రచన: అనిల్ ఎస్. రాయల్

‘ఆంధ్రజ్యోతి’, 09 జూన్ 2013


ఆ రోజు – అన్ని రోజుల్లాగే భళ్ళున తెల్లారింది.

ఏడున్నరకే ఎండ ఫెళ్లున కాస్తోంది. వేసవి వడగాలి ఛెళ్లున కొడుతోంది.

ఆ మాత్రానికే జనజీవితాలు స్థంభించే తీరుబడి కాలమిది కాదు కాబట్టి రహదారి మీద రద్దీ మామూలుగానే ఉంది. నేరుగా రాజధాని నగరంలోకి పోతోందా నల్లతాచులాంటి తార్రోడ్డు. దానికి ఇరువైపులా తుప్పలూ, తుమ్మలూ, రప్పలూ, రాళ్లూ తప్ప మరోటి ఉండేది కాదు. అది ఇరవయ్యేళ్లనాటి మాట. అసలా తాచు రోడ్డే లేదప్పట్లో. అప్పట్లో అదో కంకర్రోడ్డు. ఊరి శివార్లనేవాళ్లా ప్రాంతాన్ని. ఇప్పుడలా పిలిచే తలమాసినోళ్లెవరూ లేరు. ఇరవయ్యేళ్లలో తరం మారింది. లోకం మారింది. దాని పోకడ మారింది. బడులు మారాయి. పలుకుబడులు మారాయి. పలుకులు మారాయి. పిలుపులు మారాయి. సంగతులెయ్యటమాపి అసలు సంగజ్జెప్పాలంటే – అప్పటి శివార్లు సోగ్గా ఇప్పటి సబర్బ్స్ అయ్యాయి. ఇన్నేళ్లలో రాజధాని నుండి నాగరికత దేక్కుంటూ పాక్కుంటూ అక్కడిదాకా వచ్చేసింది. తుప్పలూ, రప్పలూ మాయమైపోయాయి. వాటి స్థానంలో ఇళ్లూ గుళ్లూ మొలిచాయి. జనాన్ని నగరం నడిబొడ్డుకి రవాణా చెయ్యటానికి బస్సులూ, అవి ఆగటానికో స్టాపూ, దాన్నానుకునో దుకాణాల సముదాయమూ, అలా అలా ఒకదాని వెంబడి ఒకటి వచ్చేశాయి. అక్కడున్న ప్రతి భవనం నెత్తిమీదా కిరీటాల్లా భాసిస్తూ, ఆకాశానికి దడి కడుతూ భారీ హోర్డింగులు వెలిశాయి. వాటిలో సింగారాలు చిలికిస్తూ చీరలమ్మే కథానాయికలవి కొన్ని, దరహాసాలొలికిస్తూ బంగారాన్నమ్మే కథానాయకులవింకొన్ని, ర్యాంకుల టముకేస్తూ సీట్లమ్మే కార్పొరేట్ బళ్లవి తక్కినవన్నీ. చదువుకునే కాలమెప్పుడో కాలం చేసి చదువు కొనే కాలానికి దారిచ్చేసింది కాబట్టి ఈ మూడో రకం కిరీటాలదే అక్కడ రాజ్యం. మొత్తమ్మీద ఆ సబర్బన్ ఏరియా నలుమూలలా నాగరికత నవనవలాడిపోతోంది.

నాగరికతతో పాటు బిలబిలమంటూ నేరాలూ విచ్చేశాయక్కడికి. వాటిని నియంత్రించటానికో రక్షకభట నిలయమొచ్చింది. బస్టాపు పక్కనే కొలువయిందది. ప్రజల నుండి రక్షణ కోసం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, పైన కరెంట్ తీగలు, స్ట్రాటజిక్ లొకేషన్స్‌లో వ్యూహాత్మకంగా పేర్చబడ్డ ఇసుక మూటలు, సెంట్రీ బురుజులు, పగలూ వెన్నెల కురిపించే ఫ్లడ్ లైట్లు ఇతరత్రా హంగామాతో దర్జాగా నిలబడుందది. కోట ముందు కందకంలా దాని ముందో మురుగుకాల్వ. అందులో మొసళ్లు లేనిలోటు తీరుస్తూ ముళ్లకంపలు, కుళ్లు కంపు. మొత్తమ్మీద ఆ ఠాణా ఓ అభేద్య దుర్గం.

