రచన: చందు తులసి

ఆంధ్రజ్యోతి‘, 4 అక్టోబర్ 2015
కథాసాహితి ‘కథ-2015‘ సంకలనం


మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గూ రోషం ఉండాలమాట మీద నిలబడాలఅప్పు తీసుకునేటపుడు తియ్యని ముచ్చట్లు ఎన్ని సెప్పావుతీరా అప్పు కట్టమంటే మాత్రం పిట్టకథలు శానా సెపుతున్నావుఅంత సేత కాకపోతే ఎవరు నిన్ను అప్పు తీసుకోమన్నాడు? నేనేం నీ ఇంటికి కొచ్చానానువ్వే కదా పదిసార్లు నా ఇంటి చుట్టూ తిరిగావు! పోయినేడాది ఏమన్నావువచ్చే ఏడాది కడతా సేటూ అన్నావుమరి కట్టావాదొంగోని మాదిరి తప్పించుకొని తిరుగుతున్నావునిన్ను పట్టుకోవడం చానా కష్టమపోయింది

నిజమే సేటు గారూ…. కానీ,  ఇప్పటికిప్పుడు తీర్చమంటే ఎట్లా తెచ్చేది” నసిగాడు నారాయణ.

ఎట్టా తీరుస్తానని తీసుకున్నావయ్యా అప్పుఎట్టా తీర్సేది కూడా నేనే సెప్పాల్నా! నీ పెండ్లాన్ని పంపురా సెపుతా….”

 పొద్దున అప్పు వసూలు కోసం వచ్చిన సేటు అన్న మాటలే మళ్లీమళ్లీ వినిపిస్తున్నాయి నారాయణకు.

ఎన్ని మాటలన్నాడు! వాడేం ఉత్తపుణ్యానికిచ్చాడా? నూటికి ఐదు రూపాయలు వడ్డీ తీసుకుంటున్నాడు కదానేనేం అప్పు ఇయ్యనన్నానా?” అనుకున్నాడు నారాయణ గబగబా నడుస్తూ.

కాసేపట్లోనే ఊరవతల ఊడల మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడుఆవేశంలో ఉరి పోసుకుందామని వచ్చాడు కానీ తాడు తెచ్చుకోవడం  మర్చిపోయాడుఇప్పుడెట్టాచెట్టువైపు చూశాడుజడలు విరబోసుకున్న బ్రహ్మరాక్షసి మాదిరి ఉంది ఆ మర్రి చెట్టు.

జాగ్రత్తగా చెట్టు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు.

ఒక్కటి కాదు, రెండు కాదు  కొమ్మ కొమ్మకో ఉరి తాడు. మొక్కులు తీర్చమని దేవుళ్ల దగ్గర కట్టినట్లు … తాళ్లు … ఉరితాళ్లు.

ఇంకా పైకి చూశాడుగబ్బిలాలు తలకిందుల్లా వేలాడుతున్నాయి. అవి గబ్బిలాల్లా లేవుఆ చెట్టుకు ఉరిపోసుకుని సచ్చిపోయి వేలాడుతున్న ఆత్మల్లా ఉన్నాయి? ఓ తాడు అందుకోబోయాడుఅంతే!

ఏడనుంచి వచ్చాడో సేటు సచ్చిపోతే అప్పు తీరిపోతుందని చంకలు గుద్దుకుంటున్నావారానా అప్పు తీరిస్తే కానీ నిన్ను సావనివ్వను … హహ్హహ్హహ్హ,” వికటాట్టహాసం చేశాడు.

తపో భంగమైన మునుల్లాగా ఉలిక్కి పడ్డాయి గబ్బిలాలు.

కీచ్ కీచ్… కీచ్ కీచ్… వందలాది గబ్బిలాలు భోరున విలపిస్తూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయివాటిని జాగ్రత్తగా చూశాడు నారాయణఅవి గబ్బిలాలు కాదుఆత్మలే. వాటిలో తన తాత ఉన్నాడుఅప్పు తీర్చలేక సచ్చిపోయిన నాయన ఉన్నాడు.  గొడ్రాలని నింద తట్టుకోలేక ఉరిపోసుకుని సచ్చిపోయిన ఊర్మిళక్క ఉంది.

వాళ్లే… వాళ్లే గబ్బిలాల్లా తిరుగుతున్నారు.

“తాతా… నాయనా… అక్కా,” కేకలు పెట్టుకుంటూ వాటిని పట్టుకోపోయాడు.

