రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి

అరుగు‘, 15 జూన్ 2016


 

మడిసి మట్టిలోంచి పుట్టాడని ఏదాంతం.  అంకయ్యకి ఏదాంతం తెలవదు.  మట్టిలోంచి మడిసి రావడం సంగతి పక్కనబెడితే ఆడికి పుడతానే మట్టితో లంకైపోయింది.  మట్టిని పుట్టిన గడ్డిని కోసే కొడవలితో గూడా.  ఎట్టంటావా?!  అంకయ్య తల్లి లచ్చమమ్మ రేత్తిరేదో, పొద్దేదో దిక్కుతెలీని దానిలా పాటు చేస్తా వుండేది.  నిండు సూలుతో గూడా దగ్గరనే గదాని పెనిమిటికి ఆన్నం ఇచ్చిరాను పొలానికి పోయ్యందా, ఆడ్నే నొప్పులొచ్చి బిడ్డ జారి బూమ్మీద పడిపోయిండు.  ఏమ్మిటే చేతనున్న కొడవలితో ఆయమ్మే బొడ్డుతాడు కోసేసినాది.  పురిటి బిడ్డని మొదులు చేతని పట్టుకున్న్న మంతరసాని మట్టితల్లే.

అంకయ్యకి అమ్మ తరవాత అమ్మ నేల తల్లైతే, బొడ్డు తాకిన కొడవలి సావాసగాడి లెక్క.  పెద్ద పండక్కి తెల్ల లుంగీ పంచె కరీదు జేస్తాడు.  పైన తువ్వాలు ఏస్తాడు.  తెల్ల గుడ్డల సోకు రోవన్నాల్లె.  నాలుగుదినాలకే అయి మట్టినబడి మసిగుడ్డలు కావలసిందే.  అయి మాసి పొతే, మట్టి తల్లి నా ఒళ్ళంతా నిమిరినాదని సంతోస పడతాడు.  శివుడు శూలం చేతబట్టినట్టుగా ఏడకిబొయినా  కొడవలి నేస్తం గాడిని చేత బెట్టుకుబోతాడు.

“నన్నా, దాన్నా అని పోటీ ఎడితే నన్ను వున్న పళాన ఒదిలేస్తావు గానీ ఈ నా సవితిని మట్టుకూ వొదల్లేవు గాదూ,” అంటది అంకయ్య  కొడవలి గురించి పెళ్ళాం నరసమ్మ.

ఆమాట ఇన్నాడా, రేత్తిరీ పొగులూ చూడక ఏందో పని గురుతొచ్చినట్టుగా మళ్ళా బైదెలుతాడు.

“బండ నా మొగుడు.  ఆడ్నిగట్టుకున్న దానికి నాకు తిప్పలొచ్చిబడ్డాయి.  మేనత్తకొడుకుగాడే అని సుట్టాలు పక్కాలంతా జేరి ఈడిని నాకు అంటగడితిరి.  ఇప్పుడీ మట్టి సాకిరీ ఎవురుజేయాల?  ఓ…యమ్మ!   వున్నా జానా బెత్తెడు బూమికి ముప్ఫై ఎకరాల ఆసామిని మించి పనిజేస్తాడు,” ఈ మాదిరి చానా మాట్లు నసగతా వుంటది.  లోపటి ఇసయం ఏందంటే, నరసమ్మదంతా ఉత్తుత్తి నసుగుడు.  ఆయమ్మకి మొగుడిమీంద ఒల్లమాలిన బెమ.

“చేవ తగ్గలే అంకయ్యో, మా ఇంటో పిల్లుంది, చేసుకుంటావో?” ఈదిన బోతంతే సావాసగాళ్ళు అంటా వుంటారు.  ఇంటికాడికొచ్చి చెబతాడు.  నరసమ్మ కసురుద్ది.

“ఊరుకోయే, ఏదో మాట వొరసకి అంటారుగానీ ఇచ్చేది నిజవా ఏందీ?” ముసిముసిగా నవ్వతాడు.

“ఇస్తే తోలకొచ్చి కాపరం జేయ్యాలనే ఆశపడతన్నట్టుండావే!” గయ్యన లేస్తది.

