రచన: యాజి

ఆంధ్రజ్యోతి‘, జూలై 2013
కథాసాహితి ‘కథ-2013’ సంకలనం


 

పువ్వులే నా జీవితం, నా సంతోషం, నా సర్వస్వం. ఇలా అని నేనేదో అర్థం అయ్యీకానట్టుగా ఉండే అందమైన పదాలను పేర్చి కవిత్వం చెప్పే భావకురాలనునేరు! కాదు, కానీ నాకూ, పూలకీ, ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ముందు నా గతాన్ని గురించి కొంత మీరు తెలుసుకోవాలి. నా పుట్టుకతోనే నా జీవితం నిర్దేశింపబడింది, ఆ భగవంతుడికే దాసీగా ఉండిపొమ్మని. నా తల్లే నాకు గురువై, నాట్యంతో పాటు నాకు అవసరమైన అన్ని విద్యలూ తన వారసత్వంగా నాకు అందించింది. నా తండ్రి గురించి నమ్మకంగా చెప్పలేను గానీ, ఎవరో బాగా అందగాడు మాత్రం అయ్యుంటాడు, నా రూపు రేఖలూ, శరీరవర్ణమూ, నా తల్లి నుంచి మాత్రం రాలేదు, కాబట్టి.

ఊళ్ళోని దేవాలయం ఈశాన్యదిక్కులో చివరగా మా ఇల్లు. ఇంటి చుట్టూరా పెద్ద పూల తోట, అందులో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పగడమల్లె పాదుల తో పాటు, నీల సంపంగి, గులాబీ, సన్నజాజి, చేమంతి, బంతి లాంటి పూల మొక్కలు. ఉదయాన్నే నేను లేచి తోటంతా తిరిగి, పూలు కోయటం చూసాకే కోడి కూస్తుందేమోనని, మా అమ్మ నన్ను ఆటపట్టిస్తూ ఉండేది. నా వరకూ, ఆ తోటలోని చెట్లే, నాతో చిన్నప్పటినించీ పెరిగీ, ఆటలాడీ, నన్ను ఆహ్లాదపరచీ, నేను దుఃఖించినప్పుడు నన్ను ఓదార్చిన నా నేస్తాలు. ఎన్నో పగళ్ళూ, కొన్ని రాత్రులూ, వాటి నీడలో నాకు ఆశ్రయమిచ్చిన ఆప్తులు. తోటలోని పూలతో మాలలు కట్టి దేవుడిని అలంకరించటం, గుళ్ళో శాస్త్రుల వారి కథాకాలక్షేపం, నాట్యాభ్యాసం, ఇంటితో పాటు ఒంటిని కుడా సింగారించుకునే అభ్యాసంతో నా రోజులు గడచిపోయేవి.

నేను పెద్దమనిషిని కాగానే నాకు ఆ దేవుడితో వివాహం జరిపించి, ఆ పలకని రాతి బండే నా మొగుడన్నారు. నా తల్లికీ అతడే మొగుడు కదా, నాకు వేరే ఎవరైనా చూడమంటే, అపచారం, అని చెప్పి లెంపలు వేసుకోమన్నారు. నా చిన్ని బుర్రలో పుట్టిన ఎన్నో ప్రశ్నలకు, జవాబులు దొరకకపోగా, వాటికి శ్రోతలే కరువైనప్పుడు, మళ్ళీ మా తోటలోని పూల చెట్లే నన్ను తాత్కాలికంగా సమాధానపరిచాయి. వయస్సూ, అనుభవం, పెరిగినప్పుడు, సమాధానాలూ దొరికాయి. ఆ పడపుగొమ్మ జీవనవిధానాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, వేరే దిక్కు లేక, దానినే ఆలింగనం చేసుకొని, నిబద్ధతతో, ఆచరించటం ప్రారంభించాను.

