రచన: అనిల్ ఎస్. రాయల్

‘వార్త’, 15 సెప్టెంబర్ 2013


 

“అమ్మూ, నిద్రపోయే వేళయింది .. రా”

“ఇంకాసేపు ఆకుంటా మమ్మీ”

“చాలాసేపు ఆడుకున్నావు, వచ్చేయమ్మా”

“ఊఁహు. నేన్లాను. ఇంకా ఆకుంటా”

లేదా, “వత్తా కానీ, మలి నాకో కత చెబుతావా?”

లేకపోతే, “మలేం .. జోల పాడతానంటేనే వత్తా”

మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాక విసుగొచ్చి ఆపేశాను. 

కుడిచెయ్యి గుంజుతోంది. దానికేసి చూశాను. మణికట్టు వద్ద బ్యాండేజ్. ఆ చేతికేమయిందో తెలీదు. ఈ ఆసుపత్రికెలా వచ్చిపడ్డానో కూడా తెలీదు. గుర్తు చేసుకోటానికి విశ్వప్రయత్నం చేశాను. జ్ఞాపకం రాలేదు; తలనొప్పి వచ్చింది. 

ల్యాప్‌టాప్‌లో మానవ్ సందేశం చూడటం నా ఆఖరి జ్ఞాపకం. ఆ తర్వాత ఈ ఆసుపత్రిలో కళ్లు తెరిచాను. నాకు కాపలాగా ఇద్దరు పోలీసులు. అంతా అయోమయంగా ఉంది. తల నిండా ప్రశ్నలు. వాటిలో కొన్నిటికి సమాధానాలు ఊహించగలను. తక్కినవాటికి ఎవరూ బదులీయటం లేదు. గంట క్రితం పోలీసులు నన్ను తీసుకొచ్చి ఈ గదిలో వదిలిపెట్టి డాక్టర్ వచ్చేవరకూ నిరీక్షించమన్నారు. 

…. నిరీక్షణ.

మానవ జీవిత పరమార్ధం నిరీక్షణ. నిస్సారమైన బతుకుల్లోకి అడపాదడపా తొంగిచూసే ఆనందకర ఘట్టాలకోసం నిరంతర నిరీక్షణ. తీరా ఆ ఘట్టం వచ్చినంతసేపుండదు; ఆస్వాదించేలోపే కరిగిపోతుంది. మరో మధురఘట్టం కోసం మళ్లీ నిరీక్షణ మొదలు. మనిషి బతుకంతా నిరీక్షణ; చావు కోసం నిరీక్షణ. అంతగా అలవాటైనా, అందరికీ అయిష్టమైనది నిరీక్షణ. ప్రస్తుతం నాకు చిర్రెత్తిస్తోందీ అదే. తప్పించుకోటానికి ఏదన్నా కాలక్షేపం అత్యవసరం. 

పక్కగదిలోకి చూశాను. నేనున్నది డాక్టర్‌గారి ఆఫీసు. పక్కనున్న విశాలమైన గది ఆసుపత్రి లాబీ. ఈ రెంటినీ అంగుళం మందముండే గాజు గోడ విడదీస్తోంది. ఆ గోడకో తలుపుంది. ప్రస్తుతం అది మూసుంది. గోడకున్న వెనీషియన్ బ్లైండ్స్ తెరుచుకుని ఉన్నాయి. వాటి గుండా లాబీలో దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అట్నుండి శబ్దాలు మాత్రం వినబడటం లేదు.

లాబీలో ఇరవైదాకా కుర్చీలున్నాయి. మూడు వరసల్లో అమర్చబడి ఉన్నాయవి. ఒక మూల భారీ పరిమాణంలో ఉన్న రిసెప్షన్ కౌంటర్ ఉంది. దాని వెనక అంతకన్నా భారీ పరిమాణంలో ఉన్న శాల్తీ ఒకటుంది. అది ప్రస్తుతం ఫోన్‌లో మాట్లాడుతోంది. మొదటివరుస కుర్చీల్లో ఒకదాంట్లో ఓ మసలావిడ తనలో తానే ఏదో గొణుక్కుంటోంది. ఆవిడ వెనక వరుసలో ఓ టీనేజ్ సుందరి లోకాన్ని మర్చిపోయి స్మార్ట్ ఫోన్‌లో చాటింగ్‌ చేస్తోంది. చివరి వరుస చిట్టచివరి కుర్చీలో కూర్చున్న కుర్రాడు ఆ అమ్మాయికేసి దొంగచూపులు చూస్తున్నాడు. అదే వరసలో ఓ ముసలి జంట, వాళ్ల పక్కనే ఓ పడుచు జంట కూర్చుని ఉన్నాయి. ఈ రెండు జంటలూ ఆ పక్కనే కింద కూర్చుని ఆడుకుంటున్న పాపని ఆసక్తిగా గమనిస్తున్నాయి. డాక్టర్ ఆఫీస్ తలుపుకి కొంచెం అవతల ఇద్దరు పోలీసులు నిలబడున్నారు. వాళ్ల దృష్టి కూడా ఆ పాప మీదనే ఉంది.

