రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి


 

ఉదయం పదిగంటల వేళ.

బంగాళాఖాతపు దిక్చక్రం దాటి, పైకెగబాకిన సూర్యుడు విశాఖనగరానికి  ఏటవాలుగా వుండి, వేడి శరాల్ని సంధించి ఒదులుతున్నాడు.

జగదాంబ జంక్షన్‌ హడావుడిగా తిరిగే మనుషులతో, వాహనాలతో సందడిగా వుంది. జూన్‌ మాసం వచ్చి రెండు వారాలు దాటినా, ఎండలు తగ్గటంలేదు. మధురవాడ నుండి పాత పోస్టాఫీసు వెళ్ళే ఇరవైఐదో నంబరు సిటీబస్సు ఆ సెంటరులో ఆగటంతో దిగింది గురమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలందుంపల గంపని మరొకరి సహాయంతో తల మీదకెత్తుకుని, జగదాంబ సినిమాహాలు ముందున్న బస్‌స్టాపు ఎడంపక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది.

ఆశీలుమెట్ట, మద్దిలపాలెం, ‘జూ’ల వైపు వెళ్ళే జనం అటుకేసి వెళ్ళాల్సిన బస్సులకోసం నిరీక్షిస్తూ అక్కడక్కడే తచ్చాడుతున్నారు.

‘‘కుసింత సెయ్యెయ్యి బాబా,’’ తనకు దగ్గర్లో నిల్చున్నతన్ని అడిగింది గురమ్మ. తన తలపై వున్న పెండలం దుంపల గంపని కిందకి దించమన్నట్లు కళ్ళతో చెబుతూ. ఆమె మాటల్లో ఎక్కడా మెత్తదనంగానీ, సహాయం చేయమని అర్ధించినట్లుగానీ లేదు. అతడో మారు గురమ్మకేసి ఎగాదిగా చూసి అయిష్టంగానే తన రెండు చేతుల్తో గంప అంచుల్లో పట్టుకొని కిందకి దించేడు.

‘‘నింపాదిగా, నింపాదిగా… దుంపలు ఉత్తి పుణ్ణేనికి ముక్కలయిపోగలవు,’’ అంటూ విసుక్కుంది.

‘గంపదించినందుకు మెచ్చుకోవటం మాట అటుంచి, పై నుండి ఈ చిరాకొకటా!’ అతడు గురమ్మకేసి గుర్రుగా చూసి, కాస్త దూరంగా వెళ్ళి నిలుచున్నాడు.

దుంపల గంప మీద మడతపెట్టి వుంచిన ప్లాస్టిక్‌ కవర్ని, పాతబడ్డ కొద్దిపాటి చిరుగుల దుప్పటినీ తీసి, ఒకసారి దులిపింది.

ముందుగా ప్లాస్టిక్‌ కవర్ని పరిచింది. ఆ తరవాత దుప్పటిని నాలుగు మడతలు చేసి, డబ్బుల్ని దాయడానికి వీలుగా పొరలున్న వైపు తన ముందుకు వచ్చేట్టుగా వేసుకుంది.

గంపలోంచి కత్తిపీట తీసి పక్కనుంచింది. దుంపల ఆకారాన్నిబట్టి, చిన్నవీ,పెద్దవీ వేరు చేసింది. వాటిని విడివిడిగా వుంచి కుప్పలుగా కొన్నింటిని పెట్టి వాటిని ఎంతరేటుకి అమ్మాలో నిర్ణయించుకొంది.

అమ్మకానికి ఉపక్రమించే ముందే అన్నీ సర్దుబాటుగా వున్నాయో, లేవో ఒకసారి చూసుకొని, గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.

తన చుట్టూ బస్సుల కోసం పడిగాపులుకాసే జనాలకేసి చూసి నిట్టూర్చింది. ఎండకి ఒళ్ళు చుర్రుమనటంతో పాటుగా, అభిషేకం చేయించుకున్నట్లు చెమట కారటం తో తను రోజూ సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పుడు దగ్గరలో వున్న తడకల హోటల్లో దాచేసి వెళ్ళే తాటాకుల గొడుగు గుర్తొచ్చింది.

వెళ్ళి గొడుగు తెచ్చుకోవాలనుకుంది. అయితే దుంపల్ని వదిలేసి వెళితే కుక్కలు, పందులు వచ్చి కలబడిపోతాయని ఆలోచించి, ఓసారి హోటల్‌కేసి చూసింది. ఎందుకోగానీ, అదే సమయంలో హోటల్‌ యజమాని అప్పల్నాయుడు గురమ్మకేసి చూశాడు.

‘‘ఓరప్పల్నాయుడా! మీ సన్నాసిని గొడుగొట్టుకు పార్రమ్మనూ….’’  ఆ కేకకి హోటల్‌లో టిఫిన్లు చేస్తున్న కష్టమర్లు ఒకరిద్దరు గురమ్మకేసి చూశారు.

‘‘ముసిలిముండ, వచ్చిందగ్గర్నుండీ కాల్చుకు తింటాది,’’ లోలోన తిట్టుకుంటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుతున్న సన్యాసిని కేకేసాడు.

‘‘ఒరేయ్‌ సన్నాసీ! గురమ్మ గొడుగొట్టికెళ్ళిచ్చీసి, బేగొచ్చీయ్‌,’’ వాడికి ఆ పని పురమాయించి తన పనిలో మునిగిపోయేడు.

సన్యాసి తెచ్చిన గొడుగుని అక్కడున్న కన్నంలోకి పాతింది. హోటల్‌కేసి వెళ్ళిపోతున్న వాణ్ని ఆగమని కేకేసి, తన కొంగున ముడేసుకున్న చిల్లర డబ్బుల్ని తీసింది.

