రచన: అనిల్ ఎస్. రాయల్

‘ఆంధ్రజ్యోతి’, 22 నవంబర్ 2009
‘తెలుగునాడి’, మే 2010
‘కథాజగత్’, మార్చ్ 2013
కథాసాహితి ‘కథ-2009’ సంకలనం
కేంద్ర సాహిత్య అకాడెమీ ‘తెలుగు సైన్స్ ఫిక్షన్’ సంకలనం


“మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ….”

పాఠం ఆపి ఓ సారి క్లాసంతా కలయజూశాను. తెల్లముఖాలు కొన్ని, వెలుగుతున్నవింకొన్ని, ప్రశ్నార్ధక వదనాలు మరికొన్ని.

బి.ఎ.ఆర్.సి.లో అణుశాస్త్రవేత్తగా తీరికలేని ఉద్యోగంలో ఉన్నా, వీలు చూసుకుని నెలకోసారన్నా హైస్కూల్ విద్యార్ధులకి గెస్ట్ లెక్చర్లివ్వటం నాకలవాటు. అదే పనిలో ఉన్నానిప్పుడు. ఇలాంటి చిన్న చిన్న విశేషాలూ, గమ్మత్తులే సైన్స్ పట్ల పిల్లలకి ఆసక్తి పెంచుతాయన్నది నా స్వీయానుభవం.

అర్ధమయినా కాకపోయినా అందరి ముఖాల్లోనూ ఆసక్తి కనిపించటంతో లెక్చర్ కొనసాగించాను. “…. ఇది తెగేది కాదు. ఇన్ఫైనైట్ లూప్ అన్నమాట. దీన్ని గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ అంటారు. టైమ్‌ట్రావెల్‌లో ఎదురయ్యే ఇలాంటి తిరకాసులు మరికొన్నీ ఉన్నాయి. ఉదాహరణకు ….”

సెల్‌ఫోన్ మోగటంతో పాఠం ఆగింది. తాతయ్య గురించిన వార్త.

* * * * * * * *

విమానంలో ఉన్న రెండు గంటలూ తాతయ్య జ్ఞాపకాలే. జీవితంలో ఏవీ యాధృఛ్చికంగా జరగవనేవాడాయన. ‘దేరార్ నో కోఇన్సిడెన్సెస్ మనవడా. ఓన్లీ ఛాయిసెస్ – బి అవర్స్, ఆర్ అదర్స్’ అనేవాడు ఆంధ్రాంగ్లాలు కలగలిపేసి. గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ గురించి వివరించేప్పుడే ఆయన పోయిన కబురు తెలియటం నా ఛాయిస్ మాత్రం కాదు. దేవుడిదేమో!

తాతయ్య గుర్తొచ్చినప్పుడు ఆయన చెప్పిన కథలూ జ్ఞప్తికొస్తాయి. కొన్ని నిజాలు నమ్మటం కష్టం. ఆయన కథలూ అంతే. అవన్నీ నిజాలే అనేవాడాయన. అర్ధం అయ్యీ కాకుండా ఉండేవవి. వినేంతసేపూ, విన్నాకా నా బుర్రలో ఎన్నో ప్రశ్నలు. నాకు ప్రతిదాన్నీ ప్రశ్నించటం నేర్పిందాయనే. “ప్రశ్నే ప్రగతికి తొలిమెట్టు. అది లేకుంటే మనమింకా ఆదిమానవులుగానే మిగిలిపోయుండేవాళ్లం” అనేవాడు.

‘తాతయ్య’ అంటున్నానని ఆయనేదో పురాతన భావాల సనాతనవాది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ‘పురాతన’ వరకూ కాస్త కరెక్టే – ఆయన పురావస్తు శాఖలో ఇంజనీర్‌గా పనిచేశాడు కాబట్టి. అందువల్ల సహజంగానే ఆయన కథలు ఆ నేపధ్యంలోనే ఉండేవి. అవన్నీ తన అనుభవాల్లోంచే వచ్చాయనేవాడాయన. నమ్మశక్యంగాని అనుభవాలవి. వాటిలో చాలావరకూ నేనెప్పుడో మర్చిపోయినా, ఇప్పటికీ గుర్తున్నది మాత్రం ఒకటుంది.