నా చిన్నప్పుడు, నా అందం, నా నాట్యం,  చూసి నన్ను వలచి రాబోయే  రసికుల గురించీ, నేను గడించపోయే ఐశ్వర్యం గురించీ, తెగ కలలు కనేది మా అమ్మ. కాలక్రమేణా,  నా స్థైర్యం, నా మాటల్లోని భావస్పష్టత, నా పోకడలోని ఒద్దిక,  నా వ్యక్తిత్వం లోని గాంభీర్యము గమనించిన మా అమ్మ, అసలు నాకు భయపకుండా నన్నెవరైనా చేరదీస్తారా అని చింతిస్తూ ఉండేది. కానీ అవే నాకు కవచమై నేను మనఃపూర్వకముగా కోరుకుంటే తప్ప, ఎవ్వరూ నాకు చేరువయ్యే అవకాశం రాకుండా చేశాయి

చిన్నప్పుడు నన్నలరించిన ఆ తోటలోని పూలే, పెరుగుతున్న నా వయసుతో, నా వొంటిలో పేరుకుంటున్న అందాలకి మరింత చేరువై నాతో గుసగుసలాడేవి, తమ రహస్యాలు తెలుసుకొని, తమను మరింత ఉపయోగించుకొని, ఆస్వాదించుకొమ్మని. ఏ పూల పరిమళాలు, ఏ వేళల, ఏ ఏ అనుభూతులను ప్రేరేపిస్తాయి, శారీరిక వాంఛలలోని గాఢతను ఏ పూలు ఎంతలా పెంచుతాయి, ఏ పూలు ఎంత అందంగా అలంకరింపబడిన వాతావరణంలోనైనా రసికతను పూర్తిగా సంహరిస్తాయి, లాంటి రహస్యాలెన్నో నాకు ఈ పూలే నేర్పాయి. పగడమల్లెపూలు నేను అందంగా తలలో అలంకరించుకొని, నా హొయలు ఒలకబోసిన వేళ, నా కోసం తపించని మగాడు ఉండడని గ్రహించినా, నా మనస్సుకి అమితంగా నచ్చిన రసికుడికి, నేను ఆనందాన్ని ఇవ్వాలనుకొనే సమయంలో తప్ప ఎప్పుడూ వాడే దాన్ని కాదు.

అలా సంయమనం పాటిస్తున్నందుకేనేమో, ఆ పూలు నాకు మరింతగా సహకరిస్తూ, బాగా విరగకాస్తూ, ఎక్కువగానే గుబాళిస్తూ లోకం ఇంకా గుర్తించని విద్యలని కూడా నాకు నేర్పేవి. రాత్రి, నా శయ్యపై అలకంకరించిన ఆ పూలు, మర్నాడు ఉదయం, ఆ రాత్రిలో జరిగిన క్రీడావిశేషాలు నాకు కళ్ళకు కట్టినట్లు, గాలిలో బొమ్మలుగా కదలి మరీ చూపిస్తున్నాయా, అన్నంత విపులంగా చెప్పేవి.

నా పూల సువాసన తో పాటు నా పరిజ్ఞాన ప్రతిభ నెమ్మదిగా ఊరంతా పాకిపోయింది. ప్రతి ఇంటిలోనూ పూలమొక్కలు ఉన్నా, నేను పెంచుతున్న పూలలో ఎదో విశేషమహిమలున్నాయని పుకార్లు పాకటంతో, నాకు ఎదురుచూడని ఖ్యాతి లభించింది. నేను పూలతో మాట్లాదతాననీ, పూలు నేను చెప్పినట్లు వింటాయనీ, పూస్తాయనీ, ఇలా ఏవేవో చెప్పుకొనేవారు నాగురించి.

గుడ్డిగా పాలింపబడుతున్న రాజ్యంలో, పేరున్నా, పెద్దగా ఎవరికీ తెలియని గ్రామమైన, మా ఊరిని గురించి ఇక్కడ కొంత చెప్పుకోవాలి. ఇక్కడ గ్రామస్తులంతా ఒకరినొకరు ఎరిగి, సుఖాలు పంచుకుంటూ, కష్టాలలో చేయూతనిచ్చుకుంటూ, ఎన్నో తరాలుగా నివాసముంటున్నవాళ్ళే. ఊరిని వదలి వెళ్ళే కుటుంబాలు ఎంత అరుదో, మా ఊరికొచ్చే కొత్త కుటుంబాలూ, అంతే అరుదు. అటువంటి ఊళ్ళో, నా దగ్గరకు వచ్చే రసపోషకులు, నాతో వారికున్న సాన్నిహిత్యాన్ని, చిలవలు పలవలు చేసి దండోరా వేసుకొనేవారు. ఊరెరిగిన ఒక సద్బ్రాహ్మణుడి విషయంలో మటుకు, అతడి వేడుకోలు మేరకు, అతడూ, నేనూ కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి, అతడి పేరు బయటకు రాకుండా చూసుకోవలసి వచ్చింది.

