రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి
ప్రచురణ: 1 అక్టోబర్ 2015
కథాసాహితి ‘కథ-2015‘ సంకలనం
ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.
నలభైయేళ్లుగా ఈడనే కూచుని వున్నాడు. రామారావు ముక్యమంత్రి కాకముందర, అయిన తరవాత ఊరికొచ్చినపుడు యీ దారంటే ఊరేగింపు చేశాడు. అంత లావు రామారావుని జనం బుర్రలోంచి మరిపిచ్చేసిన ఈ మారాజేవరా అని చంద్రబాబుని ఎగిరెగిరి చూసి ఆశ్చర్యపోయాడు. అయితే రాజన్న మటుకు తక్కువా?! పంచెగట్టి చేతులూపుకుంటాపోతావుంటే జనాలు ఎంత ఇదైపోయారు. చూస్తానే వున్నాడు…అందర్నీ…. యీడ్నే కూచుని. ముందుకీ పక్కకీ జరగలా గాని రోడ్డు ఎడల్పు చేసేప్పుడు కాసింత ఎనక్కి పోవలిసొచ్చింది!
సినిమా హాలు సెంటరు కాడ రాత్రి చానా పొద్దు దాకా జనాలు తిరుగతనే వుంటారు. పెళ్లి గాక ముందు తను రేత్తిరిపూట సినిమా యిడిసి పెట్టేదాకా ఆడనే కాసుకుని ఉండేవాడు. రేత్తిరి సినిమాకి వచ్చే జనం పొయ్యే జనం-ఇద్దరి ముగ్గురి చెప్పులన్న తెగిపోయ్యేయి.
ఆ టయాన జోడు తెగితే మంచి గిరాకి. ఏళ గానీ ఏళ గాబట్టి తనకి ఓ రూపాయి ఎక్కువ వసూలు! ఆ వసూలైన డబ్బులు దాపెట్టి ఆదోరం జలసా చేసేవాడు. పెళ్లైన తరవాత పొద్దు గుంకక ముందరే ఇంటికి పోవలిసొచ్చింది. సందకాడ ఉజ్జోగం మానేశాడు. అయినా ఇదివరకులా ఇప్పుడు తెగేదాకా చెప్పులు ఏసేవాడు ఏడున్నాడు! ఒక్కో మడిసికి నాలుగేసి రకాలాయే. పొద్దున్న లేస్తే ఆమనే నడస్తా పొయ్యేదానికి ఒకటి , ఇంట్లో ఒకటి, ఆఫీసుకొకటి, ఆటలకొకటి, బజారుకి పోతే ఇంకొకటి!. తిండికి లేనోడు తిండికి యాడస్తంటే జరిగినోడికి ఇట్ట….!
ఈడ కూచుని చూస్తనే వున్నాడు, జనాలు సినిమాలకి నడస్తా రావడం మానేశారు. తొక్కుడు రిక్షాలు పోయి ఆటోలు, సైకిళ్ళు పోయి మోటారు బళ్ళు, రకరకాల గుడ్డలు, ఇంకా …గుడ్డ రంగునిబట్టి జోళ్ళు! జోళ్ళు నలక్క ముందే పడేత్తన్నారు. ఇంకా తెగేది ఏడ? తనకి పని దొరికేది ఏడ? పక్క సందులో సాయి బాబా గుడికాడ రకరకాల కొత్త జోళ్ళు వుంటాయి. ఆటిల్లో నాలుగు తెగబెరికేసి ఆడనే దుకానవెట్టి మళ్ళా కుట్టేస్తే బావున్ను! కానీ తనకట్టా చెయ్యను చాతగాదు. ఇప్పుడుగాదు, ఎప్పుడూ తప్పుడు పనులు జేసి డబ్బులు సంపాయించాలని చూళ్ళేదు. బిడ్డల చిన్నతనంలో ఇంటికాడ మంది తక్కువ, పనెక్కువ. ఇప్పుడు మంది పెరిగారు గాని పని రాన్రాను తగ్గిపోయింది. తనకొచ్చే సొమ్ముతో ఇల్లు గడవక, పెళ్ళాం పాలేనికి దగ్గర్లో టీచరమ్మకాడ పనికిజేరింది. మరి దానికి బైట రోజుకూలి పనికి పోయే ఓపిక లేదు, అలవాటూ లేదు.
