రచన: అనిల్ ఎస్. రాయల్
‘సాక్షి‘, 15 ఆగస్ట్ 2010 & 22 ఆగస్ట్ 2010
“ఇద్దర్ని చంపాలి”
నిశ్సబ్దాన్ని ఛేదిస్తూ కంగుమందతని గొంతు.
నాకు పూర్తిగా మెలకువ వచ్చేసరికి ఆ గదిలో మేమిద్దరమే ఉన్నాం. తనని తాను ‘మెసెంజర్’గా పరిచయం చేసుకున్నాడతను. అది అతని సంకేత నామం. అసలు పేరు తెలీదు. అడిగినా చెప్పడు. అనవసరం కూడా. అతను ఎవరి తాలూకో చెప్పకున్నా తెలుసు – ఏబీ తాలూకు. ఎవరు పడితే వాళ్లు ఇక్కడిదాకా రాలేరు. వచ్చిన వాళ్లు అత్యవసరమైతే తప్ప నన్ను నిద్రలేపరు. లేపనే లేపారు కాబట్టి, నేను లేపేయాల్సింది చాలా ముఖ్యమైనవాళ్లనే అయ్యుండాలి.
“ఎవర్ని?”, కళ్లు చిట్లిస్తూ అడిగాను.
“మొదటివాడు కల్కి”
‘వాడెవడు’ అన్లేదు నేను. ఎవడైనా నాకొకటే. ‘ఎందుకు’ అనాలనే ఆలోచనే రాలేదు. నేనొక ఆయుధాన్ని మాత్రమే. ఆయుధాలకి ఆలోచనుండదు. లక్ష్యమే ఉంటుంది. అదెక్కడో తెలీటం అవసరం. అదే అడిగాను.
“ఎక్కడుంటాడు?”
“తెలీదు”
కొన్ని క్షణాల నిశ్శబ్దం. మళ్లీ మెసెంజరే ఛేదించాడు.
“అతనెవరో, ఎక్కడినుండొచ్చాడో, ఇతర వివరాలేవీ తెలీదు. కనీసం అతని పేరూ తెలీదు”
“ఇందాక కల్కి అన్నావ్?”, గుర్తు చేశాను.
“అది అసలు పేరు కాదు. అతని భారతీయ భక్తులు పెట్టిన పేరు. మొదట్లో చాలా కొద్దిమందే ఉండేవాళ్లు. వాళ్లు చేసిన ప్రచారానికి బాబాలంటే పడిచచ్చే హిందువుల్లో కల్కి పేరు అనతికాలంలోనే మార్మోగిపోయింది. ఆ సంఘటన జరిగిన మూడో రోజున అతను మళ్లీ కనబడ్డాడని పుకారు పుట్టింది ….”
‘ఏ సంఘటన’ అని నేనడగలేదు. ఆఖర్లో అన్ని ప్రశ్నలూ కలిపి వేయటం నా పద్ధతి.
“…. మీడియా పుణ్యాన ఆ పుకారు తెల్లారేసరికి ఇండియా మొత్తం పాకింది. ప్రముఖుల్ని మావాడంటే మావాడనటం మానవనైజం కదా. క్రైస్తవులు అది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ అన్నారు. ముస్లిములూ బీరకాయపీచు సంబంధమేదో కలుపుకున్నారు. మొత్తానికి పదేళ్లు తిరిగేలోపు మూడు మతాల్లోనూ అతని భక్తులు పెరిగిపోయారు. క్రమంగా ఓ కొత్త మతం పుట్టుకొచ్చింది. మిగతా చిన్నా చితకా మతాలూ అందులో కలవటానికి అట్టే కాలం పట్టలేదు. చూస్తూండగానే అది భూమండలాన్నంతా కమ్మేసింది. కల్కి పేరుతో కొత్త శకం మొదలయింది. ఉన్నదే ఒక మతం కావటంతో ఎక్కడా మతకలహాల్లేవు. అంతా శాంతి. అంతటా కల్కి మాయ. ఒకేసారి కనబడ్డాడు. మూడే ముక్కలు మాట్లాడాడు. అంతే! ఆ తర్వాత ప్రపంచం మారిపోయింది. దేవుళ్ల పేరుతో గొడవల్లేవు. దేశాల మధ్య యుద్ధాలూ లేవు”
“యుద్ధాల్లేని ప్రపంచం …. మంచిదేగా”
“ఏం మంచిది? అవి లేక ప్రపంచ జనాభా అడ్డగోలుగా పెరిగిపోయింది. వాళ్లందరికీ తిండేది? శాంతి వచనాలతో కాలే కడుపులు నింపుతావా?”
“నిజమే”, తల పంకించాను.
“అందుకే, అతన్ని చంపెయ్యాలి”
“దానిదేముంది, చంపేద్దాం”
“అంత తేలిక్కాదు”
“ఏం?”
“అతను చనిపోయి రెండు శతాబ్దాలు దాటింది”
“!?!”
“సరిగానే విన్నావు. నువ్వు చంపాల్సిన వ్యక్తి రెండొందల పన్నెండేళ్ల కిందటే చచ్చిపోయాడు”
“మరి ….”
“నువ్వు కాలంలో వెనక్కెళ్లి కల్కిని వెదికి పట్టుకుని చంపేయాలి”
“ఎలా?”
“మా దగ్గరో దారుంది – కాలయంత్రం. ఏబీ తూణీరంలో తాజా బాణం”
“నేనే ఎందుకు?”
“సిల్లీ ప్రశ్న. నువ్వు భారతీయుడివి కాబట్టి, నువ్వెళ్లాల్సింది నీ దేశానికే కాబట్టి, నిన్నైతే ఎవరూ అనుమానించరు కాబట్టి”
“అర్ధమైంది. కానీ, కల్కి వివరాలేవీ తెలీకుండా వెదికి పట్టుకోవటమెలా?”
మెసెంజర్ బదులివ్వకుండా జేబులోంచి ఓ కాగితం బయటికి తీశాడు. భద్రంగా దాని మడత విప్పి నా ముందుంచాడు. అందులో ఓ రంగుల ఫోటో ముద్రించి ఉంది – ఏదో ఉంగరం ఫోటో. వింతగా ఉందా ఉంగరం. వలయాకారంలో తనతోక తానే మింగుతున్న పాము!
నేను దాన్ని పరీక్షగా చూస్తుండగా మెసెంజర్ చెప్పటం మొదలు పెట్టాడు.
“కల్కికి సంబంధించి ఇదొక్కటే మావద్దనున్న ఆనవాలు. ఆ సంఘటన జరిగినచోట ఇది దొరికితే అతని భక్తులు సేకరించి భద్రం చేశారు. ఒకప్పుడు హిందువులకి ఓం, క్రైస్తవులకి సిలువ గుర్తు ఎలాగో ఇప్పుడు కల్కి మతానికి ఈ ఉంగరం గుర్తు అలా”
“పదే పదే ‘ఆ సంఘటన’ అంటున్నావు. ఏ సంఘటన?”
మెసెంజర్ నా కళ్లలోకి సూటిగా చూశాడు – నన్ను చదవటానికి ప్రయత్నిస్తున్నట్లు. కొన్ని క్షణాల తర్వాత అడిగాడు, “నీకు గుర్తు లేదా?”
“నాకు గుర్తుండటం ఏంటి?”
“అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు”
“ఎప్పుడు? ఎక్కడ?”
“నీ చివరి అసైన్‌మెంట్. నిజంగానే గుర్తు లేదా?”
అడ్డంగా తలూపాను. ఎలా ఉంటుంది? ఉండదు. ఉండకూడదు. ఎప్పటి అసైన్‌మెంట్ అప్పుడే మర్చిపోవటం మా ప్రొసీజర్స్‌లో ముఖ్యమైనది. పొరపాటున కూడా మేం చేపట్టే ఆపరేషన్స్ వివరాలు బయటికి పొక్కకుండా ఆ ఏర్పాటు. దానికోసం ప్రత్యేకించిన మరపు మాత్ర వేసుకుని కానీ రంగంలోకి దిగకూడదనేది నియమం. మాత్ర వేసుకున్నాక ఇరవై నాలుగ్గంటలకి అది పనిచేయటం మొదలుపెడుతుంది. అంతకు ముందురోజు జ్ఞాపకాలన్నిట్నీ తుడిచిపెట్టేస్తుంది. అవసరాన్నిబట్టి ఒకటో, రెండో, అంతకన్నా ఎక్కువో వేసుకుని పనిలోకి దిగుతాం. ఎన్ని మాత్రలు వేసుకుంటే అన్ని రోజుల జ్ఞాపకాలు చెరిగిపోతాయన్న మాట.
చెబుదామా వద్దా అన్నట్లు కాసేపు ఊగిసలాడి తర్వాతో నిర్ణయానికొచ్చినట్లు భుజాలెగరేసి నోరు విప్పాడతను.
“మీ ఆపరేషన్స్ వివరాలు గుర్తు చేయటం నియమాలకి విరుద్ధం. కానీ ప్రస్తుతం నీకది చెప్పటం అవసరం. అవసరమైనంతమేరకే చెబుతాను. విను”
పది నిమిషాల్లో క్లుప్తంగా చెప్పేశాడు. నా చివరి అసైన్‌మెంట్ – నేను విఫలమైన ఒకే ఒక ఆపరేషన్ వివరాలు. భావి భారత ప్రధానిగా పేరొందిన ఓ యువనేతని తుదముట్టించటం ఆ అసైన్‌మెంట్ లక్ష్యం. దానికి ముహూర్తం – దక్షిణ భారతదేశంలో ఓ మారుమూల ప్రాంతంలో జరుగుతున్న చిన్నపాటి సర్వమత సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనటానికి అతను విచ్చేస్తున్న సందర్భం. ఐదువేల మందికి లోబడే హాజరవుతున్న, మీడియా కవరేజ్ సైతం అనుమతించబడని ఆ సందర్భమైతే తేలికగా పనౌతుందని దాన్ని ఎంచుకోవటం జరిగింది.
అసైన్‌మెంట్ ఇవ్వటం వరకే ఏబీ పని. అమలెలా చేయాలనేది పూర్తిగా నా ఇష్టం. ఆ వివరాలు వాళ్లకీ తెలీవు. తెలిసిందల్లా, ఆ సభ తర్వాత కూడా యువనేత బ్రతికే ఉన్న విషయం. దానికి కారణమూ వాళ్లకి తెలుసు. యువనేత సభకి రావటానికి అరగంట ముందు అక్కడే జరిగిన ఒక సంఘటన – ఆ సంఘటన.
ఎక్కడ నుండొచ్చాడో ఆ వ్యక్తి. వడివడిగా సభావేదిక మీదకెళ్లాడు. అక్కడున్నవారు అడ్డుకునేలోపే మైక్ అందుకున్నాడు. నాలుగే వాక్యాలు మాట్లాడాడు: ‘నా రాక నవశకానికి నాంది. నా అంతం మరుయుగానికి ఆరంభం. జనం కోసం …. రణాల్లేని జగం కోసం …. ఈ మరణం. ఓం శాంతిః శాంతిః శాంతిః’
ఆ మాటలు పూర్తయ్యాక అక్కడున్న వేలాదిమందిని ఆశీర్వదిస్తున్నట్లు రెండు చేతులూ పైకెత్తాడు. మరుక్షణం, వాళ్లందరూ చూస్తూండగానే భగ్గున మండిపోయాడు. వాళ్లు తేరుకునేలోపే అగ్నికీలల్లో ఆహుతైపోయాడు. ఆనవాళ్లు సైతం మిగలకుండా క్షణాల్లో బూడిదైపోయాడు. చిత్రంగా, అతను తగలబడిపోయినా ఆ పరిసరాలు మాత్రం చెక్కుచెదరలేదు. సభలో పోగైనవారు హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురయ్యారు. ఈ సంఘటనవల్ల యువనేత రాక రద్దైపోయింది. ఏబీ ప్లాన్ దారుణంగా విఫలమైంది. దానికి మించి, ఏబీ ఊహించనిదొకటి జరిగింది. తెల్లారేసరికి ఆ అపరిచితుడికో భక్తగణం వెలిసింది. మూడో రోజున అతను మళ్లీ కనబడ్డటు పుకారు పుట్టింది. ఆ తర్వాతి కథ తెలిసిందే.
మెసెంజర్ చెప్పటం ముగించాక సాలోచనగా అన్నాను.
“ఎస్.హెచ్.సి”
“ఎక్స్‌క్యూజ్ మి?”, అర్ధం కానట్లు మొహం పెట్టాడతను.
“స్పాంటేనియస్ హ్యూమన్ కంబశ్చన్ – మనుషులు ఉన్నపళాన మండిపోవటం. ఇదేమీ కొత్త వింత కాదు. నాకు తెలిసి, ప్రపంచవ్యాప్తంగా అలాంటి సంఘటనలు రెండొందలకి పైగా జరిగాయి”, వివరించాను.
“చాలా మిస్టీరియస్‌గా ఉందే!”
“మిస్టరీ ఏం లేదిందులో. నాలుగైదు వివరణలున్నాయి. విక్ ఎఫెక్ట్ వాటన్నిట్లోకీ ప్రముఖమైనది”
“అదేంటి?”
“కొవ్వొత్తి మండే పద్ధతి. మనిషి దేహంలో ఉండే కొవ్వుపదార్ధాలు కొవ్వొత్తిలో మైనం అనుకుంటే, అతని దుస్తులు వత్తిలా పని చేస్తాయి. కొవ్వొత్తి ఎలాగైతే మైనం ఉన్నంతవరకూ మండి ఆ తర్వాత దానంతటదే ఆరిపోతుందో అలాగే ఎస్.హెచ్.సి సందర్భంగా మనిషి కూడా వంట్లో కొవ్వు ఐపోయేదాకా మండి ఆరిపోతాడు. పరిసరాలకు మాత్రం ఏ ప్రమాదమూ జరగదు”
“బాగుంది. కానీ కొవ్వొత్తి అంటించటానికి అగ్గిపుల్ల ఉండాలిగా. అగ్గిపుల్ల గీసిందెవరు? కల్కిని అంటించిందెవరు? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తనంతట తానే భగ్గున మండిపోయాడతడు”, మెసెంజర్ ధర్మసందేహం.
“నో వే. బయటినుండి ఏదో ఓ ప్రేరకం లేకుండా అతను మండిపోయే అవకాశం లేదు. కాకపోతే క్షణాల్లో బూడిదవటమే నమ్మశక్యంగా లేదు ….”
