రచన: ఎస్‌. నారాయణస్వామి

ఈమాట‘, సెప్టెంబర్ 1999
రంగుటద్దాల కిటికీ‘ సంకలనం
అమెరికా తెలుగు కథ‘ సంకలనం
ప్రధమ బహుమతి, వంగూరి ఫౌండేషన్ ‘ఉగాది కథల పోటీ – 1999


 

ఎడం చెయ్యి స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నా శంకర్‌ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై.

“నాన్నా,” కిరణ్‌ పిలిచాడు.

దరువాగి పోయింది కొడుకు పిలుపు వినబడగానే. కానీ కళ్ళు రోడ్డు మీదనుంచి మరల్చ కుండానే మొహం కొంచెం వెనక సీటు వేపుకు తిప్పి బదులిచ్చాడు శంకర్‌.

“ఏంట్రా కన్నా?”

“నాకో తుపాకీ కావాలి.”

“వ్హాట్‌?” రాజ్యలక్ష్మీ శంకర్‌ ఇద్దరూ ఏక కంఠంతో అరిచారు. వాళ్ళ రియాక్షన్‌ చూస్తే కిరణ్‌ తుపాకీ కావాలన్నట్టు కాదు, తుపాకీయే పేల్చినట్టు వుంది. శంకర్‌ కూడా భార్యతో పాటు తల వెనక్కి తిప్పి కొడుకు వేపు చూశాడు. కిరణ్‌ ఏమీ తొణక్కుండా ఇద్దరికేసీ సీరియస్‌ గా చూస్తూ తన కోరిక మళ్ళీ చెప్పాడు. శంకర్‌ కి తను కారు నడుపుతున్న విషయం గుర్తొచ్చి దృష్టి మళ్ళీ రోడ్డు మీదకి మళ్ళించాడు. రాజ్యలక్ష్మి మాత్రం, ఆ బాధ్యత లేదు కాబట్టి, కొడుకుని పులుకూ పులుకూ చూసింది కొంత సేపు. సడన్‌ గా ఏదో అర్థమైనట్టు చిర్నవ్వు నవ్వి,

“ఓ, మెన్‌ ఇన్‌ బ్లాక్‌ సినిమా తుపాకీయా? వాళ్ళు కళ్ళజోళ్ళే అమ్ముతున్నా రనుకున్నా, తుపాకీలు కూడా వస్తున్నట్టు తెలీదే, ఎక్కడ చూశావ్‌ నువ్వు?” అనడిగింది. కిరణ్‌ మాత్రం ఆమె చిర్నవ్వుకి తిరిగి నవ్వకుండా ఇందాకటి సీరియస్‌ నెస్‌ తోనే బదులిచ్చాడు. “నేనడిగింది బొమ్మ తుపాకీ కాదు. నిజం తుపాకీ కావాలి నాకు.”

శంకర్‌ ఏమీ అనలేదు. రాజ్యలక్ష్మే అంది, “నీకిప్పుడు నిజం తుపాకీ ఎందుకు కావల్సొచ్చిందీ?” ఇంకేవనాలో తెలీనట్టు.

“ఎందుకేవిటి? కాల్చడానికి!” జవాబులో ఏవిటా పిచ్చి ప్రశ్న అన్న నిరసన తొంగి చూసింది. అప్పటికి పెగిలింది శంకర్‌ గొంతు.

“ఎవర్ని కాలుస్తావు తుపాకీతో?”

“ఎవర్నీ కాదు, వుత్తినే కాలుస్తాను. అప్పుడప్పుడూ జంతువుల్ని వేటాడతాను.”

అమ్మా నాన్నా ఇద్దరూ మౌనంగా వుండిపోయే సరికి, తన కోరికకి అప్పోజిషన్‌ పెరిగిపోతోం దనుకున్నాడో ఏమో, సంజాయిషీ ఇస్తున్నట్టు కిరణే తిరిగి మొద లెట్టాడు. “పెద్దయ్యాక నేనేం చెయ్యాలనుకుంటానో, దానికిప్పణ్ణించే చక్కగా ప్రిపేరవ్వాలని నువ్వే చెప్తుంటావు గదా. మరి నేను పెద్దయ్యాక గొప్ప వేటగాణ్ణి కావాలనుకుంటూన్నా, బ్రయన్‌ వాళ్ళ నాన్నలాగా. అంత బాగా షూట్‌ చెయ్యాలంటే మరి ఇప్పణ్ణించే ప్రాక్టీస్‌ చెయ్యొద్దూ?”

కొడుకు లాజిక్కి శంకర్‌ కొంచెం గర్వ పడినా, తన సూక్తులు మెలితిప్పి తన మెడకే ఉచ్చెయ్యడం బొత్తిగా నచ్చక మౌనంగా వుండిపోయాడు. మొగుడు మౌనావతారం వహించేప్పటికి రాజ్యలక్ష్మి వాదన భారం నెత్తినేసుకుంది.

“ఏడిశావ్‌ లే వెధవా! మాటికీ ఆ బ్రయన్‌ గాడితో తిరక్కురా అంటే వినవ్‌. నువ్వేదో మీ నాన్నలాగా మెడిసిన్‌ చదివి మమ్మల్నేదో ఉధ్ధరిస్తావని మేవాశ పడుతుంటే…వేటగా డవుతాట్ట, వేటగాడు. ఏం, తుపాకీ బుజాన్నేసుకుని చెట్లూ పుట్టలూ పట్టుకు తిరుగుతుంటావా, సన్నాసి వెధవల్లే?” కిరణ్‌ ఆర్య్గుమెంటుని కొడుకుల మీద అమ్మలకి ఎప్పుడూ వుండే సెంటిమెంటుతో కొట్టిపారేసింది.

తల్లితో మాట్లాడ్డం అనవసరం అన్నట్టు రాజ్యలక్ష్మి మాటలు పట్టించుకోకుండా, కిరణ్‌ కొంచెం ముందుకు వంగి తండ్రి కుడి చెయ్యి తడుతూ అన్నాడు, “ఏం నాన్నా, నువ్వేం మాట్లాడవేం?”

శంకర్‌ కి తప్పలేదు. ఒక్క క్షణం తీవ్రంగా ఆలోచించి, నెమ్మదిగా మొదలెట్టాడు.

“చూడు కన్నా, మేవెప్పుడూ నీ మంచే కోరతాం. ప్రాక్టీస్‌ చెయ్యాలని నేనన్న మాట నిజమే. నువ్వు వేటగాడి వవ్వాలంటే బాగా ప్రాక్టీస్‌ చెయ్యాల్సిందే, తప్పదు. కానీ నువ్వింకా పదేళ్ళ వాడివి. ఈ తుపాకులున్నాయే అవి చాలా డేంజరస్‌ సామానులు. ఏవన్నా కాస్త పొరపాటు జరిగితే డైరెక్టుగా ప్రాణాలే పోతై. అందుకే నేను హెసిటేట్‌ చేస్తున్నా!”

తండ్రి తీవ్రంగా ‘నో!’ అంటాడేమో, ఈపాటికి టాపు లేపేసేందుకు రెడీ అవుతున్న కిరణ్‌ ఇంత రీజనబుల్‌ గా చెప్పేసరికి కొంచెం వెనక్కి తగ్గి ఆలోచనలో పడ్డాడు.

అప్పటికి ఆ ప్రసక్తి ముగిసిందన్నట్టు చిన్న నిట్టూర్పు విడిచి శంకర్‌ మళ్ళీ రోడ్డు మీద దృష్టి కేంద్రీకరించాడు. కానీ రెండు నిముషాల్లో కిరణ్‌ మళ్ళీ శంకర్‌ చెయ్యి తట్టాడు.

“మళ్ళీ ఏంట్రా?”

“సరే నాన్నా, నువ్వు చెప్పిందీ నిజమే. అందుకని నిజంగా నిజం తుపాకీ వొద్దులే బ్రయన్‌ దగ్గ రున్నలాంటిది ఎయిర్‌ రైఫిల్‌ కొని పెట్టు. దాంతో కనీసం టార్గెట్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా పొరపాటైనా ఎవరికీ పెద్ద అపాయం ఏమీ రాదు.”

కొడుకు తర్కానికి శంకర్‌ తల తిరిగి పోయింది.

రాజ్యలక్ష్మి మళ్ళీ కల్పించుకుని కిరణ్‌ ని విదిల్చేస్తూ, “తుపాకీ లేదూ, గిపాకీ లేదూ, నోర్మూసుకొని గమ్మునుండు. అడిగినవన్నీ కొనిస్తున్నందుకు అలుసెక్కువైంది నీకు,” అంది.

