రచన: ఉణుదుర్తి సుధాకర్

సారంగ‘, 7 ఏప్రిల్ 2016

(ప్రేరణ: హెర్నాండో తెలెజ్ రచన ‘Just Lather, That’s All’)


 

సుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్  – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ,  ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక  ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.

మొదట ఓ ఆరునెలలు – కత్తిరించగా కిందపడిన వెంట్రుకలు ఊడవడం, గెడ్డం చేయడానికి సరంజామా సిద్ధంచేసి ఉంచడం, మంచినీళ్ళ కూజా మోసుకురావడం, మొహాలమీద నీళ్ళు చిలకరించే సీసాలు నింపిపెడుతూండడం, తోలుపట్టీ మీద కత్తుల్ని సానపట్టడం, మధ్యమధ్య  శిల్లావెంకన్న హోటల్ కి పరుగెత్తి ఫ్లాస్కులో టీలు, విస్తరాకుల్లో కట్టిన కరకర పూరీలు, వాటికి తోడుగా బొంబాయికూర తెచ్చిపెట్టడం (ఎవరూ చూడనప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మిల కేలెండర్ల వైపు దృష్టిసారించడం, షాపు అంతటాఉన్న అద్దాలముందు జుత్తు పరపరా దువ్వి ‘సైడుపోజులో హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం), ఇవన్నీచేసి తండ్రి దగ్గర మన్ననలు, ఇతర బర్బరులనుండి గుర్తింపు పొందాడు.

ఇన్నాళ్ళూ అనవసరంగా స్కూలికి వెళ్ళి ఎందుకు దెబ్బలు తిన్నానా అని బాధ పడుతూనే ఆ దుర్దినాలకు శాశ్వతంగా స్వస్తి పలికినందుకు మురిసిపోయాడు. తండ్రి పర్యవేక్షణలో పదహారేళ్ళకే కత్తి చేతపట్టి  రంగంలోకి దూకాడు. ప్రయోగాత్మకంగా పేద గిరాకీల గెడ్డాలు ఎడాపెడా గీయడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత రక్తపాతం జరిగింది. స్ఫటిక వాడకం పెరిగిపోయింది. డెట్టాలు, పలాస్త్రీల అవసరం కలిగింది. షాపులో ఊదొత్తుల సువాసనలకు బదులు ఆస్పత్రివాసన పెరగడంతో తండ్రి భూలోకం ఉద్రిక్తతకు లోనయ్యాడు. అయితే మరికొద్ది వారాల్లోనే వైకుంఠానికి అహింసామార్గం దొరికిపోయింది. కాస్త పొడుగూపొట్టీ అయినా జుత్తు కత్తిరించడం కూడా పట్టుబడింది. కొడుకు ప్రయోజకుడై అందివచ్చినందుకు తండ్రి ఆనందానికి అవధులు లేవు.