నా చిన్నప్పుడు సింధులోయ నాగరికత గురించి ఆయన చెప్పిన కబుర్లు విన్నప్పుడు  అన్నిట్లాగా అదీ కట్టుకథే అనుకున్నా కానీ తర్వాత్తర్వాత ‘ఏమో అది నిజమే కావచ్చుగా’ అన్న అనుమానం మొగ్గతొడిగింది. కాలక్రమేణా నేను చదివిన చదువులు దాన్ని మరింత ఎక్కువచేశాయి. కొన్నిసార్లు అవన్నీ గాలి కబుర్లే అనిపిస్తే, మరి కొన్నిసార్లు అది సాధ్యమయ్యే పనే అనిపించేది. ఎన్నోసార్లు ఆయన్ని “నిజం చెప్పు తాతయ్యా. నువ్వు చెప్పింది కథా, నిజంగా నిజమా” అంటే అట్నుండి ఓ చిలిపి నవ్వే సమాధానంగా వచ్చేది. “అప్పుడే చెప్పాగా మనవడా. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు” అనేవాడు కులాసాగా. ఆధారాల్లేకుండా నమటానికి అదేమన్నా ఆషామాషీ కథా? ఓసారి మరీ వెంటబడి బతిమిలాడితే చివరికి “నేను పోయాక నీకా రహస్యం తెలిసే ఏర్పాటు చేశాలేరా. అప్పటిదాకా దాన్నో పజిల్‌గానే మిగిలిపోనీ. అలాగైనా తాతయ్యని రోజూ గుర్తుచేసుకుంటావు” అన్నాడు బోసినోటితో నవ్వుతూ.

* * * * * * * *

కర్మకాండల హడావిడి ముగిశాక ఎవరో భద్రంగా తెచ్చి నాకందించారు దాన్ని, “పెద్దాయన దీన్ని మీకిమ్మని మరీ మరీ చెప్పాడు” అంటూ.

అదో మందపాటి ఫోల్డర్. తెరచి చూస్తే లోపలన్నీ కాగితమ్ముక్కలు. వివిధ భాషల వార్తాపత్రికలు, సైన్స్ మేగజైన్లనుండి కత్తిరించినవి. వాటిలో అధికం దశాబ్దాలనాటివిలాగున్నాయి. కొన్ని పట్టుకుంటే చిరివిపోయేలా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ వింతలు, విశేషాలు, యుఎఫ్‌వోలు, గ్రహాంతరవాసులు, మిస్టరీలు, వగైరా వార్తల సేకరణది. జాగ్రత్తగా ఒక్కోటీ తీసి చదువుతుంటే తాతయ్య చెప్పిన చిన్ననాటి కథలకి ముడిసరుకెక్కడిదో అర్ధమవసాగింది. నవ్వుకుంటూ వాటిని తిరగేస్తుంటే నా దృష్టినాకర్షించిందా శీర్షిక.

‘సింధులోయ తవ్వకాల్లో దొరికిన పరీక్ష నాళిక’

నా గుండెవేగం హెచ్చింది. ఇన్నేళ్లుగా నేను ఎదురుచూస్తుంది దీనికోసమేనా?

గబగబా చదవటం మొదలుపెట్టాను.

‘క్రీ.శ. 1953లో ఈజిప్టు గీజా పిరమిడ్లవద్ద దొరికిన పరీక్షనాళికల్ని పోలిన వస్తువొకటి నెలరోజుల క్రితం సింధులోయలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఆరంగుళాల పొడవు, అంగుళం మందమూ ఉన్న ఈ నాళిక చిన్నపిల్లలు ఆడుకునే గిలక్కాయని పోలి ఉండటంతో అది బహుశా ఆటబొమ్మై ఉండవచ్చునని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గీజా నాళికలూ, ఇదీ ఒకే ఆకారంలో ఉండటం, వాటి తయారీలో వాడిన అజ్ఞాత పదార్ధం ఒకటే కావటం, కార్బన్ డేటింగ్‌లో అవి కచ్చితంగా ఏ కాలానికి చెందినవో నిర్ధారించలేకపోయినా అవన్నీ ఒకే కాలానికి చెందినవిగా రుజువవటం, ఇత్యాది కారణాల వల్ల ప్రాచీన ఈజిప్టు, ప్రాచీన సింధులోయ నాగరికతల మధ్య విస్తారంగా వాణిజ్యం జరిగుండొచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు భావిస్తున్నారు”

నవ్వొచ్చింది నాకు. ‘హమ్మ తాతయ్యా! ఇంత బుల్లి వార్త చదివి అంత పెద్ద కథల్లేశావా’ అనుకుంటుంటే ఆ రోజు మా మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఆయన చెప్పిన ఇతర కథలన్నీ ఒకెత్తు. ఇదొక్కటీ ఇంకో ఎత్తు. అందుకే ఆ నాటి మా సంభాషణ ఇప్పటికీ నా తలపుల్లో తాజాగానే ఉంది.