ఇప్పటికైనా శంకర్‌ కూడా భార్య పధ్ధతి నవలంబించి కొడుకుని నోర్మూసుకోమనో, తుపాకీ గురించి మరిచిపోమనో కసిరెయ్యచ్చు. కానీ అది అతని పధ్ధతి కాదు. చిన్న పిల్లలకి అవగాహన శక్తి ఎక్కువనీ, వాళ్ళకి విషయాలు విడమర్చి చెప్తే పెద్దవాళ్ళకంటే సులువుగా అర్థం చేసుకుంటారనీ, అర్థం చేసుకున్న విషయాల్ని మర్చిపోరనీ అతని ధృఢాభిప్రాయం. ఆ అభిప్రాయం కిరణ్‌ విషయంలో ఇంత వరకూ తప్పలేదు. అందుకే కిరణ్‌ కి సాధ్యమైనంత వరకూ అన్నీ విడమరిచి చెప్తుంటాడు. ఇప్పుడు మాత్రం ఏం చెయ్యాలో శంకర్‌ కి పాలుపోలేదు.

అందుకని ‘చూద్దాంలే’ అని దాటేశాడు.

కిరణ్‌ వూరుకోకుండా, “ప్రామిస్‌?” అని రెట్టించాడు.

“చూద్దాం అన్నానుగా!” తండ్రి గొంతులో కొంచెం విసుగు ధ్వనించటంతో మరీ మారాం చేస్తే మొదటికే మోసం వస్తుం దనుకున్నాడో ఏమో, కిరణ్‌ ఆ విషయం అక్కడితో వదిలేసి సీట్లో వెనక్కి వాలి చేతులో యోయోతో ఆడుకుంటూ ఆలోచనల్లో మునిగి పోయాడు.

‘బ్రయన్‌ గాడి ఏర్‌ గన్‌ ఎంత ముద్దొస్తూందో.. వాడికెంత గర్వం దాన్ని చూసుకొని! అయినా పాపం మంచి వాడేలే.. నన్నుకూడా కాల్చనిచ్చాడుగా.. ఛ.. ఎంత అవమాన మైపోయింది! ..నాకది సరిగ్గా పట్టుకోటం కూడా చేతకాలేదు. తీరా ఎంతో కష్టపడి ఆ ఉడత మీద గురిపెట్టి ట్రిగర్‌ నొక్కితే… ఆ ఉడత ఉలిక్కి పడ్డట్టు.. ఒకసారి తలెత్తి చూసి తుర్రున పారిపోయింది… తూటా కాస్తా ఎటు పోయిందో… తెలీనే లేదు… బ్రయన్‌ ఒకటే నవ్వటం… వాడు ఆ బొంత కాకిని ఎంత లాఘవంగా కొట్టాడూ!.. మధ్యాన్నం… దొంగతనంగా… వాళ్ళ నాన్న గదిలో దూరితే… అక్కడ గోడల్నిండా జంతువుల తలకాయలు… ఎన్నుంటాయో… అన్నీ వాళ్ళ నాన్న చంపినవే నంట!.. ఆ పెద్ద ఎలుగు బంటి తల… ఊహ్‌.. అచ్చం బతికున్నట్టే.. కోరలు చాచి కోపంగా చూస్తూ… నాకు బలే బయ వేసేసింది.. అది సడన్‌ గా కదిలొచ్చి నామీద పడుతుందేమో నని… బ్రయన్‌ వాళ్ళ నాన్న కెంత ధైర్యమో… అంత పెద్ద ఎలుగుబంటిక్కూడా భయ పడకుండా… దాని ఎదురుగా నిలబడి కాల్చి చంపేశాట్ట… ఒకవేళ ఆ తూటా గురి తప్పుంటే… బ్రయన్‌ గాడు ఆ కథ చెప్పటం వినాలి… ఏదో తనే పెద్ద మొనగాడల్లే… ఆ ఎలుగు బంటిని చంపేసిన వాడల్లే… వాడూ, వాడి పోజూనూ…

వాళ్ళ నాన్న దగ్గురున్న రైఫిల్లాంటిది నా దగ్గరుంటేనా… ఈ చచ్చు ఎలుగు బంటేవిటి, పులులకీ సింహాలకీ కూడా భయపణ్ణు నేను… ఆ అద్దాల బీరువాలో ఎన్ని తుపాకులో… మొత్తం ఓ డజనన్నా వుంటై… కానీ వాళ్ళ నాన్న ఎవ్వర్నీ ముట్టుకో నివ్వట్ట… అసలు బ్రయన్ని ఆ గదిలోకి రావద్దని ఆర్డర్ట… దొంగతనంగా ఆ గదిలో దూరటం… భలే మజా వచ్చిందిలే… నేనూ బ్రయన్‌ వాళ్ళ నాన్నకి కొడుగ్గా పుట్టుంటే ఎంత బావుణ్ణు… వాడి పదకొండో పుట్టిన్రోజున వాడికో సొంత తుపాకి ఇస్తార్ట.. ఇచ్చి, తనతో బాటు వేటకి తీసుకెళ్తార్ట.. వాళ్ళ తాతగూడా వాళ్ళ నాన్నని అలాగే తీసుకెళ్ళార్ట… అస లంత దాకా ఎందుకూ… ఎప్పుడు స్కూలుకి సెలవలొచ్చినా వాళ్ళు అడవిలో వాళ్ళ కాటేజి కెళ్తారు… జిమ్మీ గాడు గూడా…

జిమ్మీ వాళ్ళ కంత డబ్బుల్లేవు… ఐనా వాళ్ళ నాన్న వాణ్ణి వేటాకి తీసుకెళ్తాట్ట… మొన్న సమ్మర్‌ వెకేషన్‌ అయినాక… వాడు తీసుకొచ్ఛాడు స్టఫ్‌ చేసిన రాకూన్‌… తనే కొట్టాట్ట వాళ్ళ నాన్న తుపాకీతో… వాడు డబ్బా కొడుతున్నాడేమో అని నా అనుమానం… శలవలకి నువ్వేం చేశావురా అని వాళ్ళడిగితే… నాకు చచ్చేంత సిగ్గు… ఏవుందీ… ఎప్పుడూ ఇండియా పోవడం… లేపోతే డిజ్నీ వర్ల్డ్‌ కో, ఇండియన్‌ ఫెస్టివల్స్‌ కో పోవడం… ఛ! అవేం వెకేషన్లూ… మా డిజ్నీ ట్రిప్‌ గురించి బ్రయన్‌ కీ జిమ్మీకీ చెప్తే… వాళ్ళు నన్ను జాలిగా చూస్తే… నాకప్పుడు అమ్మ మీదా నాన్న మీదా బలే కోప మొచ్చిందిలే… ఎప్పుడూ ఇలాంటి చెత్త వెకేషన్‌ లకే తీసుకెళ్తారు… ఇవ్వాళ్ళ చూడ కూడదూ… చక్కటి ఫాల్‌ డే… ఇద్దరూ దిష్టి బొమ్మల్లా… ఆ ఇండియన్‌ బట్టలేసుకొని గంట సేపు డ్రైవ్‌ చేసుకొని… ఆ గుడికి పోయొచ్చారు… పైగా నేను రానన్నానని అమ్మకి కోపం… లక్కీగా బ్రయన్‌ వాళ్ళింటి కెళ్ళచ్చని నాకే బ్రిలియంట్‌ ఐడియా వచ్చింది… బతికి పోయాను… బలే ఫన్‌ గా గడిచిందిలే… లేకపోతే అన్యాయంగా బోర్‌… వీళ్ళ బట్టలూ వేషాలూ… హాలొవీన్‌ లాగా… వీళ్ళని చూసి బ్రయన్‌ వాళ్ళు ఏమనుకుంటారో అని వర్రీ అయిపోయా… అయినా వాళ్ళు చాలా కల్చర్డ్‌ లే… బ్రయన్‌ వాళ్ళమ్మ చాలా నైస్‌ గా ఇన్‌ వైట్‌ చేసింది అందర్నీ… లేడీ అంటే అలా వుండాలి, ఎంత స్టైల్‌ గా వుంటుందో… బ్రయన్‌ తో పాటు నన్ను కూడా స్వీటీ హనీ అని పిల్చింది… నాకు బలే కులాసా అయిందిలే… ఇంతకీ నాన్న ఏర్‌ గన్‌ అయినా కొంటాడో లేదో… కొంటాళ్ళే, నాన్న కొంచెం రీజనబుల్‌ మనిషే… అమ్మతోనే ప్రాబ్లం… గన్‌ నా చేతికి రానీ… అప్పుడు చూపిస్తా… బ్రయన్‌ కీ జిమ్మీకీ నా తడాఖా…’

**********

ఆ రోజు రాత్రి కిరణ్‌ నిద్ర పోయాక రాజ్యలక్ష్మి శంకర్ని కదిపింది.

“ఏంటండీ వీడిలా తుపాకులు కావాలంటాడు, ఏం చెయ్యడం?”

శంకర్‌ కూడా అదే ఆలోచనలో వున్నట్టు తలూపాడు. రాజ్యలక్ష్మి కొనసాగించింది.

“ఆ బ్రయన్‌ వాళ్ళ నాయనకి పనీ పాటూ లేదూ? ఎంత పెద్ద లాయరైతేనేం, ఎంత డబ్బు సంపాయిస్తేనేం? పసిపిల్ల లుండే ఇంట్లో అన్ని తుపాకులు పెట్టుకోవట మేవిటీ? ఎరికల వాడిలా చెట్లూ పుట్టలూ పట్టుకు వేటలాడ్డ మేవిటీ? మా తాతయ్యా ప్లీడరుగా బోలెడ్డబ్బు గడించాడు. ఖాళీ వున్నప్పుడల్లా పూజలూ పునస్కారాలూ..సంగీత సభలూ, వేదాంత చర్చలూ..ఎంత వైభోగంగా వుండేదనీ! మనకింత వుంటే కాస్త ఇహపరాలకి పనికొచ్చే పనులు చేసుకోవాలా! అంతే గానీ ఆదిమ వాసుల్లాగా ఈ వేటేవిటండీ బాబూ?”

