రచన: యాజి

ఆంధ్రజ్యోతి‘, సెప్టెంబర్ 2014
కథాసాహితి ‘కథ-2014‘ సంకలనం


 

“చీకట్లో కూర్చున్నావేం?” అంటూ లైట్ స్విచ్ వేసి గదిలోకొచ్చిన రేవంత్, ప్రవల్లిక మొహం చూడంగానే, మళ్ళీ ఏమైందోనన్న ఆదుర్దాతో, సోఫాలో ఆమెపక్కనే కూర్చొని సాంత్వననివ్వటం కోసం తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. కొంత సమయం తరవాత ప్రవల్లికే మాట్లాడటానికి పూనుకుంది.

“జెన్నీ అబార్షన్ చేయించుకుంటుందట!”

“అయ్యో! నెల క్రితమే కదా తన బాయ్ ఫ్రెండ్ తో కూడా బ్రేకప్ అయ్యింది.. పాపం”, సానుభూతి వ్యక్తపరిచాడు రేవంత్.

“బ్రేక్ అప్ కాదు రేవంత్, పాపం.  రెండో ట్రైమెస్టర్ లో ప్రవేశించిన తరవాత తన కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని బ్రేకప్ సాకుతో అంతం చెయ్యాలనుకోవటం పాపం. ఒక వందమంది హంతకులని వదిలేసైనా ఒక అమాయకుడి ప్రాణం పోకుండా కాపాడుకుందాం అన్న సూత్రం పునాది పై చట్టాలు నిర్మించుకున్న ఈ సమాజమే, ఏ పాపం చెయ్యని, ఏ ప్రతివాదమూ చెయ్యలేని ఆ మూగ ప్రాణి ప్రాణాలు తియ్యటం చట్టబద్ధం చెయ్యటం, మహాపాపం”, ఆవేశంతో ఊగిపోతోంది ప్రవల్లిక. ఆ ఆవేశానికి నేపథ్యం తెలిసిన రేవంత్, ఏ భావావేశం లేకుండా నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు.

****

ప్రవల్లిక, రేవంత్ లు రెండేళ్ళ పాటు ప్రేమించుకొని, ఏ సినిమా కష్టాలూ పడకుండా పెళ్ళిచేసుకొని, చేతుల్లో రెండు హెచ్-వన్లు, కళ్ళల్లో బోలెడు ఆశలు పెట్టుకొని అమెరికాలోని చికాగోలో  కాలిడి ఏడేళ్ళు అవ్వస్తోంది. ప్రవల్లిక ఒక ఫైర్ బ్రాండ్ పర్సనాలిటీ, ప్రతి అంశంపై నిశ్చితాభిప్రాయంతో పాటు, వాటికి గొంతునిచ్చే చక్కటి వాక్పటిమ, ఆమె సొంతం. “హ్యాప్పీ గో లక్కీ”, అరుదుగా ఉండే, వినే గుణం, రేవంత్ నైజం కాబట్టి, ప్రత్యేక ప్రయాస లేకుండా, పరస్పరాకర్షణతో, పెద్దగా స్పర్థలు లేని సంసార చక్రం ఓ నాలుగేళ్ళు తిప్పేశారు.

పిల్లల గురించి ఇరుపక్షాల పెద్దవాళ్ళ నుంచీ వాకబు లెక్కువవటం ఒక కారణమైతే, మాతృత్వం తో స్త్రీత్వపు వృత్తాన్ని పూర్తి చేద్దామన్న తలపు ప్రవల్లికకు బలంగా పుట్టటం వల్ల, నియంత్రణ పాటించకుండా కుటుంబాన్ని వృద్ది చెయ్యటానికి నిర్ణయించుకున్నారు ఇద్దరూ. మొదటి నాలుగు నెలలు, పీరియడ్ ఒక్క రోజు ఆలస్యం అయినా, ఇంట్లోనే గర్భధారణ పరీక్ష చెయ్యటం, ఆ పరీక్షా పరికరంలో కనపడే, రెండు నిలువు చారల నిర్మాణక్రమం కోసం, క్షణమొక యుగంలా వేచి చూసి, చివరకి కనిపించే ఆ ఒక్క నిలువు చార చూసి నిరాశ చెందటంలో గడచిపోయాయి.

వరుస వైఫల్యాలు ఎంతటి ఆశావాది స్థైర్యాన్నైనా వణికిస్తాయి, ఒత్తిడి పెంచి, తలచిన చెడే జరిగేటట్లుగా చేస్తాయి. వారి విషయంలో కూడా అదే జరిగింది. సహజంగా జరగాల్సిన ప్రక్రియ లోని ఆనందం నశించి, ఉత్పాదకత భారం ప్రవేశించిన యాంత్రిక సంసారం మరో పది నెలలు జరిపిన తరువాత, ప్రవల్లిక పరీక్ష చేయించుకుంటానని సూచన ఇచ్చింది. దాన్ని గ్రహించిన రేవంత్ తొలి పరీక్షకి సిద్ధపడ్డాడు. ఉత్తీర్ణుడయ్యాడు.

