రచన: అనిల్ ఎస్. రాయల్


 

విలక్షణమైన శీర్షిక, గొప్ప ఎత్తుగడ – ఇవి రెండూ కలిసి మీ కథని నలుగురూ చదివేలా చేస్తాయి. అంతటితో వాటి బాధ్యత తీరిపోతుంది. కథ పూర్తిగా చదివాక అది పాఠకుల మీద చెరిగిపోని ముద్ర వేయాలంటే మాత్రం ఆ కథకో గొప్ప ముగింపు అవసరం. ప్రతి కథకీ ఓ సంతృప్తికరమైన ముగింపు ఉండాలి. అంటే, కథలన్నీ తప్పకుండా సుఖాంతాలో లేక దుఃఖాంతాలో అయ్యి తీరాలని కాదు. మీ ముగింపు ఎలా ఉన్నప్పటికీ, అది పాఠకుల్ని మెప్పించాలి. దీనికి ఇదే సరైన ముగింపు అని వాళ్లని ఒప్పించాలి. అప్పుడే ఆ కథ వాళ్లకి గుర్తుండిపోతుంది.

‘ఎత్తుగడ’ భాగంలో ‘కథని ఎలా మొదలెట్టినా, ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అన్నాను. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి. పాఠకులకి మీరు కథలో లేవనెత్తే సందేహాలొక్కటే సరిపోవు. వాటికి సమాధానాలూ కావాలి. అవి అరటిపండు వలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెదుక్కోటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి. కథ ముగిసిపోయాక పాఠకుడు అయోమయానికి గురైనా, అసంతృప్తికి లోనైనా ఆ కథ గురి తప్పినట్లే.

సాధారణంగా కథలకి రెండు రకాల ముగింపులుంటాయి. ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైం, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ వగైరా genre కథలకి వర్తిస్తుంది. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధాన పాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనా విధానంలో కలిగే పరిణితి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం … ఇలాంటి విషయంతో ముగుస్తాయి. ఇది రెండో రకం ముగింపు. ఏ రకం కథలైనా, వాటి ముగింపుల్లో ఉండే సారూప్యత: మార్పు. ఆ మార్పుకి దారితీసిన పరిస్థితుల్ని విపులీకరించేదే కథ. సందర్భం ఎటూ వచ్చింది కాబట్టి, ఈ కథ అనే పదార్ధం గురించి మరికొంత వివరంగా మాట్లాడుకుందాం.

కథ ఏ తరహాకి చెందినదైనా, దానికి సాధారణంగా మూడు భాగాలుంటాయి: మొదలు, మధ్య, ముగింపు. మొదటి భాగంలో పాత్రల్ని ప్రవేశపెటటంతో పాటు వాటికున్న సమస్యని పరిచయం చేస్తాం. అది ఒక పాత్ర కావచ్చు, పది పాత్రలు కావచ్చు. ఆ పాత్ర సమస్య పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించటం కావచ్చు, నేరాభియోగం నుండి బయటపడటం కావచ్చు, ఏదో రహస్యాన్ని ఛేదించటం కావచ్చు, లేదా ఓ నైతికపరమైన డోలాయమాన పరిస్థితి కావచ్చు. స్థూలంగా ఈ భాగంలో జరిగేది, రచయిత ఓ ప్రశ్నని పాఠకుల ముందరుంచటం, ఆ ప్రశ్నకి సమాధానమేమయ్యుంటుందోననే కుతూహలం కలిగించటం. ఆ కుతూహలమే వాళ్లు మిగతా కథ చదివేలా చేస్తుంది.

