రచన: అనిల్ ఎస్. రాయల్
ముందు భాగంలో కథ ‘చెప్పటం’ కన్నా ‘చూపటం’ ఎంత రక్తి కట్టిస్తుందో సోదాహరణంగా చూశాం. కథని ప్రదర్శించటానికి అక్కరకొచ్చే పనిముట్లలో అతి ముఖ్యమైనది సంభాషణ. దాని గురించి ఈ భాగంలో ముచ్చటించుకుందాం.
కథకీ వ్యాసానికీ ఉన్న ఒకే ఒక్క తేడా చెప్పమంటే మీరేమంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ‘సంభాషణలు’ అంటాను. వ్యాసానికి, కథకి ఉన్న పోలిక: రెండూ పద సమూహాలే. కథల్లో సంభాషణలుంటాయి, వ్యాసాల్లో ఉండవు. రచయిత ఆలోచనలు, అభిప్రాయాలు, అవగాహన, ఆవేశం, ఆక్రోశం, ఆనందం …. ఇవన్నీ పదాలై ధారగా కాగితమ్మీదకి ప్రవహించటమే వ్యాసంలోనైనా, కథలోనైనా జరిగేది. అయితే, ఆ పదాలై సంభాషణలైతే అవి రచయిత కలం నుండి కాకుండా అతను సృష్టించిన పాత్రల నోటి నుండి ఊడిపడ్డట్లనిపిస్తూ, పాఠకుల్ని ఆ పాత్రల లోకంలోకి లాక్కుపోతాయి. అదే కథ ప్రధానోద్దేశం: చదివినంతసేపూ పాఠకుల్ని వేరే లోకంలోకి లాక్కుపోవటం.
సంభాషణలు పాఠకులపై కలిగించే ప్రభావం తీసిపారేయలేనిది. మానవులు సాంఘిక జంతువులు. ఈ జంతువులు తోటి జంతువులతో సంబంధం ఏర్పరచుకునేదానికి దగ్గరి దారి సంభాషణ. పాఠకుడు కూడా ఓ మానవుడే. ఆ మానవుడు తాను చదువుతున్న కథలోని పాత్రలతో త్వరితగతిన కనెక్ట్ అయ్యేలా చెయ్యగలిగేది అందులోని సంభాషణలే. అవి కేవలం కథలోని పాత్రలు ఒకదానితో ఒకటి సంభాషించుకోవటానికి, సంబంధం నెరపటానికి మాత్రమే ఉద్దేశించినవి కావు. పాఠకుడు ఆ పాత్రల చెంతనే తానూ ఉండి వాటి మధ్య జరుగుతున్న సంఘర్షణ ప్రత్యక్షంగా గమనిస్తున్నట్లు చెయ్యగలిగే శక్తి సంభాషణలకుంది. అందుకే కొందరు రచయితలు కేవలం సంభాషణలతోనే కథ మొత్తం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి కొందరు సంభాషణతోనే కథ మొదలు పెడతారు.
సంభాషణలు కథలో జీవం నింపుతాయి; కథని వేగవంతం చేస్తాయి. మీరెప్పుడైనా సంభాషణలు లేకుండా కేవలం వర్ణనలు, వివరణలతో నిండిన కథ చదివితే ఇందులో ఎంత నిజముందో అర్ధమవుతుంది. సంభాషణలు లేని కథ రాయకూడదని కాదు. అలా రాయబడ్డ కథలు నీరసంగా ఉండే అవకాశాలెక్కువ. మీ పాత్రలతో మాట్లాడించటం, వాటితో అర్ధవంతమైన సంభాషణలు పలికించటం వల్ల పాఠకులు ఆ పాత్రలు సజీవం అనే భ్రాంతికి లోనవుతారు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందంటే వాళ్ల మధ్య మాట్లాడుకోదగ్గ విశేషం ఏదో ఉందన్నమాట. అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి పాఠకుల్ని మీ కథ వెంట పరుగులు తీయిస్తుంది.
కథలో సంభాషణలు ఎందుకు అవసరమో, ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం కదా. ఇక, అర్ధవంతమైన సంభాషణలు రాయటం ఎలాగో చూద్దాం.
