రచన: అనిల్ ఎస్. రాయల్
‘ఈనాడు’, 05 మే 2013
‘సారంగ’, 22 మే 2013
ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.
ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు.
కానీ లేదు.
లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.
ఇది అలాంటి ఓ మనిషి గాధ.
* * * * * * * *
ఆయన్ని ప్రొఫెసర్ అందాం. వయసు అరవై ఐదు.
ప్రొఫెసర్‌కి చాలా పేరుంది. మనిషి మెదడు నిర్మాణమ్మీద ఆయన చేసిన పరిశోధనలకి నోబెల్ బహుమతొచ్చింది. ఆ తర్వాత అతి సహజంగా ఆయనకి మనదేశంలోనూ గుర్తింపొచ్చింది. ప్రభుత్వం ఆయనకి ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించింది. ఆయన్ని రాష్ట్రపతిగా చేసి తమని తాము గౌరవించుకోవాలని రాజకీయపక్షాలన్నీ ఉబలాటపడ్డాయి. కానీ ప్రొఫెసర్‌కి ఆసక్తి లేకపోవటంతో ఉసూరుమన్నాయి.
ఆయన ఎక్కువగా బయటికి రాడు. నెలల తరబడి డిఆర్‌డివో లాబొరేటరీలో గడిపేస్తుంటాడు. ఆయనకంటూ ఓ ఇల్లున్నా అక్కడికి వెళ్లేది తక్కువే. ఓ కుటుంబం కూడా లేదు. వృత్తికే అంకితమైన జీవితం. రక్షణశాఖ కోసం రకరకాల పరికరాలు, పద్ధతులు రూపొందించటం ఆయన పని. ఎప్పుడూ ఏదో ఓ రహస్య పరిశోధనలో మునిగుంటాడు. తేలటం తక్కువే. దేశభద్రత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పరిశోధనలవన్నీ.
ఇదంతా నాకెలా తెలుసు? నేనో ఇంటలిజెన్స్ ఏజెంట్‌ని కాబట్టి. నేను పనిచేసేది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో. ప్రజల భద్రత మా ప్రధాన బాధ్యత. కరడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదుల నుండి నిజాలు కక్కించటం, వాటిని విశ్లేషించి ఎటువంటి ఘోరాలకు ఒడిగట్టబోతున్నారో ముందుగానే కనిపెట్టి వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకి ఉప్పందిచటం ఇతర బాధ్యతల్లో ఒకటి. రెండేళ్ల కిందటివరకూ అదో పెద్ద సవాలుగా ఉండేది. ప్రొఫెసర్ కనిపెట్టి అభివృద్ధిపరచిన మైండ్‌రీడింగ్ ప్రక్రియ ఆ పరిస్థితిలో మార్పు తెచ్చింది. లై డిటెక్టర్, పాలీగ్రఫీ వంటి పాత పద్ధతులు ఇవ్వలేని ఫలితాలు దీనితో సాధ్యపడ్డాయి. మనిషి మెదడు పొరలని స్కాన్ చేసి అందులో ఎక్కడే సమాచారం నిక్షిప్తమై ఉందో చిటికెలో కనిపెట్టే పరికరం అందుబాటులోకి రావటంతో నేరపరిశోధన తేలికయింది. నూటికి తొంభై ఐదుగురి విషయంలో ఈ పరికరం పనిచేస్తుంది. అత్యంత మనోనిబ్బరం కలిగిన ఏ కొందరి విషయంలోనో మాత్రం ఇది ఉపయోగపడదు. ఉపయోగాలతో పోలిస్తే, అదో పెద్ద సమస్య కాదు. సమస్యలు వేరే ఉన్నాయి.
సాంకేతికత అనేది రెండువైపులా పదునున్న కత్తి. దాని ఉపయోగం వాడేవారినిబట్టి మారుతుంది. ఈ వినిమయ యుగంలో మిలటరీ అవసరాల కోసం పుట్టిన సాంకేతికత ఆ హద్దుదాటి కన్స్యూమర్ ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టటానికి ఎంతో కాలం పట్టదు. ఇంటర్‌నెట్ నుండి సెల్‌ఫోన్లదాకా అదే కథ. అనతికాలంలోనే మైండ్ రీడింగ్ పరికరాలు సైతం అదే బాట పట్టాయి. వాటి వినియోగమ్మీద ఎన్ని ఆంక్షలున్నా అవి ఏదోలా బహిరంగ మార్కెట్లలో లభిస్తూనే ఉంటాయి. వాటి వల్ల దేశంలో విడాకుల కేసులెక్కువైపోయాయి. ఇదొక సైడ్ ఎఫెక్ట్. ఇలాంటివి మరిన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ అప్రస్తుతం.
