రచన: కుప్పిలి పద్మ

వార్త‘, మే 2000
సాలభంజిక‘ కథా సంకలనం


రోజ్‌వుడ్‌ పెయింట్‌ చేసిన 2 x 2 నలుచదరపు టేబుల్‌కి అటో కుర్చీ యిటో కుర్చీ. టమోటా చిల్లీ సాస్‌, వెనిగర్‌, సాల్ట్‌, పెప్పర్‌ చిన్ని చిన్ని పింగాణీ గిన్నెలతో అమర్చిన ట్రే. యుయెస్‌ పీజా వాసనలు.  ప్లాస్టిక్‌ గ్లాస్‌లోని కోక్‌, స్పైట్ర్‌, థమ్సప్ చల్లదనాలు.

ఫ్లైవోవర్‌ మీది నుంచి యెడతెరిపి లేకుండా సాగిపోతోన్న కార్లు స్కూటర్లు, ఆటోల మధ్య బస్సులు తక్కువగానే కనిపిస్తున్నాయి. యెదురు చూస్తున్న వాహనం మాత్రం కనిపించటంలేదు.

ఎర్రదీపాలు వెలిగి ఆరుతున్నాయి. రయ్‌ రయ్‌మంటూ పైలెట్‌ వాహనం వెనుక వరుసగా వో పదికార్లు… టైట్‌ సెక్యూరిటీతో. మూడు నిమిషాల తర్వాత అటూయిటూ ఆపిన  వాహనాలని వదిలారు. మూడు గుక్కల కోక్‌  తాగేలోగా రాజ్‌భవన్‌కో జూబ్లీ హిల్స్‌కో కాలేజ్‌ రోడ్డులోని వి.వి.ఐ.పి.ల యిళ్లకో పోతుంటారు.

రోడ్డు విశాలత్వాన్ని మింగేస్తోన్న వాహన రద్దీ. యిద్దరు విదేశీయులు చేయి చేయి పట్టుకొని రోడ్డు డివైడర్‌పై పెంచిన లాన్‌ని తొక్కుకుంటూ రోడ్డుని క్రాస్‌ చేస్తున్నారు. స్వదేశీయులకి యింకా అంత తెగింపు రాలేదు. కిలోమీటర్‌ దూరం నడిచే రోడ్డుని క్రాస్‌ చేస్తు న్నారు. రోడ్లు వెడల్పు చేసినా ఫ్లైవోవర్లను నిర్మించినా నడిచేవారికి చోటెందుకు వుండదో?!

ట్రాఫిక్‌లోంచి ఆగి ఆగి వస్తున్న సందీప్‌.

రెండ్రోజులుగా నిద్రపట్టడం లేదు. ఆత్రుత. ఆందోళన. దిగులు. బరువుగా, భారంగా రెండ్రోజుల నిరీక్షణ.

యమహాని పార్క్‌ చేసి జుట్టు సరిచేసుకొని లోపలికి వచ్చాడు. వెలుతుర్లోంచి లోపలికి రాగానే అమర్చిన మసకతనం. చల్లదనం అలవాటై మూలకి వచ్చి కుర్చీలో కూర్చుంటూ, ‘‘హాయ్‌ సారీ. ట్రాఫిక్‌,’’ కామన్‌ సంజాయిషీ.

తర్వాత మౌనం. మనసులో ఆలోచనలు …

యింతకు ముందైతే – మా కబుర్లకి కామా పుల్‌స్టాప్‌లే లేవు. రెండు మూడుగంటలు యెదురెదురుగా కూర్చుని గడిపేవాళ్లం. ఐ.టి., సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు. హాలివుడ్‌ బాలివుడ్‌ సోషియాలజీ పాలిటిక్స్‌- వొక్కటేంటి కలగాపులగం.

వో రోజు – పక్క టేబుల్‌ దగ్గర సర్వ్‌ చేస్తున్న వ్యకి పైనే చూపులు నిలిచాయి. బాగా పరిచయం వున్న ముఖం. అతను లోపలికి వెళ్లిపోయాక గుర్తొచ్చింది. ఇడ్లీ బండబ్బాయి.

‘‘అతను నరసింహ కదా,’’ అడిగాను సందీప్‌ని.

‘‘వూ. నరసింహే. యిక్కడ పనికిచేరాడా,’’ సందీప్‌ మామూలుగా అన్నాడు.

అంతలోనే నరసింహ మా పక్క టేబుల్‌ క్లీన్‌ చేయడానికి వచ్చాడు.

‘‘యిక్కడ చేరారా?’’ పలకరించా.

‘‘ఆ.’’

‘‘మీ యిడ్లీబండి?’’

‘‘గిరాకి లేదమ్మా.’’

‘‘యిక్కడ బాగుండేదికదా. అసలు యిక్కడ నుంచి మీరంతా యెందుకు వెళ్లిపోయారు.’’

‘‘వెళ్లిపోలేదు. మమ్మల్ని…’’

‘‘ఎక్స్‌క్యూజ్‌మీ,’’ పక్క టేబిల్‌ నుంచి పిలుపు.

‘‘యిప్పుడే వస్తా,’’ అని నర్సింహ వెళ్లాడు.

బేరర్‌- క్లీనర్‌- సర్వర్‌- వొకనాటి వోనర్‌ నర్సింహా. యిడ్లీబండిపై వేడి వేడి యిడ్లీలు  దోశలొ సెనగపప్పు- అల్లంపచ్చడి కారం పొడి టీ కాఫీ. పక్కనే ఛాట్‌ బండి – పానీపూరి బేల్‌పూరి రగడా ఛాట్‌ పావ్‌భాజి జిలేబి.