గుడి పక్క వీధిలోనే అతడికి లంకంత ఇంటితో పాటు, ఒక ఇల్లాలూ, పిల్లలూ. నెలకోసారైనా నా దగ్గరకి చాటుగా ఎందుకు వచ్చేవాడో నేను ఎప్పుడూ అడగలేదు, ఆ రాబోయే సమాధానం ఏమిటో నాకు ముందరే తెలిసుండటం వల్ల.  ఒక రోజు ఆ ఇంటి ఇల్లాలి నుంచి నాకు పిలుపొచ్చింది, ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళమని. నేనిచ్చే మహత్తు గల పూల కోసమో లేక ఏదైనా విశేషకార్యాలంకరణల కోసమో, మరేదైనా సంసారసుఖానికి సంబంధించిన చిట్కాల కోసమో, ఇలాంటి పిలుపులు నా కలవాటైనా, అతడి ఇంటినించి నేరుగా పిలుపు రావటంతో కొద్దిగా కలవరపడుతునే వెళ్ళాను. ఆ ఇల్లాలు నన్ను గుమ్మం దాకా వచ్చి సాదరంగా ఆహ్వానించి, లోపలికి తీసుకెళ్ళి అతిథిసత్కారాలు చేసి, తన మనసులో మాట చెప్పింది. తన భర్త కొద్ది నెలలుగా సంసారం చేసే విషయంలో ముభావంగా ఉంటున్నాడనీ, తనెంత ప్రయత్నించినా, తన పట్ల మునుపటిలాగా ఆకర్షితుడవ్వటలేదని, ఏదైనా మార్గం చూపమనీ ప్రాధేయపడింది. తన బాధకు కారణమైనది నేనేనని తెలియక నాతోనే మొరపోతున్న ఆమె అమాయకత్వానికి నాకు జాలి వేసింది. నేను తనకు అక్కలాంటిదానినని తనను ఊరడించి, తన భర్తను రెండు రాత్రులు వరుసగా నా వద్దకు పంపమని చెప్పాను. అంతేకాక మూడోరోజు తరువాత, ఒక నెల పాటు, తన బిడ్డను పంపించి నా తోట లోని పగడమల్లెలు తెప్పించుకొని వాటితో రోజూ తనను అలంకరించుకోమని కూడా చెప్పాను. నా ఇంటికి వచ్చిన ఆమె భర్త ఆ రెండు రాత్రులూ, నా పూల పొడితో కలిపిన పాలు తాగి కోరిక నశించినవాడై, వెనుదిరిగి వెళ్ళిపోయాడు. నెల రోజుల తరువాత తన సమస్య పరిష్కారం అవ్వటంతో ఆ ఇల్లాలు, నాకు చాలా దగ్గరై, ఎంతో ఆత్మీయతతో తన కష్టసుఖాలు నాతో పంచుకుంటూ ఉండేది.

నేను ఒక రోజు ఆమె ఇంటికి వెళ్లేసరికి, పక్క వాటాలోకి ఎవరో అతిథులు వచ్చినట్లున్నారు, అంతా హడావిడిగా ఉంది. ఒక బ్రాహ్మణ వితంతువు తన కుటుంబంతో కొద్ది రోజుల పాటు వాళ్ళింట్లోనే ఉండబోతున్నారన్న విషయం ఆమె మాటల ద్వారానే తెలిసింది. నన్ను ఆవిడకి పరిచయం చెయ్యటం ఇష్టం లేకో లేక నిజంగానే ఆ విషయం ఆవిడకు తలపుకు రాకో తెలియదు కానీ, ఆ రోజు నేను ఆ కుటుంబాన్ని కలవకుండానే, ఆ ఇల్లాలి దగ్గర శలవు తీసుకొని బయటపడ్డాను. మర్నాడు, నేనెన్నడూ చూడని, ఒక బ్రాహ్మణ బాలుడు భిక్షాటన చేస్తూ, మా ఇంటి సంగతి పూర్తిగా తెలియక అనుకుంటా, తలుపు తట్టాడు. అతడి ముఖవర్ఛస్సూ, దేహదారుఢ్యమూ చూస్తే, ఎవరో రాచబిడ్డ వలే ఉన్నాడు. లోపలికి ఆహ్వానించి, అతడికి మంచి భోజనం పెట్టబోతే, సున్నితంగా తిరస్కరించాడు. తన కుటుంబం తనకై ఎదురుచూస్తూ ఉంటుందనీ, తానొక్కడే ఆ భోజనం చెయ్యటం భావ్యం కాదనీ చెప్పాడు. భోజన ప్రియత్వంలేని బ్రాహ్మణుని చూసి కొంచెం ఆశ్చర్యపడినా, అతడు ఆ ఊరికి కొత్తగా వచ్చిన కుటుంబంలో భాగమని గుర్తించి, స్వయంపాకానికి కావాల్సిన ముడిసరుకులన్నీమూటగట్టి అతడిని సాగనంపాను. అతగాడి రూపం మాత్రం, నాకు శాస్త్రులుగారు ప్రస్తావించిన గాంధర్వసౌందర్యాన్ని జ్ఞప్తికి తెచ్చింది.

