రచన: సాయి బ్రహ్మానందం గొర్తి


 

రవీ కెరీదా,

ఎలా వున్నారు? మా స్పానిష్ భాషలో కెరీదా అంటే ‘ప్రియమైన’ అని. నాకు అమెరికాలో వున్న అతి కొద్దిమంది పరిచయస్తుల్లో “ప్రియమైన” అని సంబోధించడానికి ఆలోచించనక్కర్లేని వ్యక్తి మీరు. అమెరికాలో నేనంటూ గౌరవించే వ్యక్తుల్లో మీరు మొదటుంటారు.

అతి తక్కువ కాలంలో మీ కుటుంబంతో ఏర్పడిన అనుబంధం తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరవరో? నేనెవరో? కానీ ఇప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరూ నాగురించి ఆలోచించే ఉంటారు. చెప్పాపెట్ట కుండా ఎలా అదృశ్యమయిపోయానాని మీ కుటుంబం తప్పకుండా అనుకునే ఉంటారు. ఇంకా రాత్రి పది దాటినా ఆఫీసు పని చేస్తున్నారా? ఉద్యోగమూ, ఎదుగుదలా కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టద్దు. ఇంతకీ మీకు “పచ్చ కాగితం”, అదే లెండి గ్రీన్ కార్డ్ వచ్చిందా?

అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కుకున్న నాకు గత రెండ్రోజులుగా మీరే గుర్తుకొస్తున్నారు. మీరు చేసిన సాయం మర్చిపోలేదని చెప్పడానికీ, చేసిన పొరపాట్లు చెప్పీ మిమ్మల్ని క్షమాపణలడగడానికే ఇది రాస్తున్నాను.

మొదటిసారి పరిచయంలో నేను ఏం చదువుకోలేదని చెప్పాను. నేనూ సైన్స్ డిగ్రీ పాసయ్యాను. ఇంగ్లీషు రాయడమూ, చదవడమూ వచ్చు. అన్నీ వచ్చి మీ ఆఫీసులో బాత్రూములు శుభ్ర పరిచే ఉద్యోగం ఎందుకు చేసానాని మీకు అనుమానం కలగచ్చు.  నాగురించి రాయాలా వద్దాని నాలో నేనే తర్జన భర్జన పడ్డాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో ఉన్నది బయటకి కక్కాలి – బాధయినా,సంతోషమైనా. ఇంటినీ, దేహాన్నీ, మనసునీ  రోజూ శుభ్రపర్చుకోవాలని మా స్కూల్ టీచర్ చెప్పేవారు. మొదటి రెంటికీ కాస్తో, కూస్తో ప్రాధాన్యత ఇచ్చినా, మనసు దగ్గరకొచ్చే సరికి ఎందుకో విపరీతమైన బద్ధకం. నిర్లక్ష్యం కూడా.

అప్పుడప్పుడు లిలియా దగ్గర మనసులో ఉన్నదంతా చెప్పడానికి  ప్రయత్నించే వాణ్ణి. మధ్యలో లిలియా వేసే ప్రశ్నలకి చికాకొచ్చి దారి మళ్ళేది. లిలియా అంటే నా ప్రేయసి. ఎంతో అమాయకంగా కళ్ళు తిప్పుతూ కనిపించే ఆ స్వచ్ఛమైన రూపం అంటే నాకు చాలా ఇష్టం. లిలియా నా కంటే అయిదేళ్ళు చిన్నది. మొదటి సారి టెకోలుట్లా స్కూలు దగ్గర మా చెల్లి కోసం వెళ్ళినప్పుడు చూసాను. అలా ఆమెని చూడ్డం కోసం వారాల తరబడి వెళ్ళేవాణ్ణి. చివరకి ఓ రోజు మా చెల్లికి దొరికి పోయాను. ఇంట్లో చెప్పద్దని అయిదు పెసోలు లంచం ఇచ్చాను. తరువాత తెల్సింది లిలియా మా చెల్లెలి సహ విద్యార్థని. అలా మొదలయిన మా పరిచయం నేను డిగ్రీ పూర్తి చేసేవరకూ సాగింది.

మా వూరు టెకోలుట్లా, మెక్సికోకి పశ్చిమానున్న పోజారికా పట్టణానికి 45 మైళ్ళ దూరంలోవున్న చిన్న పల్లెటూరు. మా నాన్న సముద్రంలో చేపలు పట్టేవాడు. దగ్గర్లో ఉన్న ఒక రెస్టారెంట్‌కి అవి అమ్మేవాడు. మా అమ్మా ఆ రెస్టారెంట్లో వంటపని చేసేది. మా అమ్మ ‘ ఫెలెతె ది పెస్కాదో రెలానో ది మరిస్కోస్ ‘ అనే చేపల కూర మిరపకాయలూ, వెల్లుల్లీ దట్టించి అద్భుతంగా వండేది. అది తినడానికే ఎంతో మంది ఆ రెస్టారెంటుకి వచ్చే వారు. నిజం చెప్పద్దూ ఏడాది పొడుగునా ఆ కూరక్కొటే తినమన్నా దర్జాగా బ్రతికేస్తాను.