ఆ పాపకి ఎనిమిదేళ్లుంటాయేమో. రెండు చేతుల్లో రెండు బొమ్మలు పట్టుకుని ఉంది. వాటిలో ఒకటి సుమారు ఎనిమిదంగుళాలుంటుంది. రెండోది అందులో సగం ఉండొచ్చు. తొడిగిన వస్త్రాలని బట్టి రెండూ ఆడబొమ్మలేనని తెలుస్తోంది. అవి తల్లీ కూతుళ్లని కనిపెట్టటానికి పెద్దగా తెలివితేటలక్కర్లేదు. పాప ఆ రెండు పాత్రలూ తానే పోషిస్తూ, ఎవరికి తగ్గ సంభాషణ వాళ్లకి చెబుతూ, పరిసరాలు మర్చిపోయి ఆడుకుంటోంది. ఆ సంభాషణలు నాకు వినబడటంలేదు కానీ అవేంటో ఊహించటం పెద్ద కష్టం కాదు. ఇందాకటిదాకా నేను చేసింది అదే పని. 

బొమ్మ తల్లీ కూతుళ్ల మధ్య సంవాదం ఇంకా నడుస్తూనే ఉంది. కూతురు నిద్రపోనని మారాం కొనసాగిస్తూనే ఉంది. తల్లి బతిమిలాడుతూనే ఉంది. చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా పాప తన ఊహాలోకంలో విహరిస్తూనే ఉంది – స్వేఛ్చగా, సంతోషంగా.

“సంతోషానికి పర్యాయపదం స్వేఛ్చ ఐతే, నేను మళ్లీ సంతోషాన్ని చవిచూసేదెన్నడో”, దీర్ఘంగా నిట్టూర్చాను. 

అప్పుడే చిన్నశబ్దంతో తలుపు తెరుచుకుంది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టి తలుపు మూశాడు. స్ఫురద్రూపి. చూడగానే ఆకట్టుకునే నవ్వు ముఖం. ముప్పై ఐదేళ్లుంటాయేమో. 

నేనతనికేసి తేరిపార చూస్తుండగానే “మిస్ ప్రియ, నా పేరు డాక్టర్ లక్ష్మణ్. చాలాసేపుగా నిరీక్షిస్తున్నట్లున్నారు. ఆలస్యానికి మన్నించండి” అంటూ బ్లైండ్స్ కిందకి దించి మళ్లీ చెప్పాడు, “మీ కేసు విషయంలో పోలీసులకి సహకరించే బాధ్యత నాకప్పగించబడింది”.

“డాక్టర్. నన్ను అరెస్ట్ చేశారా?”, నా నోటినుండొచ్చిన మొదటి వాక్యం. 

తన కుర్చీలో సర్దుకు కూర్చుంటూ బదులిచ్చాడతను. “అవును”.

“ఏ అభియోగమ్మీద?”

“ఆ వివరాలు వాళ్లు వెల్లడిస్తే మంచిదేమో”. డాక్టర్ తర్జనితో తలుపుకేసి చూపించాడు, వెలుపలున్న పోలీసుల్ని ఉద్దేశిస్తూ.

“కనీసం, నేను పోలీస్ స్టేషన్లో కాకుండా ఇక్కడెందుకున్నానో చెబుతారా? ఇక్కడికెలా వచ్చాను? ఎప్పుడొచ్చాను? నా చేతికీ కట్టెందుకుంది?”, ప్రశ్నల వర్షం కురిపించాను.

“తప్పకుండా. కానీ, ముందు మీరు నాక్కొన్ని వివరాలు చెప్పాలి”

“అడగండి”

“మీరేం చేస్తారు? మీ జీవనాధారం ఏమిటి?”

“నేనొక ఔత్సాహిక నటిని. మోడలింగ్ నా వృత్తి”

“మోడలింగ్ అంటే …. టీవీ ప్రకటనల్లాంటివా?”

“ఇంకా ఆ స్థాయికి రాలేదు. ర్యాంప్ వాక్స్ దశలోనే ఉన్నాను”

“అవునా”, డాక్టర్ తలపంకించాడు. తర్వాత డెస్క్ సొరుగులోంచి దేన్నో బయటికి తీసి నా ముందుంచాడు. “ఇదెవరో తెలుసా?”

అదొక యువతి ఫోటో. వయసు పాతికేళ్ల పైచిలుకుండొచ్చు. ఫోటోలో ఆమె నవ్వుతోంది, కానీ ఏమాత్రం ఆకర్షణీయంగా లేదా నవ్వు. ఎత్తు పళ్లు, చప్పిడి దవడలు, బండ ముక్కు. అందవిహీనంగానే ఉందనాలి. ఆమెనెప్పుడూ చూసినట్లనిపించలేదు. 

“తెలీదు”, తల అడ్డంగా ఊపాను. “ఆమెనెప్పుడూ చూడలేదు”.

“బాగా గుర్తుచేసుకోండి”

“ఊఁహు. చూడలేదు. కచ్చితంగా చెప్పగలను”

డాక్టర్ మరో ఫోటోగ్రాఫ్ చూపించాడు. “పోనీ ఇతనెవరో తెలుసా?”

ఆ ఫోటోలో ఓ ముప్పయ్యేళ్ల యువకుడు, అమ్మాయిల్ని మాయలో పడేసే సమ్మోహనకరమైన నవ్వు రువ్వుతూ. దానికేసి ఒక్క క్షణమే చూశాను. మరుక్షణం నా రక్తం మరిగిపోయింది. వాడినెలా మర్చిపోగలను?

“అతని పేరు మానవ్”, ముఖం జేవురిస్తుండగా చెప్పాను. 

“రిలాక్స్”, డాక్టర్ చెప్పాడు నా భావాల్ని గమనిస్తూ, “మానవ్ కాదు. అతని పేరు ఆదిత్య”

ఈ నిజం నన్నేమీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. “ఐతే అతని అసలు పేరు అదన్న మాట” అన్నాను కోపాన్ని నియంత్రించుకుంటూ.

