రచన: అనిల్ ఎస్. రాయల్
ముందు భాగంలో ఉత్తమ పురుషంలో కథనం నడపటంలో ఉన్న సౌలభ్యాలు, సమస్యలు చూశాం. ఈ భాగంలో మిగిలిన రెండు రకాల కమామీషేంటో చూద్దాం.
5.1 మధ్యమ పురుషం
ఉత్తమ పురుషంలో కథ ‘నా’ కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో (second person) అది ‘నీ’ కోణంలో నడుస్తుంది. మరోలా చెప్పాలంటే, ‘నిన్ను’ ఉద్దేశించి నడుస్తుంది. ఎక్కువగా, లేఖల రూపంలో రాయబడ్డ కథల్లో ఈ విధానం కనబడుతుంది. పాఠకుడిని కూడా కథలో భాగం చేసే ఎత్తుగడ ఇది. మధ్యమ పురుషంలో నడిచే కథనం ‘నువ్వు అది చెయ్యి; ఇటు తిరుగు; ఎక్కడా ఆగొద్దు; ….’ ఇలా ధ్వనిస్తూ కథలా కాకుండా కరదీపికలా అగుపించే అవకాశం ఉంది. ఉత్తమ పురుషంలో (first person) కూడా కథ చెబుతున్న పాత్ర బుర్రలో దూరటం ద్వారా కథలో భాగమయ్యే అవకాశం పాఠకుడికి ఇస్తున్నాం. అదే మధ్యమ పురుషంలో పాఠకుడి ఇష్టాఇష్టాలతో పనిలేకుండా అతన్ని కథలోకి ఈడ్చుకుపోతున్నాం. ఈ బలప్రయోగం అందరు పాఠకులకీ రుచించకపోవచ్చు. అందువల్ల ఈ విధానంలో రాసిన కథలు మనకు పెద్దగా ఎదురు పడవు. ప్రయోగాలు చెయ్యాలనుకునేవారు పరిశీలించాల్సిన కథన విధానం ఇది. ఇంతకు మించి దీని గురించి చెప్పటానికేమీ లేదు.
5.2 ప్రధమ పురుషం
‘ప్రధమ పురుషం’ అనగానే ఆంగ్లంలో ‘first person’ అని కొందరు పొరబడొచ్చు. కానీ సంస్కృతాధారిత భారతీయ భాషల్లో ‘ప్రధమ పురుషం’ అంటే ఆంగ్లంలో ‘thrid person’ అని గమనించగలరు. అలాగే, ఉత్తమ పురుషం అంటే ‘first peson’ మరియు మధ్యమ పురుషం అంటే ‘second person’.
ప్రధమ పురుషంలో రచయిత కథలో ఓ పాత్రగా కాకుండా దూరాన్నుండి చూసే పరిశీలకుడిగా వ్యవహరిస్తాడు. కథంతా ఈ పేరులేని పరిశీలకుడి కోణం నుండి చెప్పబడుతుంది. ఇందులో మళ్లీ మూడు రకాలున్నాయి: పరిమిత ప్రధమ పురుషం (third person limited), సర్వజ్ఞ ప్రధమ పురుషం (third person omniscient), మరియు బాహ్య ప్రధమ పురుషం (third person objective).
5.2.1 పరిమిత ప్రధమ పురుషం
‘పరిమిత ప్రధమ పురుషం’ అనేది ఉత్తమ పురుషానికి ఎక్కువ, సర్వజ్ఞ ప్రధమ పురుషానికి తక్కువ అనుకోవచ్చు. ఉత్తమ పురుషంలో మాదిరిగానే పరిమిత ప్రధమ పురుషంలో కూడా ఏదో ఓ పాత్ర (సాధారణంగా, ప్రధాన పాత్ర) కోణానికి మాత్రమే పరిమితమై కథ నడుస్తుంది. అయితే ఉత్తమ పురుషంతో పోలిస్తే ఈ విధానంలో కథకుడికి కాస్త ఎక్కువగా కాలూ చెయ్యీ ఆడుతుంది. దాదాపు ఉత్తమ పురుషంలో ఉన్న పరిమితులన్నీ ఇక్కడా ఉంటాయి. అక్కడ లాగే ఇక్కడా ప్రధాన పాత్ర మనసులో చెలరేగే అలజడులు, మెదలే ఆలోచనలు కథకుడికి తెలిసిపోతుంటాయి. ఇతర పాత్రల విషయానికొచ్చేసరికి, ఉత్తమ పురుషంలో మాదిరిగానే వాటి చర్యలు, ప్రతిచర్యలు గమనించి వివరించటంతోనే కథకుడు సరిపెడతాడు తప్ప ఆ పాత్రల అంతరంగాల్లో ఏముందో చెప్పడు.