* * * * * * * *

తాతయ్య ప్రపంచాన్ని చూసే విధానం విభిన్నంగా ఉండేది. “పేపర్లలోనూ, పుస్తకాల్లోనూ చదివేదే నిజం కాదురా. కళ్లు తెరిచి నీ చుట్టూ చూడు. లోతుగా చూడు. బట్ డోన్ట్ జస్ట్ లుక్ …. సీ” అనేవాడు తరచూ. లుకింగ్‌కీ సీయింగ్‌కీ తేడా అప్పుడు నాకు తెలిసేది కాదు. ఓ సారదే మాటన్నా ఆయనతో, నేను ఇంటర్ రెండో ఏడాదిలో ఉండగా.

చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి నాకేసి తిరిగాడాయన. కాసేపు చురుగ్గా నావేపు చూసి తిరిగి పుస్తకమందుకున్నాడు. ఈజిప్టాలజీ గురించిన పుస్తకమది.

“గీజా గ్రేట్ పిరమిడ్‌లో ఎన్ని రాళ్లున్నాయో తెలుసా” అన్నాడు పుస్తకంలోకి చూస్తూ. ఏ ప్రశ్నకీ సూటిగా సమాధానమీయకపోవటం ఆయన స్టైల్.

“ఊహూఁ” అన్నా నేను. ఆయనెటూ చెప్పేస్తాడని తెలుసు.

“ఒక్కోటీ పాతిక టన్నులదాకా బరువుండేవి, సుమారు పాతిక లక్షల రాళ్లు”

“అమ్మో. అన్నే!”

“అవును. నాలుగువేల ఆరొందలేళ్ల కిందట, అంత పెద్ద రాళ్లు పగలగొట్టి, అంత కచ్చితంగా చెక్కి, పిరమిడ్ కట్టే ప్రాంతానికి తరలించటానికి ఏం టెక్నాలజీ ఉండేదనుకున్నావు? కొండలు పేల్చటానికి డైనమైట్ లేదు. రాళ్లు తరలించటానికి క్రేన్లూ, ట్రక్కులూ లేవు. అసలు వాళ్లకప్పుడు ఇనుము అంటే ఏంటో కూడా తెలీదు కాబట్టి గునపాల్లాంటివీ లేవన్న మాట”

“మరెలా చేశారు తాతయ్యా?”, నాలో కుతూహలం.

“వాళ్ల దగ్గర టెక్నాలజీ లేకపోయినా, అదున్న వేరేవాళ్ల సహాయం తీసుకునుండొచ్చుగా”

“వేరేవాళ్లంటే?”

“గ్రహాంతరవాసులు”

“వాట్!?!”

“అవునోయ్. పిరమిడ్స్‌ని ఏలియన్స్ కట్టుండొచ్చు కదా”

“సిల్లీ ఐడియా. కథలకి పనికొస్తుంది”

ముందు పెద్దగా నవ్వి, తర్వాత నా నెత్తిమీదో మొట్టికాయ వేసి చెప్పాడు తాతయ్య. “సహేతుకమనిపించే వివరణలన్నీ అసాధ్యాలుగా తేలిపోయినప్పుడు మిగిలింది – అదెంత అసంబద్ధమైనా – సాధ్యమేనంటాడు షెర్లాక్ హోమ్స్. విపరీతమూ, మన నమ్మకాలకి విరుద్ధమూ అనిపించినంత మాత్రాన అన్ని ఐడియాలనీ కొట్టిపారేయకూడదోయ్. మనకి కనిపించనంతమాత్రాన గ్రహాంతరవాసులు లేరనకూడదు. ఈ విశ్వంలో మనిషి మేధకి అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నాయి”

“ఒప్పుకుంటా. ఐతే, పిరమిడ్లు కట్టింది ఏ గ్రహవాసులంటావు?”

