రచన: అనిల్ ఎస్. రాయల్


 

శీర్షిక, ఎత్తుగడ, ముగింపు, దృక్కోణం, సంభాషణలు – ఇవన్నీ సరిగా అమరటం కథకి ఎంత ముఖ్యమో గత భాగాల్లో తెలుసుకున్నాం. అయితే అవన్నీ చాలావరకూ సాంకేతికమైనవి. వాటన్నిటికన్నా ముందు, మీ దగ్గర అసలంటూ చెప్పటానికో కథుండాలి. కథంటూ ఉంటే, అందులో ఉండి తీరాల్సినవి పాత్రలు. వాటి గురించి ఈ భాగంలో తెలుసుకుందాం.

కథల్లో రెండు రకాలుంటాయి: నిర్మాణం ప్రధానంగా నడిచే (plot driven) కథలు, మరియు పాత్ర చిత్రణ మీద శ్రద్ధ పెట్టే (character driven) కథలు. మీ కథ వీటిలో ఏ కోవకి చెందినదైనా, అందులో ఎన్నో కొన్ని మానవ పాత్రలైతే ఉండటం తప్పనిసరి.

‘కథల్లో పాత్రలుండాల్సిందేనా? అవి లేనిదే అది కథ అనిపించుకోదా?’ అని మీరడగొచ్చు. అనిపించుకోదని చెప్పటానికి అరక్షణం కూడా ఆలోచించనవసరం లేదు. నిశ్చల తటాకాలు, నిశీధిని వెలిగించే తారకలు, నీలి మేఘాలు, పొదలు, పూలు – ఇటువంటివన్నీ గద్యరూపంలో అద్భుతంగా వర్ణించే కళ మీ చేతిలో ఉండొచ్చుగాక. కేవలం వాటితోనే నింపేస్తే కవిత్వానికి చెల్లుతుందే తప్ప కథకి కాదు. కథలో ‘కదలిక’ ఉండాలి. జీవం తొణికిసలాడాలి. వాస్తవాల ఆధారంగా రాయబడ్డా, లేక పూర్తిగా రచయిత కల్పన నుండి ఊడిపడ్డా – కథలనేవి జీవితాలకి దర్పణాలు. జీవం మానవ జాతికొక్కదానికే పరిమితమైన విశేషం కాకపోయినా, మానవుల్లేని జీవితాలు మనం ఊహించలేం. మనుషుల సంతోషాలు, భయాలు, బాధలు, కోపాలు, పాపాలు, పగలు, పరాజయాలు, ఆశలు, అవమానాలు, అనుమానాలు, అనుభూతులు, అనుభవాలు, ఉక్రోషాలు, ఉద్వేగాలు …. ఇటువంటివే మనకి ఆసక్తి కొలిపేది. మీరు దెయ్యాల కథలు రాసినా, జంతువులు ప్రధాన పాత్రలుగా రాసినా వాటికి మనుషుల గుణగణాలు ఆపాదించక తప్పదు. అద్భుతమైన ఆవిష్కరణల గురించి రాయబడే సైన్స్ ఫిక్షన్ కథల్లో సైతం, సదరు సాంకేతికత మానవ జీవితాలపై కలిగించే ప్రభావాన్ని పరిశీలించటమే ప్రధానాంశం. అలా కాకుండా ఆ గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని, అందులో లోటుపాట్లని విశదీకరించటం మాత్రమే చేస్తే అదో పరిశోధనా పత్రంలానో, వ్యాసంలానో మిగిలిపోతుంది. కాబట్టి మీరు రాయబోయేది ఏ తరహా కథైనా, అందులో ఉండి తీరేవి మానవ పాత్రలు. మీ కథకి మానవీయ కోణం అద్దేది, పాఠకులు మీ కథలో లీనమయేలా చేసేవి కూడా అవే. కథాయణం గత భాగాల్లో చదువుకున్న మెరుగులన్నీ ఎంత చక్కగా దిద్దినా, మీ కథని నిలబెట్టేది, ముందుకు నడిపించేది అందులోని పాత్రలే. అందువల్ల పాత్రల చిత్రణ అనేది రచయిత ఆషామాషీగా తీసుకోవలసిన విషయం కాదు.

ఈ ఉపోద్ఘాతమంతా కథలకి పాత్రలు ఎంత ముఖ్యమో నొక్కిచెప్పటానికి. మరి ఇంత ముఖ్యమైన పాత్రల్ని రూపొందించే క్రమంలో రచయితలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూద్దాం పదండి.

‘కథ అంటే ఏమిటి’ అంటే రకరకాల సమాధానాలొస్తాయి. అవన్నీ నిజమే కావచ్చు. కథంటే ఏంటో ఒక్క ముక్కలో వివరించటం తేలిక్కాదు, కానీ కథంటే ఏం కాదో చెప్పటం తేలికే:  ‘కథ అంటే కుదించబడ్డ నవల కాదు’. నవలకున్న వైశాల్యం కథకి లేదు. ఇది కథకుల పని కష్టతరం చేసే పరిమితి – ముఖ్యంగా, పాత్రల చిత్రీకరణ విషయంలో.

వాస్తవంలో మనుషుల్లో రకరకాల కోణాలుంటాయి. ఎన్నెన్నో గుణాలుంటాయి, వైరుధ్యాలుంటాయి. బలహీనతలు, లోపాలు, గతాలు, స్వగతాలు, కోరికలు, అనుభవాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, మరెన్నో ఉంటాయి. ఓ పాత్రకి నిండుదనం రావాలంటే, అది కాగితం పుటలపై సిరా మరకలుగా మిగిలిపోకుండా పుస్తకం నుండి బయటకొచ్చి సజీవంగా కదలాడాలంటే ఆ పాత్రకి సంబంధించిన సంగతులెన్నింటినో పాఠకులకి చేరవేయాలి. కానీ కథల్లో అంత సమయం ఉండదు, స్థలమూ ఉండదు. అందువల్ల మీ ప్రధాన పాత్ర జీవితాన్ని పూర్తిస్థాయిలో సమర్ధవంతంగా ఆవిష్కరించాలంటే నవల రాసుకోవటం ఉత్తమం. అది కథలో ఇరికించటానికి సరిపడే సరుకు కాదు.

పై కారణం వల్ల సాధారణంగా కథల్లో మితిమీరిన సంఖ్యలో పాత్రలుండవు. ఒకటి లేదా రెండు ముఖ్య పాత్రలు, వాటి చుట్టూ కాసిని సహాయ పాత్రలతోనే కథలన్నీ నడుస్తుంటాయి. పాత్రల గురించి అవసరమైన మోతాదులో మాత్రమే కథకుడు వెల్లడిస్తాడు. మిగిలినవన్నీ పాఠకుల ఊహకే వదిలివేస్తాడు. చాలా కథల్లో ఏకైక ప్రధాన పాత్ర ఉంటుంది. కథ మొత్తమూ ఆ పాత్రతో సంబంధమున్న ఒకటి లేదా రెండు సంఘటనల చుట్టూతా మాత్రమే తిరుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి, దానికున్న లెక్కలేనన్ని సంక్లిష్టతల్లోంచి, ఒకే ఒక మనిషిని, అతనికి సంబంధించిన ఒకే ఒక సంఘటనని ఎంచుకుని కథ చెప్పి దానికదే సంపూర్ణం అన్న భావన పాఠకుడిలో  కలగజేయటం అత్యంత కఠినమైన విషయం. కానీ తగు జాగ్రత్తలు తీసుకుని రూపుదిద్దితే పరిమిత సమాచారంతో పరిచయం చేయబడ్డ ఈ పాత్రలు సైతం పాఠకులని చాన్నాళ్లు వెంటాడతాయి. ఏ రైల్లోనో కాసేపు మనతో కలిసి ప్రయాణించి తర్వాతెప్పుడూ కనపడకుండా పోయినప్పటికీ, ఏదో కారణం వల్ల జీవితాంతం మనకి గుర్తుండిపోయే పేరు తెలియని విశిష్టమైన వ్యక్తులు కొందరుంటారు. సరిగా రూపొందిన పాత్రలు కూడా పాఠకులపై అలాంటి ముద్రే వేస్తాయి.

మరి అలాంటి ముద్ర వేయాలంటే ఆ పాత్ర ఎలా ఉండాలి? అందులో ఏదో ప్రత్యేకత ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని సాదాసీదా మనుషుల్లా ఉండకూడదు. అది ఎదుర్కొనే సంఘటనలు కూడా సగటు రోజువారీ ఘటనల్లా ఉండకూడదు. మన జీవితాల్లో నూటికి తొంభై శాతం నీరసమైన ఘట్టాలతోనూ, ఏ ప్రత్యేకతా లేని సాధారణ మానవులతోనూ నిండి ఉంటాయి. అవే కథల్లోనూ ఎదురైతే పాఠకులని ఆకట్టుకోవు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అన్నట్లు, ‘జీవితంలోంచి నిస్సారమైన క్షణాలన్నిట్నీ తొలగిస్తే మిగిలేదే కథ’. మీరు మీ రచనా వైదుష్యాన్నంతా రంగరించి వచన సౌందర్యం కుమ్మరించి ఎంత అద్భుతంగా రాసినప్పటికీ, మీ ఇంట్లో అంట్లు తోమే కార్యక్రమాన్ని గొప్ప కథగా మలచలేరు – ఆ కథ ఎంత వాస్తవ సంఘటనల, యధార్ధమైన మనుషుల ఆధారంగా రూపొందినప్పటికీ.

ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి. వినటానికి విడ్డూరంగా అనిపించినా, కథలకి సంబంధించిన వాస్తవం ఏమిటంటే – మీ పాత్రలు వాస్తవికంగా అనిపించాలంటే వాటి చిత్రీకరణలో కొంత అతిశయం ఉండాలి. ‘కథలు వాస్తవికతకి అద్దం పట్టాలి, కనుక బయట ఉన్నది ఉన్నట్లు కథలో చెప్పాలి’ అనే నమ్మకమేదన్నా మీకుంటే దాన్ని అత్యవసరంగా అవతల పెట్టేయండి. ఎందుకంటే – ఎంత హంగామా చేసి ఎన్నెన్ని తిప్పలు పడ్డప్పటికీ,  కళ అనేది ప్రకృతికెప్పుడూ ప్రతిరూపు కాలేదు. ఎంత ఉత్కృష్టమైన కళారూపమైనా ప్రకృతి ముందు అల్పమైనదే. ప్రకృతి మానవులపై అలవోకగా, అతి సహజంగా ప్రసరించే ప్రభావాన్ని కలిగించటానికి ఏ కళారూపమైనా ఎంతో కొంత అతిశయోక్తులపై ఆధారపడక తప్పదు. కాబట్టి కళ పని అతిశయీకరించటం. కథ ఇందుకు మినహాయింపు కాదు. అందులోని పాత్రలక్కూడా ఇది వర్తించే విషయం. ఓ చిత్రకారుడు ఎలాగైతే తాను గీస్తున్న వర్ణ చిత్రంలో రంగుల సంతృప్తత పెంచటం, నలుపు-తెలుపుల మధ్య తారతమ్యాన్ని అధికం చేయటం, అనవసరమైన వివరాలు దాచివెయ్యటం, అందమైన భాగాలు కొట్టొచ్చినట్లు కనబడేలా చిత్రించటం వగైరా చిట్కాల ద్వారా ‘సహజత్వాన్ని’ సాధిస్తాడో, కథకుడు కూడా అలాగే తన పాత్రల చిత్రీకరణలో పరిశ్రమించాలి.

పాత్రల చిత్రీకరణకి రెండు పద్ధతులున్నాయి. మొదటిది – కథకుడు తాను ఎరిగిన వ్యక్తుల ఆధారంగా పాత్రల్ని రూపొందించటం. రెండో పద్ధతి – పూర్తిగా కథకుడి ఊహనుండి పాత్రలని రూపొందించటం. వీటిలో ఏది మంచి పద్ధతి అన్న ప్రశ్న అనవసరం. ఏ పద్ధతి అవలంబించినా, చివరకా పాత్ర ఎలా రూపొందిందన్నదే ముఖ్యం. ఎక్కువమంది కథకులు మధ్యేమార్గంగా పోతారు. అంటే ఈ రెండు పద్ధతుల్నీ కలగలిపి వాడతారన్న మాట.

మీ పాత్రల్ని మీరెరిగిన వ్యక్తుల ఆధారంగా మలచాలనుకుంటే గుర్తుంచుకోవలసిన విషయమొకటుంది. మనకెదురయ్యే మనుషుల్లో ఏ కొందరో తప్ప మిగిలినవారిలో పెద్దగా ప్రత్యేకతలేమీ ఉండవు. ప్రత్యేకతలున్న ఆ కొందరిలో కూడా ఏ ఒకటో రెండో తప్ప మిగిలినవన్నీ సాధారణమైన లక్షణాలే ఉంటాయి. కథకుడి పని ఆ ప్రత్యేక లక్షణాలని మాత్రమే వాడుకోవటం, వాటి తీవ్రత పెంచటం. చెయ్యి తిరిగిన కథకులు చాలామంది సాధారణంగా తమ పాత్రలని ఏ ఒక్కరి నుండో కాక తామెరిగిన పలువురి నుండి పలు లక్షణాలు పరిగ్రహించటం ద్వారా రూపు దిద్దుతారు.

పాత్రలు చిత్రీకరించే క్రమంలో వర్ధమాన కథకులు చాలామంది తరచూ చేసే పొరపాటు – ఆయా పాత్రల భౌతిక లక్షణాలు, వ్యక్తిత్వం పూసగుచ్చినట్లు వర్ణించటం. ఆ వర్ణన కూడా ఏదో పచారీ సరుకుల జాబితా చదివినట్లుంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. కథకుడికి తాను సృష్టించే పాత్రపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. ఆ పాత్ర గురించిన వివరాలన్నీ తెలిసుండాలి. కానీ అవన్నీ పాఠకులకి చెప్పాల్సిన పనిలేదు. కథకి అవసరమైనంతవరకూ చెప్పి మిగిలినవి పాఠకుల ఊహకే వదిలేయాలి. ఏ కళకైనా ముఖ్యమైన సూత్రం: ఎంపిక & తిరస్కరణ. కథకుడెప్పుడూ తాను సృష్టించిన పాత్రల గురించి తానెరిగిన సమాచారమంతటినీ పాఠకుల ముందు పెట్టకూడదు. ఎప్పుడు, ఏది, ఎంత అవసరమో అంతవరకే వెల్లడించాలి. అలాగే, తన పాత్రలని వర్ణించటం (describing) కాకుండా నిర్మించటం (developing) మీద శ్రద్ధ పెట్టాలి. ‘రాముడు మంచి బాలుడు’ అని కథకుడు ఏక వాక్యంలో ఎకాఎకీ చెప్పేయటం అంత ప్రభావశీలంగా ఉండదు. దీన్ని ‘ప్రత్యక్ష పాత్ర చిత్రణ’ (direct characterization) అంటారు. ఇది కథకుడు ఆ పాత్ర గురించి ‘చెప్పటం’ అన్నమాట. దీనికంటే మెరుగైన పద్ధతి ‘పరోక్ష పాత్ర చిత్రణ’ (indirect characterization). ఈ విధానంలో కథకుడు పాత్రల్ని పరిచయం చేసి పక్కకు తప్పుకుంటాడు. తర్వాత ఆ పాత్రలు తమ ప్రవర్తన ద్వారా, చేతల ద్వారా, మాటల ద్వారా తామేమిటో పాఠకలోకానికి స్వయంగా తెలియబరచనీయనిస్తాడు. ఇక్కడ తెర వెనకనుండి తన పాత్రల్ని నియంత్రించటం, నిర్దేశించటమే కథకుడి పని. అత్యవసరమైతే తప్ప వ్యాఖ్యానం రూపంలో కలగజేసుకోడు. ఓ వ్యక్తి మీద ఎవరో చెప్పింది విని ఓ అభిప్రాయం ఏర్పరచుకోవటానికి, స్వయంగా మన కళ్లతో చూసి ఓ అభిప్రాయానికి రావటానికీ ఉన్నంత తేడా ఈ ప్రత్యక్ష/పరోక్ష పాత్ర చిత్రణ పద్ధతుల మధ్య ఉంది.

పాత్రల చిత్రణ చేయటానికి కథకుడికి ప్రధానంగా ఐదు మార్గాలున్నాయి: రూపురేఖల వర్ణన, వ్యక్తిత్వ ప్రకటన, అంతరంగావిష్కరణ, సంభాషణ, పరాభిప్రాయం. మరీ ఎక్కువ వివరాల్లోకి పోకుండా అవేమిటో స్థూలంగా చెప్పుకుందాం.

7.1 రూపురేఖలు

రూపురేఖా విలాసాల వివరణ అన్ని పాత్రలకీ తప్పనిసరి కాదు. కథకి కీలకమైతే తప్ప ఈ వివరాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. కథాగమనానికి ఉపయోగపడని వర్ణనలు పాఠకులని విసుగెత్తిస్తాయి. అవి కథ పొడుగు పెంచటానికి తప్ప మరి దేనికీ పనికి రావు. చాలా సందర్భాల్లో ప్రధాన పాత్ర పేరు, వయసు, లింగం – ఈ మూడు వివరాలతోనే కథ నడిపేయటం వీలవుతుంది. పాత్ర ఆకారం, ఆహార్యం గురించి మీరు వెల్లడించే వివరాలు ఆ పాత్ర సాంఘిక స్థాయినో, అలవాట్లనో, మరే ఇతర గుణాన్నో వెల్లడించాలి. అంతే తప్ప కేవలం ఆ పాత్ర భౌతిక లక్షణాలు వివరించటానికి వాక్యాలు వృధా చేయరాదు. పాత్రల బాహ్య స్వరూపం కన్నా వాటి అంతఃస్వరూపాన్ని తెలుసుకోటానికి పాఠకులు ఎక్కువ ఆసక్తి చూపుతారని గుర్తుంచుకోండి. ఒక పాత్ర భౌతిక వివరాలు చెప్పటం తప్పనిసరైన సందర్భాల్లో కథకుడు ప్రత్యక్ష చిత్రణ కన్నా పరోక్ష చిత్రణ మీద ఆధారపడటం మెరుగు. అంటే, ఆ పాత్ర ఎలా ఉందో వ్యాఖ్యానించటం కాకుండా, ఆ పాత్ర గురించి ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయో చెప్పించటం, వగైరా అన్నమాట.

7.2 వ్యక్తిత్వ ప్రకటన

వ్యక్తుల వైఖరి, తీరుతెన్నులు, అలవాట్లు, బలహీనతలు, ఏం చేస్తారు, ఏం చెయ్యరు – ఇత్యాదివి గమనించటం, పరిశీలించటం ద్వారా వాళ్ల వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేస్తాం; వాళ్లు మంచివాళ్లా, స్వార్ధపరులా, లోభులా, భోళాశంకరులా, జల్సారాయుళ్లా, గడుసరులా అనేది తెలుసుకుంటాం. కథల్లో పాత్రల్ని పాఠకులు అంచనా వేసే పద్ధతి దీనికి భిన్నంగా ఉండదు. అందువల్ల కథకుడు తన పాత్రల శరీరభాష, హావభావాలు, చర్యలు, మొదలైనవి వర్ణించటం ద్వారా; వివిధ సందర్భాల్లో వాళ్లెలా ప్రవర్తించేదీ, ప్రతిస్పందించేదీ తెలియజేయటం ద్వారా పాఠకులు ఆ పాత్రని ‘పరిశీలించే’ అవకాశం కలగజేయాలి.

7.3 అంతరంగావిష్కరణ

పాత్రల ఆలోచనా ధోరణి వాటి అనుభూతుల్ని, ఉద్వేగాల్ని పాఠకుల కళ్లకు కడుతుంది. వాటి చర్యల వెనకున్న ఉద్దేశాల్ని విశదీకరిస్తుంది. ఆ చర్యల్ని పాఠకులు మరింత సానుభూతితో అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల పాత్రల అంతరంగావిష్కరణ కొన్ని సందర్భాల్లో కీలకమవుతుంది. అయితే కథకుడిగా మీరు ఏ స్థాయిలో పాత్రల మనసుల్లోకి చొరబడగలరు అనేది ఆ కథ చెప్పటానికి మీరెంచుకున్న దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి, బాహ్య ప్రధమ పురుషంలో కథ చెప్పబూనుకుంటే అంతరంగావిష్కరణ జోలికి వెళ్లకుండా పాత్ర చిత్రణ చేయాల్సుంటుంది. (మరింత సమాచారం కోసం ‘దృక్కోణం’ వ్యాసం చదవండి).

7.4 సంభాషణలు

సంభాషణల గురించిన వివరాలకు గత భాగం చదవండి.

7.5 పరాభిప్రాయం

పాత్రల గురించి కథకుడు చెప్పేది, తమ గురించి తాము పాత్రలు చెప్పుకునేది, ‘చూపేది’ మాత్రమే కాక, ఆయా పాత్రల గురించి కథలోని ఇతర పాత్రలు ఏమనుకుంటున్నాయనేది కూడా పాఠకులకి చాలా విషయాలు తెలియబరుస్తుంది. మీ ప్రధాన పాత్రంటే ఇతర పాత్రలకి గౌరవమా, భయమా, చిన్నచూపా; ఆ పాత్ర గురించి మిగతా పాత్రలు ఏం మాట్లాడుకుంటాయి; ఆ పాత్ర ప్రభావం ఇతర పాత్రల మీద ఎలా ఉంది; వగైరా వివరాలు చెప్పటం వల్ల పాఠకుడు కథలోని పాత్రల మధ్య బంధాలు, సమస్యలు, ఘర్షణ సరిగా అర్ధం చేసుకుంటాడు.

అవండీ, పాత్ర చిత్రణ కబుర్లు.