రచన: వేంపల్లె షరీఫ్

రచన‘, నవంబర్ 2014


 

చూస్తుంటే ఆ పంచాయితీ తెంచడం ఆ ఇద్దరు పెద్దమనుషుల వల్ల కూడా అయ్యేటట్టు లేదు. ఇటు చూస్తే వెంకటప్ప అటు చూస్తే సావుగొడ్లు కోసుకుని బతికే బోరేవాలా దౌలూ. నిజానికి ఆ ఇద్దరూ పెద్దమనుషులు కూడా కాదు. ఏదో కాస్త దౌలూ తోడు రమ్మంటే మొహమాటం కొద్ది వచ్చి ఇరుక్కున్నారు. దౌలూ వైపు న్యాయం ఉందన్న సంగతి వాళ్లకు అర్థమవుతోంది కానీ నోరు విప్పి ఆ మాట వెంకటప్ప ముందు చెప్పలేరు. ఇదేదో తమ గొంతుకు చుట్టుకునే వ్యవహారంలా ఉందన్న భయం కూడా వాళ్లను వెంటాడుతోంది.

ఎక్కడైనా అవకాశం దొరికితే ఒక మాట మాత్రం దౌలూ తరపున ‘కూటికి లేని పేదోడు కనికరించమని’ చెబుదామని వచ్చారు. దానివల్ల దౌలూ ముందు పెద్దరికమూ ఉంటుంది, వెంకటప్ప పట్ల వినయం ప్రదర్శించినట్టూ ఉంటుంది. ఒకవేళ అవకాశం దొరకలేదా – విషయం పెద్దది కాకుండా చూసి మెల్లగా అక్కడ్నుంచి జారుకుంటే సరిపోతుంది.

పెద్దమనుషుల తరహాలోనే ఇద్దరూ తెల్లచొక్కాలు వేసుకుని అడ్డపంచె కట్టుకున్నారు. అసలే నల్లటి నిలువు మొహాలు. దానికితోడు చాలా రోజుల నుంచి తిండి లేనట్టు అవి పీక్కుపోయి ఉన్నాయి. తను ఒక పక్కకు నున్నగా దువ్వి, గడ్డాలు గీసుకున్నారు. అదృష్టం బావుండి అంతా సవ్యంగా జరిగితే సాయంత్రం దౌలూ పోయించే సారాను మనసారా తాగొచ్చని కూడా భావించారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అంతా తిరగబడేలా ఉంది.

కాఫీ రంగులో ఉన్న పొడుగాటి జుబ్బా, ఋగు రంగులో ఉన్న గళ్లుంగీని తొడుక్కోని ఉన్నాడు దౌలూ.  అటు టవలూ కాదు ఇటు కర్చీపూ కాదు. ఒకరకమైన ఎర్రటి పూల పూల గుడ్డని మెడమీద కాలర్‌ చుట్టూ వేసుకుని ఉన్నాడు. అతనికి మనసులో మనసులేదు. ఎర్రటి అతని మొహమ్మీద నల్లగా దిగులు ముసిరింది.

ఎంత దుర్మార్గం? న్యాయాన్ని న్యాయం అని చెప్పడానిక్కూడా మనుషులకు ప్రలోభపెట్టాలి! ప్రలోభపెట్టి చెప్పించినా న్యాయం బతుకుతుందని నమ్మకం లేదు. వెంకటప్ప దౌర్జన్యానికి పోలీస్‌ స్టేషన్‌కెళ్లడమే కరెక్టని మనసులో అనిపిస్తోంది  దౌలూకు. కానీ ఖర్చు తాను భరించగడా? అదే వెంకటప్ప అయితే భరించగడు. తిమ్మిని బమ్మిని చేసి పోలీసులను తనవైపుకు తిప్పుకుని కక్షసాధింపుకు దిగితే పరిస్థితి ఏంటి? అందుకే ఇవన్నీ లేకుండా కాళ్లావేళ్లా పడి తనకు రావాల్సిందేదో రాబట్టుకుందామని వచ్చాడు.

ముగ్గురూ కలసి  కాంపౌండ్‌ గేటు దాటుకుని వెంకటప్ప ఇంటిముందుకెళ్లారు. ఇల్లు విశాంగా ఉంది. ఇంటి పక్కనే పశువుల కొట్టం ఉంది. గొడ్లన్నీ మేతకెళ్లి నట్టున్నాయి. ఒక కర్రెనుము మాత్రమే దూడతో కసి గాట్లో మేస్తోంది. దాని వైపు చూశాడు దౌలూ. అతను చూస్తున్నాడని ఎవరో చెప్పినట్టుగా అదీ తలెత్తి చూసింది. దాని కళ్లలో జాలి, కృతజ్ఞత, దిగులు, అదేదో తెలియని భాష. మేయడం మాని అదలాగే చూస్తోంది.

దౌలూ కూడా కాసేపు అలాగే చూశాడు. అతనికి కడుపులో దేవినట్టయ్యింది. టక్కున తతిప్పుకుని వచ్చినపని మీద దృష్టి పెట్టాడు. ఇంట్లో వెంకటప్ప చాలా హడావిడిగా ఉన్నట్టున్నాడు. ఎవరో తొంగి చూస్తున్నారని అర్థమై మధ్యవయసులో ఉన్న ఒకావిడ బయటికొచ్చింది. నోట్లో ఉన్న తమపాకు ఉండను బయటికి తుబుక్కున ఊసి ‘‘ఎవురు గావాల్లా?’’ అని అడిగింది.

అంతకుముందెప్పుడూ ఆమెను అక్కడ చూడలేదు దౌలూ. పనిమనిషిలా కూడా లేదు. ‘‘ఎవరై ఉంటరా?’’ అనుకున్నాడు. ఎవురైంది ఇప్పుడు తనకవసరమా? మర్యాదగా వచ్చినపని చూసుకుంటే మంచిదని మనసు హెచ్చరించింది. దీంతో సర్దుకుని  ‘‘ఎంకటప్ప గావాల్ల,’’ అన్నాడు.

‘‘సరే..కూచోండి. పూజలో ఉండాడు,’’ అని లోపలికెళ్లిందామె.