 ఏమైందయ్యా…. ఏందా కలవరపాటు!?భార్య పూలమ్మ కేకలతో కళ్లు తెరిచి చూశాడు.

కల. కలే!

ఏందయ్యా, పొద్దున్న సేటు గొడవ చేసిన కాన్నుంచి అదోలా ఉన్నావునాకేందో భయంగా ఉన్నాది,” ఏడుస్తూ అన్నది పూలమ్మ.

రెండేళ్ల నుంచి అప్పు తీర్చనందుకు పొద్దున్న సేటు వచ్చి ఇంటి ముందు పెద్ద పంచాయతీ పెట్టాడుమూడు రోజుల్లో అప్పు తీరిస్తే సరేసరిలేదంటే ఇల్లు వేలం వేసి ఐనా సరే నా అప్పు వసూలు చేసుకుంటానని చెప్పి ఫర్మానా జారీ చేసి పోయాడు.

నారాయణది కొత్త కథ కాదుకొరగాని కథ.  

********

నారాయణ సొంతంగా  ఒకే ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుఒక్క ఎకరం సేద్యంతో మొగుడు సచ్చిన తల్లినీ, మొగడు ఇంకా సావని పెళ్లాన్ని, పిల్లలని సాకేదెట్టాఅందుకే ఇంకో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడుమిగతా రైతుల్లాగే బీటీ పత్తి తప్ప ఇంకో పంట కన్నెత్తి కూడా చూడని రైతుఅసలు పత్తి తప్ప ఇంకో పంట కూడా ఉందన్న సంగతే గుర్తులేని రైతు. ఒక ఏడు పంట కలిసొస్తే ధర కలిసిరాదుధర కలిసొస్తే పత్తి వ్యాపారి కలిసిరాడుసరిగ్గా అలాగే ఈ ఏడాది గింజలు భూమిలో ఏ క్షణాన ఏశాడో కానీ, ఏసిన గింజలు ఏసినట్లు కాకులుపిట్టలు ఏరకతిన్నై కానీ ఒక్క గింజ మొలవలేదు. “అప్పుడప్పుడు వాన కురుస్తుంది” అని చెప్పుకోవడానికైనా మచ్చుకు ఒక్క చుక్క పడలేదుఏం చేయాలితెలిసింది ఒక్క సేద్యమేఏస్తే గీస్తే మళ్లీ పత్తే వెయ్యాలి.   

పంట పండదన్న సంగతి సేటుకు ఎలా తెలిసిందో కానీ ఇంటి ముందు డేగలా వచ్చి వాలాడునారాయణ ఒకటి రెండు సార్లు ఇంట్లో ఉండి కూడా లేడని భార్య పూలమ్మతో చెప్పించాడుఇవాళ సేటు ఇంకా ఎవరూ నిద్రలేవకముందే వచ్చాడువస్తూనే ఇంట్లే సామానంతా బయటకు విసిరేశాడుఆ గొడవకు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు.  అందరి ముందే  నానా బూతులు తిట్టి పరువు తీశాడు.  

నారాయణకు చానా బాగా గుర్తు.. ఆ సేటు అసలు ఈ ఊరివాడు కాదుఎక్కన్నుంచో ఒక తరాజు, చెక్కపీట చేతిలో పట్టుకుని వచ్చిండుఆ వ్యాపారం, ఈ వ్యాపారంసారాయికల్తీ ఎరువులు ... ఇలా రకరకాల వ్యాపారాలు చేసి బాగా సంపాదించాడుసంపాదించిన డబ్బు అప్పులకు  ఇచ్చి, దొంగ వడ్డీలు రాసి మరింత పెంచాడురైతుల దగ్గర వంగి వంగి దండాలు పెట్టిన కాడ్నించి అదే  రైతులను “దొంగ నా…” అనేకాడికి ఎదిగాడు.

నారాయణకు పొద్దున్నించీ ఒకటే ఆలోచన. “సేటు అప్పు ఎలా తీర్చాలి?”

భూమి అమ్మినా యాభైవేలు రాలవు. అప్పేమో దానికి ఆరు రెట్లు.