ఆ తరువాత నేను అనేక మార్లు నా స్నేహితురాలైన ఆ బ్రాహ్మణ ఇల్లాలి ఇంటికి వెళ్తూఉండేదాన్ని. పక్క వాటాలోని కొత్త కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పేది, ఆ ఇల్లాలు. ఆ వితంతువు తన ఆఖరి కొడుకు యుక్తవయస్కుడైనప్పటికీ అతడిని ఒక చిన్నపిల్లాడి లాగా చూసేదనీ, తన ఒళ్లో పడుకోబెట్టుకోవటం, తన చేతులతో అన్నం కలిపి తినిపించటం లాంటవి, చేసేదని చెప్పినప్పుడు, ఆ మాతృప్రేమకి కొంచెం ఆశ్చర్యపడ్డా. నాకు ఆ వితంతువునీ, ఆ కుటుంబాన్నీ కలవాలని ఉన్నా, ఆవిడ, ఏనాడు నాతో మాట కలపక పోవటం వల్ల, వాళ్ళతో అస్సలు పరిచయం పెరగలేదు. కానీ, ఆవిడకు నా గురించి తెలిసేఉంటుందన్న నమ్మకం మాత్రం నాకుండేది.

నేను పూలతో చేస్తున్న వైద్యాల, మహాత్తుల వార్తలు మా ఊరు పొలిమేరలు దాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాల వరకూ వ్యాపించాయి. పట్నంలోని ఒక వణిజుడు నన్ను ప్రత్యేకంగా పిలువనంపి, నేను తిరస్కరించలేనంత సొమ్ము ముందుగానే చెల్లించడంతో, నేను నా ఊరు వదలి కొద్ది నెలల పాటు పట్టణవాసం చెయ్యాల్సివచ్చింది. రాజ్యంలో కొందరు దుష్టులు చేస్తున్న  రాక్షసకార్యాల గురించి ఆ నోటా ఈ నోటా వింటున్న నాకు, నా ఊరి జనం గురించి కొంత బెంగ కలిగినా, తిరిగివెళ్ళే వీలు దొరకక ఎన్నో నెలలు గడచిపోయాయి. వచ్చిన పని సవ్యంగా పూర్తి అవ్వటంతోపాటు, ఘోర అరాచకాలు చేస్తున్న దుర్మార్గుల పీడ వదలి, మా ఊరితో బాటు చుట్టుపక్కల గ్రామాలలో, మళ్ళీ శాంతిభద్రతలు వెలిసాయన్న శుభవార్త విన్న నేను, నిశ్చింతగా మా ఇంటికి తిరిగి చేరుకొన్నాను.

నేను  ఇంటికి తిరిగొచ్చిన రోజే, నా స్నేహితురాలు నా సహాయం కావాలంటూ తన కొడుకు ద్వారా నాకు వార్తంపటంతో నేను వారింటికి  వెళ్లాను. ఆ ఇల్లాలు తమ పక్క వాటాలో బస చేస్తున్న కుటుంబంలోకి కొత్త కోడలు ఆ రోజే వచ్చిందని చెప్పి, నన్ను వాళ్లకు సహాయపడమని అభ్యర్థించింది. నేనా అభ్యర్థనను అర్థం చేసుకోకుండా తోసిపుచ్చుతాననేమో, ఎంతో హడావిడిగా, నేనడక్కుండానే చెప్పటం ప్రారంభించింది. తమ కుటుంబానికి ఆ పక్కింటి వాళ్ళు ఎంతో సాయ పడ్డారనీ, వారి ఋణం తానీ జన్మలో ఏమి చేసినా తీర్చుకోలేననీ, పెద్ద పెద్ద మాటలు వాడేసి, నన్నయోమయంలోకి నెట్టేసింది. నేను తేరుకొని వివరాలు కనుక్కొనేలోపలే ఆ పక్కింటావిడ రావటంతో మా సంభాషణకి కళ్ళెం పడింది. నేనదే ఆవిడని మొదటిసారి కలవటం. ఆవిడ వితంతువే అయినా, నడివయసు మనిషైనా ఆ విగ్రహంలో ఒక రాజసం ఉట్టిపడుతోంది, ఏ ఉపోద్ఘాతం లేకుండా ఆవిడ నానుంచి ఏమి సహాయం కోరుతోందో మొహమాటం లేకుండా .. ఇంకా చెప్పాలంటే ఒక మహారాణి ఆజ్ఞాపించినట్టు .. విశదీకరించింది.

ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో శోభనకార్యం జరగబోతోంది కనక నా ప్రతిభ గురించి విని, కొత్త కోడలిని కార్యానికి తయారు చెయ్యటంలో, శోభనశయ్యాలంకరణలో నా సాయం కోరింది. నేను వారి వాటాలోకి వెళ్లి చూద్డును కదా, ఎక్కడా కళ్యాణఛాయలే కనపడలేదు సరికదా, ఒక రకమైన స్తభ్దతతో కూడిన వాతావరణం పేరుకొని ఉంది. మొదట దానిని అలంకరణలతో పారదోలితే కానీ, కళ్యాణానంతర కార్యాలు శుభప్రదమవ్వవనిపించింది. ఆ పెద్ద ఇంటిని ఆలంకరించాలంటే అది మామూలు విషయం కాదు.  అరటి బోదెలూ, మామిడాకులూ, ఇంకా అనేక రకమైన ఫలపుష్పాలూ, కావాలనీ, నా ఇంటి తోటనించి ఒక అయిదారుగురు మనుషులను పంపించి నాకు కావలసినవి తెప్పించాలి, అని ఆ కొత్తత్తగారికి చేప్పేశాను. ఆవిడ చిరునవ్వుతో తన కొడుకొక్కడు చాలు అవన్నీ తీసుకురావటానికని చెప్పి తన కొడుకుని పంపటానికని బయటకు నడచింది. అంత బలశాలి అయిన కొడుకు, నా ఇంటికి భిక్షాటనకి వచ్చిన ఆ సుందరుడా, ఆ తల్లి ఇప్పటికీ గారాం చేస్తున్న ఆ పసియువకుడా అని ఒక క్షణం ఆలోచనలో పడ్డా, ఆలోచనల్లో మునిగి ఉండడానికి ఇప్పుడు సమయం కాదు.

ఆ కొత్తకోడలికి మంగళ స్నానం చేయించి సింగారించాలి అన్న అత్తగారి మాట గుర్తుకొచ్చి, ఇంటి వెనకవైపున ఉన్న స్నానాల గది వైపు దారి తీశాను.  గదిలోనించి , నీళ్ళ చప్పుడు బదులు ఏవో మాటలు మందరస్థాయిలో వినిపించసాగాయి. చెవి గోడ దగ్గరకు ఆనించి విందును కదా, ఏదో పురుషకంఠం!

“నేనా పని చెయ్యలేను. అది ధర్మాధిక్రమణం అవుతుంది.”

“ఒక స్త్రీ తానంతట తానుగా సిగ్గువిడచి నీ సాంగత్యాన్ని కోరితే తిరస్కరిస్తున్నావే, అది నీ పురుషధర్మానికే వ్యతిరేకం కాదా?”

“మనిద్దరికీ అనువైన సమయందాకా వేచి యుంటే, నీకూ, నాకూ కుడా ఈ ధర్మసంకటం తప్పుతుంది కదా. నీ మొహావేశాన్ని అంత వరకూ ఆపుకోలేవా?”

“అనాదిగా స్త్రీకి, మీ మగాళ్ళు వ్రాసిన ధర్మచట్రాల్లోనే ఇరుక్కొని నలిగిపోవటం అలవాటైపోయింది. నా కోర్కెనూ, మనసునూ చంపుకుంటాను. నువ్వు నిశ్చింతగా శలవు తీసుకో”

ఔరా, ఈ కాలం కుర్రకారు అంత మాత్రమూ ఆగలేకపోతిరే అని నేనాశ్చర్యపోతున్నంతనే, ఇంద్రతేజస్సుతో వెలిగిపోతున్న  ఒక యువకుడు ఆ స్నానాల గది నుండి బయటకు వచ్చి, గబుక్కున గోడ చాటు దాకున్న నన్ను చూడకుండానే, వేటకు బయలుదేరిన అత్యంత నేర్పరి విలుకాడిలాగా వడిగా వెళ్ళిపోయాడు.