కాలనీవాళ్లు, కాలేజ్‌ స్టూడెంట్స్‌ దారేపోయేవాళ్లతో యెప్పుడూ యీ రెండు బళ్లు  బిజీగా వుండేవి. చుట్టు పక్కల కాలేజ్‌ స్టూడెంట్స్‌ అడ్డా. టూ వీలర్స్‌ని ఆనుకొని బండరాళ్లపై కూర్చుని, కార్లపైన కూర్చుని తింటూ గుంపులు గుంపులుగా అమ్మాయిలు అబ్బాయిలు కబుర్లు చెప్పుకునేవాళ్లం.

అప్పుడప్పుడు యిడ్లీ, దోశ పార్సిల్‌ చేయించుకొని అమ్మకి తీసుకు వెళ్లేదాన్ని. అమ్మకి అల్లం పచ్చిడి, కారప్పొడి భలే నచ్చేది. యీ కాలేజ్‌కి వచ్చిన  కొత్తలో స్టూడెంట్స్‌ దగ్గర యిప్పుడున్నన్ని కాకపోయినా పేజర్స్‌, సెల్‌ఫోన్స్‌ యెక్కువగానే వుండేవి. యెక్కువగా అబ్బాయిల దగ్గరే వుండేవి. వో రోజు కాలేజ్‌కి డ్రాప్‌ చేయడానికి వచ్చిన అమ్మ, ‘‘సెల్‌ఫోన్స్‌ పేజర్స్‌ కొత్త కొత్త కార్లు… అయినా బళ్ల మీదవి బానే తింటున్నారే,’’ అంది.

‘‘వీళ్లలో చాలామంది సాయంత్రం ఫైవ్‌స్టార్‌ త్రీస్టార్‌ హోటల్స్‌కి, క్లబ్స్‌కి, రిసార్ట్స్‌కి లేట్‌నైట్‌ పార్టీస్‌కి డిస్కోస్‌కి వెళతారు.’’

‘‘వూఁ,’’ అంది అమ్మ గోడమీద గోవింద సినిమా పాట ‘మై బేల్‌పురి’ వాల్‌పోస్టర్‌పై చూపు నిలిపి.
దసరా సెలవలు అయిపోయి కాలేజ్‌కి వచ్చేసరికి యిడ్లి ఛాట్‌ బళ్లు లేవు.

డ్రింక్‌ యిన్‌ – రెస్టారెంట్‌.

పీజా, బర్గర్‌, పేస్ట్రీస్‌, ఐస్‌క్రీవ్‌ు, కోక్‌, ధమ్సప్‌, మిరిన్‌డా- యిద్దరికి మాత్రమే సరిపోయే టేబుల్స్‌.
వీడియో గేమ్స్, యింటర్‌నెట్‌, గ్రీటింగ్‌ కార్డ్సు పువ్వులు, రంగు రంగుల నిలువెత్తు డబ్బాలో టెలిఫోన్‌.

అప్పటినుంచి డ్రింక్‌ యిన్‌ మా అడ్డా.

డ్రింక్‌ యిన్‌ రావటంతో యిడ్లి ఛాట్‌బళ్లు  డబ్బా టెలిఫోన్‌ బూత్‌ మాయమైపోయాయని చెప్పాను.

‘‘వాళ్లంతా యేమైపోయారు,’’ అంది అమ్మ.

‘‘యేమైపోరు. వేరేచోట వ్యాపారం బాగుంటుం దని వెళ్లుంటారు,’’ అన్నాడు నాన్న.

చప్పున టాపిక్‌ మార్చేశాను. వాదన యెటు తిరిగినా చివరికి అమ్మ నొచ్చుకునేట్టు యేదో వో మాట అనేస్తాడు నాన్న.

నరసింహ కనిపించిన రాత్రి  భోజనాలప్పుడు, ‘‘నరసింహ కనిపించాడు,’’ అమ్మకి చెప్పాను.

‘‘యే నరసింహా?’’ అమ్మ అడిగింది.

‘‘యిడ్లి బండి, డ్రింక్‌ యిన్‌లో సర్వర్‌, క్లీనర్‌, బేరర్‌… యేమైనా కానీ ప్రస్తుతం అక్కడ పనికి చేరాడు. డ్రింక్‌ యిన్‌ మొదలవ్వటానికి రెండ్రోజుల ముందు ట్రాఫిక్‌ పోలీసులు తరిమేశారంట. మూడేళ్లుగా మేం వుంటున్నాం. వాళ్లకి అంతో యింతో  యిచ్చుకుంటు న్నాం. మేం యెలా ట్రాఫిక్‌కి అడ్డం అయ్యామో తెలి యదు. తరిమేశారు అని బాధపడ్డాడు.యిదంతా డ్రింక్‌ యిన్‌ వాళ్లే డబ్బులిచ్చి చేయించారని నరసింహ నమ్మకం. అక్కడ నుంచి మరోచోటుకి వెళితే అప్పటికే అక్కడున్న బళ్లవాళ్లతో గొడవంట వాళ్ల వ్యాపారం పోతుందని. సంపాదించిన డబ్బుల్లో పెద్దగా దాచు కున్నవి లేవంట. టి.వి. స్కూటర్‌ ఫ్రిజ్‌ యిన్‌స్టాల్‌ మెంట్స్‌లో కొనుక్కున్నాడంట. ఆ బాకీలు తీర్చటం యిల్లు గడవటం రోజురోజుకీ తగ్గిపోయిన గిరాకీ చివరికీ డ్రింక్‌ యిన్‌లో చేరాడంట,’’ నరసింహ చెప్పిందంతా అప్పజెప్పాను.