కష్టతరమైన పరీక్షలెన్నిటికో గురైన ప్రవల్లికలోనూ ఏ లోపాలూ డాక్టర్లు గుర్తించలేకపోవటంతో పాటు, ముఫ్ఫై శాతం కేసుల్లో అసలు కారణాలే తెలియవని చెప్పారు. సహజ పద్ధతిలో ఇంకొన్నాళ్ళు ప్రయత్నించాక, డాక్టర్ల సాయం తీసుకున్నారు. ఈ సమయంలో ప్రవల్లికలో అనేక మార్పులు వచ్చాయి. ఎవ్వరి నెల తప్పిన వార్త విన్నా ఆమె మరింతగా బాధపడేది. తప్పు అని తెలిసినా నివారించలేని అలాంటి ఆలోచనలు మస్తిష్కంలో చొరబడి హింసిస్తూ ఉంటే ఆ పోరాటంలో ఆమె దాదాపు ఒంటరిదయ్యింది. ఉంచుకున్నా, పంచుకున్నా, కూడా పెరిగే బాధ అది.

అప్పటివరకూ, జ్యోతిష్యాలనీ, సంఖ్యాశాస్త్రాలనీ పిచ్చినమ్మకాలుగా కొట్టేసుకుంటూ వచ్చిన ప్రవల్లిక,  ఇంతకు ముందెప్పుడూ తలపుకు రాని జన్మ సమయాన్నీ, నక్షత్రాన్నీ వాళ్ళమ్మనడిగి, “మూడు” తనకచ్చొచ్చే సంఖ్య అని కనుక్కుంది. అది వారాంతం కాకపోయినా, మర్చి నెల ఇరవై ఒకటిన, అంతకు ముందు రెండు సార్లు విఫలమైన  “ఐ.వి.ఫ్” ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేశాడు రేవంత్. ఇది జరిగి రెండు వారాలు కావస్తోంది.

***

“జెన్నీతో ఇదంతా అనలేదు కదా? అయినా తన కారణాలేవో కనుక్కున్నావా?” కన్నీటి భారం తగ్గి తేరుకున్న ప్రవల్లికను అడిగాడు రేవంత్.

“అంత సూటిగా కాదు కానీ నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని నచ్చచెప్పాను. తన చిరుద్యోగంతో ఇంటి బాడుగ, తిండి, బట్టలకే సరిపోక అవస్థ పడుతుంటే, మరో ప్రాణాన్ని పోషించలేనని లెక్కలు చెప్పింది. లెక్కలతో ప్రాణం ఖరీదు కడుతున్న ఆమెని చూస్తూ నా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను. కొద్దిగా హెచ్చు స్వరంలోనే ఆమె మీద ఫైర్ అయ్యాను. జెన్నీని అంత బేలగా ఎప్పుడూ చూడలేదు. ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్లిపోయింది.”

డాక్టర్ అప్పాయింట్మెంట్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇద్దరూ లేచి తయారయ్యి కార్లో బయల్దేరారు. “ఠుమక్ చలత్ రామ చంద్ర బాజత్ పైంజనియా..” లత కోకిల స్వరం కారంతా వ్యాపించింది.

***

శీతాకాలం వెళ్లి వసంతం వచ్చింది. అప్పటివరకూ మంచుతో కప్పబడిన మట్టిలో ఒదిగిపోయి శక్తి నింపుకున్న ట్యూలిప్ విత్తనాలు ఆ భూమినే చీల్చుకొని ఆకాశం వైపు తమ అందాలని వెదజల్లాయి. అమ్మ ముహూర్తబలం అని మురిసిపోయింది. రేవంత్ అడుగులో ఠీవి అనాయాసంగా వచ్చి చేరింది.

ప్రాతఃకాల వికారాలు, హార్మోన్లలో వచ్చే మార్పులు, ఏవీ ప్రవల్లికకి ఇబ్బందిగా అనిపించట్లేదు. ఎంతో ఎదురుచూపు తరవాత లభించిన వరం ప్రవల్లిక అందాన్ని మరింతగా పెంచింది. ఆనందం ఆమె నీడయ్యింది. మూడు నెలలు ఇట్టే గడచిపోయాయి.

