రచన: అనిల్ ఎస్. రాయల్
మీ కథకి సంబంధించి ఎడిటర్ దృష్టిలో పడే మొట్టమొదటి విషయం: దాని పేరు. సదా బిజీగా ఉండే ఎడిటర్లు కొందరు కేవలం కథ పేరు చూసి పక్కన పడేయటమా, లేక తమ సమయం వెచ్చించి చదవటమా అనేది తేల్చుకుంటారు. ఆకర్షణీయమైన శీర్షిక అందమైన అమ్మాయిలాంటిది. అది చటుక్కున అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. అందువల్ల కథకి టైటిల్ చాలా ముఖ్యం. అది వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది – ముఖ్యంగా ఔత్సాహిక రచయితల విషయంలో. అప్పుడే అది ఇతర కథల పోటీని తట్టుకుని ఎడిటర్ దృష్టిలో పడగలుగుతుంది. బ్రహ్మాండమైన పేరు పెట్టినంతమాత్రాన అదో అద్భుతమైన కథై పోదు; కానీ ‘పేరే సరిగా పెట్టలేని కథకుడు ఇక గొప్ప కథేం చెబుతాడు’ అని ఎడిటర్ అనుకుంటే మాత్రం మీ కథ పోయేది కంచికే – అచ్చుకి కాదు.
అయితే, శీర్షిక పని కేవలం ఎడిటర్‌ని ఆకట్టుకోవటం కాదు. కొన్నిసార్లు పేరెలా ఉన్నా (ఆ మాటకొస్తే కథెలా ఉన్నా కూడా) మీ కథ అచ్చుకి నోచుకోవచ్చు. ‘సందులో సుందరి శవం’ లాంటి పేర్లు బి-గ్రేడ్ సినిమాలని తలపిస్తూ మీపైనా, మీ కథలపైనా చౌకబారు అభిప్రాయాన్ని కలగజేస్తాయి. ఒకసారి పాఠకులు మిమ్మల్ని ఉపేక్షించటం మొదలుపెడితే, ఆ తర్వాత మీరెన్ని కథలు రాసినా ఉపయోగముండదు. కథకి మీరు ఎంచుకునే పేరులో మీ సృజనాత్మకత, అంతకు మించి మీ అభిరుచి ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఆ పేరు విలక్షణంగానే కాదు, సలక్షణంగానూ ఉండటం మంచిది. శీర్షిక మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టటం ద్వారా మీరు మీకే ఉపకారం చేసుకుంటున్నారన్న సంగతి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది. అయితే, విభిన్నంగా అనిపిస్తుందని కథకి ఏ మాత్రమూ సంబంధంలేని పేరు ఎంచుకోకూడదు. శీర్షికలో నిజాయితీ ఉండాలి. ఎడిటర్‌నో లేక పాఠకులనో ఆకట్టుకోవాలని పొంతనలేని పేరు పెట్టకూడదు. క్యాచీ టైటిల్ అనుకుంటూ ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకి పెట్టినట్లు కథకి అతకని పేరు పెడితే పాఠకుల్ని మోసగించటమే అవుతుంది. అర్ధం లేని పేర్లతో ఆకట్టుకోబూనే రచయితలు పాఠకుల నమ్మకాన్ని కోల్పోతారు. అదే సమయంలో, ఎంత సందర్భోచితంగా ఉన్నా, కొన్ని రకాల పేర్లు కథా ప్రక్రియకి పనికిరావని తెలుసుకోవాలి. న్యూక్లియర్ ఫిజిక్స్ నేపధ్యంలో సైన్స్ ఫిక్షన్ కథ రాసి దానికి ‘అణు విచ్ఛిత్తి’ అనే పేరు పెడితే అదేదో పరిశోధనా పత్రంలా ధ్వనిస్తుంది. ‘అప్పు చేసినవాడికి తిప్పలు తప్పవు’ వంటి ప్రవచనాలు కూడా కథలకి పేర్లుగా నప్పవు.
