలేమీ లేవు. అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఏదన్నా కలొచ్చినప్పుడు – ముఖ్యంగా పీడకల – అది నిజమైతే అన్న అనుమానం. దాని వెంబడి కించిత్ భయం. ఒకట్రెండు సార్లు నాకొచ్చిన కలలు నిజమయ్యాయి. అప్పట్నుండీ ఎప్పుడు పీడకలొచ్చినా అదెక్కడ నిజమౌతుందోనన్న అనుమానం. ఇప్పుడూ అలాంటి అనుమానమే. నేన్నిజంగానే యాక్సిడెంట్ చేస్తే? జైలు గది ఊహించుకోటానికీ ధైర్యం చాల్లేదు. డాక్టర్తో సెషన్ ముగించుకునొస్తూ హాస్పిటల్ ఎదురుగా యాక్సిడెంట్ చేసినట్లు కల. ఇప్పుడు వెళుతుందీ అక్కడకే. 

ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలి.

(7:30 AM)

రెడ్ లైట్ పడటంతో కారాపాను. ఆలోచనల్లోనుండి బలవంతాన బయటికొస్తూ ఇంటర్సెక్షన్ ఇరువైపులా పరికించాను. జనం .. ఎక్కడ చూసినా జనం. తండోపతండాలుగా, మందలు మందలుగా. రేపు రాదేమో, అన్నీ ఇప్పుడే చేసెయ్యాలన్నంత ఆత్రంగా .. తోసుకుంటూ, పడుతూ లేస్తూ, పరుగులు తీస్తూ  .. జనం. కోట్లాది పారలల్ యూనివర్సెస్లో ఈ హడావిడి లేని భూమండలం ఒక్కటైనా ఉంటుందా? 

అన్ని కోట్ల విశ్వాల్లో దుమ్మూ ధూళీ కాలుష్యం, అసూయా ద్వేషాలు, అసమానతలూ  అనుమానాలూ, రోగాలూ ఘోరాలూ, స్పర్ధలూ  యుద్ధాలూ .. ఇవేవీ లేని భూమండలమూ ఒకటుంటుందా? ఉండొచ్చేమో! “సంభావ్యత ఉన్నవన్నీ సంభవిస్తాయి,” డాక్టర్ మాటలు గుర్తొచ్చాయి. మరి యాక్సిడెంటూ సంభవించేనా?

విండో మీద ఎవరో తడుతున్న చప్పుడైంది. తల తిప్పి చూస్తే, ఆ కుర్రాడు. ఏడాది పైబడి రోజూ చూస్తున్నా అతని పేరేంటో తెలీదు. రోజూ ఇక్కడే కనిపిస్తాడు. ఆగిన కార్లు తుడుస్తాడు, ఆపై డ్రైవర్ కిటికీ దగ్గరికెళ్లి చెయ్యి చాపుతాడు. ఏదన్నా ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఏమిచ్చినా ఇవ్వకపోయినా అదే నవ్వు అతని ముఖంలో. ఆ నవ్వులో .. ఏదో జాలి. అతనికీ అనేక లోకాలుంటాయా? వాటిలో ఏం చేస్తుంటాడో .. ఇలాగే కార్లు తుడుస్తుంటాడా, ఇంత ఆర్తిగానూ నవ్వుతాడా?

గ్రీన్ లైట్ పడింది. హడావిడిగా విండో దించి గ్లవ్ కంపార్ట్మెంట్ నుండి ఐదు రూపాయల నాణెం తీసి అతనికిస్తూ కారు ముందుకి కదిలించాను. అప్పటికే వెనకనుండి ఒకట్రెండు హారన్లు. కారు కదులుతుందని వెనక్కి జరగటంతో, నాణెం అందుకోలేకపోయాడతను. కింద పడిపోయింది. ఇంటర్సెక్షన్ దాటేస్తూ రియర్ వ్యూ మిర్రర్లో చూస్తే ఆ కుర్రాడు కిందకొంగి నాణెం ఏరుకోవటం కనిపించింది. ఏం పడుంటుంది – ఇక్కడ అచ్చైతే అక్కడ బొమ్మా, అక్కడ అచ్చైతే ఇక్కడ బొమ్మా?

“చెప్పండి. అచ్చా, బొమ్మా?”