అన్నయ్య వైకుంఠం తమ వృత్తిరంగంలో రోజురోజుకీ ఎదిగిపోతూ తన అనుభవాల్నీ, విజయాల్నీ వివరించినప్పుడల్లా కైలసానికి దిగులు కలగసాగింది. చదువులో ఉంచి తండ్రి తనకి తీరని అన్యాయం చేసాడని మరీమరీ అనిపించసాగింది. చిక్కల్లా ఒక్కటే. కైలాసానికి చదువు బ్రహ్మాండంగా వస్తోంది. పెద్ద ప్రయత్నం లేకుండానే మంచి మార్కులు వస్తున్నాయి. చిన్నకొడుకు గవర్నమెంటు ఆఫీసరు అవుతాడనే భూలోకం నమ్మకం ప్రతీ ఏడూ మరింత బలపడుతోంది. క్షవరం చేయించుకోవడానికి వచ్చే మాస్టార్లందరూ కైలాసాన్ని పెద్ద చదువులు చదివించమనే అంటారు. కైలాసం ఇంగ్లీషులో కాస్త వెనకబడ్డా, తెలుగు పద్యాలు చదివేడంటే మాత్రం పెద్దపంతులుగారు కూడా డంగైపోతారు. కొత్తగా వచ్చిన లెక్కలమాస్టారు మధుసూదనంగారైతే జీతం తీసుకోకుండా ప్రైవేటు చెప్పి తన సబ్జెక్టులో ఫస్టుమార్కు వచ్చేలా చేసాడు. అంతేకాక రెన్ అండ్ మార్టిన్ లోంచి ఎక్సెర్సైజులు చేయించి ఇంగ్లీషంటే భయం లేకుండాచేసాడు. ‘ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ’ అంటే గనక అది ముమ్మాటికీ  తప్పే అనిన్నీ, ‘ఐ ప్రిఫర్ కాఫీ టు టీ’ అన్నదే కరెక్ట్ అనీ కైలాసం ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆక్టివ్ వాయిస్ లో ‘రామా కిల్డ్ రావణా’ అని ఉంటే అది పాసివ్ లో ‘రావణా వాస్ కిల్డ్ బై రామా’ అవుతుందని తెలుసుకున్నాడు. మొదటే తెలుగు బాగా వచ్చి ఉండడంవల్ల ఇంగ్లీషు తొందరగా పట్టుబడింది.  ఇప్పుడు సెలవుచీటీ ఇంగ్లీషులో రాయగలడు. నిజానికి వీపీపీ ద్వారా పుస్తకాలు పంపిచమని కొంతమంది విజయవాడ పబ్లిషర్స్ కి కూడా ఇంగ్లీషులోనే రాశాడు. ఆయా పుస్తకాలు టంచన్ గా వచ్చేశాయి కూడా.

మధుసూదనం మాస్టారింటికి ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ఆయన వద్దనున్న తెలుగు, ఇంగ్లీషు పుస్తకభండారాన్ని చూసి కైలాసం అదిరిపోయాడు. చాలా తెలుగు పుస్తకాలు, కొద్దిపాటి ఇంగ్లీషు పుస్తకాలు తెచ్చుకొని చదివేశాడు. కొన్ని బోధపడ్డాయి; కొన్ని పడలేదు. కాని అవి అతనికి ఒక కొత్త ప్రపంచానికి దారి చూపించాయి.  ఆగష్టు పదిహేను నాడు జరిగిన తెలుగు వ్యాసరచన పోటీలో స్కూలు మొత్తానికి మొదటి బహుమతిగా గాంధీగారి ఆత్మకథ చేతికి రావడంతో కైలాసంలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఇన్ని సాధిస్తున్నప్పటికీ అసలు మజా అంతా అన్నకే దక్కుతున్నదని అతని ఆక్రోశం మాత్రం అలాగే మిగిలిపోయింది. పోరగాపోరగా పదకొండో తరగతి సెలవరోజుల్లో దుకాణానికి వచ్చి పని నేర్చుకోవడానికి తండ్రి అయిష్టంగా అంగీకరించాడు. అయితే మరుసటేడు – అంటే పన్నెండో తరగతిలో మాత్రం చదువు తప్ప మరో వ్యాపకం ఉండరాదని షరతు పెట్టాడు. కైలాసం ఉత్సాహంగా దుకాణంలో అడుగుపెట్టాడు.