డాక్టర్లు అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసి బిడ్డ ఆరోగ్యాన్ని గురించి రిపోర్టులిస్తే, చైనీస్ కాలెండర్ చూసి అమ్మ, మగ బిడ్డ అని తేల్చేసి, మనవడ్ని స్వాగతించటానికి అమెరికా వీసా ప్రయత్నాలు మొదలెట్టింది. అప్పటి వరకూ అన్ని టెస్టులను మారుమాట్లాడకుండా  చేయించుకుంటున్న ప్రవల్లికని తన డాక్టర్ “డౌన్ సిండ్రోమ్” స్క్రీనింగ్ టెస్టు చేయించుకుంటావా అంటూ ఛాయిస్ ఇచ్చింది. దాని ప్రత్యేకత గురించి చెప్తూ డాక్టర్, ఒక వేళ ఆ టెస్టులో సమస్య ఏమైనా కనపడితే, మరిన్ని కష్టమైన టెస్టులు, కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కానీ ప్రవల్లిక వయస్సు వల్ల, తనకి అలాంటి సమస్యలేవీ వచ్చే అవకాశం తక్కువేనంది.

ఎటువంటి చెడు ఆలోచనలు చేరకుండా మనసులో కట్టుకున్న గోడ వల్లనేమో ప్రవల్లిక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. రేవంత్ మాత్రం పరీక్ష చేయించుకుంటే పోయేదేమీ లేదు కదా అని ఉచితంగా ఒక సలహా పారెయ్యటంతో, ప్రవల్లిక దానికీ సిద్ధపడింది.

***

క్రమం తప్పిన శీతలం వసంతంలోకి జొచ్చుకురావటం చికాగోవాసులకి అలవాటే. స్క్రీనింగ్ టెస్టు ఫలితాలు వచ్చాయి, కంగారు పడనవసరంలేదు కానీ ఒక సారి వచ్చి కలవమని డాక్టర్ నుంచి వాయిస్ మెయిల్ వచ్చింది.

అనేకమైన ప్రశ్నలు చేరి విప్పారిన కళ్ళతో చూస్తున్న ప్రవల్లికనీ, ఆందోళన అణచిపెట్టి క్యాజువల్ గా కనపడటానికి కష్టపడుతున్న రేవంత్ నీ ఉద్దేశించి డాక్టరమ్మ సూటిగా విషయంలోకి దూకింది.

స్క్రీనింగు ఫలితం ప్రకారం, ప్రవల్లికకు రెండు శాతం డౌన్ సిండ్రోం బిడ్డ పుట్టే అవకాశం ఉందనీ, ప్రవల్లిక వయసు దృష్ట్యా అది హై రిస్క్ అనీ చెప్పింది. అది అంత పెద్ద సంఖ్యగా కనపడకపోవటంతో, ప్రవల్లిక కొంత అయోమయంతో చూస్తూ కూర్చొంటే, రేవంత్ అసలా జబ్బేమిటీ, ఇప్పుడొచ్చిన చిక్కేమిటీ లాంటి ప్రశ్నలు సంధించాడు.

“మూడు, ఇరవై ఒకటి అనేవి, డౌన్ సిండ్రోమ్ కి సంబంధించిన ముఖ్యమైన సంఖ్యలు. బిడ్డ సెక్స్ తెలియజెప్పే “XX” లేక “XY” లను తప్పించి, మిగిలిన ఇరవై రెండు క్రోమోజోములకీ సాధారణంగా రెండు నకళ్ళు ఉంటాయి. కానీ డౌన్ అనే శాస్త్రవేత్త మొదటి సారిగా కనుగొన్న దాని ప్రకారం,  ఈ అవలక్షణం ఉన్న బిడ్డలలో, ఇరవై ఒకటో క్రోమోజోమ్ మాత్రం మూడు నకళ్ళతో ఉంటుంది. సాధారణంగా వెయ్యి బిడ్డలలో ఒక్కరికి ఈ లక్షణాలు కనపడతాయి” అంటూ డాక్టర్ చెప్తున్న వివరాలు, ఇంకా పూర్తిగా ఆకళించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ దంపతులు.

“దీని వల్ల బిడ్డ ప్రాణానికి హాని ఏమైనా ఉందా?” ముందు తేరుకున్న రేవంత్ అడిగాడు.

“లేదు. ఈ అవలక్షణం ఉన్న బిడ్డ, అరవై ఏళ్ళ దాకా బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కానీ మెంటల్ ఏజ్ మాత్రం ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలకు మించే అవకాశం లేదు. వాళ్ళ ఇమ్మ్యూనిటీ తక్కువగా ఉండటంతో శారీరిక రోగాలతో పాటు మానసిక వ్యాధులతో జీవితాంతం ఎదో ఒక జబ్బుతో బాధ పడుతూనే ఉంటారు. బ్రతికినంత కాలం వారికి నిరంతర మెడికల్ కేర్  అవసరం ఉంటుంది.

మీకు ఇంటర్నెట్ లో దీని గురించి కావలసినంత సమాచారం లభిస్తుంది. కానీ, మీ విషయంలో, ఇది కేవలం ప్రాధమిక పరీక్ష మాత్రమే. తొంభై ఎనిమిది శాతం మీకు ఆరోగ్యవంతమైన బిడ్డే పుట్టచ్చు.  ఆమ్నియోసెంటోసిస్ అనే పరీక్ష చేస్తే దీన్ని చాలా వరకూ ఖచ్చితంగా తేల్చచ్చు. కానీ అది ఇంకొక రెండు నెలల వరకూ చెయ్యలేము. లేక పోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం. అసలు ఈ పరీక్ష చేయించుకోవాలా వద్దా అన్న విషయం కూడా మీరే నిర్ణయించుకోవాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి, ఆలోచించండి” అంటూ ముగించింది డాక్టర్.