నెమ్మదిగా నేను లోపలికి వెళ్లి చూద్దును కదా, అక్కడ ఇంకా స్నానం కూడా మొదలెట్టని కొత్త పెళ్ళికూతురు, వివస్త్రగా, కూర్చొని ఉంది. రంగుకి నల్లగా ఉన్నా, పుష్టిగా ఉన్న అంగ సౌష్టవంతో, తీర్చిదిద్దినట్లున్న రూపు రేఖలతో, ఆడదాన్నైన నేనే చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది, ఆ ఆడకూతురు. నేను తన దగ్గరకు వెళ్లి పలకరించంగానే, నీళ్ళతో నిండిన కన్నులతో నన్ను మౌనంగానే పలకరించింది. నా పూల సుగంధం లాగానే, నా పరిచయం కూడా నా రాక ముందే తనకు తెలిసి పోయినట్లుంది! నేను కూడా, ఆ నిశ్శబ్దాన్ని భంగపరచకుండానే, ఆమెకు తలారా స్నానం చేయించటానికి పూనుకున్నాను. పసుపుతో ఆమె శరీరాన్ని లేపనం చేస్తుండగా, తనే నోరు విప్పింది. ఆ స్నానాల గది నుండి బయటకు నడచిన వ్యక్తి తన మనసుదోచుకున్న పురుషుడూ, ఆ రాత్రి తన తనువును దోచుకోబోయేది మాత్రం వేరే పురుషుడని!

ఈ కాలంలో కూడా ఒక ఆడబిడ్డకి ఏమి కావాలో తెలుసుకోకుండా తలవంచి పెళ్లి చేసేస్తున్న పెద్దవాళ్ళ మూర్ఖత్వం మీద నాకు పట్టరాని కోపం వచ్చింది. అదే సమయంలో బలిపశువులా నా సహయంతో తయారవుతున్న ఆ పెళ్లికూతురి మీద కూడా జాలీ, దయా ముంచుకొచ్చాయి. వయసులో తన కంటే పెద్దదానిగా నా తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చి, ఆమెను సాంత్వన పరచటానికి ప్రయత్నించసాగాను. పెళ్ళైన స్త్రీ, మనసులోఅప్పటి వరకూ ఉన్న  కోరికలన్నీ చంపుకొని, ఒక తెల్లని వస్త్రం లాంటి మనసుతో కొత్త సంసారం ప్రారంభిస్తేనే, ఆమెకూ, భర్తకూ, ఆ కుటుంబానికీ కూడా శ్రేయస్కరమని, శాస్త్రులు గారి కథాకాలక్షేపం నుండి నా కబ్బిన, నాకు ఏ మాత్రం వర్తించని, నీతులను వల్లెవేస్తూ ఆమెకు అలంకారం చెయ్యసాగాను.

ఆ పెళ్లికూతురు చెవులకి నా మాటలొక్కటీ ఎక్కినట్లులేవు. నా నీతులను అర్ధాంతరంగా ఆపేసి నన్నో కోరిక కోరింది. నా పూల పరిజ్ఞానమంతా ఉపయోగించి, తన అలంకరణలోనూ, ఆ ఇంటి లోపలి శయ్యాలంకరణలోనూ, ఏమైనా కొన్ని పువ్వులను వాడి, తన పైనా, ఆ రాత్రికి జరగపోయే శోభనకార్యం పైన, తన భర్తకు కోరిక కలగకుండా చెయ్యగలవా అని. నా పరిజ్ఞానానికే పరీక్షతో బాటు నన్ను రెండు నిమిషాల పాటు ధర్మసంకటంలో పడేసింది ఆ పిల్ల, తన కోర్కెతో. నేను ఎంతో సంయమనంతో వాడినప్పుడు నాకన్ని విధాలా సహకరించి నాకెంతో జ్ఞానాన్ని పంచిన ఈ పూలు, నేను ఈ ధర్మవిరుద్ధ కార్యం చెయ్యబూనితే నాతో సహకరిస్తాయా అని కూడా మీమాంశలో పడ్డాను. కానీ నా మేధస్సుని తక్కువ చేసుకొని, లేని గురుత్వాన్ని ఆ పూలకు ఆపాదించి, నా ఆలోచనలతో అనవసరంగా కుస్తీ పడుతున్నానన్న బలమైన భావన కూడా నన్ను కమ్మేసింది. ఆ కొత్తపెళ్లి కూతురు మొహంలో తాండవిస్తున్న దైన్యం నా నిశ్చయాన్ని మరింత దృఢ పరిచింది. “అడవి బాదం పూలు” ఎక్కడైనా సంపాదించి ఒకటి రెండు, ఆ పెళ్లికూతురి జడలోను, ఆ పడకపైనా కనక ఉంచితే, అవి అన్ని కోరికలూ దూరం చేస్తాయి. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలుసు.