మొదట్లో తమ్ముడి మీద పెత్తనం చెయ్యాలని వైకుంఠం చాలా ప్రయత్నించాడుగాని అది అట్టేకాలం సాగలేదు. గెడ్డాలు చేయడంలో ఇద్దరికిద్దరూ సరిసమానం అయిపోయారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. షాపు తమదే అన్న ధీమా తలకెక్కింది. ఖాతాదారులతో సత్సంబంధాలు పెంచుకున్నారు. వాళ్ళు మోసుకొచ్చే వార్తల్లో వాళ్లకి ఆసక్తి పెరిగిపోయింది.  క్షౌరశాల అంటే నేటి భాషలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫాం, పేస్ బుక్, ట్విట్టర్.  వినగావినగా అన్నదమ్ములిద్దరికీ ఒక కొత్త సంగతి బోధపడింది. చుట్టుపక్క ప్రాంతాల్లో నక్సలైట్లు అనబడే వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారుగాని వాళ్ళు పట్టుబడడం లేదు. వాళ్ళు పరమ కిరాతకులని కొందరూ డబ్బున్న వాళ్ళని దోచుకొని పేదలకి పంచిపెడతారని కొందరూ అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ నక్సలైట్లంటే ఊళ్ళోఉన్న వ్యాపారులంతా హడిలిచస్తున్నారు. వీళ్ళకీ సంగతులు తెలుస్తున్న రోజుల్లోనే పాటలు పాడుకుంటూ ఒక ఎర్రజెండా బృందం షాపు ముందుకొచ్చి నిలబడింది. వాళ్ళేవో కేకలు వేశారు, కరపత్రాలు పంచారు, చందాలు అడిగారు. భూలోకం ఐదురూపాయిలిచ్చి పంపించేశాడు. ‘అదుగో, వాళ్ళే నక్సలైట్లు’ అన్నారెవరో. అన్నదమ్ములిద్దరూ కరపత్రం శ్రద్ధగా చదివారు.

సరిగ్గా అప్పుడే వైకుంఠం బుర్రలో ఆ ఆలోచన పుట్టింది. సెలవురోజున అంటే మంగళవారంనాడు షాపులో ఒక్కడూ కూర్చొని  కరపత్రంలోని భాషని వాడుకుంటూ, వాక్యాల్ని అటూఇటూ తిప్పి ఊరికల్లా పెద్ద కిరాణా వ్యాపారి సుంకాల కాశీనాథాన్ని సంబోధిస్తూ ఒక బెదిరింపు లేఖ తయారుచేశాడు. “ఖబడ్దార్! ప్రజా శత్రువులారా! ఎర్రసేన కదిలింది! మీ అంతు చూస్తుంది!” కరపత్రంలోని ఈ వాక్యంతో తన లేఖలోని ఆఖరి పేరాని ముగించి చివరిగా తన సొంత కవిత్వం చేర్చాడు: “మంగళవారం నాడు సాయింత్రం ఆరో గంటకల్లా జగద్ధాత్రి గుడి ఎదురుగా ఉన్న బంద పక్కన మర్రిచెట్టు మొదట్లో పదివేల రూపాయిలు ఒక బాగ్ లో పెట్టి వెళ్ళాలి”. ఎందుకేనా మంచిదని మరో వాక్యం చేర్చాడు “లేకపోతే ఎర్రసేన నిన్నూ నీ కుటుంబాన్నీ సర్వనాశనం చేస్తుంది ”. “ఇట్లు, కామ్రేడ్ జిల్లా నాయకుడు” అని ముగించాడు. పదివేలు చేతిలోపడితే మద్రాసువెళ్లి సినీమాల్లో హీరో అవ్వాలని వైకుంఠానికి మహా దురదగా ఉంది.

సుంకాల కాశీనాథం లబోదిబోమంటూ పోలీసు స్టేషన్ కి పరుగెత్తాడు. ఉత్తరం చదవగానే అది నకిలీదని పోలీసులకి అర్థం అయిపోయింది. వలవేసి వైకుంఠాన్ని పట్టుకొని నాలుగు తగల్నిచ్చి వెనకాతల ఇంకెవరూలేరని తేల్చుకున్నారు. కొడుకుని విడిపించడానికి భూలోకం కులపెద్దల సహాయం కోరితే వాళ్ళు చేతులెత్తేశారు; ఇది మామూలు తగువు కాదన్నారు. మరో మార్గంలేక సబ్ ఇన్స్పెక్టర్ సూర్యారావు కాళ్ళమీద పడ్డాడు. ‘ఊరికే వదిలేస్తామా?’ అన్నాడు సూర్యారావు. ఏమీ  ఇచ్చుకోలేనని భూలోకం మొర. ఇప్పుడంటే నక్సలైట్లని పట్టుకోలేక నానా పాట్లూ పడుతున్నాడుగాని, బుల్లెట్ మోటార్ సైకిల్ మీద బడబడమని తన రాజ్యమంతటా యదేచ్ఛగా పర్యటించే సూర్యారావంటే ఊళ్ళో అందరికీ భయమే. ‘పోలీసాఫీసరంటే అలా ఉండాలి’ అన్న వాళ్ళూ ఉన్నారు. అతని ఠీవిని చూసి మురిసిపోయే వాళ్ళల్లో ముఖ్యుడు సుంకాల కాశీనాథం. కానీ వైకుంఠంకేసులో ఇద్దరికీ కొంచెం తేడావచ్చింది. తగిన శిక్ష వెయ్యకుండా నేరస్తుడిని విడిచిపెట్టడం ధర్మవిరుద్ధం, ఇలాంటి అల్లరచిల్లరగాళ్ళే రేప్పొద్దున్న నిజం నక్సలైట్లు అవుతారు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని కాశీనాధం పట్టుబట్టాడు. ‘మీకెందుకు సార్? నేను చూసుకుంటాను, నాకొదిలెయ్యండి. పోలీసుడిపార్టుమెంటు ఉన్నదెందుకు?’ అన్నాడు ఇన్స్పెక్టర్.