దుకానం సర్దతానే తలెత్తి చూశాడు. ప్రతిరోజూ చూస్తాడు. ఎదురుగా కిళ్ళి షాపులో షబానా వుంటది. పెళ్లి కాకండానే ముసిల్ది అయిపొయ్యింది. ముసుగుల్లో వుండాలిసిన పిల్ల బజార్లో కూచుని వుండటానో, తల్లీ తండ్రికి తాహతు లేకనో ఆ పిల్లకి నికా కాలేదు. షాపుకి మొగోళ్ళు సిగ్రేట్లకని, వక్కపొడికననీ ఒక్కోసారి కాలక్షేపానికని వస్తనే వుంటారు. షబానా ఎవ్వురివంకా తలెత్తి చూడదు. అందరితోను కోపంగా వున్నట్టు మాట్టాడతాది. కానీ తనవంక మాత్తరం అదో ఇదిగా చూసేది. తన మొహాన్నీ, బుజాలని మొత్తం కండల్ని కళ్ళతో తడిమేది.
ఎప్పుడైనా ఒళ్ళు తేడాజేసి రెండ్రోజులు షాపు తెరవకపోయినా ఆలిసంగా తీసినా కంగారుగా కళ్ళతో పలకరించేది. తను తలెత్తి చూడకుండానే షబానా తన్ని చుస్తందని కనిబెట్టగలడు. తనక్కూడా షబానా మీద మోజుండేది.
ఓ కాలంనాడు దయిర్నం చేసి మాట్టాడి లేవదీసుకుపోవల్నుకున్నాడు. కానీ ఇద్దరూ మంచం పొత్తు లేని జాతులై పోయే. పైగా అంగడి ఎవైపోద్దో అని గాబరా పడ్డాడు. ఈ రోజున పెళ్లి పెటాకులు లేకండా దిగాలుగా వాడిపోయిన షబానాని చూత్తే జాతిని తీసుకెళ్ళి నూతిలో పారేసి నా ‘సూపరు మారికేట్టు’ ఎత్తి ఏ సందులో పరిస్తే పని జరక్కుండా పోయేదా, దీనికోసరం ఆ పిల్లని ఉసురు పెట్టానా అని మనేద కలుగుద్ది. మేనమావ కూతురు రవనని మనువాడినా చానా మాట్లు రేత్తిరిల్లు తన పక్కన ఒత్తిగిల్లిన పిల్ల రవనలా కాకండ షబానాలాకనబడేది!
అల్లంత దూరాన జగ్గయ్య పంతులొస్తా కనబడ్డాడు. ఇద్దరూ ఒకే కాలాన్ని పుట్టినోళ్ళు. ఇంటికాడ చొక్కా ఏసుకోడు, బజారోస్తే నీలం గళ్ళ చొక్కా ఏస్తాడు. మడిసి పచ్చగా తన నల్లటి సేతులతో తాకితే మాసిపోతా అనేలా వుంటాడు. కానీ తనంత గట్టింగ లేడు. మెడ కాడా, చెంపలకాడా జారిపోయింది. పంతులు తనూ ఒకే బళ్ళో పలకబట్టారు. తన సదువు నాలుగుతో ముగిసిపోతే పంతులు చానా దూరం పొయ్యాడు. పోతం పోయ్యడుగాని ఎప్పుడూ అత్తెసరే. ఆడాడ లెక్కలు రాసి బతకతంటాడు. వున్నా లేక పోయినా గుడ్డ నలగనీడు. మడిసి చానా ఉషారు. ఐతే చాదస్తం బాపడు. లేకపోతే ఉళ్ళో ఎన్ని యాపారాలొచ్చాయి! కానీ తన దగ్గర్నే చెప్పు తయారు చేబిచ్చుకుంటాడు. ఎంత అడిగినా బేరం ఆడకుండా ఇచ్చేస్తాడు. తనుగూడ ఎప్పుడూ పంతులినుండి ఎక్కువ గుంజాలని చూళ్ళేదు.