నారాయణకు దోస్తు జగ్గడు గుర్తొచ్చాడుజగ్గడిదీ నారాయణదీ ఒకటే ఈడువానాకాలం సదువులు కలిసే సదువుకున్నారురెండ్రోజులు బడికి మూడు రోజులు యవుసాయానికి. సదువులు మధ్యలోనే మానేసి బర్లు  కాశారుజగ్గడే ఓ సారి ఇంట్లోంచి వాళ్ల నాయిన తాగే సారా సీసా తెచ్చాడుకంది చేల మధ్యన దాచుకుని మొదటి సారిగా నారాయణ సారా తాగాడుఅప్పటినుంచి జగ్గడునారాయణ పండుగలకు పెళ్లిల్లకు తప్పకుండా సారాయి తాగేవాళ్లు.

ఓ రోజు జగ్గడి నాయన అప్పులు తీర్చలేక మర్రి చెట్టు కింద ఉరి పెట్టుకుని చచ్చిపోయిండుతండ్రి పోయిండు కానీ సేద్యం పోలేదు. అది జగ్గడి మెడకు చుట్టుకుందిజగ్గడు యవసాయం మొదలు పెట్టాడుపెళ్లి చేసుకున్నాడుఇద్దరు పిల్లలుఒకటీ రెండేళ్లు బానే ఉన్నా పోయిన ఏడాది కాలం  కలిసిరాలేదుబాధతో సారాయికి బానిసగా మారాడుతాగి తాగి పిచ్చోనిలా మారిపోయాడుఓ రోజు తండ్రి చనిపోయిన మర్రిచెట్టుకే అదే కొమ్మకు ఉరి వేసుకున్నాడుసరిగ్గా ఆ సమయంలో నారాయణ దూరంగా ఎద్దుల మేపుతూ ఉన్నాడుజగ్గడు చేసే గోరం చూసి గబగబా పైన కింద పడుతూ పరిగెత్తుకొచ్చాడుకానీ ఈ లోపలే జగ్గడు కాళ్లూ కొట్టుకుని కళ్లు తేలేశాడు.

అప్పట్నుంచీ నారాయణకు కళ్లు తెరిసినా మూసినా ఆ చెట్టే కనిపిస్తోంది.  దానికి ఉరిపోసుకుని చనిపోయింది ఒకరో ఇద్దరో కాదు.నారాయణ ఇంట్లోనే ముగ్గురు వాళ్ల తాతనాయనపెద్దక్క ఆడనే ఊపిరి వదిలారు.

ఇంకా పడుకోలేదా?ఆకాశంవైపు చూస్తూ  ఉన్న భర్తను అడిగింది పూలమ్మఅప్పు ఎట్ల తీర్చాలే అనే కదా దిగులు. నువ్వేం గుబులు చెడకుపట్నంల ఉన్న పెద్ద వ్యాపారి సత్నారి సేటు కాడ అప్పు అడిగి చూడయ్యాఆయన ఐతే వడ్డీ ఎక్కువ తీసుకున్నారెండు మూడేళ్లు ఆగుతడు”

మరి పంట రాకుంటే ఎట్ల తీరుస్తం,” అనుమానించాడు నారాయణ.

కాలం ఎప్పుడూ ఒక్క తీర్గే ఉండదు కదయ్యా. ఏమో, వచ్చే ఏడాది కాలం కాకపోతదాపంటలు పండకపోతయా, మన అప్పులు తీరకపోతయా. అడవిల మోదుగులు బతుకుతున్నయిమనం బతకలేమా?” భరోసా ఇచ్చింది పూలమ్మ.

********

పొద్దున్నే లేచి టవునుకు వెళ్లాడు నారాయణ.

సత్నారి సేటు  అప్పు వసూలుకు వేరే ఊరు పోయిండటపన్నెండింటికి వస్తడు అన్నది సేటు భార్యఇంటి ముందలనే కూచుండు నారాయణఅటు పోయిఇటు పోయి ఒంటి గంట దాటిందిఐనా సత్నారి సేటు రాలే.

పొద్దున బస్సు అందుకోవాలన్న ఆరాటంలో  రాత్రి మిగిలిన బువ్వ తిని వచ్చిండు నారాయణఆకలయ్యింది.

లేచి ఏమన్నా తిందామని హోటల్ దిక్కుకు పోయిండు.

నారాయణన్న బాగున్నవా?ఎవరో పలుకరించేసరికి అటువైపు చూసిండు.

నేనే అన్నావెంకటమ్మనుమాలపల్లె

ఆ, ఆ… పెద్ద రాములు బిడ్డవు కదామొగడు సచ్చిపోయేతల్లిదండ్రి సచ్చిపోయినంక మల్ల కానరావైవితవి. ఎట్లున్నవు?