అదిగదిగో ఆ దుర్గం ముందు ప్రస్తుతం ఓ పోలీస్ జీప్ ఆగుంది. అరగంటనుండీ అదక్కడే ఉంది. దాని ముందు సీట్లో డ్రైవరుడు లేడు. అంటే వెనక సీట్లో ఉన్నాడని కాదు. అక్కడా లేడు. బండి ఇంజన్ రన్నింగ్‌లోనే వదిలేసి పక్కనున్న టీబడ్డీ దగ్గర ఫ్రీ టీ సర్రుసర్రున జుర్రుతూ పిచ్చాపాటీ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ బడ్డీ ముందున్న దండెమ్మీద ఎన్ని పాన్ పరాగ్ దండలు వేలాడుతున్నాయి, కౌంటర్ మీద పడున్న సకుటుంబ సపరివార పత్రిక అట్టమీద ఐటమ్‌గాళ్ వళ్లెట్టా విరుచుకుంటోంది, బడ్డీ పక్కనున్న స్వతంత్ర భారత్ వైన్స్ ముందు టాక్స్ పేయర్స్ ఎలా పడిగాపులు పడుతున్నారు, వైన్స్ వెనకున్న మురిగ్గుంటలో సేదదీరుతున్న పందిరాజములు ఎంత ముద్దొస్తున్నాయి …. వగైరా వాతావరణ నివేదికలిచ్చేంత సమయం లేదు. అవతల బస్సొచ్చే టైమయింది. నిజానికి ఈ డ్రైవర్ మేటరూ అనవసరమే. ఈ కథలో వచ్చిపోయే సవాశేరు పేరులేని ఎక్‌స్ట్రా పాత్రల్లో అదొకటి. ఎస్టాబ్లిష్‌మెంట్ వంకతో ఇలాంటి పోసుకోలు కబుర్లు రాసి పుంఖాలు నింపే వెసులుబాటు కథకులకుంది కాబట్టి రాయటమే. 

డ్రైవర్నక్కడే వదిలేసి మళ్లీ జీపులోకి తొంగిచూస్తే – వెనక సీట్లో ఇద్దరు పక్కపక్కన కూర్చునున్నారు. వాళ్లలో ఒకడు రెండోవాడి కుడి చెయ్యి పట్టుకుని ఉన్నాడు – వదిలేస్తే ఎక్కడ పారిపోతాడోనన్నట్లు. వాడి ముఖంలో అధికారం తెచ్చిపెట్టిన ధీమా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తొడుక్కున్న ఖాకీ దుస్తులు ఆ దర్పాన్ని తొడగొట్టి ప్రకటిస్తున్నాయి. మామూలుగానైతే ఖాకీ దుస్తుల మనిషి సెక్యూరిటీ గార్డు కావచ్చు, బీఎస్ఎఫ్ జవాను కావచ్చు, కే బాపయ్య లాంటి పాతకాపు సినిమా దర్శకుడూ కావచ్చు. కానీ పోలీస్ జీపులో ఒకడి చెయ్యి గాఠిగా పట్టేసుకుని కూర్చునున్న ఖాకీదుస్తుల అధికార ముఖపోడు మాత్రం వాళ్లెవరూ కాకుండా పోలీసన్నే అయ్యుండాలి. దీన్నే ‘పరిస్థితులు కల్పించిన సాక్షాధారాలు పరిశీలించిన పిమ్మట’ అంటారు. అందరికీ అర్ధమయ్యేలా అచ్చ తెలుగులో చెప్పాలంటే, ‘సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్’ అన్నమాట. ఈ సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది మా చెడ్డది. చూసే కోణం కొంచెం మారిస్తే చాలు, కథ మొత్తం తిరగబడుద్ది. కాబట్టి దీని ఆధారంగా అంత తేలిగ్గా దేనిమీదా ఓ నిర్ధారణకి వచ్చెయ్యకూడదు. కానీ వీడి విషయంలో మాత్రం ఎవిడెన్స్ తట్టుకోలేనంత గట్టిగా ఉంది కాబట్టి ఫరవాలేదు.

అధికార ముఖపు పోలీసన్ననీ, వాడి ఉడుం పట్టు వదిలించుకోటానికి మౌనంగా గింజుకుంటున్న రెండోవాడినీ మార్చిమార్చి చూస్తోంది బస్టాపు ముందు నిలబడున్న కుర్రజంటొకటి. అదో ప్రేమపక్షుల జంట. ప్రతి ఉదయమూ, సాయంత్రమూ ఠంచనుగా అక్కడ వాల్తుంది. అందులో ఆడపక్షి అష్టలక్ష్మిలాగుంటే, మగది అక్కుపక్షిలాగుంది. ప్రేమ గుడ్డిదని నమ్మనోళ్లకి వీళ్లని చూపిస్తే సరి – దెబ్బకి దెయ్యం వదులుద్ది, నమ్మకం కుదురుద్ది. కిచకిచలాడుతూ మధ్యమధ్యలో జీపుకేసి చూస్తున్నాయా పక్షులు. ఆ కిచకిచలు సృష్టించిన ధ్వనితరంగాలు వాయువేగంతో జీపులో ప్రవేశించి పోలీసన్న కుడి చెవిలోంచి లోపలకి దూరి అందున్న శూన్యంగుండా ప్రయాణించి అవతలి చెవిలోంచి బయటపడి అదే ఊపులో రెండోవాడి కర్ణఫలకాన్ని తాకుతున్నాయి. ఆ కిచకిచలతో ఈ రెండోవాడికి  సమస్యలేదు కానీ వాటి మధ్య అడపాదడపా దొర్లుతున్న పకపకలతోనే యమ చిరాగ్గా ఉంది. బాధలో ఉన్నవాళ్లకి పరుల సంతోషం కలిగించే చిరాకది.