“వేటేవిటంటే ఏం చెప్పనూ? వాళ్ళ సంస్కృతి అది. పైగా తుపాకులుంచుకోవడం వాళ్ళా జన్మ హక్కుగా భావిస్తారు. గన్‌ కంట్రోలు మీద జరుగుతున్న యుధ్ధం నువ్వు చూస్తూనే వున్నావుగా! అలాంటి స్వతంత్ర భావాలతో ఏర్పడింది ఈ రాజ్యం. ఇక బ్రయన్‌ వాళ్ళ ఫేమిలీ అంటావా..వాళ్ళ తాత ముత్తాతల నుంచీ ఇక్కడ మోతుబర్లుగా వున్నార్ట. అంటే జమీందారు లన్నమాట. వాళ్ళ పూర్వీకుల్లో ఒకాయన సివిల్‌ వార్లో కన్‌ ఫెడరేట్‌ సైన్యాధికారిగా వున్నాట్ట. అంచేత ఈ ప్రాంతపు సంస్కృతి వాళ్ళ నరనరాల్లోనూ జీర్ణించుకు పోయింది.”

“అదికాదూ..వాళ్ళెలా వుంటే మనకేం? మన వాడిలా ప్రద్దానికీ వాళ్ళతో వొంతులేసుకుంటే ఎలా?”

“అదే నాకూ కొంచెం వర్రీగా వుంది. కిరణ్‌ లో ఈ మధ్య మన పధ్ధతుల మీద అసహ్యమూ, చుట్టూ వున్న తెల్లవాళ్ళ పధ్ధతుల మీద మోజూ పెరుగుతున్నట్టు అనిపిస్తోంది.”

“ఏవిటో! మీ రెసిడెన్సీ రోజుల్లో… క్లీవ్‌ లాండ్లో హాయిగా వుండే వాళ్ళం! పిలిస్తే పలికే దూరంలో మన వాళ్ళు బోలెడు మంది. అన్యాయంగా ఈ మిసిసిపీ అడివిలో వచ్చి పడ్డాం!”

“నువ్వేగా, బాబోయ్‌ ఈ చలి పడలేనూ… ఎక్కడన్నా కాస్త వెచ్చటి చోట పోస్టింగ్‌ చూడండీ అని గోల పెట్టావ్‌!” అని భార్యని వెక్కిరించాడు. “అది కాదనుకో, మిసిసిపీ ఐనా కొంచెం సిటీ దగ్గరైతే బావుండేది. తోటి ఇండియన్లని కలవటం వొకటీ, చుట్టుపక్కల జనాభా కొంచెం డైవర్స్‌ గా వుండేది. ఇక్కడ బొత్తిగా అందరూ తెల్ల వాళ్ళే. దానికి తోడు తెల్లవాళ్ళు కాని వాళ్ళ మీద వాళ్ళకి చిన్న చూపు. అసలు బ్రయన్‌ మన వాడితో ఇంత స్నేహం చేశాడంటేనే నాక్కొంచెం ఆశ్చర్యంగా వుంది. సరే కానీలే, ఈ దేశంలో సెటిలవ్వాలంటే మరి ఇక్కడి మనుషులు అన్ని రకాల వాళ్ళతోనూ స్వభావాలతోనూ తట్టుకునేందుకు అలవాటు పడద్దూ?”

“ఏం స్వభావాలో! ఏడేళ్ళు గడిపినా ఈ దేశం నాకు కొంచెం కూడా అర్థం కాదు. అద్సరే, ఇప్పుడీ తుపాకీ సంగ తేం చేస్తారూ? వాడితో చూస్తానని చెప్పారూ!”

“చూద్దాం!”

**********

స్కూల్‌ కేఫ్టీరియాలో లంచ్‌ టైం.

బ్రయన్‌ కిరణ్‌ వాళ్ళ శాండ్విచ్‌ లు తింటుండగా జిమ్మీ వచ్చి కలిశాడు. వీళ్ళిద్దరూ నిన్న చేసిన ఘన కార్యాల గురించి మ్యూచువల్‌ డబ్బా వాయించు కుంటున్నారు. జిమ్మీ రాగానే బ్రయన్‌ సస్పెన్సు నిండిన మొహం పెట్టి, ఊరింపుగా అన్నాడు,

“నిన్న నేనూ కిరాన్‌కలిసి ఏం చేశామో నువ్వెప్పటికీ వూహించలేవు.”

“ఆహా!”

“కిరాన్‌ వచ్చి మా ఇంట్లో గడిపాడు రోజంతా! మేవిద్దరం… ఏం చేశామో తెలుసా?”

“ఏం చేశారు?”

సస్పెన్సు ఇంకొంచెం పెంచేందుకు జిమ్మీ చెవి దగ్గరగా నోరు పెట్టి గుసగుసగా చెప్పాడు బ్రయన్‌, “దొంగతనంగా మా నాన్న వేట గదిలో దూరి… తుపాకుల బీరువా తలుపు తీసి… మా నాన్న ఆటోమేటిక్‌ రైఫిల్ని బయటికి తీసి…”

జిమ్మీ రియాక్షన్‌ కోసం వాడి మొహంలోకి చూశాడు బ్రయన్‌. మామూలుగా ఈ పాటికి జిమ్మీ ఒంటికాలి మీద లేచి బ్రయన్‌ కోతలకి అడ్డుపడాలి. కానీ అలాంటిదేం జరగ లేదు. జిమ్మీ కళ్ళు నిస్తేజంగా వున్నై.

కిరణ్‌ కూడా గమనించాడు, జిమ్మీ ఎప్పటిలాగా లేడని.

“ఏయ్‌, జిమ్మీ, ఏంటలా వున్నావ్‌?”

“ఏం లేదు, బానే వున్నా”

బ్రయన్‌ అందుకున్నాడు, “కాదు. ఏదో వుంది. మాతో చెప్పకోడదా?”

జిమ్మీ మౌనం. బ్రయన్‌ కిరణ్‌ ఇద్దరూ వొదిలి పెట్టకుండా బలవంతం చేస్తే నెమ్మదిగా నోరు విప్పాడు.

“మా నాన్నని ఫాక్టరీ లోనించి తీసేశారు!”

వీళ్ళిద్దరూ నిర్ఘాంత పోయారు. వాళ్ళ తండ్రుల వృత్తుల కారణంగా ఇలాంటి పరిస్థితి వాళ్ళ కెప్పుడూ ఎదురవలేదు. కానీ.. వుద్యోగం లేక పోవడం.. దాని పరిణామం ఎంత దారుణంగా వుంటుందో వాళ్ళకి వూహా మాత్రంగా తట్టింది. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు,

“ఓ, అయాం సో సారీ!”

“మీరెందుకు సారీ చెప్పటం. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు,” అన్నాడు జిమ్మీ. ఆ ఆలోచన రావటంతోనే వాడి మొహంలో రక్తం పొంగి కందగడ్డ చెక్కలా తయారైంది.

వీళ్లిద్దరూ ఆశ్చర్యంగా అడిగారు,

“ఆ? ఎవరు చేస్తున్నారు?”

“నీకెలా తెలుసు?”

“మా నాన్నే చెప్పాడు. ఇదంతా నిగ్గర్లు చేస్తున్నది. ఆ దొంగ నాకొడుకులకి మనమంటే అసూయ. వాళ్ళు సొంతంగా ఏం చేసుకోలేక.. మన మీద పడి… మనకున్నవన్నీ లాగేసుకోవాలని చూస్తున్నారు. ఇది మా నాన్న ఫేక్టరీలోనే అనుకోకండి. ఇలా వొదిలేస్తే కొన్నాళ్ళకి… మీ నాన్నల వుద్యోగాలూ… మీ ఇళ్ళూ… అన్నీ… అన్నీ వాళ్ళ చేతుల్లో కెళ్ళిపోతై.”

జిమ్మీ మాటల్ని ఇద్దరూ కళ్ళు పెద్దవి చేసి వింటున్నారు. కిరణ్‌ కి తెలిసినంత వరకూ జిమ్మీ అంత తెలివైన వాడు కాదు. అసలు వాడు వీళ్ళ కంటే రెండేళ్ళు పెద్దవాడు, చదువులో వెనక బడి వీళ్ళ క్లాసులోనే చదువుతున్నాడు. ఇవ్వాళ్ళ వీడింత సీరియస్‌ గా ఈ విషయం చెబుతుంటే, వాణ్ణి నమ్మాలో వద్దో కిరణ్‌ కి అర్థం కాలేదు. అలాగని జిమ్మీ మొహంలో సీరియస్‌ నెస్‌ చూస్తూ నమ్మకుండానూ ఉండలేక పోతున్నాడు.