“ఆల్రైట్, ఆల్రైట్. నీ నమ్మకాలతో పనిలేదిక్కడ. అతనెలా తగలడ్డాడో మనకనవసరం. అదో అద్భుతం అనుకున్నారు పిచ్చి జనం. అది ప్రపంచంలో పెనుమార్పులకి దారితీసింది. ఆ అద్భుతం జరగకుండా ఆపటం నీ ప్రస్తుత కర్తవ్యం. కల్కి స్టేజ్ ఎక్కకముందే నువ్వతన్ని లేపేయాలి. అతను ప్రపంచానికి పరిచయం కాకముందే అనామకంగా రాలిపోవాలి. చరిత్రని తిరగరాసే ప్రయత్నమిది. అమెరికాని మళ్లీ అందలమెక్కించే అవకాశం. నీ వైఫల్యాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా. నువ్వీసారి ఎట్టి పరిస్థితిలోనూ విఫలం కాకూడదు”
‘ఆ ప్రశ్నే లేదు’ అనుకుంటూ చివరి ప్రశ్నేశాను.
“సరే. ఇంతకీ, నేను చంపాల్సిన రెండో మనిషెవరు?”
గట్టిగా ఊపిరిపీల్చి వదిలి చెప్పాడు మెసెంజర్.
“నువ్వే”
* * * * * * * *
అమెరికన్ బ్రదరెన్ – ఏ.బీ. సీక్రెట్ బ్రదర్‌హుడ్ ఆఫ్ అమెరికన్ పేట్రియాట్స్ అనేది దాని పూర్తు పేరు. అమెరికాకి స్వతంత్రం వచ్చిన కొత్తలో కొందరు దేశభక్తులు ఏర్పాటు చేసిన రహస్య సంస్థ. తమ దేశాన్ని అగ్రరాజ్యంగా నిలపటం దాని ఏకైక లక్ష్యం. అందుకోసం ఏం చెయ్యటానికైనా తెగించటం దాని లక్షణం – అవసరమైతే తమ దేశాధ్యక్షులనే అడ్డు తప్పించటంతో సహా. అంతులేని నిధులు, అత్యాధునిక సాంకేతిక సంపత్తి, సీ.ఐ.ఏ తలదన్నే ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్ ఏ.బీ సొంతం. దానిలోకి నియామకాలనుండి వాళ్ల ఆపరేషన్స్ దాకా అత్యంత పకడ్బందీగా, రహస్యంగా జరుగుతాయి. వందలేళ్లుగా మనుగడ సాగిస్తున్నా దాని ఉనికి అమెరికా అధ్యక్షుడికి సైతం తెలియదు. అంత అజ్ఞాతంగా పనిచేస్తుందది.
వివిధ దేశాల ప్రభుత్వాధినేతల నుండి మత గురువుల దాకా అమెరికా ప్రయోజనాలకి భంగం కలిగించేవారి అడ్డు తొలగించటానికి ఏ.బీ పలు మార్గాల్లో ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం తమ లక్ష్యాలకి అడ్డొచ్చేవారే కాక భవిష్యత్తులో కొరకరానికొయ్యలుగా మారతారనుకునేవారిపై సైతం ఏ.బీ డేగ చూపు సదా ప్రసరిస్తుంటుంది. అటువంటివారిని పదవీచ్యుతుల్ని చేయటం దగ్గర్నుండి ఏకంగా పైకే పంపటం దాకా ఏ.బీ ప్రయత్నించని మార్గాలుండవు. తమ ఘనకార్యాలన్నీ ఏ మిలిటెంట్ గ్రూపో చేసినట్లు కనిపించేలా చెయ్యటం ఏబీ చమత్కారం. ఏ.బీ చేసిన పనులు సి.ఐ.ఏ నెత్తినపడ్డ సందర్భాలు కోకొల్లలు.
శత్రువుల్ని వేటాడి వధించటానికి ఏ.బీ దగ్గరున్న ఆయుధాల్లో తిరుగులేనిది నాలాంటి నరహంతకుల బృందం. దేశదేశాల నుండి ఎంపికచేయబడి, అమితమైన ఖర్చుతో అత్యాధునిక రీతుల్లో శిక్షణీయబడ్డ ప్రత్యేక బృందంలో నేనొకడిని. మా పేరు వైపర్స్. ఏ.బీ హిట్‌లిస్టులోని వ్యక్తుల్ని తుడిచిపెట్టటం మా ప్రధాన కర్తవ్యం.
నాకు చిన్నప్పట్నుండీ చరిత్రకెక్కే పనులు చెయ్యాలనుండేది. సైంటిస్టునై సమాజానికి ఉపయోగపడాలన్నది నా చిన్ననాటి లక్ష్యం. దాన్ని చేరుకునే కోరికతో అమెరికా వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న విద్యనభ్యసిస్తూ, సాహసాలపై ఆసక్తికొద్దీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుండగా – ఏ.బీ దృష్టి నా మీద పడింది. అది నా దిశ మార్చింది.
అమెరికాలో చదువుకోటానికొచ్చే విదేశీ విద్యార్ధులందరిపైనా నిఘా పెట్టి, వాళ్ల ఆసక్తుల్నీ, అభిరుచుల్నీ, అర్హతల్నీ క్షుణ్నంగా అధ్యయనం చేశాక ఎంపిక చేసుకున్న అతికొద్దిమందిని ఏ.బీ తమ సంస్థలోకి ఆహ్యానిస్తుంది. చేరినవారు బతికిపోతారు. చేరనివారు ఏ రహదారి ప్రమాదానికో గురై …. పోతారు. బతకనేర్చినవాడిని కాబట్టి నేను బతికిపోయాను. సైంటిస్టునవాలనే కోరిక్కి గోరీ కట్టి మర్డరర్ అవతారమెత్తే క్రమంలో మనిషిగా చచ్చిపోయాను.
ఏడాదిన్నర కఠోర శిక్షణలో ఏ.బీ నన్నో తిరుగులేని వేటగాడిగా మార్చింది. మాతృదేశానికి వ్యతిరేకంగా పనిచేయటానికి లేశమాత్రం తటపటాయించకపోవటం, ఒక్కడినే వందలాదిమంది శత్రువుల మధ్యకైనా చొచ్చుకుపోవటం, ఎదుటివాళ్ల గుణగణాలు క్షణాల్లో విశ్లేషించటం, అవసరాన్నిబట్టి అప్పటికప్పుడు ఎత్తులూ పైఎత్తులూ రూపొందించుకోవటం, ఎందరిమధ్యనైనా గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తిచేసుకుని బయటపడటం – ఇవన్నీ కలిసి నన్ను వైపర్స్ బృందంలో అగ్రగామిగా నిలిపాయి. నేను చేపట్టిన ఆపరేషన్లెన్నో. విఫలమినది ఒకే ఒకటి. అదీ, నా చేతిలో లేని సంఘటన వల్ల. మరి, నా అంత విలువైన ఆయుధానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎలా? అందుకే ఏ.బీ దానికో దారి కనిపెట్టింది.