రెండు కార్లు పండే ఒకటింగాలు పంట.  మొగుడూ పెళ్ళాలు పొద్దుగూకులూ పొలం గట్లంబడి మొదల్తానే వుంటారు.  ఎంత పండితే అంతకాడికి సదురుకుని గుట్టుగా బతకతారు.  ఇద్దరు ఆడ పిల్లోల్లకీ  పక్క ఊర్ల కాడ సంబందాలుజూసి పెల్లిజేసి పంపిచ్చారు.  కొడుకు సూరిబాబు ఆడి పెళ్ళాం పిలకాయల్తో గూడా  పెద్ద వూళ్ళో చిన్న పనిజూసుకు బొయ్యాడు.

అంకడు ఎవురికోసమూ ఏదీ దాపెట్టబల్లేదు.  బిడ్డలు ఎవురి పాట్లు ఆల్లు పడతండారు.  ఇగ అంకయ్య ఏందో, ఆ పొద్దు పనేందో, పెళ్ళాం ఆపూటికి వొండింది తిని పనికి బోయ్యామా, ఇయ్యాల్టికి ముగిచ్చాల్సిన యవ్వారాలు ముగిచ్చామా లేదా అంతే!

అంకయ్యకి మట్టిన పనిజెయ్యడమంటే అమ్మ ఒళ్లో ఆడుకోడమే.  అరక దున్ని నపుడు నేల అమ్మ నుదురిమీంది ముడత .  పంట కాలవలో నీళ్ళు బారితే అది అమ్మ ఈపున జారే సెమట.  సిలక పచ్చటి  ఇత్తనం మొలక అమ్మ కళ్ళలోని నవ్వు.  పచ్చంగా పండిన సేలు పసిపిలకాయల బిజ్జల్ని నింపే అమ్మ రొమ్ము.

పండక్కి ఊర్ల నుండి పిల్లలూ మనవల్లూ, మనవరాల్లూ వస్తా వుంటారు.  ఇల్లంతా సందడి.  సిటీ పిలకాయలు.  ఆళ్ళ మాటలూ, బట్టలూ, సదువూ అన్నీ   అంకయ్యకి  తమాసగా అనిపిస్తాయి.

“తాతా, ఎప్పుడూ లుంగీ పంచే కడతావే?  ఫాంట్, షర్ట్ వేసుకో.  మాతో పాటు వచ్చేసేయ్,” మనవడు తాతని ఫోనులో ఫోటో తీసి, ఫోటోలో అంకయ్యకి ఫాంట్ షర్టు వేసి చూబిచ్చాడు. అంకయ్య నవ్వాడు. అందరూ నవ్వారు.

ఎప్పుట్నించో అంకయ్యకి ఓ అనుమానం.  అడగాల్నంటే సిగ్గు.  మనవొల్లనీ, మనవరాల్లనీ సయిగ్గా ఈ మాటు అడిగేసిండు.

“ఓరె, మీ ఇళ్ళ కాడ మట్టి వుంటాదా”

“మట్టి వుండేదేంది?”

“ఇపుడూ మొక్కలు ఏసేదానికీ, పైర్లు పండిచ్చేదానికీ మట్టి దొరకతాదా లేదా?”

“దొరుకుతాది.  వూరన్నాక మట్టెందుకు దొరకదు?!”

“మనింటి కాడ ఏ మాత్తరం మట్టి ఉండాదో చూబియ్యండిరా”

“ఇల్లిదిగో, నువ్వు ఎన్ని మాట్లు పిలిచినా రావు.  మా అమ్మగ్గూడా నీమాదిరిగానే మట్టి పిచ్చి.  ఎప్పుడు మట్టి అమ్మే వాడొచ్చినా కొంటావుంటది”

“మట్టి కొంటం ఏంటి!” అంకయ్య బుర్ర గోక్కున్నాడు. అప్పుడప్పుడూ టాటర్లతో సెరువు మట్టి తోలిపిస్తారోవో!  మనవడు ఫోనుతీసి ఫోటోలు చూబెట్టాడు.