“ఎక్కడివారైనా కావచ్చు. లక్షల కోట్ల కాంతిసంవత్సరాల దూరంలోని ఏ మహాగ్రహవాసులో కావచ్చు. లేదా, ఈ భూమ్మీది బుద్ధిజీవులూ కావచ్చు”

“కమాన్ తాతయ్యా. మరీ నా చెవిలో పూలు పెట్టేస్తున్నావు. ఈజిప్షియన్లకి లేని టెక్నాలజీ అదే కాలంలో భూమ్మీద వేరే సివిలైజేషన్లలో ఉందంటావా?”

“అదే కాలం అని నేనన్నానా? వేరేకాలంలో విరాజిల్లిన నాగరికత …. భవిష్యత్ తరాల వాళ్లన్నమాట”

“వాట్?”

“టైమ్‌ట్రావెల్ గురించెప్పుడూ వినలేదా మనవడా? భవిష్యత్తులో మానవజాతి సాంకేతికత కాలప్రయాణాలు చెయ్యగలిగే స్థాయిలో అభివృద్ధి చెందొచ్చు. వాళ్లు గతంలోకెళ్ళి వాళ్ల టెక్నాలజీ వాడి పిరమిడ్ల నిర్మాణానికి సహాయం చేసుండొచ్చు”

“నాన్సెన్స్ తాతయ్యా. నువ్వు కథలు చెబుతున్నావు”

“సరే. అయితే దీనికి సమాధానం చెప్పు. పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోర్టార్ – అంటే సిమెంట్ లాంటి జిగురు పదార్ధం – ఉంది చూశావూ. పిరమిడ్లు అన్ని వేల సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉన్నాయంటే ఆ మోర్టారే కారణం. ఇప్పుడు మనం వాడే సిమెంట్లన్నీ ఆ మోర్టార్ గట్టిదనమ్ముందు బలాదూర్. దాని రసాయన సమ్మేళనం నేటి శాస్త్రవేత్తలు డీకోడ్ చెయ్యగలిగారు, కానీ దాన్ని తయారు చేసే పద్ధతి మాత్రం కనుక్కోలేకపోయారు. ఇంత టెక్నాలజీతో ఇప్పుడే చెయ్యలేని పని అప్పట్లో ఎలా చెయ్యగలిగారంటావు? వాళ్లకి ఎవరో సహాయం చేసుండాలి అనిపించటంలా?”

“గ్రహాంతరవాసులా, లేక కాలయాత్రికులా?”

“ఎవరైనా కావచ్చు. అది నీ ఊహకే వదిలేస్తున్నా. ఒకవేళ అది కాలయాత్రికుల పనే ఐతే మాత్రం ఓ తమాషా జరిగే అవకాశముంది”

“తమాషానా …. ఏంటది?”, ఆసక్తిగా తాతయ్యకి మరింత జగ్గరగా జరిగి కూర్చున్నాను.

“పిరమిడ్లలో వాడిన మోర్టార్ మీద పరిశోధనలు చేసి, వచ్చే యాభయ్యేళ్లలో  దాన్నెలా తయారుచెయ్యాలో మన శాస్త్రవేత్తలు కనిపెట్టేస్తారనుకుందాం. అదే సమయానికి మరో శాస్త్రవేత్త టైమ్‌మెషీనొకదాన్ని తయారుచేశాడనుకుందాం. మోర్టార్ శాస్త్రవేత్తలు, ఆ మోర్టార్ గట్టిదనమెంతో పరీక్షించటానికని టైమ్‌మెషీనేసుకుని నాలుగువేల ఆరొందలేళ్ల వెనక్కెళ్లి ప్రాచీన ఈజిప్షియన్లకి దాన్ని తయారు చెయ్యటమెలాగో నేర్పించి వచ్చారనుకుందాం. తమాషాగా లేదూ?”

“తమాషా ఏమో కానీ, తికమకగా ఉంది”

“ఏమిటా తికమక?”