ఉత్తమ పురుషంతో పరిమిత ప్రధమ పురుషానికి ఉన్న పోలికలు చూశాక, ఆ రెండిటికీ పెద్దగా తేడాల్లేవని తెలుసుకున్నాక, వాటిలో ఎప్పుడు దేన్ని ఎంచుకోవాలా అనే అయోమయంలో పడొచ్చు మీరు. దానికి మరీ కష్టపడనక్కరలేదు. మీరు కథ ‘చెప్పాలి’ అనుకుంటే ఉత్తమ పురుషాన్ని ఆశ్రయించండి. ‘చూపాలి’ అనుకుంటే పరిమిత ప్రధమ పురుషాన్ని వాడండి. ఉత్తమ పురుషంలో కథకుడు పూర్తిగా ప్రధాన పాత్రలో దూరిపోయి ఆ పాత్ర కోణం నుండే కథ నడుపుతాడు. అక్కడ ప్రాపంచిక విషయాలపైనా, ఇతర పాత్రలపైనా ప్రధాన పాత్ర అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించే వెసులుబాటుంది. అదే పరిమిత ప్రధమ పురుషానికొచ్చేసరికి, ఎంతగా ప్రధాన పాత్ర పక్షం వహించినప్పటికీ, అభిప్రాయాలు వ్యక్తీకరించే విషయంలో మాత్రం కథకుడు వీలైనంత తటస్థత పాటించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కథ నడిపేటప్పుడు ప్రధాన పాత్ర అభిప్రాయాలు ‘చెప్పటం’ కాకుండా ‘చూపటం’ మీద దృష్టి పెడతాడు. ఆ మేరకు, పరిమిత ప్రధమ పురుషంలో కథని ‘ప్రదర్శించటం’ ఎక్కువగా కనిపిస్తుంది.
ఉత్తమ పురుషానికీ, పరిమిత ప్రధమ పురుషానికీ మరో ముఖ్యమైన తేడా కూడా ఉంది. పరిమిత ప్రధమ పురుషంలో – ప్రధాన పాత్ర బుర్రలో బంధించబడి ఉండకపోవటం మూలాన, ఆ పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు కూడా, పరిమిత స్థాయిలో, కథకుడికి తెలుస్తుంటాయి. ఆ వివరాలు అవసరమైనప్పుడు బయటపెడుతూ, అవసరం లేదనుకున్నప్పుడు తొక్కిపడుతూ కథనంలో ఉత్కంఠ నింపుతాడు రచయిత. ఈ కింది ఉదాహరణ చూడండి:
_________________________________________________
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పావుగంట పరిగెత్తాక, అల్లంత దూరంలో డొంకరోడ్డు కనబడిందతడికి. ‘అక్కడికి చేరితే ఇక నన్నెవరూ గమనించరు’ అనుకుంటూ, ఆయాసంతో రొప్పుతూనే పరుగు కొనసాగించాడతడు.
డొంకరోడ్డు మొదట్లో ఉన్న పాత వెంతన కింద ఇద్దరు వ్యక్తులు పట్టాకత్తులతో తనకోసమే పొంచి ఉన్నారని అతనికి తెలియదు.
_________________________________________________
పై కథ ఉత్తమ పురుషంలో నడిస్తే పాత వంతెన కింద పట్టా కత్తులతో వేచిఉన్న ఇద్దరి ప్రస్తావన కథకుడు తేగలడా?
5.2.2 సర్వజ్ఞ ప్రధమ పురుషం
ఈ విధానంలో కథకుడు ఓ సర్వజ్ఞుడిలా వ్యవహరిస్తాడు. తన కథా పరిధిలో, తాను సృష్టించిన ఊహాలోకంలో, ఎక్కడ ఏమి జరుగుతుందో అన్నీ అతడికి తెలుస్తాయి. ఏ పాత్ర మదిలో ఏముందో కూడా అతడికి తెలుస్తుంది. ఇక్కడ కథకుడు ఏ పాత్ర పక్షమూ వహించడు. కథ ఏదో ఒక పాత్ర కోణం నుండి మాత్రమే చెప్పడు. అతడికి అందరూ సమానమే. ఇతర కథన విధానాల మాదిరిగా ఇందులో కథకుడికి పరిమితులు, హద్దులు ఉండవు. అతడు అన్ని ప్రదేశాల్లోనూ, అందరి మనసుల్లోనూ ఏక కాలంలో ఉండగలిగే సర్వేశ్వరుడి వంటివాడు.