ఆమె చెప్పడమే ఆలస్యం ఏదో కాళ్లనొప్పున్నట్టు పెద్దమనుషులుగా వచ్చిన ఇద్దరూ పుసుక్కున అరుగుమీద కూలబడ్డారు. దౌలూ ఇంటిముందున్న పందిరి గుంజకు ఆనుకుని అప్పుడప్పుడు ఇంట్లోకి తొంగి చూస్తున్నాడు – వెంకటప్ప వస్తున్నాడేమో అని. ఆ ఆడమనిషి లోపలికెళ్లి పదినిమిషాలు దాటుతున్నా వెంకటప్ప మాత్రం బయటికి తెమల్లేదు. అతనొస్తే ఎలా మొదులుపెట్టాలా అనేది దౌలూ ఆలోచన.

**** 1 ****

ఆరోజు ఏ రోజే తెలియదు. ఆదివారమైతే కాదు. రాత్రి తొమ్మిది గంటలప్పుడు హడావిడిగా పక్కీరపల్లె నుంచి పిలిపించాడు దౌలూను వెంకటప్ప. ఇలాంటిదేదో ఉంటుందనే అనుమానించి వెళ్లాడు దౌలూ.

వెళ్లేసరికి పశువుల కొట్టంలో నట్టినడి మధ్యన గుడ్డిబల్బు వెలుతురులో అడ్డంగా పడుంది ఎనుము. ఇంత పెద్ద పొట్టేసుకుని ఈనలేక మూలుగుతోంది. అంతపెద్ద భారీకాయం కూడా పురిటినొప్పులకు తాళలేక మూగగా బుసులు కొడుతోంది. ఆ బుస దెబ్బకు మూతిదగ్గర నేల మీద పల్చగా రాలి ఉన్న వరిగడ్డి పొట్టు కూడా ఎగిరి అంత దూరం పడుతోంది. కొట్టమంతా పేడకల్లు గచ్చు వాసన.

ఆ వాసనొస్తే దౌలూకు మనసు ఏదోలా అవుతుంది. ఈ గొడ్లు కోసే పని మానుకుని పాడెనుము పెట్టుకోవాలని అప్పుడెప్పుడో వయసులో ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నించాడు కానీ కుదరలేదు. పెట్టుబడి పెద్దగా అవసరమయ్యే పనికావడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుని చివరికి ఓ తీరని కోరిగ్గా మిగిలిపోయాడు. ఆ బాధ అతన్ని కమ్మేసింది.

దాన్నుంచి తేరుకుని దగ్గరికెళ్లి ఎనుమును తీక్షణంగా చూశాడు కదా… వెంటనే అర్థమైపోయింది దౌలూకు – అది కొనూపిర్లో ఉందని, తెల్లారే వరకైనా బతకడం కష్టమని; చచ్చాక ఉచితంగా మాదిగోళ్లకివ్వడం కన్నా గొందిలో కొంత ప్రాణం ఉండగానే తనకిచ్చి ఎంతో కొంత రాబట్టుకోవానే ఆత్రంలో వెంకటప్ప ఉన్నాడని.

‘‘కడుపులో దూడ అడ్డంగా తిరిగిందిబ్బీ.. రెండు దినాల నుంచి ఈన్తాదని సూపెట్టుకోనుండాం. తిండి లా… నీళ్లు లా..ఇట్టనే పడి మూలుగుతాంది. పసువు డాట్టరొచ్చి సూదులేసి జూసినాడు. ‘కస్టమన్నా, కడపులో దూడ సచ్చిపోయిండాది. ఎనుము గుడక బతకదు’ అని సెప్పేసి పోయినాడు. బాగా బతికిన ఎనుముబ్బీ ఇది. ఇదిగో ఈడుండేటివన్నీ దాని బిడ్డలే,’’అన్నాడు వెంకటప్ప బాధగా.

ఎనుము స్థితి చూసి కదిలిపోయాడు దౌలూ. కడుపుతో ఉన్నదాన్ని కోసి, మాంసం చేసి, భాగలేసి, అమ్ముకుని సొమ్ముచేసుకోవాంటే అతనికి మనసొప్పలేదు.

‘‘వొద్దులేన్నా. కడుపుతో ఉన్నదాన్ని ఎందుక్కొయా. దాన్ని సూచ్చాంటే బాదయి తాండాది. ఇంగెవరికైనా ఇచ్చుకోన్నా..’’ అనేశాడు.

వెంకటప్పకు కాలింది.

‘‘ఊరందరితోపడుకునే సాని … పనోని దగ్గరికొచ్చేసరికి నేను సస్వరినీ అనిందట. అట్టుంది నీ యవ్వారం. కసాయి నా కొడుకువు నీకు బాదేంది వోయ్‌… మాట్లాడిరది సాలు గానీ, మూస్కోని… ఎంతోకొంత ఇచ్చేసి పట్టకపో,’’ అన్నాడు విసురుగా.

దౌలూ మనసు చివుక్కుమంది.

‘‘ఇది బావుండాదే. నేను కొనాల్నో వద్దో గూడ నీవే సెప్పేస్తాండావే. నాకొద్దన్నా ఈ ఎనుము. ఏం… ఈ పొద్దుటి దాంక నీకు పాలిచ్చిండ్లా ఈ బరిగొడ్డు. ఇబ్బుడే కదన్నా సెబ్తివి ఇయన్నీ దాని బిడ్డలే అని. నీ కాపురం పైకొచ్చేదానికి కారణం ఈ ఎనుమే అయినప్పుడు దాన్ని గుడక ఒక అమ్మ మాదిరి అనుకుని సచ్చిపోయేంతవరకు  జూస్కోవచ్చు కదా. సచ్చినాంక తీస్కపోయి యాడన్న బూడ్సొస్తే ఎంత పున్నెం వొస్తాది? యాన్నా… ఇట్టాంటప్పుడు గుడక కక్కుర్తి పడతావ్‌?’’

మొహం మీద కొట్టినట్టు అన్నాడు దౌలూ.

నోటిదాక వచ్చిన బేరం వెనక్కి వెళ్లేటట్టుందే అని కంగారు పడ్డాడు వెంకటప్ప. ఎందుకైనా మంచిదని కొంత గొంతు తగ్గించాడు.

‘‘గొడ్డుసీలు కొట్టుకుని బతికే నాకొడుకువు నువ్వు కూడా నాకు నీతులు సెప్పబడ్తివే. ఏదోలే పేదోనివి … కోసుకుని నాలుగు రూపాయలు సంపాయించుకుంటావు గదా అని పిల్లంపడం గూడా తప్పయిపోయిండాదే,’’ అన్నాడు నిష్ఠూరంగా.