“ఆ మారయ్యా, మన బాటా కంపెనీ కొత్త మోడల్స్ తియ్యి. జోళ్ళు మార్చేద్దాం” జగ్గయ్య తన పరచికానికి తనే ఇరగబడి నవ్వుతా పక్కనే బల్లమీద కూలబడ్డాడు.
“రా పంతులా, నీ కోసరం గాక ఎవురికోసరం ఈడ కూసుండి వున్నా?! అట్నే కుట్టేద్దాం., రేపొద్దుటికి.” తన పాత సావాస గాడినీ, కస్టమర్నీ చూసి మారయ్య మనసు కుశాలైపోయింది.
తోలు పని చేయడం గమ్మత్తనిపించినపుడు, బడి మానేసి పన్లోజేరాలనుండే సంగతి మొదులు ఇంటికాడ కాకండా జగ్గయ్యతోనే చెప్పాడు. జగ్గయ్య కాసేపు బడి మానోద్దని మారయ్యని బతిమిలాడాడు. గోటింబిల్లా, గోలికాయలు, బచ్చాలు, ఇంకా అట్టాంటి చానా ఆటలు మారయ్య కాడనే జగ్గయ్య రహస్యంగా నేరిచాడు. అట్టాంటి గురువు తన్ని వొదిలి పోతాడంటే జగ్గయ్యకి దిగులైపోయింది. కానీ మారయ్య ఇనిపిచ్చుకోల.
“రేపటినించీ రానంటే రానంతే” ఆఖరికి ఇసయం అదే.
ఆ రోజున ఇద్దరూ ఆశతీరా ఆడుకున్నారు మాపటేళకి ఇంటిదారి బోతన్నారు. జగ్గయ్య ఇల్లు బజారు ఏమ్మిడే. మారయ్య గుడిసె మాత్తరం బజారు దాటి సివరాకర్న ఆడేడో. ఆటకి అలిసి సావాసగాళ్ళకి దాహమైపోయింది.
“దాహంగా వుందిరా” మారయ్యకి గస లేసింది.
జగ్గయ్య చప్పున ఇంట్లోకి పోయి లోటానిండా నీళ్ళు తెచ్చాడు. మారయ్య గటగటా తాగేశాడు. అంతట్లోకి యీదిలోంచి పెద్ద పంతులు (జగ్గడి నాన్న) గుమ్మంలోకొచ్చాడు. మారయ్య సాయ ఎగాదిగా చూశాడు.
“ఎవరబ్బాయివిరా”అనుమానం!
“తోలు మల్లయ్య కొడుకుని” మా పాలెంలో మానాన్నని అందరూ అట్టానే పిలుస్తారు. అట్టా పిలవడం నాకు బలే గొప్పగా అనిపిస్తాది.
“దాహానికి నీళ్ళు తాగితే తాగావుగానీ, ఆ చెంబు ఇహ ఇంటికి పట్టుకుపో. మళ్ళా మాఅబ్బాయితో తిరగవాక”జగ్గన్ని బుజం పట్టుకుని ఈడ్చుకుపోతా చెప్పాడు.
మారయ్యకి చెంబు బలే నచ్చింది. ఉత్తికినే వచ్చింది పైగా. ఇంట్లో వున్న సత్తు సొట్టల చెంబు మాదిరిగాగాకండ ఇది తళ తళగా వుంటం మూలాన మొగంగూడ సూస్కోవచ్చు.
“యాడిదిరో చెంబు”పుల్లమ్మ కొడుకునీ చెంబుని వింతగా మార్చి మార్చి చూస్తా అడిగింది.
“జగ్గయ్య నాన్న, పెద్ద పంతులిచ్చాడు. ఆడ నీళ్ళు తాగినా. ఎమ్మటే సెంబిచ్చేశారు”గర్వంగా గడ్డమెత్తి చెప్పాడు.