తనలా నేనూ కష్టపడకూడదని మా నాన్న నన్ను శాన్ పాబ్లోలో కాలేజీలో చదివించాడు. లిలియాతో పరిచయం పెరిగినప్పట్నుండీ నా చదువు మందగించింది. లిలియా అమ్మా, నాన్నా కూడా మావాళ్ళల్లాగే చిన్న చిన్న పనులు చేసుకునే బ్రతుకు లాగిస్తారు. లిలియా మంచి పిల్ల. చాలా కలివిడిగా మాట్లాడుతుంది. చాలా సాయంకాలాలు మేం సముద్రం ఒడ్డున చాలా సార్లు గడిపాం. ఆమెతో కబుర్లలో పడితే కాలం తెలిసేది కాదు.  చదువు పూర్తయ్యాక మా నాన్న నన్ను మెక్సికో సిటీలో తెలుసున్న బంధువు ఒకాయన ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్ళమన్నాడు. టెకోలుట్లా విడిచి వెళ్ళడం అస్సలిష్టం లేదు నాకు. ముఖ్యంగా లిలియా గురించి. పోజారికా లో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానని మా నాన్నకి వెళ్ళనని చెప్పాను. ఈ విషయం లిలియాతో చెబితే నన్ను తిట్టింది. మెక్సికో సిటీ వెళితే అక్కడనుండి అమెరికా వెళ్ళడానికి అవకాశాలొస్తాయని చెప్పింది.

ఎప్పటికయినా అమెరికా వెళ్ళాలన్నదే తన ధ్యేయమనీ లిలియా చెప్పింది. లిలియాకే కాదు మా వూళ్ళో, ఆ మాటకొస్తే మా దేశంలో అందరికీ అమెరికా వెళ్ళడమే గొప్ప జీవిత లక్ష్యం. మా దేశంలో నిరుద్యోగ సమస్యుంది. దాని నీడలోనే అవినీతీ పెరిగి పెద్దదయ్యింది. ప్రకృతినే నమ్ముకున్న మాలాంటి కుటుంబాలకి బ్రతకడం కష్టమే!  సంపాదన తక్కువయిన ప్రజలు అంతగా ఖర్చుపెట్టరు. వారిమీదే బ్రతికే మాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది.  మా దేశంలో లిలియాలా ఆలోచించే వాళ్ళే అధికశాతం వున్నారు.

లిలియా మాట కాదనలేక మెక్సికో సిటీ వెళ్ళాను. తెలుసున్న బంధువుల ద్వారా అమెరికా వెళ్ళలని నెల రోజులు తిరక్కుండా లిలియా మెక్సికో సిటీ వచ్చింది. అప్పుడొక ట్రావెల్ ఏజంటు పరిచయమయ్యాడు. మా దేశంలో వీళ్ళని కయోటీ అంటారు. మనుషుల్ని పక్క దేశాలకు రవాణా చేసేవాళ్ళని కయోటీ అని మెక్సికోలో అనడం కద్దు. ఆ కయోటీ మొత్తం రెండు వేల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుందని చెప్పాడు. అంత డబ్బు నా దగ్గరలేదు. అయిదేళ్ళు పని చేసినా అంత డబ్బు వెనకేయలేను. లిలియా పోరు భరించలేక టెకోలుట్లా వెళ్ళి నాన్నకి విషయం చెప్పాను. నాన్న సరేనని చెల్లెలి పెళ్ళికోసం దాచుకున్న డబ్బు ఇద్దామనుకున్నాడు. అమ్మ వద్దంది. ఓ రెండ్రోజులు మా ఇంట్లో యుద్ధం జరిగింది. చివరకి నాన్నే గెలిచాడు. అమెరికా వెళ్ళగానే మొట్ట మొదట ఆ రెండువేలూ సంపాదించి అమ్మకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. బయల్దేరుతూండగా అమ్మ రంగుల పూసల దండ నా మెళ్ళో కట్టింది. ఏమిటో అనుకున్నాను కానీ, అందర్నీ విడిచి వెళ్ళడం అంత సులభం కాదని ఆ క్షణం అర్థమయ్యింది.  అమ్మకి నేను వెళ్ళడం ఇష్టంలేదని గ్రహించాను. మొదట డబ్బుకోసం అనుకున్నాను. కానీ అది కాదన్న సంగతి తరువాత తెల్సింది. ఈ ప్రపంచంలో అమ్మలందరూ అంతే!   ఏదీ పైకి చెప్పరు.ముఖ్యంగా పిల్లలపైన ప్రేమని.

ఊరినుండి తెచ్చిన సొమ్మంతా కయోటీ చేతిలో పోసాను. అమెరికా వెళ్ళాలంటే పాస్పోర్టూ అవీ కావాలి కదాని కయోటీని అడిగితే నన్ను చూసి నవ్వాడు. ఆ తరువాత తెల్సింది మా దేశం నుండి లీగల్గా ఎవరూ అమెరికా వెళ్ళరని; చదువుకున్న వాళ్ళతో సహా! మొదట నాకెందుకో భయం వేసింది. ఇప్పటికి వందమందిని పైగా అమెరికా పంపానని లిస్టు చూపించాడు. పైగా లిలియా పోరుండనే ఉంది. మెక్సికో సిటీ నుండి అమెరికా బోర్డరు దగ్గరున్న శాండీయేగో నుండి అమెరికాకి పంపడానికి ఏర్పాట్ల నిమిత్తమై కయోటీ మా వేషభాషల్ని మార్చాడు. లిలియాకి అమెరికన్లలాగ జుట్టుకి రంగేయించాడు. మేం గుర్తుపెట్టుకోవల్సిన పేర్ల లిస్టొకటిచ్చి బట్టీ పట్టమన్నాడు. ఎవరేం ప్రశ్నించినా తడబడకుండా సమాధానం చెప్పమనీ, ఎక్కడా మొహంలో భయం కనిపించనీయద్దనీ చెప్పాడు. అలా మేమూ, కయోటీ అమెరికా బోర్డరు దగ్గరున్న టుహ్వానాకి విమానం ఎక్కి బయల్దేరాం. టుహ్వానా శాండియేగో సరిహద్దున వుంది. చాలామంది మెక్సికన్లు ఈ శాండీయేగో నుండే ఇల్లీగల్గా అమెరికాలో ప్రవేశిస్తారు.