‘‘ట్రాఫిక్‌  పోలీసులా?!  వ్యాపారం బాగా సాగు తుందని గమనించే డ్రింక్‌ యిన్‌ వాళ్లు రెస్టారెంట్‌ మొదలుపెట్టారు. డబ్బాఫోన్‌ కుర్రాడిని పంపించేశారు. వొకరిద్దరు కస్టమర్స్‌ని కోల్పోవటం కూడా వాళ్లకి యిష్టం వుండదు. ఆ బళ్లు రెస్టారెంట్‌ పక్కన వుండటం కూడా చీప్‌లుక్‌ అనుకొని వుంటారు. ‘యీటింగ్‌ వరల్డ్‌ ’ రాగానే రోజూ కూరలు కొనుక్కొచ్చే అవ్వ తట్ట లేచిపో యింది కదా,’’ అంది అమ్మ.

‘‘యీటింగ్‌ వరల్డ్‌లో కూరలు ఫ్రెష్‌గా వుంటాయి. అన్ని సామాన్లు వొక్కచోటే కొనుక్కోవచ్చు కదా,’’ అన్నాడు నాన్న.

‘‘అవ్వ దగ్గర అకుకూరలు, పచ్చిమిర్చి, వంకా యలు యే కూరగాయలైనా నిగనిగలాడుతూనే వుండేవి, ’’ అమ్మ.

‘‘నీది వుత్తి ఆవేశం అరుంధతి, కరడుకట్టిన ధియరీలు, నీ కమ్యూనిస్ట్‌-ఫెమినిస్ట్‌ బుద్ధులు పోనిచ్చు కున్నావ్‌ కాదు. నీకేం తెలుసు ఇండియాలో ముఖ్యంగా మన దగ్గర పర్చేజింగ్‌ పవర్‌ యెంతలా పెరిగిందో, ఫ్రిజ్‌లకి, టి.వి.లకి, కార్లకి, యిల్లు కొనుక్కోవడానికి లోన్స్‌ యిస్తున్నారు. కొన్ని యింట్రస్ట్‌ ఫ్రీ కూడా. పేదా గొప్ప తేడా పెద్దగా లేదు. నువ్వు వుత్తినే ఆవేశపడు తున్నావ్‌,’’ నాన్న.

‘‘పేదాగొప్పా లేదు. పర్చేజింగ్‌ పవర్‌ కన్‌స్యూమర్‌ పవర్‌లెస్‌ కన్‌స్యూమర్స్‌ మోర్‌ కన్‌స్యూమర్స్‌ అసలు సిసలైన బ్యూరోక్రాట్‌వి,’’ అమ్మ.

రెండ్రోజులకోసారి యింట్లో యివే గొడవలు కొన్నాళ్లుగా. నాన్నకి సొంత యెజెండా వుండటం మేం చూడలేదు. యేపాత్రలోనైనా యిమిడిపోయి ఆ ఆకారంలా కనిపించే నీళ్లలా నాన్న పని చేసేస్తుంటే –

‘‘అసలీ పనులు యెందుకు చేస్తున్నావ్‌? వీటివల్ల జరుగుతుందేమిటో తెలియదా,’’ అమ్మ అడిగిందోరోజు.

‘‘షటప్‌ నన్నెవరూ ప్రశ్నించరు? నాతో యెవ్వరూ యిలా మాట్లాడరు. నువ్వు తప్పా. నువ్వూ నీ బోడి ఫెమినిజం ఎవరిక్కావాలి. నాలుగు నోట్లు చూపిస్తే నీతో వున్న ఆ నలుగురాడాళ్లు యిటొచ్చేస్తారు. డబ్బు సంపా దించటం చేతకాక సుఖంగా బతికేవాళ్లని ఆడిపోసు కోవటం. నీ కొడుకే నీ ఆలోచనలు పొరపాటంటు న్నాడు. గుర్తుంచుకో. యింకెప్పుడూ హాఫ్‌ నాలెడ్జ్‌తో ప్రశ్నించకు.’’

‘‘నే నమ్మిన విలువలకి కట్టుబడి వున్నాను. నువ్వు వున్నావా,’’ అమ్మ అడిగింది.

‘‘యేంటి నీ విలువలు? ఆడాళ్లకి రాజ్యమా? చదువా? డబ్బా? పిల్లలా? మొగుడా? అందాల పోటీలా? నా విలువలనే ప్రశ్నిస్తావా? పొగరెక్కి…’’ తింటున్న అన్నం పళ్లం నేలకేసి కొట్టాడు నాన్న.

వాళ్లిద్దరి బెడ్‌రూమ్స్ వేరైపోయాయి.

‘‘యేంటమ్మా యిదంతా? యింతగా మీ యిద్దరికి యే విషయంలోను పడదు కదా యిద్దరూ యిష్టపడి యెలా పెళ్లి చేసుకున్నారు,’’ ఆరోజు అమ్మని అడిగాను.