డాక్టర్ నా వ్యాఖ్యని పట్టించుకోలేదు. సొరుగులోంచి మరో ఫోటోగ్రాఫ్ తీసి నా ముందుంచాడు. “ఇదెవరో తెలుసా?”

అదో ఇరవయ్యేళ్ల సౌందర్యరాశి వర్ణచిత్రం. అందాలు వెల్లడి చేసే వలువల్లో వయ్యారంగా కూర్చుని ఉంది. ఆమె నీలి కళ్లలో తళుక్కుమంటున్న మెరుపులు, గులాబి పెదవుల్లో తొణికిసలాడుతున్న తమకం.

“అది నేనే. ఎప్పుడో మానవ్‌కి షేర్ చేసిన ఫోటో ఇది”, అంటుండగా వెలిగింది నాకు. “దీని ద్వారా పోలీసులు కూపీ లాగి అతని ఆత్మహత్యకీ నాకూ లంకె పెట్టారన్న మాట”.

“కావచ్చు”, డాక్టర్ అభావంగా చెప్పాడు. “మిస్ ప్రియ. మీ ఇద్దరి మధ్యా ఏం జరిగిందో వివరంగా చెబుతారా?”

ఓ నిట్టూర్పు విడిచి మొదలుపెట్టాను. “ఏడాది కిందట ఫేస్‌బుక్‌లో మా పరిచయమయింది. అప్పుడప్పుడూ మెసేజెస్ పెట్టుకునేవాళ్లం. క్రమంగా అతన్ని ఇష్టపడ్డాను. ఆ సంగతి అతనికి చెబితే, తనకీ నేనంటే ఇష్టమేనన్నాడు. అప్పట్నుండీ కుదిరినప్పుడల్లా చాట్ చేసేవాళ్లం. కొన్నాళ్లలో అతనిపై ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. తనూ నన్ను ప్రేమిస్తున్నానన్నాడు”

“అతన్నెప్పుడన్నా కలిశారా?”, డాక్టర్ నా మాటలకి అడ్డొస్తూ ప్రశ్నించాడు.

“లేదు”

“కనీసం మాట్లాడారా? వాయిస్ చాట్, వీడియో చాట్, ఫోన్ లాంటివేమన్నా ..”

“లేదు. మామూలు చాటింగ్ మాత్రమే”

“అతనెక్కడుంటాడో, ఏం చేస్తాడో .. అలాంటి వివరాలేమన్నా చెప్పాడా?”

“చెప్పాడు”

“అతను చెప్పినవన్నీ అసత్యాలు కావచ్చునన్న అనుమానం మీకెప్పుడూ రాలేదా?”

“ప్రేమ గుడ్డిదంటారు కదా. అతన్ని గుడ్డిగా నమ్మాను. తప్పు చేశానని తర్వాత తెలిసింది”

“ఏం జరిగింది?”

“అలా ఓ ఏడాది గడిచింది. అతన్నెంత పిచ్చిగా ప్రేమించానంటే, అతను నన్ను ఆవహించాడు. ఓ మైకంలా కమ్ముకున్నాడు. నిరంతరం అతని తలపులే. వేరే విషయాలన్నిటి మీదా ఆసక్తి చచ్చిపోయింది. ఇరవై నాలుగ్గంటలూ అతనితో చాట్ చేస్తూనే గడిపేయాలనిపించేది. కొన్నాళ్లకి, తను లేకుండా నేను బతకలేనని అర్ధమయింది. అతన్నోసారి కలవాలని నిర్ణయించుకున్నాను. ఆ సంగతి చెబితే తనేమన్నాడో తెలుసా?”

“ఏమన్నాడు?”

“తనకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారన్నాడు. నన్ను కలవటం ఇష్టం లేదన్నాడు. ఇన్నాళ్లూ సరదాగా నాతో చాట్ చేశాడే తప్ప వేరే ఉద్దేశం లేదన్నాడు. సరదా! నేనో ఆటబొమ్మనా? సరదాగా కాసేపు వాడుకుని, నా మనసుతో ఆడుకుని వదిలేస్తాడా! అన్నాళ్లూ నాతో చెప్పినవన్నీ అబద్ధాలే. నమ్మించి మోసం చేశాడు. నా గుండె రగిలిపోయింది”

“మీ బాధ నేనర్ధం చేసుకోగలను”, సానుభూతిగా తలూపాడు డాక్టర్ లక్ష్మణ్.

“నాలా మరెవర్నీ దగా చెయ్యకుండా అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. మానవ్‌కి మనశ్శాంతి లేకుండా చెయ్యటానికి ప్రయత్నించాను. అతని భార్యకి మా సంగతి చెప్పి వాళ్ల పెళ్లి పెటాకులు చేస్తానని బెదిరిస్తూ మెసేజెస్ పెట్టాను. అతని ఇంటి చిరునామా, ఎక్కడ పనిచేస్తాడు, ఇలాంటి వివరాలన్నీ నాకు తెలుసని భయపెట్టాను”

“ఆ వివరాలన్నీ మీకు నిజంగానే తెలుసా? కాసేపటి క్రితం నేను చెప్పేవరకూ మీకతని అసలు పేరేంటో కూడా తెలీదు కదా”

“అఫ్‌కోర్స్, తెలీదనుకోండి. చీకట్లో బాణాలు వేశాను, అవి తగలాల్సిన చోట తగిలాయి. నేనొక నటిని కదా. నా నటన నమ్మేసి భయపడిపోయాడు. తనని క్షమించమని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. అతనెంత బతిమిలాడితే నేనంత బిగుసుకుపోయాను”

“అతను ఎదురు తిరిగి మిమ్మల్ని బెదిరించటంలాంటిదేమీ చెయ్యలేదా?”