ఈ చిరాకు ముఖం రెండోవాడి పేరు బండ రెడ్డి. బండరెడ్డి పేరుకు తగ్గట్లు బండగా ఉన్నాడని రాయొచ్చు కానీ దానివల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే కొంపలు మునుగుతాయి. ఎంచక్కా కొంచెం బొద్దుగా ఉన్నాడంటే ముద్దుగానూ ఉంటుంది, ఓ హద్దులో ఉన్నట్లూ ఉంటుంది కాబట్టి అలాగే అందాం. ఇకనుండీ మనం వీడి వెనకేబడదాం. ఎందుకంటే, ఇది వీడి కథ. 

కాలం సైతం సాపేక్షమన్న శాస్త్రాన్ని రుజువు చేస్తూ – ప్రేమపక్షులకి ఐదు నిమిషాల్లో కరిగిన అరగంట రెడ్డికి రెండు గంటల్లా నిక్కుతూ నీలుగుతూ నడిచింది. సరిగా ఎనిమిదింటికి అల్లంత దూరాన రోడ్డు చివరి మలుపులో కనబడింది బస్సు – ఇటే వస్తూ.  ‘నిండుగర్భిణిలా’ అనే ప్రయోగం చెయ్యటానికి వీల్లేకుండా రయ్‌రయ్యిన దూసుకొచ్చి కీచుమనే శబ్దంతో ఆగింది. బస్టాపులో కాదు. అక్కడాగటానికది ఘనత వహించిన ఆంప్రరారోరసం వారి జనరవాణా బస్సు కాదు. కిటికీలకి పటిష్టమైన ఊచలు, ప్రమాదాల్ని తట్టుకునే దళసరి గోడలు – వెరసి అనుమతి లేనిదే లోపలివారు బయటికీ బయటివారు లోపలికీ రాకపోకలు సాగించలేని పకడ్బందీ బందోబస్తున్న బస్సు. సరిగా బండరెడ్డున్న పోలీసు జీప్ ఎదురుగా ఆగింది. రెడ్డి బలవంతంగా ఎక్కించబడ్డాక కదిలింది.

రెడ్డి  కాక పన్నెండుగురు పాసింజర్లు ఉన్నారందులో. అందరి ముఖాల్లోనూ దిగులు, భయం, బాధ కలగలిసిన నిర్వికారం. నిర్వికారంలో అన్నిరకాల భావాలెలా తోచాయని మీరు విస్తుపోనవసరం లేదు. కథకుల దివ్యచక్షువులకి కొన్నలా గోచరిస్తాయంతే. అందరూ మూగజీవులో, లేక వాళ్ల మధ్య మాటలు నిషేధించబడ్డాయో – మొత్తమ్మీద పాసెంజర్లందరూ ముఖాలు మాడ్చుకుని మూతులు ముడుచుకుని సీటుకొకరు చొప్పున తలా ఓ కిటికీ పక్కన కూర్చుని ఉన్నారు. ఎవరెటు చూస్తున్నా అందరి దృష్టీ శూన్యంలోనే లీనమౌతోంది. మొత్తమ్మీద బస్సంతా గంభీరభరితం. శ్మశానంలో ఇంతకన్నా ఎక్కువ సంతోషం తాండవిస్తుంది.

ఖాళీ సీటొకటి చూసుకుని కిటికీ పక్కన కూలబడ్డాడు రెడ్డి. భుజమ్మీద వేలాడుతున్న బరువైన సంచిని పక్క సీటులో విసురుగా పడేశాడు. ఆ శబ్దానికి కొన్ని మాడు ముఖాలు ఇటు తిరిగి, తిరిగి అటు తిరిగాయి. 

డ్రైవర్, పదమూడుగురు పాసింజర్లు కాక మరో మనిషున్నాడందులో. ఈ రోజు మనకళ్లబడ్డ రెండో ఖాకీ దుస్తుల మనిషి వీడు. ఓ చేతిలో దినపత్రిక, రెండో చేతిలో వెలుగుతున్న సిగరెట్ పట్టుకుని ఇంజన్ బాక్స్ మీద కులాసాగా కూర్చుని ఉన్నాడు. మిలటరీ సర్వీసునుండొచ్చిన వాడు కావటంతో మేజర్ అంటారంతా. అనకపోతే తంతాడు. అందుకని అందరూ ముఖమ్మీద ‘మేజర్’ అన్నా వెనకాల ‘వాడు’, ‘వీడు’ అనే అనుకుంటారు. మనమూ అదే చేద్దాం.

బండ రెడ్డి కళ్లు మేజర్ చేతిలో ఉన్న సిగరెట్ మీద పడ్డాయి. అంటే రెడ్డి కళ్ళు వాడి తలకాయలోంచి ఊడొచ్చేసి సిగరెట్ మీద పడిపోయాయని కాదు. వాడి చూపులు సిగరెట్ మీదకి మళ్లాయని. అక్కడ్నుండి ఆ పొగవెంబడే పాక్కుంటూ పైకెళ్లి పైనున్న ‘నో స్మోకింగ్’ కంకాళం బొమ్మ మీద ఆగి, యూ-టర్న్ తీసుకుని మళ్లీ కిందకి జరజరా పాక్కుంటూ వచ్చి మేజర్ ముఖమ్మీద వాలాయి. ఆ ముఖంలో కరడుగట్టిన కాఠిన్యం. సరిగా బండ రెడ్డి చూపులు తన ముఖమ్మీద వాలే సమయానికి – దినపత్రిక మడచి పక్కన పడేస్తూ, కనుకొనల నుండి రెడ్డిని పరికిస్తూ, గరగరలాడే గొంతేసుకుని డ్రైవర్‌తో చెపుతున్నాడు.