కథాంశాన్ని శీర్షిక ద్వారా తెలియజేయాలనే వాదనొకటుంది. అందులో తప్పులేదు కానీ, అదంత ముఖ్యం కాదని నా అభిప్రాయం. శీర్షిక పని పాఠకుల్లో ఆసక్తి రేపెట్టి వాళ్లని కథ ఎత్తుగడ దాకా లాక్కు రావటం. అంతే. పేరు చదవగానే కథంతా అర్ధమైపోయేలా ఉంటే మొదటికే మోసం వస్తుంది. శీర్షిక ఎప్పుడూ కథపై ఆసక్తి రేకెత్తించేదిగా ఉండాలి; ఆసక్తి పోగొట్టేదిగా కాదు. ‘గయ్యాళి అత్త’ పేరు చూడగానే ఆ కథ ఎలా ఉండబోతోందో అర్ధమైపోతుంది. ఇలాంటి అంశాలతో చాలా కథలు ఇప్పటికే వచ్చి ఉండటం మూలాన, ఇది కూడా వాటిలానే ఉండబోతోందన్న అంచనా పాఠకుల్లో ఏర్పడొచ్చు. నిజానికి ‘గయ్యాళి అత్త’ కథలో రచయిత ఇంతవరకూ ఎవరూ స్పృశించని విషయాన్ని అద్భుతంగా చెప్పి ఉండొచ్చు. కానీ ఏం లాభం? ఆ పేరు కలిగించిన ప్రభావం చాలామంది పాఠకులు పేజీ తిప్పేసేలా చేసే ప్రమాదముంది. కథలో ఉన్న ప్రత్యేకత దాని పేరులోనూ కొట్టిపడాలి, కానీ ఆ కథలో ఏముందో పూర్తిగా విప్పి చెప్పేయకూడదు. నాన్-ఫిక్షన్ తరహా పుస్తకాలకి, వ్యాసాలకి పేర్లు పెట్టేటప్పుడు తప్పనిసరైతే కావచ్చు కానీ, కాల్పనిక సాహిత్యానికి సంబంధించినంతవరకూ శీర్షిక తప్పనిసరిగా కథాంశాన్ని వివరించనవసరం లేదు.
అయితే కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే సరైన పని కావచ్చు. మన కథ పాఠకుల్లో ఓ ప్రత్యేక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినప్పుడు, పేరులోనే కథ అర్ధమైపోవటం వల్ల లాభమే తప్ప నష్టం లేదన్న నమ్మకం ఉన్నప్పుడూ ఆ విధంగా పేరు పెట్టేయొచ్చు. చిన్న పిల్లలకోసం ప్రత్యేకించి రాసే కథలు ఈ కోవకి చెందుతాయి. అలాగే హాస్య కథలు కూడా. అటువంటివి తీసేస్తే, మిగతా కథలకి పెట్టే పేర్లు కథాంశాన్ని ముందస్తుగా వివరించకుండా ఉంటేనే మంచిది. అలాగని పేరుతో కథకి అసలు సంబంధమే లేకుండా పోకూడదు. కథ చదివాక ఆ పేరు ఔచిత్యం పాఠకులకి అవగతం కావాలి. శీర్షిక చూడగానే అర్ధమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన కథల్లో ‘తరళ మేఘచ్చాయ, తర్వాతి ఎడారి’ (వై. విశారద) అనే పేరు చాలామందిని ఆకట్టుకుంది. ఆ కథ దేని గురించి అయుంటుందో పేరు సూచించకపోయినా, సగం మంది పాఠకులకి ఆ శీర్షికలో సగమే అర్ధమైనా, అందులో ఉన్న అందమైన రిథం కథపై ఆసక్తి కలగజేస్తుంది. ‘పగడ మల్లెలు’ (యాజి) పేరు కూడా అంతే. ఆ పేరులో ఉన్న సొగసు, ఆహ్లాదం కలిసి మనల్ని కథలోకి లాక్కుపోతాయి. ‘చంద్రుడు గీసిన బొమ్మలు’ (భగవంతం) పేరు వినగానే అవేంటో, ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించటం లేదూ? ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’ (పి. అశోక్ కుమార్) అనే పేరు కథాంశాన్ని గోప్యంగా ఉంచుతూనే చదవాలనే కుతూహలం కలగజేస్తుంది. ఇవన్నీ వేటికవే విభిన్నమైన పేర్లు. నూతనత్వం పరిమళిస్తున్న పేర్లు. తేలికగా గుర్తుంచుకోగలిగే పేర్లు. అన్నిటికీ మించి, కథ చదవాలన్న ఆసక్తి కలగజేసే పేర్లు. ఈ కథలన్నీపేరుతోనే సగం ఆట గెలిచాయి. మిగతా సగమూ గెలిచేదీ లేనిదీ కథలో ఉన్న సరుకుని బట్టి ఉంటుంది, అది వేరే కథ.