“ఆ పనీ చేశాడు. ఒకే ఒక సారి. తనని వేధించటం ఆపకపోతే నా అంతు చూస్తానన్నాడు. అవన్నీ తాటాకు చప్పుళ్లే కాబట్టి నేను బెదరలేదు. కానీ నా జాగ్రత్తలో నేనున్నాననుకోండి. అప్పట్నుండీ అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటికెళ్లటం మానుకున్నాను”

“మరీ ఎక్కువగా సాగదీస్తున్నట్లు మీకనిపించలేదా? అతను గుణపాఠం నేర్చుకున్నట్లున్నాడు కదా. ఇక వదిలేసుండాల్సిందేమో”

“గుండెల్ని ముక్కలు చేసేవాళ్లని ఒట్టి గుణపాఠాలతో వదిలిపెట్టకూడదు”

“సరే. తర్వాతేం జరిగింది?”

“రోజులు గడిచేకొద్దీ నా బెదిరింపులు తీవ్రమయ్యాయి. రోజూ లెక్కలేనన్ని సందేశాలు పెట్టేదాన్ని. మొత్తమ్మీద అతనికి నిద్రపట్టనీకుండా చేశాను. చివరికో రోజు అతన్నుండి ఓ సందేశం వచ్చింది. అదొక సూసైడ్ నోట్. నన్ను, తన భార్యని మోసగించినందుకు పశ్చాత్తాపపడుతున్నట్లు, ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దాని సారాశం. ఆ సందేశం నేను చదివేసరికే తన జీవితం అంతమైపోతుందని రాశాడు. దాన్ని చదవటం వరకూ మాత్రమే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఈ ఆసుపత్రిలో కళ్లు తెరిచాను, చేతికో కట్టుతో. ఈ దెబ్బ ఎలా తగిలిందో, అదెవరి పనో, ఏమీ తెలీదు”

“అవన్నీ కాసేపట్లో తెలుస్తాయి. ముందీ విషయం చెప్పండి. మీరు చేసిన పనికి బాధపడుతున్నారా?”

“ఏ మాత్రమూ లేదు. నన్నతను పెట్టిన క్షోభకి అదే సరైన శిక్ష. ఆత్మహత్య అనేది అతని స్వయంకృతాపరాధం. దానికి నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?”

డాక్టర్ నన్ను చదువుతున్నట్లు కాసేపు సూటిగా చూశాడు. గదిలో మౌనం రాజ్యమేలింది.

“మీరడిగిన వివరాలు చెప్పాను. ఇక నా ప్రశ్నలకి జవాబులు చెప్పండి” అన్నాను మౌనాన్ని ఛేదిస్తూ.

“తప్పకుండా” అంటూ డాక్టర్ చెప్పటం మొదలుపెట్టాడు. “మీరు కొన్నివారాలపాటు కనపడకుండా పోయేసరికి ఏమయిందీ కనుక్కోటానికి మీ సహోద్యోగి ఒకరు మీ అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఆమె వెళ్లే సమయానికి మీ ఫ్లాట్ చిందరవందరగా ఉంది. ఇల్లంతా పగిలిన అద్దాలు, గాజు ముక్కలు. డైరీలు, ఫోటోల్లాంటి మీ వ్యక్తిగత వస్తువులన్నీ ధ్వంసమై ఉన్నాయి. మీరేమో నేల మీద స్పృహలేకుండా పడి ఉన్నారు. మీ మణికట్టుదగ్గర పెద్ద గాయమై చాలా రక్తం పోయింది. ఇంకా ఆలస్యం కాకముందే ఆమె కళ్లబడటం మీ అదృష్టం. తను వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది. వాళ్లు మిమ్మల్ని హుటాహుటిన ఈ హాస్పిటల్‌కి తరలించారు. మీరు ఆరోజంతా స్పృహలో లేరు. మర్నాడు స్పృహలోకొచ్చారు కానీ మీలో మీరు లేరు. ఏవో పలవరింతలు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. దాంతో, మీరు స్థిమితపడేవరకూ మత్తులో ఉంచటం తప్ప మాకు వేరే దారి లేకపోయింది. ఈ ఉదయానికి కానీ మీరు మెరుగుపడలేదు”

“ఎన్ని రోజులుగా నేనిక్కడున్నాను?”

“ఎనిమిది రోజులు”

ఎనిమిది రోజులు! అంతా నిన్నే జరిగినట్లుంది. అతని చివరి సందేశం నా జ్ఞాపకాల్లో ఇంకా తాజాగానే ఉంది. అందులో అక్షరాలన్నీ నేనే రాసినంత వివరంగా గుర్తున్నాయి. అవి రాసిన వ్యక్తి గతించి ఎనిమిది రోజులయింది. కానీ అతనంటే నాకున్న అసహ్యం, పగ మాత్రం చెక్కుచెదరలేదు. చేతిగాయం మానటానికి ఎనిమిది రోజులు చాలేమో. గుండె గాయం మానటానికి ఎన్నేళ్లు పట్టేనో.

“మీరా సూసైడ్ నోట్ చదివాక ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోగలరా?”, నా ఆలోచనలకి అడ్డొస్తూ డాక్టర్ ప్రశ్నించాడు.