‘‘ఇంద, పావళా ఒట్టికెళ్ళి బడ్డీకొట్టుకాడ సుట్ట ముక్కొట్టుకు పార్రమ్మీ’’ కొంగు ముడి విప్పుతుండగా… ఆశగా తనకు డబ్బులిస్తాదని అనుకున్న సన్యాసి, సుట్ట ముక్క తెమ్మనడంతో మళ్ళీ గిరుక్కున వెనక్కి తిరిగేడు.

‘‘మా అప్పల్నాయుడుగోరు కోప్పడతారు. ఎంగిలి పేట్లు ఎత్తకుండా ఎల్పోనానని సిరాకుపడ్తారు… నానెల్ను’’ హోటల్‌ కేసి పరిగెత్తేడు సన్యాసి.

‘‘ముండెదవా,’’ పైకే తిట్టింది. నడుంకి చుట్టుకున్న చీర చెంగును రెండు చేతుల్తో ఒకసారి దులిపి, అలాగే మొహమూ, మెడా తుడుచుకొని, గొడుగు క్రిందకు దూరి సర్దుకొని కూర్చుంది.

‘ఎప్పుడో తెల్లవారుఝామున కాల్చిన చుట్ట. నాలుక పీకేస్తుందని’ అనుకుంది. తాత్కాలికంగా చుట్ట తాగాలన్న కోరికను చంపేసుకుంది.

స్టాపులోకి అప్పుడప్పుడూ సిటీబస్సులు వచ్చి, ఆగి, వెళ్తున్నాయి. గురమ్మకి ఆ వాతావరణం కొత్తగాదు. తన పెళ్ళయిన కొత్తలో మొదలెట్టిన వ్యాపారం ఇది. దాదాపుగా నలభై సంవత్సరాలుగా అదే సెంటర్లో దుంపలమ్ముతోంది.
కాలచక్రంలో ‘ఎల్లమ్మతోట’ ఎలా ‘జగదాంబ జంక్షను’ గా మారిపోయిందో గుర్తొచ్చింది. ‘కొత్తనీరొచ్చి పాతనీటిని పారదోలినట్టు హోటల్లు, సినిమా టాకీసులు, కొత్త కాలనీలూ హఠాత్తుగా పుట్టుకొచ్చి, తరాల్నుండి వున్న ఆ ప్రాంతాల పేర్లను మరుగున పడేస్తున్నాయనుకుంది’.

గురమ్మకి మానవ సంబంధాల పట్ల కూడా ఒక రకమైన చులకన భావమే. లోకం డబ్బుచుట్టూ తిరుగుతూ, ప్రేమలకీ, ఆత్మీయులకీ అతీతం అయిపోయిందని ఏనాడో నిర్ణయం చేసుకుంది గనక, దానికి తగ్గట్టుగానే జీవనం సాగిస్తోంది.
విజయనగరం నుండి విశాఖపట్నానికి కాపురానికి వచ్చినప్పుడు గురమ్మకి పదహారేళ్ళ వయసు. మొగుడు అతిమంచితనంతో సత్తికాలం మనిషి అవటంతో, అత్త ఈ దుంపల వ్యాపారంలోని మెళుకువలన్నీ గురమ్మకి నేర్పించింది.

ఎండాడ, తాళ్ళ వలస, ఆనందపురం లాంటి పల్లెల నుండి తెచ్చిన పచ్చి పెండలం దుంపల్ని ఉడకేసి, వాటిని ఎలా లాభసాటిగా అమ్మాలో చెప్పింది.

గురమ్మకి కొడుకు, కూతురూ పుట్టేక కొంతకాలానికి, ఆర్నెళ్ళ తేడాలో అనుకోని జబ్బులు చేసి, అత్త, మొగుడూ చనిపోవటంతో ఇంటి బాధ్యతనంతా తనే తీసుకొంది.

పెండలం దుంపల అమ్మకంలోనే తన కొడుక్కీ, కూతురికి పెళ్ళిల్లు చేసింది. కొడుక్కి తన మేనకోడల్ని చేసి, కూతుర్ని తగరపు వలసకి ఇచ్చింది. ఇప్పుడు తనకున్న బాధంతా ఒక్కటే!

గురమ్మ కొడుకు తాగుబోతు. వాడు చేసుకున్న కూలీ డబ్బులన్నీ తాగుడుకే ఖర్చు పెడతాడు. అలాగని వాని మానానవాణ్ణి వదిలేస్తే తండ్రి బాటలోనే జులాయిగా తిరిగే మనవడు తయారయ్యాడు.

పదహారేళ్ళయినా సరిగా నిండనివాడు, తోటి పోరంబోకు సావాసగాళ్ళతో సినిమాహాల్లెంటా, బ్రాకెట్ల వెంటా తిరుగుతాడు. కోడలు మధురవాడ బస్టాండులో ఆగిన బస్సుల చుట్టూ తిరుగుతూ అరటిపళ్ళు అమ్ముతాది.
తనూ, కోడలు ఇలా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తుంటే తిని, కొవ్వెక్కి తిరగబడే కొడుకుని, మనవడ్నీ భరించక తప్పటంలేదు.

చనిపోయిన మొగుడంటే గురమ్మకి దేవుడితో సమానం. ‘అంతమంచి మనిషికి వారసులుగా ఈ బేవర్సగాళ్ళు ఎలా పుట్టారా’ అని దిగులుపడ్డా, తన మొగుడి వంశాంకురాలు గనక, ఆయన రక్తమే వీళ్ళలోనూ పారుతుందని తనకు తను సర్ది చెప్పుకుంటుంది గురమ్మ.

వయసు అరవైకి పరుగులు తీస్తున్నా, అప్పుడప్పుడే ముడతలిడుతున్న చర్మంతో, నలుపు ఛాయలో, సన్నగా రివటలా వుండి నడుం వంచకుండా నడుస్తాది గురమ్మ. అక్కడక్కడా నెరిసిన జుట్టుకి ఆముదం దట్టించి, కుడిపక్కగా కొప్పు కడుతుంది. చెవులకి కాడలు, ముక్కుకి బులాకీ తనకున్న బంగారు నగలు, పెళ్ళికి ముందు నుండీ ఆ నగలు ఆయా అవయవాల్లో నెలవై వున్నాయి. రవిక వేసుకోవటం తనకెప్పుడూ అలవాటు లేదు. కుడివైపుకి కొంగేసుకోవటం అలవాటైన గురమ్మ ఎప్పుడూ ముతకచీరలు తప్పించి, మరోరకం ఎరగదు.