మనవడి ఫోనులో చానా ఫోటోలున్నాయి. పెద్ద పెద్ద బొవంతులు, ఆడాడ కూచునే దానికి సిమెంటు బెంచీలూ, సినిమా హాల్లూ, అపార్మెంట్లూ.  ఏడ బట్టినా ఇయ్యే.  అరెకరం కాలీ జాగా వుంటే వొట్టు.  ఆటన్నింటి మజ్జెన ఏడో రెండు గదుల శిన్న రేకు ఇంటో కొడుకు సూరిబాబు కాపరం.  ఆ ఇంటి ముందర డజను కుండీల్లో రంగురంగుల శామంతి, గులాబ్మోక్కలు.  రంగులు బాగానే వుండాయి. కానీ మట్టే మరీ రొవంత, బొత్తిగా కంటికి ఆనలా.

“మాయమ్మకి పొద్దుజిక్కిందా, కొత్త కుండీలు బెడతా, వున్నోటిల్లో మట్టి తిరగేస్తా వుంటది,” పిల్లోడు ఇంకా ఏందో చెబతానే వుండాడు. అంకయ్యకి మనసు కుశాలు లేదు. పిల్లల సర్దాజూసి ఆళ్ళని చిన్నబుచ్చ లేక చిన్నంగా నవ్వాడు.
సందేల రచ్చబండకాడికి పోయ్యాడు.   ఆడ పిదపకాలం జిత్తులమారి బోకరు రంగ రాజుగాడు మీటింగెట్టున్నాడు.

“అమరావతి లాంగానే మాన ఊళ్ళో గూడ బూమి తిరగబడి  ఆకాశమై పోద్ది. అంటే ఏందనుకున్నావు? మట్టి మీంద  బండలు పరిసి ఆకాశంలా మెరిపిత్తారు. ఆకాశం బూమికి అందిపోద్ది. అంటే, బిల్డింగులు ఎంత పొడుగంటే, పైకెక్కి చెయ్యి సాపితే మొబ్బులు ఏళ్ళకి తగల్తాయి. పొలాలన్నీ  సిటీలైపోతాయి. ఇహ ఏడ బట్టినా గచ్చే. కాలికి మట్టి తగలాలంటే మైళ్ళు పరిగెత్తి బోవాల!”

రంగరాజు చెప్పిన ముచ్చట గురించి గలబా మొదులైంది. బెమ్మం గారు ఈ సంగతి ఎప్పుడో రాసి పెట్టారని కొందరూ, లేదని కొందరూ ఒగటే రచ్చ.

“ఇంక మనూర్ల గూడా ఆరు లారీలు ఒక్కమాటే పోయేలాగా రోడ్లూ,  పెద్ద పెద్ద బిల్డింగులూ, కొత్త కొత్త బజార్లూ.  ఇది మొదులే. లోకం మారి పోతంది,”  కొందరు కొత్త బిల్డింగుల మధ్య తిరగతా వున్నట్టు ఊహిచ్చేసుకోడం మొదులెట్టారు.  అంకయ్యకి మండుకొచ్చింది. మయాన ఆరు రోడ్ల దారి ఏస్తే ఇంగ ఈ జానా బెత్తెడు వూరు ఏడ మిగిలేది! మొత్తం రోడ్లో కలిసిపోదా? రంగారాజుగాడు  ఏదైనా వాగాడంటే ఎవుడి కొంపో ములిగిపోడం కాయం. లేసి తుండు దులుపుకుంటా ఇంటికి తిరుక్కున్నాడు.

“మావో, ఏం ఎల్లిపోతన్నావ్? మట్టి మీంద బుట్టి గడ్డి కోసే కొడవలితో బొడ్డు కోబిచ్చుకున్నోడు గూడా, కాలం కలిసొస్తే ఆకాశంలో ఎగిరే ఇమానం ఎక్కొచ్చు.  జెప్పింది నిజవా కాదా?!” అంకయ్య ఇనీ ఇన్నట్టుగా నడిసిపోయ్యాడు.