‘‘యిష్టపడే చేసుకున్నాం. యింట్లోవాళ్లని వొప్పించి, కాదన్నవాళ్లని పట్టించుకోకుండానే చేసు కున్నాం. అప్పట్లో విజయ్‌ యిలా వుండేవాడు కాదు. రానురాను అతనిలో రకరకాల మార్పులు వచ్చాయి. పవర్‌ వైపు, అక్రమార్జన వైపు తను పరుగు మొదలుపెట్టి నప్పట్నుంచి అతనిని రక్షించుకోవాలని నే చేసిన ప్రయ త్నాలేవీ ఫలించలేదు. యిప్పుడు యే మానవీయ స్పర్శా అతనికి అక్కర్లేదు. ముందే అతను యిలా వుండివుంటే తను నా ఛాయిస్‌ అయివుండే వాడు కాదు,’’ అంది అమ్మ.

‘‘యిలా యెందుకు జరుగుతుందంటావ్‌.’’

‘‘గ్లోబలైజేషన్‌ బ్యాంక్స్‌ దగ్గరే ఆగిపోదమ్మా బెడ్‌ రూమ్ లోకి వచ్చేస్తుంది,’’ అంది అమ్మ.

ఆ రోజు నుంచి అమ్మా నాన్న మాట్లాడుకోవటమే అరుదైపోయింది.

యిన్ని గొడవల మధ్యకి నరసింహ సమస్యని అనవసరంగా తీసుకొచ్చానేమో. అమ్మ  వొక్కతే వున్నప్పుడు చెప్పాల్సింది.
టాపిక్‌ మార్చాలి వెంటనే. యే టాపిక్‌? తమ్ముడి చదువు… నా చదువు… టి.వి. సీరియల్స్‌… అరే… బ్లాంక్‌… ఆ… సందీప్‌.

‘‘నే కాలేజ్‌కి వెళ్లాక సందీప్‌ యేమైనా ఫోన్‌ చేశాడా? యీమధ్య కలిసి పదిరోజులై పోయింది. ఫోన్‌ చేసినా దొరకటంలేదు,’’ తమ్ముడితో అన్నాను.

‘‘లేదు. బిజీగా వున్నాడేమో,’’ అన్నాడు.

‘‘యింట్లో యెవ్వరూ లేరా,’’ అమ్మ అడిగింది.

‘‘ఆంటీ వున్నారు. మెసేజ్‌ యిచ్చాను.’’

ఫోన్‌ మోగింది. నాన్న తీశారు.

‘‘హాయ్‌ హౌ ఆర్‌ యూ. హా గుడ్‌ వెరీగుడ్‌. కంగ్రాట్స్‌,’’ అని ఆగి నాన్న కార్డ్‌లెస్‌ అందించారు.

‘‘హలో.’’

‘‘హాయ్‌ జాబ్‌ వచ్చింది. స్టేట్స్‌ వెళుతున్నా. ఆరేంజ్‌మెంట్స్‌లో బిజీ,’’ సందీప్‌ చెపుతున్నాడు.

‘‘రేపు డ్రింక్‌ యిన్‌కి రా,’’ అన్నాను.

‘‘రేపా? రేపు కాదు యెల్లుండి.’’

‘‘రేపేంటి పని?’’

‘‘క్లాస్‌ వుంది.’’

‘‘యే క్లాస్‌?’’

‘‘పర్సనాలిటి డెవలప్‌మెంట్‌. రేపు ఆఖరి క్లాస్‌,’’ అన్నాడు.

‘‘యెల్లుండి సాయంత్రం. బై.’’

‘గుడ్‌. వెరీ గుడ్‌. సందీప్‌ అమెరికా వెళుతున్నా డంట. వచ్చే యేడాది నా కొడుకూ వెళతాడు…’’ నాన్న మాట్లాడుతూనే వున్నాడు. నాకేం వినిపించటంలేదు.

అమెరికా వెళతాడా? అసలీ ప్రస్తావనే మామధ్య యెప్పుడూ రాలేదు.

అమ్మ గదిలోకి నా వెనకే వచ్చింది.

‘‘సందీప్‌ వెళ్లాలనుకుంటున్నాడని నీకు తెలుసా?’’

‘‘తెలియదు.’’

‘‘యేంటలా అయిపోయావ్‌.’’

‘‘అమెరికా… తను వెళితే అతన్ని చాలా మిస్‌ అవుతా.’’

‘‘తిరిగి వస్తాడుగా.’’

‘‘వుద్యోగానికి వెళుతున్నాడు.’’

‘‘వూఁ యేడాదికి తిరిగిరాడా.’’

‘‘సంవత్సరం తక్కువ కాలమా? వచ్చినా తిరిగి వెళతాడు. తనని కలవకుండా మాట్లాడకుండా వుండటం నాకు కష్టంగానే వుంటుంది.’’

‘‘నీకు అమెరికా వెళ్లాలని వుందా లేదా?’’ అమ్మ అడిగింది.

‘‘కొన్నాళ్లు వుండి వుద్యోగం చేయటం చదువు కోవటం పట్ల నాకేం అభ్యంతరం లేదు. సెటిల్‌ అవ్వా లని లేదు. అయితే యిప్పుడు సమస్య నా చదువు యింకా పూర్తికావడానికి యేడాది టైవ్‌ు వుంది. తనతో వెంటనే వెళ్లలేను కదా,’’ అన్నాను.