‘‘నువ్వట్టంటే బావుండేదన్నా. ‘కసాయివోనికి నీకు బాదేందిరా’ అన్నావు సూడు ఆడ్నే నాకు బాదయిండాది. పని కసాయిదైనా మనసు మాత్రం మనిషిదే కదన్నా’’ అన్నాడు దౌలూ.

‘‘సర్లేవోయ్‌. మాటలు నేర్సినావ్‌. ఎంతిస్తావో సూడు ముందు,’’ అన్నాడు అసలు విషయానికొస్తూ వెంకటప్ప.

‘‘తొమ్మిది నూర్లు ఇస్తా సూడప్పా. అది తెల్లారేదాంకైనా బతకతాదో లేదో తెలీదు. సాయిబూని.. నీకు తెలుసు.సచ్చినదాన్ని కొయ్యను. సచ్చిందనుకో తొమ్మిది నూర్లు నట్టం అనుకుంటా. లేకంటే నీ పేరు సెప్పుకుని నాలుగు రూపాయలు సంపాయించుకుంటా. సరేనా?’’

‘‘మల్లా అంత అన్యాయమా దౌలూ. పదహైదు నూర్లు ఇచ్చి కొండకపో…’’

‘‘అన్నన్నా… అంత మాటనగాకు. నాక్కూడా ఓ పిల్లోడున్నాడు. అపద్దం చెప్పను. కడుపులో సచ్చిన దూడ, గలీజు – అంతా పోంగా మాంసానికి కూడా అంత రాదు. పదినూర్లు ఇస్తాపోన్నా…’’

‘‘అట్టకాదు కానీ… లాస్టుగా ఒక మాట సెప్తా విను. పన్నెండు నూర్లకు తెంపు…’’ అనేసి భుజమ్మీద టవల్‌ తీసి విదిలించి మళ్లీ భుజమ్మీదే వేసుకున్నాడు పెదరాయుడి మాదిరి వెంకటప్ప.

ఏం జేయాలో తెలీక, ‘‘సరేన్నా ఇచ్చాగానీ ఎనుమును ఇంటిదాంక తీసుకుపోవాల కదా. నీ ఎద్దలబండి రోంత సాయం చెయ్యల్లా,’’ అన్నాడు దౌలూ బతిమాుతున్నట్టుగా.

‘‘బాడిగిస్తానంటే ఎందుకు సెయ్యను? అగ్గవగా ఎనుమును కొంటాండేది కాకండా మల్లా ఇదొక్కటా నాకు సమురు,’’ వెంటనే గొంతు మార్చి కఠినంగా అన్నాడు వెంకటప్ప.

ఇతన్ని అడగడం తనదే తప్పనుకుని, ‘‘సర్లేప్పా. నూర్రూపాయలు బాడిగ గుడక ఇస్తా కానీ – నీ దగ్గరుండే మనిషిని రోంతబండికట్టమని సెప్పు. యీడ్నే నడిరేత్రి అయిపోయేలా వుండాది,’’ అన్నాడు దౌలూ.

మూణ్నిమిషాల్లో బండి రెడీ అయిపోయింది. వెంకటప్ప దగ్గర పనిచేసే సేద్యగాడు గంగన్న బండికట్టుకోనొచ్చి పశువుల కొట్టంలో నిబెట్టాడు. వీధిలోకెళ్లి గంగన్న ఓ ఐదారుగురు మనుషుల్ని బతిమాలి వెంటతీసుకొచ్చాడు. అంతా కలసి తలా ఓ చెయ్యి వేసి దాదాపు ఒక గంట పాటు కష్టపడి ఎలాగోలాగ ఎనుమును బండికెక్కించారు. టవల్‌తో చమట తుడుచుకుంటూ వెళ్లి గంగన్న బండి నొగల మీద కూర్చున్నాడు.

దౌలూ గబగబా చొక్కా వెనక జేబులోంచి డబ్బు తీసి పన్నెండు నూర్లు ఎనుము డబ్బు, నూర్రూపాయలు బండి బాడుగ అంతా కలిపి పదమూడు నూర్లు వెంకటప్ప చేతిలో పెట్టాడు. అతను నోట్లు లెక్కపెట్టుకున్నంతవరకు ఉండి ‘‘పోయెచ్చాప్పా’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బండెక్కాడు.

**** 2 ****

బండి దౌలూ ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి దాటింది. దౌలూ బండి దిగి వెళ్లి గుడిసె తలుపు తీసి, దాని వెనకాలున్న అతుకు వైరును జాగ్రత్తగా ముట్టుకుని స్విచ్చు వేశాడు. గుడ్డి బల్బు వెలిగింది. వసార్లోకొచ్చి మంచమ్మీద పడుకోనున్న తన పదేళ్ల కొడుకు మదారును నిద్రలేపాడు.

దౌలూకు ఉన్న ఏకైక బంధం మదారు. వీణ్ని కని వాళ్లమ్మ చనిపోతే చిన్నప్పటి నుంచి అన్నీ తానే అయి పెంచాడు. చదువు సంధ్య ఏమీ చెప్పించకుండా తనతోపాటే ఈ గొడ్లు కోసే పనికి తిప్పుకుంటున్నాడు.

మదారు లేచి తండ్రి వెంటే వచ్చి  కళ్లు నులుపుకుంటూ బండి దగ్గర నిబడ్డాడు. ఆ గుడ్డివెల్తురులోనే దౌలూ బండెక్కి ఎనుము కాళ్లకు కట్టేసిన మోకు విప్పాడు. ఆపక్క ఈ పక్క నాట్లకు కట్టిన తాళ్లను కూడా తప్పించాడు. తర్వాత బండి దిగి గంగన్నతో కసి ముందుకెళ్లి ఎద్దుల్ని విప్పి, బండిని అట్లే కొంచెంకొంచెంగా పైకి ఎత్తాడు. ఎనుము మెల్లగా బండ్లోంచి జారుకుంటూ వచ్చి చివరికొచ్చేసరికి పట్టుతప్పి దభీమని కింద పడిరది. అలా పడ్డప్పుడు కడుపులో ఎక్కడ తగిలిందో కానీ అది ‘‘అంబా’’ అంటూ ఒక్క అరుపు అరిచింది. అది విని దౌలూ గుండెలో ఎక్కడో కులుక్కుమనింది.