అదేమంటే – అవసరం లేనప్పుడు నన్ను క్రయోజనిక్ నిద్రలోకి పంపటం. అప్పటిదాకా ప్రయోగాల దశలోనే ఉన్న ఆధునాతన విధానమది. ఆ ప్రతిపాదన ఒప్పుకోటానికి నాకు పెద్దగా అభ్యంతరం లేకపోయింది. గత్యంతరం లేదనాలేమో. ఏ.బీకి ఎదురాడితో ఏమౌతుందో నాకెవరూ చెప్పనవసరం లేదు. కెమిస్ట్రీలో నా ఆసక్తి కూడా దానికి ఒప్పుకునేలా చేసింది.
వస్తువుల్ని అతి శీతల వాతావరణంలో భద్రపరిచే శాస్త్రమే క్రయోజనిక్స్. ఈ పద్ధతిలో, నన్ను హిప్నాసిస్ ద్వారా దీర్ఘ నిద్రలోకి పంపిన తర్వాత లిక్విడ్ నైట్జోజెన్‌తో నింపబడ్డ ప్రత్యేకమైన ఛాంబర్‌లో పడుకోబెడతారు. అంత చల్లటి వాతావరణంలో ఎక్కువకాల ఉంటే శరీర కణాల్లో నీరు ఊరి నాశనమైపోతాయి. దాన్ని నివారించటానికి డై మిధైల్ సల్ఫాక్సైడ్ – డి.ఎమ్.ఎస్.ఓ – అనబడే క్రయోప్రొటెక్టెంట్ ద్రావకాన్ని శరీర కణాల్లోకి అవసరాన్నిబట్టి ఇంజెక్ట్ చేస్తుంటారు. అలా సుషుప్తావస్థలో గడ్డకట్టుకుని ఉన్నన్నాళ్లూ నా శరీరంలో మార్పులు ఆగిపోతాయి. గుండె కొత్టుకోదు. మెదడుతో సహా ఏ అవయవాలూ పనిచేయవు. మరో రకంగా చెప్పాలంటే, పేరుకి నిద్రే ఐనా, అక్కడ జరుగుతుంది నన్ను అవసరం లేనప్పుడు చంపేసి అవసరం పడ్డప్పుడు తిరిగి బ్రతికించటం …. అలా నా జీవితకాలాన్ని పొడిగించటం.
క్రీ.శ. 1981లో నేను మొదటిసారిగా క్రయోజనిక్ నిద్రలోకెళ్లాను. ఆ తర్వాత మూడేళ్లకి అత్యవసరమై నన్ను లేపారు. మళ్లీ 1991లో లేపారు. ఆ తర్వాత మరికొన్ని సార్లు. చివరిసారిగా నిద్రలోకెళ్లింది 2010 డిసెంబర్ 23. మళ్లీ ఇదే లేవటం – రెండువందల పన్నెండేళ్ల తర్వాత.
నేను చివరిసారిగా నిద్రలోకెళ్లిన దశాబ్దానికి ప్రపంచంలో పెనుమార్పులొచ్చాయి. ఒక బుద్ధుడు, ఒక మహాత్ముడు నడిచిన నేలమీద మరో శాంతివిప్లవం మొదలయింది. భారతదేశంలో పుట్టిన కొత్త మతం శరవేగంతో ప్రపంచమంతటా విస్తరించింది. ఆ మతకర్త బోధన ప్రజలకి పిచ్చిలా పట్టింది. జనం శాంతికి జైకొట్టారు. దాన్ని ప్రచారం చేసిన రాజకీయ పక్షాలకే ఓట్లేశారు. యుద్ధపిపాసులకి ప్రభుత్వాల్లో చోటులేకుండాపోయింది. కొద్ది కాలంలోనే భూమ్మీదనుండి యుద్ధాలు మాయమయ్యాయి. మతాల పేరుతో బతికే అతివాద మూకలకి కాలం చెల్లిపోయింది. ఎక్కడ చూసినా శాంతి జపాలే. అదే అమెరికా పుట్టి ముంచింది. వరుసవెంబడి మాంద్యాల దెబ్బకి కుదేలై, ఆయుధ వ్యాపారమే ఏకైక ఆదాయ వనరుగా మారిన అగ్రరాజ్యం ఈ దెబ్బకి కళ్లు తేలేసింది. ఈలోగా అక్కడా నూతన మతం చాపకింద నీరులా వ్యాపించింది. ప్రభుత్వం మారింది. శాంతే అజెండాగా వచ్చిన కొత్త ప్రభుత్వం వస్తూ వస్తూనే సి.ఐ.ఎ వంటి సంస్థలపై వేటేసింది.
ఐతే ఏ.బీ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పని చేస్తూనే ఉంది – ఏనాటికైనా అమెరికాని అగ్రరాజ్యంగా నిలిపే ఏకైక లక్ష్యంతో. ఆ సమయం ఇప్పుడాసన్నమయింది. అందుకే నన్ను లేపారు.
నేను చేపట్టబోయే ఆపరేషన్‌ని బట్టి నన్ను ఎంత ముందుగా నిద్రలేపుతారనేదీ ఉంటుంది. ఈ సారి వారం ముందుగా లేపారు. ఎటువంటి ఆపరేషన్‌కైనా అది మరీ తక్కువ సమయం. క్రయోజనిక్ నిద్రనుండి లేవటం అంటే మామూలు నిద్రనుండి లేచినట్లు కాదు. వళ్లు స్వాధీనంలోకి రావటానికే వారం పడుతుంది. ఆ తర్వాత చెయ్యాల్సిన పనులు చాలా ఉంటాయి. సాధారణంగా నా దీర్ధ నిద్రల కాలంలో ప్రపంచంలో వచ్చిన మార్పులు ఆకళింపు చేసుకోటానికీ, ఆ కాలానికి తగ్గ వేషభాషలు అలవాటు చేసుకోటానికీ ఎక్కువ సమయం పడుతుంది. ఐతే ఈ సారి ఆ సమస్య లేదు – నేను చివరిసారిగా ఏ కాలాన్ని ఎరుగుదునో అప్పటికే వెళ్లబోతున్నాను కాబట్టి.
* * * * * * * *
సమావేశ స్థలికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశమది. ఆ ప్రాంతమంతా చిట్టడవిలా ఉంది. దాన్ని చీల్చుకుంటూపోతున్న సన్నటి తారు రోడ్డు పక్కనే కాపుకాసి అరగంటగా నిరీక్షిస్తున్నాను. డజన్ దాకా వాహనాలు అటూ ఇటూ వెళ్లాయి. నేనెదురుచూస్తున్న వాహనం మాత్రం రాలేదు.
అరగంటలో ఆరోసారి – రోడ్డు పక్కనే గుబురుగా ఉన్న తుప్పలకేసి దృష్టిసారించాను. వాటి వెనక తుక్కుతుక్కుగా మారి పడుంది నేను ప్రయాణించిన టైమ్ మెషీన్. అందులో నా కాలానికి తిరిగెళ్లటం కుదరదు. అది కాలంలో వెనక్కే తప్ప ముందుకి పోలేదు. అందువల్ల దానితో నాకిక ఉపయోగం లేదు. కానీ అది ఇతరుల దృష్టిలో పడటం మంచిది కాదు. అందుకే దాన్ని గుర్తుపట్టటానికి వీల్లేకుండా నాశనం చేశాను. అయినా, గతంలోకెళ్లటానికే టైమ్ మెషీన్ అవసరం. భవిష్యత్తులోకెళ్లటానికి దానితో పనేంటి? మనకిష్టమున్నా లేకున్నా, గడిచే ప్రతి క్షణమూ కాలంలో మనని ముందుకే తీసుకెళుతుంది. వచ్చిన పనయ్యాక నా కాలానికి తిరిగెళ్లటానికి మిగిలిన మార్గం అదే. అయితే దానికో వ్యక్తి అడ్డున్నాడు.