నేను గట్లనే ఉన్న అన్నఇదే నా బండిఅన్నం తింటవా?” అని అడిగింది.

మురికి కాలువ పక్కన తోపుడు బండి మీద ఓ గిన్నెలో అన్నంమిగిలిన గిన్నెల్లో కూరచారు ఉన్నాయి.  

మొగమాటానికి వద్దన్నడు.

ఏం ఫర్లేదన్నాపైసలియ్యకుంటే మాయేనీలాంటి కష్టజీవికి పెడితే పుణ్యంమొస్తది,” అని ఓ ప్లేట్ల ఇంత అన్నం, రెండు చికెన్ ముక్కలుచారు పోసి ఇచ్చిందిబాగా ఆకలితో ఉన్నాడేమో నారాయణ, రెండు ముద్దలకే అంతా మింగేసిండుఇంకొంచెం పెట్టించుకోని తిన్నడు.

అవు చెల్లె.  నీ మగడు జానయ్య నిన్ను మోసం చేసి పోయిండు కదాఎటు పోయినవో ఏమై పోయినవో అనుకున్నం

 ఏ ఏట్లోనో దూకుదామనుకున్నా కానీ నా కడుపుల ఓ నలుసు పడిందివాన్ని బతికించుకునేటందుకు నిలబడ్డ. మొదట ఈడ హోటల్ల క్లీనింగ్ పనికి చేరి మెల్లగ వంట నేర్చుకున్నఇప్పుడు సొంతంగ నేనే ఈ బండి పెట్టినఇప్పుడు రోజు ఐదారొందలు .నాకు నా కొడుక్కు సరిపోతయినా కింద ఇంకో ఇద్దరు మనుషులు కూడా ఉన్నరునా కొడుకు ఇంజనీరింగ్ సదువుతున్నడుఆనిమీద ఆశతోనే బతుకుతున్న”  

అన్నం తిని జేబుల చేయి పెట్టిండు నారాయణయాభై రూపాయలు ఇచ్చిండు.

“వద్దన్నా,” అన్నది. ఐనా బలవంతంగా చేతిల పెట్టి, “ఎప్పుడన్నా కుదిరితే ఊరికిరా చెల్లె,” అని చెప్పి గబగబ సత్నారి సేటు ఆఫీసుకాడికి బాట పట్టిండు.

వెంకటమ్మ చెప్పింది విన్న తర్వాత నారాయణకు తన బతుకుమీద తనకే అసహ్యం పుట్టింది. “ఆఖరికి రోడ్ల మీద తోపుడు బండ్లు పెట్టుకున్నవాళ్లు కూడా ఆరామ్ గా బతుకుతున్నరుదేశంల అందరూ సుఖంగానే బతుకుతున్నరు ఒక్క వ్యవసాయం చేసేటోడు తప్పఅందరూ ఏడాదికో అంతస్తు ఇల్లు కడుతుంటే రైతు మాత్రం ఏడాదికేడాదికి బొందల దిగబడుతుండు,” అనుకున్నడు.

సత్నారి సేటు  ఇంకా రాలేదుకానీ అక్కడకి ఓ యాభై మందిదాకా రైతులు వచ్చిన్రుఅందరిదీ అదే కథఅప్పు కావాలే. అప్పు

నారాయణకు రాత్రి సరిగా నిద్రరాలేదుతోపుడు బండి మీద కడుపు నిండ తిన్నడేమో చిన్నగా కన్నుమూత పడింది.

చెట్టుఊరవతల ఊడల మర్రిచెట్టుజుట్టు విరబోసుకుని, కొరివి దయ్యంలా.ఊడలు ఊపుకుంటూ రారా… అంటూ.

గబ్బిలాలుకీచ్ కీచ్తాళ్లు, ఉరి తాళ్లు … ఊగుతా.

కారు హార్న్ సప్పుడు కావడంతో ఉలిక్కిపడి నిద్రలేచిండు నారాయణ.  

సత్నారి సేటు దిగిండుపోయినేడాది దాకా బైక్ మీద తిరిగేటోడుకొత్తగా కారు కొన్నడుబొర్ర కూడా పెరిగింది.  రైతులంతా గబగబ దండాలు పెట్టుకుంట పోయినరుఒకల తర్వాత ఒకలు. తన వంతు వచ్చినంక పోయి పరిస్థితి అంత చెప్పిండు నారాయణ.