ప్రస్తుతంలోకొస్తే, ఈ సాయంత్రం ఏజెన్సీ అధినేత నుండి నాకో అత్యవసర సందేశమొచ్చింది – ఉన్న పళాన ప్రొఫెసర్ దగ్గరికెళ్లి ఆయనకి కాపలా ఉండమని. ప్రముఖుల భద్రత కూడా మా ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నేనిలా అత్యవసరంగా వీఐపీల భద్రత చూడాల్సిన అవసరం పడ్డ సందర్భాలు ఇంతకు ముందూ ఉన్నాయి. కాబట్టి ఇది నాకు కొత్తకాదు. కొత్తగా తోచింది వేరే ఉంది. ప్రొఫెసర్ అత్యంత నిరాడంబరజీవి. రక్షణ శాఖలో కీలక సైంటిస్టుగా ఆయన క్షేమం దేశ ప్రయోజనాల రీత్యా అతి ముఖ్యం. ఆ కారణంగా గతంలోనే ప్రభుత్వం ప్రొఫెసర్‌కి కమాండోల సెక్యూరిటీ ఏర్పాటుచెయ్యబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. అటువంటిది, ఈ రోజు తనకి రక్షణ కావాలని స్వయానా ప్రొఫెసర్ నుండే అభ్యర్ధన రావటం వింత. ఓ పార్టీలో ఉండగా ఫోనొచ్చింది. వెంటనే బయల్దేరాను.
* * * * * * * *
డిఆర్‌డీవో కాంప్లెక్స్ నగరం నుండి విసిరేసినట్లుంటుంది. కొండల మధ్యలో లోయలా ఉన్న ప్రాంతంలో, నాలుగువేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. నేనక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది కావస్తోంది. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ వాళ్లు ఆపారు. నా గుర్తింపుకార్డు చూశాక తూతూమంత్రంగా తనిఖీ చేసి గౌరవంగా లోపలకి పోనిచ్చారు.
లోపల, అక్కడొకటీ ఇక్కడొకటీ భవనాలు. వాటిని కలుపుతూ నున్నటి తారు రోడ్లు. ఆ రోడ్ల మీద అడపాదడపా తప్ప లేని వాహన సంచారం. మొత్తమ్మీద ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ప్రొఫెసర్ ఉండే భవనం మిగిలిన భవనాల నుండి మరీ దూరంలో ఉంది. నా వాహనం దాన్ని సమీపిస్తుండగా కళ్లు అప్రయత్నంగా పరిసరాలని క్షుణ్నంగా పరిశీలించటం ప్రారంభించాయి. అనుమానాస్పదమైనదేదీ కనబడలేదు.
తలుపుకున్న గాజుకన్ను ముందు నా బ్యాడ్జ్ కనపడేలా పట్టుకుని బజర్ మోగించాను. రెండు నిమిషాలకి ప్రొఫెసర్ వచ్చి తలుపు తీశాడు, “క్షమించండి. ఓ ప్రయోగం చివర్లో ఉన్నా. మధ్యలో వదిలేసి రావటం కుదర్లేదు” అంటూ.
ఫరవాలేదన్నట్లు నవ్వి ఆయన్ని అనుసరించాను. మా వెనకే తలుపు మూసుకుంది. లాక్ అయినట్లు శబ్దమొచ్చింది.
అదో విశాలమైన గది. ప్రొఫెసర్ దాన్ని లివింగ్ రూమ్‌లా మార్చుకున్నట్టున్నాడు. ఓ మూల చిన్న మంచం. మరో మూల ఆఫీస్ డెస్క్; దాని మీద రెండు ల్యాప్‌టాప్స్, ఏవో పేపర్లు, ఓ కాఫీ మేకర్, పక్కనే ఫ్రూట్‌బౌల్. మరోపక్క గోడవారగా పెద్ద బుక్‌షెల్ఫ్; దాన్నిండా బరువైన సైన్స్ పుస్తకాలు. గది మధ్యలో ఓ త్రీ సీటర్ సోఫా, మరో లవ్ సీట్. వాటికి ఎదురుగా ఉన్న గోడకి వేలాడుతూ పెద్ద ఎల్ఇడి టెలివిజన్. మొత్తమ్మీద పెద్దగా అలంకరణలు, ఆడంబరాలు లేకుండా ఉందా గది.
“ఇంకాస్త పని మిగిలుంది. పది నిమిషాల్లో వచ్చేస్తాను. కాఫీ కావాలంటే అక్కడుంది చూడండి” అంటూ బుక్‌షెల్ఫ్ పక్కనే గోడకున్న తలుపు తెరుచుకుని పక్క గదిలోకి మాయమైపోయాడు ప్రొఫెసర్. అదాయన లాబొరేటరీ కావచ్చు.