జగదాంబ జంక్షనులో పొద్దు ఎక్కేకొద్దీ వాహనాల సందడి మరింతెక్కువయింది. ఒక పక్క దుంపల్ని అమ్ముతూనే పరిసరాల్ని పరికిస్తోంది. మార్నింగుషో సినిమాలకి వేళయింది. సిటీబస్సులు ఆగటంతో గెంతి, చిత్రాలయ హాలుకేసి పరిగెత్తే ఆడవాళ్ళని చూసి ఓర్వలేకపోయింది గురమ్మ.

‘‘మొగుళ్ళు అందంటందంట పనుల్లో కెళ్ళి పోగానె సోకులు సేసీసుకొని, దొంగసాటుగ సినిమాలకి యలబారిపోతాయి ముండ పాపలు, ఒళ్ళొలసకండా ఇంట్లో కూకుడోబెట్టి, తిండెట్టే మొగుళ్ళు ఉండబట్టి గొప్పగా సుఖపడిపోతన్నారు,’’ మనసులో  కసిగా తిట్టుకుంది.

బస్సులు, ఆటోలు వెర్రెక్కిన ఆంబోతుల్లా అప్సరా‘డౌను’ నుండి పూర్ణా మార్కెట్‌ వైపుకీ, కె.జీ. ఆస్పత్రి ‘అప్పు’ కీ పరుగులు తీస్తున్నాయి. గురమ్మకీ కొద్ది ఎడంగా వున్న ఆటోస్టాండులో బేరాలు కట్టకుండా రాత్రి చూసిన సినిమా గురించో, బస్టాండులో నిల్చున్న కాలేజీ పిల్ల గురించో, దేశరాజకీయాల గురించో తెగ చర్చించుకుంటూ ముచ్చట్లాడుకుంటున్నారు ఆటో డ్రైవర్లు. ఏ పాసింజరయినా వచ్చి ‘మీటరు మీద ఫలానా దగ్గరకి వస్తావా’ అనడిగితే ‘ఏటీ… మీటర్రేటుకి రమ్మంతావా? చినవాల్తేరు పిచ్చాసుపత్రి నుండి కాని పారిపోయివచ్చావా’ అని ఎగతాళి చేస్తున్నారు కొందరు డ్రైవర్లు.

జగదాంబ హాలుకి ఎదురుగా వున్న దండు బజార్‌ రోడ్డు మీద బలిసిన పందులు కొన్ని వీరవిహారం చేస్తూ వాహనాలు నడిపించే డ్రైవర్లని ఆట పట్టిస్తున్నాయి.

లీలామహలుకి వెళ్ళే డౌను రోడ్డు కిరుపక్కలా వున్న పుట్‌పాత్‌పై చిల్లర సామాన్లు అమ్మే జనం నిండిపోయి వున్నారు. జంక్షను చుట్టూతా వున్న పెద్ద పెద్ద బట్టలషాపులు. బేకరీలు, హోటళ్ళు, చెప్పుల దుకాణాలూ, వీడియోలు-ఆడియోలతో వెలసిన కొత్తకొత్త షాపుల్లోంచి హోరెత్తించే సంగీత ధ్వనుల్తో… జాతరలా వుంది అక్కడంతా.
బస్సులకి వేలాడ్తూ ప్రయాణించే జనంకేసి చూసిన గురమ్మ ‘మాయమంద పాపం పెరిగినట్లు పెరిగిపోతోందని’ మనసులో అనుకుంది.

రోజూ గురమ్మని చూసే కొందరు చనువుగా వచ్చి, బామ్మా!  బాప్పా! అప్పా! లాంటి వరసల్ని కలిపి సంభోదిస్తూ దుంపల్ని కొనుక్కెళ్తున్నారు.

డబ్బులకి తగ్గట్టుగానే దుంపని అమ్మటం జరిగేది. పెద్దపెద్ద దుంపల్ని ఒడుపుగా పిడికిల్లో బిగించి, దళసరిగా, గుండ్రని బిళ్ళల్లా కోసేది కత్తిపీటతో.

‘‘మరీ బంగారంలా అమ్ముతున్నావేఁ’’ అనెవరయినా వెటకారంగా అన్నారని అర్థం చేసుకుంటే… కోసిన దుంపనయినా గంపలోకి కోపంగా విసిరేసి ‘నీదసలు కొనే మొఖం కాదులే’ అని కసురుతుంది.

ప్రతీ అమ్మే దుంప వెనకా తను పడుతున్న కష్టాన్ని గుర్తుకు తెచ్చుకునేది. మాటంటే పడేరకం కాదు గురమ్మ. ఎప్పుడూ తన పంతం నెగ్గాలనే తత్వం, దానికి తోడు మాటతీరు కరుగ్గా వుండటంతో, గురమ్మని ఎరిగినవారు చాలామంది చాటుగా ‘‘ముసిల్దానికి సెడ్డ పొగరు’’ అనటం మామూలే.

మరొకరికి భయపడకుండా, ఎవర్నీ నమ్మకుండా జీవించడం మాత్రమే తెలుసు.

‘‘గురమ్మా… వొప్పుడొచ్చినావు బొట్టే,’’ అంటూ వచ్చింది నూకాలమ్మ.

నూకాలమ్మేది పూర్ణా మార్కెట్‌లో కూరగాయల వ్యాపారం. గురమ్మకి నేస్తురాలు. తన కోడల్ని కొట్లో కూర్చోబెట్టి అప్పుడప్పుడూ జగదాంబ జంక్షన్‌ దగ్గరకు వచ్చి, గురమ్మతో కొంతసేపు కబుర్లాడి వెళ్తాది.