అమెరికా చేరాక ఎవర్ని కలవాలీ, ఏం చెయ్యాలీ అన్న వివరాలూ తీసుకొని కారులో నేనూ, లిలియా బయల్దేరాం. మాకు ఒక రెసిడెన్సీ కార్డొకటిచ్చాడు. అస్పష్టంగా దానిపైనున్న మా రూపాలు చూడగానే అది దొంగ కార్డని అర్థమయ్యింది. నాకెందుకో భయం వేసింది. ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ బోర్డరు సమీపించాం. అక్కడొక అమెరికన్ అధికారి లిలియాని ప్రశ్నిస్తే, శాండీయేగోలో ఉన్న బంధువుల్ని చూసి వారం రోజుల్లో వచ్చేస్తానని చెప్పింది. కారు దింపి మమ్మల్ని ఫింగర్ ప్రింటు మెషీన్ దగ్గరకి తీసుకెళ్ళి వేలిముద్రలు తణిఖీ చేసాడు. సరిపోలేదంటూ ఆ మెషీన్ పై నున్న ఎర్ర లైటు వెలిగితే, నాకు కాళ్ళాడలేదు. లిలియా మాత్రం ధైర్యంగానే వుంది. ఆ అధికారి మంచివాడులా వున్నాడు. మళ్ళీ ఇంకో సారొస్తే జైల్లో వేస్తానని హెచ్చరించి మెక్సికోకి వెనక్కి పంపేసాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఇంటి ముఖం పట్టాం. ఈ వ్యవహారం బెడిసి కొట్టడంతో లిలియా కయోటీపై యుద్ధం చేసింది. మమ్మల్ని ఎలాగయినా అమెరికా పంపేలా చేస్తానని ఒప్పించి, కాస్త ఓపిక పట్టమన్నాడు. బోర్డరు దగ్గర అధికారిని చూసి మొదట భయం కలిగినా, మమ్మల్ని వెనక్కి పంపించేసరికి పౌరుషం వచ్చింది. ఓడిపోయే కొద్దీ గెలవాలన్న వ్యసనపరుడిలా పట్టుదల పెరిగింది. ఆ విధంగా మా మొదటి ప్రయత్నం బెడిసి కొట్టింది.

శాండీయేగో అయితే దొరికిపోతామేమోనని ఈసారి కయోటీ అరిజోనా ఎడారి నుండి పంపుతానని చెప్పాడు. ఎడారంటే నాకు నచ్చలేదు. పైగా ఎంతో మంది ఆ ఎడారి సరిహద్దులు దాటుతూ, అక్కడ వేడి తట్టుకోలేక మరణించారని విన్నాను. వెళ్ళడానికి నాకు భయం వేసింది. అస్సలు మనస్కరించలేదు. మేం అరిజోనా ఎడారి సమీపంలో ఉన్న నొగాలె అనే ప్రాంతం నుండి అమెరికా సరిహద్దు దాటడానికి ఏర్పాట్లు చెయ్యడం మొదలు పెట్టాడు. నొగాలెలో ఉన్న మరొక కయోటీని కలవమని చెప్పాడు. అతన్నక్కడందరూ పొలెరో అని వ్యవహరిస్తున్నారు. ఎడారి వాతావరణం ఎలా వుంటుందీ?, అధికారుల్నుండి ఎలా తప్పించుకోవాలీ?, ఎలా సమాధానాలు చెప్పాలీ? – అన్న విషయాలపై  ట్రైనింగిచ్చారు. కొన్ని వీడియోలవీ చూపించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. సరిహద్దు దాటేవరకూ పొలెరో మాతో పాటు వస్తానన్నాక మాకూ ధైర్యం పెరిగింది. పొలెరోకి అమెరికన్ వీసా వుంది. ఈ సారి ఏ వస్తువులూ తీసుకెళ్ళ కూడదని హెచ్చరించారు. కట్టుబట్టలూ, కొన్ని డాలర్లూ తప్ప మా దగ్గరేమీ లేవు.

అమెరికా మోజులో పడి సరిహద్దు దాటడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం గానీ, అక్కడికెళ్ళాక ఎలా బ్రతుకుతామన్న ఆలోచన మా కెవ్వరికీ రాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మేమందరమూ ఎంత గుడ్డిగా ప్రవర్తించామా అనిపిస్తుంది.