మధ్య భాగంలో ఆ సమస్యని జటిలం చెయ్యటం, పీట ముడులు వెయ్యటం, వాటిని ప్రధాన పాత్రలు ఎలా ఎదుర్కొన్నాయో వివరించటం జరుగుతుంది. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో కథానాయకుడు ఎన్ని బాధలు పడ్డాడు; నైతికపరమైన చిక్కుముడిలో ఇరుక్కున్న కథానాయిక మనసులో ఎలాంటి అంతఃసంఘర్షణ చెలరేగింది, ఇత్యాదివి వర్ణించబడతాయిక్కడ. కథ లిటరరీ లేదా genre తరహాల్లో దేనికి చెందినదనేదాన్ని బట్టి ఈ భాగంలో మలుపులు, మెలికెలు, వగైరా యాక్షన్ పాళ్లు ఎక్కువుంటాయా లేక పాత్రల చిత్రణపై, వాటి మనసుల్లో చెలరేగే అలజడులపై కథనం కేంద్రీకరించబడుతుందా అన్నది ఆధారపడి ఉంటుంది. పాఠకులకి ఈ భాగంలో కథలోని ప్రధాన సమస్యపై అవగాహన పెరుగుతుంది, పాత్రలపై సానుభూతి లేదా సహానుభూతి మొదలవుతుంది. సమస్య లోతు తెలుస్తుంది. వాటి పరిష్కార మార్గాలపై అంతో ఇంతో అంచనా వస్తుంది. ఆ సమస్యనుండి పాత్రలు ఎలా బయటపడ్డాయోననే ఉత్సుకత కలుగుతుంది.

ఇక ముగింపులో ప్రధాన పాత్ర తన సమస్యనుండి బయట పడిందా లేదా, చివరికి ఏమయింది అనేది తెలిసిపోతుంది. అంటే కథానాయకుడు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడా లేదా, దాని పర్యవసానాలేమిటి; కథానాయిక కనుగొన్న జీవిత సత్యమేంటి, అది ఆమెలో ఎటువంటి మార్పు తెచ్చింది; వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి ఎవరు – ఈ చిక్కుముడులన్నీ ఈ భాగంలో విడిపోతాయి. పాఠకులు ఓపిగ్గా ఇక్కడిదాకా చదివేది ఆ ముక్క తెలుసుకోటానికే. ఈ భాగం వాళ్లని సంతృప్తిపరచలేకపోతే తమ సమయం వృధా చేసుకున్నట్లు భావిస్తారు. కథ చదవటం పూర్తయ్యాక పాఠకుల మనసులో ముద్రించుకుపోయేది దాని ముగింపే. కాబట్టి అది అత్యంత శ్రద్ధతో రూపుదిద్దాల్సిన అంకం. ఔత్సాహిక కథకులు చాలామంది ఇక్కడే తప్పులో కాలు వేస్తారు.

మీరో గొప్ప ఆలోచనని కథ రూపంలో పెడదామనుకున్నారు. దానికి అవసరమైన పాత్రలు సృష్టించారు. ఆ పాత్రల మధ్య సంఘర్షణ కళ్లకి కట్టినట్లు వర్ణించారు. కథలో మీరనుకున్న రసం బ్రహ్మాండంగా  పండించారు. ఇక చెప్పటానికేం లేదని భావిస్తూ కథ ముగించారు. అంతటితో మీ పనైపోయిందనుకున్నారు. కానీ పాఠకుడు మాత్రం మీరు తనని నడి సముద్రంలో వదిలేసి పోయినట్లు భావిస్తాడు. సంఘర్షణొక్కటే కాదు, దాని ప్రభావం ఆయా పాత్రల మీద ఎలా ఉంది, చివరికి ఏమయింది అనేది కూడా పాఠకుడికి ముఖ్యం. సమస్యల ప్రస్తావన వరకూ చేసి వదిలేసే కథలు అసంపూర్ణంగా అనిపిస్తాయి. ఇది చాలా కథల్లో కనిపించే లోపం. ‘కథ చొక్కా తొడుక్కున చర్చ’, ‘వ్యాసానికి కథ ముసుగేసినట్లుంది’, ‘ఉపన్యాస ధోరణిలో ఉంది’ వంటి వ్యాఖ్యలు ఇలాంటి కథల విషయంలోనే మనం తరచూ వింటుంటాం. కథ పరమోద్దేశం ఓ విషయమ్మీద చర్చ లేవనెత్తడమూ, ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అందిచటమూ మాత్రమే కాదు. ఆ పని అంతకన్నా ప్రభావశీలంగా చెయ్యటానికి మెరుగైన వేరే మార్గాలున్నాయి. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలోనే వదిలేసి పోతే కుదరదు.