ఉదయం నుండీ ఆ పని చేయటానికి చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయాను. మళ్లీ ప్రయత్నించినా ఫలితముండదు. తల విదిలిస్తూ డాక్టర్‌తో చెప్పాను, “నేనా మెసేజ్ చూస్తున్నప్పుడు ఎవరో నా మీద దాడి చేసి ఉంటారు. కానీ అదెవరో అంతుపట్టటం లేదు”

“అదెవరో ఇప్పుడే కనుక్కుందాం” అంటూ డాక్టర్ ఇంటర్‌కామ్‌లో “వాళ్లని లోపలకి పంపండి” అని చెప్పాడు. 

ఒక నిమిషం భారంగా గడిచాక తలుపు తెరుచుకుంది. ముందుగా ఇందాకటి పోలీసులిద్దరూ లోపల అడుగుపెట్టారు. వాళ్లని అనుసరిస్తూ ఓ మూడో వ్యక్తి కూడా ప్రవేశించాడు. 

నేను కుర్చీలో ఎగిరిపడ్డాను. అతను …. వాడే. మానవ్ … అదే .. ఆదిత్య. ఇంకా బతికే ఉన్నాడు! నా కళ్లు పెద్దవయ్యాయి. బుర్రలో మెరుపులు మెరిశాయి. అంతా స్పష్టంగా అర్ధమయింది. “రాస్కెల్. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి, నువ్విక లేవని నేను ఏమరుపాటున ఉండగా దాడి చేసి నన్ను చంపటానికి ప్రయత్నించావా …. దుర్మార్గుడా. నా ప్రేమని ఖూనీ చేసింది చాలక నన్నూ అంతం చెయ్యాలని చూస్తావా” అంటూ ఆవేశంతో ఊగిపోయాను.

అతనేం మాట్లాడలేదు. డాక్టర్ మాట్లాడాడు. “మిస్ ప్రియ. పొరబడ్డారు. మీపై దాడి చేసింది అతను కాదు”

“మరెవరు?”

డాక్టర్ డెస్క్‌మీదున్న ఫోటోల్లోంచి ఒకటందుకుని నాకు చూపిస్తూ ప్రశ్నించాడు, “ఇదెవరో మీకు నిజంగా తెలీదా?”. నాకు మొదట చూపించిన అందవిహీన ఫోటో అది.

“చెప్పాను కదా. ఆమెనెప్పుడూ చూడలేదు” అంటుండగా స్ఫురించింది. “ఓహ్. ఇప్పుడర్ధమయింది. ఆమె ఇతని భార్య కదా? తనకి మా సంగతి తెలిసిపోయుంటుంది. అందుకే నన్ను అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. అవునా?” అన్నాను డాక్టర్‌ని, పోలీసులని మార్చి మార్చి చూస్తూ. 

డాక్టర్ నావైపు అర్ధాంగీకారంతో చూశాడు. “అవును. మీపై దాడి చేసింది ఆమే. కానీ తను మీరనుకున్నట్లు ఆదిత్య భార్య కాదు”

“ఎవరు మరి?”

సొరుగులోంచి ఓ అద్దం బయటికి లాగి, పక్కనొచ్చి నిలబడి దాన్ని నా ముఖం ముందు పట్టుకుని చెప్పాడు డాక్టర్. “మీరే చూడండి”

అయోమయంగా అద్దంలోకి చూశాను. ముందో అపనమ్మకం, దాని వెంబడో అలజడి, దాన్ననుసరిస్తూ ఓ ఆర్తనాదం.

ఆ ఫోటోలోని అందవిహీన – నేనే!!

* * * * * * * 

ఆసుపత్రి లాబీలో డిశ్చార్జ్ పత్రాల కోసం నిరీక్షిస్తుండగా, ఈ ఉదయం ఆ నిర్ఘాంతపరచే నిజం తెలిసిన క్షణాలు కళ్లలో మెదిలాయి. 

“అది మీరే, మిస్ ప్రియ. మిమ్మల్ని చంపబోయిందెవరో కాదు. మీరే”, డాక్టర్ లక్ష్మణ్ మార్దవమైన గొంతుతో చెప్పాడు, అద్దాన్ని అలాగే పట్టుకుని. “ఇంకో నిజం ఏమిటంటే, మీ పేరు ప్రియ కాదు. మీ అసలు పేరు మంజు”

“మంజు!?!”

“అంతే కాదు. మీ వృత్తి మోడలింగ్ కాదు; మీరో ఔత్సాహిక నటి కూడా కాదు. మీరో సాఫ్ట్‌వేర్ సంస్థలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నారు. మీకు ఈ ఆదిత్య గారితో ఫేస్‌బుక్‌తో సహా మరే రకమైన పరిచయమూ లేదు”

“అదెలా సాధ్యం ….”, గది గిర్రున తిరిగినట్లనిపించింది. తూలి కిందపడబోయాను. డాక్టర్ చప్పున నన్ను పట్టుకుని కుర్చీలో కూర్చోబెడుతూ మిగిలినవాళ్లని విజ్ఞప్తి చేశాడు, “ఆమెకి గాలి ఆడనిద్దాం. ఆ తలుపు తెరుస్తారా? అదే చేత్తో ఆ బ్లైండ్స్ కూడా తెరవండి”

నన్ను కుదుటపడనిచ్చి మళ్లీ చెప్పటం కొనసాగించాడు. “మిస్ మంజు. ఆ లాబీలో ఆడుకుంటున్న పాపని చూశారా? ఆ అమ్మాయికి ఎనిమిదేళ్లు. ఆ వయసులో అలాంటి రోల్-ప్లేయింగ్ ఆటలాడే పిల్లలు అరుదుగా ఉంటారు. సాధారణంగా పిల్లలు ఆరేడేళ్లకల్లా ఆ తరహా ఆటలు ఆపేస్తారు. కొందరు మాత్రం ఆ తర్వాత కూడా కొనసాగిస్తారు. ఆ కొందరిలో మీరొకరు”

“ఏమిటి మీరనేది!”