నేను గది నలుమూలలా పరికించాను. సోఫాల కింద, అల్మైరా వెనక, ఆఫీస్ డెస్క్ దగ్గర, మంచం కింద …. ఇలా ముఖ్యమైన ప్రదేశాల్లో వెదికి చూశాను. ప్రమాదకరమైనవేమీ కనపడలేదు. ప్రొఫెసర్‌కి ఎవరి నుండి ప్రమాదముందో, ఉన్నపళాన ఆయనకి సెక్యూరిటీ అవసరమెందుకు పడిందో ఆ వివరాలేమీ నాకు తెలీదు. ఎట్నుండి ఏ ప్రమాదమొస్తుందో తర్వాత సంగతి. ప్రమాదం అంటూ వస్తే బ్యాకప్ వచ్చేదాకా ప్రొఫెసర్‌ని కాపాట్టానికి అనువైన ఓ ప్రదేశం అవసరం. అందుకు ఈ లివింగ్ రూమ్ అనుకూలమా కాదా అన్నది తెలుసుకోవటం నా తనిఖీల పరమార్ధం.
అన్నట్లుగానే పది నిమిషాల్లో తిరిగొచ్చాడు ప్రొఫెసర్. “అరె. ఇంకా నిలబడే ఉన్నారేం. కూర్చోండి, కూర్చోండి” అంటూ సోఫావైపు చూపించాడు, ఆఫీస్ డెస్క్ దగ్గరికి నడిచి ఏవో కాగితాలు ఫైల్లో సర్దుతూ.
“ఫర్వాలేదు” అన్నా నేను. గంటల తరబడి అలర్ట్‌గా నిలబడే ఉండటం నాకు అలవాటైపోయిన విషయం.
“నో, నో. మీరంత ఫార్మల్‌గా ఉండనవసరం లేదు. కూర్చోండి. ఇంతకీ కాఫీ తాగినట్లు లేరే. చల్లారిపోయిందా? మళ్లీ పెడతానుండండి” అంటూ డెస్క్ మీదనున్న కాఫీమేకర్ అందుకున్నాడు. “భయపడకండి. నేను కాఫీ కాయటంలో ఎక్స్‌పర్ట్‌ని” అంటూ నావైపు చూసి కన్ను గీటాడు.
నేను సోఫాలో కూర్చున్నాను. ఐదు నిమిషాల్లో రెండు కాఫీ కప్పులతో వచ్చాడాయన. ఓ కప్పు నాకిచ్చి త్రీ సీటర్‌లో ఆసీనుడయ్యాడు.
కాసేపు గదిలో మౌనం రాజ్యమేలింది. కాఫీ సిప్ చేస్తున్నా నా చూపులు పరిసరాలని పరిశీలిస్తూనే ఉన్నాయి. ప్రొఫెసర్ వెనక గోడకున్న పెద్ద కిటీకీ మీదకి నా దృష్టి పదే పదే మళ్లుతోంది. ఆ కిటికీ రెక్కలకి మరీ అంత మందంగాలేని గాజు పలకలు బిగించి ఉన్నాయి. ప్రమాదం అంటూ వస్తే అట్నుండే రావాలి.
నా చూపుల్ని ప్రొఫెసర్ గమనిస్తూనే ఉన్నాడు. తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టి చెప్పాడు.
“మరీ ఆ స్థాయి కాపలా అవసరం లేదు. కొంచెం రిలాక్స్ అవ్వండి. రేపు ఉదయం దాకా మీరు నాకు తోడుగా ఇక్కడుంటే చాలు. జస్ట్, నాకు కంపెనీ ఇవ్వటం అనుకోండి. ఓ కమాండోలా కాకుండా నా గెస్ట్‌లా ఉండండి. దయచేసి, ముందలా మరమనిషిలా చూట్టం మానేయండి” అన్నాడు నవ్వుతూ.
నేనూ నవ్వి రిలాక్సయ్యాను.
“ఇంకేమిటి విశేషాలు. బయట ప్రపంచం ఎలా ఉంది?” అన్నాడాయన. “ఈ పరిశోధనల్లో మునిగిపోయి బయటేం జరుగుతోందో పెద్దగా పట్టించుకోను” అన్నాడు మళ్లీ తనే సంజాయిషీ ఇస్తున్నట్లు.
“మానభంగాలు, అరాచకాలు, హత్యలు, దొంగతనాలు, కుంభకోణాలు, ఉగ్రవాదం. అంతా యధాతధంగానే ఉంది. ఆసక్తికరమైన విశేషాలేం లేవు”
“అంటే మీకు చేతినిండా పనన్న మాట”
“అవును. నాగరికత పురోగమించేకొద్దీ మనిషి తిరోగమిస్తున్నాడు. అందుకే నేరాలు ఏ ఏటికా ఏడు పెరిగిపోతూనే ఉన్నాయి”
“నిజమే. మనిషి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో తవ్వి తీయగలుగుతున్నాం కానీ అందులో దురాలోచనలు దూరకుండా అడ్డుకోలేకపోతున్నాం”, ప్రొఫెసర్ నిట్టూర్చాడు.