“ఇద్దరు స్నేహితురాళ్లు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. కష్ట సుఖాలు కలబోసుకున్నారు. కబుర్లైపోయాక ఎవరి దారిన వారు పోయారు”

ఈ అంశమ్మీద మన నైపుణ్యమంతా రంగరించి, క్రియేటివిటీ కుమ్మరించి పెద్ద కథే రాయొచ్చు. ఓ కొత్త కోణం నుండి అమ్మాయిల సమస్యల్ని చూపించొచ్చు. కానీ చివర్లో ఆ స్నేహితురాళ్ల ఆలోచనా విధానంలోనో, ప్రాపంచిక దృక్పధంలోనో, మానసిక స్థితిలోనో, మరెందులోనో ఓ మార్పు కనబడాలి. లేదా కనీసం మార్పు దిశగా ఓ సూచనన్నా అగుపడాలి. అది లేని కథ గమ్యం లేని ప్రయాణం లాంటిది. కేవలం అమ్మాయిల సమస్యలు ఏకరువు పెట్టటానికైతే కష్టపడి కథ రాయనవసరం లేదు. శుభ్రంగా ఓ వ్యాసం రాసి అచ్చేయొచ్చు.

అసలు పాఠకుడు మన కథ ఎందుకు చదువుతాడు? తన దారిన తాను పోకుండా ఆ పాత్రలతో ఎందుకు మమేకమౌతాడు? వాటి బాధలు తనవిగా ఎందుకు భావిస్తాడు? ఎందుకంటే – చివరికి ఆ పాత్రలకి ఏమయిందోననే మానవ సహజమైన కుతూహలంతో. ఓపిగ్గా కథంతా చదివాక చివర్లో పాత్రల స్వభావాల్లో కానీ, స్థితిగతుల్లో కానీ ఏమీ తేడా లేకుండా మొదట్లో ఉన్నట్లే చివర్లోనూ మిగిలిపోతే నిరాశకి గురవుతాడు. అంతకాడికి ఆ కథంతా చెప్పటం దేనికి, తాను చదవటం దేనికి అనుకుంటాడు. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి. మీ కథకి ‘వ్యాసం’ అన్న ముద్ర పడకుండా ఉండాలంటే మీరు తీసుకోవలసిన కనీసపు జాగ్రత్త అది.

కొన్ని సార్లు కథలో లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబితే కానీ సరైన ముగింపనిపించుకోదు. అదే కొన్ని సార్లు ఉన్న ప్రశ్నలకి తోడుగా మరో కొత్త ప్రశ్న లేవనెత్తి వదిలేయటం మంచి ముగింపవుతుంది. ఎత్తుగడ, శీర్షికల విషయంలో ఎలాగైతే ‘ఇదిగిదిగో ఇదే సరైనది’ అని చెప్పలేమో, ముగింపు విషయంలోనూ అంతే. అది కథని బట్టి ఉంటుంది అని కొందరు అభిప్రాయపడతారు. నా మట్టుకు నేను, కథకి ముగింపు అనేది ఆ కథని రచయిత ఎలా మలుచుకొచ్చాడు అనేదాని మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటాను. మరోలా చెప్పాలంటే, చాతుర్యం ఉన్న కథకుడు ఒకే కథకి రెండు పూర్తిగా భిన్నమైన ముగింపులిచ్చి అవి రెండూ కూడా సరైనవే అనిపించగలుగుతాడు. అదెలా సాధ్యం అని మీరనొచ్చు. సాధ్యమే. ఆ యొక్క ముగింపుని అంగీకరించటానికి పాఠకుల్ని మనం ఎలా సిద్ధం చేశామన్నదానిమీద అది ఆధారపడి ఉంటుంది.