ప్రవల్లిక “డౌన్ సిండ్రోం” గురించి పరిశోధన ప్రారంభించింది. సమాచారం లభించినంత సులభంగా సమాధానం మాత్రం దొరకలేదు. ఆ పరీక్ష విధానం ప్రకారం, ఆమ్నియాటిక్ సంచీ లోకి ఒక సూదిని దింపి, కొంత ద్రవాన్ని బయటకు లాగి దాన్ని పరీక్షించాలి. కానీ ఆ పరీక్ష వల్లే బిడ్డకి హాని జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం చాలా తక్కువని, ఒకటి రెండు శాతం మించదని చాలా చోట్ల కనపడితే, ప్రతి 66 డౌన్ సిండ్రోమ్ బిడ్డలకీ, 40 మంది ఆరోగ్యవంతమైన బిడ్డలు ఈ పరీక్ష వల్లే చనిపోతున్నారన్న సమాచారం కూడా దొరికింది.

కడుపులో బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి ప్రవల్లికకి. తనలో భాగమై పెరుగుతున్న ప్రాణంతో అనుబంధం రోజు రోజుకీ మరింత బలపడుతున్నఈ రోజుల్లో, భవిష్యత్తు గురించిన భయాందోళనలూ ప్రవేశించాయి. శుభముహూర్తం, అంతా మంచే జరుగుతుంది అంటూ భరోసా ఇస్తున్న అమ్మతో ఆ మూడు, ఇరవై ఒకటి సంఖ్యలలోని “ఐరనీ” గురించి చెప్పలేకపోయింది.

రేవంత్ తన సమాచారం లో దొరికిన దాన్ని బట్టి, ఆ ప్రాధమిక పరీక్షలో తప్పుడు ఫలితాలు (“ఫాల్స్ పాజిటివ్”) ఎక్కువగా ఉంటాయన్న అభిప్రయానికొచ్చేసి, ప్రవల్లిక మూడ్ ని ఉల్లాసపరచాలన్న పన్లో పడిపోయాడు. పెరట్లో ఆప్పుడే పిందెలు వేస్తున్న కూరగాయలు, డెక్ పైన కనపడుతున్న పక్షి గుడ్లు అన్నీ శుభసూచకాలని ప్రవల్లికకి రోజూ చూపిస్తున్నాడు.

“అసలా పరీక్ష గురించి ఆలోచించటం మానెయ్యవే. మా కాలంలో ఇలాంటివి విన్నామా కన్నామా? మన వంశంలోనే ఇలాంటి వ్యాధులెవరికీ ఉన్న దాఖలాల్లేవు. ఆనందంగా ఉండు, నాకు పండంటి మనవడు పుడతాడు” అంటూ, ఓ సలహా పారేశాడు, ప్రవల్లిక నాన్న.

దాటవేస్తూ వచ్చిన ప్రశ్నని ఢీ కొట్టాలని ఒక రాత్రి రేవంత్ ని కూర్చోపెట్టి సూటిగా అడిగింది, ప్రవల్లిక. “పరీక్ష చేయించు కోవాలా వద్దా? శాతాల లెక్కలతో ఫలితాలు చెప్పే ఈ పరీక్షలు వల్ల మనకి ఒరిగేదేమిటి?”

“మనశ్శాంతి. గత నెలన్నరగా నువ్వు పడిన క్షోభ చాలు. ఆ టెస్ట్ ఎదో చేయించేసుకొని అంతా సవ్యంగా ఉందని తెల్చేసుకుంటే, మిగిలిన నాలుగైదు నెలలూ ఆనందంగా గడపచ్చు”

“సవ్యంగా లేకపోతే?”

“ఆ వంతెనేదో అక్కడి కెళ్ళాక దాటచ్చు కదా? అంతా పాజిటివ్ గా ఆలోచించాల్సిన సమయంలో..” కొంచెం చిరాకుతో సమాధానం చెప్పి పడుకున్నాడు, రేవంత్.

***

పరీక్ష అయిన మూడు రోజుల దాకా ఫలితాలు రావని చెప్పటంతో, ప్రవల్లిక మనసు మళ్ళించటానికి చాలా కష్టపడ్డాడు రేవంత్. మొదటి రోజు ఒక కర్నాటక కచేరీకి వెళ్ళారు ఇద్దరూ.