“పిరమిడ్లలో వాడిన మోర్టార్ మనవాళ్లు రివర్స్ ఇంజనీర్ చేసి దాని ఫార్ములా కనుక్కొని, గతంలోకెళ్లి ప్రాచీన ఈజిప్షియన్లకి నేర్పించారు. అంటే, మనవాళ్లు నేర్పించకపోతే ఈజిప్షియన్లు మోర్టార్ తయారు చెయ్యగలిగేవారు కాదు; ఈజిప్షియన్లు తయారు చెయ్యకపోతే మనవాళ్లు దాన్ని రివర్స్ ఇంజనీర్ చెయ్యగలిగేవాళ్లు కాదు. మరప్పుడు దాన్ని తయారు చేసే పద్ధతి ఎవరు ముందు కనిపెట్టినళు? వీళ్లా, వాళ్లా?”

“గుడ్ క్యాచ్. పట్టుకుంటావో లేదో అనుకున్నా. గుడ్డు ముందా, పిల్ల ముందా తరహా తిరకాసన్న మాట. దీన్నే కాజాలిటీ పారడాక్స్ అంటారు. టైమ్‌ట్రావెల్‌లో ఇలాంటి తిరకాసులు ఇంకా ఉన్నాయి. ఇంటరెస్టింగ్‌గా లేదూ?”

ఈ తిరకాసుల వ్యవహారమేదో నాకు సరదాగా అనిపించింది. టైమ్‌ట్రావెల్ పట్ల నా ఆసక్తికి అదే నాంది.

“ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు టైమ్‌ట్రావెల్ అనేది కుదిరే పనేనా”, ఉత్సాహంగా అడిగాను.

“ఎందుక్కాదురా. రెండొందలేళ్ల కిందట గాల్లో ఎగరటం కుదిరేపని అనుకున్నారా ఎవరన్నా? వందేళ్ల కిందట రోదసిలోకెళ్లటం కుదిరే పని అనుకున్నారా? అవన్నీ సాధ్యమైనట్లే ఇదీ సాధ్యమౌతుంది ఏదో నాటికి”

“ఏమో. నాకు నమ్మకం లేదు”

తాతయ్య ముందుకొంగాడు. అటూ ఇటూ చూసి మెల్లగా, “నీకో రహస్యం చెప్పనా? ఎవరికీ చెప్పకూడదు” అన్నాడు. నేను సరేనన్నాక గుసగుసగా చెప్పాడు. “నేనూ ఓ సారి టైమ్‌ట్రావెల్ చేశానోయ్. అందుకే అంత నమ్మకంగా చెబుతున్నా”

పగలబడి నవ్వేశాను. “కొయ్యమాకు తాతయ్యా. నీకన్నీ పరాచికాలే. అసలు టైమ్‌మెషీన్ ఎక్కడిది నీకు? అంత పెద్దది ఎవరికీ తెలీకుండా ఎలా తయారు చేశావు?”

“టైమ్‌మెషీన్ పెద్దగానే ఉండి తీరాలని ఎవరు చెప్పారోయ్ నీకు? అసలదో యంత్రం కావల్సిన అవసరమూ లేదు”

“మరి?”

“సింగ్యులారిటీ అంటే ఏంటో తెలుసా నీకు?”

“బ్లాక్‌హోల్ కేంద్రకంలో ఉండే పరిస్థితేగా? అణుబాంబులు పనిచేసేది కూడా ఈ సింగ్యులారిటీ ఆధారంగానే కదా”, ఫిజిక్స్ పాఠాలు గుర్తుచేసుకుంటూ చెప్పాను.

“అవును. భారీ నక్షత్రాలు పేలిపోవటాన్ని సూపర్‌నోవా అంటారు. సూపర్‌నోవా కేంద్రస్థానంలో అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే పదార్ధాన్ని డార్క్‌మ్యాటర్ అంటారు. ఆ డార్క్‌మ్యాటర్ చుట్టూ ఆవరించి ఉండేదే సింగ్యులారిటీ. ఆ సింగ్యులారిటీ గాఢత కొంత తగ్గించి బ్లాక్‌హోల్ బదులు మైక్రోస్కోపిక్ వర్మ్‌హోల్ – అంటే అతి సూక్ష్మ కాలబిలం – సృష్టిస్తే దానిద్వారా కాలంలో ముందుకీ వెనక్కీ ప్రయాణించొచ్చు. ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం చెప్పే విషయమే ఇది”

“ఓకే …. ఐతే ఏంటట?”