ఆగిన సిటీ బస్సులోంచి స్టూడెంట్‌ కుర్రాడెవరో స్టాండ్‌లో నిల్చున్న పల్లెటూరి మనిషిని ఏదో అని ఆటపట్టించడం చూసిన గురమ్మకు కోపం వచ్చింది.

‘వాడి పీక మీద కాలుమోపి, ఒళ్ళు చీరేయాలి’ అనుకుంది. ‘‘సూసేవే నూకా లమ్మా! ఆ యెదవల పొగరు. పోయిన శనోరం ఏటయినాదో ఎరికా… తగరపలస నుండి మా అమ్మిగోరి మాఁవ… అదేనే మా ఈరకోడు అప్పన్న. ఆడికి ఒంట్లో బాగునేక కె.జి.లోని సూపించుకోడానికొచ్చి ఇటుకాసొచ్చినాడు. మాఁవిద్దరివీ మంచీ, సెడ్డా ఊసు లాడుకుంతన్నామా! ఇనాగే ఆగిన బస్సులో నుండి ఆ ఎదవసచ్చిన టూడెంటు మా ఈరకోణ్ణి అదేదో పేరెట్టి పిలిసి ‘‘నీ సుట్టం సూరుగోడు రమ్మంతన్నాడు’’ అన్నాడు. ఈడెర్రి మొగఁఏసీసుకొని ‘‘ ఏ సూరిగోడు బాబా’’ అంటూ లేసెల్నాడు. సూరిగోడూ నేడు, సుట్టముక్కా నేదు. సెడ్డ ఇరగబాటు. అమ్మా, అయ్యా పీకల్దాకా మేపీసి, కాలేజీల కంపతన్నారు గందా…. ఈల్లేనేటీ, అల్లా ఆడమందా అల్గే వున్నారు. సిగ్గూసెరంవొగ్గేసి ఇక ఇకలూ, పకపకలూనీ…. కాలం ఎలాగున్నాదో సూడోలమ్మా!’’
‘‘ఓ… లాల్తో నీకేటీదే… ఆళ్ళమానాన ఆళ్ళే పోతారు. నాకయ్యన్నీ ఎందుగ్గానీ, నీ దగ్గర సుట్ట ముక్కుంటే ఇద్దూ’’

నూకాలమ్మ మాటలకి చేతులూ, మూతీ తిప్పింది గురమ్మ.

‘‘అచ్చీ నేదు. నానొచ్చిందగ్గర్నుంచీ కాల్చనేదు. నాలికి పీకేత్తంది. అల్లా బడ్డీ కొట్టుకాడకెళ్ళి రెండు సుట్లొట్రమ్మీ’’ అడిగినందుకు తనకే పని చెప్పిన గురమ్మకేసి మూతి బిగించి చూసి, మెల్లగా లేచి వెళ్ళి చుట్టలు తెచ్చింది.
అగ్గిపుల్ల వెలిగించి ఒకేసారి ఇద్దరూ కాల్చుకున్నారు. కొద్దిసేపు కబుర్లాడి నూకాలమ్మ వెళ్ళిపోయింది. సగందాకా కాల్చిన చుట్టముక్కని నోట్లోంచి తీసి, మెడ పక్కకి తిప్పి తుప్పుమని ఊసి, తిరిగి అడ్డపొగ పెట్టేసింది గురమ్మ.
సూర్యుడు నడినెత్తిపైకి వచ్చేడు.

మనుషుల మరుగుజ్జు నీడలకేసి సాలోచనగా చూస్తున్న గురమ్మకి చెక్కలు కొడుతున్న శబ్ధం విన్పించి, తాటాకుల గొడుగులోంచి తలని బయటికి పెట్టి, ముఖానికి ఎండతగలకుండా మోచేయి అడ్డుగా వుంచుకొని, కళ్ళు చిట్లించి చూసింది.

ఆగిన సిటీబస్సు దగ్గరగా ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు, చెక్కలు కొడుతుండగా, పదకొండేళ్ళ అమ్మాయి గాల్లోకి చేతుల్ని తిప్పుతూ డాన్స్‌ చేస్తూ పాట పాడుతోంది.

‘మాయమంద, అడుక్కుతినే జనం ఎక్కువయిపోనాది నోకంనోని’ చిరాకుపడుతూ పిల్లలిద్దరికేసి తేరిపార చూసింది. పిల్లలిద్దరూ తనకేసి వస్తున్నారు.

చింపిరి జుత్తుతో పాదాలదాకా జీరాడే పాతబడ్డ ఎర్రని చిరుగుల పరికిణీ మీద, మాసిన చొక్కా ఒకటి వేసుకొని వున్న ఆ పిల్ల నల్లగా వున్నా, ముఖంలో కళవుంది.

కుర్రాడు ఎర్రగా బొద్దుగా వుండి, ఏ ధనవంతుడి కొడుకో బిచ్చగాడిలా ఫ్యాన్సీ డ్రెస్‌ వేసుకున్నట్లున్నాడు. ఆపిల్‌ పండు బుగ్గల్తో, రింగులు తిరిగిన వెంట్రుకల్తో పెద్ద పెద్ద కళ్ళతో… వాడూ చిరిగిన చొక్కా, నిక్కరూ వేసుకొని వున్నా చూడ్డానికి ముద్దొచ్చేలా వున్నాడు.

గురమ్మని చూడగానే వాడి చేతులు చెక్కల్ని బాదటం మొదలెట్టాయి. ఆ పిల్ల పాట మొదలెట్టి, డాన్స్‌ చేయసాగింది.