వెళ్ళే రోజు రాత్రి పది దాటాక ఒక వ్యానులో మమ్మల్నందర్నీ సరిహద్దు దగ్గర వదిలి పెట్టారు. రాత్రి పదకొండు దాటినా అక్కడ సెగలు కక్కే వేడి గాలి చూసి ఎలాగరా భగవంతుడానుకున్నాను.  వేసవికాలం రాకుండానే భీభత్సమైన వేడి గాలి. ఎంత ఓ గంట ఓర్చుకుంటే చాలని ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకున్నాం. ఇంతకుముందెప్పుడూ పరిచయం లేని మేము ఈ రెండు గంటలూ కలిసి ప్రయాణిస్తాం. సరిహద్దు దాటగానే ఎవరి దారి వారిదే! రాత్రి ఒంటిగంట దాటాక ఆ ఎడారిలో నడక ప్రారంభించాం. ఆ వేడికి గొంతు పిడచకట్టుకు పోయింది. అలాగే ఓర్చుకుంటూ నడవసాగాం. ఈ అరిజోనా ఎడారి విచిత్రమైంది. చుట్టూ ఎత్తయిన కొండ ప్రదేశం. బొమ్మ జెముళ్ళూ, ముళ్ళపొదలూ, తుమ్మ మొక్కలూ తుప్పలు తుప్పలుగా ఉంటాయి. వాటి మధ్య పాములూ, విషపూరితమైన తొండలూ, ఎడారి తేళ్ళూ  ఉంటాయని ముందు జాగ్రత్తల్లో ఒకటికి పదిసార్లు చెప్పారు. ఒంటరిగా ఏ మానవ మాత్రుడూ ఇక్కడ నడక సాగించలేడు. ఎవరెవరితోనూ గట్టిగా మాట్లాడ్డానిక్కూడా వీళ్ళేదు. మరోపక్క రాత్రి గస్తీ కాచే అమెరికన్ అధికారులకెక్కడ చిక్కుతామన్న భయం కూడా వుంది.

దాదాపు రెండు గంటలు నడిచాక అందరం ఒక చోట విశ్రాంతికి చతికిలబడ్డాం. ఇంకొక్క అరగంటలో సరిహద్దు చేరుకుంటామని పొలెరో చెప్పాడు. లేని ఓపిక తెచ్చుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ బయల్దేరాం. కొంతదూరంలో చిన్న రహదారి కనిపించింది. దాని వెంబడే వెళ్ళబోతూండగా హఠాత్తుగా మా కంట్లో కాంతి పడింది. అందరమూ తలో మూలకీ పరిగెత్తాం. పొలెరో, నేనూ దగ్గర్లో ఉన్న చెట్టు వెనక్కి పరిగెత్తాం. ఆ కంగారులో లిలియా పడిపోయింది. హఠాత్తుగా ఒక జీపొచ్చి ఆగింది. కళ్ళెదుటే లిలియా పట్టుబడింది. లిలియాని రక్షిద్దామని నేను ముందుకెళ్ళబోతే పొలెరో నన్ను ఆపాడు. ఆ అధికారులు లిలియాని ప్రశ్నించడం చూసాను. లిలియా గట్టిగా ఏడవడం వినిపించింది. తట్టుకోలేకపోయాను.  పొలెరో వద్దన్నా నేనూ చెట్టు చాటునుండి పరిగెత్తుకుంటూ జీపు దగ్గరకెళ్ళాను. నన్ను చూసి కంగారుగా ఆ అధికారిలిద్దరూ మాకేసి తుపాకీ గురిపెట్టారు. చేతులెత్తి మేమిద్దరం లొంగిపోయాం. జీపులో వెళుతూ మా వాళ్ళకోసం వెనక్కి చూసినప్పుడు దూరంగా పరిగెడుతూ పొలెరో కనిపించాడు. నన్ను చూసి బావురుమంది లిలియా. నేనున్నానని ధైర్యం చెప్పాను.

మమ్మల్ని నొగాలె సరిహద్దు గేటు వద్దకి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. నా గురించి చెబుతున్నంత సేపూ అందులో ఒకతను లిలియా కేసే చూస్తూ ఉన్నాడు. మధ్యలో లిలియాని తీసుకొని వేరే జీపెక్కించుకొని వెళిపోయాడు. కళ్ళల్లో కన్నీరు కారుతూండగా నా ప్రేయసి నన్నొదిలిపోతూ కనిపించింది. జీవితంలో సంతోషంగా జీవించడానికి అమెరికా వెళదామనుకున్న మేం ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంటామని కలలో కూడా ఊహించలేదు.  అదే నేను లిలియాని ఆఖరు సారి చూడ్డం. ఆ మర్నాడు నన్ను జీపులో తీసుకెళ్ళి మెక్సికన్ బోర్డరు వైపు దింపారు. దారిపొడూగునా లిలియా గురించి అడిగాను. ఎవరూ చెప్పలేదు. వాళ్ళందరికీ స్పానిష్ భాషొచ్చు. అయినా నేను మాట్లాదేది అర్థం కానట్టే ఉన్నారు. ఏడుపొచ్చింది. లిలియాకోసం మనసు రోదించింది.