ఏం తాకట్టు పెడతావ్? బంగారమేమన్నా ఉన్నదా?”

అంటే … పంట అమ్మినంక నీకే ఇస్త సేటు

అరే నారాయణఇప్పుడు పంట మీద అప్పు ఇచ్చే రోజులు పోయినయ్రైతులు కూడా తెలివిమీరిన్రుపోనీ ఓ పని చేయ్భూమి కాయితాలేమన్నా ఉన్నయా?

నారాయణ కౌలు రైతు ఉన్నది ఒక్క ఎకరం కానీ దానికీ పట్టాలేదు.

బంగారం లేదుభూమిలేదుఉన్నదానికి పట్టాల్లేవుఏం చూసి అప్పియ్యమంటవు నారాయణాకనీసం మీరు ఉరి పెట్టుకుని సచ్చినా గవర్మెంటోడు లక్ష రూపాయలిస్తడునాకెవడిస్తడు? సేటు లేచిపోయిండు.

నారాయణకు కోపం తన్నుకొచ్చింది. ఒకప్పుడు నారాయణ మార్కెట్కు పత్తితో వచ్చినపుడు ఇదే సత్నారి సేటు తన దగ్గరే అమ్మా అయ్యా అని కాళ్లు వేళ్లు పట్టుకుని బతిమాలాడు. “నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత అంటే అంత అప్పు ఇస్తా,” అన్నాడు. రోజులు మారినయ్. మాటలు మారినయ్.

చేసేదేంలేక ఇంటి దారి పట్టిండు నారాయణ.

అయిపోయిందిఅంతా అయిపోయిందిఉన్న ఒక్క ఆశ జారిపోయిందిరేపు మాపో ఊర్లో సేటు రావడం కాయం. పరువు తీయడం కాయం. దీనికన్నా సావే నయంపురుగు మందు తాగి సచ్చినా బాగుండుఅది కొందామన్నా జేబుల సరిపోయే పైసలు లేవు,” తిట్టుకుంటా బస్టాండుకు కాళ్లీడ్చుకొచ్చిండు.

ఇంకా బస్సు రాలేదు.

చాయ, చాయ … చాయ్. సమోసా…బిస్కట్లోయ్. 

ఏ … పల్లీ బటానీలోయ్.

బస్టాండంతా సందడి.

అయ్యా పాప్ కార్న్ కావాలా?” ఎక్కన్నో విన్న గొంతు. అటు తిరిగి చూశాడు.

లింగన్న! 

వాళ్లూరోడే.  వ్యవసాయం దివాళా తీయడంతో పట్నం వచ్చిండు.

ఏమిరా లింగ. పల్లీ బఠాణీ అమ్ముతున్నావారా!?”

అవునన్నా..ఆ యవసాయం చేసి అప్పుల పాలయే దానికన్నా ఇదే సుఖంగా ఉందేరోజుకు ఎంత లేదన్నా రెండు మూడొందలువస్తయిలాభం రాకున్న పెట్టబడిన్న వస్తదియవసాయం కన్న వందపాళ్లు నయంఅగో, పట్నం  బస్సు వచ్చింది నాలుగు గిరాకిలొస్తయిపోయొస్త,” అనుకుంట పరుగున పోయిండు.

లింగయ్యది పెద్ద వ్యవసాయంపదెకరాలపైనేబోర్లు వేసి వేసి ఐదారు ఎకరాలు అమ్మిండుఇంక మిగిలిన భూమి కూడా అప్పులకింద సరిపోయిందిపొట్ట సేతపట్టుకుని పట్నం వచ్చిండు.

థూఇంత బతుకు బతికి పల్లీ బఠాని అమ్ముతుండుఅదే నేనైతే సిగ్గుతోని సచ్చిపోయేటోన్ని. దాని కన్న మర్రిచెట్టు కింద ఉరిబెట్టుకుంటే నయం,” అనుకున్నడు నారాయణ

ఇంతలో బస్సు రావడంతో ఎక్కి కూర్చున్నడుచిన్న కునుకు పట్టింది.

మళ్లీ, జడల మర్రిచెట్టుఉరి తాళ్లుగబ్బిలాలు.

తాతనాన్న.

“రా, రా, రా,” ఊడలు పిలుస్తున్నాయ్.