ఇంతలో పీయే సిస్టం లో వాళ్ళ ప్రిన్సిపాల్‌ గొంతు వినబడింది.

“ప్రియమైన విద్యార్థులారా! మన స్కూల్‌ బోర్డ్‌ వారి నిర్ణయం ప్రకారం, మన కౌంటీలోని బీద విద్యార్థులకి చేయూత నివ్వడం కోసం, వంద మంది బీద విద్యార్థుల్ని మన బళ్ళో చేర్చుకుంటున్నామని చెప్పటానికి మేమెంతో సంతోషిస్తున్నాం. మీరందరూ ఈ కొత్త పిల్లల్ని ఆదరంతో ఆహ్వానించి మీలో కలుపు కుంటారనీ, మన బళ్ళో చదువుకోవటం వల్ల ఆ విద్యార్థులూ ఎంతో లాభం పొంద గలరనీ ఆశిస్తున్నాం.”

ఈ మాటలు వినగానే జిమ్మీ రెండు చేతుల్లోనూ జుట్టు పట్టుకుని, జుగుప్స మొహమంతా నిండిపోతుంటే, మోచేతులు బల్ల మీద ఆనించి, “ఓ గాడ్‌!” అన్నాడు.

బ్రయన్‌ కిరణ్‌ ప్రశ్నార్థకంగా చూశారు.

“మీకింకా అర్థం కాలా? కౌంటీలో బీద విద్యార్థులంటే ఎవరు? నిగ్గర్‌ లంజ కొడుకులే!”

బ్రయన్‌ తనకి పరమ రహస్యం అర్థమై పోయినట్టు, “ఔనౌను. ఈ నిగ్గర్లని మన బళ్ళో చేర్చుకుంటే బడి పందుల దొడ్డై పోతుంది,” అన్నాడు.

కిరణ్‌ కి ఏమనాలో అర్థం కాలా. మౌనంగా వుండిపోయాడు.

జిమ్మీ మళ్ళీ అందుకున్నాడు, “నన్ను కోసి ఉప్పు పాతరేసినా సరే, నేను ఆ పంది వెధవల్తో స్నేహం చెయ్యను! నువ్వే మంటావు బ్రయన్‌?”

“నేను కూడా అంతే. మన క్లాసులో ఎవరన్నా చేరితే వాళ్ళని పందులకన్నా హీనంగా చూడాలి. అంతే కాదు, మన వాళ్ళల్లో ఎవరన్నా వాళ్ళతో స్నేహం చేసినట్టు తెలిస్తే.. వాళ్ళని కూడా వెలెయ్యాలి.”

ఇద్దరూ కిరణ్‌ వేపు చూశారు, వాడి ఆమోదం కోసం. వాడికెందుకో మనసొప్ప లేదు, ముక్కూ మొహం తెలీని మనుషుల్ని అకారణంగా ఇలా ద్వేషించటం. కానీ తన స్నేహితుల్ని చూస్తే ఈ విషయంలో చాలా సీరియస్‌ గా వున్నట్టు కనిపిస్తున్నారు. ఎవరో అనామకుల కోసం తన స్నేహాన్ని బలివ్వటం ఎందుకు? బ్రయన్‌ జిమ్మీల స్నేహం ముఖ్యం తనకి. ఒక నిర్ణయానికి వచ్చి, అంగీకారంగా తలూపాడు.

“నేను కూడా నిగ్గర్లతో స్నేహం చెయ్యకుండా వెలేస్తాను!”

******

కుర్చీలో తల వంచుకుని కూర్చున్న కొడుకుని తేరిపార చూశాడు శంకర్‌. భుజాలు కుదించుకుని, రెండు చేతుల బొటన వేళ్ళనీ మెలేస్తూ విడ దీస్తూ కిరణ్‌ పోజులో నిర్లక్ష్యమూ ధిక్కారమూ సమపాళ్ళలో కనిపిస్తున్నా రవ్వంత కలవరపాటు కూడా తొంగి చూస్తుండటం అతను గమనించక పోలేదు. హాస్పిటల్లో పనిలో వుండగా రాజ్యలక్ష్మి ఫోన్‌ చేసి కంగారుగా చెప్పిన విషయం. మొదట శంకర్‌ కి అర్థం కాలేదు. కిరణ్‌ డిటెన్షన్‌ లోనా? నమ్మలేక పోయాడు. తన పని ఇంకో డాక్టర్‌ కి అప్పగించి ఆదరా బాదరాగా స్కూల్‌ చేరుకుని ప్రిన్సిపల్ని కలిశాడు. ఆవిడ చెప్పిన విషయం: కేఫ్టీరియాలో బ్రయన్‌ జిమ్మీలతో కలిసి కిరణ్‌ ఆఫ్రికన్‌ అమెరికన్‌ లని గురించి అసహ్యంగా మాట్లాడు తుండగా అది అటుగా వెళ్తున్న ఒక టీచర్‌ విన్నాడనీ, ఆయన ప్రిన్సిపాల్కి చెప్తే, ఆవిడ వాళ్ళని పిలిపించి ప్రశ్నించగా వాళ్ళు పెదవి విప్పలేదనీ, అందుకని పిల్లల తల్లి దండ్రులే వాళ్ళని ఈ విషయం కనుక్కుని తగిన చర్య తీసుకోవాలనీ.

కొడుకుని కార్లో ఎక్కించుకుని ఇంటికొచ్చాడు శంకర్‌, దారి పొడుగునా ఈ సమస్య నెలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ. జాగ్రత్తగా హాండిల్‌ చెయ్యాలి అనుకున్నాడు.

ఫుట్‌ స్టూల్ని కిరణ్‌ కి ఎదురుగా లాక్కుని కూర్చుని, ఒక చేత్తో కిరణ్‌ గడ్డం పట్టుకుని తల పైకెత్తుతూ,

“ఏం జరిగింది కన్నా?” అనడిగాడు అనునయంగా.

కిరణ్‌ తల ఎత్తనిచ్చి, ఒకసారి తండ్రి కేసి చూసి మళ్ళీ తల దించేసుకున్నాడు.

“చూడు కన్నా, మేం నిన్నెప్పుడూ ఏ విషయంలోనూ బలవంత పెట్ట లేదు. మంచి వ్యక్తిత్వం కల మనిషిగా నువ్వు ఎదగాలన్నదే మా కోరిక. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది అందరం కలిసి సాల్వ్‌ చేసుకోవాలి. నాకు సాధ్యమైనంతలో విషయాలన్నీ నీకు అర్థమయ్యేట్టు చెప్పటానికి ప్రయత్నిస్తూనే వున్నా. అంతే కానీ, జరిగిన పొరపాటేదో నీవల్లే జరిగిందనీ, దానికి నిన్ను శిక్షించాలనీ మేవెప్పుడూ డిక్టేటర్లాగా బిహేవ్‌ చెయ్యలేదు. అవునా?”

అవునన్నట్టు తలూపాడు కిరణ్‌.

“మనం ఒకే టీంలో వున్నాం. మీ ప్రిన్సిపల్‌ నివ్వు తప్పు చేశావ్‌ అన్నారు. నువ్వు చేసిందేవిటో, ఎందుకు చేశావో నీ వేపునుంచి నాకు తెలియక పోతే నేను నిన్నెలా సమర్థించ గలను? అందుకని… భయపడకుండా జరిగిందేంటో వివరంగా చెప్పు.”

కిరణ్‌ తల ఎత్తకుండానే ఆవేశం ధ్వనిస్తూ అన్నాడు,

“మరి వాళ్ళు… వాళ్ళు మనింటినీ, స్కూళ్ళనీ… నీ వుద్యోగాన్నీ లాగేసుకోవాలని చూస్తున్నారు!”

“వాళ్ళా? వాళ్ళంటే…?”

“నిగ్గర్లు”

కోపం కంటే కొడుకు నోట ఆ మాట వచ్చినందుకు శంకర్‌ కి బాధే ఎక్కువ కలిగింది. నెమ్మదిగా మొదలెట్టాడు.

“ఒక మాట చెప్తాను కన్నా, వింటావా? నువ్వు వుపయోగించిన మాట మంచిది కాదు, నీకు తెలుసో లేదో. అది ఒక జాతి నంతటినీ ఇన్సల్ట్‌ చేసే తిట్టు. వాళ్ళని గురించి చెప్పాలంటే ఆఫ్రికన్‌ అమెరికన్‌ అనడం పరిపాటి. వాళ్ళెవరో నీకు పర్సనల్‌ గా తెలియునప్పుడు… ఆ జాతి ప్రజలందర్నీ ఇన్సల్ట్‌ చేస్తూ మాట్లాడ్డం తప్పు కాదూ?”

కిరణ్‌ ఒక్క నిముషం మాట్లాడ లేదు. ఏదో గుర్తొచ్చినట్టు సడన్‌ గా తలెత్తి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు,

“ఆ రోజు.. శ్రీధర్‌ అంకుల్‌ వాళ్ళు మనింటికి వచ్చినప్పుడు… శ్రీధర్‌ అంకుల్‌.. వాళ్లింటిపక్కన నిగ్గర్‌ ఫేమిలీ చేరిందనీ… తమకి భయంగా వుందనీ అనలేదూ?… వాళ్ళని గురించి అసహ్యంగా మాట్లాడలేదూ? మరి అంకుల్తో నువ్వీ సంగతి చెప్పలేదేం?”