‘ఓసోస్. తెల్లారి లేస్తే ఎన్ని వందల మాటలు మాట్లాడం? ఎంత మంది మాటలు వినం? సంభాషణలు రాయటం చిటికెలో పని’ అనుకుంటే మాత్రం మీరు పొరబడ్డట్లే. అర్ధవంతమైన సంభాషణలు రాయటం అంత తేలిక్కాదు. వాస్తవంలో ఇద్దరు మనుషులు మాట్లాడుకోవటానికి, కల్పనా లోకంలో రెండు పాత్రలు మాట్లాడుకోవటానికీ హస్తిమశకాంతరం ఉంది. కథల్లో సంభాషణలు వాస్తవికంగా ఉన్నట్లు భ్రాంతి కలిగించాలే తప్ప అవి నిజ జీవితంలో సంభాషణలకి నకళ్లుగా ఉండకూడదు. బయట ఉన్నది ఉన్నట్లు, విన్నది విన్నట్లు కథల్లో రాసేసి ‘బయట జరిగేదే మేం రాస్తున్నాం’ అనేయటం తప్పుకోటానికి పనికొచ్చే వాదనే తప్ప తర్కానికి నిలబడేది కాదు. ఇంతకీ ఏమిటా తర్కం?
అసలు వాస్తవికత అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న లోకంలో మనుషులు మాట్లాడే మాటల్ని అలాగే కథల్లోకి దించేయటం మాత్రం కాదు. మీరో సారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటల్ని ఉన్నవున్నట్లు ఓ కాగితమ్మీదకి ఎక్కించి తర్వాత చదువుకోండి, ఆ సంభాషణ ఎంత అర్ధరహితంగా అనిపిస్తుందో తెలుస్తుంది. వాళ్ల సంభాషణ పొడుగూతా – మాటల మధ్యలో నట్లు పడటం, ఓ క్రమంలో లేకుండా మాట్లాడటం, వాక్యం సగంలో మింగేయటం, చెప్పిందే చెప్పటం, సగమే చెప్పి మిగతా చేతులతో అభినయించి చూపటం, రకరకాల భాషలు కలగాపులగం చేసి మాట్లాడటం, పదాలు దొరక్క ఆగిపోవటం, ఇద్దరూ ఒకేసారి మాట్లాడటం (overlapped dialogue), పూర్వాపరాలూ, పూర్వోత్తర సంబంధాలూ (context) లేకుండా యధేచ్చగా మాట్లాడేయటం, ఆ మాట్లాడుకునేదాంట్లో సగానికి పైగా పనికిరాని కబుర్లే ఉండటం …. ఇలాంటివి ఎన్ని ఉంటాయో గమనించండి. నిజజీవితంలో నిత్యమూ ఎదురయ్యే ‘వాస్తవిక’ సంభాషణలివి. వీటిని ఇలాగే కథల్లోకి దించితే ఎంత గందరగోళంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి సంభాషణలని వడపోసి, పునరుక్తుల్ని పరిహరించి, ‘నట్లు’ ఊడబెరికి, ‘మింగుడు’ మానిపించి, అవసరమైనంత context జతచేసి, సాపు చేసి, అరగదీసి, మెరుగులద్ది …. తన కథని ముందుకు జరిపే రీతిలో రూపుదిద్ది పాఠకుల ముందు పెట్టటం కథకుడి పని. కథల్లో సంభాషణలకి ఇవన్నీ సహజాలంకారాలు. ఈ అలంకారాలే కథకి కళాకాంతులద్దేది. వాస్తవికతని ప్రతిఫలిస్తున్నాం అనుకుంటూ బయట ఉన్నవి ఉన్నట్లు రాస్తే అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సంభాషణల్లో అంతరార్దం ఎక్కువుండాలి; వ్యర్ధ ప్రసంగాలు ఉండకూడదు. వాస్తవంలో సహజంగా అనిపించే ప్రతిదీ కథల్లో సహజంగా అనిపించదని గుర్తుంచుకోండి.
ఈ సందర్భంలో ఓ ప్రశ్న ఎదురవుతుంది. ‘సంభాషణల్లో బూతులు ఉండొచ్చా?’. పాత్ర చిత్రణకి తప్పదనుకున్న సందర్భాల్లో ఆచి తూచి వాడితే అభ్యంతరకరమైన భాష సైతం ఒక షాకింగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చి, ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. అంతేకానీ సహజత్వం పేరుతో విచ్చలవిడిగా బూతు పదాల వాడకంలోకి దిగితే అది జుగుప్స కలగజేస్తుంది. వందేళ్ల కిందటే ఓ ప్రముఖ విమర్శకుడు అన్నట్లు – ‘కథ అనేది సంతోషం, భయం, ఆవేశం, వగైరా ఎన్ని భావాలైనా కలిగించొచ్చుకానీ, ఏ క్షణాన జుగుప్స కలిగిస్తుందో ఆ క్షణాన అది సాహిత్యం అనిపించుకునే అర్హత కోల్పోతుంది’. బూతుల వాడకం వల్ల కొందరు పాఠకుల్ని దూరం చేసుకోవటం తప్ప కథకి అదనంగా చేగూరే ప్రయోజనమేమీ ఉండదు. ‘పోతే పోయారు వెధవ పాఠకులు. ఇష్టమైనోళ్లే చదువుతారు’ అనుకునే రచయితకి చెప్పగలిగేదేం లేదు. ఇదే సూత్రం యాసలకి, మాండలికాలకి కూడా వర్తిస్తుంది. బూతుల్లానే, మాండలికం కూడా ఎంత మితంగా వాడితే అంత అధికంగా ప్రయోజనం ఉంటుంది. పాత్రోచితంగా మాండలికం వాడాలే తప్ప, రచయిత ఆయా మాండలికాల్లో తనకున్న పట్టు ప్రదర్శించటానికి కథ రాయకూడదు.
మరి ఇంత వడపోసి రాసే సంభాషణలు వాస్తవికంగా ఉన్న భ్రాంతి ఎలా కలిగిస్తాయి? దానికి చాలా దారులున్నాయి. అవేంటో చూద్దాం పదండి.
6.1 వాగుడు (తల)కాయలు
రెండు పాత్రల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ పోయినట్లు రాయటం వల్ల ఆ పాత్రలు యాంత్రికంగా అనిపిస్తాయి. ఆంగ్లంలో ‘talking heads problem’ అనబడే ఈ సమస్యని అధిగమించటం నిజానికి చాలా తేలిక. సంభాషణలతో పాటుగా ఆయా పాత్రలు ఏం చేస్తున్నాయి, వాటి ముఖాల్లో ఏమేం భావాలు పలుకుతున్నాయి, చుట్టూ ఏం నడుస్తుంది వంటి వివరాలు కూడా రాస్తే ఆ పాత్రలు మరబొమ్మల్లా కాకుండా మనుషుల్లా ప్రవర్తించినట్లనిపిస్తుంది. ఈ ఉదాహరణ చూడండి:
“ఎక్కడికి వెళ్లావురా? తిండి వేళకి కానీ ఇల్లు గుర్తు రాలేదా?”, కించిత్ కోపంగా అడిగేడు రామినీడు.
పై వాక్యం ఎంత యాంత్రికంగా ఉందో గమనించండి. పైగా ‘కించిత్ కోపంగా అడిగేడు’ అని ఇక్కడ రచయిత చెబుతున్నాడు. ఇదంత ప్రభావశీలమైన పద్ధతి కాదు. దాన్ని ఈ కింది విధంగా మారుద్దాం.
“ఎక్కడ ఊరేగి వస్తున్నావురా?”, పళ్లెంలో చెయ్యి కడుగుతూ అడిగేడు రామినీడు. “ఆకలేస్తే కానీ కొంప గుర్తుకు రాలేదా?”
పై వాక్యంలో రామినీడు ఏం మాట్లాడిందీ మాత్రమే కాక, అతనప్పుడు ఏం చేస్తుందీ కూడా చెప్పాం. అదే సమయంలో, కొడుకు అన్నాల వేళ దాటిపోయాక ఇంటికొచ్చాడన్న వివరమూ వెల్లడించాం. ‘ఎక్కడకు వెళ్లేవురా’ బదులు ‘ఎక్కడ ఊరేగి వస్తున్నావురా’, ‘ఇల్లు గుర్తుకు రాలేదా?’ బదులు ‘కొంప గుర్తుకు రాలేదా’ అనిపించటం ద్వారా ‘కించిత్ కోపాన్ని’ కూడా ప్రదర్శించాం.
పై ఉదాహరణలో నేర్చుకోవలసిన విషయం మరొకటీ ఉంది. సంభాషణలన్నిట్నీ ‘అతను చెప్పాడు’, ‘ఆమె అన్నది’ వంటి tags తో ముక్తాయించటం బాగోదు. వీలైనంతవరకూ, అటువంటి tags వాడాల్సిన సందర్భమొచ్చినప్పుడు పాత్రల శరీరభాష, ముఖకవళికలు వగైరా సూచించే వాక్యాలు వాడటం వల్ల సన్నివేశానికి అభినయం జతపడి కథనం వేగవంతమైన భావన కలగజేస్తుంది. మీ పాత్ర చెప్పే సంభాషణ మరీ పొడుగైపోయిందనిపించినప్పుడు దాన్ని ముక్కలుగా విడగొట్టి, మధ్యలో అభినయాన్ని జతచేస్తే కథ బాగా ‘ప్రదర్శించ’బడుతుంది. ఎందుకంటే, నిజజీవితంలో మనుషులెవరూ బిర్రబిగిసి నిలబడి మాట్లాడుకోరు. మాట్లాడుతూనే ఏదో ఓ పని చేస్తుంటారు, ముఖంలో రకరకాల భావాలు పలికిస్తుంటారు. వాటిని కథల్లోనూ ప్రదర్శించటం వల్ల మీ పాత్రల్లో జీవం ఉట్టిపడుతుంది. అదే సమయంలో పొడుగాటి సంభాషణలతో పాఠకులని విసుగెత్తించే ప్రమాదమూ తప్పుతుంది. అలాగని సంభాషణలన్నిట్లోనూ పాత్రల అభినయం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అవసరమ్మేరా మాత్రమే ఆ పని చేయాలి. లేకపోతే talking heads సమస్య వదిలించుకుని దాని స్థానంలో అతిగా నటించేసే పాత్రల్ని తెచ్చిపెట్టినట్లవుతుంది.
6.2 మాటల మూటలు
ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించ కూడదు. మీ పాత్రలు ఒక్కో విడతలో పేరాలకి పేరాలు (ఇంకా ఘోరంగా, పేజీలకి పేజీలు) మాట్లాడేస్తూ పోతే పాఠకులు విసుగెత్తిపోతారు. నిజ జీవితంలో ఎలాగైతే మనం అనర్ఘళంగా మాట్లాడమో (ఉపన్యాసాలిచ్చేటాప్పుడు తప్ప), అలాగే మీ పాత్రలు కూడా అదే పనిగా మాట్లాడుతూ పోకూడదు. రెండు పాత్రల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడది ఏకపక్షంగా ఉండకూడదు. రెండో పాత్ర కూడా నోరు విప్పుతుండాలి, లేదా కనీసం తలాడించటమో, ప్రశ్నలేయటమో, ఊఁ కొట్టటమోనన్నా చేయాలి. ఒకే పాత్రతో ఎక్కువసేపు మాట్లాడించి తీరాల్సిన అవసరం పడితే ఆ సంభాషణని భాగాలుగా విడకొట్టి మధ్య మధ్యలో అభినయం, ఇతర వర్ణనలు జతచేయాలి.
ఇక, ప్రతి పాత్ర చెప్పే సంభాషణకీ ఒక పేరాగ్రాఫ్ కేటాయించాలి. ఇలా చేయటం వల్ల, సంభాషణ వెనక ప్రతిసారీ ‘రాజు చెప్పాడు’ తరహా tags తగిలించాల్సిన అవసరం ఉండదు. మొదట మాట్లాడింది ఎవరు, ఆ తర్వాత మాట్లాడింది ఎవరు అన్నది ఒకసారి ఎస్టాబ్లిష్ చేశాక, ఇక tagsతో పనిలేకుండానే పాఠకులు ఏ సంభాషణ ఎవరిదో అర్ధం చేసుకుంటారు. అయితే ఇది రెండు పాత్రల మధ్య సంభాషణకి మాత్రమే పనికొస్తుంది. అంతకన్నా ఎక్కువ మంది మధ్య మాటలు నడుస్తుంటే tags ఎక్కువగానే వాడాల్సివస్తుంది. ఒకటే పేరాలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాత్రల సంభాషణలు మాత్రం ఎప్పుడూ ఇరికించకూడదు. అలాచేస్తే పాఠకులు గందరగోళానికి గురవుతారు.
6.3 పాత్రోచిత భాషణం
పదేళ్ల పిల్లవాడు మాట్లాడే మాటలు, అరవయ్యేళ్ల వృద్ధుడు మాట్లాడే మాటలు ఒకేలా ఉండవని గమనించాలి. ప్రపంచమ్మీద వాళ్లకుండే అవగాహన లోనే కాదు, వాళ్లిద్దరి vocabularyలో కూడా చాలా తేడా ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అలాగే స్త్రీలు, పురుషులు, మధ్య తరగతి మనుషులు, కడు పేదలు, వైద్యులు …. ఇలా లింగ, జాతి, మత, వర్గ, స్థాయీ భేదాలు వాళ్లు వాడే భాషమీద ప్రభావం చూపిస్తాయి. మీ పాత్ర నేపధ్యం, దాని వృత్తి, ఇత్యాదివన్నీ పరిగణలోనికి తీసుకుని దానికో స్పష్టమైన ‘స్వరం’ అమర్చాలి. లేకపోతే అన్ని పాత్రల సంభాషణలూ ఒకేలా ఒకేలా అనిపిస్తాయి. వాటి సొంత గొంతులు కాకుండా అన్నిట్లోనూ రచయిత గొంతే వినిపిస్తుంది. ఆ పాత్రలన్నీ రచయిత సృష్టించినవే, వాటి నోళ్ల గుండా వెలువడేది రచయిత అప్పగించిన చిలక పలుకులే. అంతమాత్రాన అవన్నీ ఏక రీతిన మాట్లాడాలని లేదు. ఆ పలుకులు వాస్తవికంగా అనిపించాలంటే ప్రతి పాత్రా తన సొంత వ్యక్తిత్వాన్ని తాను మాట్లాడే మాటల్లో కనబరచాలి.
ఈ పని చేయటం చాలా కష్టం అనుకోవచ్చు మీరు. ఇందుకోసం రచయితకి రక రకాల యాసలు, భాషా ప్రయోగాలు, వాడుకలు తెలిసుండాలి, రకరకాల మనుషుల గురించి అవగాహన ఉండాలి అనుకోవచ్చు. అవన్నీ ఉంటే మంచిదే. లేకపోయినంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదు. సంభాషణలు రాసే విధానంలో ఒక్కో పాత్రకీ ఒక్కో template రూపొందించి దాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఉదాహరణకి, ఒక పాత్ర పొడవాటి వాక్యాలు మాట్లాడితే, మరో పాత్ర చిన్న చిన్న వాక్యాలతో సరిపెడుతుంది. అలాగే, ఒక పాత్ర కొన్ని రకాల ఊతపదాలు పదే పదే వాడుతుంది, మరో పాత్ర మాటల్లో తరచూ సామెతలు, ఉపమానాలు దొర్లుతుంటాయి. ఒక పాత్ర ఎప్పుడూ గంభీరంగా మాట్లాడుతుంది. మరో పాత్ర మాటల్లో హ్యూమరసం పొంగి పొర్లుతుంది. ఒక పాత్ర అచ్చ తెలుగే మాట్లాడితే, మరో పాత్ర ఆంగ్ల పదాలు ధారాళంగా వాడేస్తుంది. ఇలాంటివి చెయ్యటం పెద్ద కష్టమైన పనేం కాదు.
6.4 కృతక సంభాషణం
______________________________________
“హరీష్ అంటే, మీ మూడోవాడేగా? ఢిల్లీలో ఇంజనీరింగ్ చదవటానికెళ్లి రెండేళ్లకే చదువుకి నామం పెట్టొచ్చేసి పనీ పాటా లేకుండా రికామీగా తిరుగుతూ ఊర్లో ఆడపిల్లల వెంట పడి ఏడిపిస్తూ ఒకట్రెండు సార్లు పోలీసుల చేతిలో తన్నులు కూడా తిన్నాడని ఎప్పుడూ చెప్పి బాధ పడుతుంటావు. మళ్లీ ఏం తలనొప్పి తెచ్చి పెట్టాడు?”, వెంకటేశం చుట్ట పీలుస్తూ అడిగాడు.
“చాలా పెద్ద తలనొప్పేరా”, రామారావు నిట్టార్చాడు. “ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలీటం లేదు”.
______________________________________
పై సంభాషణ ఎంత కృతంగా ఉందో గమనించండి. వెంకటేశం, రామారావు మంచి స్నేహితులన్నట్లు, హరీష్ విషయం వాళ్ల మధ్య చాలాసార్లు చర్చకొచ్చినట్లు ఆ సంభాషణలోనే స్పష్టంగా ఉంది. మరి తామిద్దరికీ తెలిసిన విషయాన్ని వెంకటేశం అంత వివరంగా మళ్లీ చెప్పటం ఎందుకు? ఈ సంభాషణ రామారావుతో వెంకటేశం పలికినట్లుగా లేదు. పాఠకులకి రచయిత చెప్పినట్లుగా ఉంది. హరీష్ ఎటువంటివాడో పాఠకులకి పరిచయం చెయ్యటానికి రచయిత ఎంచుకున్న మార్గమిది. ఇటువంటివి చాలా అసహజంగా ఉంటాయి. పాఠకులకి పాత్రల నేపధ్యం, ఇతర వివరాలు తెలియజెప్పే ప్రయత్నంలో చాలామంది వర్ధమాన కథకులు చేసే పొరపాటిది. సమాచారం అందించటానికి సంభాషణలు వాడుకోవచ్చు కానీ, ఆ సమాచారాన్ని పాత్రల నోళ్ల వెంట బలవంతాన కక్కించకూడదు. అలా చేయటం వల్ల సంభాషణల్లో వాస్తవికత లోపిస్తుంది.
______________________________________
“ఆ రోజు గుర్తుందా?”
“మనిద్దరమూ జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకు గుర్తుండదు?”
______________________________________
పై ఉదాహరణలో కథకుడు ‘ఆ రోజు’ ఆ రెండు పాత్రలకీ ఎలా ఎప్పటికీ గుర్తుండిపోయిందో పాఠకులకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఒక పాత్రతో ప్రశ్న అడిగించి మరో పాత్రతో సమాధానం చెప్పిస్తున్నాడు. ఇటువంటి సంభాషణ నిజ జీవితాల్లో ఎదురవొచ్చేమో కానీ కథల్లో అది అనవసరమైన ప్రశ్న-సమాధానం అవుతుంది. రెండు పాత్రలకీ బాగా తెలిసిన విషయాన్ని పనిగట్టుకుని పాఠకుల కోసం బలవంతంగా చెప్పించటం అనవసరం. దీనికిబదులు ఒకే పాత్రతో ఈ విషయాన్ని ఇంతకన్నా మెరుగ్గా చెప్పించొచ్చు:
______________________________________
“అదెంత భయంకరమైన రోజో గుర్తుందిగా”
______________________________________
6.5 ఆ విషయం ఎలా తెలుసబ్బా!?!
పైదానికి సరిగా వ్యతిరేకమైన పొరపాటు కూడా చాలా మంది పాతా కొత్తా కథకులు చేస్తుంటారు. పాత్రలకి బాగా తెలిసిన విషయాలు పాఠకుల కోసం పనిగట్టుకుని చెప్పటం ఎంత అసహజంగా ఉంటుందో, పాత్రలు తమకి తెలిసే అవకాశం లేని సంగతులు కూడా అలవోకగా చెప్పుకుపోవటం అంతే అసహజంగా ఉంటుంది. సాధారణంగా, పాత్రలు ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు వివరించే సందర్భాల్లో ఇటువంటివి ఎదురవుతుంటాయి. సంభాషణలు రాసేప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా నివారించవచ్చు.
6.6 ఉబుసుపోక కబుర్లు
______________________________________
ఫోన్ ట్రింగ్‌మనటంతో చేస్తున్న పని మధ్యలో ఆపేసి పరుగున వచ్చి ఫోనెత్తింది రాధిక.
“హలో”
“నేను సుమతిని. అవతల మాట్లాడేది రాధికేనా?”
“అవును. చెప్పక్కా. ఏంటి సంగతి?”
“కొంచెం అర్జెంట్ పని పడిందే నీతో. ఈ రోజు సాయంత్రం ఏడింటికి ఫలానా చోట కలవటం కుదురుతుందా?”
“ఉండు ఇప్పుడే చెబుతాను” అంటూ రిసీవర్ చెంపకానించుకుని కాసేపు ఆలోచించిది రాధిక. ఆ సాయంత్రం తనకి ఏమేం పనులున్నాయో గుర్తు తెచ్చుకుంది. అంత ముఖ్యమైనవేం కావు. “కుదురుతుందక్కా”.
“తప్పకుండా వస్తావుగా. చాలా ఇంపార్టెంట్ విషయం”
“తప్పకుండా. ఇంకేమిటి విశేషాలు?”
“నువ్వే చెప్పాలి”
“నిన్న బజారునుండొస్తుంటే మాధురి కనబడింది. బాగా లావయింది. తనే వచ్చి పలకరించేదాకా గుర్తుపట్టలేకపోయాననుకో”
______________________________________
నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ (ప్రత్యక్ష సంభాషణ సైతం) పై విధంగానే ఉంటుంది. అసలు విషయం కొంతే ఉండి, కొసరు కబుర్లు కోకొల్లగా ఉంటాయి. కథల్లో మాత్రం ఇలాంటి సంభాషణలు నసలా అనిపిస్తాయి. పై సంభాషణలో పాఠకుడికి ఆసక్తిగొలిపే విషయం, కథకి పనికొచ్చే విషయం ఒకటే ఉంది: సుమతి రాధికతో ఏదో ముఖ్యమైన విషయం చర్చించటానికి ఆ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఫలానా చోట కలవబోతుంది. మిగిలిన పోసుకోలు కబుర్లు, ఎంత వాస్తవికంగా ధ్వనించినప్పటికీ, పాఠకుడికి అనవసరం. కథని ముందుకు జరపని ఇటువంటి కబుర్లు ఆయా పాత్రలకి ఆసక్తికరంగా అనిపిస్తాయేమో కానీ, పాఠకుడిని మాత్రం అసహనానికి గురి చేస్తాయి. సంభాషణలు రాసేటప్పుడు కథకుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన సంగతొకటుంది: ఆ సన్నివేశానికి పాఠకుడొక శ్రోత లాంటి వాడు. మీరు సంభాషణలు రాస్తున్నది ఆ శ్రోత కోసమే తప్ప, అవి పలికే పాత్రల కోసం కాదు. మీ శ్రోతని (అదే, పాఠకుడిని) విసుగెత్తించే వివరాలు సంభాషణల్లో దొర్లకుండా జాగ్రత్త పడటం అత్యవసరం. పాత్రోచితంగా ఉందనో, లేక మీకు నచ్చిందనో కథకి ఉపయోగపడని కబుర్లని సంభాషణలుగా మలచొద్దు. ఒకవేళ అత్యవరమైతే సంభాషణా రూపంలో కాకుండా వ్యాఖ్యానం రూపంలో సూచనాప్రాయంగా తెలియజేయటం మెరుగు. రెండు పాత్రల మధ్య సంభాషణ ‘హలో’తో మొదలై ‘ఇక ఉంటాను’తో పూర్తి కావలసిన అవసరం లేదు. మధ్యలో మొదలై, అవసరమైన విషయం మాట్లాడేసిన తర్వాత అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు. కథాగమనానికి ఉపయోగపడని చెత్తంతా లేపేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల మీ కథకి క్లుప్తత కూడా లభిస్తుంది.
6.7 మౌన భాషణం
______________________________________
కాఫీ తాగినంతసేపూ మొన్న విడుదలైన ఫ్యాక్షన్ సినిమా గురించి, ఈ ఉదయం పత్రికలో పెద్దక్షరాల్లో వచ్చిన హత్య గురించి, ఇంకా ఏవేవో చాలాసేపు మాట్లాడాడు. నన్నిక్కడికి పిలిచిన కారణం మరేదో ఉందని తెలిసిపోతూనే ఉంది. అదేంటో వాడే చెప్పేదాకా ఓపిగ్గా ఎదురుచూశాను. నాలుగు కప్పుల కాఫీ తర్వాత అసలు సంగతి బయట పెట్టాడు.
“ప్రణీతకి విడాకులివ్వాలనుకుంటున్నాను”
నాకు ఊపిరాగిపోయింది. నోట మాట రాలేదు.
______________________________________
పైన గమనించాల్సిన విశేషాలు రెండున్నాయి. మొదటిది: పిచ్చాపాటీ కబుర్లతో పాఠకుడిని విసుగెత్తించకుండా పది నిమిషాలకి పైగా సాగే సంభాషణని సూచనా మాత్రంగా చెప్పేయటం. ముందటి ఉదాహరణలో (రాధిక, సుమతి ఫోన్ కాల్) వాస్తవికత కోసం కథకి ఉపయోగపడని సంభాషణలు రాసిన వైనం ఇక్కడ లేదు.
రెండో విశేషం: మాటకి మాటే ఎప్పుడూ ప్రతిస్పందన కానవసరం లేదని చూపించటం. కొన్నిసార్లు మౌనం వంద మాటల పెట్టవుతుంది. మీ పాత్రలు మాటల ద్వారానే కాదు, అప్పుడప్పుడూ మాట్లాడకుండా ఉండటం ద్వారా కూడా అర్ధవంతంగా సంభాషించగలవని గుర్తు పెట్టుకోండి.
6.8 నొక్కి వక్కాణింపులు
______________________________________
“లేచిపోయిందా?”, రాజిరెడ్డి ముఖం వివర్ణమయింది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆమె చేసిన పని అతడిని తీవ్రంగా బాధించసాగింది.
______________________________________
ఇక్కడ సంభాషణతో సమస్య లేదు. దాన్ని ఆనుకుని ఉన్న రెండు వాక్యాలతోనూ సమస్య లేదు. చిట్ట చివరి వాక్యంతోనే సమస్య. తనకందిన వార్తకి రాజిరెడ్డి స్పందన ‘లేచిపోయిందా?’ అన్న మాట ద్వారా, అతని హావభావాల వర్ణనద్వారా రచయిత సమర్ధంగా వివరించాడు. అయినా అతడికి (రచయితకి) ఇంకా ఏ మూలో చిన్న సందేహం: “రాజి రెడ్డి ఎంత బాధ పడుతుందీ పాఠకులకి అర్ధమవుతుందా” అని. అందువల్ల మరో వాక్యం అదనంగా జతచేశాడు. అది పూర్తిగా అనవసరం. ‘ఆమె చేసిన పని అతడిని తీవ్రంగా బాధించసాగింది’ అన్న విషయం రాజి రెడ్డి మాటలు, చేతల ద్వారా పాఠకులకి అర్ధమైపోతుంది. అదే విషయం మరోమారు నొక్కి వక్కాణించనవసరం లేదు. రచయిత అనేవాడు పాఠకుల అవగాహనా స్థాయిని, తెలివితేటల్ని మరీ అంత తక్కువగా అంచనా వేయకూడదు.
6.9 ఇండెంటేషన్
సంభాషణలకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం – ఇండెంటేషన్. సరైన ప్రదేశాల్లో విరామ చిహ్నాలు వాడాలి. హైఫన్, ప్రశ్నార్ధకం, ఆశ్చర్యార్ధకం, మూడు చుక్కలు (…), వగైరా వాడకంలో ప్రామాణికత పాటించటం ముఖ్యం. మన ఇష్టం వచ్చిన అర్ధంలో వాటిని వాడేస్తే పాఠకులు గందరగోళానికి గురవుతారు. అలాగే, వాటిని ఎడా పెడా విచ్చలవిడిగా కూడా వాడేయకూడదు. అప్పుడు మీ కథంతా చిత్రవిచిత్రమైన సింబల్స్‌తో నిండిపోయి కంగాళీగా తయారవుతుంది.
సంభాషణలు రాసేటప్పుడు సాధారణంగా అందరూ పాటించే పద్ధతొకటుంది: సంభాషణల్ని డబుల్ కొటేషన్స్ ( ” ) మధ్యలో ఉంచి, సంభాషణలో మరో సంభాషణ దొర్లితే దాన్ని సింగిల్ కొటేషన్స్ ( ‘ ) మధ్యలో ఉంచటం. కింది ఉదాహరణ చూడండి.
“వద్దురా అంటూ ఎంత పోరినా వినలేదు వాడు. ‘నువ్వు చెప్పేదేంటి’ అంటూ తీసి పారేశాడు”
ప్రతి పాత్ర సంభాషణకీ ఒక పేరాగ్రాఫ్ కేటాయించటం మంచి పద్ధతి అని గతవారం చెప్పుకున్నాం. పేరాగ్రాఫుల మధ్య ఒక లైన్ బ్రేక్ ఇవ్వటం కూడా ముఖ్యం. అలా చేయటం వల్ల సంభాషణలు చెబుతున్న పాత్ర మారిందన్న విషయం ‘అతను చెప్పాడు’, ‘ఆమె పలికింది’ వంటి tags లేకున్నా కూడా పాఠకులకి తేలిగ్గా తెలిసిపోతుంది. అదే కాక, ఇటువంటి ‘శూన్య ప్రదేశాలు’ (white spaces) పాఠకులు సేదదీరటానికి, ఊపిరి పీల్చుకోటానికి ఉపయోగపడతాయి.
అవండీ సంభాషణల గురించిన కబుర్లు. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు కానీ ఇక్కడితో ఆపేద్దాం.
స్పందించండి