మళ్లీ కాసేపు మౌనరాజ్యం. నా కప్పులో కాఫీ ఐపోయింది. అది కిందపెట్టబోతుంటే ప్రొఫెసర్ వారిస్తూ లేచి కప్పందుకున్నాడు. తన కప్పు కూడా తీస్కెళ్లి డెస్క్ మీద పెట్టేసి అక్కడున్న ఫ్రూట్‌బౌల్ నుండి ఓ అరటిపండు వలుచుకుని తినటం మొదలు పెట్టాడు. తిన్నంతసేపూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు శూన్యంలోకి చూశాడు. తర్వాత, ఇందాకటి సంభాషణ కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.
“ఐతే …. మనుషులకి వక్రబుద్ధులు పుట్టకుండా చేయలేకపోవచ్చు కానీ, అవి అమలు జరగకుండా ఆపగలిగే రోజు ఎంతదూరంలోనో లేదు”.
నేను ప్రశ్నార్ధకంగా చూశాను.
“మైండ్ రీడింగ్ ద్వారా మనుషుల తలపులు గ్రహించి, వాళ్లు తలపెట్టిన ఘోరాలని ఊహించి వాటిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లే విజయవంతమవుతున్నారు. ఎందుకు? ఈ సాంకేతికత మీకు కేవలం జరగబోయే నేరాల గురించి ఓ అంచనా మాత్రమే కల్పిస్తుంది కాబట్టి. ఆ అంచనా కొన్నిసార్లు తప్పూ కావచ్చు. అందుకే, మనకి మైండ్ రీడింగ్‌ని మించిన టెక్నాలజీ అవసరం”, ప్రొఫెసర్ వివరించటం మొదలు పెట్టాడు. “దాన్ని సాధించే పరిశోధనల్లోనే నేను రెండేళ్లుగా తలమునకలయ్యున్నాను. అందుకే రాష్ట్రపతి పదవిని సైతం వదులుకున్నాను. ఈ ప్రయోగంలో విజయవంతమైతే దేశానికి ఒనగూడే ప్రయోజనం కన్నా ఆ పదవి ముఖ్యం కాదు”
నాకాయన మీదున్న గౌరవం అమాంతం రెట్టింపయింది. “మీకభ్యంతరం లేకపోతే, ఆ పరిశోధనేంటో చెబుతారా?”, ఆసక్తిగా అడిగాను.
“అభ్యంతరమేం లేదు. ఎలాగూ రేపీపాటికి ఇది దేశమంతా తెలిసిపోయేదే”
“అంటే ..?”
“అవును. పరిశోధన ఫలించింది. అఫ్‌కోర్స్, ఈ ప్రక్రియలో మనమింకా తొలిదశలోనే ఉన్నామనుకోండి. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మిలటరీకి, మీ ఏజెన్సీకీ అందుబాటులోకి తేవటానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ప్రస్తుతానికైతే, రేపు ఉదయాన్నే ప్రెస్‌మీట్‌లో కొన్ని విశేషాలు వెల్లడిస్తున్నాను. పిఆర్ కోసం చేసే తప్పనిసరి తంతన్నమాట. పైగా, ప్రాజెక్ట్‌లో మిగతా దశలకి ఫండింగ్ కోసం కూడా ఇలాంటివి తప్పదు”
“ఇంతకీ, ఏంటా పరిశోధన”, ఉత్కంఠ భరించలేక మళ్లీ అడిగాను ఆయన వాక్ప్రవాహానికడ్డొస్తూ.