అన్నట్టుగానే రేపు విదిచిపెడతారనగా ముందురోజురాత్రి రైఫిల్ బట్ తో బలంగా మోది వైకుంఠం కుడిచెయ్యి విరగ్గొట్టాడు – ‘రేప్పొద్దున్న తుపాకీ పట్టుకోవాలనుకున్నా నీవల్ల కాదురా’ అంటూ. ‘మీవాడు బాత్రూంలో జారిపడి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు’ అని భూలోకానికి అప్పజేప్పేడు.  విరిగిన చెయ్యి అతుక్కుందిగాని వంకర ఉండిపోయింది. ఇప్పుడు వైకుంఠం ఫుల్ హ్యాండ్ చొక్కాలే వేసుకుంటాడు. అవిటి చేత్తో కటింగ్ చేస్తాడు గాని మునపటి జోరు లేదు. ‘హరనాథ్ లా ఉన్నాను’ అనుకోవడం మానేశాడు.

********

కొడుకులిద్దర్నీ షాపులో ఉంచి భూలోకం భోజనానికి వెళ్ళాడు. షాపంతా ఖాళీ. బయట ఎండ మండిపోతోంది. ఎదురుగుండా మెడికల్ షాపులో కూడా ఓనరుతప్ప ఎవరూ లేరు. రోడ్డుమీద అలికిడి తగ్గిపోయింది. మధుసూదనం మాస్టారి దగ్గర తీసుకొచ్చి అద్దం వెనకాతల దాచిన పుస్తకం తీసి చదవుతున్నాడు కైలాసం. కూజాలోని చల్లటి నీటిని చేతిలోకి తీసుకొని మొహమ్మీద కొట్టుకున్నాడు వైకుంఠం. సరిగ్గా అప్పుడే బుల్లెట్ బడబడ వినబడింది. శబ్దం దగ్గరవుతోంది. పుస్తకంలోంచి చటుక్కున తలెత్తి అన్నకేసి చూశాడు కైలాసం. ‘ఇక్కడికే వస్తున్నాడా?’ అన్నట్టు చూశాడు వైకుంఠం. శబ్దం బాగా దగ్గర్నించి వినిపిస్తోంది; గుమ్మం ముందుకొచ్చి ఆగిపోయింది. పెరటి గుమ్మంలోంచి వైకుంఠం జారుకున్నాడు. చదువుతున్న పుస్తకాన్ని గభాలున అద్దం వెనక పడేశాడు కైలాసం.

లోపలి వస్తూనే, “ఏరా, ఎవరూ లేరా?” అన్నాడు ఇన్స్పెక్టర్ సూర్యా రావు.

“నాన్న, అన్న భోజనానికి వెళ్ళారు”

పిస్తోలుతో ఉన్న తోలు పటకా, బులెట్ లతో ఉన్న క్రాస్ బెల్టునీ విప్పేసి ఒక ఖాళీ కుర్చీ మీద పడేశాడు.

“ఎప్పుడొచ్చినా మీ అన్న కనబడ్డు. ఏంటి సంగతి? మళ్ళా ఏమైనా వేషాలేస్తున్నాడా?”