అత్తగారు, బయట నా కోసమే, జరిగిన ఆలస్యం వల్ల అనుకుంటా, అసహనంగా ఎదురు చూస్తూ పచార్లు చేస్తున్నారు. ఆమె పంపిన కొడుకు, ఎంత బలశాలో ఏమో మరి, అడిగినవన్నీ ఒక్కడే నా ఇంటి పెరట్లోనించి కోసి, తన భుజాలమీద మోసుకొచ్చి పడేశాడు. నేను ఎక్కడ ఏమి కట్టాలో చెప్తే, చిటికెలో అన్నీ పనులూ చేసేశాడు. శోభనంపెళ్లి కొడుకు మాత్రం ఇంటి లోపలి గదిలోనే ఉండిపోవటంతో అతడిని చూసే అవకాశం లేకపోయింది. నేను అదను చూసుకొని బయటకు వెళ్లి నాకు కావాల్సిన పూలు కోసుకొచ్చుకొని చివరిగా శయ్యాలంకరణ ప్రారంభించాను. పగడమల్లెలు ఒక్కటైనా పొరపాటున కూడా పడకుండా, అలంకరణలో అసలే వాసన లేని అనేక రకాల  పూలు వాడి శయ్యను అతి సుందరంగా అలంకరించా. అడవి బాదం పూలు మాత్రం  మోతాదుకి మించే తగిలించి బయట పడ్డా. నా ఇంటికి వెళ్ళిపోతున్న నన్ను, వెనకనుంచి పిలచి మరీ గుర్తుచేసింది ఆ అత్తగారు, ఆ మర్నాడు ఉదయం ఒక్క సారి మళ్ళీ వచ్చి కలవమని. పూలను చదవగల నాకున్న శక్తిని గురించి తెలిసే నన్ను రమ్మంటోందన్న విషయం తెలిసి, మర్నాడు ఏమి సాకు చెప్పాలో అని విచారిస్తూ ఇంటి త్రోవ పట్టా.

ఆ మర్నాడు, సూదుల్లా గుచ్చే సూర్య కిరణాలు కానీ, తోట లోని పూల గుబాళింపులు గానీ, కోడి పలు కూతలు గానీ, ఏవీ నన్ను నా మంచం నుండి లేపేందుకు ప్రేరేపించలేకపోయాయి. వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం, అతికష్టం మీద లేచి ఆ ఇంటికి వెళ్ళా. పెళ్లి కూతురు కనపడలేదు కానీ, అత్తగారు గారు నన్ను గుమ్మంనించే తోడ్కొని, శోభనం జరిగిన గదిలోనికి తీసుకెళ్ళారు. ఆ గదిలో పగడమల్లెల పరిమళాలు పూర్తిగా గాలిలోకి ఇంకిపోయున్నాయి. ఆ పడక మీద నేను రాత్రి సింగారించిన పూలు అన్ని వైపులా చెదరి అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. పగడమల్లెలు నేను వాడకపోయినా, మత్తెక్కించే అంత సువాసన ఎక్కడ నుంచి వస్తోందో అని నాకే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క పువ్వునూ వాసన చూడసాగాను. అన్నిటిలోనూ పగడమల్లెల వాసనే, ఆఖరికి, అడవి బాదం పువ్వుల్లో కూడా అదే పరిమళం! కాగలనున్న కార్యాన్ని జరిపించటానికి, నా పూలే పనిగట్టుకొని, నా పరిజ్ఞానాన్ని పరిహసిస్తూ, తమ ఒరవడినే మార్చుకొని, ఇలా ప్రవర్తించాయా అన్న ఆలోచనలలో మునిగిపోయా!