తన సర్వీసులో ఎన్నో బక్క గొడ్లను కోశాడు దౌలూ. కానీ కడుపుతో ఉన్న దాన్ని కోయలేదు. అందుకే ఏదో తెలీని చింతన అతన్ని తొలిచేస్తోంది. ఈ బాధ నుంచి తనకు, ఎనుముకు విముక్తి కలగాలంటే వీలైనంత త్వరగా హజ్రత్‌ని పిల్చుకొచ్చి దాన్ని జుహా చేయించడం ఒక్కటే మార్గం అనుకున్నాడు.

ఊళ్లో మసీదులో ఉండే హజ్రత్‌ చాలా మంచోడు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు మసీదు ముందుకెళ్లినా పలుకుతాడు. నవ్వుతూ వెంటవస్తాడు. గొడ్డును జుహా చేసినందుకు ప్రతిగా ఏమిచ్చినా పుచ్చుకోడు. మనిషికి మనిషి కృతజ్ఞత ఉండకూడదంటాడు. అందరూ ఆ అల్లాకు కృతజ్ఞతగా ఉండాంటాడు. వారంవారం నమాజుకు రమ్మని పోరుతాడు. ఇతను సరే అంటాడు కానీ పనుల్లోపడి వెళ్లడు. అతను పిలవడం మానడు. అందుకే హజ్రత్‌ గుర్తుకొచ్చినప్పుడల్లా దౌలూ కొంచెం ఇబ్బందికి గురవుతాడు. అయినా తప్పదు. అతన్ని పిలవాలి. పివకపోతే గొడ్డును జుహా చేసేది ఎవరు?

చీకిచెట్టు కింద చీకట్లో బడబడమంటూ బండి కదిలిన చప్పుడైంది. ఆలోచన నుంచి తేరుకుని అటువైపు చూశాడు దౌలూ. గంగన్న ఎప్పుడు బండికట్టుకున్నాడో కట్టుకుని ఎద్దుల్ని తిప్పుకుని తుర్రుమంటున్నాడు. కనీసం ‘‘వెళ్లొస్తా’’ అనికూడా చెప్పకుండా వెళ్లిపోతున్న అతని వాలకం ఆశ్చర్యాన్ని కలిగించింది. గట్టిగా కేకేసి వెనక్కి పిలుద్దామనుకున్నాడు కానీ మళ్లీ అంతలోకే ‘‘అతనికెంత పనుందోలే. అసలే నడిరేత్రి గుడక ఐపోయిండాది,’’ అనుకుని ఊరుకుండి పోయాడు.

కానీ ఎలా? ఎనుమును జుహా చేయాంటే కనీసం నలుగురు మనుషులైనా కావాలి.‘‘ఈ రాత్రప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టే పనిలేకుండా గంగన్న తోడుంటాడులే,’’ అనుకుంటే అతనూ వెళ్లిపోయాడు.

‘‘మరి ఇంకెవర్ని పివాలి?’’ ఆలోచనలో పడ్డాడు దౌలూ. అంతలోనే మదర్సా పిల్లోళ్లు గుర్త్తొచ్చి ధైర్యం తెచ్చుకున్నాడు.

‘‘మసీదు దగ్గరికెళ్లినప్పుడు హజ్రత్‌తో పాటు మరో ఇద్దరు మదర్సా పిల్లోళ్లను కూడా వెంట తెచ్చుకుంటే సరిపోతుంది,’’ అనుకున్నాడు. కొడుకువైపు చూశాడు.

నిద్రముఖంతో తల గోక్కుంటూ నిబడి ఉన్నాడు మదారు.

‘‘ఒరేయ్‌, మదారా… నువ్వు పొద్దన్నే మబ్బుతోనే అందరిండ్లకాడికి బోయి యాట వుండాదని జెప్పేసిరావాల.’’

‘‘సరే,’’ అన్నాడు మదారు.

ఇది అతనికి అవాటే.

ఆదివారం రోజు కోసే యాటకైతే ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. వాడిక ఉన్నవాళ్లే స్వయంగా వచ్చి మాంసం తీసుకెళ్తారు. ఇలా అర్జంటుగా కోయాల్సివచ్చినప్పుడు మాత్రం ఇంటింటికెళ్లి చెప్పేసి రావాల. లేకపోతే తెలీక చాలామంది మాంసానికి రారు. అలా రాకపోతే నష్టమొస్తుంది. నష్టానికి తోడు కష్టమొస్తుంది. అవును. మిగిలిపోయిన మాంసాన్నంతా కేజీ, అరకేజీల్లెక్కన కాగితాల్లో చుట్టి, పొట్లాలు కట్టి ఒక డబ్బాలో పెట్టుకుని పక్కీరపల్లెతో పాటు మాదిగిళ్లన్నీ తిరిగి స్వయంగా అమ్ముకుని రావాలి అబ్బా కొడుకులిద్దరూ. అలా అమ్ముకుని రావడానికి వెళ్తున్నప్పుడు కొందరు హిందువులతోపాటు గొడ్డుమాంసం తినని తోటి సాయిబూలు కూడా తక్కువగా చూస్తారు. దాన్ని తట్టుకోవాలి.

ఒకసారి ఇలాగే జరిగింది. సైకిల్‌ మీద మాంసం డబ్బా పెట్టుకుని మాదిగిళ్లలో తిరుగుతున్న దౌలూను మటన్‌ కొట్టే కరీంసాబ్‌ అడ్డుకున్నాడు.

‘‘మీ బోరేవాళ్లు జేచ్చాండే పనికి మా అట్టాంటోళ్లకు కూడా సెడ్డపేరు వొచ్చాండాదయ్యా. మీకేం గొడ్లను కోచ్చారు. తింటారు. మల్లా అమ్ముతారు. ఎప్పుడన్నా కర్మగాలి ఇట్టా ఎదురయ్యి మీతో కనబడినామే అనుకో, ఇంగ మేము కూడా తింటాండామన్నట్టే లెక్క. మేము తినం అని ఎంతసెప్పినా ఎవరూ నమ్మడం ల్యా. ఆకరికి మాఇండ్లల్లో ఆడపిల్లోళ్లకు సమ్మందాలు గుడక రావడం లేదనుకో … ’’ ముఖం నవ్వుతూనే ఉంది కానీ కరీంసాబ్‌ గొంతులో మాత్రం కఠినత్వం దొర్లింది.

ఎంచెప్పాలో కాసేపు  అర్థం కాలేదు దౌలూకు.