“అలాటిది ఏమీ లేదు సార్”

“గెడ్డం చెయ్యడం చేతనవునా?” కుర్చీలో కూర్చుంటూ.

“కిందటిసారి నేనే కద సార్ చేసింది?” అని టేబిల్ ఫ్యాన్ ఆన్ చేశాడు.

నాలుగు రోజుల గెడ్డం. నక్సలైట్ల వేటలో నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నాడని సోషల్ మీడియా ద్వారా కైలాసానికి తెలుసు.

“నీకు తెలిసిందా? రాత్రి ముగ్గుర్ని లేపేశాం”

ముగ్గురు నక్సలైట్లని మొన్న పట్టుకొని నిన్న రాత్రే చంపారని, వాళ్ళల్లో ఇద్దరు నాయకులున్నారనీ అరవ వైర్లెస్ ఆపరేటర్ పొద్దున్న గెడ్డం చేయించుకోవడానికి వచ్చినప్పుడు చెప్పాడు. తెలుగు రాకపోవడం వలన అంతకు మించి చెప్పలేకపోయాడు.

పరుగెత్తుకెళ్ళి మధుసూదనం మేష్టారికి ఈ సంగతి తెలియజేస్తే ఆయన వెంటనే మార్చురీకి బయిల్దేరాడు.

“తెలీదు సార్” అంటూ గుడ్డ కప్పి బొందులు ముడేశాడు.

నీళ్ళు చిలకరించే సీసా తీసి ఇన్స్పెక్టర్ మొహంమీద నీళ్ళు కొట్టాడు. తుడిచి మళ్ళీ కొట్టాడు. సూర్యారావు రిలాక్సైపోయాడు.

బ్రష్ తో సబ్బు బాగా కలిపాడు. బాగా నురగ వచ్చాక గెడ్డానికి అద్దాడు. గెడ్డం మీద బ్రష్ ఆడుతోంది. నురగ గెడ్డం అంతటా వ్యాపిస్తోంది. సబ్బు వాసన షాపులో అలముకుంది.

“మీసం ముట్టుకోకు…. మీసం సంగతి నేను చూసుకుంటాను”. కిందటి సారీ ఇదే మాటన్నాడు.

“అలాగే సార్”

బేరాల్లేక అన్నదమ్ములిద్దరూ పొద్దుట్నించీ అదేపనిగా కత్తులకు సానపెట్టారు. అవన్నీ ఇప్పుడు మహావాడిగా మెరిసిపోతున్నాయి. అన్నిట్లోకీ వాడిగా ఉన్న కత్తిని ఎంచుకున్నాడు కైలాసం. బొటనవేలు మీద నెమ్మదిగా నొక్కి చూశాడు.

‘నా సామి రంగా, ధారు అదిరిపోయింది’ అనుకున్నాడు.

“వచ్చే నెల నుంచీ మన ఊళ్ళో కూడా స్పెషల్ పోలీస్ కేంపు పెడుతున్నారు. వీళ్ళ ఆటలు ఇంక సాగవు”.

కొత్తవిషయం తెలిసింది. ఈ సంగతిని నమోదు చేసుకున్నాడు. మేష్టారికి చెప్పాలి.

తోలు పట్టీ మీద కత్తిని ఇంకా సాన పడుతూ కొత్తలో తండ్రి భూలోకం నేర్పిన పాఠాలు గుర్తు చేసుకున్నాడు.

“ఒరేయ్, కత్తి ధారుగా ఉంటేనే అది మన మాట వింటుంది. ఎంత మొండి గెడ్డమైనా లొంగిపోతుంది. కాని గెడ్డం చేసేవాడు మూడే మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. చర్మాన్ని సాగదీసి కత్తికి దారి చూపించాలి. కత్తిని కిందకి లాగాలి. ఎగ్గొరగ కూడదు. అందుకే ‘మంగలాడెంత మంచోడైనా ఎగ్గొరిగితే మంటే’ అన్నారు. తేలిగ్గా లాగి చివర్లో తేల్చాలి. లోపలికి  నొక్క కూడదు. తేల్చు. అద్గదీ, అలా తేల్చు”.