ఇదంతా మామూలేననీ, వారంలోగా మరలా పంపుతానని నాతో పొలెరో అన్నా, నాకు అమెరికా మీద వ్యామోహం పోయింది. నాకు లిలియా దక్కితే చాలు. టోర్టియా తినయినా మెక్సికోలోనే బ్రతుకుదామనిపించింది. ఏం? ఎంతమంది మా దేశంలో బ్రతకడంలేదు? మేమూ వాళ్ళల్లో ఒకళ్ళుగానే జీవిస్తాం. అంతే!  లిలియాకోసం రోజూ నొగాలె సరిహద్దు దగ్గరకొచ్చే వాణ్ణి. అక్కడున్న మెక్సికన్ అధికారుల్ని లిలియా గుర్తులు చెప్పి అడిగే వాణ్ణి. ఆమె జాడ మాత్రం లేదు. అమెరికన్ అధికార్లు చంపేసారాని భయపడ్డాను. ఏటా ఇలా సరిహద్దులుదాటుతూ వందలమంది చనిపోయారని విన్నాను. అన్ని చావులూ ఎడారి వేడికి కాకపోయినా కొన్నయినా అమెరికన్ తుపాకులకి బలైనవేననీ తెలుసు. ఎన్నో రాత్రుళ్ళు లిలియా కోసం ఏడ్చాను. అమ్మ ప్రతీ ఆదివారం చర్చికి రమ్మనమంటే వెళ్ళడానికి ఇష్టపడని నేను లిలియా క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను. లిలియా గురించి వెతకడం వృధా అనీ, అమెరికన్ అధికారులు ఆమెని జైల్లో వేసుంటారనీ పొలెరో చెప్పాడు. నాకెందుకో తిరిగొస్తుందన్న ఆశతో అక్కడ రెండు వారాలు గడిపాను.

సాధారణంగా పట్టుబడిన స్త్రీలని అమెరికన్ అధికారులు కొంతమంది అనుభవించి వాళ్ళని మెక్సికో సరిహద్దు పోస్టు దగ్గర వదిలేస్తారు. లిలియా అమెరికాలోనే క్షేమంగా ఉండుండాలి. మా ఇంటిక్కానీ, లిలియా ఇంట్లోకానీ ఎవరికీ ఈ విషయం కబురంపలేదు. నాకే మొహం చెల్లలేదు. అలా పిచ్చివాడిలా అక్కడే నొగాలే దగ్గరే రెణ్ణెల్లు గడిపాను. తెచ్చుకున్న సొమ్మంతా అయిపోసాగింది. నన్ను చూసి పొలెరో జాలిపడ్డాడు. లిలియా అమెరికాలో బ్రతికే ఉందన్న నమ్మకం కలిగించీ, నన్ను ఎలాగయినా అమెరికా పంపుతానని మాటిచ్చాడు. వెళ్ళడానికి నేనూ సిద్ధ పడ్డాను.

ఈ సారి ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసాడు పొలెరో. ఒక నకిలీ అమెరికన్ పాస్‌పోర్టు పుట్టించాడు. నా జుట్టుకి ఎర్ర రంగు వేయించాడు. ఎవరికీ అనుమానం రాకుండా వంటిమీదున్న జుట్టుకీ రంగు వేసుకోమన్నాడు. చూడగానే ఏమాత్రం అనుమానం రాకుండా నా రూపం మార్పించాడు. వెళ్ళేముంది లిలియా ఫొటో ఒకటి పొలెరోకి ఇచ్చాను. ఈ రెణ్ణెల్లలోనూ నన్ను పట్టించుకున్నదెవరయినా ఉంటే ఈ పొలెరోనే!

నాకు ఇంగ్లీషు రావడం ఈసారి చాలా ఉపయోగపడింది. పట్టుబడితే పట్టుబడ్డానన్న మొండిధైర్యంతో నేనూ మానసికంగా తయారయ్యాను. చిత్రం, ఈసారి నన్నెవరూ అంతగా ప్రశ్నించలేదు. మొదటి రెండు సార్లూ అష్టకష్టాలూ పడ్డ నేను మూడోసారి మాత్రం ఎంతో సులభంగా అమెరికా వచ్చేసాను. సరిహద్దు దాటగానే టస్కన్ వెళ్ళి పొలెరో కలవమని చెప్పినంతన్ని కలిసాను. లిలియా గురించి చెప్పి ఆమె ఫొటో ఒకటి కాపీ ఇచ్చాను. నన్ను మాత్రం నెగాలే సమీపంలో ఉండొద్దనీ చెప్పాడు. వీలయితే కొద్ది రోజుల్లో కాలిఫోర్నియా పంపిస్తానని చెప్పాడు. ఎక్కడికెళ్ళినా లిలియాకోసమే నా కళ్ళు వెతికేవి. రోజులు గడిచేకొద్దీ లిలియాపై ఆశ సన్నగిల్లింది.