‘‘బంగారు కోడిపెట్టా వచ్చెనండీ. హే పాప… హే పాప… హే పాపా’’

గురమ్మ వాళ్లకేసి అసహనంగా చూస్తూ, కుక్కల్ని, పందుల్ని దూరంగా తరమ డానికి దగ్గరుంచుకున్న కర్ర తీసి చూపించింది.

‘‘ముండ పాట ఆపుతావా, తాపులు తింతావా’’ గట్టిగా కసిరింది.

పిల్లలిద్దరూ గురమ్మ గొంతుకి భయపడి, బిగుసుకుపోయినట్లు ఆపేశారు. ఎందుకయినా మంచిదని కొద్ది దూరంలో వుండి డబ్బులడుక్కోడం మొదలెట్టారు.

కుర్రాడు మాటిమాటికి దుంపలకేసి దొంగ చూపులు చూస్తూ, ఆ పిల్ల పాటకి అనుగుణంగా చెక్కలాడిస్తున్నాడు.
గురమ్మ గంపలోని పెండలం దుంపలు సగందాకా అమ్ముడయ్యాయి. డబ్బుల్ని జాగ్రత్తగా తను కూర్చున్న దుప్పటి మడతల్లో వుంచింది.

పిల్లలిద్దరూ ఎందుకోగానీ గొడవపడ్తున్నారు. వాడు మారాం చేస్తుంటే, ఆ పిల్ల బుజ్జగిస్తోంది.

‘‘ఆల్లక్కడ సూడూ! ఎన్ని రంగు బుడ్లున్నాయో. ఒక్కటి కొనివ్వా…’’ వాడు దగ్గర్లో వున్న కూల్‌డ్రింక్‌ షాపుకేసి చూపిస్తూ అన్నాడు.

‘‘అమ్మకి ఒంట్లోని బాగునేదని తెల్దేటి? అమ్మేటి సెప్పిందొరే! మందులు కొన్నందకి డబ్బులు సాలవన్నాదా, ఆసుపత్రికి అమ్మని తీసుకెళ్ళమని డాటేరు బాబు సెప్పనేదేటి? నీకు అమ్మకావాలా, రంగు బుడ్డీ కావాలా?’’ వాణ్ణి ఒప్పించడానికి బ్రతిమాలుతోంది.

‘‘అమ్మ కావాలిగానీ, ముందు రంగుబుడ్డి కొనీయ్‌’’

‘‘రంగుబుడ్డీ పావళా అనుకున్నావేట్రా కొండానికి, కావాలంటే సోడా కొనిత్తాను’’ తెగేసి చెప్పింది. పిల్లల సంభాషణ వింటున్న గురమ్మకి వాళ్ళ ఆరా తీయాలనిపించింది.

‘‘ఒలే గుంటా, ఇల్రాయే, ఎందుకే వల్లక దెబ్బలాడీసుకుంతన్నారూ’’ గురమ్మ పిలుపుకి కొద్దిగా బెదురుతూనే వచ్చారిద్దరూ.

‘‘ఈడ్నీకు ఏటౌతాడే’’

‘‘ఆడ్నా తమ్ముడే బామ్మా, సెడ్డ పేసీకోరు, మాఁవు అడుక్కునీ డబ్బులెట్టి రంగుబుడ్డీ కొనీసుకుందామంతన్నాడు’’ ఆ

పిల్ల మాటలకు గురమ్మ ఆశ్చర్యపోయింది.

‘‘ఈడ్నీకు తమ్ముడేటీ… వల్లకోయే, మాడి పోయిన కవాపుల్లనాగ నీవున్నావు, పండిన మాఁవిడి పండునాగాడున్నాడు…’’

‘‘నేదు బామ్మా సత్తిపెమానకంగా ఆడ్నా తమ్ముడే. ఆడిపేరు రాజు. నా పేరు సిట్టి’’

‘‘మీ అమ్మేటి సేత్తాదే’’

‘‘ఏటీ సెయ్యిదు. ఇంట్లోని ఒళ్ళకే వుంతాది’’

‘‘మీరడుక్కెళ్ళిన డబ్బులు సాలతాయేటే, మీ అయ్యేటి సెయ్యిడా’’

‘‘మా కయ్యినేడు. రాజారావూ, నూకరాజూ, సిఁవాసెలఁవూ.. ఆల్లంతా ఒచ్చి డబ్బులిచ్చివోరు ఇన్నాళ్ళూనీ. మా అమ్మకి జబ్బుసేసినికాడ్నుండీ ఆళ్రాటం మానీసేరు’’

‘‘మీ యిల్లు ఎక్కడే’’ అనుమానంగా చూసింది చిట్టికేసి.

‘‘సావులు మదుం దగ్గిరే, కమ్మరిల్లు.’’ ఆ పిల్ల మాటల్ని బట్టి తనకంతా అర్థం అయిపోయినట్లు తలని కిందకీ, పైకీ ఆడించింది.

‘అమ్మో, గుడిసేటి ముండా, నీ తల్లి రంకుదాయా! ఒవుడొవుడి దగ్గిరి తొంగోని మిమ్మల్ని కని పారీసిందో. వుప్పుడు రోగాల్తెచ్చీసుకున్నాది గావాలా! ఇందంట అడుక్కోని రండని తోలీసినాది గావాల మిమ్మల్ని’ మనసులో అనుకోకుండా ఉండలేక పోయింది గురమ్మ.

మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. మార్నింగ్‌ షో వదిలినట్టు గుర్తించింది జనప్రవాహాన్ని చూసి. మాట్నీ ఆట మొదలయ్యాక జంక్షన్‌లో కొంతసందడి సద్దుమణి గింది.

అప్పటిదాకా పనిచేయని ట్రాఫిక్‌లైట్లు ఆకస్మాత్తుగా వెలగటంతో కొంత సేదతీరొచ్చని అనుకున్న పోలీసు జగదాంబ హాలు నీడలోకి వచ్చి చేరాడు.

పోలీసుని చూడగానే దుంపల మీద గుడ్డ కప్పేసింది గురమ్మ.