కార్యక్రమ ప్రారంభం ఆలస్యమయ్యింది. అక్కడ అనుకోకుండా కలిసారు పట్టాభి వీళ్ళకి. చాలా కలుపుగోలు మనిషి. ఓ యాభై ఏళ్ళు ఉంటాయి. ఆయనే చొరవగా రేవంత్, ప్రవల్లికలను పలకరించాడు. అప్పుడప్పుడే కొద్దిగా బయటపడుతున్న ప్రవల్లిక లోని మాతృత్వపు ఛాయలను గుర్తు పట్టి, అభినందించాడు.

ఆయనలోని ఆత్మీయత బలంగా కనపడిందేమో, ప్రవల్లిక కూడా అప్పుడే కలిసారన్న విషయం మర్చిపోయి ఆయనతో సంగీత చర్చలో పడిపోయింది. ప్రవ్వల్లికని ఉల్లాసంగా ఉంచటంలో ఆసక్తి తప్ప సంగీతంతో పెద్దగా పరిచయం లేని రేవంత్ కొద్దిగా దూరంగా జరిగి వారిద్దరినీ గమనించ సాగాడు.

పెద్దగా నవ్వుతూ, ప్రవల్లికని నవ్విస్తూ ఉన్న పట్టాభిని చూసి, తామున్న పరిస్థితి గుర్తుకొచ్చిందేమో రేవంత్ కి, “ఈ మనిషి ఎంత ఆనందంగా ఉన్నాడు! ఎంత స్వఛ్ఛంగా నవ్వుతున్నాడు!” అన్న ఆలోచన ఒక్కసారి అలా వచ్చిపోయింది.
ఇంతలో పట్టాభి భార్య అరుణ ఒక వీల్ చైర్ ని తోసుకుంటూ రావటంతో వాళ్ళ దృష్టి అటు మళ్ళింది. “రేవతి వల్ల రెస్ట్ రూం లో కొద్దిగా ఆలస్యం అయ్యింది”, అంటూ అరుణ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది. నలభైల్లో ఉన్నా తరగని ఆమె ముఖవర్చస్సు, ఒక్కసారన్నా తిరిగిచూడాలనిపించే  చక్కని కనుముక్కు తీరు అరుణది. నుదుటన ఎర్రని బొట్టుతో పట్టాభి  పక్కన నుంచుంటే ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా  ఉన్నారు.

కానీ రేవంత్, ప్రవల్లికల దృష్టి మాత్రం రేవతి మీదే నిలచిపోయింది. ఒక పదహారు పదిహేడేళ్ళు ఉంటాయేమో ఆమెకి. ముఖాకృతి ని బట్టి చెప్పచ్చు, ఆమెలో ఎదో వైకల్యం ఉందని. ఏవో అర్ధం కాని ధ్వనులను చేస్తూ ప్రవల్లిక వైపు చూసి ఒక నవ్వు నవ్వింది రేవతి.

ప్రవల్లిక హటాత్తుగా మాటలు లేనిదై రేవతినే చూస్తూ నిలబడిపోయింది. పట్టాభి వాళ్ళ ఇబ్బందిని గమనించి, “మా అమ్మాయే రేవతి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన రాగం. అందుకే తను పుట్టంగానే అదే పేరు పెట్టా. తనకి చెల్లెళ్ళు పుడితే, ఆ రాగంలోని షడ్జమాన్ని పై స్థానానికి నెట్టి, వాళ్ళ పేర్లు శివరంజని, సునాదవినోదిని అని కూడా పెడదామనుకున్నా. అరుణకి, నాకు కూడా కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పై వాడు మా ఇష్టాన్ని గుర్తించి, రేవతిని ఇలా పంపించాడు. తన మానసిక వయస్సు అయిదారేళ్ళకు మించదు.. ఎప్పటికీ. అందుకనే వేరే రాగాల జోలికి పోకుండా రేవతి తోనే ఆగిపోయాం.” అన్నాడు.

“రేవతికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. ఇలాంటి కచేరీలకు అందుకే అప్పుడప్పుడూ తీసుకొస్తూ ఉంటాం”, ఒక గుడ్డతో రేవతి తెరచిన నోరు నుంచి కారుతున్న లాలాజలాన్ని తుడుస్తూ చెప్పింది అరుణ.

పట్టాభి, అరుణ స్నేహితులు మరికొందరు కూడా వచ్చి రేవతిని పలకరించి వాళ్ళతో సరదాగా మాటలు మొదలెట్టారు. రేవంత్, ప్రవల్లికలలో ఎన్నో ఆలోచనలు. కచేరీ మొదలయ్యింది.

ప్రోగ్రాం అయిన తరువాత, రేవతిని వీల్ చైర్ తో సహా వాన్ లో ఎక్కించి, శలవు తీసుకొనే ముందు, రేవంత్, పటాభి లు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఇంటికి వెళ్ళే దోవలో, కాసేపు మౌనం తరవాత “పట్టాభి, అరుణల ను చూస్తుంటే, దు:ఖించటానికి, దిగులు పడటానికీ కారణాలు ఉన్నప్పటికీ, ఆనందంగా ఉండాలంటే అలా ఉండాలన్న నిశ్చయమొక్కటే చాలేమో అనిపిస్తోంది కదా?” సమాధానం కోసం ఎదురు చూడకుండా ప్రశ్నించింది ప్రవల్లిక. ఎదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ తో ఇంటికి చేరారిద్దరూ.