వొరాలిచ్చే దేవుళ్ళు గూడా శనిద్రంగాడి తట్టే. ఆ రోజు రంగారాజుగాడు ఏందో కూసినాడా, పెద్ద మినిస్టర్లు ఆ మాటలన్నీ ఇన్నారా అన్నట్టుగా జరిగింది.  వూరు ఇమానాలు నిలిచే తాలుగా మారబోతందంట. అంకయ్య ఒకటింగాలు బూమి గూడా అందులో కలవబోతన్నాది.  ఆపీసర్లు మీటింగులు జేర్చి ఏందేందో చెబతన్నారు. ఎకరం బోయినా నికరంగా శాన లాబం వచ్చుద్దన్నారు.  సెక్కలో ముక్కలో ఎగసాయం జేసి ఎన్ని తరాలు బోయ్యాయి? దాన్నించీ ఏం లాబం లేదు, రాబోయే దినాల్లో ఊళ్లు మారిపోయ్యాక  పతి పిల్ల నాయాలుకీ చేసినంత పని దొరకతాదన్నారు. ఆ రోజు పొలాలు కొలతలేస్తంటే అంకయ్యకి కాళ్ళూ చేతులాడలా.

“అయ్యా, నానేల నాకు ఇడిసిపెట్టు సారూ. నాకు ఏరే పనేం సేతగాదు.  ఈ మట్టిని ఒదిలి నేను నిలవలేనయ్యా,” అంటా బావురుమన్నడు. నేనిక్కడ్నే పుట్టానని సేప్పేద్దామనుకున్నడు గానీ నోరు పెగలడంలా. పొర్లు పొర్లుగా ఏడుపోస్తా వుండాది.

సారూ జాలిగా సూశాడు. సారు మాత్తరం ఏం జేయ్యగలడు? పిల్లోడికి ఇంజీషను ఇప్పిచ్చే ముందు అమ్మ సూది నీక్కాదు నాకనీ,  పొడిసినా నేప్పే పుట్టదనీ అబద్దాలు చెప్పి పిల్లోన్ని మరిపిచ్చాలని చూసుద్ది. సారు గూడా అట్ట చెప్పుకొచ్చాడు.

“పొలం రేటుకి తగ్గట్టు నీకు పరిహారం వస్తది. మీకు పించను కూడా వచ్చేలాగా నే చూస్తాను. నీకూ, నీ రాబోయే ముందు ముందు తరాలకి మేలు జరగాలి కాదా. నువ్వలా మనసు కష్టపెట్టుకో కూడదు,” సారు ఓదార్చను నాలుగు ముక్కలు చెప్పాడు.

పేణం ఉండిచ్చమంటే పించను ఇంస్తానంటాడు. ముందు తరాల్ల ఎవురుకి మేలు జరుగుద్దో ఎవురు మట్టిని గొట్టుకు పోతారో ఎవురు జూసారు?  మళ్ళన్నీ ఊళ్లై పోతే మట్టిని కరుసుకుని మసిలే బతుకులు బీళ్లవ్వాలిసిందే. మట్టి రేటు పెరిగితే ఏమోస్తది? దాని ఇలువ మసానమయినాక. అన్నం పండే బూమిలో బొవంతులు లేపేస్తే రేపు మెతుకులు ఏడ్నించి పుట్టిస్తారు? అంకయ్య ఏడుసుకుంటా సాపనార్దాలు పెట్టుకుంటా ఇంటికిబోయ్యాడు.

“ఇంటి మొగోడు అట్ట ఏడవగూడదు,” పెళ్ళాం తన దిగులు దాసుకుని పెనిమిటిని ఓదార్చను చూసింది.

ఆ మాట ఇన్నంకను గూడా ఆ ఇంటి మొగోడు ఏడస్తానే వుండాడు!

నరసమ్మకి దిక్కు తెలీలా.  కొడుకుతో ఫోను మీంద మాట్టాడింది. అంకయ్యని ఇడవకుండా అంటిపెట్టుకునే ఉండింది.

ఏడిసీ ఏడిసీ అంకయ్యకి ఏ పొద్దో కన్ను మూత పడింది.  అట కన్ను మూసిన కుసేపటికి సప్పుడైనట్టుగా అనిపిచ్చింది.  అయోమయం. ఏడో కొండకాడున్నాడు.  అడుగు ముందూకేసాడు.  కాలికింద గట్టింగా ఏందో తగిలింది. వొంగి తీశాడు. కొడవలి.

