రచన: అనిల్ ఎస్. రాయల్


‘శీర్షిక’, ‘ఎత్తుగడ’, ‘ముగింపు’. ఇవి మూడూ కథకి ఎంత ముఖ్యమో గత భాగాల్లో చర్చించుకున్నాం. వాటి తర్వాత అంత ముఖ్యమైనది ‘దృక్కోణం’ . ఇది పెద్ద వ్యాసం కాబట్టి రెండు భాగాలుగా వస్తుంది.

“సమయానికి పరీక్ష అందుకుంటానో లేదోనన్న ఆందోళనతో పరిగెత్తుకొస్తున్న బాలుడు, వాడి కోసం బయల్దేరిన బస్సుని నిలిపేసిన డ్రైవర్, అది చూసి అవతల కనెక్టింగ్ బస్ వెళ్లిపోతుందని గొడవపెడుతున్న ప్రయాణీకుడు”. ఈ మూడు పాత్రల మధ్య నడిచే డ్రామా ఆధారంగా ఓ కథ రాయాలి. ఈ కథని ఆ బాలుడు చెబితే ఎలా ఉంటుంది? డ్రైవర్ చెబితే ఎలా ఉంటుంది? ప్రయాణీకుడు చెబితే ఎలా ఉంటుంది? వీళ్లెవరూ కాక దూరం నుండి ఈ గొడవంతా గమనిస్తున్న నాలుగో వ్యక్తి చెబితే ఎలా ఉంటుంది? ఆ నాలుగో వ్యక్తి మొదటి ముగ్గుర్లో ఎవరో ఒకరి పక్షం వహించి కథ చెబితే ఎలా ఉంటుంది? పక్షపాత రహితంగా, తన సొంత అభిప్రాయాలు ఇరికించకుండా, చూసింది చూసినట్లు వర్ణిస్తే ఎలా ఉంటుంది?

ఒకే కథ చెప్పేవారిని బట్టి, ఆ కథలో వారి ప్రమేయాన్ని బట్టి ఎంత భిన్నంగా రూపుదిద్దికుంటుందో గమనించండి.

మీరో కథ రాయబూనుకున్నప్పుడు మొట్ట మొదట తేల్చుకోవాల్సింది, ఆ కథ ఎవరి కోణం నుండి చెప్పాలనే విషయం. ఎత్తుగడ, ముగింపు, పేరు – ఇవన్నీ తర్వాత పడాల్సిన తిప్పలు. మీరెంచుకునే దృక్కోణం మీ కథనాన్ని నిర్దేశిస్తుంది. ఎత్తుగడ, ముగింపు రెండూ కథనమ్మీద ఆధారపడి ఉంటాయి. అంటే, దృక్కోణం ఆ రెంటినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి కథ ఎవరి కోణం నుండి చెప్పాలనేది ఆషామాషీగా తేల్చే పని కాదు.

కథలకి సంబంధించి ఆంగ్లంలో point of view లేదా p-o-v అనబడే దృక్కోణాలు మూడే మూడున్నాయి. అవి ఉత్తమ పురుషం (first person), మధ్యమ పురుషం (second person), మరియు ప్రధమ పురుషం (third person). ఒక్కోదాన్నీ వివరంగా చూద్దాం.

4.1 ఉత్తమ పురుషం

ఉత్తమ పురుష కథన విధానంలో కథకుడే స్వయంగా ఓ పాత్ర ధరించి కథ చెబుతాడు. ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి. ‘నేను’ చెప్పే కథలు, ‘మేము’ చెప్పే కథలు. కథకుడే ఓ పాత్ర పోషిస్తూ, ఒకే ఒక పాత్ర కోణం నుండి చెప్పేవి మొదటి రకానికి చెందినవైతే, ఒక సమూహం కోణం నుండి నడిచేవి రెండో రకం కథలు. ఆంగ్లంలో ఈ రెండు రకాల కథన విధానాల్నీ వరుసగా first person singular మరియు first person plural అంటారు. ఉండటానికి రెండు రకాలున్నా, నూటికి తొంభై తొమ్మిది కథలు first person singular పద్ధతిలోనే నడుస్తుంటాయి. తెలుగులో ‘మేము’ కోణంలో నడిచే కథలేవీ నేను చదివిన గుర్తులేదు. మనకి సంబంధించినంతవరకూ ఉన్నది ఒకటే విధానం: ఉత్తమ పురుషం. దానికి అర్ధం ‘నేను’ చెప్పే కథ అని మాత్రమే.