“…. ప్రేమించలేదని డిగ్రీ స్టూడెంట్ ముఖమ్మీద యాసిడ్ పోసిన కేసు. ఏడేళ్లు శిక్ష”

“ఏడేళ్లేం సరిపోద్ది. ఉరి తీసిపారెయ్యాలి వెధవల్ని”, డ్రైవర్ స్పందన. మెల్లిగా అన్నా రెడ్డి చెవుల్లో పడింది. వాడి మనసు చివుక్కుమంది. 

కఠిన శిక్షలతో నేరాలు మటుమాయమౌతాయనుకునే సగటు జీవి ఆ డ్రైవరు. పిల్లల్ని పందెం కోళ్లలా పెంచే తల్లిదండ్రులు మారితే తప్ప ప్రేమతో సహా మరెందులోనైనా గెలుపోటములు తేలిగ్గా తీసుకునే తత్వం కుర్రకుంకల తలకెక్కదన్న జ్ఞానం బొత్తిగా లేని మామూలు మానవుడు. అయితే రెడ్డి మనసు చివుక్కుమంది ఆ అజ్ఞానానికి కాదు. ‘ఉరి’ అన్న మాట తవ్వి తీసిన జ్ఞాపకానికి. మెదడు పొరల్లో ఎంత లోతుగా పాతరేసినా ఏదోలా బయటపడిపోతుందది. తలచుకుంటేనే వళ్లు జలదరించే జ్ఞాపకం. దానిబారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, పారిపోయే ఉపాయాల మీదకి మనసు మరల్చాడు. 

పారిపోటం తనకి కొత్త కాదు. దొరికిపోటమూ కొత్త కాదు. గతానుభవాల దృష్ట్యా, ఇకముందు తనమీద నిఘా మరింత కట్టుదిట్టంగా ఉండబోతోంది. ఎలాగో మళ్లీ పారిపోయినా ఎక్కడికెళ్లాలి? పోనీ, పారిపోయే ఆలోచనకి స్వస్తి చెప్పి ఏదోలా మిగిలిన ఆరేళ్లు నెట్టుకొచ్చేస్తే? అమ్మో! ఆ నరకంలో ఒక్క ఏడాదే యుగంలా గడిచింది. ఇంకో ఆరేళ్లన్న ఊహే భయంకరంగా ఉంది. 

మేజర్ బాతాఖానీ కొనసాగొతోంది. అతని దృష్టిమాత్రం అప్పుడప్పుడూ రెడ్డి ముఖమ్మీద తారట్లాడుతూనే ఉంది. 

బండరెడ్డి పేరున్నంత మొరటుగా ఆ ముఖముండదు. అంతో ఇంతో అమాయకత్వమే కనిపిస్తుందందులో. అయితే బండ రెడ్డి పైకి కనిపించేంత అమాయకుడేం కాదని ఆ మేజర్‌కి బాగా తెలుసు. గతేడాది రెండుసార్లు కాపలా వాళ్ల కళ్లుగప్పి పారిపోబోయి రెండుసార్లూ మేజర్ చేతికే చిక్కాడు రెడ్డి. డ్రైవర్‌తో హస్కు కొడుతున్నా, మేజర్ కళ్లు పదే పదే రెడ్డి వైపుకి మళ్లుతుండటం అందుకే కావచ్చు. ఆ చూపులు పదునుగా గుచ్చుకుంటుండటంతో రెడ్డి ఉష్ట్రపక్షిలా మారాడు. తల పక్కకి తిప్పి కిటికీలోంచి వెలుపలికి చూడసాగాడు.

బయట బడిపిల్లల సందడి. బస్సు జిల్లా పరిషత్ హైస్కూల్ ముందుగా, ఎడాపెడా రోడ్డు దాటేస్తున్న విద్యార్ధినీ విద్యార్ధుల్ని నేర్పుగా తప్పుకుంటూ నెమ్మదిగా వెళుతోంది. ఒకట్రెండు తరాల కిందట హైస్కూలు చదువులంటే ఎక్కువమందికి అలాంటి బళ్లే దిక్కు. ప్రస్తుతం అదో దిక్కుమాలిన బడి. ఐనా దాని డిమాండ్ దానికుంది కాబట్టి విద్యార్ధులకైతే కరువు లేదు.

రెడ్డి చూపు బడి ప్రాంగణంలోకి ప్రసరించింది. దాన్నిండా సీతాకోకచిలకల్లాంటి స్కూలు పిల్లలు. తరగతులు మొదలవటానికి ఇంకా సమయం ఉందేమో, బడి ముందున్న విశాలమైన మైదానంలో నవ్వుతూ, తుళ్లుతూ రకరకాల ఆటల్లో మునిగి తేలుతున్నారు. గోలగోలగా ఉంది అక్కడంతా. స్వేఛ్చావిహంగాల్లా ఉన్నారా పిల్లలు.