ఆ పూలు, నాతో ఆ భార్యా భర్తలు ఆనందావేశాలతో గడిపిన ఆ తొలిరాత్రి మధురక్షణాలూ, ఒకరిలో ఒకరు కరిగిపోతూ మమేకమైపోతున్న ఆ దృశ్యాలను నాకు అస్తవ్యస్తంగా గోచరింప చేయసాగాయి. నన్నే చాలాసేపటినుంచీ గమనిస్తున్న ఆ అత్తగారు, నేను ఏమీ చెప్పకుండానే నా భావాలని చదివేసినదానిలాగా, ఒక పెద్ద చిరునవ్వుతో, మెచ్చుకోలు చూపుతో, నా వైపు చూసి, బయటకు నడచింది. నేనూ, అయోమయ స్థితిలోనే గదినుంచి బయట పడ్డాను. నా కోసమే ఎదురు చూస్తున్న ఆ కొత్త కోడలు నన్ను పక్కకి లాగింది. నా ప్రశ్నార్థకమైన చూపును అర్థం చేసుకుందేమో, ఏమి జరిగిందో చెప్పసాగింది.

గదిలోనికి అడుగుపెట్టిన ఆమెని, ఆ అడవి బాదం పూల వాసన చుట్టేసి చాలా ఇబ్బంది కలగజేస్తున్నప్పుడు, ఆమె భర్త లోపలికి ప్రవేశించాడు. ఆతని మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది. నిర్మలమైన మోముతో, చెదరని చిరునవ్వుతో అతడు ఆమెను పలకరించాడు. కుచించుకుపోయి కూర్చోని ఉన్న ఆమె, అతడి మోహంలోని వెలుగునూ, ప్రశాంతతనూ చూసి కలవరపాటు కొంచెం కోల్పోయినదైనది. అతడు, ఏ మాత్రం తొణకని, మృదువైన స్వరంతో, ఆమె మనసులో ఉన్నది తను కాదని తనకు తెలుసుననీ, కానీ పతిగా తన ధర్మం తను నెరవేర్చటానికి తనకది అడ్డుకాదనీ చెప్పాడు. అంతే కాక, ఆమెకు ఇష్టం లేకుండా ఆమెను తాకే ప్రయత్నం కూడా తను చెయ్యననీ, అది తన పురుషధర్మానికే వ్యతిరేకమనీ పలికి కూర్చొండిపోయాడు. ఆ సమయాన అతడు భూలోకంకి దిగివచ్చిన ధర్మదేవత ప్రతిరూపంలాగా ఆమెకు అగుపడ సాగాడు. ఆమె లోని దైన్యం, నిర్లిప్తత ఒక్కసారిగా కరిగిపోనారంభించాయి.  అప్రయత్నంగా ఆమె చేతులు అతడి పాదాల్ని స్పృశించాయి. ఆమె అతని శరీరమును తాకినంతనే, శయ్యపైనున్న ఆ పూలు తమ ప్రకృతినే మరచిపోయి పగడమల్లెల సువాసనలు వెదజల్లనారంభించాయి. ఆ వాసనలే ఆమెను ఆవహించి సహధర్మచారిణిగా ఆమె యొక్క ధర్మాన్ని గుర్తు చేశాయి. ఆ తరువాత కొన్ని గంటలు క్షణాలుగా మారిపోగా, అలసిన ఆ శరీరాలకు నిద్ర ఎప్పుడూ పట్టిందో కూడా ఆమె గుర్తించలేదు.

ఆమె చెప్పినది విన్న తరువాత నా రోమాలు నిక్కపొడిచాయి. ఇది మానవ మేధస్సుకందని అద్భుతసంఘటన అని సరిపెట్టుకొని నా ఇంటి వైపు మళ్ళాను.

ఇంతకూ నా పేరు చెప్పనే లేదు కదూ, దాని అవసరం కూడా లేదు. నాలాంటి వాళ్ళ కథలకు పురాణపుటల్లో ఎక్కడా చోటు ఉండదు. కానీ, నేను ఆ రోజు కలసిన ఆ ఇంటిలోని వ్యక్తులు మాత్రం యుగాయుగాలకీ చెరగని విధంగా ఆ పుటల్లో తమ ఇతిహాసాన్ని వ్రాసుకు పోతారనే నమ్మకం మాత్రం నాకుంది. మా ఈ చిన్న కుగ్రామమైన ఏకచక్రపురంలో, కొన్నాళ్ళు మజిలీ చేసి వెళ్ళిన ఆ కుటుంబం, పాండవ వంశానికి చెందినదని, ఆ కొత్త పెళ్లి కూతురు పాంచాల దేశ రాకుమారి అని నాకు అనేక సంవత్సరాల దాకా తెలియనేలేదు!