‘‘వెంటనే వెళ్లలేకపోవచ్చు. బెంగగానే వుంటుంది కానీ కమ్యూనికేషన్‌ కష్టంకాదు కదా. యీమెయిల్‌, చాట్‌ యిన్ని వున్నాయి కదా యెల్లుండి కలిసినప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడు,’’ అంది అమ్మ.

‘‘వినగానే బాగా దిగులేసింది. చదువు పూర్తిచేశాకే వెళతా. కమ్యూనికేషన్‌ పెద్ద సమస్య కాదు. క్షణాలపై అన్నీ మాట్లాడవచ్చు. యిట్స్‌ వెరీ ఫన్నీ. నో పది నిము షాల ముందువరకు సందీప్‌ ఫోన్‌ చెయ్యలేదని తప్ప మరే ఆలోచన లేదు. యిప్పుడేమో చదువు పూర్తి చేయటం, అమెరికా వెళ్లటం యెలా యివే ఆలో చనలు. సందీప్‌ నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కాని యెప్పుడు యెక్కడా యెలా అని అనుకోలేదు. యెల్లుండి మాట్లాడాలి,’’ అన్నాను.
యిదిగో యిప్పుడిలా సందీప్‌తో.

********

‘‘యేమిటి మట్లాడాలన్నావ్‌,’’ అడిగాడు సందీప్‌.

‘‘అమెరికా వెళుతున్నావ్‌, మనం యెలా ప్లాన్‌ చేసుకుందాం,’’ అడిగాను.

సందీప్‌ కొంచెం సమయం తీసుకొని, ‘‘యిమో షనల్‌గా కష్టంగానే వుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా తప్పటం లేదు. నీ చదువు నా చదువు వేరు. మనిద్దరికి వొక్కచోట వుద్యోగం దొరకటం కష్టం. ఛాన్స్‌ లేదు. నా ప్రొఫెషన్‌లోనే వున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే యిద్దరం వొకే చోట వుద్యోగం చేయవచ్చు. వొకేసారి ఆఫీసుకి కలిసి వెళ్లొచ్చు. యింటికి కలిసి తిరిగి రావొచ్చు. యింటిపని కలిసి చేసుకోవచ్చు. ప్రొఫెషనల్‌ గా బోల్డంత చర్చించుకోవచ్చు. నీ పని పూర్తయి నువ్వు యింటికి త్వరగా వచ్చేస్తావనుకో. నా పని కాకపోవచ్చు. అప్పుడు యింట్లో వొంటరిగా నాకోసం నువ్వు యెదురు చూస్తుంటావ్‌. నువ్వు ఆలస్యమైనా నేను త్వరగా రావొచ్చు. అప్పుడు నువ్వు యెదురుచూడాలి. లాంగ్‌ రన్‌లో గొడవలు లేకుండా వుండాలంటే ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్‌ టెన్షన్స్‌ వర్క్‌ మీద పడకూడదు,’’ సందీప్‌ చెపుతున్నాడు.

సందీప్‌ కొత్తగా తోచాడు. కొత్త మాటలు కొత్త ఆలోచనలు, పదిరోజులైయిందా కలిసి. యింతలోనే యెంత కొత్తో.

‘‘ఫ్యామిలీ లైఫ్‌ చాలా ముఖ్యమంటా. వర్క్‌లో సక్సెస్‌ అవ్వటానికి.’’

‘‘ముఖ్యమంటా…? యెవరు చెప్పారు?’’ అడిగాను.

‘‘పర్సనాల్టి డెవలప్‌మెంట్‌ క్లాసెస్‌కి వెళ్లానుగా.’’

‘‘యెన్ని క్లాసులు.’’

‘‘రోజుకి రెండు గంటలు, యేడు రోజులు.’’

‘‘మొత్తం పధ్నాలుగు గంటలు.’’

‘‘ఆ. మనం మంచి స్నేహితుల్లా వుండిపోదాం. పెళ్లి చేసుకొని లాంగ్‌ రన్‌లో పొట్లాడుకోకుండా… విడి పోకుండా నువ్వు కూడా చక్కగా సోషియాలజి స్టూడెంట్‌ని చూసి పెళ్లి చేసుకుంటే యిద్దరూ కలిసి వొకే పనిని చేయచ్చు. యెన్‌.జి.వో. పెట్టొచ్చు. కన్స ల్టెంట్స్‌గా పనిచేయచ్చు. పనిని షేర్‌ చేసుకోవచ్చు.’’

‘‘గుడ్‌. పర్సనాల్టి డెవలప్‌మెంట్‌ క్లాసెస్‌ నీకు బాగా నచ్చాయా.’’

‘‘చాలా. మనం కొన్ని విషయాలని అర్థం లేకుండా ఆలోచిస్తాం. నేను నిన్ను పెళ్లిచేసుకోనని చెపితే నువ్వు బరస్ట్‌ అవుతావని నీ విషయంలో నా నిర్ణయం తప్పని అన్యాయమని యిన్‌హ్యామన్‌ అని అమ్మ బోల్డంత పోట్లాడింది. కోప్పడింది. నచ్చచెప్పాలని ప్రయత్నించింది. నే చెబుతూనే వున్నా నువ్వు అర్థం చేసుకుంటావని. యీ నిర్ణయం మన యిద్దరి జీవితా లకి మంచిదేనని,’’ సందీప్‌ మాట్లాడుతూనే వున్నాడు.