అతడు – నేనే!
రెండొందల పన్నెండేళ్ల కిందటి నేను ప్రస్తుతం నాకు అడ్డు. మా ఇద్దరిలో ఒకరికే బ్రతికుండే అవకాశముంది. ‘అవకాశం’ కన్నా ‘హక్కు’ సరైన మాటేమో. ఈ నా ఉనికి ఆ నాకు తెలీకపోవటం వల్ల, ఆ నా ఉనికి ఈ నాకు తెలీటం వల్ల, ఆ హక్కు ఈ నాకే దక్కింది. ఆ నా ప్రాణం ఈ నాకు రిటర్న్ టికెట్ అన్నమాట. కల్కిని తుదముట్టించాక, యువనేతని చంపే ఆపరేషన్ మీదొచ్చిన ఆ నన్ను చంపేయటం, ఆ నా స్థానంలో బేస్‌కి వెళ్లి క్రయోజనిక్ నిద్రలోకి జారుకోవటంతో నా ప్రస్తుత ఆపరేషన్ ముగుస్తుంది.
అసైన్‌మెంట్ ఐపోయాక రెండు మూడు రోజుల సెలవు ఉంటుంది. ఆ సమయంలో నేను ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరపు మాత్రలతో జ్ఞాపకాలు తుడిచేసే నియమం ఆపరేషన్ సాగిన రోజులకి మాత్రమే వర్తిస్తుంది. నా వెకేషన్ సమయానికి కాదు. జీవితకాలాన్ని పొడిగించుకునే క్రమంలో నేను కోల్పోతున్నవెన్నో. వాటికి ఏ.బీ కట్టిన వెల – ఆ నాలుగైదు రోజుల జ్ఞాపకాలు. అవే నాకు ఆస్తిపాస్తులు.
క్రితం సారి పనయ్యాక రెండు రోజులు సెలవు తీసుకున్నాను. ఆ రెండ్రోజులూ ఏం చేశానో చాలావరకూ గుర్తుంది. ‘ఆపరేషన్ కల్కి’ ఐపోయి, ఆ నా స్థానంలోకి విజయవంతంగా ప్రవేశించాక, వీలైనంతవరకూ పోయినసారి చేసిన పనులన్నీ అప్పట్లానే పునరావృతం చేయాలి. ఇది చాలా ముఖ్యం. చరిత్ర క్రమంతో ఆటలాడటం ఆషామాషీ వ్యవహారం కాదు. చిన్న తేడా చాలు భవిష్యత్తు ఊహకందని రీతిలో మారిపోటానికి. అందుకే, కల్కిని చంపేయటం తప్ప మిగతా సంఘటనలేవీ మారకుండా జాగ్రత్తపడాలి.
మనుగడ కోసం నన్ను నేనే చంపుకోవాల్సిన విచిత్ర పరిస్థితి! అయినా అది నాకేం కొత్త కాదు.
నిర్వికారంగా వేచిచూస్తూండగా మరో పది నిమిషాలు గడిచాయి. వాహనాల రాకపోకలు మందగించాయి. ఇలా వేచిచూడటం నాకలవాటే. రోజుల తరబడి ఒకే చోట మాటువేసి కూర్చున్న సందర్భాలెన్నో. అప్పుడెప్పుడూ లేనిది, ఈ సారి కాసేపటికే నాలో ఏదో అసహనం మొదలయింది! దాన్ని కప్పిపెట్టుకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తూండగా – దూరంగా ఏదో వాహనం వస్తున్న శబ్దమయింది.
అదేనా?
నిద్రలేచాక నాలుగు రోజులపాటు కల్కి గురించి చాలా చరిత్ర పుస్తకాలు, మత గ్రంధాలు తిరగేశాను. వాటిలో మాయలు, మత్రాల గాలి కబుర్లే ఎక్కువ. కల్కి ఎలా ఉంటాడో ఎక్కడా రేఖామాత్రంగానైనా వర్ణించబడలేదు. విగ్రహారాధనకి వ్యతిరేకమైన మతం కావటంతో – కల్కి తొలిభక్తులుగా పేరొంది, ఆ మతానికి మూల స్థంభాలుగా పేరొందిన ఆరుగురు ‘అపోస్టల్స్’ ఫోటోలు సైతం దొరకలేదు. కనీసం వాళ్లెవరో తెలిసినా కల్కి ఆచూకీ కనిపెట్టటం తేలికయ్యేది. కల్కి ఉంగరం గురించి కూడా రకరకాల కథలు. అతను తగలబడిపోయాక ఉంగరంగా మారాడనీ, అతని ఆత్మ ఇప్పటికీ అందులోనే ఉందనీ …. పనికిరాని కథలు. నాకు పనికొచ్చే వివరం ఒకే ఒకటి దొరికింది. అది – ఆ రోజు కల్కి ప్రయాణించి వచ్చినట్లుగా చెప్పబడుతున్న పాత బస్సు, అదొచ్చిన మార్గం. ప్రస్తుతం నేను కాపుకాసింది ఆ మార్గంలోనే.
వాహనం సమీపించింది. అదే! దగ్గరకు రాగానే చెయ్యెత్తాను. ఆగింది. తలుపు తెరుచుకుంది. లోపలికెక్కగానే కండక్టర్ తలుపు మూశాడు. బస్సు బయల్దేరింది.
పర్సులోనుండి రెండు పాతనోట్లు – ఈ కాలానికి చెందనవంటూ మెసెంజర్ ఇచ్చినవి – తీసి కండక్టర్‌కిచ్చి నేను వెళ్లాల్సిన చోటేదో చెబుతూ ఓ సారి బస్సంతా కలయజూశాను. డ్రైవర్నీ, కండక్టర్నీ అనుమానించాల్సిన పనిలేదు. వాళ్లనొదిలేస్తే మిగిలినవారిలో ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పదేళ్లలోపు పిల్లలు. వాళ్లనీ తీసేస్తే ఆరుగురు మగాళ్లు మిగిలారు. అందరూ ముప్పైకీ, నలభైకీ మధ్యలో ఉండే యువకులు. దాదాపు నా వయసు వాళ్లే.
నా వయసు. ఇంతకీ నా వయసెంత …. రెండొందల యాభై పై చిల్లరా?
కండక్టరిచ్చిన చిల్లర, టికెట్ జేబులో పెట్టుకుంటూ మరోసారి అందర్నీ పరికించి చూస్తుండగా చివరి సీట్లో కిటికీ పక్కగా కూర్చున్న వ్యక్తి నన్నాకర్షించాడు. ఈ లోకంలో లేనట్లు మౌనంగా కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. అతని పక్కనున్న సీటు ఖాళీగా ఉంది. వెళ్లి అక్కడ కూర్చుంటూ అతనివైపోసారి పరీక్షగా చూశాను.