శంకర్‌ నిరుత్తరు డయ్యాడు. కిరణ్‌ కళ్ళు నిలదీస్తున్నై. పెరుగుతున్న పిల్లల మధ్య పెద్ద వాళ్ళు మాట్లాడే ప్రతిమాటా ఆ పసి మనసుల మీద ఎంత బలంగా ముద్ర వేస్తుందో ఛెళ్ళున కొట్టినట్టు గ్రహింపు కొచ్చింది. తప్పు ఒప్పుకోక తప్పింది కాదు.

“నిజమే కన్నా. శ్రీధర్‌ అలా మాట్లాడ కోడదు. అతను చెప్పింది విని నేనలా ఊరుకుండ కోడదు. డెఫినెట్‌ గా అప్పుడే శ్రీధర్ని అప్పోజ్‌ చేసి వుండల్సింది. నౌ ఐ రిపెంట్‌ మ్య్‌ మిస్టేక్‌. థేంక్స్‌ ఫర్‌ టెల్లింగ్‌ మీ. ఇలాంటిది మళ్ళీ జరక్కుండా నా శయ శక్తులా ప్రయత్నిస్తాను. కమింగ్‌ బాక్‌ టు వాట్‌ వుయ్‌ ఆర్‌ డిస్కసింగ్‌… వాళ్ళ మీద నీకెందుకు అంత కోపం… వాళ్ళు నిన్నేం చేశారు?”

“చెప్పాగా! ఆ నిగ్గ… ఆఫ్రికన్‌ అమెరికన్లు మన వస్తువుల్నీ అన్నిట్నీ లాగేసుకుని నాశనం చెయ్యాలని చూస్తున్నారు.”

ఈ ఏహ్య భావమేదో కొడుకులో బలంగా వేళ్ళు పాతుకుందని గ్రహించాడు శంకర్‌. దీనికి విత్తనం ఎక్కడ పడిందో ఊహించ గలడు. ఈ క్షణంలో తను కోప్పడితే… ఒకపక్క కిరణ్‌ భావాలు ఇంకా పటిష్ఠం కావటం అటుంచి, ముందు వాడు తనతో మాట్లాడ్డం మానేసే ప్రమాదం వుంది. దీన్ని మెత్తగానే నరుక్కు రావాలి. ఉబికిన ఉద్రేకాన్ని అణిచిపెట్టి మామూలుగా అడిగాడు,

“ఈ సంగతి నీ కెవరు చెప్పారు?”

“ఎవరూ చెప్పక్కర్లా, నాకే తెలుసు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అందుకని ముందు మా స్కూల్లో చేరతారు. రేపు జిమ్మీ వాళ్ళ నాన్న వుద్యోగం పోతుంది. ఆ తరవాత నీ వుద్యోగమూ, బ్రయన్‌ వాళ్ళ ఇల్లూ… అన్నీ పోతాయ్‌… వాళ్ళు లాగేసుకుంటారు. మనం హేపీగా వుంటం వాళ్ళ కిష్టం లేదు.”

“మనం? మనమంటే ఎవరు?”

“మనమంటే… నువ్వూ, నేనూ… బ్రయన్‌ వాళ్ళూ.. జిమ్మీ వాళ్ళూ.. మనందరం…”

దీర్ఘంగా నిట్టూర్చాడు శంకర్‌. కొద్ది క్షణాలు మౌనంగా ఆలోచనల్ని కూడదీసుకుని మొదలెట్టాడు.

“జిమ్మీ తోటీ, బ్రయన్‌ తోటీ నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోడం నాకెంతో ఆనందంగా వుంది. మరి ఆఫ్రికన్‌ అమెరికన్లతో గూడా అలా ఎందుకు ఐడెంటిఫై చేసుకోవు?”

“వాళ్ళు నల్లవాళ్ళూ!” రికాయిల్‌ లాగా వచ్చింది జవాబు.

“అంటే వాళ్ళ వొంటి రంగు వేరన్న మాట! ఎప్పుడన్నా నీ వొంటి రంగునీ బ్రయన్‌ వొంటి రంగుతో కంపేర్‌ చేసుకున్నావా? అవి రెండూ ఒకేలా వున్నాయా?”

అనుకోని ఈ ప్రశ్నకి కిరణ్‌ బిత్తర పోయాడు. తికమక పడ్డాడు. తను బ్రయన్‌ జిమ్మీలకంటే ఏ విధంగానూ భిన్నంగా వున్నానని వాడు ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా నాన్నా విషయం వేరు వాళ్ళు అప్పుడప్పుడూ వాళ్ళ ఇండియన్‌ వేష భాషల్నీ పధ్ధతుల్నీ పాటిస్తుంటారు. కానీ తను… తనకీ బ్రయన్‌ కీ తేడా ఏముంది, ఏమీ లేదు! వొంటి రంగు వేరయితే మాత్రం….?

“బ్రయన్‌, జిమ్మీ నా ఫ్రెండ్స్‌!” అన్నాడు, ఈ పరమ సత్యాన్ని ఎలా భేదిస్తావో చూస్తానన్న సవాల్‌ ధ్వనిస్తూ.

శంకర్‌ పైకి గంభీరంగానే వున్నా లోపల నవ్వుకున్నాడు. ఇదంతా స్నేహ బలం ప్రభావమన్న మాట.

“కరక్ట్‌. బ్రయన్‌ జిమ్మీ నీ ఫ్రెండ్స్‌. అందుకని మీలో తేడాలున్నా అవి నీకు కనిపించవ్‌.. మీ స్నేహానికి అడ్డం రావు. స్నేహమంటే అలాగే వుండాలి. అయితే ఇప్పుడు నిన్నొక ప్రశ్నడుగుతా. బాగా ఆలోచించి సమాధానం చెప్పు”

కిరణ్‌ కుతూహలంగా చూశాడు.

“బ్రయన్‌ లాగానే ఒక నల్ల అబ్బాయి నీకు మంచి ఫ్రెండయ్యాడనుకో. ఆ అబ్బాయికీ, నీకు మల్లేనే టాం సాయర్‌ అన్నా, పవర్‌ రేంజర్స్‌ అన్నా, నింటెండో అన్నా, స్విమ్మింగ్‌ అన్నా చాలా ఇష్టం అనుకో. మీరిద్దరూ కలిసి ఎన్నో ఏక్టివిటీస్‌ చెయ్యచ్చు. ఎన్నో గేంస్‌ ఆడుకోవచ్చు. కలిసి పుస్తకాలు చదూకోవచ్చు.” ఒక్క క్షణం ఆగాడు.

వింటున్నానన్నట్టు తలూపాడు కిరణ్‌. శంకర్‌ కంటిన్యూ చేశాడు.

“నౌ దిసీజ్‌ ద క్వశ్చెన్‌. బ్రయన్‌ తో నీ స్నేహానికీ, ఈ నల్లబ్బాయితో నీ స్నేహానికీ తేడా ఏవిటి, మీ ముగ్గురి వొంటి రంగులు తప్ప?”

కిరణ్‌ తీవ్రంగా ఆలోచించాడు. నిజమే, నాన్న అన్నట్టు తన వొంటి రంగు బ్రయన్‌ జిమ్మీల కంటే నాలుగైదు చాయలు నల్లగానే వుంటుంది. అంత మంచి ఫ్రెండ్‌ దొరికితే ఆ ఫ్రెండ్‌ నల్లగా వుంటేనేం? ఆ మాటకొస్తే, అలాంటి అబ్బాయి తనకి తగిల్తే వాడితో స్నేహం చెయ్యడనికి తనకే అభ్యంతరమూ లేదు.

ఈ ఆలోచనతో పాటే, నల్లవాళ్ళ మీద బ్రయన్‌ జిమ్మీలకున్న కోపం అసహ్యం గుర్తొచ్చాయి. ఈ కొత్త నల్ల పిల్లాడితో తను స్నేహం చేస్తే వాళ్ళు తనని కూడా వెలేస్తారు. కొత్త స్నేహం కోసం… తన ప్రాణ స్నేహితుల్ని వొదులుకోవాలా?

అ మాటే అడిగాడు శంకర్ని.

“… మరి బ్రయన్‌ వాళ్ళు నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కదా! అండ్‌ దే హేట్‌ బ్లాక్‌ పీపుల్‌. నేనొక నల్ల పిల్లాడితో స్నేహం చేస్తే… దే విల్‌ హేట్‌ మీ టూ!”

“ఫస్ట్‌, సరైన నిర్ణయాని కొచ్చినందుకు నీకు కంగ్రాచ్యులేషన్స్‌. స్నేహం చేసేందుకు వొంటి రంగు అడ్డం కాదనీ, రంగు నల్లగా వున్నంత మాత్రాన మనుషులు చెడ్డవాళ్ళు కాదనీ గ్రహించావు కదా?”

కిరణ్‌ అంగీకారంగా తలూపాడు.