ఉలికిపడి  కళ్లు తెరిచాడు నారాయణ.  “దీని తల్లి కన్ను మూస్తే ఆ మర్రిచెట్టేనాకు ఏదన్న దయ్యం గిట్ట పట్టిందా?జగ్గడు అట్నే నాలుగైదు రోజులు పిచ్చోనిలెక్క అరిచి అరిచి, ఆఖరికి ఆ చెట్టుకే ఉరి పెట్టుకుండు

బస్సు ఊరికి చేరింది.

ఊరంతా ఒకటే కలకలం.

నర్సిగాడు ఉరి పెట్టుకున్నడటపొద్దున పట్నం పోయేటపుడు కూడా నారాయణతో మాట్లాడిండుగబగబ నారాయణ నర్సిగాని ఇంటికి  పోయిండుఇంటి నిండా జనం.

నిండా ఇరవై ఏళ్లు కూడా లేని నర్సిగాని పెళ్లం శవం మీద పడి గుండెలు బాదుకుంటోంది.  

సూడ సక్కని పువ్వుల్లాగా ఉన్న ఇద్దరు బిడ్డలుఇంత చిన్న పిల్లల్ని వదిలి ఎవరికైనా చనిపోవాలనిపిస్తదా?

రాత్రికి రాత్రే నర్సయ్య అంత్యక్రియలు పూర్తయినయి.

బంగారమసోంటి బిడ్డ, నర్సిగాడు.పొద్దున నీ కోసం ఇంటికూడా వచ్చినడువానలేక పంట మొత్తం తెర్లయి పోయిందని ఒకటే బాదపడ్డడు,” పూలమ్మ భర్త దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది.

నారాయణకు తినాలని కూడా అనిపించలేదుకాళ్లమంచం వేసుకుని కూలబడ్డడు.

ఏందిదిఎందుకు ఒకని తర్వాత ఒకడు పిట్టలు రాలినట్లు రాలుతున్నరు.  దేనికి భయపడి? అప్పు తీరదన్న భయమా? అట్లైతై నర్సిగాడు ఎన్నడో సావాలే! నర్సిగాడు చానా దైర్యస్తుడుకొమ్ములు దిరిగిన కోడెను కూడా వంచేటోడుఅసలు భయమన్నదే తెలీదుఅర్థరాత్రి, అపరాత్రి ఎక్కడికైనా వెళతాడుఎంత లోతు బాయిలో అయినా ఏదన్నా పడిపోతే మునిగి తెచ్చేటోడుఆరడుగుల తాచుపామును ఒడుపుగా మెడపట్టుకుని ఆడించేంత ధైర్యమున్న నర్సిగాడు దేనికి భయపడ్డడు? అప్పుకైతే కాదు

మన ఇంటి కాడ గొడవచేసినట్లే నర్సిగాని ఇంటికాడ కూడా సేటు గాడు లొల్లి పెట్టిండటతల్లినీపెళ్లాన్నీ అనరాని మాటలన్నడట,” పూలమ్మ చెప్తోంది.

నారాయణకు అర్ధమైందినర్సిగాడు పరువుకు భయపడ్డడుఇంత కాలం బతికిఇప్పుడు పదిమంది ముందు నామోషి అవుతాందని బాధపడ్డడు. 

తనూ ఇంత కాలం భయపడేది ఆ పరువు పోతుందనేనాఅప్పు ఇవాళ కాకుంటే రేపన్నా తీరుతుంది. పరువు పోతే?

ఇంతకీ పట్నంల సేటు ఏమన్నాడయ్యా?”పూలమ్మ పిలుపుతో లేచి కూచున్నాడు నారాయణ.

మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లి  పడుకున్నాడు.

పట్నంల ఏం జరిగిందో చెప్పకుండానే అర్థమైపోయింది పూలమ్మకుఉన్న ఆశ కూడా జారిపోవడంతో కళ్లనిండా నీళ్లు తిరిగాయికానీ ఏడిస్తే భర్త గుండె పగులుతుందని కన్నీళ్లని కంటి రెప్పల చాటున దాచేసింది.

నిద్రపట్టింది నారాయణకు. కలత నిద్ర. కలల నిద్ర.

పుల్లిగాని కొడుకు నారిగాని ఇల్లు వేలంపాటఒకటోసారి … రెండో సారి … మూడో సారి …”

కూలబడ్డాడు నారాయణపోయిందిఇంత కాలం కాపాడుకున్న పరువు గంగల కలిసిపోయిందిఇక బతకటం దండగ. అక్కన్నుంచి వేగంగా పరిగెత్తాడు, మర్రిచెట్టు కాడికి. 