పధ్నాలుగు గంటల పర్సనాల్టి డెవలప్‌మెంట్‌ క్లాసెస్‌- మా ఐదేళ్ల స్నేహం ప్రేమని యింత ప్రాక్టికల్‌గా ఆలోచింపచేసి నిర్ణయాలని తీసుకొనేంత శక్తివంతమై నవా?

లేక బుర్రలో అటూయిటూ కొట్టుమిట్టాడుతున్న వాటిని బయటకి లాగి పైకి మాట్లాడటానికి కావల్సిన సపోర్ట్‌ని యిచ్చాయా? నిజంగా సందీప్‌ చెపుతున్నవి కారణాలేనా? అంతకంటే బలమైనది, భయపెట్టేది చెప్పలేక యివి చెపుతున్నాడా? బతకటం  అవసరమా? అనవసరమా? అటో యిటో తేల్చి చెప్పే కౌన్సిలింగో యేదో వొక డెవలప్‌మెంట్‌ క్లాసో వర్క్‌ షాపో వుంటాయి. యెందులోకి వెళ్లాలన్నది మన ఛాయిస్‌ కదా.

సో… సందీప్‌ ఛాయిస్‌.

పంచుకున్న కాలాన్నో జల్లుకొన్న రంగుల్నో విర జిమ్ముకొన్న పరిమళాలనో చెవిలో ముద్దునో తడ బడుతూ అల్లుకొన్న శరీరాల మోహస్పర్శనో గుర్తుచేసి నిర్ణయం మార్చుకో అని నచ్చచెప్పటం వాదించటం అనవసరం.

ఆ రాత్రి కంప్యూటర్‌ ముందు కూర్చుని మెయిల్‌ చూస్తున్నా.

‘‘మీ అమ్మలా వుత్తినే ఆవేశపడటం తప్ప బతికే తెలివిలేదు. నేనప్పుడే చెప్పా. సోషల్‌ సైన్స్‌లు వద్దూ. యెంసెట్‌ రాయమన్నా వినలేదు. బియస్సీ కంప్యూ టర్స్‌… వినలేదు. సందీప్‌కి చెప్పొచ్చుగా సంవత్సరంలో డిప్లమా కోర్సు చేసి వచ్చేస్తా నీ లైన్‌లోకే అని. ఐ.టి.దే భవిష్యత్తంతా. యిప్పటికేనా నా మాట విని యేడాది కోర్సులో చేరు. కంప్యూటర్‌ లైన్‌లో లేకపోతే పెళ్లిళ్లు కష్టం.’’

నాన్న మాటలు వింటుంటుంటే నవ్వొచ్చింది.

‘‘యేదైనా యాడ్‌ యేజన్సీ వాళ్లకి ఫోన్‌చేసి ఐ.టి.లో చేరితే మొగుడు గ్యారెంటీ అని చెప్పరాదు. కంప్యూటర్‌ యిన్‌స్టిట్యూషన్స్‌ ప్రకటనల్లో వాడు కుంటారు,’’ అన్నాను.

‘‘నవ్వులాటగుంది. క్లాసెస్‌కి వెళ్లు.’’

‘‘నాన్నా! యే రంగానికున్న ప్రాముఖ్యత ఆ రంగానికుంటుంది. నా పనులన్నీ కంప్యూటర్‌తో హాయి గా చేసుకుంటున్నాగా. అవసరమైన స్కిల్స్‌ని నేర్చు కుంటూనే వున్నాగా.  కానీ ఆ ఫీల్డు నా ప్రొఫెషన్‌ కాదు. పెళ్లికోసమని కంప్యూటరూ నేర్చుకోను. వంటా నేర్చు కోను. నాకు ఆసక్తిగానో నా యిష్టంగానో అవసరంగానో అనిపిస్తే యేవైనా నేర్చుకుంటా. అంతేకాని పెళ్లి కాదనో, మొగుడు వదిలేస్తాడనో నేర్చుకోను.’’

‘‘మీ అమ్మలా తయారయ్యావ్‌. వూ… సర్లే… నాకే మైనా మెయిల్‌ వుందా,’’ అన్నారు నాన్న.

‘‘లేవు. అమ్మకి వుంది,’’ అన్నాను.

నాన్న గదిలోంచి వెళ్లిపోయాడు.

సందీప్‌… సంవత్సరం తర్వాత పదిరోజుల సెలవు పై వచ్చాడు. పెళ్లికి పిలిచాడు.

అరటిచెట్లు, మల్లెపూలు, కొబ్బరాకులు, మామి డాకుల మంటపంలో సందీప్‌ అమ్మాయి మెడలో తాళి కట్టాడు.

‘‘యింటికి రాలేకపోతున్నా… టైవ్‌ు లేదు. తను  వెంటనే అక్కడ జాబ్‌లో జాయిన్‌ అవ్వాలి. వొకేచోట యిద్దరి వుద్యోగం. నీకు జెఎన్‌టియులో సీటు వచ్చిం దట కదా. నెక్స్‌ట్‌ టైవ్‌ు వయా ఢిల్లీ వస్తే నిన్ను చూడొ చ్చన్నమాట,’’  అన్నాడు.

‘‘వూహా.’’

‘‘అక్కడికి వచ్చి యేదైనా యూనివర్సిటీలో చదువుకోవచ్చు కదా,’’ అన్నాడు.

‘‘వూ… వెళతానింక.’’