‘‘ఇది గడక ఒకందుకు మంచిదే గదన్నా. ఇప్పుటికైనా మీకు రోంతైనా అర్తమయ్యింటాది. ఒక తిక్కు హిందువు తక్కవగా జూచ్చా మరో తిక్కు సాయిబూలు అయ్యుండి గుడక మీరూ తక్కవగా జూచ్చా … మేమెంత ఇబ్బంది పడతాండామో,’’ అన్నాడు దౌూ

‘‘సాల్లే బ్బా. బో సెప్తాండావ్‌. మీరంటే తింటాండారు కావట్టి పడాలా.  మేమెందుకు పడాల్నో సెప్పు? మీరు జేచ్చాండే పనికి అందరి ముందు మేము సిన్నతనం అయితాండాం. అడిగినోళ్లందరికీ సెప్పుకోలేక సచ్చాండాం. ఎవురిదెక్కువ బాదో నువ్వే జెప్పు?’’ లాజిగ్‌గా అడిగాడు కరీంసాబ్‌.

కోపమొచ్చింది దౌలూకు.

‘‘ఔనబ్బా. మేము గొడ్డుసీలు తింటాం. అయితే ఏందంట తప్పు? బుద్దిపుడితే మీరు గుడక తినండి. లేదంటారా, ఎనకాముందూ మూస్కొని ఉండండి. తినొద్దని సెప్పడానికి మీరెవురు? మీకింకో సంగతి తెల్సునా? హైదరాబాద్‌లోనంటా, గొడ్డు సీలు తిననోళ్లను సాయిబూల కింద గూడా లెక్కగట్టరంట. మల్ల వోల్లకు మీరేం జెబుతారన్నా జెవాబు. బుద్దిని బట్టి యాలీసన్‌ (విలువ)గానీ తినే తిండిని బట్టి ఉంటాదా యాలీసన్‌?’’

అంతే. కిమ్మనలేదు కరీంసాబ్‌. చిరాగ్గా మొహం పెట్టి మనసులోనే ఏదో గొనుక్కుంటూ వెళ్లిపోయాడు. వెళ్లిపోవడమేకాదు ఆ పొద్దుట్నుంచి అతనితో అస్సలు మాటల్లేవు. ఇలా ఎంతమందితో అని చెడ్డ కావాలి. అసలు ఎందుకొచ్చిన గోల ఇదంతా. దీనంతటికి కారణం మాంసం అమ్ముడుపోకపోవడం ఒక్కటే కదా. అందుకే ముందు జాగ్రత్తగా ఇంటింటికెళ్లి యాట ఉన్న సంగతి చెప్పేసొస్తే పోలా. అందుకే గత కొంత కాలంగా ఈ పని కొడుక్కి పురమాయిస్తూ  వస్తున్నాడు దౌలూ.

తండ్రి మాటకు ఊకొట్టిన మదారు ఆవులించుకుంటూ వెళ్లి ఇంట్లోంచి ఇంత వరిగెడ్డి తెచ్చి ఎనుము మూతి దగ్గర వేశాడు. అది పట్టించుకునే స్థితిలో లేదు. అప్పుడు చూశాడు నిశితంగా ఆ గుడ్డి బల్బు వెల్తురులోనే ఎనుము వైపు మదారు. నోట్లోంచి నురుగు వస్తోంది. పెద్దగా గసబోతోంది. భారంగా కనురెప్పలు మూస్తూ తెరుస్తోంది.

‘‘ఇది పొద్దటిదాంక గూడ బతికేటట్టు లేదు గదా నాయన,’’ అంటూ అరిచాడు గాభరాపడి.

‘‘అందుకే గదరా ఎంకటప్ప మనకంటగట్టినాడు,’’ అన్నాడు దౌలూ తాపీగా.

‘‘ఎంకటప్ప అన్నీ ఇలాంటియే మనకు అంటగడతాండాడు గదా నాయనా. మరెట్టా?’’ అన్నాడు మదారు చింతిస్తూ.

‘‘ఎట్టంటే ఏముండాదిరా తిక్కలోడా. దాన్ని ఇప్పుడే కోసేయాల. నేనిప్పుడే మసీదు కాడికి పోయి హజ్రత్‌ను, మదర్సా పిల్లోళ్లను తొడక్కొచ్చా. అంతలోకే నువ్వుబోయి బోరింగ్‌ కాణ్నించి రోన్ని నీళ్లు తెచ్చి తొట్లోపోయ్‌పో,’’ అన్నాడు దౌలూ.

మదారుకు నిద్రమబ్బు వదిలింది. ఇంట్లోకెళ్లి అంచు విరిగిపోయిన ఆకుపచ్చ బిందెను తెచ్చుకుని చీకట్లో బోరింగును వెతుక్కుంటూ బయల్దేరి వెళ్లాడు.

ఇటు దౌలూ – ఎనుము కోతక్కావాల్సిన పనుల్లో పడ్డాడు. గూట్లోంటి కత్తులు తీశాడు. అన్నిటినీ కింద పెట్టి జుహా చేసే కత్తిని మాత్రం చేతిలోకి తీసుకున్నాడు. దాని మీద చెంబుతో కొన్నినీళ్లు పోసి పక్కనే ఉన్న నున్నటి రాయిపై బర్‌బర్‌మని రుద్ది సాన పెట్టాడు. కాసేపటి తర్వాత ఆ కత్తిని కూడా అక్కడే పడేసి హజ్రత్‌ని పిల్చుకొద్దామని బయటికొచ్చి మసీదువైపు వెళ్తూ మసక వెల్తురులోనే చీకిచెట్టు కిందికి చూశాడు కదా… చూస్తే ఏముంది!!

ఎనుము ఈనుతోంది. ప్రాణం ముక్కలు చేసుకుని మూలుగుతోంది. నేల మీద పడుకుంది పడుకున్నట్టే ఉండి, మరోపక్క తోక ఎత్తి ముక్కుతోంది. ఇందాక బండిలో అదుర్లకు పాపం దాని కడుపులో దూడ ఎన్ని మెలికలు తిరిగిందో కానీ – చివరికి పోయిందనుకున్న ప్రాణాన్ని తిరిగి పోసుకుని వెచ్చగా తల్లి కడుపులోంచి దారి వెతుక్కుంటూ కొద్ది కొద్దిగా బయటికొస్తోంది. ఆ దృశ్యం చూడగానే దౌలూ ఒళ్లంతా జదరించింది. కళ్లలో నీళ్లు నిండాయి. ఆనందం పట్టలేకపోయాడు.

‘‘ఒరేయ్‌… మదారా… ఇట్టరా…’’ అంటూ అరిచాడు.