“పందొమ్మిదొందల యాభైల్లో నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఫీల్డ్‌వర్క్‌ కోసం ఈజిప్ట్ వెళ్లానా? అక్కడ పిరమిడ్లలో నాక్కొన్ని సీల్డ్ టెస్ట్‌ట్యూబ్స్ లాంటివి దొరికాయి. ఏదో వింత పదార్ధంతో తయారు చేసినట్లున్నాయి. ప్రాచీన కాలంలో పిల్లలాడుకునే గిలక్కాయల్లాంటివి కావచ్చు. న్యాయంగా ఐతే అవన్నీ ఈజిప్షియన్ ప్రభుత్వానికి అప్పగించాలి. ఆసక్తి కొద్దీ వాటిలో ఒకటి తస్కరించి ఇండియా తీసుకొచ్చి నా స్నేహితుడు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒకడుంటే వాడికిచ్చా – దాన్ని తయారు చేసిన మెటీరియల్ ఏంటో కనుక్కోమని. వాడు దాని మీద ఏవేవో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తే మేం ఊహించనిదొకటి బయటపడింది”

“లెట్ మి గెస్. ఆ మెటీరియల్ వేరే గ్రహమ్మీదది అనే కదా. రైట్?”

“రాంగ్. ఆ పరీక్షనాళికలో అణుమాత్రంగా మిగిలున్న డార్క్‌మ్యాటర్. అదెక్కడినుండొచ్చిందీ తెలీదు కానీ, సరిగా వాడితే దానితో వర్మ్‌హోల్స్ సృష్టించొచ్చు. కాలంలో ప్రయాణాలూ చెయ్యొచ్చు”

“అంటే, కాలప్రయాణీకులెవరో దాన్ని పిరమిడ్లలో పోగొట్టుకుంటే మీకు దొరికిందన్న మాట”

“ఎక్జాక్ట్‌లీ. దాన్ని వాడే మేం కాలప్రయాణం చేశాం …. నేనూ, నా స్నేహితుడూ”

తాతయ్య చెబుతున్నదంతా కట్టుకథేనని తెలుసు. ఓ పక్క నవ్వొస్తోంది. ఐనా ఆయన ముందు ముందు ఏం చెప్పబోతున్నాడోనన్న ఆసక్తీ ఉంది. అందుకే నవ్వాపుకుంటూ అన్నా.

“ఇంటరెస్టింగ్ తాతయ్యా. ఎక్కడికెళ్లారేంటి కాలంలో?”

“సింధులోయకి. ఇండస్‌వ్యాలీ సివిలైజేషన్ వర్ధితుల్లుతున్న రోజులకి”

“అప్పటికే ఎందుకు?”

“ఆ నాగరికత ఎందుకు అంతరించిపోయిందో చెప్పు చూద్దాం”

“ఆర్యుల దండయాత్రలనీ, సింధునది వరదలనీ, ఘాగర్-హక్రా నది దిశ మార్చుకోవటం వల్లనీ, భూకంపాల నుండనీ …. రకరకాల కారణాలు చెబుతారు. ఏది నిజమో మరి”

“తక్కినవన్నీ ఈ మధ్య – ఇరవై, ముప్పై ఏళ్ల కిందట ప్రతిపాదించబడ్డ సిద్ధాంతాలు. పందొమ్మిదొందల యాభై మూడు ప్రాంతంలో చలామణిలో ఉన్నది ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ఒకటే. అదెంతవరకూ నిజమో కనుక్కుందామనే మేం ఆ కాలానికెళ్లాం”

నాకు ఆసక్తి రెట్టింపయింది. కథ వినటంలో లీనమైపోయానిక.