సరైన ముగింపు అనేది అప్పటిదాకా జరిగిన కథ మొత్తాన్నీ క్రోడీకరించి దాని సారాన్ని పాఠకుడికి చేరవేస్తుంది. ఇందుకో మంచి ఉదాహరణగా ‘అస్తిత్వానికి అటూ… ఇటూ…’ (మధురాంతకం నరేంద్ర) చెప్పుకోవచ్చు. పద్నాలుగు పేజీల ఈ కథలో చివరి పేజీ వదిలేస్తే, అమిత నైపుణ్యంతో రాయబడ్డ మొదటి పదమూడు పేజీలకీ పరమార్ధం ఏమిటనే ప్రశ్న పాఠకుడిలో కలిగితీరుతుంది. కథకి ముగింపు ఎంత ముఖ్యమనేదానికి ‘బంగారు మురుగు’ (శ్రీ రమణ) మరో గొప్ప ఉదాహరణ. మీలో చాలామంది ఆ కథ చదివే ఉంటారు. మళ్లీ చదవండి. కానీ ఈసారి ఆఖరి ఆరు వాక్యాలూ వదిలేయండి; ఆ కథ ఎంత అసంపూర్ణంగా అనిపిస్తుందో గమనించండి.

నేను రాసే తరహా కథలకి ఈ ముగింపు అనేది మరీ ముఖ్యమైన అంశం. నా కథ నాలుగు పేజీలుండొచ్చు, లేదా నలభై పేజీలుండొచ్చు. నా వరకూ అవన్నీ ఆఖరు పేజీలో నేను రాయబోయే నాలుగైదు పేరాగ్రాఫుల దిశగా పాఠకుల్ని అతి జాగ్రత్తగా అడుగులేయించే సోపానాలు. ఉదాహరణకి, ‘శిక్ష’లో కథంతా చిట్టచివరి వాక్యంలోనే ఉంది. మిగతాదంతా ఆ ముగింపువైపు పాఠకుల్ని నడిపించటమే.

నేను కథ రాయబూనుకున్నప్పుడు మొట్టమొదటగా రాసేవి ముగింపు వాక్యాలు. అక్కడనుండి వెనక్కు కథనల్లుకుంటూ వెళ్లటం నాకలవాటు. (‘ఎత్తుగడ’ వ్యాసంలో చెప్పినట్లు) కథ మొత్తం పూర్తయ్యాక, దానికి తగ్గ ఎత్తుగడ రాస్తాను. ఇది చదివి ‘ముగింపుతో మొదలెట్టి ఎత్తుగడతో ముగిస్తానంటున్నాడు. చిత్రమైన మనిషిలా ఉన్నాడే!’ అనుకుంటున్నారా? నేను ఎంచుకునే కథాంశాలకి ఈ పద్ధతి పనిచేస్తుంది. కథలు ఇలాగే రాయాలని చెప్పటానికిది రాయలేదు. ముగింపుకి నేను ఇచ్చే ప్రాధాన్యత తెలియజెప్పటమే ఇక్కడ నా ఉద్దేశం.

ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ సంతృప్తికరమైన ముగింపు ఎలా రాయాలి? ఏ కథకి ఎలాంటి ముగింపు సరిగా అమరుతుందనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫలానా రకం ముగింపులే మురిపిస్తాయని సూత్రీకరించటం సాధ్యపడదు. కానీ, ఏ రకమైన ముగింపులు పండవో చెప్పటం తేలికే. వీలైనంతవరకూ ఈ కింది రకాల ముగింపుల్ని ముట్టుకోకపోతే మంచిది.

  • మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు. పాత్రల స్వభావాల్లో మార్పు కథలో జరిగే వివిధ సంఘటనలద్వారానో, లేక ఏదో ఓ బలమైన కారణం వల్లనో సహజంగా రావాలి తప్ప ఆఖర్లో అకారణంగా ఉన్నట్లుండి వాళ్లలో పరివర్తన కలగటం, కళ్లు తెరుచుకోవటం, వగైరా జరిగితే అసహజంగా కనిపిస్తుంది. అంటే, నలుపు-తెలుపు సినిమాల్లో సూర్యకాంతం ధరించే (ముళ్లపూడి వారి మాటల్లో, ‘సూర్యకాంతాన్ని భరించే’) గయ్యాళి అత్త పాత్రకి శుభం కార్డు ముందు గ్రూప్ ఫోటో తరుణంలో ఠకీమని జ్ఞానోదయమవటం టైపన్న మాట.
  • కొన్ని సార్లు రచయితలకి అద్భుతమైన ఆలోచనలు తడతాయి. ఇంతవరకూ ఎవరూ స్పృశించని సమస్యని చర్చిస్తూ ఆవేశంగా కథ రాసేస్తారు. ఆఖరికొచ్చేసరికి, ఆ సమస్యకి పరిష్కార మార్గం తట్టకో, బద్ధకమేసో, రాసీ రాసీ విసుగొచ్చో, ‘నే చెప్పాలనుకున్నది చెప్పేశా. పరిష్కారం పాఠకుడే వెదుక్కుంటాడ్లే’ అన్న ఉద్దేశంతోనో కథని అర్ధాంతరంగా ముగించేస్తారు. ఇలాంటి కథలు అసంపూర్ణంగా మిగిలిపోయినట్లనిపిస్తాయి. లోకంలోని సమస్యలన్నిటికీ కథల్లో పరిష్కారాలు చూపనక్కర లేదు. ఎటూ తేల్చని ముగింపులు ఉండకూడదనేం లేదు. అవి కథనెలా ముగించాలో తెలీని రచయిత అయోమయం నుండి ఊడిపడకూడదు.
  • పై సమస్యకి పూర్తిగా వ్యతిరేకమైన సమస్య కొందరు కథకులది. వీరి వద్ద ముగింపు మాత్రమే ఉంటుంది. అందులో తప్పేం లేదు. కథని అట్నుండీ అల్లుకు రావచ్చు. కాకపోతే ఆ క్రమంలో వీళ్లు తడబడిపోతారు. కథన్నాక ఇంత పొడుగుండాలని ఏవో లెక్కలుంటాయి కాబట్టి, వాటికి తగ్గట్లు నాలుగైదు పేజీలు నానా వర్ణనలతో నింపేసి చివర్లో తామనుకున్న ముగింపుతో ముక్తాయిస్తారు. కొన్ని రకాల సినిమాల్లో యువత చేసే పిచ్చి పనులన్నీ వివరంగా చూపించి క్లైమాక్సులో ఓ నీతివాక్యం బోధిస్తారు చూడండి …. అలా అనిపిస్తాయిలాంటి ముగింపులు.
  • తర్కబద్ధంగా లేని ముగింపుకి ఆమడ దూరంలో ఉండటం మంచిది. నిజజీవితంలో చాలా సమస్యలు మన చేతిలో లేని యాధృచ్ఛిక సంఘటనల మూలాన తీరిపోవటం సహజమే. కానీ ఇటువంటివి కథల్లో కనిపిస్తే అసహజంగా అనిపిస్తాయి. ఉదాహరణకి, మేనేజర్ వేధింపులకి గురవుతున్న మహిళ ప్రధాన పాత్రగా ఓ కథ రాశారనుకోండి. దుష్ట బాస్ వల్ల ఆవిడ పడుతున్న బాధలు, వాటిని ఎదుర్కోవటానికి ఆమె చేసిన పోరాటం, ఇదంతా అద్భుతంగా రాసుకొచ్చి ఆఖరుకి వాడేదో రైలు ప్రమాదంలో పోయినట్లు, తద్వారా ఆమె పీడ విరగడైనట్లు చూపిస్తే …. మీ కథ కొంప మునుగుతుంది. ఆ రైలు ప్రమాదం వెనక ఆవిడ హస్తమున్నట్లు చూపిస్తే, అది కనీసం అదోలానైనా ఉంటుంది. (మార్మిక, ఫ్యాంటసీ, అధివాస్తవిక వగైరా తరహా కథల విషయంలో ‘తర్కం’ అనే మాటకి అర్ధం వేరు. అక్కడ ‘తర్కబద్ధత’ అంటే కథలో రూపుదిద్దిన లోకానికి రచయిత నిర్దేశించిన నియమాలకి అనుగుణంగా అని అర్ధం)