బొమ్మ

“ఆల్రైట్.. చూద్దాం ఏం పడిందో.. కంగ్రాట్స్, బొమ్మే. ఇలా టాస్ వేస్తే బొమ్మ పడటానికి ఎంత అవకాశముందో, అచ్చు పడటానికీ అంతే అవకాశముంది. ఫలితం మాత్రం ఒకే ఒకటి – ఐతే అచ్చు, లేకపోతే బొమ్మ. అవునా?”

అంతే కదా మరి

“ఒకవేళ అచ్చు, బొమ్మ రెండూ పడితే?”

అదెలా సాధ్యం డాక్టర్?”

“సాధ్యమే .. బహుళ ప్రపంచాల సిద్ధాంతం ప్రకారం”

అదేం సిద్ధాంతం!”

“మెనీ వర్ల్డ్స్ ఇంటర్ప్రెటేషన్ – ఎమ్డబ్ల్యూఐ. దాని ప్రకారం, నాణెం గాల్లోకి లేచిన క్షణంలో మనమున్న ఈ ప్రపంచం లాంటిదే మరో ప్రపంచం పుడుతుంది. ఆ రెండో ప్రపంచంలోనూ మనం ఉంటాం – ఇదే గదిలో, ఇదే సంభాషణ చేస్తూ. తేడా అల్లా అందులో టాస్ ఫలితం బొమ్మ కాకుండా అచ్చు వస్తుంది”

“!!”

“ఒకటికన్నా ఎక్కువ ఫలితాలొచ్చే సంభావ్యత ఉన్న ఏ సంఘటన జరిగినా అప్పుడు మరిన్ని కొత్త ప్రపంచాలు పుట్టుకొస్తాయి. ఒక్కో ప్రపంచంలో ఒక్కో ఫలితం చొప్పున అన్ని రకాల ఫలితాలూ ఎక్కడో ఒక చోట వస్తాయి. వాటిలో మనం ఏ ఫలితాన్ని చూస్తామనేది మనం ఉన్న ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది”

గందరగోళంగా ఉంది. సైన్స్ ఫిక్షన్ కథ వింటున్నట్లుంది

“ఫిక్షన్ కాదు. సిసలు సైన్సే. సూపర్ స్ట్రింగ్ థియరీ పేరు విన్నారా?”

“??”

“అయితే వివరాల్లోకొద్దులే. పాయింటేమిటంటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయమూ కొత్త విశ్వాల పుట్టుకకి దారి తీస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, సంభావ్యత ఉన్నవన్నీ సంభవిస్తాయి – ఒక్కోటీ ఒక్కో విశ్వంలో. పారలల్ యూనివర్సెస్ ఉన్నాయనే వాదనకి శాస్త్రవేత్తల ఆమోదం రాన్రానూ పెరుగుతుంది. వాటి ఉనికి గురించిన ఆధారాలైతే ఇంకా ఏమీ దొరకలేదనుకోండి ..”

ఆధారాల ఆసరా లేనిదే దేన్నీ నమ్మకూడదా? మరి మత విశ్వాసాల మాటేమిటి? మతాల పునాది ఏ శాస్త్ర పరీక్షకీ నిలబడని పురాతన విశ్వాసాలేగా. వేల సంవత్సరాలుగా వందల కోట్ల మంది నమ్మిన విశ్వాసాలన్నిట్నీ ఆధారాల్లేవని కొట్టేయగలమా? గుడ్డిగా దేవుడి ఉనికిని నమ్మటానికి లేని సమస్య సైంటిఫిక్ థియరీలని నమ్మటానికి మాత్రం దేనికి? మల్టీవర్స్ థియరీని అంగీకరించటానికి, నమ్మటానికి అంతకన్నా ఎక్కువ తర్కం అవసరం పడలేదు నాకు. 

(8:00 AM)

ట్రాఫిక్ జామ్. ముందెక్కడో యాక్సిడెంటయిందట. ఎవరో కుర్రాడు, ఫుట్బోర్డింగ్ చేస్తూ జారి బస్సు కింద పడ్డాడట. ఇప్పుడే అంబులెన్స్ వెళ్లింది సైరన్లు మోగించుకుంటూ. దెబ్బలు బాగానే తగిలాయట. ఉంటాడో పోతాడో. 