ఉత్తమ పురుషంలో నడిచే కథంతా ‘నా’ కోణం నుండి జరుగుతుంది. దీనివల్ల కొన్ని సౌలభ్యాలున్నాయి. ఈ విధానంలో కథ చెప్పటం వల్ల కథకుడికి, పాఠకులకి మధ్య త్వరితగతిన ఒక సాన్నిహిత్యం, ఒకానొక భావవేశపూరిత బాంధవ్యం ఏర్పడుతుంది. పాఠకుడు కథ చెబుతున్న పాత్ర బుర్రలో దూరి అతని/ఆమె కళ్లతో ఆ కథనంతటినీ చూస్తాడు. నిజజీవితంలో ఎలాగైతే మనకి కేవలం మన సొంత ఆలోచనలు మాత్రమే తెలిసి పరులవి ఊహకందవో, ఉత్తమ పురుష కథనంలోనూ అలాగే పాఠకుడికి కేవలం కథ చెబుతున్న పాత్ర ఆలోచనలు మాత్రమే తెలుస్తుంటాయి. అందువల్ల ఇది కథ చెప్పటానికి అతి సహజమైన పద్ధతి. కొంత సులువైన పద్ధతి కూడా. ఈ రెండే కాక మరికొన్ని ఇతర కారణాల వల్ల, వర్ధమాన రచయితలు ఉత్తమ పురుషంలో కథలు చెప్పటం ఉత్తమం అని నా అభిప్రాయం. ఆ కారణాలేంటో విపులంగా చెబుతాను.

ప్రధమ పురుషంలో (third person) కథ చెప్పేటప్పుడు అనుభవం లేని రచయిత అన్ని పాత్రల మనసుల్లోకీ ఎడా పెడా దూరిపోయి వాళ్ల ఆలోచనల్ని వ్యక్తీకరించబోవటం, ఆ క్రమంలో పదే పదే context switching కి పాల్పడటం ద్వారా పాఠకుడి తల తిరిగేలా చెయ్యటం సర్వసాధారణమైన విషయం. పాశ్చాత్య విమర్శకులు head hopping గా పిలిచే ఈ తల తిరుగుడు కథనానికి ఉదాహరణొకటి చూద్దాం:

_________________________________________________

అతనామెకేసి చూశాడు. ‘ఎంత అందంగా ఉంది’ అనుకున్నాడు. అప్పుడే తను కూడా అతన్ని చూసింది. ఆమె గుండె ఝల్లుమంది. ‘ఆ కళ్లెంత బావున్నాయో’ అనుకున్నాడతడు. ఎంతసేపైనా ఆ కళ్లకేసే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందతనికి. అతను రెప్పవాలకుండా తననే చూస్తుండేసరికి ఇబ్బందిగా కదిలి కళ్లు వాల్చిందామె. ‘వెధవ. సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నాడో’ అనుకుంది కంపరంగా. వారం నుండీ అవే డేగ చూపులు. ఆమెకి వళ్లంతా జెర్రులు పాకినట్లుంది. ఆమె భావాలు చదవకుండా ‘ఈ రోజు ఎలాగైనా ధైర్యం చేసి అడిగేయాలి’ అనుకున్నాడతడు.

_________________________________________________

పైనున్న కాసిన పంక్తుల్లోనే రచయిత ఎన్ని సార్లు ఒక పాత్రనుండి మరో పాత్రలోకి గెంతాడో గమనించండి. అతనితో పాటు పాఠకులు కూడా అటూ ఇటూ గెంతుతూ, కథని ఇద్దరి కోణాల్లోనుండీ చదవాల్సొస్తుంది. కథ మొత్తం ఇలాగే ఉంటే చదివేవాళ్లకి కళ్లు తిరగటం ఖాయం. ప్రధమ పురుషంలో కథ చెప్పే క్రమంలో రచయిత తడబడటం వల్ల వచ్చిన తలనొప్పిదంతా. కొత్తగా కథలు రాసేవాళ్లు తరచూ వేసే తప్పటడుగిది. ఉత్తమ పురుషంలో ఒకే పాత్ర కోణం నుండి కథ నడుస్తుంది కాబట్టి ఈ సమస్య ఉండదు. అందువల్ల  వర్ధమాన రచయితలు కాస్త చెయ్యి తిరిగేవరకూ ఉత్తమ పురుషంలో కథలు రాయటం మంచిది. (ఇదేమీ నియమం కాదు. సూచన మాత్రమే)