కొంతకాలమయ్యాక శాన్‌హోసే వచ్చాను. ఆ విధంగా మీతో పరిచయమయ్యింది. మొదటి సారి మిమ్మలి చూసినప్పుడు మీరూ మాలాగే వచ్చారని అనుకున్నాను. ఇండియా అన్న ఒక దేశం ఉందని తెలుసు తప్ప  అంతకు మించి అవగాహన లేదు. స్కూల్లో ఎప్పుడో గాంధీ గురించి చదివాను. ఆయనది ఇండియా అని మాత్రమే తెలుసు. ఈ అమెరికా ఒక భూతల స్వర్గం. ఎంతో మంది వివిధ దేశాల్నుండీ వచ్చి స్థిరపడుతున్నారు. కంప్యూటర్ యుగంలో ఇండియా కూడా ముందుకెళుతోందని మిమ్మలందర్నీ చూసాక అర్థమయ్యింది. మాలాగ కాకుండా మీరందరూ చట్ట బద్ధంగా ఈ దేశం వచ్చినవాళ్ళు. కాబట్టి మీకు మేం పడ్డ కష్టాలు తెలీవు. తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా కథలు ఎవరికీ చెప్పం. ఏ పేపర్లోనూ ఎవరూ ప్రచురించరు. ప్రచురిస్తే మాకే ఇబ్బంది. అందుకని మేమూ మా జాగ్రత్తలో ఉంటాం. నాలా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు ఈ కాలిఫోర్నియాలోనే లక్షల మందున్నారు. వచ్చిన కొత్తలో ఇంతమంది ఎలా బ్రతుకుతున్నారాని ఆశ్చర్యపోయేవాణ్ణి. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ నంబరులేనిదే ఎవరూ ఇక్కడ ఉద్యోగం ఇవ్వరు. ఉద్యోగ జీతం నుండే దేశానికి కట్టాల్సిన పన్ను విరగ్గోసి మరీ ఇస్తారు.

అందువల్ల మాలాంటి వాళ్ళ ఇక్కడ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తే చట్టానికి దొరికిపోతాం. అమెరికా వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులే పడ్డాను. రాగానే సుస్తీ చేసింది. లిలియా దూరమయ్యిందన్న బాధా, ఇక్కడెలా బ్రతుకుతామురా అన్న బెంగా, రెండూ నా ఆరోగ్యంపై దెబ్బకొట్టాయి. ఉద్యోగాలకొచ్చే చిక్కే డాక్టర్ల వద్దా ఎదురవుతుంది. నాకు హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లేదు. అందువల్ల చిన్న దుకాణాల్లో దొరికే మందులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడికొచ్చాకకానీ ఈ దేశం గురించి అర్థం కాలేదు. మరీ చిన్న చిన్న పనులు చెయ్యడానికి మనస్కరించలేదు. నాకు ఇక్కడున్న ఏజంటు అలాంటి ఉద్యోగాలే తప్ప వేరే గత్యంతరం లేదని చెప్పాడు. వచ్చిన కొత్తల్లో హోం డిపో దగ్గర కూలీ పనులకోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి. చిన్నా చితాక పనులు చేస్తే కొన్ని డాలర్లు దొరికేవి.

ఎవరికయినా వాళ్ళ గార్డెన్ పని చెయ్యాలన్నా, బరువు పనులు చెయ్యాలన్నా ఒప్పుకునేవాణ్ణి. టెకోలుట్లాలో ఉండగా అమ్మా, నాన్నలకెప్పుడూ సాయపడిన గుర్తే లేదు. ఎప్పుడైనా అమ్మ చిన్న చిన్న పనులు చెబితే నాన్నవిసుక్కునే వాడు. అలా సోమరిగా బ్రతికిన నేను ఇక్కడ కూడని పనులు చెయ్యడానికి సిద్ధపడుతున్నానంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకో ఈ మోటు  పనులు నావల్ల కాదని పించింది. గత్యంతరం లేక మా ఏజంటుకున్న “జానిటర్” పనులు చేసే కంపెనీలో పనిచెయ్యడానికి ఒప్పుకోక తప్పలేదు. అతను నాకు వర్కు పర్మిట్టుకి అప్లై చేస్తానని నమ్మించాడు. పైగా అది సాయంత్రం ఏడు దాటాక పని. మిగతా పనులతో పోలిస్తే శారీరిక శ్రమ అంతగా ఉండదు. ఆ విధంగా నేను మీ కంపెనీలో బాత్రూములూ శుభ్ర పరిచే ఉద్యోగానికి వచ్చే వాణ్ణి.

మిమ్మల్ని చూసాక, నాకూ మీలాగ ఒక ఆఫీసులో కూర్చుని పని చెయ్యలనిపించేది. అలా కలలు కనే మా అమ్మా నాన్నా నన్ను చదివించారు. వాటికి భిన్నంగా నేను చేస్తున్న ఈ పనులు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ముఖ్యంగా మా అమ్మ. ఏమీ చెయ్యలేని పరిస్థితి. తిరిగి మా దేశం వెళ్ళలేను. వెళ్ళడం జరిగితే లిలియాతోనే వెళతాను. చూస్తూండగా ఏడాది గడిచిపోయింది. నా బ్రతుకులో ఏ మాత్రం మార్పు లేదు.