ఆ స్థాయిలో హద్దూ పద్దూలేని అపరిమితాధికారం ఎటువంటి కథలకి పనికొస్తుందని బుర్ర గోక్కుంటున్నారా? మీ కథలో ఒకటికన్నా ఎక్కువ ప్రధాన పాత్రలున్నా, ఒకటి కన్నా ఎక్కువ ‘గొంతులు’ బలంగా వినపడాల్సిన అవసరమున్నా, ఈ విధానం అక్కరకొస్తుంది. అయితే, వీలైనన్ని తక్కువ ప్రధాన పాత్రలు – సాధారణంగా ఒకే ఒకటి – ఉండటం కథ లక్షణాల్లో ఒకటి కాబట్టి, ఈ ‘సర్వజ్ఞ ప్రధమ పురుషం’ అనేది కథలకన్నా నవలల్లో ఎక్కువగా ఉపయోగించబడే పద్ధతి.
అన్ని కథన విధానాల్లోనూ ఉన్నట్లే ఇందులోనూ ఓ సమస్య ఉంది. ఈ పద్ధతిలో రాసినప్పుడు ఒక పాత్ర కోణం నుండి మరో పాత్ర కోణానికి మారే క్రమంలో జాగరూకత వహించకపోతే, గత వ్యాసంలో పేర్కొన్న head hopping అనబడే తల తిరుగుడు సమస్య వచ్చిపడుతుంది. పాఠకులకి కళ్లు తిరగటం, కడుపులో తిప్పటం వంటి వికారాలకి దారితీయకుండా ఉపయోగించగలమన్న నమ్మకం వచ్చేదాకా ఈ కథన విధానానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఒకవేళ మీ కథకి ఇదే సరైన దృక్కోణం అనుకుంటే, head hopping సమస్యని అధిగమించటానికి ఈ చిట్కా పాటించండి: కథని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్ర కోణం నుండి నడపండి. దీనివల్ల పాఠకుడు గందరగోళానికి గురి కాకుండా కథ చదవగలుగుతాడు. అయితే అన్ని కథలనీ ఇలా భాగాలుగా విడగొట్టటం కుదరకపోవచ్చు. మరి అప్పుడేం చేయాలి? దానికి పరిష్కారంగా మనకి మిగిలిన చివరి కథన విధానం పనికొస్తుందేమో చూద్దాం.
5.2.3 బాహ్య ప్రధమ పురుషం
ఈ పద్ధతిలోనూ కథకుడు సర్వజ్ఞుడే. అతడికి తెలియని విషయాలుండవు. కాకపోతే, వాటిని మన కళ్లకు కట్టే క్రమంలో అత్యంత సంయమనం ప్రదర్శిస్తాడు. ఏ పాత్ర పట్లా పక్షపాతం చూపడు. ఎవరి మనసుల్లోకీ తొంగిచూడడు. అందరికీ సమాన దూరంలో నిలబడి చూసినది చూసినట్లు మనకి చెప్పుకుపోతాడు. తన సొంత అభిప్రాయాలు చొప్పించడు. పాత్రల చర్యలకి, ప్రతిచర్యలకి ఉద్దేశాలు ఆపాదించడు. విలువలు కట్టడు. తీర్పులీయడు. ‘జరిగిందిది. దీన్నెలా అర్ధం చేసుకుంటారో మీ ఇష్టం’ అంటూ పాత్రల చేతల్ని అంచనా వేసే భారం పాఠకులపైకే నెట్టేస్తాడు. కథకుడు పాత్రల బుర్రల్లోకి ఎడా పెడా దూరేయకుండా వెలుపలే నిలబడి కథ చెబుతున్నాడు కాబట్టి ఇక్కడ head hopping సమస్య ఉండదు.
ఈ విధానాన్ని కథ ‘చూపటం’ అనే ప్రక్రియకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. బాహ్య ప్రధమ పురుష కథనంలో రచయిత పాత్రల ఆలోచనల్ని ప్రత్యక్షంగా వెలిబుచ్చకుండా, వాటి చేతలు, శరీర భాష మరియు సంభాషణల ద్వారా ఆయా పాత్రల చిత్రణ చేస్తాడు. సన్నివేశాల రూపకల్పన, సంఘటనలు, వాటి వర్ణన ఇక్కడ కీలకమైనవి. అందువల్ల ఈ విధానంలో కథ చెప్పేటప్పుడు నాటకీయతకి పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఇలా రాయబడ్డ కథలు చదువుతున్నప్పుడు ఓ నాటకమో, సినిమానో చూస్తున్న అనుభూతి కలిగిస్తాయి.