“డోర్ కౌంటీ వెళ్దామా? ఒక రెండ్రోజులు శలవ తీసుకొని, వీకెండ్ తో కలుపుకొని, నాలుగు రోజులు ఈ వాతావరణానికి దూరంగా.. ఎంజాయ్ చేసొద్దాం” అంటూ కదిపాడు రేవంత్. ప్రవల్లికా ఊ కొట్టటంతో అక్కడ కాటేజ్ బుక్ చేసే పన్లో పడిపోయాడు రేవంత్.

రెండో రోజు ఇంటి పక్కనే ఉన్న పార్క్ లో వాకింగ్ కి వెళ్లారు. మాటల్లో పడి చాలాసేపు అక్కడ రౌండ్లు కొడుతూ గడిపారు. వెలుగు దాదాపు హరించిపోతున్న వేళలో, వాళ్లకి దూరంగా ఒక నిండు గర్భిణి వారి వైపే నడుస్తూ కనపడింది. బాగా దగ్గరకు వచ్చాక, ఆవిడే “హాయ్ ప్రవల్లికా!” అంటూ పలకరించింది.

అంత దగ్గరగా వచ్చాక గానీ ప్రవల్లిక కూడా గుర్తుపట్టలేదు తను జెన్నీ అని. జెన్నీని ఆ స్థితిలో చూసి చాలా ఆనందించి ఒక హాగ్ ఇచ్చి రేవంత్ కి కూడా పరిచయం చేసింది.

జెన్నీ కూడా ఎన్నో రోజుల తరవాత కలసిన ఆనందంతో, అన్నాళ్లుగా చెప్పే అవకాశం లేక దాచుకున్న విషయాలు చెప్పసాగింది.

“ప్రవల్లికా నీకు చాలా ఋణ పడి ఉన్నాను. నా బాయ్ ఫ్రెండ్ తో కొట్లాటలు, నా ఆర్ధిక ఇబ్బందుల ఆలోచనల్లో మునిగిపోయి, నేను ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నానో నువ్వు హెచ్చరించే దాకా నాకు తెలియలేదు. మొదట నీ పై కోపం, నా స్థితి పై ఏడుపు వచ్చాయి. నెమ్మదించిన తరువాత నువ్వు చెప్పిన మాటలే సరైనవి, నా సంపాదన లెక్కల బట్టి నా పుట్టబోయే బిడ్డ జీవించాలా వద్దా అనే నిర్ణయం తీసుకొనే హక్కు లేదనీ నాకు అనిపించింది. వచ్చే వారం నాకు అమ్మాయి పుట్టబోతోంది. నేను ఇంత ఆనందంగా ఇంతకు మునుపెన్నడూ లేను.. అంతా నీ వల్లే!”

అది విన్న ప్రవల్లిక కళ్ళల్లో ఆనందంతో కూడిన తడి చేరితే, తన భార్య పై కించిత్ గర్వం రేవంత్ ఛాతిలో పొంగింది. తమ విశేషాన్ని కూడా జెన్నీ తో పంచుకొని, మరింతగా ఆనందించి, వీడ్కోలు తీసుకున్నారు.

“ఇక పరీక్ష ఫలితం గురించి దిగులు పడను…నువ్వు రేపు ఆఫీస్ కి నిశ్చింత గా వెళ్ళు రేవంత్”, ఆ రాత్రి పడుకోబోయే ముందు చెప్పింది ప్రవల్లిక.

****

మర్నాడు ఫలితం వచ్చింది. పాజిటివ్… పాజిటివ్ గా డౌన్ సిండ్రోమ్ ఉన్న బేబీ. నూటికి తొంభై తొమ్మిది శాతం కేసుల్లో డౌన్ సిండ్రోమ్ బేబీనే పుట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయి.

డాక్టర్ అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కౌన్సెలర్ వారికి ఉన్న ఆప్షన్స్ విశదీకరించాడు. ఈ పరిస్థితిలో తొంభై తొమ్మిది శాతం  ప్రెగ్నెంసీ ని ఎబార్ట్ చేయించుకుంటారు. బిడ్డని కనాలనుకుంటే కూడా పూర్తి సహాయం లభిస్తుంది, అది పూర్తిగా వారి నిర్ణయం అని చెప్పాడు. ఒక వేళ అబార్షన్ నిర్ణయిస్తే, అప్పటికప్పుడు దొరకటం కష్టమవ్వచ్చని చెప్పి డాక్టర్ వారికి ముందు జాగర్త కోసం రెండు రోజుల తరవాత కుక్ కౌంటీ హాస్పిటల్లో ఎప్పయింట్మెంట్ ఇచ్చేశాడు.

