రచన: అనిల్ ఎస్. రాయల్
దీనితో ‘కథాయణం’ పూర్తయింది. ఇది చదివినవారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ, చివరగా నాలుగు మాటలు చెబుతాను.
కథలెలా రాయాలో వ్యాసాలు చదివితే వంటబట్టే విషయం కాదు. అంత మాత్రాన అటువంటి వ్యాసాలకి విలువ లేకుండా పోదు. కళలు నేర్చుకుంటే రాకపోవచ్చు. కానీ ఎంత స్వతహాగా వచ్చిన కళైనా మెళకువలు తెలుసుకుని అమల్లో పెడితే మెరుగు పడుతుంది. ‘కథాయణం’లో వివరించిన అంశాలన్నీ వర్ధమాన కథకులు తూచా తప్పక పాటించాల్సిన అవసరం లేదు. అవి నియమాలు కాదు. సూచనలు మాత్రమే. ఇవి మరో నలుగురికి ఉపయోగ పడతాయన్న ఆశతో చాలా సమయం వెచ్చించి ఈ వ్యాసాలు రాయబూనుకున్నాను. నాకున్న ఇతర బాధ్యతల మధ్యలో వారం వారమూ క్రమం తప్పక సమయానికి వ్యాసం పూర్తిచేసి అందించటం చాలాసార్లు కష్టమయింది. సమయాభావం వల్ల కొన్ని అంశాలు పైపైన వివరించి వదిలేశానన్న అసంతృప్తి ఉంది. వీలు కుదిరినప్పుడు వీటిని మరింత విస్తరించే ఆలోచనుంది. చూద్దాం.
తెలుగు సాహితీలోకంలో రాజకీయాల గురించి వర్ధమాన కథకుల్లో రకరకాల అనుమానాలుంటాయి. కొత్తగా రాసేవారిని ఎదగనీయరని, గుంపులు కడతారని, వగైరా. అవన్నీ నిజమో కావో నాకు తెలీదు. నాకైతే అటువంటి సమస్యలు ఎదురు కాలేదు. నాణ్యమైన కథలని ఏ రాజకీయాలూ నాశనం చెయ్యలేవని గుర్తెరగండి. అనవసరమైన ఆలోచనలతో సమయం వృధా చేసుకోకుండా, కథ రాయటమ్మీదనే దృష్టి పెట్టండి. మీకోసం మీరు రాయండి. కథకుడిగా మీ ప్రయాణంలో వెన్ను తట్టేవారుంటారు, వెంటబడి మొరిగే వారూ ఉంటారు. ప్రోత్సహించినవారిని గుర్తుంచుకోండి; పిచ్చి కూతల్ని పట్టించుకోకండి. కాలక్రమంలో, చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉంటే గింటే మీ కథలకే ఉంది తప్ప మిగతా వివాదాలకి కాదు. మీరెన్ని కథలు రాశారన్నది ముఖ్యం కాదు. నాసిరకం కథలు టకటకలాడించి టైప్ రైటర్ అనిపించుకోవటమా లేక నాణ్యమైన కథలు సృష్టించి రైటర్ అనిపించుకోవటమా అన్నది మీ చేతిలోనే ఉన్న విషయం. కాబట్టి రాశి కన్నా వాసి మీద దృష్టి పెట్టండి. అన్నిటికన్నా ముఖ్యంగా, కథ రాయటాన్ని ఆస్వాదించండి. రాస్తూ నేర్చుకోండి. నేర్చుకున్నది మరో పదిమందికి పంచండి. ఆ పదిమందిలో నేనూ ఉంటాను.
ఆల్ ది బెస్ట్.
అనిల్ ఎస్. రాయల్
స్పందించండి