“చెబుతాను. దానికి ముందు మీక్కొంచెం నేపధ్యం చెప్పాలి” అంటూ మొదలుపెట్టాడు ప్రొఫెసర్. “చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి – మనిషిని పరిసరాలతో అనుసంధానించే పంచేంద్రియాలు. కళ్లు, చెవులు, చర్మం, ముక్కు, నాలుక …. ఇలా శరీరంలో ఒక్కో భాగం ద్వారా ఒక్కో జ్ఞానం మనకి కలుగుతుంది. ఆయా భాగాలు నాడీవ్యవస్థ ద్వారా సదరు సమాచారాన్ని మెదడుకి చేరవేస్తాయి. దాన్ని మెదడు ప్రాసెస్ చేసి శరీరం ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయిస్తుంది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త దీనికి సంబంధించిన ఓ విశేషాన్ని కనిపెట్టాడు. అదేంటంటే, శరీరం సేకరించిన ఇంద్రియజ్ఞానం మెదడు స్వీకరించి, తిరిగి శరీరం ఎలా ప్రతిస్పందించాలో తెలియజేసేసరికి కనీసం అరక్షణం గడుస్తుంది”
“అర్ధం కాలేదు”
“ఐతే మీకు సోదాహరణంగా చెబుతా. ఇది తింటూ వినండి” అంటూ ఫ్రూట్‌బౌల్ నుండి ఓ ఆపిల్ అందుకుని మెరుపులా నా వైపు విసిరాడు. సూటిగా నా ముఖమ్మీదకి దూసుకొచ్చిందది. మరో లిప్తలో అది నా ముఖాన్ని పచ్చడి చేస్తుందనగా నా చెయ్యి లాఘవంగా దాన్ని ఒడిసిపట్టింది.
“గుడ్ రిఫ్లెక్సెస్. చాలా చురుగ్గా కదిలారు. కమాండో శిక్షణ ఊరికేపోలేదు” అంటూ ప్రొఫెసర్ వచ్చి మళ్లీ తన సోఫాలో కూర్చున్నాడు. “రెటీనా మీద పడ్డ వెలుతురు అక్కడినుండి మెదడులోకి చేరటానికి, మెదడు దాన్ని దృశ్యంగా మార్చటానికీ మధ్య కనీసం అరక్షణం గడుస్తుంది. మరోలా చెప్పాలంటే, నేను ఆపిల్ విసిరిన అరక్షణానికి కానీ అది మీరు చూడలేరు” అన్నాడు సోఫాలో సర్దుకుంటూ.
“అయితే?”
“నేను విసిరిన వేగానికి, ఆ లోపే ఆపిల్ మీ ముఖానికి తగిలుండాలి. కానీ తగల్లేదు. మీరు సరిగా సమయానికి దాన్ని పట్టేసుకున్నారు. అంటే, నేను ఆపిల్ విసిరిన విషయం తెలీకముందే మీ శరీరం దాన్ని ఎదుర్కోడానికి సిద్ధమైపోయింది”
“అదెలా సాధ్యం!?!”
“ఎలాగంటే …. అరక్షణం తర్వాత ఏం జరగబోతుందో మీ మెదడు ముందే గ్రహించింది కాబట్టి. అంటే అది భవిష్యత్తులోకి తొంగిచూసిందన్న మాట. అందుకే మీరు అరక్షణం ఆలస్యంగా కాకుండా, నేను ఆపిల్ విసిరిన వెంటనే రియాక్ట్ కాగలిగారు. ఇది మనందరి మెదళ్లూ చేసే మాయ. మనం దీనికి ఎంతగా అలవాటుపడిపోయామంటే, ఇదిలా జరుగుతుందన్న ఊహే నమ్మశక్యంగా అనిపించదు”
ఈ విషయం ఇంకెవరన్నా చెబితే కొట్టిపారేసేవాడినేమో. కానీ మెదడు పనితీరు గురించి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి వెల్లడించే విశేషం నమ్మకతప్పదు. ఐతే ఒకటి మాత్రం నాకర్ధం కాలేదు. అదే అడిగాను.
“భవిష్యత్తులోకి చూట్టం ఎలా సాధ్యం? భవిష్యత్తు ఇంకా జరగలేదుగా”
“అది అందరూ అనుకునేది. నిజానికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి విడివిడిగా లేవు. అవన్నీ మనుషులు తమ వెసులుబాటు కోసం సృష్టించుకున్న పదాలు మాత్రమే. ఉన్నది ఒకటే కాలం”
“ఏమిటది?”
“గతం”
“??”
“అవును. జరగాల్సింది, జరిగే అవకాశం ఉన్నది మొత్తం ఇప్పటికే జరిగిపోయింది. అదంతా మన దృష్టిలో ఇంకా పడలేదంతే. మనం ఇప్పటికే గమనించినది గతం. ప్రస్తుతం గమనిస్తున్నది వర్తమానం. ఇంకా గమనించనిది భవిష్యత్తు. దట్సాల్”
“అంటే …. భవిష్యత్తు కూడా ఇప్పటికే జరిగిపోయింది కానీ అది మనకింకా అనుభవంలోకి రాలేదంటారు”
“ప్రిసైజ్‌లీ. ఐతే, ఈ భవిష్యత్తనేది ఒకటి కాదు. కొన్ని వందల, వేల, లక్షల భవిష్యత్తులుంటాయి. వర్తమానంలో మనం ఏం చేస్తున్నామనేదాన్నిబట్టి ఆ లక్షలాది భవిష్యత్తుల్లో ఏదో ఒకటి మన అనుభవంలోకొస్తుంది. అదే మన గతంగా మారుతుంది”
“ఒకటికన్నా ఎక్కువ భవిష్యత్తులంటే …. ముందేం జరగబోతుందో తెలిస్తే దాన్ని మార్చుకునే అవకాశం ఉందన్న మాట”
“అవును. ఇందాక జరిగిందదే. నేను ఆపిల్ విసరడానికి అరక్షణం ముందే మీ మెదడు దాన్ని చూడగలిగింది. అందువల్లే ఆపిల్ మీ ముఖమ్మీద కాకుండా చేతిలో పడింది. లేకపోతే దానికి వ్యతిరేకంగా జరిగుండేది”
“బాగానే ఉందిదంతా. ఇంతకీ మెదడు అరక్షణం తర్వాతేం జరుగుతుందో ముందే ఎలా పసిగట్టగలుగుతుంది?”