మన్లో మాట. ఏదో కవితాత్మకంగా ఉంటుందని స్వేఛ్చావిహంగం అంటామే కానీ నిజానికి పక్షులకి స్వేఛ్చ ఎక్కడేడిచింది? పొద్దెక్కినప్పట్నుండి పొద్దుగుంకేదాకా తిండిగింజలకోసం తిప్పలు పడటం, ఎవరదిలించినా దడుచుకు పారిపోవటం …. బతుకంతా అదే భయం. ఇదేం స్వేఛ్చ! 

పై మన్లో మాట బండ రెడ్డికి తెలీకపోవటంతో – సదరు స్వేఛ్చావిహంగాలు కళ్లబడేసరికి వాడి గొంతులో ఏదో అడ్డం పడ్డట్లయింది. మరీ దూరం కాని గతంలో తానూ అటువంటి ఓ స్వేచ్చా జీవే. ఆ పిల్లల భాగ్యానికి అసూయ, తన దౌర్భాగ్యానికి కోపం ఏక కాలంలో కలిగాయి రెడ్డికి.

బండ రెడ్డి భావాలతో సంబంధం లేకుండా బస్సు ముందుకి సాగిపోతోంది.

బడి పిల్లల మీదనుండి చూపు బలవంతంగా మరల్చుకుంటూ కళ్లుమూసుకున్నాడు రెడ్డి. మూసుకున్న రెప్పల మాటున కిందటేడాది గిర్రున తిరిగింది. 

ఏడాదిగా  తప్పించుకోటానికి రెడ్డి చేయని ప్రయత్ర్నాల్లేవు. అర్జీలు, రికమెండేషన్లు, ఏవీ పని చెయ్యలేదు. రెడ్డి మొర ఆలకించేవారే లేకపోయారు. పారిపోయే ప్రయత్నం రెండుసార్లూ బెడిసికొట్టింది. నిరాహార దీక్షతో పనౌతుందేమోనని గతవారం అదీ ప్రయత్నించి చూశాడు. అన్నా హజారే అన్నం తిననంటూ మొండికేస్తే దేశం గగ్గోలెత్తిపోతుందేమో కానీ బండ రెడ్డి తిండి మానేస్తే పట్టించుకునేదెవరు? నిరశన దీక్ష సైతం నీరసంగా ముగిశాక ఇక మార్గాలేవీ మిగల్లేదు.

బస్సు కంటోన్మెంట్ ఏరియాలోకి ప్రవేశించింది. అక్కడనుండి రోడ్ల రాజసం మారిపోయింది. తీర్చి దిద్దినట్లున్న రహదారులు, వాటికి ఇరువైపులా అందమైన పూల మొక్కలు. రణగొణ ధ్వనులు లేవు. ట్రాఫిక్ కూడా పెద్దగా లేదు. రోడ్లు ఖాళీగా ఉండటంతో బస్సు వేగం పెరిగింది.

ఐదు నిమిషాల తర్వాత, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బస్సాగింది. కళ్లు మూసుకుని వైరాగ్యంలో మునిగున్న రెడ్డి కిటికీ పక్క పెద్ద శబ్దమై కళ్ళు తెరిచి చూశాడు. మిలటరీ ట్రక్కొకటి, డ్రైవర్ ఆఖరి క్షణంలో బ్రేక్ వేయటంతో, కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. దాన్నిండా జవానులు. తిరిగొస్తారో రారో తెలీని ఏ కార్యమ్మీద బయల్దేరారో – అందరి ముఖాల్లోనూ అదో రకం ఆందోళన …. చావు భయం. 

జ్ఞాపకం మళ్లీ ఒళ్ళువిరుచుకుంది. దాన్ని కప్పెట్టేయటానికి రెడ్డి కుస్తీ పడుతుండగా, సిగ్నల్ మారింది. వాహనాలు రెండూ ముందుకురికాయి. మిలటరీ ట్రక్కు హారన్ మోగించుకుంటూ హడావిడిగా దూసుకుపోయింది. అదలా వెళ్లిందో లేదో, ఆ ఖాళీని పూరించటానికన్నట్లు ఆ స్థానంలోకి మరో వాహనం వచ్చి రెడ్డి బస్సుకి సమాంతరంగా ప్రయాణించసాగింది. ముదురు బూడిద రంగు బస్సు. రెడ్డి బస్సులానే పటిష్టమైన ఊచలు, దళసరి గోడలు ఉన్నాయి దానికి. పక్కన పెద్ద పెద్ద అక్షరాల్లో ‘కేంద్ర కారాగారము’ అని రాయబడి ఉంది. కిటికీలదగ్గర అక్కడొకటీ ఇక్కడొకటీ కనిపిస్తున్నాయి నిర్లిప్తంగా చూస్తున్న ముఖాలు. యావజ్జీవిత ఖైదీలో లేక ఉరిశిక్ష కోసం ఎదురుచూసేవాళ్లో – మొత్తానికి అన్ని ముఖాల్లోనూ ప్రేతకళ.