పొద్దుటి కల మళ్లీ గుర్తొచ్చింది. ఎవరో అతను! ఏదో ఫెమిలియారిటీ. ఏమిటది? ఇంతకీ సమయానికే బ్రేక్ కొట్టానా లేక ఆలస్యమయిందా? యాక్సిడెంటయితే .. ఉన్నాడా, పోయాడా?

పోవటం అంటే .. మనం తప్ప మిగతా అంతా ఉండటం అని ఎక్కడో చదివిన జ్ఞాపకం. 

మనిషితో పాటే అతని జ్ఞాపకాలూ గతించి పోతాయా? ఒక జీవిత కాలంలో అతను సంపాదించిన విజ్ఞానమంతా అతనితోటే నశించిపోతుందా? 

కాదనుకుంటా. కొన్ని రకాల పక్షులు శీతాకాలంలో వేలాది మైళ్ల అవతలున్న ప్రదేశాలకి వలస పోతాయట. తాము జన్మలో ఎప్పుడూ వెళ్లి ఎరగని ఆ ప్రాంతానికి అవి అంత తేలిగ్గా ఎలా ఎగిరెళ్లగలుగుతాయో తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యమేసింది. ఆ పక్షి జాతి, ఆ ప్రాంతానికి సంబంధించిన తమ జ్ఞాపకాన్ని భద్రంగా జన్యువుల ద్వారా తమ తర్వాతి తరానికి చేరవేస్తుందట! ఈ జ్ఞాపకాల బదిలీ అనేదే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతానికి పునాది. ప్రాణులన్నీ తమ జీవిత కాలంలో నేర్చుకున్న అతి ముఖ్యమైన జ్ఞానాన్ని జన్యువుల్లో పొందుపరచి తర్వాతి తరాలకు బదిలీ చేస్తాయి. అది పనిగట్టుకు చేసే పని కాకపోయినా, అదలా జరిగిపోతుందంతే. కాబట్టి, జ్ఞాపకాలు గతించవు. అంటే – మరణం అనేది ఏ జీవికీ అంతం కాదు. అయినా దాని గురించి ఎందుకంత భయం?

హారన్ మోగటంతో ఆలోచనలకు అడ్డుకట్ట పడింది. ట్రాఫిక్ జామ్ క్లియర్ ఐనట్లుంది. వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. నేనూ కదలబోతుండగా, నా కారు వెనకనుండి కుడి వైపుగా దూసుకొచ్చిందో స్కూటీ. నన్ను కదలమన్నట్లు హారన్ కొట్టింది ఆ స్కూటీ నడుపుతున్న సుందరాంగే. గేర్లు మారుస్తూ ఆమెకేసి చూశాను. హెల్మెట్ లేకుండా టూవీలర్స్ నడిపేవాళ్లని చూస్తే నాకు మామూలుగానైతే చిరాకేస్తుంది. ఈమెని చూస్తే మాత్రం ఆనందమేసింది. అందాన్ని చూస్తే కలిగే ఆనందం. 

నేనలా రెప్ప వాల్చకుండా చూస్తుండగానే స్కూటీ సుందరి నాకేసి చూసింది. చూడగానే నవ్వింది. నవ్వాక తల తిప్పుకోలేదు; తదేకంగా నన్నే చూసింది. అలాగే చూస్తూ నా కారు దాటేసి ముందుకు సాగిపోయింది. ఆ చూపులో .. అదే భావం. రెండు నెలల్లో నాకు పలుమార్లు కొత్తవారితో ఎదురైన అనుభవం …. ఇప్పుడు మరోసారి ఎదురయింది. 

ఆమె కళ్లలో నన్ను గుర్తు పట్టిన భావం – డేజావూ.

“డేజావూ అనేది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు, కొందరికి తరచూ ఎదురయ్యేదే. మీరొక్కరే అనుభవించే పరిస్థితి కాదది”

“అది కలగటానికి కారణం?”

“మెదడు చేసే మాయ. ఆ ప్రదేశాలకి మీరు నిజంగానే ఎప్పుడో – ఉదాహరణకి, బాగా చిన్నప్పుడు – వెళ్లి ఉండొచ్చు. అయితే వాటి గురించి గుర్తుపెట్టుకోవాల్సినంత విశేషం ఏదీ లేకపోవటంతో మీ మెదడు వాటిని ఏ మారు మూల సొరుగుల్లోకో తోసేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు మళ్లీ అక్కడికెళ్లినప్పుడు ఆ జ్ఞాపకాలే బయటికి తీసి ఉండొచ్చు. ఇదొక వివరణ”

అంటే, ఇంకొక వివరణ కూడా ఉందా?”