అప్పటికే నిండు బిందెతో ఇంటిముందుదాక వచ్చిన మదారు ఉలిక్కిపడ్డాడు. నిల్చున్నచోటే నిల్చున్నట్టుగా భుజమ్మీదున్న నీళ్ల బిందెను నేల మీదికి దింపేశాడు.

‘‘ఏమైండాది నాయనా అట్ట అర్సినావ్‌!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

‘‘అట్ట జూడ్రా… ఎనుముకల్లా’’ అన్నాడు దౌలూ.

చూశాడు మదారు. అతని కళ్లలో కూడా ఆనందం.

‘‘ఆ దేవుడే ఇట్ట ఆ ఎనుము తల్లిని, దూడని మనింటికి పంపినాడు నాయనా,’’ అన్నాడు తండ్రితో.

‘‘అవున్రా. ఆ అల్లాకు..లాఖ్‌ లాఖ్‌….షుకూర్‌. కడుపులో సచ్చిందనుకున్న దూడ బతకడం ఏంది? సచ్చాదనుకున్న ఎనుము మనింటిదాంక వచ్చి ఈనడమేంది? యా మేరే పీర్‌… ఎనుముకు ఈత సక్కంగా అయ్యేటట్టు సూడు సామీ,’’ అని మనసులోనే మొక్కుకున్నాడు దౌలూ.

అతని మొక్కు ఫలించింది. అబ్బా కొడుకు అలా చూస్తుండగానే తల్లి కడుపుని చీల్చుకుని దూడ నేల మీద పడింది. దానెంటే ఉమ్మనీరు, మాయి అంతా కలగలసిపోయి కిందపడి నేలంతా చిత్తడిగా తయారైంది. దూడ నేల మీద పడగానే బిడ్డను చూసుకోవాని తల్లిగుండె తల్లడిల్లింది. లేని శక్తి తెచ్చుకుంటూ ముందరి కాళ్లతో ముందుకు వంగి లేవబోయి అట్టే కూలబడింది ఎనుము. ‘‘అర్రే’’ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి దూడను పక్కకు లాగి తీసుకెళ్లి తల్లి మూతి దగ్గర వదిలాడు దౌలూ. తల్లి ప్రాణం నిమ్మలించింది. కూర్చోనే కడుపారా దూడను నాకడం మొదలుపెట్టింది. దాని ఒంటిమీద జిగట క్రమంగా ఆరిపోతోంది. ఆది ఆరేకొద్ది దూడ కొత్త శక్తిని సంతరించుకుని అటూ ఇటూ చూస్తోంది. ఆ దృశ్యాన్నే చూస్తూ రాత్రంతా ఆనందంగా గడిపారు తండ్రీ కొడుకు.

**** 3 ****

తెల్లారింది. చీకిచెట్టు  కింద ఎనుము లేచి నిలబడింది. దూడ, తల్లి పొదుగు చుట్టే తిరుగుతోంది. వెనక్కాళ్లలో బలం లేకపోయినా పడుతూ లేస్తోంది. దాన్నలా చూస్తుంటే మదారుకు ముచ్చటేసింది. వెళ్లి అమాంతంగా గుండెకు అదుముకుని నుదుటి మీద ముద్దుపెట్టాడు.

‘‘షున్ను మున్నా’’ అన్నాడు.

అదే దాని ముద్దు పేరైంది.

తండ్రి కోసం చూశాడు.

చీకిచెట్టు అవతల అప్పుడప్పుడే వెచ్చగా పడుతున్న ఎండలో కొంచెం ఎత్తయిన ఎర్రటి రాయి మీద కూర్చుని పడమటివైపుకు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు దౌలూ. మనసు బాగలేనప్పుడు అతను అలాగే కూర్చుంటాడు.

‘‘ఏమైండాది నాయనా?’’ అంటూ అడిగాడు దగ్గరికెళ్లి మదారు.

‘‘ఏమైనా ఏమైతాదిరా. ఏం ల్యా. ఇబ్బుడు ఈ ఎనుము మన్దా … ఎంకటప్పదా? అర్తం గావడంలా,’’ అన్నాడు దౌలూ.

మదారుకు గుండెల్లో గుభేలుమంది.

‘‘అదేంది నాయనా, అట్ట మాట్టాడతావ్‌. మనింటిదగ్గర ఈనింది మన్ది కాకండా ఊళ్లోళ్లది అయితాదా యాడన్నా,’’ అన్నాడు.

‘‘నిజెమేరా.కానీ ఎనుము సచ్చాదనుకుని మనకంటగట్టినాడు ఎంకటప్ప. అది బతికిపాలిచ్చాండాదని తెలిచ్చే ఊరుకుంటాడా. కాంతూలం ఉంటాది గదరా ఎవురికైనా’’ అన్నాడు దౌలూ.

‘‘అదేంది నాయనా! అబ్బుడే మర్సిపోయిండావా? అది ఆయప్ప సెప్పిన నాయెమే  గదా,’’ అన్నాడు మదారు.

అవును. అది వెంకటప్ప చెప్పిన న్యాయమే. వెంకటప్పకు చాలా పాడిపశులున్నాయి. ఆ చుట్టుపక్కల్నే చాలా పలుకుబడి కూడా ఉండాది. ఎప్పుడు ఏ గొడ్డుకు ప్రాణం మీదికొచ్చినా మొదట పిలిచి అమ్మేది దౌలూకే. ఇంతకు ముందర కూడా ఒక బక్కెద్దును ఇలాగే వెంకటప్ప దగ్గర కొన్నాడు దౌలూ. కానీ బండ్లో వేసుకుని ఇంటికి తెచ్చుకునే లోపలే అది చచ్చిపోయింది. ఆ విషయం వెంటనే మళ్లీ వెళ్లి వెంకటప్పకు మొరపెట్టుకున్నాడు.

‘‘సూడన్నా. ఎంత అన్యాలం జరిగిపోయిండాదో. నీ తాన కొని ఇంకా అర్తగంట గుడక కాల్యా. అబ్బుడే బక్కెద్దు సచ్చిపోయిండాది. ఇంగా ఇంటి దాంక గుడక ఎస్కపోలేదు సామీ. దార్లోనే సచ్చిపోయి నా పానం మిందికి తెచ్చిండాది. ఇబ్బుడు ఈ ఎద్దు ఇట్టా సచ్చిపోతే నేనేం కోయా. ఏం తినా. పేదోన్ని. దెయ సూపి  నేనిచ్చిన లెక్క నాకు ఎనిక్కి ఇచ్చెయ్యి సామి,’’ అని బతిమాలుకున్నాడు.