రెడ్డికి ఆ ముఖాల్లో శీను కనపడ్డాడు.

కుస్తీలో జ్ఞాపకమే నెగ్గింది.

శీను ….

‘పిరికివాడు శీను’ అన్నారందరూ. బండ రెడ్డి దృష్టిలో మాత్రం శీను బహు ధైర్యవంతుడు. తానూ అదే పని చేయాలని రెడ్డి అప్పుడప్పుడూ ఆలోచించకపోలేదు. కానీ శీనుకున్నంత ధైర్యం లేక ఆగిపోయాడు.

బతకటానికే కాదు, చావటానికీ ధైర్యం కావాలి మరి. రెండోదానికే రవ్వంత ఎక్కువ అవసరం.

శీనుతో రెడ్డికి పెద్దగా పరిచయం లేదు. శీను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రెడ్డికన్నా రెండేళ్లు పెద్దవాడు. సహచర బందీ; ఇప్పుడు కాదు. ఇప్పుడు లేడు కదా. తప్పించుకోటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మూడు నెలల కిందటి సంగతి. అప్పట్లో ఆంధ్రదేశమంతా అదో సంచలనం. అదే అదనుగా సందు దొరికింది కదాని దేశంలో మంటగలిసిపోతున్న మానవ హక్కుల దగ్గర్నుండి, భారతీయ సంస్కృతిపై పాశ్చాత్యుల దాడుల దాకా ఏవేవో విషయాల గురించి సాధారణ ప్రజానీకానికి అర్ధం కాని భాషలో వాదోపవాదాలు చేసుకుంటూ మేధావులు టెలివిజన్లలో చెలరేగిపోయారు. టీవీ తొంభై తొమ్మిది వారు హుటాహుటిన ఈ ఘోరం గురించి ఎన్నారైలు ఏమంటున్నారో ఆరాతీసి ఆంధ్రప్రదేశమంతటా దండోరా వేశారు. శీను పుట్టింది ఫలానా ప్రాంతంలో అని తెలియగానే విషయానికి రాజకీయ రంగంటుకుంది. ఉద్యమపార్టీ ఉగ్రరూపం దాల్చింది. శీను అమరవీరుడైపోయాడు. నగర నడిబొడ్డు విశ్వవిద్యాలయంలో నాలుగు ఆర్టీసీ బస్సమిధలు ఆహుతయ్యాయి. సంబంధిత శాఖ మంత్రిని ఊడబెరకాలంటూ అసెంబ్లీలో విపక్షనాయకులు ఊగిపోయారు. జైళ్లు-బళ్ల జంట శాఖల్ని రెండేళ్లుగా రెండు కళ్లలా కడు సమర్ధంగా కాచికాపాడుకుంటున్న మంత్రిగారు కళవళపడిపోయారు. ఆ కళ్లలో ఒకటన్నా ఊడబెరికి తనకప్పగించకపోతుందా హైకమాండ్ అనుకుంటూ ఆయాసపడింది ఆశావహుల జాబితాలో సదా ఫస్టుండే సీనియర్ మోస్టు చకోరపక్షి. ప్రతిపక్షంపై అలవాటుగా ఎదురుదాడికి దిగింది పాలక పక్షం. సందట్లో సడేమియాగా ప్రభుత్వాన్ని పడగొడతామంటూ తొడగొట్టింది చీలిక పక్షం. అదే జరిగితే మద్దతిచ్చి ఆదుకుంటామంటూ అడక్కపోయినా అభయమిచ్చిందో  పిపీలిక పక్షం. మొత్తమ్మీద రాష్ట్రమంతా రంకెలూ రణగొణ ధ్వనులూ. వారం పాటు మీడియా మెదళ్లకి ఇదే మేత. పాఠకులకీ ప్రేక్షకులకీ మోగిందే మోత. 

ఎనిమిదో రోజు జరిగిందా సంఘటన. దేశాన్ని పట్టి కుదిపేసిన ఘటన.

అవినీతి, ఆర్ధికమాంద్యం, ధరవరలు, కరువుకాటకాలు, నిరుద్యోగం, అంటువ్యాధులు వంటి విషయాలు మరే దేశంలోనన్నా అంతర్యుద్ధాలకి దారితీసేంత పెద్ద కారణాలవ్వొచ్చు కానీ మనదేశంలో కావు. దైవచింతన మెండైన భారతీయాత్మకివన్నీ అల్లాటప్పా వ్యవహారాలు. మన మనసుకి పట్టేది రెండే విషయాలు. ఒకటి క్రికెట్. రెండోది సినిమా. ఆ రెండో రంగంలో ధృవతారగా వెలుగుతున్న నంబర్‌వన్ కథానాయిక నెలతప్పిందనే వార్త దేశమంతా దావానలంలా వ్యాపించటంతో మేధావుల చర్చలు అటు మళ్లాయి. ఆమెకి పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా లేక చెరొకరా; బిడ్డకి తల్లి పోలికలొస్తాయా, తండ్రివొస్తాయా లేక మరెవరివో వస్తాయా …. ఇత్యాది ముఖ్యమైన అంశాలపై మీ అభిప్రాయాలు వేంఠనే ఫలానా నంబర్‌కి ఎస్సెమ్మెస్ పంపమనే ఆసక్తికరమైన పోటీలతో నిండిపోయిన ఛానళ్లు. మీడియా కవరేజ్ పోగానే రాజకీయులు ఎక్కడివారక్కడే గప్‌చుప్. అమరవీరుడి సంగతి అందరూ మర్చిపోయారు.