“ఉంది. ఎమ్డబ్ల్యూఐ ప్రకారం మనకి అనేక నకళ్లు ఉంటాయనుకున్నాం కదా. వాటన్నిటి మెదళ్లూ అనుసంధానమై ఉంటాయనేది ఓ ప్రతిపాదన. అదే నిజమైతే, ఏదో ఓ సమాంతర విశ్వంలో మీ నకళ్లలో ఒకరు చూసే ప్రదేశాలూ, అతని  జ్ఞాపకాలూ మీ మెదడు పొరల్లోకి లీక్ అవ్వచ్చు. కొన్నిసార్లు కొత్త ప్రదేశాలనీ, మనుషులనీ చూసినప్పుడు కలిగే ఫెమిలియర్ ఫీలింగ్‌కి కారణం ఇదే కావచ్చు. డేజావూకి ఇదొక వివరణ”

మరేదో ప్రపంచంలో స్కూటీ సుందరి నకళ్లలో ఒకటి నా నకళ్లలో ఒకర్ని కలిసిందన్న మాట. నేను ఆమెకి ఫెమిలియర్గా అనిపించటానికి అదీ కారణం! ఆ లోకంలో వాళ్లిద్దరూ ఒకరికొకరు ఏమయ్యుంటారు …. ప్రేమికులా? 

ఆ ఊహకి నవ్వొచ్చింది. 

నా గమ్యస్థానమూ వచ్చింది.

(8:21 AM)

హాస్పిటల్ యాభై గజాల దూరంలో ఉండగా వచ్చిందా ఆలోచన. కలలో యాక్సిడెంటయింది హాస్పిటల్ ఎదురుగా. ఎందుకైనా మంచిది, ఇక్కడే పార్క్ చేసి నడిచి వెళితే

రోడ్డువారగా కారాపి కిందకి దిగాను. లాక్ చేస్తూ టైమ్ చూసుకున్నాను. ఇంకా తొమ్మిది నిమిషాలే ఉంది. ఇదే ఆఖరి సెషన్. ఉదయం ఎనిమిదికి ఒక స్లాట్, ఎనిమిదిన్నరకి మరొక స్లాట్ ఉన్నాయంటే ఈ టైమ్ ఎంచుకున్నాను. ఈ రోజేవో టెస్టులు చేసి అవసరమైతే మందులవీ రాసిస్తానన్నాడు – డిప్రెషన్ తగ్గటానికీ …. నిద్ర పట్టటానికీ.

నిద్ర .. కల .. కలలో తెరుచుకున్న కిటికీ .. నా మరో ప్రపంచానికి. అందులో నేను కారు నడుపుతున్నాను. హాస్పిటల్ నుండి బయటికొస్తున్నాను. సెల్ ఫోన్ మోగింది. కారుకెవరో అడ్డొచ్చారు. బలంగా బ్రేక్ నొక్కాను .. 

హాస్పిటల్ గేటులోకి అడుగు పెడుతూ, జనవరి ఉదయపు చలి కాచుకోటానికి లెదర్ జాకెట్ జేబుల్లో చేతులు పెట్టుకోబోతుండగా గుర్తొచ్చిందది. అతనికి సంబంధించినదాన్ని దేన్నో చూసిన ఫీలింగ్. నే తొడుక్కున జాకెట్, ఇదే జాకెట్. 

మెరుపు మెరిసింది. కారుకి అడ్డం పడింది ఎవరో కాదు, నేనే!!

“మనం తీసుకునే ప్రతి నిర్ణయమూ కొన్ని కొత్త విశ్వాల పుట్టుకకి దారి తీస్తుంది”

డెసిషన్స్, డెసిషన్స్ .. 

ఊగిసలాడి తీసుకున్న నిర్ణయం – ఈ రోజు ఎనిమిదికి బదులు ఎనిమిదిన్నరకి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నది. 

మరో ప్రపంచంలో నేను ఎనిమిదింటికే డాక్టర్ దగ్గరికెళ్లి ఇప్పుడు తిరిగొస్తున్నానా? 