“నిన్ను తిట్టి కొట్నారా?”అమ్మకి గాబరా పుట్టింది.
“లేదే! ఎందుకూ?”అమ్మ నేను ఆళ్ళకి తెలీకండా చెంబు తెచ్చాననుకుంటందనుకుంటా.
“ఏరే వాళ్ళైతే సంపినంత పని జేద్దురు. పెద్ద పంతులు దేవుడే. బిడ్డో, నీళ్ళ కోసరం అట్టా పెద్దోళ్ళ కొంపలమీద పడమాక. కడగొట్టోళ్ళం. ఆళ్ళని కళ్ళతోజూసిందే మనకి గొప్ప. అంతగా దప్పికైతే దోసిట్లో పోబిచ్చుకుని తాగు”అమ్మ జాగర్త చెప్పింది.
ఈ రోజుకీ మారయ్య ఆ చెంబుతోనే నీళ్ళు తాగుతాడు. ఆ చెంబు తన పుట్టుకని ఎగతాళి చేసేదని చానాకాలానికి గాని బుర్రకెక్కలేదు. పని తగ్గి కాళీ పెరుగుతున్న రోజుల్లో, పక్కనే వున్న వేరే పాలెం లోకి సున్నం పనికిబోయాడు. దండెం మీద తువ్వాలుకి కడిగిన చేతులు తుడిస్తే ఆ ఇంటి ఆడది నారాయణమ్మ తువ్వాలు ఎత్తకపోమ్మంది! అమ్మ జెప్పిన సంగతి గ్యాపకం వొచ్చింది. తను కడగొట్టు మడుసుల్లో కడగొట్టు. చెర్చి కాడ కంచం పొత్తు సూబెట్టెవోళ్ళు ఇంటికాడ తేడా సూబెట్టేశారు.
బడి మానేసి తోలుపనికి జేరేప్పటికి తను చిన్నోడే. మోదట్లో ఆ వాసనకి వాంతి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి అలవాటైంది. కానీ పని ఎన్నాళ్ళో సాగలా.
“తోలు పని ఇడిసి పెట్టేసేయ్ రా. ఇది ఒంటిని లోపట్నించి తినేస్తాది. పేనం వున్నప్పుడు మెరిసే తోళ్ళు పేనం పోయినాక కరిసేస్తాయి. నా రోగం తోలు నుంచే పుట్టింది”. సచ్చేముందు అయ్య మాట ఇన్న తరవాత తోలంటే బెదురు పుట్టింది. దాన్ని ఇడిసి పెట్టేశాడు. సినిమా హాలు కాడ దుకానవెట్టాడు. జోళ్ళు బాగుజేసేది, తాయారుజేసేది నేరిచాడు. కొత్తగా పని జేసేప్పుడు పనిలో ఒళ్ళు దగ్గిరిండాల! లేపోతే సేతులు సిల్లులే
“పిల్లకాయలెట్టున్నారు పంతులా?”మారయ్య ఆరా తీశాడు.
జగ్గయ్య మోహంలో కులాసా మాయమై దిగులొచ్చింది.
“ఆ ఏముంది మారయ్యా. పూజలు చేసేదానికి పనికి రాని పంతుళ్ళు. ఉజ్జోగాలు సంపాయించలేని మొద్దోళ్ళు. పెద్దోడు హైదరాబాద్ పోయాడు. చిన్నోడు ఇంకా ఏపని చెయ్యాలో తెలుసుకోక తిరగతా వున్నాడు”.
“కానీ పంతులా. ఏదో పనికి పోనీ”
“మాబోటోళ్ళని మీవోళ్ళు నేలకి తోక్కేసిన పాపం మీరిట్టా అనుబగిస్తన్నరేవో పంతులా”పరచికంగా నవ్వతా అనేశాడు మారయ్య. జగ్గయ్య కూడా నోరారా నవ్వాడు.