బండ రెడ్డి తప్ప.

ఎలా మరచిపోగలడు? కళ్లు మూసినా తెరిచినా ఉరితాడుకు వేలాడుతున్న శీను నిర్జీవ దేహమే కనిపిస్తుంటే. నాలుక వెళ్లబెట్టి, కళ్లు బయటికి పొడుచుకొచ్చి , గాల్లో ఊగుతూ …. వారం రోజులు నిద్రకి దూరం చేసిన సన్నివేశమది. జీవితాంతం వెంటాడే భయానక దృశ్యం.

పక్క బస్సు పాసెంజర్ల మీంచి బలవంతాన దృష్టి మరల్చుకున్నాడు రెడ్డి. బస్సంతా ఓ సారి కలయజూశాడు. లోపల – గమ్యం దగ్గరౌతున్న కొద్దీ ముదురుతున్న వైరాగ్య వాతావరణం. గాలి సైతం స్థంభించినట్లుంది. ప్రయాణీకుల మధ్య నిశ్శబ్దం. దాన్ని భగ్నం చేస్తూ ఇంజన్ మోత. దానిలో కలసిపోయిన మేజర్, డ్రైవర్ల సంభాషణ.

చావు మీంచీ, శీను మీంచీ ఆలోచనల్ని మళ్లించే ఉద్దేశంతో చెవులు రిక్కించి ఆ సంభాషణ వినటానికి ప్రయత్నించాడు రెడ్డి.

వేసవి సెలవులైపోయి స్కూళ్లు తెరుచుకునే రోజుల్లో పిల్లలున్న తల్లిదండ్రుల మధ్య జరిగే సాదా సీదా సంభాషణ అది. 

“మీవాడు ఈ ఏడాది ఇంటర్‌లో కొస్తాడు కదూ. ఎక్కడ చేర్పిస్తున్నావు?”, మేజర్ ప్రశ్న. 

“గవర్నమెంట్ జూనియర్ కాలేజిలో”, డ్రైవర్ సమాధానం.

“అదేం. వాసవ్యలో చేర్పించొచ్చు కదా”, మేజర్ ఉచిత సలహా.

“చేర్పిద్దామనే ఉంది. బయటైతే క్రికెట్టనీ, ఇంకోటనీ చెడిపోతున్నాడు. వాటికి తోడు మ్యూజిక్ పిచ్చొకటి. ఇంట్లో ఉన్న కాసేపూ ఆ గిటారొకటి తగిలించుకుని ఒకటే మోత. అవన్నీ కూడు పెట్టేవా చచ్చేవా. వాసవ్యలో ఐతే బానే ఉంటది కానీ అంత ఖర్చు తట్టుకునే స్థోమత నాకేడిది? పైగా స్టూడెంట్సందరూ హాస్టల్లోనే ఉండాలనే కండిషన్. అదింకో ఖర్చు. ఒక్క సంపాదన. ఓ పక్క పెద్దల్లుడి కట్నం పీడింపులు. ఇంకో పక్క ముసలాళ్ల మందులూ మాకులూ …. “, అందాకా డ్రైవర్‌లో నిద్రాణంగా ఉన్న దిగువ మధ్యతరగతి మానవుడు అదను దొరగ్గానే దిగ్గున మేల్కొని సినిమాటిక్ కష్టాల కథకళి మొదలెట్టాడు.

“మన సారుతో ఓ మాట చెప్పిస్తే కన్సెషనిస్తారు కదా”, కథకళికడ్డొస్తూ మేజర్ డిస్కౌంట్ ఆఫర్ – అదేదో తానే ఇస్తున్న పోజుతో.

రెడ్డికి ఆసక్తిపోయింది. చూపులు బయటకి మళ్లించాడు. ప్రేతకళ ఖైదీల వాహనం ఎప్పుడు వెనకబడిందో గమనించలేదు. 

రోడ్ల మీద రద్దీ లేకపోవటంతో బస్సు వేగంగా వెళుతోంది. వేసవిగాలి ముఖాన్ని పేలుస్తోంది. రెడ్డి దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. అల్లంత దూరంలో, రోడ్డునానుకుని కేంద్రకారాగారం కనిపిస్తోంది. అంటే – గమ్యం దగ్గరపడిందన్న మాట. 

రెడ్డి మనసులో ఇంకా సంఘర్షణ , ‘తప్పించుకోటమా, తక్కిన రోజులు అక్కడే గడపటమా?’.

తేల్చుకునేలోపే బస్సు జైలు భవనాల్ని సమీపించింది. దాని వేగం తగ్గింది. రెడ్డి కళ్లు మూసుకున్నాడు.