“ఊర్లో మంచం మీంద పండుకున్న తను ఈడికెట్టచ్చాడు?  సూర్లో ఉండాల్సిన కొడవలి నేలకెట్టా వొచ్చింది?” ఇడ్డూర పడ్డాడు. నిదర రేత్తిరికాడ ఒక్కోతాలు పిసాశాలు ఎత్తక పోతాయని ఇనున్నాడు.  నిజంగా అట్ట జరిగిందా అని అనుమానం బుట్టింది.

కొండపైని సిన్న గుడిసె. ఎదురుగ్గా ఏపచెట్టు.  చెట్టుకు లాందర్లు కట్టున్నాయి. చెట్టు కింద నులక మంచం.  దానిమీంద శాట్లో ఇత్తనాలు.

ఒక ఆడ, మొగ జంట రాతి నేలని తవ్వి పెళ్ళల్ని చితగ్గొడతుండారు.

“ఎవురదీ?” అంకయ్య దయిర్నంగా దబాయిచ్చాడు.

“పనీ పాటు గాల్లం”

“ఈ గుట్టమీంద నడిజామునేం పాటుజేస్తా?!”

“అయ్యి వొచ్చేలోగా, నేల మూసుకు పోయ్యేలోగా ఏదో ఒకటి చెయ్యాల. కొండలు తొవ్వేస్తాయి. నేలని మూసేస్తాయి.  అంతదాకా వొస్తే ఆకాసంలో విత్తులు వేస్తాం. పని మట్టుకూ ఆపేది లేదు. అయి ఆకాశాన్ని కూడా తవ్వి డొల్ల చేసినాక,” ఇగ మాట తోచక వొగరిచ్చాడు.

పెద్ద రొద ఇనపడింది. దూళి కమ్ముకొచ్చింది.

“వస్తన్నయ్,” కేకలు పెడతా కొండ మనిషి గొడ్డలి తీశాడు. ఎట్నుంచి వొచ్చాయో తెల్లటి సూదుల్లాంటి కొమ్ములున్న అడివి పందులు గుంపుగా పడ్డాయి.

కొండ మనిషీ, పక్కనున్న ఆడదీ ఆటితో కలబడ్డారు. అంకయ్య బిత్తర పొయ్యాడు. ఒక్కసారి దడ దడగా అనిపిచ్చింది.  శేతిలో వున్న కొడవలితో తనుగూడా ఆటి మీంద పడ్డాడు. బీబత్సం. గుంపు దాటికి అంకయ్య కొండ అంచుకు దొర్లాడు.  ఇంతట్లో అదాట్న దుడ్డు కర్రతో ఎవురో కాల్లెమ్మట కొట్టారు. పట్టు తప్పి పొయ్యింది. నేలని పడబోతూ కొట్టిందెవురా అని చూస్తే రంగరాజులా అగుపిచ్చాడు. అంతే. ఆ బ్రెమ తరవాత అంకయ్య మడుసుల్లో పడనేలా.

ఎట్నో కొన్నాళ్ళు మంచాన గడిసినంక అంకయ్య సచ్చి పొయ్యాడు. అదురుష్టం, పొలం ఇంకా గవర్మెంటులో కలవక ముందరే పొయ్యాడు.  ఆ పొలం లోనే అంకయ్యని పూడిసి పెట్టారు. అంకయ్యని పాతిన దిబ్బలో అతనికిష్టమయిన కొడవలిని గూడా పీనుగుతో పాటు పారేశారు. మట్టిన బుట్టిన మడిసి మళ్ళా మట్టిలోకే! మనిషి తయారు చేసుకున్న కొడవలి గూడా మట్టికే.

మడిసి కుళ్ళి మట్టిలో కలవను ఎక్కువ రోజులుపట్టిందా, లేపోతే ఇనప కొడవలి తుప్పెక్కి నేలను కలవను ఎక్కువ కాలం పట్టిందా? వూళ్ళో ఓ తింగరి నాయాలకి ఇట్టాటి అనుమానం ఒచ్చి అద్దరాత్తిరి దిబ్బని తొవ్వాడు. లోపల ఏం జూశాడో ఏమో, ఆ పొద్దు నుంచీ పిచ్చి పట్టి పొయ్యాడు!