అంతా ఒక కలలా అనిపిస్తోంది రేవంత్, ప్రవల్లికలకి. అన్నిటికీ తలాడిస్తున్నా, ఏమీ ఆలోచించలేని ఒక శూన్య స్థితి. అలాగే మౌనంగా ఇంటికి చేరారు.

అసలు పగలు రాదేమో అని అనిపించిన రాత్రి, ఇద్దరికీ కూడా.

అంధకారం తరిమేసే ఆ తొలికిరణాలు తాకంగానే, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా లేచి కూర్చొంది ప్రవల్లిక.  “మనం అనుకున్నట్లుగా రెండు రోజుల్లో డోర్ కౌంటీ వెళ్తున్నాం. నువ్వు శలవు పెట్టు”, ఆజ్ఞాపించింది ప్రవల్లిక. బదులివ్వలేదు రేవంత్.

****

నిర్ణయం తీసుకున్న తరువాత ప్రశాంతత వస్తుందనుకున్న అంచనా కూడా దెబ్బతింది. పర్యవసానం గురించి చర్చించకుండా తీసుకున్న ఏకపక్షనిర్ణయ భారం, ప్రవల్లికను రోజు గడిచే కొద్దీ కృంగతీస్తోంది. రేవంత్ పట్టాభి గారితో ఒక సారి మాట్లాడదాం అని అనంగానే, వెంటనే ఒప్పుకుంది. పట్టాభి గారికి కాల్ చేసి పరిస్థితిని వివరించంగానే, ఆయన అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

ఒక అరగంటలో వారి ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ.

తలుపు తీసిన అరుణని చూసి క్షణకాలం ఆశ్చర్యపోయారు ఇద్దరూ. కనుముక్కుతీరు ఒకప్పటి అందాన్ని గుర్తు చేస్తున్నప్పటికీ, ఏ మేకప్ లేకుండా ఉన్న ఆమె ముఖంలో ముందు కనపడిన వర్చస్సు లేదు. పట్టాభి కూడా వచ్చి వీళ్ళని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత ఆయనే విషయం కదిపాడు.
“ఏం చేద్దామనుకుంటున్నారు మీరు?”

“డౌన్ సిండ్రోమ్ ఉన్నా, లేకున్నా, నా బిడ్డని వదులుకోను”, తడుముకోకుండా జవాబిచ్చింది ప్రవల్లిక.

“అన్నీ ఆలోచించావా?” అడిగింది అరుణ.

“అన్నీ… అంటే చెప్పలేను. కానీ నా బిడ్డ ఎలా ఉన్నా, నేను చూసుకుంటాను, ఆనందంగా ఉంటాను. ఈ ధైర్యం కూడా రేవతిని, మిమ్మల్నీ చూసాక కలిగింది.”

“మా టైం లో ఇటువంటి పరీక్ష లేదే అని ఈ రోజుకీ బాధ పడుతూ ఉంటాను, నేను” అనుకోని విధంగా స్పందించాడు పట్టాభి.

“రేవతి పుట్టుకతో ఒక కొత్త జీవితాన్ని ఆశించాం..కానీ జీవితాంతం మరో కొత్త లేకుండా జీవించటాన్ని కాదు. ఉదయాన్నే లేచిన తరువాత నేను రేవతిని చూస్తే ఈ రోజుకీ నాకు కలిగేది బాధే. మేమేం తప్పు చేశాం అని మొదట్లో పిచ్చిగా ప్రశ్నించుకొనే వాళ్ళం. చుట్టుపక్కల వాళ్ళ నుంచి దానికి లభించిన సమాధానం “మేమో లేక రేవతో చేసిన పూర్వ జన్మ పాపం…” అది మమ్మల్ని ఏ మాత్రం సమాధానపర్చలేదు సరి కదా, అలా అనే వారి మీద ద్వేషాన్ని పెంచింది.

ఎవ్వరితో కలిసే వాళ్ళం కాదు. ఇంత మంది స్నేహితులు చుట్టూ ఉండి కూడా ఒంటరి వాళ్ళమైపోయాం. మాకొచ్చిన కష్టానికి ఏ కారణం లేదు, అందరి లాగానే హాయిగా ఉండే హక్కు మాకూ ఉంది అని మాకు మేము సర్దిచెప్పుకోటానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ అది కూడా సహజం కాదు. నిరంతరం ఉండే దుఃఖానికి చేసే ఈ ఎదురీతలో అలసిపోయి మానసికంగా ఎంతో ముసలాళ్ళైపోయాం.
రేవతి పై మేము చూపించే శ్రద్ధకీ, కురిపించే అనురాగానికీ, మమ్మల్ని పోగిడే వాళ్ళు పెరిగారు కానీ, ఒక రోజన్నా ఎవరి దగ్గరైనా వదలి వెళ్దామంటే, చూసుకొనేందుకు మాత్రం ముందుకు వచ్చిన వాళ్ళు లేరు.