“ఆ సమాచారమంతా మెదడులోనే ఉంటుంది. గతం ఎలాగైతే మెదడు పొరల్లో ఓ జ్ఞాపకంగా బంధించబడి ఉంటుందో, మనకున్న లెక్కలేనన్ని భవిష్యత్తులు కూడా అలాగే జ్ఞాపకాలుగా మెదడులోనే భద్రంగా ఉంటాయి. కాకపోతే, మనకి గతం మాత్రమే గుర్తుంటుంది. భవిష్యత్తులేవీ గుర్తుండవు. మన వర్తమానానికి తగిన భవిష్యత్తుని ఎంచుకుని ఆ జ్ఞాపకాలని ఓ అరక్షణం ముందే తవ్వి తీసే శక్తి మెదడుకుంది. అంతకు మించి ముందుకెళ్లగలిగితే ఎలా ఉంటుందనే ఊహ నా పరిశోధనకి పునాది”
“అంటే?”
“భవిష్యత్తులోకి మరింత లోతుగా తొంగిచూసే పద్ధతి కనిపెట్టటం ఆ పరిశోధన లక్ష్యం. అందులో నేను విజయం సాధించాను కూడా”
“కంగ్రాచ్యులేషన్స్”, చెప్పానే కానీ నా గొంతులో నమ్మకం ధ్వనించలేదు. అదాయన గమనించాడు.
“మీరు నమ్ముతున్నట్లు లేరు. ఉండండి మీకిప్పుడే డెమో ఇస్తాను” అంటూ నన్ను సోఫాలోంచి లేచి నిలబడమని సైగ చేశాడు. ఆయన చెప్పినట్లే చేశాను.
“కొంచెం రిలాక్స్ అవండి. కళ్లు మూసుకుని ఓ నిమిషం శ్వాస పీల్చి వదలండి” అంటూ నన్నో ప్రత్యేకమైన భంగిమలో నిలబెట్టాడు. ఆ తర్వాత నా చెవిలో ఓ పొడుగాటి వాక్యం చెప్పాడు. “మీ మెదడు పొరల్లో నిద్రాణంగా ఉన్న భవిష్యత్తు జ్ఞాపకాలని వెలికితీసే ఫార్ములా ఇది. దీన్ని ఏకాగ్రతతో పదేపదే మననం చేసుకోండి. అప్పుడు మీకు మీ భవిష్యత్తు గోచరిస్తుంది” అన్నాడు.
నాకు నవ్వొచ్చింది. “ఇది సైన్స్ ప్రయోగంలా లేదు. ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నట్లుంది. శాస్త్రం పేరుతో వేదాంతం నేర్పిస్తారా ఏంటి కొంపదీసి” అన్నాను నవ్వాపుకుంటూ, కళ్లు తెరవకుండానే.
“ఓ దశ దాటిపోయాక ఆ రెంటికీ పెద్దగా తేడా లేదులే. చెప్పింది చెయ్యండి” అన్నాడాయన కసురుతున్నట్లు.
* * * * * * * *
నేను మళ్లీ కళ్లు తెరిచేసరికి సోఫాలో కూర్చుని ఉన్నాను. ఆ స్థితిలో ఎంతసేపున్నానో, సోఫాలోకి ఎలా వచ్చానో గుర్తురాలేదు. కళ్లెదురుగా ప్రొఫెసర్ ముఖం కనబడింది.
“ఎంతసేపయింది?”, అన్నాను అర్ధోక్తిలో.
“ఎంతో సేపెక్కడ. ఒక్క నిమిషం లోపే. చెప్పాను కదా, ఈ ప్రయోగం ఇంకా తొలిదశలోనే ఉంది. ప్రస్తుతానికి మీరు వెలికితీయగలిగేది మీ …”
“…. చిట్టచివరి జ్ఞాపకం” ఆయన వాక్యాన్ని నేను పూర్తి చేశాను.