ఈ వ్యాసంలో ఒకటికి పదిసార్లు ‘చెప్పటం’ vs ‘చూపటం’ ప్రస్తావనొచ్చింది. ఏదైనా విని తెలుసుకోవటానికీ, చూసి తెలుసుకోవటానికీ ఎంత తేడా ఉందో, ఆ రెంటిలో ఏది మనమీద బలమైన ముద్రవేస్తుందో మీకు తెలుసు కదా. ఈ చెప్పటానికీ, చూపటానికీ మధ్య తేడా చూపించే ఉదాహరణలు చూద్దాం:
_________________________________________________
చెప్పటం:
రమ్య మెల్లిగా చెప్పింది, ‘నాకు నువ్వంటే ఎప్పుడూ ఇష్టం లేదు’.
అది విన్న కృష్ణకి కోపం తన్నుకొచ్చింది.
_________________________________________________
చూపటం:
రమ్య మెల్లిగా చెప్పింది, ‘నాకు నువ్వంటే ఎప్పుడూ ఇష్టం లేదు’.
అది విన్న కృష్ణ ముఖం జేవురించింది. అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి. కుర్చీలోంచి చివ్వున పైకిలేచి రెండు పిడికిళ్లతోనూ బల్లమీద బలంగా గుద్దాడు.
_________________________________________________
పైన మొదటిదానికన్నా రెండో ఉదాహరణలో కృష్ణకి వచ్చిన కోప తీవ్రత ఎక్కువగా తెలియటంలేదూ? ‘కోపం’ అన్న మాట దొర్లకుండానే అతని కోపాన్ని చూపగలిగామిక్కడ. బాహ్య ప్రధమ పురుషంలో రాయబడ్డ కథలు ఇలా కళ్లకు కట్టినట్లుంటాయి. ఈ విధానంలో రాసేటప్పుడు ‘రామారావు సంతోషంగా నడుస్తున్నాడు’ అనటానికి బదులు ‘రామారావు ముఖం వెలిగిపోతోంది’ అంటాం. ఎందుకు? బాహ్య ప్రధమ పురుషంలో ‘సంతోషం’ అనేది కథకుడికి కనబడే లక్షణం కాదు. అది రామారావు మానసికస్థితి. ఆ సందర్భంలో రామారావు స్పందన ఏమిటన్నదే కథకుడు గమనించగలిగే విషయం. రామారావు హావభావాలు వివరించటం ద్వారా అతడి మానసిక స్థితిని సూచించటం ఇక్కడ సరైన మార్గం.
తన స్వరం కథలో వినపడకుండా రచయిత జాగ్రత్తపడాలనుకున్నప్పుడు, పాఠకులకి తన ఉనికి తెలీకుండా తెరవెనుకే మిగిలిపోవాలనుకున్నప్పుడు, పాత్రల మనసుల్లో దూరి వాటి భావోద్వేగాలని వెల్లడిచేయకుండా చేతులు కట్టేసుకోవాలనుకున్నప్పుడు, పాత్రల చర్యలు మాత్రమే వివరించి వాటి వెనక ఉద్దేశాలేంటో గ్రహించే బాధ్యత పాఠకుల నెత్తినే పెట్టాలనుకున్నప్పుడు – బాహ్య ప్రధమ పురుషం అక్కరకొస్తుంది. నా ‘మరపురాని కథ’లో కనిపించేది ఈ తరహా కథనమే. అందులోని మూడు పాత్రల మనసుల్లో చెలరేగే అలజడి, వాటి గతం, ప్రస్తుతంలో వారి ప్రవర్తనకి వెనకున్న కారణాలు, ఇత్యాది వివరాలు ఆ ముగ్గురూ నోరు తెరచి చెప్పేదాకా పాఠకులకి తెలియకుండా దాచటం కథకి కీలకం. అందువల్ల ఆ కథ మొత్తమ్మీదా ఆ మూడు పాత్రల శరీరభాష, ముఖ కవళికలు, సంభాషణలు, ప్రతిస్పందనలు వివరించటమే తప్ప వాటి వెనకున్న ఉద్దేశాలపై కథకుడి వ్యాఖ్యానం ఎక్కడా వినిపించదు. (‘మరపురాని కథ’ ఇక్కడ లభిస్తుంది)
బాహ్య ప్రధమ పురుషంలో కథలు రాయాలనుకునే రచయితలకి పరిశీలనా శక్తి మెండుగా ఉండాలి (మిగతా విధానాల్లో రాయబూనుకునేవారికి అది అవసరం లేదని కాదు; ఈ పద్ధతిలో రాయటానికది రవ్వంత ఎక్కువ అవసరమని). తన చుట్టూ ఉన్న మనుషులు ఎలా నడుస్తారు, ఎలా నొసలు చిట్లిస్తారు, ఎలా మాట విరుస్తారు లాంటివి బాగా గమనిస్తుండాలి; అంతటితో ఆగకుండా ఆ చర్యల వెనకున్న భావాలు అర్ధం చేసుకోవాలి. అప్పుడే తాము రాసే కథల్లో పాత్రల ఆలోచనలు ‘చెప్పటం’ కాకుండా వాటి చేతల ద్వారా ‘చూపే’ పని సమర్ధంగా చేయగలుగుతారు.