రెండు మూడు రోజులుగా నిద్ర లేనట్లుందతని ముఖం. కళ్లెర్రబడి ఉన్నాయి. నెత్తిమీద జుత్తు చాలావరకూ రాలిపోయి ఉంది. చర్మం పొడిగా, అక్కడక్కడా పగుళ్లుబారి ఉంది. కీళ్లనొప్పుల బాధితుడిలా ముణగదీసుకుని ఉన్నాడు. తైరాయిడ్ వ్యాధి లక్షణాలు. అనారోగ్యంతో పాటు, అతని ముఖంలో ఏదో ఆకర్షణ కూడా అగుపించింది. దాన్ని మించి …. ఏదో ఫెమిలియారిటీ. అతన్నెక్కడో చూశాను. ఎక్కడ? ఎప్పుడు? గుర్తుకు రాలేదు. గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ అతన్నోసారి ఆపాదమస్తకం పరికించాను.
నా దృష్టి అతని చేతి మీద ఆగింది. ఆ వేళ్లకి …. అదే ఉంగరం. వలయాకారంలో, తన తోక తానే మింగుతున్న పాము.
వెదకబోయిన తిగ ఇంత తేలిగ్గా తగులుతుందనుకోలేదు. మరోసారతన్ని పరీక్షగా చూశాను. చింపిరి జుత్తు, చిరు గడ్డం, చేతిలో చిన్న సీసా. గొణుక్కుంటున్నట్లు కదులుతున్న పెదాలు. మొత్తంగా పిచ్చోడీ వాలకం.
ఇతనా కల్కి!
మేధావులకి పిచ్చోళ్లనే ముద్రేసే లోకం ఈ సారి ఓ పిచ్చోడిని మేధావనుకుని నెత్తినెక్కించుకుందా?
నా దృష్టి గుచ్చుకున్నట్లు అతను చటుక్కున తలతిప్పి నాకేసి చూశాడు. మా చూపులు కలుసుకున్నాయి. అతనివి బిత్తర చూపులు. కానీ లోతైన చూపులు.
“ఎక్కడ నుండి?”
అతని గొంతు మెల్లిగా ధ్వనించింది. అందులో ఏదో మార్దవం. పిచ్చోడి పలుకుల్లా లేవవి.
“ఇక్కడివారిలా లేరు. ఎక్కడ నుండొస్తున్నారు?”, మళ్లీ అడిగాడు. ఆ మాటతీరులో ఓ స్నేహభావం.
ఇలాంటి ప్రశ్నలకి నావద్ద సమాధానాలు సదా సిద్ధంగా ఉంటాయి. వెంటనే చెప్పాను. కాసేపట్లో మేమిద్దరం సంభాషణలో మునిగితేలుతున్నాం. మాటల్లో అతను వెళుతోంది సర్వమత సమ్మేళనానికే అని తెలిసింది. మరో క్లూ – అతనే కల్కి అనటానికి. అయినా నేను పూర్తిగా నిర్ధారణకి రాలేదు. అతనే కల్కి అని ఖరాఖండిగా రూఢి చేసుకోవటం చాలా ముఖ్యం.
ప్రయాణం కొనసాగినంతసేపూ ఏదో వేదాంతం వినిపించాడతను. ప్రాణులన్నింటి పుట్టుక వెనకా ఓ పరమార్ధం ఉంటుంది, ప్రతి మనిషి జీవిత లక్ష్యమూ ముందే నిర్ణయించబడి ఉంటుంది, కానీ చాలామందికి అదేమిటో తెలుసుకునే శక్తి, ఆసక్తి లేక దారితప్పి తప్పుడు లక్ష్యాలు చేరుకోటానికి తపిస్తుంటారు …. ఈ ధోరణిలో. లేని ఆసక్తి నటిస్తూ విన్నానదంతా.
ఏ మాటకామాటే. అతని చూపులోనే కాదు, మాటల్లోనూ పదునుంది. అవి నా మీదా ప్రభావం చూపినట్లున్నాయి. వైపర్ కావటం కాకుండా నాకు వేరే లక్ష్యమేదన్నా రాసిపెట్టుందా? నాన్సెన్. ఎవరో ఏదో రాసిపెడితే మనం వాటిని చేరుకోవటం ఏంటి. మనం మనుషులమా, మరబొమ్మలమా?
“బోర్ కొడుతున్నాను కదా?”
అతనికేసి చూశాను. నేను ఆలోచనలోకి జారుకోటం గమనించినట్లున్నాడు.
“లేదు. మీ ఫిలాసఫీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఐతే, నాదో ప్రశ్న”, ముఖమంతా కుతూహలం నింపుకుంటూ చెప్పాను.
“అడగండి”
“మనమేదన్నా మహానాటకంలో పాత్రలమా, ముందే రాసిపెట్టబడ్డ స్క్రిప్ట్ ప్రకారం పనులు చేసుకుపోవటానికి. అలాగైతే ఫ్రీ విల్ సంగతేంటి?”
ఆ ప్రశ్నడుగుతున్నప్పుడు నా గొంతెందుకో వణికింది – నేను మాత్రమే గమనించగలిగేంత చిన్నగా. ఫ్రీ విల్ గురించి నువ్వా మాట్లాడేది అంటోన్న అంతరాత్మ. అలవాటుగా దాన్ని నొక్కిపట్టాను.
నవ్వాడతడు. నా మనసు చదివినవాడిలా నవ్వాడు. నవ్వుతూనే చెప్పాడు, “ఆ స్వేఛ్చ మనకెప్పుడూ ఉంది. లక్ష్యాలు రాసిపెట్టబడ్డాయే తప్ప మనమీద రుద్దబడలేదు కదా. ఎవరి మహాలక్ష్యం వారు కనుక్కుని దాన్ని ఛేదించటానికి ప్రయత్నిస్తే ప్రపంచం మరోలా ఉంటుంది. అదే నేను నమ్మేదీ, నలుగురికీ చెప్పేదీ”
“బాగుంది. మరి మీ మహాలక్ష్యం ఏంటో కనుక్కున్నారా?”, వెటకారం ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ అడిగాను.
“యెస్”. ఆ మాటంటున్నప్పుడు అతని కళ్లలో తొణికిసలాడిన కనబడ్డ నమ్మకం నన్నో క్షణం కదిలించింది. ఒక్క క్షణమే. వెంటనే దాన్ని తుడిచేస్తూ అడిగాను.
“ఏమిటది?”
“మీలాంటివారిని అసలు లక్ష్యాలకేసి మళ్లించటం”. ఆ మాటంటూ మళ్లీ నవ్వాడు.
నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అతని మాటలు నన్ను వశపరచుకుంటున్నాయా? జాగ్రత్తగా ఉండాలి. ఈ సారి కూడా ఆపరేషన్ ఫెయిలైతే ఏ.బీ ఆగ్రహానికి అంతుండదు.
అతను హఠాత్తుగా నవ్వాపాడు. తర్వాత, కాసేపు నన్నే తదేకంగా చూసి అడిగాడు, “మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఊహకందని పని చెయ్యటానికి వస్తున్నారనిపిస్తోంది. అవునా?”
ఉలిక్కిపడ్డాను. అంత కచ్చితంగా ఎలా అంచనా వేశాడు? సందేహం లేదు. ఇతను పిచ్చివాడు కాడు. మేధావే. ఇతనే కల్కి. నిర్ధారణకొచ్చేశాను.