దానికి వెంకటప్ప ఇంతెత్తు లేచాడు.

‘‘యానాకొడుకురా… నీకు యాపారం నేర్పిండేది. బావుంటే కోసుకుని కుప్పలేసుకుని అమ్ముకుని లెక్కజేసుకుని తింటావ్‌. ఇట్టా సచ్చి నట్టమొస్తే ఆసామి మింద ఏచ్చావా? లెక్క ఎనిక్కి ఇచ్చేది ల్యా.. ఏంల్యా. పో.. ఈణ్నించి మట్టంగా. ఒకపారి కొనుక్కున్నాక నట్టమొచ్చినా లాబమొచ్చినా నీకే సమ్మందం వాయ్‌,’’ అంటూ గదురుకున్నాడు.

కరెక్టే కదా. మరదే న్యాయం కదా ఇప్పుడుకూడా. ఒకసారి కొనుక్కున్నాక అది సచ్చినా, బతికినా, ఈనినా తనకే కదా సంబంధం.

అందుకే కొడుకు మాటకు ఉలకలేదు, పలకలేదు దౌలూ.  ఆలోచించుకుంటూనే వెళ్లి వేడివేడిగా నీళ్లు కాచి ఎనుముకు పోశాడు. వరి చెత్తతో ఒళ్లంతా రుద్ది శుభ్రం చేశాడు. వేపాకు, సాంబ్రాణి పొగ పట్టాడు. దూడకు గిట్టెలు గిల్లాడు. మాయను కుక్కు తినకూడదని దూరంగా తీసుకెళ్లి పూడ్చి వచ్చాడు.

పాడెనుముకు ఎలా సపర్యు చేయాలో దౌలూ కొంత తెలుసు. ఎప్పటికైనా పాడెనుము పెట్టుకోవాలనే కోరికతో వీలున్నప్పుడల్లా వాటిని గురించి రైతును అడిగి తెలుసుకునే వాడు. ఇప్పుడా జ్ఞానం కొంత ఉపయోగపడింది.

వేడివేడిగా నీళ్లు పడేసరికి ఎనుముకు ప్రాణం లేసొచ్చింది. మాంచి కళగా తయారైంది. గబగబా దొడ్డెనక ఉన్న ఇంత వరిచెత్త తెచ్చి దాని ముందేశాడు. అది మెల్లగా మేయడం మొదలుపెట్టింది. అది మేస్తుంటే చూసి దౌలూకు కడుపు నిండిపోయింది.

మరో రోజు గడిచింది.

ఆ రోజు మధ్యాహ్నం దౌలూ టవునుకెళ్లేసొస్తానని ఇంటి నుంచి బయల్దేరి వెళ్లాడు. ఎనుమును, దూడను జాగ్రత్తగా చూస్తుండమని కొడుక్కి చెప్పాడు. దూడను పాలు తాగకుండా అడ్డుకోవద్దని సూచించాడు.

ఈ లోపు విషయం ఎలా తెలిసిందో వెంకటప్పకు తెలిసింది. తన దగ్గర కోసుకోవడానికని తీసుకెళ్లిన ఎనుము ఈనితే ఒక్కమాట కూడా చెప్పకుండా దాన్ని తనతోనే ఉంచుకున్నందుకు దౌలూ మీద వెంకటప్ప ఆగ్రహం ఆకాశాన్ని తాకింది. వెంటనే మనుషుల్ని పంపించి ఇంటి దగ్గరున్న పిల్లోడు మదారును బెదిరించి ఎనుమును, దూడను అప్పటికప్పుడు తనింటికి తోలించేసుకున్నాడు. దీంతో కడుపులో అగ్గిపడింది దౌలూకు. కనీసం అతని పదమూడు నూర్లు డబ్బు కూడా అతనికి వెనక్కి ఇవ్వలేదు. కానీ పేదవాని కోపం పెదవికి చేటన్న సంగతి గుర్తొచ్చి విషయాన్ని వీలైనంత శాంతంగానే త్చేుకుందామనుకున్నాడు దౌలూ. అందులోభాగంగానే తనకు మద్దతుగా మరో ఇద్దర్ని బతిమాులుకుని వెంటేసుకుని వచ్చాడు.

**** 4 ****

ఎప్పుడొచ్చినాడో వెంకటప్ప దౌలూ ఆలోచనల్లో ఉండగానే ఉరుముకుంటూ ఇంట్లోనుంచి బయటికొచ్చాడు.

‘‘ఏంరా… దొంగనాకొడకా… ముప్పయివేల ఎనుమును తిరిపానికి తినేద్దామనుకున్నావు గదా వాయ్‌. మల్లొచ్చినావ్‌ బయం లేకండా?’’ అంటూ పందిరిగుంజకు ఆనుకుని ఉన్న దౌలూను అట్టే గుండెమీద ఎగిచ్చి తన్నాడు.

అంత పెద్ద పందిరి కూడా ఒక క్షణం అలా కదిలిపోయింది. ఎక్కడ తగిలిందో కానీ ఎదురొమ్మును అట్టే పట్టుకుని కూబడ్డాడు దౌలూ.

బిత్తరపోయారు పెద్దమనుషులుగా వచ్చిన ఆ ఇద్దరూ. అరుగు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి దౌలూను పట్టుకున్నారు. వాళ్ల సహాయంతో దౌలూ మెల్లగా లేచి నిబడ్డాడు.

‘‘నేనేం తప్పు జేసినానో చెప్పి కొట్టు సామీ,’’ అంటూ రెండు చేతులు జోడించాడు.

‘‘ఏమి జేసినావా? ఇంతకన్నా ఏం జేయాలని ఉండావ్‌ వాయ్‌. నేను కనుక్కోక పోయింటే ఆ ఎనుమును వుత్తపున్నేనికి తినేసేనాకొడుకువే గదా,’’ వగరుస్తూ అన్నాడు వెంకటప్ప.

అప్పుడు చూశాడు నిశితంగా వెంకటప్ప వైపు దౌలూ.

అతను నల్లగా ఏనుగు మాదిరి బలిసి ఉన్నాడు. పైగా ఒట్టి పయ్యిన ఉన్నాడు. నడుముకు కట్టిన తెల్లపంచెను అలాగే కిందికి వదిలేశాడు. అప్పుడే పూజ పూర్తయిన సూచికగా నుదుటిమీద నిలువునా కుంకుమ బొట్టు  పెట్టాడు. రెండు చేతుల మణికట్లకు పెద్దపెద్ద వెండికకడియాలున్నాయి. వేళ్లకు రెండ్రెండు ఉంగరాలున్నాయి. మెళ్లో పులిగోరు మెరుస్తోంది.