“రా, రా, రా,” ఊడలు పిలుస్తున్నాయ్.

జడల మర్రిచెట్టుఉరి తాళ్లుగబ్బిలాలు.

అక్క. నర్సిగాడు. వాళ్ల పక్కనే వేలాడుతూ …

నారాయణ!

దిగ్గున మేలుకున్నాడు నారాయణ. కళ్లు తెరుచుకున్నాయి.

భార్య నిద్రపోతోంది. పక్కన కూతురు.

మంచంలోంచి లేచి కూచున్నాడు.

రా, రమ్మని పిలుస్తోంది ఊడల మర్రిచెట్టు.

పోలీసు వేధింపులు తట్టుకోలేక ఆ చెట్టుకే ఉరేసుకున్నాడు తాత.

అప్పు తీర్చలేక ఉరిపెట్టుకున్నాడు నాయన. నాకూ తప్పదా?

గబగబ లేచాడు. ఇంటి పైకప్పు సూరులో దాచుకున్న సారాయి సీసా బయటకు తీశాడు.

మొత్తం ఒక్క గుటకలో ఖాళీ చేశాడు.

చీకట్లో తడుముకుంటూ చప్పుడు కాకుండా మెల్లగా వెతికాడుకాసేపటికి దొరికిందిమెల్లగా ఇంటి ముందు తలుపు తీసుకుని  వేగంగా ఊరవతల ఊడల మర్రి చెట్టు వైపు నడిచాడు.

అదే చెట్టుజడలు విరబోసుకున్న చెట్టుఊడలు చాచి పిలుస్తోంది.

వేగంగా చెట్టుదగ్గరికి చేరుకున్నాడు.

ఎవరన్నా వస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి దండం పెట్టాడు. 

“క్షమించు తల్లీ” అనుకున్నాడు.

********

భర్త మంచంలో లేకపోవడంతో పూలమ్మ ఉలిక్కిపడిందిఎప్పుడో నిద్రపట్టిందో ఒళ్లు మరిచి నిద్రపోయిందిఎంత సేపటికీ నారాయణ రాకపోయే సరికి కీడు శంకించిందిరెండు మూడు రోజుల నుంచి మొగడు తేడాగా కనిపించడం గమనిస్తూనే ఉందిఈ మనిషి ఏదో ఘోరం చేస్తాడని భయపడుతూనే ఉందిఇంత రాత్రిపూట ఎక్కడికి పోయాడు అనుకుంటూ లేచి ఇంటిబయటకొచ్చి అటూ ఇటూ చూసింది. “ఏమయ్యా,”అని కేకేసింది. జాడ లేదుఅంతే.

“వామ్మో, వాయ్యో … నా కొంపమునిగిందిరయ్యోనేనేం చేద్దును దేవుడో,” అంటూ గట్టిగా ఏడుపందుకుందిఆ కేకలకు చుట్టు పట్టు జనం పరిగెత్తుకొచ్చారుచీకట్లు పోయి అప్పుడే తెల్లారుతోందిఊరవతల ఊడల మర్రిచెట్టు గుర్తొచ్చింది పూలమ్మకి. అటు పరుగుతీసింది. వెంట జనం పరుగులు. కేకలు. 

ఊపిరాపకుండా పరుగుతూ ఊరవతలకొచ్చి పడ్డారు జనం, పూలమ్మ.

ఊరవతల.

ఊడల మర్రి.

ఏదీ?

నిన్నటిదాకా జడలు విరబోసుకున్న చెట్టు ఇప్పుడు మొదలు దాకా నరకడంతో కుప్పకూలి పడిపోయి ఉంది

పక్కన ... నారాయణ.

గండ్రగొడ్డలి చేతిలో పట్టుకుని బ్రహ్మరాక్షసిని వధించిన పరశురాముని లాగా చెట్టుమీద కాలువేసి నిలుచున్నాడుఒళ్లంతా చెమటలు.

 బస్సొచ్చే ఏళయిందితొందరగా స్నానాలు చేసి పట్నం పోదాం. అక్కడే ఏదో ఓ పని చేసుకుని అప్పులు తీరుద్దాం,” అంటూ పూలమ్మను చూసి నవ్వాడు నారాయణ.

దూరంగా గుట్టల మధ్యనుంచి పొద్దు పొడిచింది.