“అవును. ప్రపంచాన్ని మార్చటానికి వస్తున్నా”, తడబాటు కనబడనీయకుండా తూటాలా బదులిచ్చాను. పనిలో పనిగా మిస్టీరియస్ నవ్వొకటి పెదాలపై పులిమాను. ఇలాంటి సందర్భాల్లో అవతలివారి దృష్టి మళ్లించటానికి నేనుపయోగించే చిట్కాల్లో అదొకటి.
అతను నవ్వలేదీ సారి. సూటిగా నా కళ్లలోకి చూస్తూ చెప్పాడు, “మీ మాటలోనో, కళ్లలోనో …. ఎక్కడో, ఏదో గమ్మత్తుంది. ఏదో ఆకర్షణుంది”
నిజమే. అలాంటి గమ్మత్తుల్లేకపోతే నా వృత్తిలో కొనసాగటం కష్టం. కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చెయ్యాలంటే ఆ మాత్రం అయస్కాంతత్వం ఉండాల్సిందే.
అంతలో బస్సాగింది. మా గమ్యం వచ్చినట్లుంది. ఇద్దరమూ లేచాము. కల్కిని ముందుగా దిగనిచ్చాను. అతనికన్నా ముందు మరో ఇద్దరు దిగారు – ఇద్దరూ ఆడాళ్లే. కల్కి వెనకగా నేనూ బస్సు దిగాను. అతను మెల్లిగా నడుస్తుంటే నేను యాభై గజాల దూరంలో అనుసరించసాగాను – అతనికి అనుమానం రాకుండా. కీళ్లనొప్పులు బాగానే బాధిస్తున్నట్లున్నాయతన్ని. నడకలో ఆ ఇబ్బంది తెలుస్తుంది. మంచిదే. నన్నంత తేలిగ్గా తప్పించుకుపోలేడు. అతను స్టేజ్ ఎక్కటానికింకా మూడుగంటల సమయం ఉంది. వీలు చూసుకుని మూడోకంటికి తెలీకుండా పక్కకి తీసుకెళ్లి పైకి పంపేయాలి.
కల్కి మీద ఓ కన్నేసి నడుస్తూనే పరిసరాలు గమనించాను. మూడువేలమంది దాకా ఉన్నట్లున్నారు. ఇంకా వస్తున్నారు. సభావేదిక దూరంగా కనిపిస్తూంది. సువిశాలమైన మైదానం మధ్యలో ఉందది. తోరణాలు, బ్యారికేడ్ల వంటి ఆర్భాటాలేవీ లేవు. భవిష్యత్ ప్రధాని రాకకోసం ప్రత్యేకంగా చేసిన భద్రతా ఏర్పాట్లు సైతం అగుపడలేదు. సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతరత్రా బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం అనుమతించటం లేదు – వాటి సాయంతో బాబుల్ని పేల్చే అవకాశం ఉండటం మూలాన. నాలాంటి ప్రొఫెషనల్‌కి అదో అడ్డంకి కాదు. ఈ తూతూమంత్రం భద్రత మీద అతినమ్మకంతో, నలుగురైదుగురు బాడీగార్డ్స్‌ని మాత్రం తోడుతీసుకుని వచ్చి పోతాడేమో యువనేత. ఈ సారి వస్తే పోవటమే. నేను – అంటే ఈ నేను కాదు, ఆ నేను – ఆల్రెడీ పొజిషన్ తీసుకుని ఉండాలి. సాలోచనగా మైదానం అంతా పరికించాను.
యువనేతని లేపేయటానికి పోయినసారి నేనేమి ప్లాన్ వేసి ఉంటానో ఇప్పుడు గుర్తులేదు. మరపు గుళిక మహిమ. ఫర్వాలేదు. అదో సమస్య కాదు. ఇదే పరిస్థితిలో ఇప్పుడు అతన్ని లేపేయటానికి ఎలా ఆలోచిస్తానో అప్పుడూ అలాగే ఆలోచించి ఉంటాను.
అంత పెద్ద మైదానాన్నీ, తక్కువ సంఖ్యలో ఉన్న జనాన్నీ, తక్కిన ఏర్పాట్లనీ గమనించాక, యువనేతని టెలిస్కోపిక్ గన్‌తో కాల్చేయటం అత్యంత సులువైన మార్గం అనిపించింది. దానికోసం కావలసిందల్లా మాటువేయటానికీ, పనైపోయాక చప్పుడు లేకుండా తప్పుకుపోటానికీ అనువైన ప్రదేశం. అది కనిపెట్టటం పెద్ద పనేమీ కాలేదు. బస్సు ఆగిన చోటికి కుడివైపు, సుమారు రెండొందల గజాల దూరంలో గుబురుగా ఉన్న చెట్లు కనబడ్డాయి. సభావేదిక్కి దాదాపు ఎదురుగా, సుమారు నాలుగొందల మీటర్ల దూరంలో ఉందది. దాని ముందో బురదనీటి గుంట. మాటు వేయటానికీ, కాటు వేయటానికీ అంతకన్నా అనువైన చోటు లేదు. పరీక్షగా చుస్తే ఆ చెట్ల వెనక నక్కి కూర్చున్న ఆకారం కనబడింది. ఆ మసకచీకట్లో క్రీనీడలా కదలాడుతున్నా, అతన్ని అతి సులువుగా గుర్తుపట్టాను. నేను ఎక్కడున్నానో తెలిసింది. ఇక కల్కిని గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టాలి. అదయ్యాక, యువనేతని మట్టుపెట్టనిచ్చాక నన్ను లేపేయాలి. తర్వాత …. పోయినసారి గడిపినట్లే రేపూ, ఎల్లుండీ గడపాలి. అవే ప్రదేశాలకి వెళ్లాలి. అవే పనులు తిరిగి చేయాలి. ఆ తర్వాత, అప్పట్లానే విమానమెక్కాలి. పదకొండు గంటల ఏకబిగి ప్రయాణం తర్వాత నా బేస్‌కి చేరుకుంటాను. అక్కడ ఫార్మాలిటీలు పూర్తిచేసుకున్నాక క్రయోజనిక్ నిద్రకుపక్రమిస్తాను. మళ్లీ ఎప్పుడో అవసరమైనప్పుడు లేస్తాను – క్రీస్తు శకంలో. కల్కి శకంలో కా….
…. కల్కి!
ఏడి!?!
ఆలోచనల్లో మునిగిపోయి కల్కి మీదనుండి దృష్టి మరల్చాను. అతను ఐపులేకుండా పోయాడు!
డామిట్. ఇంత పరధ్యానంగా ఎలా ఉన్నాను?
* * * * * * *
ఏడు గంటలు కావస్తోంది. బస్సు దిగి మూడుగంటలయింది. జనం సంఖ్య రెట్టింపయింది. ఎంత వెతికినా కల్కి మాత్రం కనబడలేదు. అయినా నేను నిరాశ చెందలేదు. నిరాశనేది నాలాంటివారి నిఘంటువుల్లో ఉండకూడని పదం. నా పని చిట్టచివరి క్షణం వరకూ ప్రయత్నించటమే. ఆ చివరి క్షణాలు దగ్గర పడుతూండటంతో వేదిక ముందుకి చేరాను. లెక్క ప్రకారం మరో ఐదారు నిమిషాల్లో కల్కి వేదికనెక్కి మైక్ అందుకోవాలి. నాలుగడుగుల ఎత్తున్న వేదికది. దాని పైకెళ్లటానికి ఒకే ఒక చోట మెట్లున్నాయి. వెళ్లి వాటిపక్కనే నిలబడ్డాను. కల్కి వేదికనెక్కేటప్పుడు అడ్డగించి ఏదోలా అతన్ని మాటల్లో పెట్టి పక్కకి తీసుకుపోతే చాలు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అతన్ని అంతమొందించి తప్పించుకోవటం చిటికెలో పని.