“వర్మ్‌హోల్ గుండా వెనక్కి ప్రయాణించి క్రీస్తు పూర్వం పదిహేను వందల ఏళ్ల ప్రాంతానికెళ్లాం. సింధులోయ నాగరికత వెలుగులు చూసి అదిరిపోయాం. సింధు నది, దానికి సమాంతరంగా ఘాగర్-హక్రా నది. ఆహా …. ఏం నదుల్రా అవి. మన కృష్ణ, గోదావరి వాటి ముందు పిల్లకాలవలే. ఆ రెండు నదుల మధ్యలో వందలాది పట్టణాలు, పల్లెలు. అప్పట్లోనే కొన్ని నగరాల్లో యాభై వేలకి తగ్గని జనాభా. ఆ నగరాల నిర్మాణం చూసి తీరాల్సిందే. నాటి ఇంజనీర్ల గురించి నేటి చరిత్రకారులు గొప్పగా చెబుతుంటారు కానీ, నిజానికి వాళ్ల గొప్పదనంలో మనమెరిగింది పది శాతమే. సిటీ ప్లానింగ్ అంటే వాళ్లనుండే నేర్చుకోవాలి. ఇక, సింధునది మీద వాళ్లు కడుతున్న బ్రహ్మాండమైన ఆనకట్టైతే చూడాల్సిందే తప్ప వర్ణించటం కష్టం. అసలు గ్రేట్ పిరమిడ్ ఎందుకు పనికొస్తుంది దాని ముందు? ఆ కాలంలోనే అంత భారీ కట్టడం! మన దేశంలో ఇప్పుడున్న ఆనకట్టలన్నీ దానిముందు దిగదుడుపే ….”, తాతయ్య పరవశంగా చెప్పుకుపోతున్నాడు. ఆ తన్మయత్వం చూస్తుంటే ఆయన నిజంగానే అవన్నీ చూశాడా అన్న అనుమానమొచ్చింది. ఆయన్ని ఆపకపోతే ఆగేలా లేడు.

“ఆగు తాతయ్యా. సింధు నాగరికతలో భారీ ఆనకట్టలేవీ ఉన్నట్లు చరిత్రలో లేదే” అన్నాను ఆయన్ వాక్ప్రవాహాన్నాపుతూ.

“ప్రశ్నలెయ్యకుండా విను. దానికీ సమాధానం చెబుతాగా” అని కోరగా నాకేసి చూసి కొనసాగించాడాయన. “సింధు లోయలో చివరి మజిలీగా ఆ డ్యామ్ వద్ద ఆగాం. దాని భారీ పరిమాణానికీ; క్రేన్లూ, పొక్లెయిన్లూ లాంటివి లేకుండానే దాన్ని కడుతున్న వాళ్ల నైపుణ్యానికీ ఆశ్చర్యపోయాం. ఇక తిరిగొచ్చేసే సమయమయింది. అయితే అర్ధం కాని విషయం మాత్రం ఒకటి అలాగే మిగిలిపోయింది”

“ఏంటది?”

“మన లెక్కల ప్రకారం మేం వెళ్లేసరికే ఆ నాగరికత అవసాన దశలో ఉండాలి. కానీ అలాంటి సూచనలేవీ కనబడలేదక్కడ. ఆర్యుల ఆనవాళ్లు లేవు, దండయాత్రల దాఖలాలూ లేవు. మొత్తానికి, మేం ఏ నిజం కనుక్కుందామని వెళ్లామో అది మాత్రం మాకు తెలియలా. నిరాశగా వెనక్కి తిరిగి వచ్చేయబోతుండగా జరిగిందది. మేం ఏ మాత్రం ఊహించనిది ….”

“ఏం జరిగింది?”, నాలో ఉత్సుకత.

“తిరుగు ప్రయాణం నిమిత్తం వర్మ్‌హోల్ సృష్టించే ప్రయత్నంలో నా స్నేహితుడు గందరగోళానికి గురై దానిమీద నియంత్రణ కోల్పోయాడు. అవసరమైనదానికన్నా ఎక్కువ శక్తివంతమైన వర్మ్‌హోల్ చేసేశాడు. దానిగుండా మేమైతే ఎలాగోలా మా కాలానికి తిరిగి రాగలిగాం కానీ, మేమిలా దాటేశామో లేదో దానివల్ల అక్కడో చిన్నపాటి అణు విస్ఫోటనం జరిగింది. దాని దెబ్బకి ఆనకట్ట తునాతునకలైపోయింది. జలాశయం నుండి ఒక్కుదుటన విడుదలైన నీరు వంద సునామీల పెట్టున సింధునది పొడుగునా ఉన్న నగరాలనీ, గ్రామాలనీ ముంచెత్తింది”

“వాట్ట్!!” అదిరి పడ్డాన్నేను. అది నేనూహించని ట్విస్ట్.