ఈ కాలిఫోర్నియాలో ఉన్న లాటినో కమ్యూనిటీ అంతా నా బాపతు గాళ్ళే! మమ్మలందర్నీ లీగల్ చేసి ఇక్కడ జనస్రవంతిలో కలపమన్న ఒక రాజకీయ అంశం కూడా వుందని మొదట్లో తెలీదు. మీరూ, నేనూ అందరం వలసొచ్చిన వాళ్ళమే! ఇక్కడి న్యాయాలూ, చట్టాలూ ఈ దేశస్థులకునుగుణంగానే ఉంటాయి. ఈ దేశమనే కాదు; ఏ దేశమయినా అంతే! ఒకసారి నేను క్లింటనొస్తున్నాడనీ, ఆ సందర్భంగా  ఈ దేశపు పౌరసత్వం కోసం మా లాటినోలు చేసే ధర్నాకి వెళుతూంటే మీరొక ప్రశ్న లేవనెత్తారు. నా కింకా గుర్తు. “ఇక్కడ లా అండ్ ఆర్డరు ఎంతో గొప్పగా ఉంటాయి కదా? వీళ్ళు తలుచుకుంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఏరెయ్యడం కష్టమయిన పని కాదే? చూసీ చూడనట్లుంటారో?” అంటూ ప్రశ్నించారు. చటుక్కున నాకు సమాధానం తట్ట లేదు. ఎవర్నడిగినా తెలీదన్నారు. ఇదే విషయం నేనొక స్పానిష్ న్యాయవాదితో అంటే – “అమెరికన్లు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్నందర్నీ మీ దేశాలకి పంపించేస్తే ఈ దేశంలో వీళ్ళు చెయ్యలేని పనులెవరు చేస్తారని? అందుకని దొంగతనంగా వచ్చినా మిమ్మల్నెవరూ ఏమీ చెయ్యరు. మీ హక్కులకోసం రాజకీయ నాయకులు మరింత పోరాటం చేస్తారు. ప్రజాస్వామ్య భ్రమణానికి ఓటే కదా గరిమనాభి. మీరు వీళ్ళకి కావాలి. ఇక్కడ బ్రతకడం మీక్కావాలి. అంతే!” అంటూ వాస్తవాన్ని చెప్పాడు.

మా అంత కాకపోయినా లీగల్గా మీకూ అమెరికాలో కష్టాలున్నాయన్న సంగతి క్రమేణా తెలిసింది. మీ దేశస్తులే మిమ్మల్ని పావులుగా వాడుకుంటారన్న సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. గ్రీన్ కార్డొచ్చే వరకూ మీకూ స్వేచ్ఛ లేదు. ఈ అమెరికా అన్నదొక మాయా జాలం. వచ్చే వరకూ రావడమే ధ్యేయమనుకుంటాం; తీరా వచ్చాక ఇక్కడెలా స్థిరపడాలానుకుంటాం. అందమైన అమ్మాయి మోహంలో పడ్డట్టు అందరూ ఈదేశపు మాయలో పడిపోతారు.

మాకు బ్రతుకంతా ఇల్లీగల్ వ్యవహారమే! ఇక్కడే ఉన్న లాటినోలని పెళ్ళాడి వారి ద్వారా కొంతమంది పౌరసత్వం సంపాదిస్తారు. చట్టాలెన్నున్నాయో అంతకుమించి లొసుగులూ ఉంటాయి. మా లాటినో లాయరకి మమ్మల్ని లీగల్గా ఎలా మార్చాలో తెలుసు. అంతవరకూ నాలాంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడపాల్సిందే! ఈ చీకటి  యుద్ధంలో ఓపికొక్కటే మా ఆయుధం.

ఎక్కడో మొదలు పెట్టి చెత్తంతా రాసేస్తున్నానుకోకండి. మనసుకనిపించింది రాసేస్తున్నానంతే! మీతో చెప్పా పెట్టకుండా మాయమవడం నే చేసిన తప్పు. ఏం చెయ్యమంటారు? లిలియా టస్కన్లో కనిపించిందనీ పొలెరో కబురంపాడు. యంత్రంలా సాగుతున్న జీవితంలో మరలా లిలియా గురించి విన్నాను. చూసి మూడేళ్ళయిపోతోంది. మీకు తెలీదు. లిలియా కోసం ఇన్నాళ్ళొ ఎంత తపించానో?  అందుకే ఉన్న పళాన ఎవరికీ చెప్పకుండా పరిగెత్తాను. చెబితే మరలా చేజారిపోతుందేమో నన్న భయం. మా ఏజంటుకి రెండు వారాలు శలవు కావాలని కబురంపాను. ఏమయిపోయానాని అతను బహుశా కంగారు పడుంటాడు. మీరయితే ఎదురుచూస్తూ ఉండుంటారు. ఏమీ కాలేదండీ! ఇంకా బ్రతికే ఉన్నాను. ఇక్కడ అరిజోనా జైల్లో గత నాలుగు నెలలుగా పడున్నాను.

తల్చుకుంటేనే ఏడుపొస్తుంది. ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపానో తెలీదు. ఒక్కోసారి నన్ను నేనే తిట్టుకునే వాణ్ణి. లిలియాతో పరిచయమయ్యాకే నాకు సుఖం శాంతీ లేకుండా పోయాయని రోదించేవాణ్ణి. వేంటనే, పాపం ఇందులో లిలియా తప్పేముంది? ఆమె కూడా నాలా విధి వంచితే కదానిపించేది.