“అవును. మీ కళ్లు చూసే చివరి దృశ్యమన్న మాట. మీ జీవితంలో ఆఖరి ఘట్టం. ఇంతకీ ఏం చూశారు?”
“నన్ను ఉరి తీయటం”, మెల్లిగా చెప్పాను. ఇంకా కళ్లముందే మెదులుతుందా దృశ్యం. నా నేరాన్ని చదివి వినిపించటం, తర్వాత ముఖానికి ముసుగేసి ఉరితాడు బిగించటం, కాళ్ల కింద చెక్క పక్కకి తొలగటం, మెడ విరిగిన శబ్దం. అంతా నిమిషం లోపే.
నా ముఖమ్మీద చెమటలు పట్టాయి. వళ్లంతా వణుకు. అంత ఏసీలో కూడా ఉక్కపోతగా అనిపించింది. మెడలో టై వదులుచేశాను.
“భయపడకండి. మీరు చూసేశారు కాబట్టి అది జరగకుండా తప్పించుకోవచ్చిక”, అనునయంగా చెప్పాడు ప్రొఫెసర్.
నాకు వణుకింకా తగ్గలేదు. లేచి చిరాగ్గా గదిలో పచార్లు చేయటం మొదలు పెట్టాను. టై మెడనుండి ఊడిపడి చేతిలోకొచ్చి గిరగిరా తిరుగుతోంది. బుర్రలో ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఇంకా ఏ మూలో అపనమ్మకం. నేను చూసింది నిజమేనా?
“చూశారుగా. ఎలాంటి పరికరాలు అవసరం లేని ప్రక్రియ. పురాతన కాలంలో దీన్నే దివ్యదృష్టి అనేవాళ్లు. దీనిక్కాస్త పదునుబెట్టి భవిష్యత్తుని మరింత వివరంగా చూడగలిగితే, అప్పుడది దేశభద్రతకి పనికొచ్చే అద్భుతమైన ఆయుధమవుతుంది. భవిష్యత్తులో జరగబోయే నేరాలు ముందే సవివరంగా తెలుసుకుని ఆపటం సాధ్యమవుతుంది. ఇంకెంత, మహా ఐతే రెండు మూడేళ్లు చాలు”, సోఫాలో కూర్చుని ఆనందంగా చెప్పుకుపోతున్నాడు ప్రొఫెసర్.
నేనాయన మాటలకి అడ్డు తగిలాను.
“ప్రొఫెసర్. ఇంతకీ మీరు మీ భవిష్యత్తులోకి చూశారా?”
“అఫ్‌కోర్స్. చూడకుండా ఎలా ఉంటా?”
“ఏం కనబడింది?”
“నా చివరి క్షణాలు … ఎవరో వెనకనుండి నా గొంతు నులుముతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. గింజుకుంటున్నాను. కళ్ల ముందు ఈ గది గిరగిరా తిరుగుతూ ఉంది. నిమిషం పాటు అదే దృశ్యం. ఆ తర్వాత కళ్లలో మెరుపులు మెరిశాయి. అంతా నల్లగా మారిపోయింది. అంతే”
నా కళ్లు పెద్దవయ్యాయి. అపనమ్మకం మటుమాయమయింది. మా ఇద్దరి భవిష్యత్తులూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఐతే ఆ విషయం నాకు మాత్రమే తెలుసు, ప్రొఫెసర్‌కి తెలీదు. ఇద్దరం ఒకే భవిష్యత్తు చూశామంటే – ఇది కచ్చితంగా నిజమే.
తక్షణం నేనేం చెయ్యాలో బోధపడింది. తలతిప్పి ప్రొఫెసర్‌కేసి చూశాను. సోఫాలో అటుతిరిగి కూర్చుని ఉన్నాడాయన. నన్ను గమనించే స్థితిలో లేడు. ఇంకా చెప్పుకుపోతున్నాడు, “రేపు ప్రెస్‌మీట్ తర్వాత ఈ ఫార్ములాని భద్రంగా ప్రభుత్వానికి అందజేస్తాను. అందాకా నేను క్షేమంగా ఉండటం అత్యవసరం. అందుకే మిమ్మల్ని పిలిపించాను”
“ఈ ఫార్ములా ఇంకెవరికన్నా చెప్పారా?”, ఆత్రుత ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ అడిగాను.
“లేదు. ఇప్పుడు మీకు చెప్పేవరకూ అసలీ పరిశోధన గురించి కూడా ఎవరికీ తెలీదు”, ప్రొఫెసర్ వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాడు.