నా వరకూ నేను, నా కథల పేర్లు మరీ వివరణాత్మకంగా ఉండకుండా జాగ్రత్తపడతాను. అదే సమయంలో నేను ఎంచుకునే శీర్షిక కథలో పలికించిన రసాన్ని, ఆ కథ నడిచే mood ని ప్రతిఫలించేలా జాగ్రత్త పడతాను. హాస్య కథకి ధీర గంభీరమైన పేర్లు, కరుణ రసాన్నొలికించే కథకి ‘వస్తే చస్తావ్’ లాంటి భీభత్సమైన పేర్లు అతకవు.
కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలామంది ఔత్సాహిక రచయిత/త్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే శీర్షికగా ఎంచుకోవటం. ‘రాధిక’, ‘సుబ్రహ్మణ్యం’, ‘కవిత’. ఈ పేర్లు చదివితే మీకు ఆ కథల పైన ఎంత మాత్రం ఆసక్తి కలిగింది? ప్రధాన పాత్ర పేరుని కథకి శీర్షికగా ఉంచకూడదనేం లేదు, కానీ అదెంత ఆసక్తికరంగా అనిపిస్తుందో ముందుగా అంచనా వేయాలి. ప్రధాన పాత్ర పేరునే కథకి పెట్టి తీరాల్సిన సందర్భమొస్తే (ఉదాహరణకి మీ కథ character sketch అయితే), కనీసం ఆ పాత్ర పేరు మరీ సాధారణంగా ఉండకుండా జాగ్రత్తపడటం అవసరం. నా రెండవ కథకి అందులో ప్రధాన పాత్ర పేరు ‘కల్కి’నే శీర్షికగా వాడాను. ‘కల్కి’ అనే పేరుకి మన సమాజంలో ఉన్న విశిష్టత, ఆ పురాణ పాత్రకున్న ఆకర్షణ, దాని వెనకున్న నిగూఢత, ఇవన్నీ కలిసి ఆ పేరంటే పాఠకుల్లో కలగజేసే ఆసక్తి అంచనా వేశాకే కథకి ఆ పేరు పెట్టాను.
చప్పగా, సర్వసాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసేసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం. కథకి బాగా నప్పిందని ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ వంటి అరిగిపోయిన సామెత పేరుగా ఎంచుకున్నారనుకోండి. ఆ పేరు చూడగానే ఎడిటర్ గారు అదేదో పాత చింతకాయ పచ్చడి కథ అనుకుని అవతల పారేస్తే అది ఆయన తప్పు కాదు. అలాగే, ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంతవరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు. మీ కథకి బాగా నప్పుతుందని ‘గాలివాన’ అన్న పేరు పెడితే, వెంటనే పాలగుమ్మి పద్మరాజు గారి కథ గుర్తుకు రావటం, దానితో మీ కథని పోల్చిచూడటం జరిగిపోతాయి. అయితే, తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప కథలన్నీ గుర్తుంచుకుని ఆ పేర్లన్నిట్నీ బ్లాక్‌లిస్ట్ చెయ్యటం అయ్యేపని కాదనుకోండి. వీలైనంతవరకూ ప్రసిద్ధి చెందిన కథల పేర్లని వాడుకోకుండా ఉండమని చెప్పటమే ఇక్కడ ముఖ్యోద్దేశం. తద్వారా ఆ పాత కథని గౌరవించినట్లూ ఉంటుంది, మన కథ ప్రత్యేకత మనం నిలుపుకున్నట్లూ ఉంటుంది. అన్నిట్నీ మించి, మన కథకీ అదే పేరుతో ఉన్న మరో ప్రముఖ కథకీ మధ్య పాఠకులు గందరగోళపడకుండా నివారించినట్లూ ఉంటుంది.