“పిల్లలు తమకి మాత్రమే కనబడే మిధ్యాస్నేహితులతో ఆడుకోవటం సర్వసాధారణం. తమ బాధలు, భయాలు, సంతోషాలు పంచుకోటానికి వాళ్లెరిగిన మార్గమది. నిజజీవితంలో తమకు దొరకని ఆనందాలు అనుభవించటానికి కొందరు పెద్దలు సైతం అప్పుడప్పుడూ ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. అది వింతేం కాదు. ఊహకీ నిజానికీ తేడా తెలిసినన్నాళ్లూ దానితో ఎవరికీ సమస్యలేదు. కానీ ఆ రెంటికీ మధ్యనున్న సన్నని గీత చెరిగిపోతే, వాళ్లా ఊహాలోకంలోనే ఇరుక్కుపోయే ప్రమాదముంది. మీ విషయంలో అదే జరిగింది”

నేను స్థాణువునై వినసాగాను.

“వివిధ మార్గాల్లో మీ గురించి మేము సేకరించిన సమాచారం ప్రకారం – మీరెప్పుడూ అంతర్ముఖులై ఉండేవారు. చెప్పుకోదగ్గ స్నేహితుల్లేరు. బోయ్‌ఫ్రెండ్స్ అసలే లేరు. అందుకు మీరు మీ రూపాన్ని నిందించుకునేవారు. మీరో అనాకారి అనే ఆత్మన్యూనతలో కూరుకుపోయారు. దాన్నుండి బయటపడటానికి, మీకు మీరో ప్రతిరూపాన్ని సృష్టించుకున్నారు. ఆ రూపానికి ఓ వృత్తిని, ఓ వ్యక్తిత్వాన్నీ కల్పించారు. ఆమెకి ప్రియ అనే పేరు పెట్టి, ఆ పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచారు. దానికి ప్రొఫైల్ పిక్చర్‌గా ఇంటర్నెట్‌నుండి ఓ అందమైన అమ్మాయి ఫోటోని డౌన్‌లోడ్ చేసి వాడుకున్నారు. మొత్తమ్మీద, మీ ఊహల్లో మీరెలా ఉండాలని కోరుకున్నారో అలాంటి ప్రతిరూపాన్ని తయారుచేసుకున్నారు”

డాక్టర్ చెబుతుండగా, నా జ్ఞాపకాలు తిరిగిరాసాగాయి.

“ఆ తర్వాత మీరు మానవ్ అనే మరో పాత్రని సృష్టించారు. మీ కలల బోయ్‌ఫ్రెండ్‌కి ఉండే లక్షణాలు ఆపాదించి అతనికో వ్యక్తిత్వాన్నిచ్చారు. ఆ పేరుతో ఇంకో ఫేస్‌బుక్ ఖాతా తెరిచి, ఇంటర్నెట్‌లో దొరికిన ఈ ఆదిత్య గారి ఫోటో పట్టుకొచ్చి ఆ ప్రొఫైల్‌కి తగిలించారు. ఆ రెండు ఖాతాలు సిద్ధమయ్యాక వాటి మధ్య సందేశాలు పంపించుకోవటం మొదలుపెట్టారు. అదిగో, అక్కడ ఆ పాప చేస్తుందే …. అచ్చం అలాగే మీరు సృష్టించిన రెండుపాత్రల్లోకీ పరకాయప్రవేశం చేసి రోల్-ప్లేయింగ్ ఆట ఆడసాగారు. మొదట్లో ఇది అప్పుడప్పుడూ కాలక్షేపానికి చేసేవారు. తర్వాతదో అలవాటుగా మారింది. త్వరలోనే అదో వ్యసనమైపోయింది. మీ ల్యాప్‌టాప్‌లో రెండు బ్రౌజర్ సెషన్స్ తెరిచి ఆ ఖాతాల్లో లాగినై వాటి మధ్య గంటల తరబడి చాటింగ్ జరిపేవారు. మొదట్లో మీకిదంతా ఓ ఆట మాత్రమే అన్న స్పృహ ఉండేది. క్రమంగా ఆ వ్యసనానికి ఎంత బానిసయ్యారంటే, ఆ పాత్రలు రెండూ మిమ్మల్ని వశం చేసుకోనారంభించాయి. మెల్లిగా మీరు నిజానికీ ఊహకీ ఉన్న తేడా మర్చిపోసాగారు. ఊహాలోకమే నిజమనే భ్రాంతిలో కూరుకుపోసాగారు”

“ఇదంతా మీకెలా తెలుసు?”, నేను హఠాత్తుగా ప్రశ్నించాను.