వారం క్రితం రాత్రి గుండె నొప్పి వచ్చి కూలబడిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రి మంచమ్మీదున్నాను. నాకు చిన్నగా హార్టెటాకొచ్చిందని చెప్పారు. వేంటనే మీరు గుర్తుకొచ్చారు. రోజూ మీ కంపెనీలో బాత్రూములు శుభ్రపరచడానికి ఏడింటికి వచ్చేవాణ్ణి. పనంతా అయ్యేసరికి రాత్రి పదకొండు దాటేది. మీరు ఏ రోజూ పన్నెండు ముందుగా వెళ్ళడం చూళ్ళేదు. పెళ్ళాం పిల్లలు లేరా? ఏవిటీ ఈ మనిషిలా పని చేస్తాడనుకునే వాణ్ణి. పనిఒత్తిడిలో పడిపోయిన మిమ్మల్ని 911 ఫోన్ చేసి రక్షించడంతోనే మీతో పరిచయం కలిగింది. మీరూ, మీ కుటుంబమూ నన్ను ఆదరించారు. నాకు యాక్సిడెంటయ్యి చెయ్యి విరిగితే, ఇన్స్యూ్రెన్స్ లేదని, ఆ ఖర్చంతా మీరే భరించడం గుర్తుంది. మీకు తెలీకుండా మీ వాలెట్ నుండి అవసరాలకి డబ్బు దొంగిలించాను. నేనే ఇలా…ఇదంతా రాస్తుంటే ఏడుపొస్తోంది. ‘హేవియర్! డిన్నరుకి ఇంటికిరా!’ అని మీరు పిలవడం గుర్తుకొస్తోంది.  ఎంత యేడ్చి ఏం ప్రయోజనం?  మీరెవరూ నన్ను కలవలేరు. నన్నెప్పుడు ఈ జైలునుండి రిలీజు చేస్తారో తెలీదు.

లిలియా గురించి కబురందగానే టస్కన్ వెళ్ళాను. ఆమెను ఒక గ్రోసరీ స్టొరు దగ్గర కార్లో వెళుతూ చూసానని పొలెరో చెప్పాడు. గుర్తుపట్టి పలకరించే లోపలే అక్కడనుండి వెళిపోయిందని అన్నాడు. లిలియా కోసం చుట్టు పక్కలంతా గాలించాం. ఓ రోజు పొలెరో స్నేహితుడొకడు ఒకరింట్లో పని చెయ్యడానికి వెళితే అక్కడ లిలియా పేరుగల ఒకామెను చూసాడని చెప్పాడు. అంతే నేనూ, పొలెరో స్నేహితుడూ ఆ ఆ రాత్రి ఇంటి ముందు కాపు కాసాం. కార్లోనే నిద్రపోయాం. ఓ రాత్రి వేళ ఇద్దరు పోలీసులు డోరు తట్టడంతో ఉలిక్కిపడి లేచాం. మమ్మల్ని అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్ళారు. అక్కడికెళ్ళాక తెలిసింది పొలెరో స్నేహితుడొక డ్రగ్ ట్రాఫికింగ్ ఏజంటని. ఆ కార్లో గంజాయి పేకట్లూ, ఇంకా ఆయుధాలూ దొరికాయని ఇంటరాగేషన్లో  తెలిసింది. నా వివరాలన్నీ కూపీ లాగారు. నా గురించి ఎంత చెప్పినా ఎవరూ నమ్మ లేదు. అలా నెల్లాళ్ళు గడిచాయి. ఈలోగా నాకు గుండెనొప్పి వచ్చి ఆసుపత్రి పాలయ్యాను. బ్రతుకుమీద ఆశ చచ్చింది. నా బాధ చూసి జైలు అధికారి ఉత్తరం రాసుకోడానికి అనుమతిచ్చాడు. మీరొక్కరే నన్ను ఈ ఊబి నుండి పైకి లాగ గలరని నిన్ననే మా తరపున వాదించే అటార్నీ చెప్పాడు. నే చేసిన తప్పులన్నీ క్షమించి మీరొక్క సారి రండి.

నిన్న ఆసుపత్రిలో ఉండగా ఒక విచిత్రం జరిగింది. టెస్టులకని వీల్ చైర్లో వేరే రూంకి నన్ను తీసుకెళుతూండగా చేతిలో చిన్న పిల్లని ఎత్తుకొని తీసుకెళుతూ, నేనామెను చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. కళ్ళు నులుపుకొని మరీ చూసాను. ఆమె ఖచ్చితంగా లిలియానే! నోట మాట రాలేదు. మూడేళ్ళ నిరీక్షణా ఒక్క సారి చచ్చుబడిపోయింది. ఆమె నన్ను గమనించలేదు. నేనామెను పిలవలేదు. ఇప్పుడు  ఆమె ఒళ్ళో తలవాల్చాలనీ లేదు. అంతెందుకూ ఈ దేశంలోనే ఉండాలని లేదు.

మా వూరెళ్ళి అమ్మ చేసిన ‘ఫెలెతె ది పెస్కాదో రెలానో ది మరిస్కోస్ ‘ తినాలనుంది. నా మెళ్ళో వేసిన పూసల దండని అమ్మ మెళ్ళో వేయాలనుంది. అదే నా చివరి కోరిక.

హాస్తా ప్రాంతో,

– హేవియర్

( కెరీదా – ప్రియమైన; పెసో – మెక్సికన్ డబ్బు; ‘ఫెలెతె ది పెస్కాదో రెలానో ది మరిస్కోస్’  – మెక్సికన్ చేపల కూర;  కయోటీ – మెక్సికన్లని అమెరికాకి పంపే దళారి; పొలెరో – మెక్సికో సరిహద్దు దాటాక అమెరికాలో ఉండే ఇల్లీగల్ దళారులు; టోర్టియా – చపాతీ; హాస్తా ప్రాంతో – త్వరలో కలుద్దాం )