వర్ధమాన కథకులకుండే మరో సమస్య: పాత్రోచితమైన సంభాషణలు రాయలేకపోవటం. రచయిత రూపుదిద్దిన పాత్రలు మాట్లాడే పద్ధతిపై అతడి వ్యక్తిగత ముద్ర పడితే, అన్ని పాత్రలూ ఒకేలా ప్రవర్తించినట్లనిపించి కథ అసహజంగా తయారౌతుంది. కథలో ఉండటానికి భిన్నపాత్రలున్నప్పటికీ వాటన్నిట్లోనూ రచయిత గొంతే వినిపిస్తూ విసిగెత్తిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పాత్రౌచిత్యంతో పనిలేకుండా ప్రతి పాత్రా ప్రాస కోసం ప్రయాస పడుతూ మొనాటనీ సృష్టించినట్లన్న మాట. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి వాటి ఆలోచనలు భిన్న మార్గాల్లో వివరించటం కొత్త రచయితలెదుర్కునే పెద్ద సవాళ్లలో ఒకటి. ఆ సమస్య తప్పించుకోవటానికి ఉత్తమ పురుష కథనం అక్కరకొస్తుంది. ఇక్కడ కథంతా ఒక పాత్ర కోణం నుండే నడుస్తుంది కాబట్టి, కథకుడు తన ముద్రని సదరు పాత్ర ముసుగు కింద కప్పెట్టి తప్పించుకోవచ్చు. అలాగే, కథ మొత్తం – అంటే సంభాషణలు, వర్ణనలు, అన్నీ – ఏదో ఓ మాండలికంలో రాయటానికి కూడా ఉత్తమ పురుష కథనం నప్పుతుంది.

కొత్త కథకులకుండే ఇంకో సమస్య: అవకాశం దొరికితే (కొన్ని సార్లు అవకాశం దొరికించుకుని మరీ) కథలో సమాజానికి సందేశాలూ, ఉపన్యాసాలూ ఇరికించేసే బలహీనత. తమకు తెలిసినవన్నీ పాఠకులకి చెప్పేయాలనే ఉబలాటంతో కథాగమనానికి తోడ్పడని ఉద్బోధలు, వ్యాఖ్యానాలు, వ్యక్తిత్వ వికాస పాఠాలు, వగైరా, వగైరా చొప్పించేసి పడిపోతుంటారు. ప్రధమ పురుషంలో నడిచే కథల్లో రామాయణంలో పిడకలవేటలా రచయిత అభిప్రాయాలు, ఆక్రోశాలు, సిద్ధాంతాలు దొర్లటం ఎన్నిసార్లు గమనించారో గుర్తుకు తెచ్చుకోండి. అదే కథ ఉత్తమ పురుషంలో నడిచినట్లైతే అవే అభిప్రాయాలు తనని భరిస్తున్న పాత్ర నెత్తిన రుద్ది రచయిత తప్పించుకునే అవకాశం ఉంది (పాత్రోచితంగా ఉన్నంతవరకూ).

వర్ధమాన రచయితలెదుర్కొనే సమస్యల్లో మరో ముఖ్యమైనది: కథ ‘చూపటం’ కన్నా ‘చెప్పటం’ మీద ఎక్కువ దృష్టి పెట్టటం. “Show, don’t tell” అనేది ఎల్లవేళలా తూచా తప్పక పాటించాల్సిన నియమం కాకపోయినప్పటికీ, ఆ రెండిటి మధ్యా సమతూకం ఉండేలా చూసుకోవటం ముఖ్యం. కొత్తగా కథలు రాసేవాళ్లు ఈ విషయంలో తరచూ విఫలమౌతుంటారు. ప్రధమ పురుషంలో (third person) రాయబడ్డ కథల్లో ఈ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అసలీ “Show, don’t tell” అంటే ఏంటో అర్ధమవటానికి ఓ సంఘటన ప్రస్తావిస్తాను. ఇది చక్రపాణి, మల్లాది రామకృష్ణశాస్త్రి గార్ల మధ్య జరిగిన సంగతి అనుకుంటాను. పేర్లు సరిగా గుర్తులేవు.

శాస్త్రి గారు స్క్రిప్ట్ రచయితగా చేసిన తొలి సినిమా నిర్మాణంలో జరిగిన సంఘటనిది. అప్పటికే శాస్త్రిగారు సాహితీరంగంలో లబ్ద ప్రతిష్టులు. సినిమా రచనకి మాత్రం కొత్త. ఆయన రాసిన స్క్రిప్ట్ తొలివాక్యం ఇలా ఉంది:

“గౌరీనాధం సద్బ్రాహ్మణుడు”

ఆ వాక్యం చదివి చక్రపాణి వేసిన విసురు:

“శాస్త్రి గారూ. ‘నేను సద్బ్రాహ్మణుడిని’ అని గౌరీనాధం మెడలో బోర్డేమన్నా వేలాడేసుకు తిరుగుతాడా? ఆ విషయం సినిమాలో చూపెట్టాలి, చెప్పకూడదు. గౌరీనాధం ఉదయాన్నే సంధ్యావందనం చేసినట్లో, గాయత్రీ మంత్రం చదివినట్లో సన్నివేశం రాయండి. తక్కినది ప్రేక్షకులే అర్ధం చేసుకుంటారు”

అదన్నమాట సంగతి. తెరమీదకి తర్జుమా అయ్యే సినిమా స్క్రిప్టుల్లోనే కాదు, కథల్లో కూడా చెప్పటం కన్నా చూపెట్టటం అనేది పాఠకుడి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రధమ పురుషంలో (third person) నడిచే కథల్లో అవకాశం ఉందికదాని అదృశ్యరూపుడైన కథకుడు ఆకాశవాణిలా అన్ని విషయాలూ ‘చెప్పుకుంటూ’ పోవటం చాలా కథల్లో కనబడే విషయం. ఇవన్నీ ‘చూపిస్తే’ పాఠకుల్లో కలిగే అనుభూతి వేరు. అయితే ‘రాముడు మంచి బాలుడు’ అని ఒక్క ముక్కలో చెప్పగలిగేదాన్ని కథలో చూపెట్టాలంటే ఏకంగా ఓ సన్నివేశాన్నే సృష్టించాల్సి రావచ్చు. ప్రతిదీ చూపెట్టబోతే కథ మరీ పొడుగైపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ ‘చెప్పటం’, ‘చూపెట్టటం’ అనేవి రెండూ సమతూకంతో చెయ్యాల్సిన విషయాలు. కథనం మరీ నిదానం ఐపోయిందనిపించినప్పుడు వడివడిగా ‘చెప్పటం’, వేగం పెరిగిపోయిందనుకున్నప్పుడు ‘చూపెట్టటం’ ….. ఇలా ఈ రెంటినీ మార్చి మార్చి వాడటం ద్వారా కథన వేగాన్ని నియంత్రించుకురావటం ఒక పద్ధతి. ఇది సాధనతో సమకూరే కూసువిద్య. ఆ విద్య అబ్బేదాకా ఉత్తమ పురుషంలో కథలు చెబితే మంచిది. ఈ విధానంలో ఒక పాత్ర కథ ‘చెబుతుంది’ అన్న స్పృహ పాఠకుల్లో ఉండటం వల్ల, ‘చెప్పటం’ కాస్త మితిమీరినా చెల్లిపోతుంది. అలాగే, ప్రధమ పురుషంలో సాగదీసినట్లనిపించే వర్ణనలు ఉత్తమ పురుషంలోకొచ్చేసరికి మరీ అంత విసుగ్గా అనిపించవు. కారణం? ఇక్కడ పాఠకుడికీ, ప్రధాన పాత్రకీ మధ్య ఏర్పడ్డ బాదరాయణ సంబంధం వల్ల ఇతర తరహా కథనాల్లో సొదలా అనిపించే విషయాలు ఉత్తమ పురుషంలో చెప్పబడినప్పుడు సొంపుగా వినిపిస్తాయి. అందువల్ల, ప్రధాన పాత్ర మనసు ఆవిష్కరించటం కథకి కీలకమైతే, ఉత్తమ పురుషంలో కథ నడపటం ఉత్తమం. (అలాగని, ఈ విధానంలో కథకుడు తప్పనిసరిగా ప్రధాన పాత్రనే పోషించాల్సిన అవసరం లేదు. కథలో మరే పాత్రనైనా ధరించొచ్చు).

పైవన్నీ ఉత్తమ పురుషంలో రాయటంలో ఉన్న సౌలభ్యాలు. ఈ పద్ధతిలో ఓ పెద్ద సమస్య కూడా ఉంది.

ఉత్తమ పురుషంలో కథ చెప్పేటప్పుడు కథకుడు ఇతర పాత్రల మనసుల్లో ఏముందో చెప్పే అవకాశం ఉండదు. తాను పోషిస్తున్న పాత్రకి తెలియని విషయాలు, అవగాహన లేని విషయాలు  – కథకి ఎంత కీలకమైనవైనా – పాఠకుల ముందరుంచేందుకు దారుండదు. అయితే సరిగా వాడుకుంటే ఈ సమస్యలోంచి అద్భుతమైన ఉత్కంఠ పుట్టించొచ్చు. ప్రధాన పాత్ర దేన్నో అన్వేషించటం మీ కథలో ప్రధానాంశం అనుకోండి. ఆ పాత్ర కోణానికున్న పరిమితులవల్ల, ఆ కోణం నుండే కథ చదవాల్సిన అవసరం వల్ల, ఆ పాత్రకి తెలీని విషయాలేవీ పాఠకులకీ తెలియవు. దీనివల్ల కథకి అదనపు ఉత్కంఠ జతపడుతుంది. డిటెక్టివ్ కథలు ఎక్కువగా ఈ పద్ధతిలో నడవటం కాకతాళీయం కాదు. అలాగే, అవిశ్వసనీయ కథకుడు (unreliable narrator) విధానంలో కథ చెప్పటానికి కూడా ఉత్తమ పురుషానికి మించినది లేదు. వ్యక్తిగతంగా, నేను ఉత్తమ పురుషంలో కథ చెప్పటాన్ని విపరీతంగా ఆస్వాదిస్తాను. ఈ విధానానికున్న లిమిటేషన్స్‌ని ఉపయోగించుకుంటూ ఉత్కంఠభరితమైన కథలు రాయటం నాకో సరదా. నేను ఇంతవరకూ పది కథలు రాస్తే, వాటిలో ఏడు ఉత్తమ పురుషంలో నడిచినవే. ఒక్క ‘ప్రియ శత్రువు’ వదిలేస్తే తక్కిన ఆరింటిలోనూ ఓ సారూప్యత ఉంది. అదేమంటే, ఆ ఆరు కథల్లోనూ ప్రధాన పాత్రకి పేరు లేదు. ఇదేదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు. దాని వెనకో కారణముంది. అదేంటో మీ ఊహకే వదిలేస్తున్నాను.

ఆఖరుగా – అన్ని రకాల కథలనీ ఉత్తమ పురుషంలో చెప్పలేం. ఉత్తమ పురుషంలో ఉన్న సౌలభ్యాలు వాడేసుకుందామని గుడ్డెద్దు చేలో పడ్డట్లు కథలన్నీ ఇదే పద్ధతిలో దున్నేస్తానంటే కుదరదు. ముందు మీరనుకున్న కథాంశానికి ఇది సరైన విధానమో కాదో తేల్చుకోండి. ఇది సరిపడుతుందని రూఢి చేసుకున్నాక, ఈ క్రింది జాగ్రత్తలు తప్పక తీసుకోండి:

– ‘నేను’ కథ చెప్పేటప్పుడు తన గురించి తాను వర్ణించుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ పాత్ర ఆకార విశేషాలు, వేషభాషలు కథనానికి అత్యంత అవసరమైతే తప్ప చెయ్యకూడదు. తప్పని సందర్భాల్లో పరోక్ష వర్ణనకి దిగటం మెరుగు (వేరే పాత్ర ద్వారా సంభాషణలో చెప్పించటం, అద్దంలో పరికించి చూకోవటం, వగైరా).

– కథ చెబుతున్న ‘నేను’ అనబడే వ్యక్తి పురుషుడా, మహిళా, చిన్న పిల్లవాడా, ముదుసలా …. ఇటువంటి వివరాలు వీలైనంత త్వరగా పాఠకులకి చేరవేయాలి (ఆ వివరం దాచటం కథకి కీలకమైతే తప్ప).

– కథ చెబుతున్న పాత్రకి తెలిసే అవకాశం లేని విషయాలు (ఇతరుల ఆలోచనలు, తాను లేని సన్నివేశాల్లోని సంఘటనలు, వగైరా) ప్రస్తావించకూడదు.

– పైదానికి పూర్తి వ్యతిరేకమైన విషయం: ప్రధాన పాత్రకి తెలిసిన విషయాలు, కథకి కీలకమైనవి, సస్పెన్స్ పోషించటానికో లేక ముగింపుదాకా పాఠకుల్ని మభ్యపెట్టటానికో ఉద్దేశపూర్వకంగా తొక్కపట్టకూడదు.

– పైన ఉత్తమ పురుషంలో కథ ‘చెప్పటం’ అన్నదాన్ని ఎలా వినియోగించుకోవచ్చో చూశాం. అయితే దీన్ని అలుసుగా తీసుకుని అతిగా ‘చెప్పేస్తే’ కథనం బల్లపరుపుగా తయారవుతుంది.

– ఉత్తమ పురుషంలో ఉన్న సౌలభ్యాలు విచ్చలవిడిగా దుర్వినియోగపరిచేస్తే మొదటికే మోసం వస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్ అనేది అన్నిట్లా ఇక్కడా వర్తించే విషయం.

‘దృక్కోణం’ గురించిన మిగతా వివరాలు తరువాతి భాగంలో చూద్దాం.