“ఓ కాలం నాడు మేం గొడ్లు కాసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతికామంట. తారవాత రాజుల్నీ, రాజ్యాల్నీ ఏలాం. ఈ రోజు నువ్వు తోలు కోసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతకతన్నావు. రేపు నువ్వు రాజ్యం ఏలతావులే’’ పంతులు బరోసా ఇచ్చాడు.
“నే రాజ్జానికి వొచ్చేలోగా ఇల్లు గడవాలిగా. మనవడికి వొళ్ళు ఎచ్చబడింది. మందు ఏపిచ్చాలి. రెండొందలిప్పియి పంతులా”మారయ్యకి అవసరం గురుతుకొచ్చింది.
పంతులు జాగర్తగా రెండు నోట్లు తీసి మారయ్య చేతిలో పెట్టాడు. మారయ్య ఆటిని బొడ్లో దోపాడు.
“ఇంతకీ రాజ్యం చేతికొచ్చాక ఏం జేస్తావు మారయ్యా?”జగ్గయ్య నవ్వతానే అడిగాడు.
“నాకైతే ఆటిగురించి ఆలోశన లేదు. రాజ్జాలు ఏలేది ఒకరో ఇద్దరో. తీరా కురిచీలు ఏక్కాక మడుసుల్లో మారుపోచ్చెసుద్ది. నాకు దరమం కావాలి. నా పని గూడా అన్ని పనుల్లోకి సమానం కావాలి. అంటే సూది మందేసే బాబుతో నాకూ సమానంగా డబ్బుఇయ్యాలి. నాకే గాదు…అన్ని పనులకీ అటు ఇటుగా ఒకే రేటువుండాలి. ఇగ అన్ని కూలాలోల్లకి పని దొరకాలి! అప్పుడు ఎక్కువా తక్కువా తేడా ఏడుంటది?”
“ఓర్నీ అసాధ్యం గూలా! నువ్వూ సూదిమందిచ్చే డాక్టరూ ఒకటే?”పంతులు నమ్మలేనట్టు మొకం పెట్టి నవ్వాడు.
మారయ్య పొగాకు నముల్తా వున్నాడు. జవాబు చెప్పేదానికి తుపుక్కున ఉమ్మేశాడు. ఇంతట్లోకి గందరగోళంగా గోస ఇనపడింది. మందిజేరి రాలి తీశారు. మారయ్య పెద్దకొడుకు కొండయ్య ముందర్నే నడస్తావున్నాడు. ఆడు మందిలో లేపోతే అనుకొవాల. ఉండకుండా ఎట్టా? మరి తన కొడుకు నాయకుడుగాదా! కొండయ్యకి అన్ని కులాల్లో సావాసగాళ్ళున్నారు. ఎవురూ ఆడికి నీళ్ళు తాగిన చెంబిచ్చేసేదానికి, దోసిట్లో నీళ్ళు పోసేదానికి దయిర్నం చెయ్యరు. ఆడు పులిలాటోడు. ఆడికన్ని తెలుసు. కానీ ఇంకా సంపాదన్లోకి రాలేక పోతన్నాడు.
కొండయ్య ఊరేగింపు వొదిలి నాన్న కాడికొచ్చాడు.
“నువ్వు గూడా రాగూడదా నానా?”
“నువ్వు పోరా నాకు దుకానముంది”.
“ఎప్పుడూ వుండే దుకానమేగా. ఆడ పారేసి రాగూడదా,” కొడుకు ఆదుర్దా
“ఎందుకురా ఈ తంతు ఇయ్యాల?”
“ఉజ్జోగాల్లో న్యాయం జరిగేదానికి”
“ఎన్ని ఉజ్జోగాలున్నయిరా?”
“ఎన్నైనాగానీ, పెద్ద పెద్ద ఉజ్జోగాల్లో మనోళ్ళు పోవాలి”
“నే రాలేను. నువ్వు పోరా”మారయ్య ఉన్న చోటునుంచి కదలేదానికి ఇష్టపడలేదు. కొండయ్య కోపంగా చిరాగ్గా చూసి ఎల్లిపోయాడు.