అద్భుతమైన స్క్రీన్-ప్లే ఉన్నవిగా పేరుబడ్డ సినిమాలలో కేవలం మాటలు, నటీనటుల హావభావాలు, వారి శరీరభాష ద్వారా పాత్రల మానసిక సంఘర్షణ, వాటి అంతరంగాలు ఆయా దర్శకులు తెరపై ఆవిష్కరించారో పరిశీలించండి. బాహ్య ప్రధమ పురుషంలో రాయటమ్మీద పట్టు సాధించటానికి ఇదో మంచి మార్గం.
ఇతర విధానాలన్నిటికీ సౌలభ్యాలతో పాటు పరిమితులూ ఉన్నాయని చెప్పుకున్నాం. మరి బాహ్య ప్రధమ పురుషం సంగతేమిటి?
ఈ పద్ధతికీ ఓ పరిమితి ఉంది. ఈ విధానంలో నడిచే కథల్లోని పాత్రల అంతరంగాల్లో ఏమేం అలజడులు చెలరేగుతున్నాయో, ఏ ఆలోచనలు పరుగులెడుతున్నాయో తెలీకపోవటం వల్ల, బయటి నుండి వాటి చేతలు మాత్రమే గమనించటం వల్ల, ఆ పాత్రలతో పాఠకుడికి సాన్నిహిత్యం – గత వారపు వ్యాసంలో చెప్పుకున్న ‘భావావేశపూరిత బాదరాయణ బాంధవ్యం’ – ఏర్పరచటానికి పూర్తిగా నాటకీయతపై ఆధారపడాలి. అది అంత తేలిక కాదు. కథకులుగానూ, నవలా రచయితలుగానూ ప్రసిద్ధులైన ఎందరో సినిమా స్క్రిప్ట్ రచయితలుగా తేలిపోవటం కాకతాళీయం కాదు. భావోద్వేగపూరిత కథలు భావుకతతో నింపి ‘చెప్పి’ మెప్పించటానికి అలవాటు పడ్డ వీళ్లు అదే కథని తెరకనువదించేటప్పుడు కళ్లకు కట్టినట్లు ‘చూపే’ ప్రయత్నంలో తడబడటం దానిక్కారణం. కాబట్టి, పాఠకుడికి మీ పాత్రలతో ఇంటిమసీ ఉండటం, వాటితో సహానుభూతి చెందటం ముఖ్యమైతే – ఆ పాత్రల భావోద్వేగాలన్నిట్నీ కేవలం వాటి కదలికలు, సంభాషణల ద్వారా వెలిబుచ్చే కళలో ఆరితేరామని నమ్మకం కుదిరేదాకా బాహ్య ప్రధమ పురుషం జోలికెళ్లకపోవటం మంచిది. కాదూ కూడదూ అనుకుంటే మధ్యేమార్గంగా వెళ్లొచ్చు. అంటే, వీలైనంతవరకూ బాహ్యంగా ఉంటూనే, అప్పుడప్పుడూ పాత్రల అంతరంగాలనీ ఆవిష్కరించటం అన్నమాట. ప్రధమ పురుషంలో వచ్చే కథలు ఎక్కువగా ఇలాగే రాయబడతాయి.
చివరగా, మీ బుర్రకి పదునుపెట్టే చిన్న పని. మీకు నచ్చిన కథలు కొన్నింటిని ఎంచుకుని అవి ఏ దృక్కోణాల్లో చెప్పబడ్డాయో పరిశీలించండి. అవే కథల్ని, మూల కథకి భంగం కలగకుండా వేరేదైనా దృక్కోణంలో తిరగరాయండి. పూర్తయ్యాక, మీ కథకీ మూలకథకీ ఎంత తేడా ఉందో గమనించండి. ఒకే కథ, చెప్పే కోణాన్నిబట్టి, ఎంత భిన్నంగా మారిపోతుందో తెలుస్తుంది.
స్పందించండి