“నువ్వు ఇవ్వాళ్ళ స్కూల్లో ఆఫ్రికన్‌ అమెరికన్ల గురించి అలా మాట్లాడ్డం తప్పేనా?”

“తప్పే. అయాం రియల్లీ సారీ. అయాం ఎషేండ్‌ దట్‌ ఐ సెడ్‌ దోజ్‌ థింగ్స్‌.”

“గుడ్‌. సారీ నాక్కాదు. రేపు వెళ్ళి మీ ప్రిన్సిపల్‌ కి చెప్పాలి, ఓకే?”

“ఓకే…. కానీ… నువ్వు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు. నేను నల్ల పిల్లల్తో స్నేహం చేసినందుకు బ్రయన్‌ వాళ్ళు నన్ను కూడా హేట్‌ చేస్తే..?”

“చూడు కన్నా! ఇది చాలా పెద్ద విషయం. పెద్ద వాడివయ్యే కొద్దీ నీకే అర్థమౌతుంది. మీ బడి పాఠాల్లో వివరంగా చెబుతారు ఈ చరిత్ర. ఐనా ఇప్పుడు టూకీగా చెబుతాను…”అంటూ ఆఫ్రికన్‌ అమెరికన్ల చరిత్ర సింపుల్‌ గా చెప్పుకొచ్చాడు. చెప్పి ఇలా ముగించాడు.

“… ఎందరో ఆఫ్రికన్‌ అమెరికన్లు అన్ని రంగాల్లోనూ గొప్ప విజయాలు సాధించారు. అన్‌ ఫార్చ్యునేట్లీ, చాలా మంది ఇంకా బీదరికం తోనూ, ఇతర బాధల్తోనూ కుస్తీ పడుతున్నారు.  అలాగని తెల్ల అమెరికన్లు మాత్రం అందరూ సుఖంగా వున్నారా? అంచేత, అందరూ మనుషులే.. వీళ్ళందరూ అమెరికన్లే. నువ్వు మంచి అమెరికన్‌ గా, మంచి మనిషివిగా ఇతరుల్లో మంచి తనాన్ని గుర్తించాలి. ఇక బ్రయన్‌ వాళ్ళంటావా, మీ ఫ్రెండ్‌ షిప్‌ బలమైనదైతే వాళ్ళు గూడా నీ పధ్ధతే రైటని గుర్తించి వాళ్ళ పధ్ధతుల్ని మార్చుకుంటారు.’

“థాంక్యూ నాన్నా, ఫర్‌ టెల్లింగ్‌ మీ ఆల్‌ దిస్‌. నౌ ఐ విల్‌ గో అండ్‌ రైటె లెటర్‌ టు అవర్‌ ప్రిన్సిపల్‌… అపాలజైజింగ్‌ ఫర్‌ మై బిహేవియర్‌.”

*****

కిరణ్‌ ఎక్కేప్పటికి స్కూల్‌ బస్‌ ఇంచుమించు సగం నిండి వుంది. కొంతమంది పిల్లలు గ్రూపులుగా కూర్చుని గోలగా కబుర్లు చెప్పుకుంటుంటే మిగతా వాళ్ళు మాత్రం సీటుకొక్కరే కూర్చుని కిటికీల్లోంచి బయటకి చూస్తున్నారు. బస్‌ లో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా వున్న ఒక సీట్‌ మాత్రం గోడ నానుకుని వుంటుంది. అందులో కూర్చుంటే తల తిప్పకుండానే ఎదురుగా వున్న కిటికీలోంచి బయటకి చూస్తూండవచ్చు. ఆ సీట్లో కూర్చోవటం కిరణ్‌ కిష్టం. వాడు ఆ సీట్‌ ని చేరేప్పటికి దాంట్లో ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ అబ్బాయి కూర్చుని వున్నాడు. కిరణ్‌ అక్కడే ఆగిపోయి ఆ అబ్బాయిని తేరిపారా చూస్తూ నుంచుండి పోయాడు, సభ్యత కూడా మర్చి పోయి. ఆ అబ్బాయీ కిరణ్‌ తనవేపే చూస్తుండడం చూసి పలకరింపుగా నవ్వాడు. నల్లటి మొహంలో ఆరోగ్యవంతమైన తెల్లటి పల్వరస తళుక్కున మెరిసింది నీలి మేఘంలో మెరుపుతీగలా. కిరణ్‌ ఒక్క క్షణం పాటు తటపటాయించాడు బస్సులో సీట్లు కొన్ని ఖాళీగానే వున్నై వేరే సీట్లో కూర్చుందామా అని. వాడు డిసైడ్‌చేసుకునే లోపలే, ఆ అబ్బాయే పలకరించాడు.

“హాయ్‌, నేనేవన్నా పొరపాట్న నీ సీట్‌ తీసుకున్నానా? అయాం సారీ!” అంటూ లేవబోయాడు. కిరణ్‌ తడబడి, “నో, నో, ప్లీజ్‌ సిట్‌!” అని తనుకూడా ఆ అబ్బాయి పక్కన చతికిల బడ్డాడు. కిరణ్‌ కి వాళ్ళ నాన్న చెప్పిన హితవు గుర్తొచ్చింది. క్రీగంట పక్కన కూర్చున్న కుర్రాణ్ణి గమనించాడు. వాడికీ సుమారు తన వయసే వుంటుంది. చూడ్డానికి ఆరోగ్యంగానూ నీట్‌ గానూ వున్నాడు. ఇంతలోనే వాడు కూడా కిరణ్‌ వేపు చూడ్డంతో చూపులు కలిశాయి. ఆ అబ్బాయి స్నేహపూర్వకంగా నవ్వాడు. ఎందుకో ఆ నవ్వు చాలా నచ్చింది కిరణ్‌ కి.

అప్రయత్నంగానే “హాయ్‌” అన్నాడు.

“హాయ్‌, నా పేరు మేథ్యూ. నా ఫ్రెండ్స్‌ మాట్‌ అని పిలుస్తారు. నువ్వు కూడా అలాగే పిలవ్వొచ్చు. ఈ స్కూల్లో ఇదే నా మొదటి రోజు.”

“నా పేరు కిరణ్‌. నేను ఫస్ట్‌ గ్రేడ్‌ నుంచీ ఈ స్కూల్లోనే చదువుతున్నా.”

“అలాగా! నేను ఫిఫ్త్‌ గ్రేడ్లో చేరుతున్నా”

“రియల్లీ! నేను కూడా ఫిఫ్త్‌ గ్రేడే.”

“భలే! ఐతే మనం ఒకే క్లాసన్న మాట. మనం ఫ్రెండ్స్‌ అవ్వొచ్చు నీకిష్టమైతే. విల్‌ యూ బి మై ఫ్రెండ్‌, కిరణ్‌?”

కిరణ్‌ కుతూహలానికి ఆనకట్ట పడింది ఈ ప్రశ్నతో. తను మాట్‌ తో స్నేహం చేస్తే బ్రయన్‌ జిమ్మీ తన నెలా చూస్తారో ఊహించు కున్నాడు. ఆఫ్రికన్‌ అమెరికన్లని గురించి వాళ్ళ మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటల్ని మాట్‌ కి అన్వయించటానికి ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా పొంతన కుదర్లా. సడన్‌ గా మాట్‌ ని అడిగాడు,

“నీకు టాం సాయర్‌ అంటే ఇష్టమా?”

“యా! కానీ టాం సాయర్‌ కంటే హకల్‌ బెర్రీ ఫిన్‌ అంటే ఇంకా ఇష్టం.”

“పవర్‌ రేంజర్స్‌? నింటెండో?”

“అవి కూడా భలే ఇష్టం నాకు. పవర్‌ రేంజర్స్‌ ఇప్పుడింక టీవీలో రావట్లేదుగా… ఇదివరకు మా అమ్మ చాలా ఎపిసోడ్స్‌ రికార్డ్‌ చేసి పెట్టింది…”

ఇద్దరూ తమకి నచ్చిన రేంజర్స్‌ ఎపిసోడ్స్‌ నీ, విడియో గేంస్‌ నీ డిస్కస్‌ చెయ్యటంలో పడిపోయారు. నాన్న చెప్పిన కాల్పనిక స్నేహితుడు మేథ్యూనేమో అనిపించింది కిరణ్‌ కి. మాటల్లో మాట్‌ దగ్గిర నింటెండో లేదనీ, ఎప్పుడన్నా ఫ్రెండ్స్‌ ఇళ్ళకెళ్ళినప్పుడు మాత్రమే ఆడుతుంటాడనీ కిరణ్‌ కి తెలిసింది. వచ్చే శనివారం వాళ్ళ నాన్న నడిగి మేథ్యూని తమ యింటికి తీసుకొచ్చి ఆ రోజంతా నింటెండో ఆడుకోవాలని నిర్ణయించేసు కున్నాడు.