రెండో కొడుకు బుద్ది పుట్టినపుడు ఆటోఏస్తాడు. తనకొడుకేంది, తనకి తెలిసిన కమ్మరోల్ల కొడుకులు, కుమ్మరోల్ల కొడుకులు, వొడ్డి పిలకాయలు ఆటోలు తోల్తానే వున్నారు. అంతకి మించి వాళ్ళకేం పని అగపడలా.
పంతులు రాలీ చూత్తా గమ్మునున్నాడు. మారయ్య మాట్టాడాడు, “పాత రోజులే నయ్యం పంతలా. జనాలు తక్కువ. పని దండిగా దొరికేది. ఇయ్యాల జనాలెక్కువ. పనులు లేవు. పని వున్నోడికి పనిమీందనే వుంటది. లేనోడికి కోపంగా ఇసుగ్గా వుంటది. పెద్ద పెద్ద కురిచీలెక్కినోళ్ళు ఈ పిల్లోళ్లికి పని సూబిచ్చలేక, ఆళ్ళు రోడ్లట్టుకు తిరగతా ఆక్రూసిస్తా వుంటే నిమ్మళంగా వుంటారు. ఈ పిలకాయల్లో చురుకంతా ఎవురికీ పనికి రాకండా పోతంది. దీన్ని వాడుకోను లోకానికి చాతగావడంలేదు”.
పంతులు మళ్ళా ఏంమాట్టాడ లేదు. “ఇహ పోతా మారయ్య”అనేసి ఇంటేపుకి పొయ్యాడు.
పంతులు తనని ‘అరే ఓరే’ అనీ బమగా పిలస్తాడు. కానీ తనట్టా పిలవలేడు. మారయ్య చిన్నదో పెద్దదో అని సూడకుండా ఏ పనైనా జేసుకు బతగ్గలడు. కానీ పంతులట్ట బతకలేడు. వాళ్లిద్దరికీ ఒకళ్ళ మీంద ఒకళ్ళకి అబిమానం వుంది గానీ ఒకళ్ళింటికి ఒకళ్ళు పోరు. కొండయ్య మాత్రం ఎవురింటికైనా పోగలడు. పెద్ద పెద్ద సంగతులు మాట్టాడగలడు. కానీ అదేందో మరి ఆడుగూడా సంతోషంగా లేడు!
నిట్టురుస్తా పంతులి పని మొదలెట్టబోయిన మారయ్యకి ఇంటికి పోవలసిన తొందర గురుతొచ్చింది. కూతురొచ్చింది. ముగ్గురు బిడ్డల తల్లి. అల్లుడు మరీ తట్టుకోలేనంత దెబ్బలుగొడితే వచ్చేసుద్ది. అల్లుడు అదోరకం. ఆడికి ఎప్పుడు తిక్కరేగినా పెళ్ళాం లోకువగా దొరుకుద్ది. దాన్ని సావ బాత్తాడు. తిక్క రేగడానికిపెద్ద వొంకలు కుడా అవసరంలా. ముద్ద మింగేప్పుడు పొలమారినా సాలు.
అమ్మమ్మ గ్యాపకంగా కూతురికి ఎంకటలచ్చిమని పేరెట్టాడు. పెళ్లి తరవాత అల్లుడు దాన్ని ఎలిజిబెతని మారిచాడు. అంతకు ముందు మాతమ్మ గుడి కాడ దన్నవెట్టే కూతురు ఇప్పుడు మరియమ్మ గుడికాడ గూడా మొక్కుతాది. అంతే! పేరుమారినా, కొలిచే దేవుళ్లు మారినా ఆ పిల్లకి పట్టదు.
“అన్నీ ఒగటేలే అయ్యా, తిని తీరిగ్గా కూచ్చునే వాడికి తగూలన్ని,” కాచి వడబోసినట్టు చెప్పేసుద్ది.
ఐతే రవనకి గానీ తనకి గానీ కొత్త పేరు నోరు తిరగాలా, గానీ బిడ్డ అలవాటు జేసేసుకుంది. అడదిగాద, మొగోడు చెప్పినదానికి అలవాటు పడాల. కడగొట్టోళ్లలోకి కడగొట్టుది ఆడదే!