‘‘వొక్క నిముషం,’’ అని సందీప్‌ పార్క్‌ చేసిన కార్లవైపు వెళ్లాడు. తిరిగొచ్చి, ‘‘యిది నీకోసం తీసుకొచ్చా. నెంబర్‌ బటన్స్‌ అక్కర్లేదు. పర్సన్‌ పేరు నెంబర్‌ చదువు కుంటూ వెళ్లు. రికార్డ్‌ అయిపోతాయి. ఫోన్‌ చేయా లనుకున్నప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పు. ఆటోమేటిక్‌గా డైల్‌ అవుతుంది. కాన్పిÛడెన్షియల్‌గా  వుంటుంది. నెంబర్స్‌ గుర్తుపెట్టుకోనక్కర్లేదు. టెలిఫోన్‌ నెంబర్స్‌ పుస్తకాన్ని మోసుకు తిరగక్కర్లేదు. జె.టి.యం., టాటా యేదో వొక కనెక్షన్‌ తీసుకో,’’ చిన్నిగా ముద్దుగా వున్న నల్లని యిన్‌స్ట్రుమెంట్‌ని చూపిస్తూ అన్నాడు.

‘‘సెల్‌ వాడేంత పనేంలేదే.’’

‘‘ఢిల్లీ వెళుతున్నావ్‌ చాలా యూజ్‌ఫుల్‌,’’ అన్నాడు.

‘‘వాడే వాళ్లకి యిస్తే సంతోషిస్తారు. వాడను కదా. మూలపెట్టాలి. వాడే అవసరం యిప్పట్లో రాదు,’’ అన్నాను.

‘‘నీ కోసమే తెచ్చా. యెలా? యేమివ్వను? పెర్‌ఫ్యూమ్స్. కాని యిక్కడ లేవు. యింట్లో వున్నాయి. డ్రైవర్‌తో మీ యింటికి పంపించనా?’’

‘‘వద్దొద్దు.పెళ్లికి వచ్చాను. మల్లెపూలు యిచ్చారు గా చాలు వెళతా.’’

‘‘సినిమాల్లో చూపించినట్లే పెళ్లిళ్లు జరుగుతాయా అని అమెరికన్‌ ఫ్రెండ్స్‌ అడిగారు. వాళ్లకి కేసెట్‌ చూపిస్తానని చెప్పాను. అందుకు కష్టపడి అరటిచెట్లని, కొబ్బరాకుల్ని, మల్లెపూలని, మామిడాకుల్ని తెప్పించాం. పద్ధతిగా అన్ని చేశాం. ఫ్రెండ్స్‌ని పిలిచి చూపించి పార్టీ యిస్తాం. వాళ్లకి యివి బాగా నచ్చుతాయి,’’ సందీప్‌ చెపుతుంటే చాలారోజులుగా నాలోనే వుండిపోయిన సందేహం గురించి అడగాలనుకున్నా.

‘‘యివన్ని నీకు నచ్చవా,’’ అడిగాను.

‘‘నచ్చటం నచ్చకపోవటానికి యేముంటుంది. మన ట్రెడిషన్‌ కదా. మన విషయాల పట్ల వాళ్లకు చాలా ఆసక్తి.’’

‘‘వూహా.. మనం వొక్కచోట వుద్యోగాలు చేయ లేమని యిలా యేవేవో చెప్పావు ఆ రోజు మన పెళ్లికి అడ్డంకులుగా. నిజంగా అవి సమస్యలా? కలిసి బతక డాన్ని విడిపోవడాన్ని ఆ చిన్న విషయాలు నిర్ణ యిస్తాయా? నీ పర్సనాల్టి డెవలప్‌మెంట్‌ క్లాసెస్‌లో మనం కలిసి బతకటంలో సంఘర్షణ వుంటుందని నువ్వు గుర్తుపట్టావ్‌ కాని యెందుకు అనేది నువ్వు చెప్పలేక- కలిసి ఆఫీసుకి వెళ్లడం, కలిసి వండుకోవటం, తినటం అంటూ  కారణాలు చెప్పావు. యిప్పటికైనా అసలు కారణాన్ని చెప్పగలవా?’’ అడిగాను.

సందీప్‌ కొన్ని  క్షణాలు యేం మాట్లాడలేదు.

‘‘మునీరా…’’ అని నా వైపే రెండు  క్షణాలు చూసి… తలాడిస్తూ, ‘‘నిజమే, అప్పుడు నీకు చెప్పగలను అనుకున్న వొకటి రెండు కారణాలు చెప్పాను. నిజానికి ఆ క్లాసెస్‌ చెప్పే ధైర్యాన్ని యిచ్చాయి కానీ చాలా కాలంగా మన యిద్దరి జీవితంపట్ల నాకెన్నో సందేహాలు, అనుమానాలు.మొదట్లో మనిద్దరి యిష్టాలు అభిప్రా యాలు వొకేలానే దగ్గరగానో వుంటూ వచ్చాయి. నువ్వు యీ దేశంలో వస్తున్న ప్రతి మార్పుని వొప్పుకోడానికో ఆచరించడానికో సిద్ధంగా లేవు. నరసింహ విషయమే తీసుకో.నిన్ను బాధపెట్టింది. నాకే బాధాలేదు. మార్పు సహజం. అభివృద్ధిని యెందుకొద్దనాలి? యింకొకరి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే అభివృద్ధిపట్ల నీకు అభ్యం తరం వుంది. మనిద్దరి జీవితం మీ అమ్మానాన్నగారిలా రోజూ గొడవలతోనే నిండిపోతుందని భయం వేసింది. మా నాన్నగారు చేసే పనులపట్ల మా అమ్మకి యే అభ్యంతరం వుండదు. యెక్కువ సంపాదిస్తే నాకు అక్కకి యింకాస్త యెక్కువ డబ్బులు యివ్వొచ్చు అనుకుంటుంది తప్ప యీ దేశంలోనో బయటో జరిగేవి యేది అమెకి పట్టదు. మా యింట్లో మీ యింట్లోలాంటి గొడవలు వుండవ్‌. నీకూ నాకు చాలా విషయాలలో కుదర్దనిపించింది,’’ అన్నాడు సందీప్‌.