బస్సు స్కూల్‌ ఆవరణలో ప్రవేశించేప్పటికి ఇద్దరి మధ్యా స్నేహం కుదిరి పోయింది. మేథ్యూ తో చేతులు కలిపి బస్‌ దిగుతుంటే కిరణ్‌ మెదడులో మళ్ళీ ఆందోళన మొదలైంది, బ్రయన్‌ జిమ్మీ ఏమంటారో నని. దాని వెంటనే ఒక కొత్త ఆత్మ విశ్వాసం కూడా గుండెలో మొలకెత్తింది. మేథ్యూ ని చూస్తే వాళ్ళే తమ అభిప్రాయం తప్పని ఒప్పుకుంటారు. తను చేసేది తప్పు కానప్పుడూ, ఆ పని తన కెంతో ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడూ, ఇంకోళ్ళెవరో ఏదో అంటారని ఎందుకు భయపడాలి? ఆ ఆత్మ విశ్వాసం వాడి వేళ్ళ కొసల దాకా పాకింది. కొత్త స్నేహితుడి చేతిమీద తన చెయ్యి మరి కాస్త బిగించి, కిరణ్‌ కొత్త బలంతో స్కూల్‌ బిల్డింగ్‌ లో అడుగు పెట్టాడు.

********

శంకర్‌ కి ఆరోజు ఎమర్జెన్సీ రూం లో డ్యూటీ. రెండు మూడు చిన్న కంప్లైంట్లు తప్ప వేరే రద్దీ లేదు. ఉన్న పేషంట్లందర్నీ ఒకసారి చెక్‌ చేసి ఫిజిషియన్‌ రూం లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అటు తిరిగీ ఇటు తిరిగీ శంకర్‌ ఆలోచనలు కిరణ్‌ మీదికి మళ్ళాయి. వాడి సందిగ్ధం తను అర్థం చేసుకో గలడు. ఆ వయసులో పరిసర వాతావరణం ప్రభావం వాడి లేత మనసు మీద ఎంత వత్తిడి తీసుకొస్తుందో తనకి తెలుసు. తన తోటి వాళ్ళలో ఒకడుగా కలిసి పోవాలని వాడు పడే తాపత్రయం తనకీ ఆ వయసులో అనుభవమే. కాకపోతే తను కులం పట్టింపునే ఎదుర్కో వలసి వచ్చింది. కిరణ్‌, ఇక్కడ, తమకి పూర్తిగా భిన్నమైన సంస్కృతీ దృక్పథాలతో ఏర్పడ్డ ఈ అమెరికన్‌ సొసైటీలో… ఇంట్లో కల్చర్‌ కీ బయట ఎదురయ్యే కల్చర్‌ కీ సమన్వయం కుదరక… ఇక్కడ పెరిగే ఇండియన్‌ అమెరికన్‌ పిల్లల బాధ వాళ్ళ తల్లి దండ్రులు ఎంత వరకూ అర్థం చేసుకోగలరు?

ఏమైనా మేథ్యూ విషయంలో కిరణ్‌ చూపించిన అవగాహన, ఆత్మ స్థైర్యం తనకే ఆశ్చర్యం కలిగించాయి. మాట్‌ తో పరిచయమైన ఈ మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళకి బాగా స్నేహం కుదిరి పోయింది. అప్పటి తన బెస్ట్‌ ఫ్రెండ్‌ బ్రయన్‌ తనని వెలేసినట్టు చూస్తాడని తెలిసి కూడా వాడు మేథ్యూతో స్నేహం చెయ్యడం… నిజంగా వండర్‌ ఫుల్‌. ఇవ్వాళ్ళ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ డేకి స్కూలుకి శలవైనా, ఆ మహానుభావుడి జ్ఞాపకార్థం బడివాళ్ళు నిర్వహిస్తున్న ఫమ్క్షన్‌ కి మాట్‌ నీ కిరణ్‌ నీ బళ్ళో దింపి తను డ్యూటీ కొచ్చాడు. జస్ట్‌ నాలుగు నెల్ల క్రితం ఆఫ్రికన్‌ అమెరికన్ల గురించి రేషియల్‌ స్లర్స్‌ విసిరిన కారణంగా డిటెన్షన్‌ పాలైన కిరణ్‌, ఈ రోజు వేడుకల్లో మాట్‌ తో కలిసి స్టేజ్‌ మీద కింగ్‌ గారి ‘ఐ హావె డ్రీమ్‌ స్పీచ్‌ చదివే స్థాయికి ఎదగటం తనకి నిజంగా గర్వం కలిగించింది. ఈ వెధవ డ్యూటీ లేకపోతే తనుకూడా ఆ ఆడిటోరియంలో వుండేవాడు. ఈ పాటికి వాళ్ళ స్పీచ్‌ అయిపోయుంటుంది.

శంకర్‌ ఆలోచనలకి అంతరయం కలిగిస్తూ రేడియో రిసీవర్‌ గొంతు విప్పింది. అది ఆంబులెన్స్‌ నుంచి వస్తున్న మెసేజ్‌.

“…. స్కూల్లో షూటింగ్‌ జరిగింది. ఇరవై మంది దాకా తీవ్రంగా గాయ పడ్డారు. పది మందిని మన హాస్పటల్‌ కి తీసుకొస్తున్నాం. దయ చేసి ఆపరేషన్లకి సిధ్ధంగా వుండండి….” అంటూ గాయపడిన వారి పరిస్థితి చెబుతూ పోయింది అ గొంతు.

శంకర్‌ కోటు తొడుక్కుని రిసీవింగ్‌ స్టేషన్‌ కి పరిగెత్తాడు. అప్పటికే నర్సులూ, డాక్టర్లూ, ఆర్డర్లీలూ వస్తున్న పది మందినీ రిసీవ్‌ చేసుకునేందుకు సిధ్ధపడుతున్నారు. రానే వచ్చాయి ఆంబులెన్సులు, గుండెలు పగిలే శోకంతో మొరపెడుతున్న సైరన్ల అరుపులతో. చకచకా పేషెంట్లని గర్నీల మీద కెక్కించటం, శరవేగంగా పరీక్ష చెయ్యటం, ఎవరికెంత గాయాలు తగిలాయో… దానికి తగిన చికిత్స పురమాయించటం. ఒక నడివయసు టీచరూ… మిగతా తొమ్మిది మందీ పిల్లలూ. శంకర్‌ నలుగురు పిల్లల్ని చెక్‌ చేశాడు. ఎవరికీ ప్రాణాపాయం లేదు కానీ, అందరూ షాక్‌ లో వున్నారు. రక్తం చాలా పోయింది. తను చూసిన నాలుగో పేషెంటుకి రక్తం ఎక్కించమని శంకర్‌ నర్సుకి చెప్తుండగా అవతలి టేబుల్నించి ఇంకో డక్టర్‌ పిలిచాడు,

“శంకర్‌, ఐ నీడ్‌ సం హెల్ప్‌ హియర్‌!”

తన పేషెంట్‌ ని నర్సు కప్పగించి అటు పరిగెత్తాడు. టేబుల్‌ మీద చిన్న శరీరం. నల్ల అబ్బాయి, సుమారు పదేళ్ళుంటాయి. మూడు బుల్లెట్లు తగిలాయి. ఒకటి తొడలోకీ ఇంకోటి చేతికీ తగిలాయి. మూడోది మాత్రం ఛాతీలోకి చొచ్చుకు పాయింది. గుండెకో ఊపిరి తిత్తులకో బలమైన దెబ్బ తగిలి వుండచ్చు. రక్త నష్టం కాకుండా కట్లు కట్టి ఆపరేషన్‌ కి తరలిస్తుండగా శంకర్‌ ఆ పిల్లవాడి మొహం చూశాడు. మేథ్యూ! ఆ గుర్తింపు శంకర్‌ కి కొరడా దెబ్బలా తగిలింది. ఈ ఘాతుకం జరిగింది కిరణ్‌ స్కూల్లో… కిరణ్‌ కూడా మేథ్యూతోటే వుండి వుండాలి… నా కిరణ్‌…. కిరణ్‌ ఎక్కడ… ఆలోచించేందుకూ వెదికేందుకూ టైం లేదు. డాక్టర్‌ గా తన కర్తవ్యం తన చేతుల్లో వున్న ప్రాణాలు కాపాడాలి. ఒక్క క్షణం పాటు ఆ గర్నీ మీద నిర్జీవంగా పడున్నది కిరణే నన్న భ్రాంతి కలిగింది శంకర్‌ కి.

సర్జరీలో మాట్‌ కి మత్తు మందు ఎక్కిస్తుండగా వాడి కళ్ళు తెరుచుకున్నాయి. అది గమనించిన శంకర్‌ “మేథ్యూ, మాట్‌!” అని మృదువుగా పిలిచాడు. వాడి కళ్ళు ఆ గొంతు గుర్తు పట్టినట్టు లిప్తపాటు తళుక్కున మెరిశాయి. సన్న గొంతుతో, ‘కిరన్‌.. కిరన్‌.. సేఫ్‌…”అంటుండగానే మేథ్యూకి మత్తు ఆవహించింది.

స్కాల్పెల్‌ పట్టుకున్న శంకర్‌ చెయ్యి వణికి పోతోంది. పక్కనున్న సర్జన్‌ శంకర్‌ చెయ్యి పట్టుకుని అడిగాడు,

“డాక్టర్‌ శంకర్‌, ఆర్యూ ఆల్రైట్‌?”