బస్సు మెల్లిగా జైలు ప్రధానద్వారాన్ని దాటి ముందుకెళ్లి రోడ్డు దిగింది. అక్కడో పెద్ద ఆవరణ. చుట్టూ ఎత్తుగా ప్రహరీ గోడలు. వాటిపైన ముళ్ల తీగలు. గోడ మధ్యలో ఉన్న భారీ ఇనుప గేటు ముందు బస్సాపి హారన్ మోగించాడు డ్రైవర్. నిమిషం తర్వాత భారంగా తెరుచుకుందది, కిర్రుమనే శబ్దం చేస్తూ. బస్సు మెల్లిగా లోపలికెళ్లగానే మూసుకుంది. తలుపు వెనకున్న సెంట్రీ పోస్టులో వ్యక్తులు ఇద్దరు కాపలా కాస్తున్నారు. ఆ పోస్టు దాటాక కుడివైపున్న ఖాళీస్థలంలో ఆగింది బస్సు.

ఆ ఆవరణలో మూడు పొడుగాటి మూడంతస్తుల భవనాలున్నాయి. దగ్గర దగ్గరగా, గుఱ్ఱపునాడా ఆకారంలో కనిపిస్తున్నాయవి. నాడా కుడి ఎడమల ఉన్న భవనాలు చాచిన కబంధహస్తాల్లా ఉన్నాయి. వాటి చుట్టూ కొద్దిపాటి ఖాళీస్థలం. దూరంగా ఒకేలాంటి దుస్తులు ధరించిన జీవఛ్చవాల సమూహమొకటి చేతుల్లో బొచ్చెల్లాంటివి పట్టుకుని వరుసలో వెళుతోంది. ఉదయం ఎనిమిదిన్నరవుతుందిగా, ఉపాహారం కోసమేమో. వాళ్ల వెనకాలో వార్డెన్ నడుస్తున్నాడు. అక్కడ తప్ప మిగతా ఆవరణంతా నిశ్శబ్దంగా ఉంది. అంతటా యాంత్రికత. భయపెట్టేంత యాంత్రికత. 

బస్సు ఆగిన కుదుపుకి కళ్లు తెరిచాడు రెడ్డి. అప్పుడే బస్సు ముందుభాగంలో ఉన్న తలుపు కూడా తెరుచుకుంది. అందులోండి మొదట మేజర్ దిగి తలుపు పక్కనే పహరా కాస్తున్నట్లు నిలబడగా, ప్యాసెంజర్లు ఒక్కొక్కరే లేచి దిగటం మొదలు పెట్టారు. ఎదురుగా ఉన్న భవనంలోంచి ఇద్దరు వార్డెన్లు ఇటే వస్తున్నారు. 

అందరి కన్నా ఆఖర్న లేచాడు బండ రెడ్డి. సంచీనందుకుని భుజానికి తగిలించుకున్నాడు. కిందకి దిగబోతూ చివరి మెట్టుమీద ఓ క్షణం ఆగిపోయాడు. 

రెడ్ది మదిలో సంఘర్షణ సద్దుమణిగిన క్షణమది. స్వేఛ్చ గురించి మర్చిపోయి మిగిలిన ఆరేళ్లు కిక్కురుమనకుండా అక్కడే గడపాలని నిర్ణయించుకున్న క్షణం. 

నిర్ణయించుకున్నాక, రెడ్డి  మెట్టు దిగాడు.

అప్పటికే అక్కడికి చేరుకున్న వార్డెన్లు తాజా జీవఛ్ఛవాలని వరుసలో అమరుస్తున్నారు. రెడ్డి వెళ్ళి చివర్లో నిలబడ్డాడు.

మేజర్ బస్సెక్కాడు. 

డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు.

“మెట్టుపేట సబర్బన్ సీఐ బండ బసివిరెడ్డి గారబ్బాయి. సందిస్తే పారిపోతాడు, జాగ్రత్త”, వార్డెన్లకి మేజర్ అప్పగింతలు పూర్తవకముందే కదిలిందా పసుపు రంగు బస్సు.

బండ రెడ్డి గుండె నిండా గాలిపీల్చుకుని తల పైకెత్తి చూశాడు.

ఎదురుగా ఉన్న భవనమ్మీద భారీ పరిమాణంలో వెక్కిరిస్తూ కనపడిందా పేరు –

‘వాసవ్య రెసిడెన్షియల్ విద్యాసంస్థలు’

దానికిందే చిన్న అక్షరాలతో రాసుంది.’మా ప్రత్యేకత: ఆరు నుండి పన్నెండు తరగతుల వరకూ అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్ష..’

అందులో ఆఖరి అక్షరం ఎగిరిపోయింది. ఎవరి గుండె మండిన ఫలితమో.

వార్డెన్ల అదిలింపుతో వరుస కదిలింది. 

దీర్ఘంగా నిట్టూర్చి నీరసంగా ముందుకు నడక సాగించాడు పన్నెండేళ్ల బండరెడ్డి.

ఆ రోజు – వాడు ఏడో తరగతిలో అడుగుపెట్టే రోజు.