‘తొత్తుకొడుక్కి దుంపని తీసీసుకొని నోట్లోకి కుక్కీసుకోడఁవే గానీ, జేబులోంచి దమ్మిడీ తీయుడు’ ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తుకి తెచ్చుకుంది.

ఎండవేడికి ఒళ్ళు కమిలిపోయినట్లు అనిపించింది. ఆకలి కూడా వేస్తున్నట్లు అన్పించింది. ఇంట్లోంచి తెల్లవారుజామున బయల్దేరినపుడు తిన్న సల్దన్నము. మళ్ళీ రాత్రికే తిండి. మధ్యాహ్నం టిపిన్లు కూడా తినదు. టీ మాత్రం తెప్పించుకు తాగటం అలవాటు.

అడుక్కుంటున్న రాజుని రమ్మని చేత్తో సైగచేసింది. దుంపేమయినా ఇస్తుందన్న ఆశతో పరిగెత్తుకొని వచ్చేడు వాడు.

‘‘ఒరేయ్‌. అల్లా ఒటేళ్ళోకి యెళ్ళి, దుంపల గురమ్మంపిందని సెప్పి, టీ పట్రమ్మీ’’.

రాజు తెచ్చిన టీ తాగేసి, ఎంగిలి గ్లాసుని తిరిగి హోటల్‌లో ఇచ్చేసి రమ్మంది.

తిరిగి వచ్చిన రాజు గురమ్మ దుంపేమయినా ఇస్తుందేమోనని అక్కడే తచ్చాడాడు. దుంప ఊసు ఎత్తనట్టు తన బేరం చూసుకుంటూ, అప్పుడప్పుడూ డబ్బుల్ని లెక్కబెట్టుకుంటోంది. మరిక లాభం లేదనుకున్న రాజు ‘గురమ్మకేసి కోపంగా చూస్తూ, అక్క దగ్గరకెళ్ళిపోయాడు.

‘ఎండకి ఒళ్ళు పేలిపోతోందని’ చిరాకుపడ్తూ, అందినంతమేర వీపు గోక్కోడానికి ప్రయత్నిస్తున్న గురమ్మకి చిట్టి కన్పించడంతో కేకేసింది.

‘‘ఒలేయ్‌ సిట్టి గుంటా, బీపు బకుర్దువుగాని రాయే’’ గురమ్మ చెప్పిందే తడవుగా వెనకవైపుకి వచ్చి, మోకాళ్ళమీద కూర్చుని తన వాడిగోళ్ళతో మెడ దగ్గరనుంచి, నడుందాకా మెల్లగా గోకసాగింది. అక్కడక్కడున్న చెమట పొక్కుల్ని చిదిమింది.

సిట్టి చేత వీపు గోకించుకోవటంలో చాలా హాయిగా అనిపించింది గురమ్మకి. తన కొప్పును విడదీసి, కొద్దిసేపు పేలు చూడమంది. సిట్టి చేతులు తల్లో ఆడుతోంటే నిద్ర కమ్ముకొస్తున్నట్లుగా వుంది.

‘‘అవునే… గుంటా, అయ్యేం పాడు పాటలే!’ మాటల్లో సిట్టిని అక్కడే వుంచేసి, మరికొంత సుఖం పొందాలనుకుంది గురమ్మ.

‘‘నీకు తెల్దేటి బామ్మా! సిరంజీవి పాటది. సినిమా సూన్నేదేటి’’

‘‘ఏ బోడిగోడి పాటయితే నాకేటే. దేవుడి పాటల్రావేటీ’’

‘‘అలాటియి పాడితే జనం డబ్బులేయిరని సెప్పింది మాయమ్మ’’

‘‘ముండ పాటన్నేర్సినావునే….’’ నవ్వింది గురమ్మ.

‘‘నీకు పాడ్డఁవొచ్చేటి బామ్మా’’ కుతూహలంగా అడిగింది చిట్టి.

‘‘నా పాటింటే ఇరగబడి నవ్వుతావే’’

చిట్టి, గురమ్మని పాట పాడమని బలవంతపెట్టింది. తను పాడకపోతే ‘గుంటముండ అడుక్కోడానికి పారిపోద్ది గావాల’’ అనుకుంటూ గుర్తున్న పాటని అందు కుంది.

    చింతకాయ బొంతకాయ చిమిడి మావిడికాయ,
    కోనేటి వంకాయ కొమ్మ నిమ్మలపండు,
    జీలుగులు తోటలో ఓలుగులు మేయగా,
    ఒక్కటే రాలగా, వరి పువ్వు రాలగా,
    తోటాకు దబ్బనం కోట గట్టించీ,
    తోటలో వున్నాయి జుమ్ము తేనీగలు
    గట్టెక్కి చూస్తే గంజాయి గుర్రాలు
    ఇంటింటికోబండి ఇనపగట్లా బండి
    సిక్కాపు తోటకి ఒక్కటే గొలుసు 
    సీ బందు రామనా ఉయ్యాలో…
    రామనా రచ్చ తూగుటుయ్యాలో…

పాట పాడుతూ, పాడుతూ తనలో తను నవ్వుకుంటూ ఆవలించింది గురమ్మ.

పాట విన్న చిట్టికి అందులోని ఒక్క ముక్కయినా అర్థం అవలేదు.

ఇలాంటి పాటల్ని పాడితే మటుకు జనం పైసా కూడా రాల్చరని మాత్రం అను కుంది.

మరో అరగంట దాకా ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. అప్పటిదాకా రాజు తనదగ్గరున్న చిల్లర డబ్బుల్తో ఏ బఠాణీలో కొనక్కుని తింటూ అడుక్కుంటున్నాడు.

‘‘ఒలేయ్‌ సిట్టీ, నాను ఒగటికెళ్ళొత్తాను. సిటం ఇల్లిక్కడే కూకుడోయే! ముండె దవలు ఒగటికెల్నిందకి ఇందంటెక్కడా కట్టనేదు. అల్లా దండుబజారుకాసి ఎళ్ళొత్తాను. జాగర్త సుమీ! కుక్కనంజిలు ఏ ఇరకనుండో ఎల్పొచ్చీసి, దుంపల్నెత్తుకుపోతాయి. ఇదిగో ఇల్లీ కర్రొట్టుక్కూసోయే’’

‘‘అల్గే బామ్మా నీవు బేగెల్లీసొచ్చీయ్‌. నాను దుంపల్దగ్గిరే వుంతాను’’ చిట్టి మీద భరోసా వుంచింది గురమ్మ. విడిన కొప్పుని ముడేసుకొని మరోసారి జాగ్రత్తలు చెప్పింది.

గురమ్మ వెళ్ళిపోగానే అక్కదగ్గరకి చేరిపోయాడు రాజు.

‘‘సిట్టక్కా..సిన్న దుంపెట్టు’’

‘‘ముసల్దాయి సూసినాదంటే సరమ్మొల్చీగల్దొరేయ్‌’’

‘‘అది వుప్పుడున్నాదేటి? ముసిలిఖండి నాను ‘టీ’ తెచ్చినందకయినా సిన్న దుంపెట్టింది కాదూ…’

‘‘నాకిచ్చినాదేటి? నానూ బీపు బకిర్నానుగానా, పేలూ సూసినాను. సిటఁవొల్లకోరా! ఒగటికెళ్ళీసొచ్చేక దుంపిత్తాది గానీ’’ తమ్మునికి సర్ది చెప్పింది.

మాటల్లోకి దింపేసి, ఒక దుంపని చిట్టి కళ్ళు గప్పేసి దాచేసేడు. ఏమీ ఎరగనట్టు మెల్లగా ఆటోస్టాండుకేసి వెళ్ళాడు.
దండుబజారు డౌను దిగుతూ జగదాంబ కేసి వస్తున్న గురమ్మ డేగ కళ్ళకి ఆటో చాటుగా దుంప తింటున్న రాజు కన్పించాడు.

కోపంతో గురమ్మ వడివడిగా వచ్చింది. వస్తూనే గాల్లోకి చేయి విసిరి, చిట్టి చెంప మీద ‘చెల్లు’మని జల్లేసింది, తన ఐదేళ్ళూ అంటుకుపోయేలా.

ఊహించని దెబ్బకి తూలిపడబోయి నిలదొక్కుకుంది చిట్టి.

ఒక్క క్షణం గురమ్మ తనని ఎందుకు కొట్టిందో అర్ధంగాక కంగుతిన్నట్లుండి పోయింది.

ఎగదన్నుకొచ్చిన ఏడుపుని దిగమింగింది. కళ్ళనిండా నీరు నింపుకుంది.

‘‘నంజిముండాఖానా, నీ తమ్ముడికి ఎన్ని దుంపలందించీసినావే’’ చిట్టి రెక్క పట్టి లాగి, విసురుగా తోస్తూ అరిచింది.

‘‘నానీయినేదు బామ్మా’’ చిన్నగా వణికిపోతూ అంది.

‘‘నీవియ్యికంటే దుంపల్లెగిసెల్లి నీ తమ్ముడి నోట్లోకెళిపోయినాయేటీ’’ అప్పుడు చూసింది చిట్టి తమ్ముడెక్కడున్నాడోనని. వాడు గురమ్మ చిట్టిని కొట్టడం చూస్తూనే దూరంగా పారిపోయి, దొంగచాటుగా ఏం జరుగుతుందోనని చూస్తున్నాడు.

‘‘అబద్దాల కోరుముండా! బీపు సీరిగల్ను. నీయమ్మ రంకుమొగుడి సొమ్మను కున్నావేటీ’’ గురమ్మ అరుపులకి స్టాపులోని జనం మూగేరు.

బిక్కచచ్చినట్లు పాలిపోయిన మొహంతో అలాగే నిల్చుండిపోయింది చిట్టి.

‘‘ఏడీ! ఆ దొంగెదవ’’ చుట్టూ పరికిస్తోంది గురమ్మ.

గురమ్మ చెంపదెబ్బ ఎంత గట్టిగా తగుల్తాదో తెలిసిన చిట్టి, తమ్మున్ని  ఎలా బాదెస్తాదో అని భయపడిపోయింది.
‘‘నాకు తెలీకంట దుంప దాసినాడు. నీ మనవడ్ల్లాటోడు. ఆన్ని ఒగ్గీయ్‌ బామ్మా’’ బతిమిలాడుతున్నట్లుగా అంది చిట్టి.

‘‘ఇంకోపాలి నా మనవడన్నావంతే తన్నీగల్ను యార్లా, నాకాడు మనవడేటీ… ఆడెఁవుడికి పుట్నాడో! నా కొడుక్కి పుట్నాడేటే నంజిముండా’’ రెచ్చిపోయిన గురమ్మ మళ్లీ చెయ్యిని గాల్లోకి లేపింది.
ఇక లాభం లేదనుకొని మెల్లగా అక్కడ్నుండి జారుకుంది చిట్టి.

సాయంత్రం అవుతున్న కొద్దీ… నగరం చల్లబడసాగింది. చల్లటి సముద్రంగాలి వీస్తోంది. జంక్షనులో మళ్ళీ సందడి ఎక్కువకాసాగింది. మరో ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులు వచ్చేరు. మెత్తని పకోడీలు, చేగోడీలు, జిలేబీలు అప్పుడికప్పుడు చేసి, వేడి వేడిగా అమ్మే తోపుడు బండ్లు ఒక్కొక్కటీ రాసాగేయి.

మేట్నీ సినిమాలు వదిలేసారు. చెదిరిన పుట్టలోంచి చెల్లాచెదురై పాక్కుంటూ పోతున్న చీమల్లా జనం. డ్యూటీల్నుండి ఇంటికి వెళ్ళే జనం, షాపింగు చేయడానికి వచ్చిన జనం, సినిమాలకి వెళ్ళే జనం. అంతా జనమయం.
ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోల్లాంటి త్రిచక్ర వాహనాలు. సిటీ బస్సుల స్వైర విహారాలు. అన్నింటిని కలగలిపి చెవులదరగొట్టే హారన్ల మోతల్లో జగదాంబ జంక్షనంతా గోలగోలగా వుంది.

ఉదయం నుండీ దుంపలమ్మిన గురమ్మ నీరసించిపోయింది. ఇంకా జత దుంపలు మిగిలి పోయాయి. వాటిని ఎవరయినా వచ్చి కొనగానే ఇంటికి వెళ్ళిపోవాలను కుంది.

హోటల్‌ కుర్రాడు సన్నాసిని కేకేసి, రప్పించి, తన తాటాకుల గొడుగుని దాచేయమని చెప్పింది.

చీకట్లు ముసురుకుంటున్నాయి. జగదాంబ జంక్షన్‌లో ఒక్కో మెర్క్యూరీ లైటూ వెలగసాగింది.

అల్లంత దూరంలో తనకేసి వస్తున్న మనవడ్ని చూడగానే ముఖం చిట్లించుకుంది గురమ్మ. వాడి జులాయి వేషాన్ని ఎంతదూరం నుండయినా పోల్చగలదు.

చూస్తుండగానే దగ్గరగా వచ్చి, దర్జాగా నడుం మీద చేయి వేసుకొని, కళ్ళ మీద ఊగాడే జుత్తుని వెనక్కి సవరించుకున్నాడు.

‘‘నాన్నమ్మా! నానర్జింటుగా సినిమాకెళ్ళాల. అలంకారులోని సిరంజీవి సినిమా ఆడతన్నాది. దుంపలన్నీ అమ్మేసినావేటి? సినీమాకి బేగ డబ్బులిచ్చేయ్‌’’

‘‘ముండ దర్జా! సినీమాకు డబ్బున్నేవు’’ వాడివైపు కోపంగా చూసింది.

‘‘ఆల్గ సూత్తన్నవేటే ముసిల్దానా. సెవుల్లోకి నాన్సెప్పింది దూర్నేదేటి? ఏసికాలెయ్య కంట బేగి డబ్బులిచ్చీయ్‌’’ గురమ్మ కన్నా కోపంగా అరిచేడు వాడు.

‘‘ఒరేయ్‌, తొత్తికొడకా, నీవు, నీ బాబూ నా సొమ్ముకి దాపురించినార్రా. ఒక్క దమ్మిడీ నేదు. పీకల్దాకా మేపతన్నాం కామా. అది సాల్దా! దుంపలమ్మి, డబ్బుల్ని నీ సినీమాకిచ్చీసి, మావు గడ్డి తినాలేట్రా… బేవార్సీ నా ఎదవ’’ గురమ్మ పెద్దగా అరవటంతో జనం కొద్దిసేపు వినోదంలా చూశారు.

‘బామ్మ, మనవల్ల సరసం లెద్దూ’ అనుకున్నారు కొందరు.

‘‘గడ్డి తింతావో, గాడిద గుడ్డు తింతావో, నాకెరికనేదు. వుప్పుడు డబ్బులీయుకు పోతే మటుకి తాపుల్తింతావు’’ ఒక పక్క సినిమాకి టైం అయిపోతుందన్న ఆరాటంతో వాడిలో అసహనం పెరిగిపోతోంది. ఇద్దరి మధ్యా మరో పావుగంట రభస జరిగింది.

వాడు గురమ్మని పచ్చిబూతులు జోడించి తిట్టడం మొదలెట్టాడు.

‘‘అమ్మనాగుంజిగా! సెప్పు తీసుకొని సుబ్బరంగా మొత్తీగల్ను. వోయి, వొరసా లేని సచ్చినోడా… ఇక్కడ్నుంచెల్తావా, నేదా’’ అప్పటిదాకా కూర్చొని వున్న గురమ్మ పైకి లేవబోయింది. అదే అదనుగా –

‘‘చావు నంజా’’ అంటూ తన కుడి కాలుని పైకి లేపి బలం కొద్దీ గురమ్మ కడుపు మీద తన్నేడు.

‘‘అమ్మ నా గండో…. సచ్చిపోనానమ్మో’’ పెడబొబ్బ పెడుతూ అలాగే వెనక్క విరుచుకు పడిపోయింది గురమ్మ.

రెప్పపాటులో దుప్పటి మడతల్లో వున్న డబ్బుల్ని చేతికి దొరికినన్ని తీసుకొని, అలంకార్‌ టాకీసుకేసి దూసుకుపోయి, జనంలో కలిసిపోయేడు.

గురమ్మ అప్పటిదాకా మనవడితో సరదాగా దెబ్బలాడుతోందనుకున్న జనం ఆ సంఘటనకి ఆశ్చర్యపోయారు.

‘‘అమ్మో! తన్నేసి పారిపోతన్నాడు. పట్టుకోండి, పట్టుకోండి’’ అరిచేరెవరో.

అక్కడికి దగ్గర్లోనే, బస్సు దగ్గర డబ్బుల్ని అడుక్కుంటున్న చిట్టి, గురమ్మ కేకకి బెదిరిపోయి చూసింది.

అంతకు ముందే అక్క కొనిచ్చిన సోడాని తాగుతున్న రాజుకి కూడా గురమ్మ కేక వినిపించింది.

‘‘ఒరేయ్‌ రాజుగా దుంపల బామ్మ పడిపోనాది’’ అరుస్తూ, గాబరాగా గురమ్మకేసి పరిగెత్తింది చిట్టి.

గురమ్మ ఎందుకు పడిపోయిందో సరిగా అర్ధంకాని రాజు చేతిలోని సగం తాగిన సోడాబుడ్డితోనే అక్కను అనుసరించాడు.