కథ పేరు ఎంత పెద్దగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం. వ్యక్తిగతంగా, నేను మరీ పొడుగాటి పేర్లు పెట్టటానికి వ్యతిరేకం. నా కథల్లో వేటికీ రెండు పదాలకి మించిన పేరు పెట్టలేదు. వాటిలో అన్నింటికన్నా పెద్ద పేరు ఏడు అక్షరాల పొడుగే ఉంది. కథ పేరు ఇంత పొడుగే ఉండాలి అనే నియమాలేమీ లేకపోయినా, అది మరీ పొడుగ్గా ఉండకపోవటం, గుర్తు పెట్టుకోటానికి వీలుగా ఉండటం ముఖ్యం. మీరో గొప్ప కథ రాశారు కానీ దాని పేరు నోరు తిరక్కో, గుర్తుండకో, అర్ధం కాకో ఆ కథ చదివిన వాళ్లు మరో నలుగురికి చెప్పలేకపోయారనుకోండి. దాని వల్ల ఏం లాభం? ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ పాటిస్తే లాభమే తప్ప నష్టం లేదు.
కథ రాశాక పేరు పెట్టాలా, లేక ముందుగా పేరు అనుకుని తర్వాత కథ రాయాలా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎలాగైనా చేయొచ్చు. ఆ పేరు ఆకట్టుకునేలా ఉండటం ముఖ్యం. ముందుగా పేరు అనుకుని తర్వాత కథ రాయటం అంటే రెడీమేడ్ ట్యూన్‌కి సాహిత్యం పొదగటం లాంటిది. ఈ పద్ధతిలోనూ మంచి కథలు రాయొచ్చు కానీ ఇక్కడ కథకుడికుండే స్వేచ్ఛ తక్కువ. ఆ పేరుకి తగ్గట్లు కథని మలచుకోవలసి ఉంటుంది. నేను సాధారణంగా కథ రాసేటప్పుడు ఒక వర్కింగ్ టైటిల్ పెట్టుకుంటాను. కథ పూర్తయ్యేసరికి అది మారిపోయే అవకాశాలే ఎక్కువ. మరమనిషి ప్రధాన పాత్రలో ఆ మధ్య నేను రాసిన కథకి పెట్టుకున్న వర్కింగ్ టైటిల్ ‘విశ్వవిధాత’. కథ పూర్తయ్యాక దానికన్నా ‘రీబూట్’ అనే పేరు ఎక్కువ ప్రభావశీలంగా, ప్రత్యేకంగా ఉంటుందనిపించటంతో శీర్షిక మార్చేశాను. అలాగే, నా తొలికథకి తొలుత అనుకున్న ‘నాగరికత’ అనే పేరులో ప్రత్యేకతేమీ ధ్వనించకపోవటం వల్ల, ఆఖరి నిమిషంలో ‘నాగరికథ’గా నామకరణం చేసి పంపాను. పరిచయ పత్రాలు, సిఫారసు లేఖలూ తోడు లేకుండా ఊరూ పేరూ లేని ఓ కొత్త రచయిత నుండి ఇ-మెయిల్లో ఊడిపడ్డ ఆ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం సంపాదకవర్గాన్ని ఆకర్షించటానికి దాని పేరే కారణమన్నది నాకు తర్వాత తెలిసిన విషయం.
ఒక్కసారి మీకు నచ్చిన కథలు కొన్ని గుర్తు చేసుకోండి. ఆ కథలకున్న విశిష్టత వాటి పేర్లలోనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుందో లేదో గమనించండి. శీర్షిక ప్రాముఖ్యత అర్ధం చేసుకోటానికి అది చాలు. వర్ధమాన రచయితలు కథ రాయటంలోనే కాక, దానికి పేరు పెట్టటంలో కూడా తమదైన శైలి రూపొందించుకోవటం మంచిది. శీర్షికలో ఓ రకమైన అర్ధాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్ధం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను. అది నా శైలి. మన శైలి ఏదన్నది ముఖ్యం కాదు. అసలంటూ ఒకటుండటం అభిలషణీయం.
ఆఖరుగా, ఒక మాట. శీర్షికలు సంతకాల్లాంటివి. కాలక్రమంలో ఆ పేర్లతోనే మనం గుర్తించబడతాం. కాబట్టి అవి విభిన్నంగా, వినూత్నంగానే కాదు; సముచితంగా, సంస్కారయుతంగా కూడా ఉండాలి.
కథారచనలో శీర్షిక, ఎత్తుగడల తర్వాత అత్యంత ముఖ్యమైన మూడో విషయం గురించి తరువాతి భాగంలో ముచ్చటించుకుందాం.
స్పందించండి