మాకున్న అతి పెద్ద భయం ఏంటో తెలుసా? రేవతి మా కంటే ఎక్కువ కాలం బ్రతుకుతుందేమోనని…”, ఆ పై మాటలు పెగల్లేదు పట్టాభికి.

“కాబట్టి మీరు మమ్మల్ని చూసి స్ఫూర్తి పొంది నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించుకోండి” అంటూ ముగించింది అరుణ. కొంతసేపు నిశ్శబ్దం రాజ్యమేలిన తరువాత శలవు తీసుకొని, ఇంటికి చేరారు, ప్రవల్లిక, రేవంత్ లు.

****

“మనకింకా అయిదారేళ్ళ సమయం ఉంది. ఇప్పుడు ఈ బిడ్డ వద్దనుకున్నా మరో సారి ప్రయత్నించచ్చు. దీని గురించి అంత ఎక్కువగా ఆలోచించద్దు” తన పక్కనే పడుకున్న ప్రవల్లికతో అన్నాడు రేవంత్.
“అంత సులువా రేవంత్? ఈ బిడ్డ ఆరోగ్యం బాగోదు, కాబట్టి భూమ్మీదకి రావటానికి వీల్లేదు అని ఈ లోక ద్వారపాలకుల్లాగా ప్రవర్తించే హక్కు మనకెవరిచ్చారు?
ఆర్ధిక ఇబ్బందుల వల్ల బిడ్డ వద్దనుకున్న జెన్నీకి, ఆరోగ్యం బాగుండదేమో అని అనుమానిస్తూ వద్దనుకుంటున్న మనకూ తేడా ఏముంది?”

“అదీ, ఇదీ ఒకటే ఎలా అవుతుంది?”

“ఎవరు గీస్తారు రేవంత్ ఆ రేఖని? ఆరోగ్యం సాకుతో మనం, ఆర్ధిక నెపం తో జెన్నీ, ఆడపిల్లేమో అన్న భయంతో మన దేశంలో ఏంతో మంది… కారణాలు ఏమైతేనేం? అందరం హంతకులమే కదా?”
“ఒక్కోసారి నీ మేధస్సే నీ శత్రువై, నీ ఈ పదునైన ఆలోచనలే నిన్ను చిత్రవధ చేస్తాయి. నేను చెప్పేదేం లేదు ఇక. మన సూట్కేస్ సిద్ధంగా ఉంది. వెకేషన్ కి డోర్ కౌంటీ కెళ్ళాలో, లేక కుక్ కౌంటీ హాస్పిటల్ కెళ్ళాలో రేపు ఉదయానికల్లా నువ్వే తేల్చుకో” అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు రేవంత్.

****

“కార్ కీస్ నా కివ్వు” అడిగింది ప్రవల్లిక.

“ఈ పరిస్థితిలో.. అవసరమా?”

“ప్లీజ్ రేవంత్… ఈ రోజు మాత్రం నేనే డ్రైవ్ చేస్తాను. అడ్డు చెప్పద్దు.”

“ఒకే..జి.పి.యస్ పెట్టనా?”

“గమ్యం తెలిస్తేనే కదా ఏ జి.పి.యస్ అయినా దోవ చెప్పగలిగేది?”

ఓడిపోయిన వాడిలాగా చేతుల్ని గాల్లో ఎగరేసి పాసెంజెర్ సీట్లో కూర్చోండి పోయాడు రేవంత్.

కారు వేగం అందుకొంది, రేవంత్ ఆలోచనలు అంత కంటే వేగంగా పరిగెడుతున్నాయి. విండోలోంచి  మేపుల్ చెట్ల ఆకులు ఊగుతూ చుట్టూరా పచ్చగా కనపడుతున్నాయి.

“ఎంత సేపు అలా మౌనంగా ఉంటావు? ఏమాలోచిస్తున్నావు ప్రవల్లికా?”

“రాత్రి ఎదో మేధస్సు, ఆలోచనలు అన్నావు చూడు, అన్నీ ఉన్నా నేనెంత సగటు మనిషినా అని”

“ఏమంటున్నావో అర్థం కావట్లే..”

ఎదురుగా రక్తమోడుతున్న రంగులోకి లైటు మారటంతో కారు ఆగింది. యుగాలుగా అనిపించిన ఆ కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ కదిలింది. ఎంత ఉన్నతమైనదైనా స్వానుభవంలోకి వచ్చేసరికి  వంచబడే సిద్దాంతంలా మలుపు తిరిగింది రోడ్డు. రోడ్డు పక్కన కనపడే సైన్ బోర్డుల పై గమనించాడు రేవంత్, కుక్ కౌంటీ హాస్పిటల్ చిహ్నాలు.