“మీ డైరీల ద్వారా, మిస్ ప్రియ. అవి ధ్వంసమైనా, వాటిని ఫోరెన్సిక్ నిపుణులు చాలావరకూ పునరుద్ధరించగలిగారు. వాటిద్వారా మీగురించి చాలా వివరాలు తెలుసుకోగలిగాం. మీరు మీరుగా ఉన్నప్పుడు ఈ సంగతులన్నిట్నీ వివరంగా డైరీల్లో రాసుకున్నారు. మీకు, మీరు సృష్టించిన పాత్రలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ, ఏదోనాడు అవి మిమ్మల్ని పూర్తిగా వశం చేసుకుంటాయేమోనన్న భయం, ఈ రోల్-ప్లేయింగ్ వ్యసనం వదుల్చుకోవటానికి, ఆ పాత్రల గుప్పిటనుండి బయటపడటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు …. ఇవన్నీ డైరీల్లో రాశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా, ఒక రోజు మీరా రెండు పాత్రల మధ్య విభేదాలు సృష్టించాలని నిర్ణయించారు. వాళ్ల మధ్య గొడవలు రేపెట్టి ఒకరికొకర్ని దూరం చేస్తే ఇక ఆ పాత్రల ఉనికికే పరమార్ధం ఉండదని; అవి మిమ్మల్ని వదిలిపోతాయని భావించారు. ఇది మీరు డైరీలో రాసిన ఆఖరి విషయం. నాలుగు వారాల కిందటి సంగతది”

డాక్టర్ ఊపిరి పీల్చుకోటానికన్నట్లు కాసేపు ఆగి, మళ్లీ కొనసాగించాడు. పోలీసులు, ఆదిత్య మౌనప్రేక్షకుల్లా చూస్తున్నారు. 

“ఆ తర్వాతేం జరిగిందనేదానికి డైరీల్లో ఆధారాల్లేవు. కానీ మీ ఫేస్‌బుక్ ఖాతాల మధ్య నడిచిన సందేశాలు, ఇందాక మీరు నాకు చెప్పిన విషయాలు, వారం రోజులుగా మీ పలవరింతలు …. ఇవన్నీ ఓ క్రమ పద్ధతిలో పేర్చటం ద్వారా ఏం జరిగిందో ఊహించొచ్చు”

“ఏం జరిగింది?”

“మానవ్‌కి అప్పటికే పెళ్లయిపోయిందన్న విషయం బయటపెట్టడం ద్వారా వాళ్లిద్దరి మధ్యా మీరనుకున్నట్లుగానే విభేదాలు సృష్టించారు. లెక్కప్రకారం ఇక్కడితో వాళ్ల బంధం తెగిపోవాలి. కానీ మీ అంచనా తప్పింది. ఆ వార్తకి ప్రియ మీరు ఊహించని రీతిలో ప్రతిస్పందించింది. మానవ్ తనని మోసం చేశాడని కోపంతో రగిలిపోయింది. అతన్ని వదలకుండా వెంటాడి వేధించాలని నిర్ణయించుకుంది. దాంతో మీరు ప్రియ పాత్రలోనే ఇరుక్కుపోయారు. లోలోపల మీపై మీకున్న న్యూనతాభావం, ప్రియ పాత్రపై మీకున్న మమకారం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. మొత్తమ్మీద, అక్కడిదాకా వచ్చేసరికి మీరు ప్రియగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. దానికి సాక్ష్యం – మీరు ప్రియ కాదు, మంజు అని గుర్తు చేసే వివరాలన్నిట్నీ నాశనం చేయటం. మీ డైరీల్ని, ఫోటోలని, ఇతర వ్యక్తిగత వస్తువులన్నిట్నీ మీరే ధ్వంసం చేశారు. ఆఖరికి, మీ ముఖాన్ని మీరు చూసుకునే వీల్లేకుండా ఇంట్లో ఉన్న అద్దాలన్నిట్నీ కూడా పగలగొట్టేశారు”

“ఆగండి. అవన్నీ నేనే ధ్వంసం చేశానా!”

“అవును. మరెవరో అయ్యుండే అవకాశమే లేదు. మీ అపార్ట్‌మెంట్‌లో ఇతరులెవరూ ప్రవేశించిన దాఖలాల్లేవు. మీ సహోద్యోగి వెళ్లేసరికి అపార్ట్‌మెంట్ తలుపు లోపలనుండి గడెపెట్టి ఉంది. ఆమె చౌకీదారు సహాయంతో తలుపు బద్దలు కొట్టుకుని లోపలకి ప్రవేశించాల్సొచ్చింది”

“తర్వాతేమయింది?”

“వస్తువులన్నిట్నీ ధ్వంసం చేశాక రోల్-ప్లేయింగ్ కొనసాగించారు. ఇరవైనాలుగ్గంటలూ ఇదే పని. ఉద్యోగానికి వెళ్లటం కూడా మానేశారు. మీరే ప్రియ అనే భ్రమలో పడిపోయి, మానవ్‌పై అసహ్యం పెంచుకుని అతని అంతు చూడాలని నిర్ణయించుకున్నారు. అతన్ని రకరకాలుగా బెదిరించారు. ఆఖరుకి, ఎనిమిదిరోజుల క్రితం, బెదిరించటం కట్టిపెట్టి ఇక అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అతను ప్రియకి ఓ సూసైడ్ నోట్ పంపి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఆ విధంగా మానవ్ పాత్రని అంతమొందించారు. ఐతే, అప్పటికల్లా మీకు ఇదంతా రోల్-ప్లేయింగ్ మాత్రమేనన్న జ్ఞానం లేకుండాపోయింది. ఆ పాత్రలు రెండూ నిజమే, వాటి మధ్య ఘర్షణా నిజమే అన్న నమ్మకంలో పడిపోయారు. ఎవరి పాత్ర పోషిస్తున్నప్పుడు వాళ్లలాగే ప్రవర్తించటం మొదలు పెట్టారు. దాంతో ఆ పాత్రల ఆలోచనలు, అనుభూతులే కాక వాటి చర్యలు కూడా నిజాలైపోయాయి. పర్యవసానంగా, మానవ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు – అతను ఇంటినిండా చెల్లా చెదురుగా పడున్న గాజు ముక్కల్లో ఒకటి ఏరుకుని తన మణికట్టు దగ్గర కోసుకున్నాడు”

“ఆ తర్వాత నేను ప్రియ పాత్రలోకి మారి అతని ఆఖరి సందేశం చదువుతూ, ఈలోగా మణికట్టునుండి తీవ్రంగా రక్తస్రావమై స్పృహ కోల్పోయానన్నమాట”, నాలో నేను అనుకుంటున్నట్లు పలికాను.