అంగడి కట్టేసాడు. అంటే తాళాలు ఎయ్యడం కాదు. ఉన్న సరంజామా మీద గోతం పట్టాలు కప్పి వచ్చేసాడు. ఎవురి సొత్తు అయినా దోసుకోగలరు. కానీ మాదిగోని సొమ్ము దోసుకోరు. అది దరిద్రపు సొమ్మంటారు. ఏవుందాడ? పాత చెప్పుల సంపద! ఇదే లోకం మాదిగోనికిచ్చిన సొత్తు. ఊరికే ఇస్తా అన్నా ఎవురూ తీసుకోరు!
బుడ్డోడికి అయ్యవారమ్మ జరం బిళ్ళ ఇప్పించిందని జెప్పింది రవన. జరం నిమ్మలిచ్చింది. రెండొందలు మిగులు. పెళ్లామిచ్చిన టీ నీళ్ళు తాగి కింద గుడ్దేసుకుని పండుకున్నడు మారయ్య. తలలో ఆలోశన్లు కుమ్మరి పురుగాలే తొలిసేస్తన్నాయి.
పంతులికి కూటికి ఇబ్బందే. చెప్పుకోడు. తనకి రేపటి రోజు ఎలా తెల్లారుద్దో తెలీని పరిస్థితి. కొడుక్కి తెలివి వుంది గానీ ఉజ్జోగం లేదు. షబానాకి ఇంక మొగుడు దొరకడు. కూతురికి మొగుడు బారినుండి ఎట్టా బైట పడాలో తెలీదు. ఏదో మందపాటి గోడ అడ్డంబడతంది…ఈ బతుకులకి ఆటి సుకానికీ మద్దెన!
గోడలు!
ఎదురుగా చూశాడు. తన ఇంటి మట్టి గోడ. ఒక్క దెబ్బకి పడిపోద్ది! కళ్ళు మూసుకున్నాడు. ఎత్తుగా గోడలేవో కనబడతన్నాయి. చాలా బలంగా వున్నాయి. కలగంటన్నాడా? మేలుకునున్నాడా? మారయ్యకే అర్ధం కాలేదు. మళ్ళా కళ్ళు తెరిచాడు.
కళ్ళ ముందు ఏడోకలాసుకంటే ఎక్కువ, ఎనిమిదో తొమ్మిదో సదూతున్న ఎలిజిబెత్ కూతురు.
“అమ్మీ, ఉక్కు పోసి గట్టి మందపాటి గోడ కట్టారనుకో…దాన్నెట్టా బద్దలు కొట్టేదీ?” అడిగాడు
“కింద బాగా వేడి పెట్టు. కరిగిపోద్ది. అయితే వేడి చానా ఎక్కువ పెట్టాలి తాతో”.
కాసేపటికి బైయట మబ్బు గమ్మి వాన పడతా వుంది. ఇంటి ఆడది బొగ్గుల కుంపటి రాజేసి పిలకాయల కోసరం మొక్కజొన్న కంకులు కాలస్తంది. కొండయ్య కూడా ఇంటి కాడనే వున్నాడు. అంతా చలికి వనకతా వున్నారు. చేతులు ఎచ్చబెట్టుకోడం కోసరం కుంపటి కాడజేరి చేతులు జాపారు.
“ఎంతేడి పెడితే గోడ కరుగుద్దో ఇంత సలిలో!” పైకే అనుకుంటా మారయ్య గూడా లేచి వాళ్ళ పక్కకి జేరాడు .
సెగ ఎచ్చగా నరాల్లోకి పాకింది.
5 అక్టో 2018 at 7:28 సా.
చాలా బావుంది. మనుషుల మధ్యనున్న రకరకాల గొడలని సున్నితంగా చూపెట్టింది.
అవును బాగానే మంట పెట్టాలి.
మెచ్చుకోండిమెచ్చుకోండి