‘‘వూహా.’’

యింటికి వచ్చేశాను.

అమ్మకి చెపితే, ‘‘యిన్‌ ప్రిన్సిపుల్‌ కలవదు అను కొని వుంటాడు,’’ అంది.

‘‘కలవటం కష్టం. అమెరికన్‌ స్నేహితుల కోసమో, రష్యన్‌ బంధువుల కోసమో నే పూలజడని వేసుకోలేను కదా. నాకు వేసుకోవాలనిపిస్తే తప్ప లేదా నా మొగుడు ఆస్వాదిస్తానంటే తప్ప. కేసెట్ల కోసం నావల్ల కాదుకదా. నేనింకా యేం సర్దుకోలేదు రా,’’’ అంటూ  గదిలోకి వెళ్లి సూట్‌కేస్‌లు తెరిచా.

బట్టలు, పుస్తకాలు, కేసెట్స్‌ సర్దుతున్నాం.

‘‘సందీప్‌ నిర్ణయం విన్నప్పట్నుంచి నే చాలా భయపడ్డా నీ గురించి యిమోషనల్‌గా. నిన్ను నువ్వు యెలా నిలబెట్టుకుంటావా అని దిగులుపడ్డా. నాకిప్ప టికి ఆశ్చర్యంగానే వుంటుంది. నీ లోపలి సంఘర్షణని యెలా యెదుర్కున్నావాని,’’ అంది అమ్మ.

‘‘నాన్న పూర్తిగా పవర్‌కి, డబ్బుకి అలవాటు పడటానికి యిరవై యేళ్లు పట్టింది. సందీప్‌ పూర్తిగా మారిపోవటానికి పధ్నాలుగు గంటలు పట్టింది. యిరవై యేళ్లుగా కొంచెం కొంచెం మారిపోతూ వున్న నాన్నని చూసి నువ్వెంత బాధపడ్డావో. బాధపడకుండా వుండ లేవు. విడిపోనూ లేవు. యిరవైయేళ్లు తక్కువ సమయం కాదు. యెలాగోలా కలిసి వుండటానికి అలవాటు పడి పోతాం. బట్‌ పదిహేను గంటలు, అరగంట, పదిహేను నిమిషాలు యెక్కువ సమయం మీక్కాదు. మాకు యెక్కువే. త్వరత్వరగా తీసుకునే నిర్ణయాలు మా తరాన్ని నిలబెడతాయో ముంచేస్తాయో. ఆనందాన్ని, సంతృప్తిని యిస్తాయో విషాదమైన శూన్యాన్ని నింపు తాయో యిప్పుడే నేనేం చెప్పలేను. కానీ నాకు వో విషయం ఆశ్చర్యంగానే వుంటుంది. సందీప్‌ని కలవా లని రెండ్రోజులు పడిన ఆత్రుత, ఆరాధన, బాధ, ఆదుర్దా సందీప్‌ నిర్ణయం విన్నప్పుడు యేమైపోయాయో తెలియలేదు. పధ్నాలుగు గంటల్లో మారిపోయిన కుర్రాడు యిరవైయేళ్లలో యేమవుతాడంటావ్‌?’’ అన్నాను.

‘‘యేమో … ఇరవయ్యేళ్లాగి చూద్దాం,’’ అంది అమ్మ, నవ్వుతూ.

నేనూ నవ్వేశాను. నవ్వి, చెప్పాను.

‘‘అన్నట్టు … నీకో విషయం చెప్పటం మర్చిపోయా. సందీప్‌ పెళ్లికి వెళుతుంటే చూశా. యిప్పుడు డ్రింక్‌ యిన్‌ లేదు. రెండ్రోజుల క్రితం నేనెళ్లినప్పుడు వుంది. డ్రింక్‌ యిన్‌ వెనక వో పెద్ద షాపింగ్‌ మాల్ వచ్చింది. కడుతున్నప్పుడు డ్రింక్‌యిన్‌ ఆ కాంప్లెక్స్‌ వాళ్లకి అడ్డు అని  నే అనుకోలేదు. ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో రెస్టారెంట్‌, బిలియర్డ్స్‌,  యింటర్‌నెట్‌,  పిల్లల పార్క్‌, కూరలు, కోళ్లు… వొక్కటేంటి? దొరకనివి లేవు. బట్టలు, నగలు, యిదీ అదీ అని కాదు అన్నీ వున్నాయి. రోడ్డు వైడెనింగ్‌ అంటూ నిమిషాలపై డ్రింక్‌ యిన్‌ కూల్చేసరికి ఆ మాల్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.’’

‘‘అవునా, ఆ మాల్ పేరేంటి?’’

‘‘యిన్‌స్టంట్ లైఫ్!’’