“అవును. రోజుల తరబడి ఏకాంతంలో గడపటం, అన్నపానాదుల ధ్యాసలేకుండా ఏకధాటిగా చాటింగ్‌లో మునిగితేలడం, వీటికి తోడుగా తీవ్రమైన రక్తస్రావం …. వీటన్నిటివల్ల మీ మానసిక, శారీరకారోగ్యాలు ఆందోళనకరమైన స్థితికి జారుకున్నాయి. అందువల్ల, మరునాడు ఆసుపత్రిలో స్పృహలోకొచ్చే సమయానికి మీరో విధమైన షాక్‌లో ఉన్నారు. వైద్యభాషలో దీన్ని పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. వారం పాటు చికిత్స చేశాక నేటికి కొంత మెరుగుపడ్డారు. కానీ, మీరున్న సున్నితమైన పరిస్థితిలో మీరు ప్రియ కాదు, మంజు అని ఒక్కసారిగా వెల్లడించటం మంచిది కాదు. అందుకే, మిమ్మల్ని కాసేపు ప్రియగానే ఉండనిచ్చి, ఒక్కో వివరం గుర్తుచేస్తూ వచ్చి సరైన సమయంలో మీరెవరో బయటపెట్టటం మంచిదని భావించాం”

“మరి మానవ్, ఆత్మహత్య …. ఇవన్నీ అబద్ధమైతే నన్నే నేరమ్మీద అరెస్ట్ చేసినట్లు?”

అప్పటిదాకా మౌనంగా ఉన్న పోలీసుల్లో ఒకతను మొదటిసారిగా నోరు విప్పాడు. 

“మేడమ్, మీ ఇంట్లో లభించిన ఆధారాలు మొదట్లో మమ్మల్ని తప్పుదోవ పట్టించాయి. ఏదో నేరం జరిగిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. ఆ క్రమంలో, ప్రియ ఫేస్‌బుక్ ఖాతాలో లభించిన యువకుడి ఫోటోని టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం చేస్తే, అది ఆదిత్య ఫోటో అని, తను బతికే ఉన్నాడని బయటపడింది. ఆ తర్వాత, ఆ ఖాతాలు రెండూ మీవేనని తెలుసుకోటానికి అట్టే సమయం పట్టలేదు. కేసు వెంటనే విడిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సొచ్చింది. కానీ ఆ వాదన కోర్టులో నిలబడదు. ఎందుకంటే ఆత్మహత్యాయత్నం చేసింది మీరు కాదు, మానవ్ కాబట్టి”

“అయితే నన్ను వదిలేస్తారా?”

“ఛార్జ్‌షీట్ బలంగా లేదు కాబట్టి మాకు వేరే దారిలేదు. కాకపోతే, ముందు మిమ్మల్ని ప్రియ పట్టునుండి బయటికి తేవాలి. అందుకోసం మేము డాక్టర్ లక్ష్మణ్ సహాయం తీసుకున్నాం. ప్రియ మిమ్మల్ని వదిలిపోయిందని నిరూపణైతే ఛార్జ్‌షీట్ రద్దుచేసి మిమ్మల్ని వదిలేస్తాం. దానికి కావలసిందల్లా మీరు మీరేనని డాక్టర్ లక్ష్మణ్ నిర్ధారించటం”

“నేను మంజునే. ఆ విషయంలో మీకే అనుమానం అక్కర్లేదు. నేను చేసిన పిచ్చిపనులన్నిటికీ సిగ్గు పడుతున్నా. నన్నా మాయలోనుండి బయటికి తెచ్చినందుకు, మళ్లీ మామూలు మనిషిని చేసినందుకు మీకెంతగానో రుణపడి ఉన్నా. నావల్ల ఆదిత్య గారికి కలిగిన ఇబ్బందికి ఆయన క్షమిస్తారని ఆశిస్తున్నా”, అందర్నీ కలయజూస్తూ నెమ్మదిగా, స్పష్టంగా చెప్పాను. చివరి వాక్యానికి ఆదిత్య ఫరవాలేదన్నట్లు నవ్వుతూ తలూపాడు.

* * * * * * * *

అలా, నా నుండి ప్రియని పారదోలాడు డాక్టర్ లక్ష్మణ్. 

ఆ తర్వాత గంటసేపు మనుషులు తమని తామెలా మర్చిపోతారు, ఎందుకు మర్చిపోతారు వగైరా విషయాల మీద శాస్త్రీయ వివరణలేవో ఇచ్చాడు. అవేవీ నా మట్టిబుర్రకి అర్ధం కాలేదు.

ఒకటి మాత్రం అర్ధమయింది. డాక్టర్ లక్ష్మణ్ అత్యంత ప్రతిభావంతుడైన మానసిక నిపుణుడు. అంతకు మించి, మంచి మనిషి. 

డాక్టర్ లక్ష్మణ్ – నాకు బాగా నచ్చాడు. అతనికి ఫేస్‌బుక్‌లో ఖాతా ఉందో లేదో.

అయినా, ఉంటే నాకేం లేకుంటే నాకేం.

అతనికోసం నేనే ఒకటి సృష్టిస్తే పోలా?