  • పది పాత్రల చుట్టూ తిరిగే అపరాధ పరిశోధన కథలో ఆఖరికి అంతవరకూ కథలోలేని, కనీసం సూచనా మాత్రంగానన్నా ప్రస్తావన రాని పదకొండో పాత్ర హంతకుడిగా తేలితే ఆ కథ తుస్సుమంటుంది. ఇది ఊహించని మలుపు అని రచయిత అనుకోవచ్చు కానీ, ఇలాంటి ముగింపు రాయటం కన్నా పాఠకుడిని మొఖమ్మీదనే వెక్కిరించటం నయం. ఊహించని మలుపు అంటే పాఠకుడు ‘వార్నీ!ఇలా జరుగుతుందని ఊహించలేదే’ అనుకోవటం కాదు. ‘అర్రె … ఈ పాయింట్ ఎలా మిస్సయ్యానబ్బా!’ అనుకోవటం. ఓ పక్క ముగింపు ఎలా ఉండబోతోందో కథ నిండా క్లూస్ వదులుతూనే, మరోపక్క పాఠకుడిని మాయజేసి పెడదారి పట్టిస్తూ పోయి, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే సిసలు ఊహాతీతమైన ముగింపు.
  • కథ ఎలా ముగించాలో తెలుసుకోవటం ఒకెత్తైతే, ఎక్కడ ముగించాలో తెలుసుకోవటం మరో ఎత్తు. కొన్ని కథలు ముగిసిపోయాయనిపించాక కూడా ముందుకు సాగిపోతూంటాయి. “ఆ రకంగా రవికి జ్ఞానోదయమయింది. అప్పట్నుండీ వాడు మళ్లీ కళాశాలకి శ్రద్ధగా వెళ్లటం మొదలు పెట్టాడు. ఆటపాటలకి ఫుల్‌స్టాప్ పెట్టి రేయింబవళ్ళు చదివాడు. ఏడాది తిరిగే సరికి వాడి తల్లిదండ్రులు కలలుగన్నట్లే ఎంట్రన్స్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. నాలుగేళ్లలో ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసుకుని ఓ మంచి ఐటీ కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్‌లోనే ఉద్యోగం సంపాదించాడు. అది చూసి వాడికి పిల్లనిస్తామని చాలామంది వెంటబడ్డారు. వాళ్లలో ఓ చక్కని చుక్కని పెళ్లాడి సుఖంగా కాపురం చేసుకోసాగాడు …………….”. నిజానికి, రవికి జ్ఞానోదయం కావటంతోనే ఈ కథ ముగిసిపోయింది. ఆ తర్వాతివన్నీ అనవసరం.
  • ముగింపు రూపుదిద్దటంలో కొందరు వర్ధమాన కథకులు చేసే పొరపాటు – ఆ కథ ద్వారా తామేం చెప్పదలచుకున్నదీ ఆఖర్లో ఓ పేరాగ్రాఫ్‌లో సంక్షిప్తంగా పొందుపరచటం. ‘నాన్నా పులి’ కథ చివర్లో ‘అదర్రా పిల్లలూ. అబద్ధం ఆడిన పిల్లాడికి చివర్లో ఏమయిందో తెలిసిందా? పులొచ్చి తినేసింది. కాబట్టి మీరెప్పుడూ అబద్ధాలాడొద్దు’ అని ముక్తాయిచినట్లుంటాయీ కథలు. పిల్లల కథల సంగతేమో కానీ, ఎదిగిన పాఠకుల కోసం రాసేటప్పుడు మీ కథలో సారాంశాన్ని ఆఖర్లో మరోమారు నొక్కివక్కాణించనవసరం లేదు. అది మీ పాత్రల మాటలు, చేతల ద్వారా సూచనామాత్రంగా పాఠకులకందితే చాలు.

అవండీ, ముగింపు ముచ్చట్లు. గుర్తుంచుకోండి: మిగతా అంతా ఎంత గొప్పగా రాసినప్పటికీ, ముగింపు తేలిపోతే మీ కథ పేలిపోయినట్లే. ఎందుకంటే, ముగింపే అసలు కథ. Climax is the story. తక్కినదంతా సదరు ముగింపుకి పాఠకుల్ని సన్నద్ధం చేయటానికి రచయిత పడే ప్రయాస.

తరువాతి భాగంలో మరో ముఖ్యమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం.