రచన: అనిల్ ఎస్. రాయల్


 

గత ఎనిమిది భాగాల్లో కథకి సంబంధించిన ఆరు అంశాలని వివరించాక, ‘కథాయణం’ చివరి ఘట్టానికి చేరింది. ఈ భాగంలో కథ నిర్మాణం ఎలా ఉండాలో చెప్పి ఈ వ్యాసావళిని ముగిస్తాను.

కథ నిర్మాణం అంటే ఏమిటి? తేలికపాటి మాటల్లో చెప్పాలంటే – మీ కథలో సంఘటనల్ని ఓ క్రమపద్ధతిలో అమర్చటమే ఆంగ్లంలో plot అనబడే ‘నిర్మాణం’.

‘ఇంతేనా! అదెంత పని?’ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నాలుగ్గోడలు, కాసిని కిటికీలు, ఓ తలుపు, పైనో కప్పు కట్టేస్తే ఇల్లు పూర్తవుతుందేమో కానీ అది నాలుక్కాలాలు నిలబడాలంటే మాత్రం డిజైన్ దశ నుండీ దాన్ని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించాల్సిందే. అలాగే – సంఘటనల్ని, సన్నివేశాలని ఒకదాని తర్వాత ఒకటి పేరుస్తూ వెళ్లిపోవటం వల్ల మీ కథకి ఓ రూపం వస్తుందేమో కానీ, అది అందరూ గుర్తుంచుకునేంత గొప్పగా రూపొందాలంటే నిర్మాణమ్మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అయితే, మీరు నిర్మాణమ్మీద అంత శ్రద్ధ పెట్టినట్లు బయటికి కనపడకూడదు. అంటే, నిర్మాణం అనేది మిగతా అంశాలని (కథనం, సంభాషణలు, పాత్ర చిత్రణ, వగైరా) కమ్మేయకుండా రచయితలు జాగ్రత్త పడాలి. మీ కథ ఓ పూమాల అనుకుంటే, plot అందులో దారం అనుకోవచ్చు. దారం లేనిదే దండ లేదు కానీ, దండలో అంతటా దారమే అగుపిస్తే ఎంత బోసిగా అనిపిస్తుందో, కథని నిర్మాణ కౌశలం డామినేట్ చేస్తే అది కూడా అలాగే వెలవెలాపోతుంది. కాబట్టి కథ నిర్మాణం కత్తిమీద సాము వంటిది.

మీ కథలో ఏమేం సంఘటనలు అవసరమవుతాయో ఇతివృత్తం నిర్దేశిస్తుంది. ఆ సంఘటనల్ని ఏ క్రమంలో, ఎలా చెబితే కథ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా రూపొందుతుందో తేల్చుకోవటం కథకుడిగా మీ బాధ్యతల్లో ప్రధానమైనది. సాధారణంగా – డిటెక్టివ్, హారర్ వగైరా genre కథల విషయంలో రచయితకి నిర్మాణపరంగా ఎక్కువ శ్రమ అవసరమవుతుంది. అంతమాత్రాన పాత్రల సంఘర్షణ ప్రధానంగా నడిచే character driven కథల్లో నిర్మాణం ప్రాముఖ్యత కొట్టిపారేసేది కాదు. ఎందుకంటే, ఏ సందర్భంలో మీ పాత్రల ప్రవర్తన ఎలా ఉందనేది వాటి వ్యక్తిత్వాలని సూచిస్తుంది. మీ పాత్రలకి ఎదురయ్యే సంఘటనలు, అవి పోరాడే సమస్యలు, తీసుకునే నిర్ణయాలు – ఇవన్నీ పాత్రల చిత్రణని, వాటి చర్యల్ని, ఆలోచనల్ని, మాట్లాడే మాటల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు. కాబట్టి మీరెంత అంతఃసంఘర్షణ పైనే కేంద్రీకరించి కథంతా నడపబూనుకున్నా కూడా మీ కథకి నిర్మాణం అనేది తప్పనిసరి.

దురదృష్టవశాత్తూ, కథ నిర్మాణంపై తెలుగు కథకుల్లో కొంత చులకన భావం ఉంది. నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించటంలో సృజనాత్మకత ఉండదని, ‘ఆలోచించి’ రాసే కథలకన్నా యధేచ్చగా (spontaneous) తోచింది తోచినట్లు రాసుకుపోయే కథల్లో అందం ఎక్కువని ఒక దురభిప్రాయం ఉంది. ఎంతగా మెదడు కుడి భాగం సృజనాత్మకతకి కేంద్రమైనప్పటికీ, ఎడమ భాగం ప్రమేయం లేకుండా రూపొందే ఏ కళారూపమైనా అపరిపక్వంగా మిగిలిపోతుంది. ఈ అంశమ్మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఆ వివరన్నీ ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పొచ్చేదేమంటే, మీక్కూడా ‘ఆలోచించి’ రాయటమ్మీద చులకనభావమేదన్నా ఉంటే వెంటనే వదిలించుకోండి. వర్తమాన తెలుగు కథల్లో వస్తుపరంగా నూతనత్వం, కావలసినంత వైవిధ్యం ఉంటున్నప్పటికీ వాటిలో అధికం నాసిరకంగా ఉండటానికి ఈ ధోరణే కారణమని చెప్పొచ్చు.

నిర్మాణం అనేది కేవలం పాత్రల చిత్రీకరణనే కాదు, కథన శైలిని, కథ చెప్పే దృక్కోణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కడ ఎంత సమాచారాన్ని ఎలా వెల్లడించాలనేది కూడా నిర్మాణమే నిర్దేశిస్తుంది. కథ ఎత్తుగడ, ముగింపు కూడా ఆ కథని మీరెలా నిర్మించారనేదానిపై ఆధారపడి ఉంటాయి. ఏతా వాతా, కథాయణంలో మనం ముచ్చటించుకున్న ప్రతి ఆంశమూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కథ నిర్మాణమ్మీద ఆధారపడి ఉంటుంది. పాత్ర చిత్రణ ప్రధానంగా నడిచే కథల్లో నిర్మాణం వెనుక వరుసలో కూర్చుంటుంది; అదే డిటెక్టివ్, హారర్ వగైరా genre కథల్లో నిర్మాణం ముందు వరసకొస్తుంది. ప్రాధాన్యతలో హెచ్చు తగ్గులే తప్ప, నిర్మాణం అనేది ఏ రకమైన కథకైనా ముఖ్యమైన విషయమే అని వర్ధమాన కథకులు గుర్తెరగాలి. ఓ కథ రాయబూనుకునే ముందు మీ మదిలో దాని నిర్మాణమ్మీద పూర్తి అవగానుండాలి. అది లేకుండా కాగితమూ కలమూ పట్టుక్కూర్చుని తోచిన అందమైన వాక్యాలు గిలికేసి దానంతటదే ఓ అద్భుతమైన కథగా రూపొందుతుందనుకోవటం అత్యాశే అవుతుంది.

నిర్మాణంపై ఉపోద్ఘాతం ఇంతటితో ముగించి, నా కథల్లో ఒకదాన్ని ఎంచుకుని దాన్ని నేనెలా నిర్మించిందీ విశదీకరిస్తాను. ఆ క్రమంలో, ‘కథాయణం’ వ్యాస పరంపరలో వివిధ సందర్భాల్లో చర్చించుకున్న అంశాలు, స్పృశించిన కథన వైనాలు ఈ కథలో నేనెలా అమల్లో పెట్టిందీ కూడా వివరిస్తాను. ఆ కథ పేరు ‘మరపు రాని కథ‘.

_____________________________________________

ఇతివృత్తం 

మరపు అనేది మానవ యంత్రంలో సృష్టికర్త కళ్లుగప్పి చొరబడ్ద నిర్మాణలోపం కాదు. అది, మనుషులు  జ్ఞాపకాలకి బానిసలుగా మారకుండా ఉండేటందుకు ఉద్దేశ్యపూర్వకంగా జతపర్చబడ్డ విశేషాంశం.

_____________________________________________

‘మరపు’ ఇతివృత్తంగా కథ రాయాలనుకున్నప్పుడు నాకు మొదట తట్టిన వాక్యాలవి. పై వాక్యాలు కథలో అమర్చటానికి సందర్భం కుదరక తీసేయాలొచ్చింది. కథలో ఇమడకపోతే రచయితకి ఎంత నచ్చిన వాక్యాలనైనా నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే.

ఇతివృత్తం అనుకున్నాక దాన్ని కథ రూపంలో చెప్పాలంటే ఎన్నో కొన్ని పాత్రలుండాలి. వాటిలో కనీసం ఒకటి ప్రధాన పాత్ర కావాలి. ఆ పాత్రకి ఏదో సమస్యుండాలి. ఆ సమస్యని ఎదుర్కొనే క్రమంలో సదరు పాత్ర సంఘర్షణకి గురికావాలి. చివరికి ఆ సమస్య తీరిందా, లేదా అనేది వేరే కథ. ఇదంతా ఫార్ములా వ్యవహారం అనిపించొచ్చు. కానీ గొప్పదిగా పేరుబడ్డ ఏ కథనైనా తీసుకుని పరిశీలించండి. ఇవన్నీ కనబడి తీరతాయి. అది కాకతాళీయం కాదు.

‘మరపు’ ఇతివృత్తానికి పాత్రలు, సమస్యలు, సంఘర్షణ జోడించాక దాని సినాప్సిస్ ఈ క్రింది విధంగా తయారయింది.

_____________________________________________

కథా సంగ్రహం 

ఓ ముసలాయన. ఆయనకో చీకటి గతం. ఆ గతంలో తానొడిగట్టిన పాపమొకటి నిరంతరం కళ్లలో కదలాడుతున్నా, తనవారితో చెప్పుకుని కాస్త ఉపశమైనా పొందలేని పిరికితనం. చనిపోయేలోపైనా ఎవరో ఒకరితో పంచుకోకపోతే ఆ బరువు తనకు తోడుగా సమాధిలోకొస్తుందనే భయం.

ఇలా ఉండగా ఒక రోజో యువకుడు ఆయనదగ్గరికొస్తాడు. ఆ అపరిచితుడితో ముసలాయన మనసు విప్పి తన గతం చెప్పుకుంటాడు. అంతా విన్నాక ఆ యువకుడో రహస్యం బయట పెడతాడు.

ఏమిటా రహస్యం? ముసలాయన గతమేమిటి? ముసలాయనకీ ఆ యువకుడికీ ఉన్న సంబంధం ఏమిటి? తనవారితోనూ చెప్పుకోలేని విషయాలు ఓ అపరిచితుడితో చెప్పటానికి కారణమేంటి?

_____________________________________________

పై కథా సంగ్రహంలో ముఖ్యమైన విషయాలు రెండున్నాయి: మొదటిది – అంతఃసంఘర్షణ చిత్రించగలిగే అవకాశమున్న ప్రధాన పాత్ర. రెండోది – పాఠకుల ఆసక్తి పట్టి నిలపటానికి తగినన్ని ప్రశ్నలు.

‘ఇతివృత్తం’, ‘కథా సంగ్రహం’ రూపొందాక మూడో దశ కథ నిర్మాణం – అంటే, plot development. ఈ దశలో పాత్రలకి వ్యక్తిత్వాలనివ్వటం, సన్నివేశాలు కల్పించి వాటిలో పాత్రల్ని పడేయటం, ఘర్షణ సృష్టించటం, సమస్యలు పుట్టించటం ఉంటుంది. ఈ దశ పూర్తయేసరికి కథ ఓ రూపానికొస్తుంది. వ్యక్తిగతంగా, నాకు ఈ దశలోనే అసలీ కథాంశానికి ఇంతకన్నా ముందుకెళ్లే అవసరముందా లేక ఇక్కడితో ఆపేసి చెత్తబుట్టలో పడేయొచ్చా తెలిసిపోతుంది. నావరకూ నేను కథ రాసేప్పుడు ఈ మూడో దశకే ఎక్కువ సమయం తీసుకుంటాను. (నేను రాసే తరహా కథలకి నిర్మాణం అత్యంత కీలకం కావటం కూడా దానికో కారణం).

మళ్లీ ‘మరపురాని కథ’లోకెళితే, నిర్మాణ సమయంలో కథలోని ఉన్న రెండు ముఖ్యపాత్రల గుణగణాలపై అవగాహనొచ్చింది. ముసలాయన పాత్రకి ఓ ప్రత్యేకత తేవటానికి, ఆ పాత్ర మీద పాఠకులకి సానుభూతి కలగటానికి, ఆయనకో అరుదైన మెదడు సంబంధిత వ్యాధి కలగజేశాను. అలాగే, ఆయన భార్య పాత్రకీ కథలో చోటు కల్పించాను. ఈ మూడు పాత్రలతో కథ ఎలా నడపాలనే విషయంలో స్థూలంగా ఓ అంచనాకొచ్చాను. ఈ కథని ఏ దృక్కోణంలో చెప్పాలో కూడా ఈ దశలోనే నిర్ణయించుకున్నాను.

ఇక్కడ దృక్కోణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘మరపురాని కథ’లో ఉన్నవి రెండు ముఖ్య పాత్రలు, మరొక సహాయ పాత్ర. ఆ పాత్రలన్నిటికీ అక్కడ ఏం జరుగుతుందో కొంత తెలుసు, మరికొంత తెలియదు. ఏ పాత్రకి ఎంత తెలుసో పాఠకుడికి చివరివరకూ తెలియనీయకపోవటం ఈ కథలో ఉత్కంఠ నింపటానికి అత్యవసరం. కాబట్టి ఈ కథని ఎవరి కోణం నుండి చెప్పాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఉత్తమ పురుషం, సర్వజ్ఞ ప్రధమ పురుషం, లేదా పరిమిత ప్రధమ పురుషం – ఈ మూడింటిలో దేన్ని ఎంచుకున్నా కూడా ఏదో ఒక పాత్ర అంతరంగంలోకి చొరబడి దాని ఆలోచనాస్రవంతిని చూచాయగానైనా వెల్లడించాల్సుంటుంది. ఈ దృక్కోణాల్లో కథ చెప్పినప్పుడు కథకుడు తాను ‘అనుసరిస్తున్న’ పాత్రకి తెలిసిన విషయాలని కేవలం ఉత్కంఠ రసం పోషించాలన్న కారణంతో పాఠకులకి చెప్పకుండా తొక్కిపట్టటం కృతకంగా ఉంటుంది. కాబట్టి ఈ కథకి ఈ మూడు దృక్కోణాలూ సరిపడవు. అందువల్ల ‘మరపురాని కథ’ని బాహ్య ప్రధమ పురుషంలో, ఏ పాత్ర బుర్రలోనూ దూరకుండా అన్ని పాత్రలకీ సమదూరంలో నిలబడి చెప్పటమే సరైన పని.

పై విధంగా కథకి ఓ ఆకారమొచ్చింది. అది ఇలా ఉంది.

_____________________________________________

మరపురాని కథ

ఓ వృద్ధుడు, ఆయన భార్య వసారాలో కూర్చుని కాఫీ సేవిస్తుండగా ఒక యువకుడు అక్కడికొస్తాడు.

వృద్ధుడి భార్య ఇంట్లోకెళ్లిపోతుంది. వృద్ధుడు చేతిలోని పుస్తకం పక్కన పెట్టి యువకుడిని పలకరిస్తాడు.

యువకుడి వాలకం చూస్తే అతనికి వృద్ధుడితో ముందే పరిచయం ఉన్నట్లనిపిస్తుంది. కానీ వృద్ధుడు ఆ యువకుడిని ఎప్పుడూ చూడలేదంటాడు. ఒకసారి చూస్తే జన్మలో దేన్నీ మర్చిపోలేని జబ్బు తనకుందని చెబుతాడు. మరచిపోయే శక్తి లేకపోవటం ఎంత నరకమో వివరించి ఆవేదనాభరితుడవుతాడు. ఇద్దరి మధ్యనా సంభాషణ కొనసాగుతుంది. ఆ క్రమంలో, తొలుత తటపటాయించినా, యువకుడి ప్రోత్సాహంతో వృద్ధుడు తన చీకటి గతాన్ని వెల్లడిస్తాడు. ఎన్నో ఏళ్లుగా సొంతవారిదగ్గరా దాచిన రహస్యాన్ని ఓ అపరిచితుడికి వెల్లడించటానిక్కారణం కూడా చెబుతాడు.

ఆయన కథ విన్నాక యువకుడు తానెవరో, ఎందుకొచ్చాడో వెల్లడిస్తాడు. (వాళ్లిద్దరికీ ఉన్న సంబంధమేంటో ఇక్కడ తెలుస్తుంది). చెప్పాక, తనని క్షమించమని వృద్ధుడిని వేడుకుంటాడు.

‘నిన్ను క్షమించాల్సిన తప్పేమీ చెయ్యలేదు బాబూ నువ్వు’ అంటాడు వృద్ధుడు.

అప్పుడు, ‘నేను చెప్పింది మీరు సరిగా అర్ధం చేసుకోలేదంకుల్. నన్ను క్షమించమన్న కారణం వేరే’ అంటూ వృద్ధుడిని షాక్‌కి గురి చేసే విషయమొకటి చెబుతాడా యువకుడు.

వృద్ధుడు షాక్‌లో ఉండగా ఆయన భార్య బయటికొస్తుంది.

వాళ్ల వద్ద సెలవు తీసుకుని యువకుడు బయల్దేరుతుండగా, ‘వచ్చే వారం తప్పకుండా వస్తావుగా బాబూ’ అని ఆవిడ ప్రాధేయపూర్వకంగా అడుగుతుంది. సరేనన్నట్లు తలూపి యువకుడు వెళ్లిపోతాడు.

వృద్ధుడు కాఫీ టేబుల్ మీదున్న పుస్తకం అందుకుని చదవటం ప్రారంభిస్తాడు.

_____________________________________________

అలా నా కథకి ఓ ‘అస్థిపంజరం’ సమకూరింది. పైన ‘పూదండ’ ఉదాహరణలో చెప్పినట్లు, ఈ అస్థిపంజరం లోపలుండాల్సిందే తప్ప బయటికి కనబడకూడదు. అంటే, కథకి కండ కలగజేయాలి. అనగా action, సంభాషణలు జోడించటం; పాత్రల అంతరంగాలు ఆవిష్కరించటం, వాటి వ్యక్తిత్వానికి తుది రూపునీయటం, ఇతర మెరుగులు దిద్దటం. ఆంగ్లంలో treatment అనబడే ఈ దశని తెలుగులోకి నేరుగా దించేసి ‘చికిత్స’ అనేద్దాం.

కథలో రెండు ముఖ్య పాత్రలకీ గత చరిత్రలు, వాటిలో దాగిన రహస్యాలు ఉన్నాయి. అవేమిటనే విషయమ్మీద ‘నిర్మాణ’ సమయంలో నేను దృష్టి పెట్టలేదు. ఆ దశలో మరీ ఎక్కువ వివరాలు అనవసరం. అవన్నీ ‘చికిత్స’ దశలో దృష్టిపెట్టే సంగతులు. కథ నిర్మాణాన్ని బట్టి అందులో ఉండే సన్నివేశాలు, వాటి సెటప్, వాతావరణం, కథకుడి tone, కథ యొక్క mood, ఇతర వివరాలు రూపొందుతాయి. అలాగే, ఈ ‘చికిత్స’ దశలోనే కథ ఎత్తుగడ, ముగింపు విషయంలో కూడా స్పష్టత వస్తుంది.

‘మరపురాని కథ’ బాహ్య ప్రధమ పురుషంలో చెప్పబడటం వల్ల, పాత్రల ఆలోచనలు వెల్లడించే అవసరం లేదు. దానికి బదులుగా నేను పాత్రల సంభాషణలు, హావభావాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సుంది. ఈ కథలో ఓ పాత్ర మరో పాత్ర వద్ద ఏదో రహస్యాన్ని దాస్తున్న మూలాన, ఆ పాత్ర సంభాషణలు మొదటిసారి కథ చదివినప్పుడు ఒకలా, రెండో సారి చదివినప్పుడు మరోలా అనిపించేలా రాయాల్సిన అవసరముంది. ఇవన్నీ treatment లో భాగమే. వీటన్నింటి తర్వాత అస్థిపంజరానికి తనదైన రూపమొచ్చింది. (పాఠకుల సౌకర్యం కోసం ‘మరపురాని కథ’ ఈ పుస్తకం చివర్లో జతచేయబడింది)

కథ నిర్మాణం గురించిన విశేషాలవి. ఈ సందర్భంగా మీరు తెలుసుకోవలసిన విషయమొకటుంది. ‘మరపురాని కథ’ ఎలా రాయబడిందీ ఉదహరించే క్రమంలో నేను ‘ఇతివృత్తం’, ‘కథా సంగ్రహం’, ‘అస్థి పంజరం’ అంటూ ఆ కథని ఎలా నిర్మించుకొచ్చిందీ రాత పూర్వకంగా సూచించానే తప్ప, కథలు రాసేప్పుడు నేనిలాగే చేస్తానని కాదు; అందరూ అలాగే చేయాలని అసలే కాదు. నా మనసులోనే కథ పూర్తి రూపం సంతరించుకోనిచ్చి, సంభాషణలతో సహా ఒకేసారి రాసేయటం నాకలవాటు. ఆ తర్వాత ఒకట్రెండు రివిజన్స్ చేసి కథలోంచి అనవసరమైన ‘కొవ్వు’ తీసేస్తాను. మొత్తమ్మీద కథ ‘రాయటం’ మొదలు పెట్టాక ఒకట్రెండు రోజుల్లో పూర్తైపోతుంది. రాయటం మొదలు పెట్టక ముందే అసలు కథంతా నడుస్తుంది. ఇది నా పద్ధతి.