ఎడమ బొటన వేలుతో చర్మాన్ని లాగి పట్టి, దారిచేసి, కుడి చేత్తో కత్తిని నడిపిస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే కత్తి మహాసున్నితంగా తన పని చేసుకుంటూ పోతోంది.‘ఇప్పుడు గాని కత్తి కిందకి దించి గొంతుకమీద ఒక్క నొక్కు నొక్కేనంటేనా! వీడి పని అయిపోతుంది. ఇవాళ నా చేతిలో చస్తాడు’ అనుకున్నాడు.

షట్టర్ మూసిన శబ్దం. ఎదురుగుండా మెడికల్ షాపు కోమటాయన ఇం’టికి వెళ్ళిపోతున్నాడు. సాయింత్రం అయిదైతేగాని రాడు. గడియారంలో రెండవుతోంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. కైలాసానికి చెమటలు పడుతున్నాయి. గుండె కొట్టుకోవడం వినిపిస్తోంది.

పెదవికింద కత్తి లాగుతున్నాడు. మీసానికి అటూ, ఇటూ. పైన కూడా.

“మీ నాన్న కన్నా నువ్వే బాగా చేస్తున్నావు రా”

“అదేం లేదు సార్”

ఫైనల్ గా ఎక్కడా గరుకు మిగలకుండా మొత్తంగా కత్తి లాగుతున్నాడు. గొంతుక దగ్గర ఒక్క క్షణం కత్తి నిలిచి పోయింది, దానంతట అదే. మళ్ళీ కదిలింది.

ఆలోచనలు ముందుకి పరుగెడుతున్నాయి. వీడ్ని చంపితే మాత్రం ఏమొస్తుంది? ఊరంతా ఈ వార్త గుప్పుమంటుంది. నెలయ్యాక అంతా మర్చిపోతారు. మరో ఇన్స్పెక్టర్ వస్తాడు. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు.  పదేళ్లో, ఇరవై ఏళ్లో శిక్ష పడుతుంది. ఒట్టి పిరికిపంద, గెడ్డంచేస్తూ చంపేసాడు అంటారు కొందరు. విప్లవకారుల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడని కొందరనవచ్చు. మధుసూదనం మేష్టారు ఏమంటారో?

“తొందరగా కానీ, స్టేషన్ కి వెళ్ళాలి” అని ఇన్స్పెక్టర్ అనడంతో ఉలిక్కి పడి నిలుపుచేసాడు. నున్నగా మెరిసిపోతోంది గెడ్డం. ఎక్కడా ఒక్క గాటు గాని రక్తపు ఛాయలు గాని లేవు. ఈ పనితనం తండ్రి చూస్తే సంతోషించే వాడు. ఇన్స్పెక్టర్ మొహాన్ని తడిచేసి,  తువ్వాలుతో తుడిచి, పైన వేసిన గుడ్డ విప్పి తీసేసాడు. ఇప్పుడింక సబ్బు మరకలు కూడా లేవు.

పిస్తోలుబెల్టు, తూటాలపటకా తగిలించుకుంటూ, ఇన్స్పెక్టర్ అన్నాడు: “మనుషుల్ని చంపడం అంత తేలికేమీ కాదు. కసి ఒక్కటే సరిపోదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి. మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా కాలం పడుతుంది”.

కైలాసం నిర్ఘాంతపోయాడు. గొంతుక ఆర్చుకు పోయింది. నోరు పెగల్లేదు. చెవుల్లోంచి ఆవిర్లు. పది రూపాయిలు చేతిలో పెట్టి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్.

‘మీ వాళ్ళు అన్నాడు….అంటే?… తెలిసిపోయిందా?’

కైలాసం బుర్ర పనిచెయ్యడం లేదు. మోటార్ సైకిల్ బయిల్దేరింది. పెద్ద బజారు మీదుగా చర్చి పక్కన పోలీస్ స్టేషన్ దారిలోకి మళ్లే వరకూ బడబడ వినిపిస్తూనే ఉంది.