“నో. ఐ డోంట్‌ థింక్‌ ఐ కెన్‌ కంటిన్యూ…” వణికే గొంతుతో అన్నాడు.

“లెట్‌ మీ టేకోవర్‌. ప్లీజ్‌ టేకె బ్రేక్‌.” అని ఆ సర్జన్‌ శంకర్‌ చేతులోంచి స్కాల్పెల్‌ తీసుకున్నాడు. శంకర్‌ కళ్ళలో అసంకల్పితంగా నీళ్ళు నిండిపోయి ధారలుగా కారిపోతున్నాయి.

సర్జరీ లోంచి బయటికొస్తుంటే బెల్టుకి తగిలించుకున్న పేజర్‌ చప్పుడు చేసింది. ఇంటి నుంచి. గబగబా ఫోన్‌ దగ్గరికి నడిచి ఇంటికి కాల్‌ చేశాడు. రాజ్యలక్ష్మే ఎత్తింది.

“నేనే. కిరణ్‌ కి…”

“ఏం కాలేదు, క్షేమంగానే వున్నాడు భగవంతుడి దయవల్ల…”

భార్య చెప్పే మాట లింకేవీ శంకర్‌ కి వినబళ్ళేదు. కొడుకు క్షేమంగా వున్నాడని తెలిశాక గుండెని పిండేస్తున్న ఉక్కు పిడికిలేదో ఒక్కసారిగా పట్టు సడలించినట్టు, బలంగా ఊపిరి పీల్చుకున్నాడు.

“ఆ… సరే. విక్టింస్‌ ని ఇక్కడికే తెచ్చారు. నేనే అటెండవుతున్నా. ఎమర్జెన్సీ పని పూర్తి కాగానే వచ్చేస్తా… ఇదుగో… ధైర్యంగా వుండు…”

మేథ్యూ విషయం ఆమెకి చెప్పలేదు. కిరణ్‌ కి తెలిస్తే తట్టుకోలేడు. మిగతా పేషెంట్లని చూస్తూ పనిలో మునిగి పోయాడుకానీ మెరుపులా నవ్వుతున్న మేథ్యూ మొహమే శంకర్‌ కళ్ళ ముందు కదలాడుతోంది. రెండు గంటల తరవాత ఊపిరి సలిపింది అతనికి. సర్జరీలో కెళ్ళిన ముగ్గురి మినహా మిగతా వాళ్ళు స్టేబుల్‌ కండిషన్లో వున్నారు. చేతులు కడుక్కుని సర్జరీ వేపు నడుస్తుంటే సర్జరీ తలుపు తెరుచుకుని సీనియర్‌ సర్జన్‌ బయటి కొచ్చాడు. శంకర్‌ ఆయన్ని పలకరించే లోపే ఆయనే చెప్పాడు,

“టఫ్‌ కిడ్‌. హి యీజ్‌ గోయింగ్‌ టు మేకిట్‌. తూటా గుండెకి ఒక్క అంగుళం పక్కగా పోయింది… లేక పోతే…”

శంకర్‌ భగవంతుడికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

ఇంటికి చేరగానే కారు తలుపు తాళం వేసేందుక్కూడా ఆగకుండా ఇంట్లోకి పరిగెత్తాడు శంకర్‌. రాజ్యలక్ష్మి ఎదురొచ్చింది.

“కిరణేడి?”

“తన గదిలో వున్నాడు.”

పైకి దారి తీస్తూ అడిగాడు.

“ఎలా వున్నాడు?”

“ఇంకా చాలా షాక్‌ లో వున్నట్టున్నాడు. అప్పుడప్పుడూ మేథ్యూ.. జిమ్మీ… అని గొణగడం తప్ప ఏం మాట్లాడ్డం లేదు. కనీసం ఏడవడం గూడా లేదు.”

కిరణ్‌ గదిలో ప్రవేశించారు. కిరణ్‌ కుర్చీలో వాలిపోయి వున్నాడు.

“కిరణ్‌!”

“నాన్నా, మేథ్యూ… జిమ్మీ …. గన్‌ ఫైర్‌…. మేథ్యూ …. బ్లడ్‌…”కళ్ళు నిస్తేజంగా పిచ్చి చూపులు చూస్తున్నాయి.

“కన్నా” అంటూ కొడుకుని ఎత్తేసుకుని గాఢంగా గుండెలకి హత్తుకున్నాడు శంకర్‌.

“మేథ్యూ క్షేమంగానే వున్నాడు. ఎమర్జెన్సీలో నేనే అటెండయాను. సర్జరీ ఇప్పుడే పూర్తైంది. హి యీజ్‌ గోయింగ్‌ టు బి ఓకే!”

రెండు క్షణాలకి ఆ మాటలు కిరణ్‌ మెదడులోకి ఇంకాయి. వాటి మహిమ వాడికి తగిలిన షాక్‌ ని పటాపంచలు చేసింది. తండ్రి చేతుల్లో వాడి వొళ్ళు చిగురుటాకులా కంపించింది. ఇప్పటి దాకా నిద్రాణంగా వున్న దు ఖం కట్టలు తెంచుకుని కన్నీళ్ళ ధారగా కురిసింది.

శంకర్‌ బెడ్‌ మీద కూర్చుని కిరణ్‌ ని ఒళ్ళో కూర్చో బెట్టుకుని తలా వీపూ మృదువుగా నిమురుతూ వుండిపోయాడు.

“ఓ గాడ్‌… మేథ్యూ… యు ఆర్‌ ఓకే…” కిరణ్‌  వెక్కుతూ వెక్కుతూనే స్నేహితుణ్ణి తల్చు కుంటున్నాడు. ఆ ఏడుపుతోటే జలపాతంలా బయటి కొచ్చింది కిరణ్‌ మనసులోనుంచి వాడి కళ్ళేదుటే జరిగిన ఘాతుకపు జ్ఞాపకం.

“నేనూ… మేథ్యూ… మా స్పీచ్‌ ముగించి స్టేజ్‌ దిగొచ్చాం. నాకు అర్జంట్‌ గా బాత్రూం కెళ్ళాల్సొచ్చింది. నేను వెళ్ళి తిరిగి ఆడిటోరియం లోకి వచ్చి స్టేజ్‌ వేపు నడుస్తుంటే… నా వెనకాల పెద్దగా టపాకాయలు పేల్తున్న చప్పుడు… నేను వెనక్కి తిరిగి చూశా. వెనగ్గా వున్న కుర్చీల వరసలో నుంచి జిమ్మీ లేచి నుంచుని వున్నాడు. వాడి చేతుల్లో … ఆటొమాటిక్‌ రైఫిల్‌ నిప్పులు కక్కుతోంది. వాడి మొహం వికృతంగా, విలన్‌ లాగా వుంది. వాడు నా ఫ్రెండ్‌ అంటే నమ్మలేక పోతున్నాను. వాడి ద్వేషం… ఇంత పని చేయించిందంటే… నేను మళ్ళీ స్టేజ్‌ వేపు చూసే సరికి… అప్పటికే మేథ్యూ కిందకి ఒరిగి పోతున్నాడు. నేను వాడి దగ్గరికి పరిగెత్తాను… వాడు కింద పడి కొట్టుకుంటున్నాడు. ఎక్కడ చూసినా నెత్తురు… ఆ నెత్తురు చూసి వాడు చచ్చిపోయాడనే అనుకున్నా. వాణ్ణి వదిలి పెట్టి నేను మాత్రం బాత్రూం కి ఎందుకెళ్ళాను? ఐ డిసెర్టెడ్‌ మై ఫ్రెండ్‌…”

ఆ జ్ఞాపకం తాలూకు బాధ మళ్ళీ వాడి ళేత శరీరాన్ని ఉప్పెనలా ఊపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని గట్టిగా కౌగలించుకుని కుర్చీలో ముందుకీ వెనక్కీ ఉయ్యాల ఊగుతుండి పోయాడు శంకర్‌. కొడుకు దు ఖానికి రాజ్యలక్ష్మీ కన్నీళ్ళు ఆపుకో లేక పోయింది. అలా ఏడ్చి ఏడ్చి కిరణ్‌ సొమ్మసిల్లి పోయాడు. శంకర్‌ కొడుకుని బెడ్‌ మీద పడుకో బెట్టి షాక్‌ తగ్గి నిద్ర పట్టేందుకు సెడేటివ్‌ ఇంజక్షనిచ్చాడు.

శంకర్‌, రాజ్యలక్ష్మి కిరణ్‌ బుగ్గల్ని మృదువుగా ముద్దాడి బయటికి వచ్చి గది తలుపు వెయ్యబోతుంటే, “నాన్నా” అని పిలిచాడు కిరణ్‌. తలుపు దగ్గర్నించి వెనక్కి చూశాడు శంకర్‌. మందు కప్పుతున్న మత్తుని ఎదిరిస్తూ కళ్ళు బలవంతంగా సగం తెరిచి కలలో మాట్లాడుతున్నట్టుగా అంటున్నాడు కిరణ్‌, “నాన్నా, నాకు తుపాకీ వొద్దు!”