మొట్టమొదటి సెషన్లో డాక్టర్ చెప్పింది గుర్తొచ్చింది చప్పున.

“కలలో మీరేదో పని చేస్తున్నట్లు చూశారనుకోండి; నిజానికి మీరు చూస్తుంది మిమ్మల్ని కాదు – మీకున్న వేలకొద్దీ నకళ్లలో ఒకదాన్ని. అంటే, మీరు కల అనుకునేది మీ నకళ్లలో ఒకతని దినచర్య. అతనికి నిజమయిందే మీకు కలయ్యింది”

అంటే .. కలలో కారు నడుపుతుంది నేను కాదు, నా నకలు!

చిన్నగా మొదలైన అనుమానం. జిగ్సా పజిల్లో ముక్కలు వాటంతటవే ఓ చోట చేరుతున్నట్లు …. అందాకా అస్పష్టంగా సాగిన ఆలోచనలు వేగంగా ఓ రూపు దిద్దుకోనారంభించాయి.

సమాంతర రేఖలు కలిసే అవకాశం ఉన్నప్పుడు సమాంతర విశ్వాలు ఢీకొనే అవకాశమూ ఉండాలిగా! లోకం లోకంతో ఢీకొంటే? నేను నాకు ఎదురు పడితే? 

క్షణకాలం నా బుర్ర తిరిగింది. అర్ధమయ్యీ కాని అయోమయం. నా నకలు నన్ను ఢీకొనటమే నేను చూశానా? అదెలా సాధ్యం? నేనా కలగన్నది మూడు గంటల క్రితం. అక్కడ అది ఆల్రెడీ జరిగిపోయింది, ఇక్కడ ఇంకా జరగలేదు! 

ఎక్కడో లెక్క తేలటం లేదు .. అంతలోనే వెలిగిందది. 

కలలో .. బ్రేక్ వెయ్యగానే మెలకువ వచ్చేసింది నాకు. తర్వాతేమయిందో నేను చూడలేదు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయితే గియితే దానికో అర క్షణమన్నా టైముంది.

“ఒక్కో విశ్వంలోనూ కాలం ఒక్కో వేగంతో నడవచ్చు. ఒక చోట క్షణం మరోచోట యుగం కావచ్చు”

అరక్షణం ఈజ్ ఈక్వల్ టు మూడు గంటలు.

పజిల్ పూర్తయింది.

డామిట్. ఇప్పటిదాకా ఇదెందుకు తట్టలేదు?

అంతలో …. చెవులు చిల్లులుపడే శబ్దం. ఆలోచనల్లో పడి తలొంచుకుని నడుస్తున్నవాడిని, కంగారుగా తలెత్తి చూడబోయాను. అప్పటికే ఆలస్యమయింది. కీచుమంటూ పడ్డ బ్రేకులు. నా కారు లాంటి కారే …. గాల్లోనుండి ఊడిపడ్డట్లు వేగంగా వచ్చి ఢీకొంది.  

జరుగుతుంది అర్ధం కాకముందే ఆరడుగుల పైగా గాల్లో ఉన్నాను. తలకిందులుగా కిందికొస్తుండగా అర్ధమయింది – ఇక్కడ మిగలబోయేదిక నా జ్ఞాపకాలేనని. దేవుడు గుర్తొచ్చాడు, కానీ వేడుకోవాలనిపించలేదు – ఆయన లెక్కలు వేరన్న గ్రహింపుతోనేమో. 

ఆ క్షణం .. వళ్లు తేలికయింది, మనసు భారమయింది. అయినా వింతగా ఆ క్షణం .. భయంగా అనిపించలేదు,  బాధగానూ అనిపించలేదు. బాదరబందీలేవీ గుర్తుకు రాలేదు. తర్వాతేమిటనే ఆలోచన లేదు. జీవితం ఇంతటితో ముగిసిపోలేదు. బ్రతికి ఉండటమే ముఖ్యం, ఎక్కడుంటానన్నది కాదు. ఎక్కడో ఓ చోట నేనుంటాననే భావన .. అది తెచ్చిన ప్రశాంతత ఆవరిస్తుండగా – ఆ రోజు జరిగినవన్నీ ఒక్క లిప్తలో నా మదిలో మెదిలాయి.  

ఈ ప్రపంచంలో నాకదే ఆఖరి జ్ఞాప్….