‘‘నేనట్టాంటి దొంగనాకొడుకునే అయింటే రేతిరికి రేతిరే దాన్ని నరమానవునికి గుడక తెలీకండా ఏ సంతకో తోలి లెక్క జేసుకుండేటోణ్ని. నాయెం అనేది గుడక ఒగటి ఉండాది గావట్టే నేను బయపడకండా దైర్నంగా ఉండా. అబ్బుడే మర్సిపోయినావా సామీ? అంతకు ముందు ఒకపారి నీ తాన కొనుకున్న ఎద్దు సచ్చిపోయిండాదని వొచ్చి మొత్తుకుంటే నువ్వేమన్న్యావో. ఒకతూరి కొన్న్యాక అది సచ్చినా బతికినా కొన్నోనిదే అయితాది గానీ ఆసామిదైతాదా అని గదా అన్న్యావ్‌. మల్లదే నాయెం గదా సామీ ఇబ్బుడు గుడక. అట్టాంటప్పుడు ఎనుము ఈనిండే సంగతి నీకెందుకు జెప్పాల?’’

వెంకటప్ప కొట్టిన దెబ్బతాలూకు బాధ రగుతుంటే గట్టిగానే అడిగాడు దౌలూ.

వెంకటప్పకు కోపం మరింత పెరిగింది.

‘‘అంటే ఏందిరా నువ్వు సెప్పేడిది. అబ్బుడ్ది, ఇబ్బుడ్ది ఒగటేనంటావా? తిప్పి తిప్పి కొడితే ఆ పొద్దు నీ లెక్క నా తాన ఎయ్యి రూపాయిు గుడక ఎల్లదు. అందుగని ఈ పొద్దు… ఈ ముప్పయివేల ఎనుమును వుత్తపున్నేనికే నీగంట కట్టమంటావా? యా నాకొడుకురా నీకు నాయెం సెప్పిండేది?’’ ` పళ్లు పటపటా కొరికాడు వెంకటప్ప.

‘‘ఈ పొద్దు నీకు ఈ ముప్పయివేల ఎనుమెంతో, ఆ పొద్దు నాకు ఆ ఎయ్యి రూపాయిుల లెక్క గుడక అంతే సామీ. యేమంటే ఆ పొద్దు నీకు ఎదురు సెప్పల్యాక ఉత్త పున్నేనికే ఎయ్యి రూపాయిులు వొదిలేసుకుని కండ్ల నీళ్లు పెట్టుకుంటా ఎల్లిపోయినా. ఆ నట్టం బూడ్సుకునేటందుకు ఎన్నెన్ని తిప్పలు పడుకున్న్యానో, ఎవురెవురి తాన ఎంత పియ్యి తిన్న్యానో నాకు తొసు..’’ అన్నాడు దౌలూ దీనంగా.

‘‘ఇంత సెప్పినాంక గుడక ఇంగా నువ్వు నా తాన అట్టా ఇట్టా మాటాడి యిగారాలు పడతాండావా? ఇబ్బుడిదాంక నిన్ను నా ముందు నిలబెట్టి మాటాడించినాను జూడు అది నాదే తప్పు. ఇంగో మాట గూడా మాటాడకండా ఈణ్నుంచి పోకపోతే కనుక్కో నా కొడకా… నీ పీనెగే ఎల్దాది,’’ అంటూ సరసరా పందిరి మీద నుంచి పొడుగాటి నాటుకట్టె తీసి చేతిలో పట్టుకున్నాడు వెంకటప్ప.

ఏక్షణమైనా దౌలూ తల పగలొచ్చని భయపడ్డ ఆ ఇద్దరు పెద్దమనుషులు గబగబా వెళ్లి వెంకటప్ప కాళ్లను చుట్టేసుకున్నారు.

‘‘ప్పా… ప్పా… పోనీలేప్పా, పేదోడు. ఏదో గతిల్యాక వొచ్చినాడు. వోని పదమూడునూళ్లు వోనికి పారేసేయ్‌ సామీ. వాణ్ని నీ కండ్ల ముందు ల్యాకండా తీస్కపోయే పూచి మాది,’’ అని బతిమాలారు.

‘‘పదమూడునూళ్లేనా? ఇంగేమొద్దూ! ఎనుము ఈన్తానే సక్కంగా నాతావుకొచ్చి ‘ఇదిగోప్పా నీ ఎనుము ఈనిండాది’ అని అప్పగిచ్చింటే అప్పుడు ఇద్దును పదమూడు నూళ్లు లెక్క. ఎనుమును సూపిచ్చకుండానే మాయెం సేద్దామనుకున్న్యారే. ఇబ్బుడేం బాకీ వాయ్‌ మీకు లెక్క,’’ అంటూ లేసుకున్నాడు వెంకటప్ప.

‘‘ప్పా… ప్పా… అట్టనగాకుప్పా,’’ అన్నారిద్దరూ.

‘‘ఇట్ట జెప్తే మీరెందుకింటారు వాయ్‌,’’ అని రెచ్చిపోయాడు వెంకటప్ప.

ఆ పక్క ఈ పక్క కాళ్లకు చుట్టుకుని ఉన్న ఇద్దరినీ గట్టిగా విదిలించి కొట్టాడు. అట్టొకరు ఇట్టొకరూ అల్లంత దూరమెళ్లి సదురుకుని పడ్డారు.

ఎదురుగా ఉన్న దౌలూ మీదికి జప్‌మని నాటు కట్టె ఎత్తాడు. ఎత్తి జోరుగా దౌలూ నెత్తి మీద ఒక్కటెయ్యబోయాడు.

కానీ దౌలూ ఆ కట్టెనలాగే గాల్లోనే పట్టుకున్నాడు. పట్టుకుని తన చేతుల్లోకి కసికొద్దీ లాక్కున్నాడు. లాక్కుని ఏమాత్రం తొణక్కుండా నిఠారుగా నిబడ్డాడు.

అతని వెనకాల దూరంగా పశువుల కొట్టంలో ఎనుము కొమ్ముల్ని నేలకేసి కొడుతూ తలుగు తెంపుకుంటోంది.

దౌలూను, ఎనుమును మార్చి మార్చి చూస్తున్నాడు వెంకటప్ప.