చాలు. నాక్కావలసింది అదే. వెంటనే మెరుపులా ముందుకొంగాను. లిప్తపాటులో నా చేతిలోని టై ప్రొఫెసర్ మెడచుట్టూ బిగుసుకుంది. వణుకుతున్న చేతుల్లోకి బలమంతా తెచ్చుకుంటూ మౌనంగా ఉచ్చు బిగించసాగాను. కాసేపు గింజుకున్నాక, నా బలం ముందు ఆయన వృద్ధదేహం ఓడిపోయింది. మూడే నిమిషాల్లో అంతా ముగిసిపోయింది. ఆయన ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక నోరు విప్పి చెవిలో చెప్పాను, “సారీ ప్రొఫెసర్. నా నేరమేమిటో చెప్పలేదు కదూ. అది, దేశద్రోహం. మిమ్మల్ని చంపినందుకు నా మీద మోపిన అభియోగం”.
నా వంట్లో వణుకు తగ్గిపోయింది. గుండె కుదుటపడింది.
* * * * * * * *
ఆ భవనం అగ్నికీలల్లో దగ్ధమవుతోంది. నేను దాని ముందున్న బెంచ్ మీద కూర్చుని ఉన్నాను. లోపల ప్రొఫెసర్ దేహం, దానితో పాటే ఆయన పరిశోధనకి సంబంధించిన సాక్షాధారాలన్నీ బూడిదైపోయాయి. దూరంగా సెక్యూరిటీ వాహనం సైరన్ మోగించుకుంటూ ఇటే వస్తూంది. ఫైర్ అలార్మ్ పనిచెయ్యకుండా చేసి భవనంలో ఉన్నవన్నీ తగలబెట్టేశాక నేనే వాళ్లకి ఫోన్ చేశాను.
భవిష్య దర్శన ప్రక్రియ మంచివాళ్ల చేతుల్లోనే ఎల్లకాలమూ భద్రంగా ఉండే అవకాశం లేదు. అది అందరికీ అందుబాటులోకి వచ్చిననాడు ప్రపంచం ఈ మాత్రం క్షేమంగా కూడా ఉండదు. ఒక మోసకారి స్టాక్‌బ్రోకర్ దీన్ని వాడుకుని ప్రపంచ ఆర్ధికవ్యవస్థలన్నిట్నీ అతలాకుతలం చెయ్యొచ్చు. ఓ దగుల్భాజీ రాజకీయనాయకుడు దీని ఊతంతో ప్రభుత్వాల్ని పడదోయొచ్చు, ప్రజల తలరాతల్ని చిత్తమొచ్చినట్లు మార్చిపారేయొచ్చు. ఓ నరహంతక తీవ్రవాది దీని సాయంతో ఎప్పటికీ పట్టుబడకుండా తప్పించుకు తిరగొచ్చు. దీనివల్ల ఒరిగే లాభాలకన్నా జరిగే నష్టాలే మిన్న. అందుకే ఈ ప్రక్రియ వెలుగులోకి రాకూడదు. ఆ సంగతి ప్రొఫెసర్‌కి వివరించినా ఉపయోగం ఉండదు. ఇంత కీలక పరిశోధనా ఫలితాన్ని నావంటి అపరిచితుడికి వెల్లడించిన మనిషిని నమ్మటం ఎలా? అందుకే ఆయన్ని తుదముట్టించటం మినహా దారిలేకపోయింది. ఇప్పుడా ఫార్ములా తెలిసిన వ్యక్తి ఒకడే మిగిలున్నాడు – నేనే. నేను ఎక్కువకాలం బతికుంటే ఆ ఫార్ములా అవసరానికో, స్వార్ధానికో బయటపెట్టొచ్చు. కాబట్టి నేనూ వీలైనంత త్వరగా అంతమైపోవాలి. ఆత్మహత్య అందరూ అనుకునేంత తేలిక్కాదు. ఇక మిగిలిన దారి, లొంగిపోవటం. లొంగిపోతే నా భవిష్యత్తేంటో నాకు తెలుసు. అన్నాళ్లూ ఈ రహస్యం నా దగ్గర భద్రంగా ఉంటుందన్న విషయమూ తెలుసు – మైండ్ రీడింగ్ ప్రక్రియతో ఇంటరాగేట్ చేసినా బయటపడనంత భద్రంగా.
ఎందుకంటే, మైండ్ రీడింగ్‌కి లొంగని ఐదు శాతం మందిలో నేనూ ఒకడిని.
సెక్యూరిటీ వాహనం ఎదురుగా వచ్చి ఆగింది. గార్డులు తుపాకులు ఎక్కుపెడుతూ నన్ను చుట్టుముట్టారు. ప్రతిఘటించే ఉద్దేశం నాకు లేదు.
ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.
ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. కానీ లేదు.
లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.
ఇది అలాంటి ఓ మనిషి గాధ.
ఇది, నా కథ.
స్పందించండి