“అంతే కాదు. ఆ విస్ఫోటనం ధాటికి ఒకదాని వెంబడి ఒకటి చైన్ రియాక్షన్‌లా భూకంపాలు విరుచుకుపడి ఆ ప్రాంతాన్నంతా కుదిపేశాయి. వాటి దెబ్బకి ఘాగర్-హక్రా నది ఉన్న పళాన దిశ మార్చేసుకుంది. కాలబిలం గుండా మా కాలానికి తిరిగొచ్చేస్తూ, వెనక జరుగుతున్న వినాశనాన్ని టెలివిజన్ తెరపై ఫాస్ట్ ఫార్వార్డ్‌లో కదిలిపోతున్న సినిమాలా వీక్షించి చెప్పలేనంత షాక్‌కి గురయ్యాం”

నాకు నోట మాట రాలేదు.

“ఇప్పుడర్ధమయిందా, సింధులోయ నాగరికత ఎలా అంతరించిందో”, అడిగాడు తాతయ్య.

“పూర్తిగా. మా తాతయ్యా, ఆయన ఫ్రెండూ వెళ్లి నాశనం చేశారు. మీరు వెళ్లకపోతే అది నాశనమయ్యేది కాదు. అది నాశనమవకపోతే మీరు వెళ్లేవాళ్లు కాదు. కాజాలిటీ పారడాక్స్ అన్నమాట. మొత్తానికి ఆర్యుల దండయాత్ర వల్ల మాత్రం అంతరించలేదంటావు”, అన్నాను తేరుకుంటూ.

“ఆర్యుల దండయాత్రా ఓ కారణమేనోయ్. నిజానికి అదే అసలు కారణం. ఆ ఆర్యులెవరో కాదు – మేమిద్దరమే”, తాతయ్య కన్ను గీటి చెప్పాడు. “అదీ సంగతి. మేం వెళ్లేనాటికి లేని భూకంపాలు, వరదల సిద్ధాంతం ఆ తర్వాత పుట్టుకు రావటానికి కారణమూ అదే. ఎవరికీ చెప్పొద్దీ విషయం. ఇది మనిద్దరి రహస్యం”

“చెప్పినా ఎవరు నమ్ముతారు? నా ముఖానే నవ్వుతారు” అనుకుంటూ చివరిగా ఓ ప్రశ్నడిగా. “ఎవరితో చెప్పన్లే కానీ, మరి మీరు మళ్లీ వెనక్కెళ్లి ఆ ఘోరం జరక్కుండా ఆపుండొచ్చు కదా”

ఆయన గాఢంగా నిట్టూర్చి శూన్యంలోకి చూస్తూ చెప్పాడు. “ఎలా వెళ్తాం? ఆ గందరగోళంలో డార్క్‌మ్యాటర్ ఉన్న నాళిక అక్కడే పోగొట్టుకుని వచ్చాంగా”

* * * * * * * *

చిన్న వార్త ఆధారంగా చిలవలుపలవలుగా అంత పెద్ద కథల్లేసిన తాతయ్య ఊహాశక్తికి ఆశ్చర్యపోతూ ఆ పేపర్ కటింగ్ భద్రంగా మడత పెట్టసాగాను. ఇన్నాళ్లు వేచిన నిజం, తెలిసిపోయేసరికి ఉసూరుమనిపించింది. కొన్ని నిజాలు నమ్మటం కష్టం – అవింత సాదాసీదాగా ఉంటాయని తెలిస్తే. తాతయ్య టమ్‌ట్రావెల్ కథ నిజమే అయ్యుండాలని లోలోపల గట్టిగా కోరుకున్నానా నేను?

అంతలో నా దృష్టి యధాలాపంగా ఆ పేపర్ ముక్క వెనకున్న సినిమా ప్రకటన మీద పడింది. హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ రిటర్న్స్’ ప్రకటనది.

నా భృకుటి ముడిపడింది.

‘ఆర్కియాలజీ’ మేగజైన్‌లోనుండి కత్తిరించిన కాగితం అది. ఆ పత్రికలో ‘మమ్మీ’, ‘ఇండియానా జోన్స్’ వంటి సినిమాల ప్రకటనలు రావటం మామూలే. అది కాదు నేనాలోచిస్తోంది.

‘ది మమ్మీ రిటర్న్స్’ విడుదలయింది ఎనిమిదేళ్ల క్రితం.

తాతయ్య నాకా కథ చెప్పి ఇరవయ్యేళ్ల పైమాటే.

అంటే …. !?!