“హలో”
నా భుజమ్మీదో చెయ్యిపడింది. వెనక్కి చూస్తే – కల్కి. తమాషాగా కనుబొమలెగరేసి సంభ్రమంగా చూస్తూ.
“చాలా సేపట్నుండీ మీకోసం వెదుకుతున్నా. నా కొత్త ఫ్రెండ్స్‌ని మీకు పరిచయం చేద్దామని ….”, ఆనందంగా చెప్పుకుపోతున్నాడు. అతని వెనక ఐదుగురు వ్యక్తులు, ఆసక్తిగా నన్నే చూస్తూ.
అరగంట కలిసి ప్రయాణించిన అపరిచితుడు మళ్లీ కనిపిస్తే అంతానందమా! విచిత్రంగా అనిపించింది కల్కి తీరు. అప్పుడే మెరుపొకటి మెరిసింది నా మెదడు పొరల్లో.
క్రితం సారి, వెకేషన్ ముగించుకుని వెనక్కెళ్లిపోయే హడావిడిలో విమానాశ్రయంలో గబగబా నడుస్తుండగా – ఇలాగే నా భుజమ్మీదో చెయ్యి పడింది. వెనుదిరిగి చూస్తే ఎవరో అపరిచితుడు. ఆశ్చర్యంగా నాకేసి చూస్తూ అంటున్నాడు, “ఇది నిజంగా నిజమా? నమ్మలేకపోతున్నాను”. అతని కళ్లలో కొట్టిచ్చినట్లున్న సంతోషం.
అదే సంభ్రమం. అదే తీరున కనుబొమలెగరేయటం. అప్పుడూ ఇలాగే అనుకున్నా – ‘అపరిచితుడ్ని చూసి అంతానందమా?’. ఇంకోటీ అనుకున్నా – ‘నన్ను చూసి మరెవరో అనుకున్నాడు కాబోలు’. అనుకున్నాక, అతన్ని పట్టించుకోకుండా వేగంగా ముందుకి సాగిపోయా -వెనకనుండి అతనేదో మాట్లాడుతూనే ఉన్నా పట్టించుకోకుండా.
అతనే ఇతను, ఇతనే అతను!
ఆ రోజు …. ఆపరేషన్ రోజు నుండి మూడో రోజు. కల్కి మళ్లీ కనబడ్డాడని చెప్పబడే రొజు.
ఎక్కడో మొదలైన అనుమానం. ఏదో అర్ధంకాని అయోమయం.
అంతలో – నా దృష్టి అతని చేతిలో ఉన్న చిన్న సీసామీద పడింది. అప్పుడే అందులోంచి రెండు గుళికలు చేతిలోకి వంపుకుని నోట్లో వేసుకోబోతున్నాడతను. అవేమిటో వెంటనే గుర్తు పట్టాను.
ఆర్థో-పెర్-అయొడిక్ యాసిడ్. స్ఫటిక రూపంలోని అయొడిన్ సప్లిమెంట్స్. ధైరాయిడ్ బాధితులు సాధారణంగా వాడే మాత్రలు.
అయొడిక్ యాసిడ్, డి.ఎమ్.ఎస్.ఓ. ఆ రెండూ జతకూడితే జరిగే రసాయనచర్యకి చిన్నపాటి పేలుడు సంభవిస్తుంది.
క్రయోప్రొటెక్టెంట్‌గా నాలో అణువణువునీ ఆక్రమించుకుని ఉన్న డి.ఎమ్.ఎస్.ఓ.కి అయొడిన్ సప్లిమెంట్స్ తోడైతే?
సంబంధం లేనివిగా అనిపించే సంఘటనల్ని ఓ క్రమంలో పేరిస్తే – ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి.
నా చెవుల్ని హోరెత్తిస్తూ సంభాషణలు. వాటి వెంటే ప్రశ్నలు, వెనువెంబడి సమాధానాలు.
“అగ్గిపుల్ల గీసిందెవరు?”. అగ్గిపుల్లే అవసరం లేదు నిప్పు పుట్టించటానికి.
“మీలాంటివారిని అసలు లక్ష్యాలకేసి మళ్లించటం”. ఏమిటి నా అసలు లక్ష్యం?
“ప్రపంచాన్ని మార్చటానికి”. నేనిచ్చిన బదులు. దానికి మరో అర్ధమూ ఉందని అప్పుడు నేనూహించలేదు. ఇప్పుడే లీలగా స్ఫురిస్తోందది.
“…. మూడో రోజున అతను మళ్లీ కనబడ్డాడని పుకారు పుట్టింది”. అది పుకారు కాదు. పచ్చి నిజం!
ఆ క్షణందాకా ఉన్నట్లే లేని పజిల్ ఆకస్మాత్తుగా విడిపోయింది.
అతను కాదు. నేనే కల్కి!!
మరు క్షణం – ముఖమ్మీద ఎవరో ఛెళ్లున చరిచినట్లు, పగలే చుక్కలు కనిపిస్తుండగా …. ఫెళ్లున జ్ఞోదయమయింది.
అందరూ పోయేవాళ్లే. ఆ తర్వాతా గుర్తుండిపోయేవాళ్లు మాత్రం కొందరే. ఆ కొందరిలో ఒకడవ్వాలనుకున్నాను. ఆఖరుకేమయ్యాను?
ఎలా జరిగిందిదంతా?
నన్ను నేనే చంపుకుంటూ …. నావాళ్లూ, నా ముందు వాళ్లూ, నా తర్వాతివాళ్లూ, ఆ తర్వాతివాళ్లూ గతించిపోగా …. ఈ అనంత విశ్వంలో నా అనేవాళ్లు లేక, శతాబ్దాలకి శతాబ్దాలే …. ఒంటరిగా, జీవన్మృతుడిగా.
ఎందుకిదంతా? ఎవరికోసం ఇదంతా?
చేతి గడియారం బీప్‌మంటోంది. సమయం ఆసన్నమయింది. నా ఆలోచనలూ ఓ రూపానికొస్తున్నాయి.
పనిచేయని గడియారం సైతం రోజుకి రెండుసార్లు సరైన సమయం చూపిస్తుంది. నేను అంతకన్నా పనికిరానివాడినా? పనికొచ్చేపని ఒకటైనా చెయ్యలేనా?
చెయ్యగలను.
చేస్తాను.
శతాబ్దాల మొద్దునిద్ర నుండి నేను నిజంగా మేల్కొన్న క్షణమది. సమాధి బద్దలుకొట్టుకుని మనిషిగా మళ్లీ పుట్టిన క్షణమూ అదే.
ఆ క్షణం – ఆయుధానికి ఆలోచనొచ్చింది, లక్ష్యం తారుమారయింది.
నా లక్ష్యం – చరిత్ర తిరగరాయటం కాదు. చరిత్ర సృష్టించటం.
అప్పుడొచ్చింది – వందలేళ్ల క్రితమే నన్నొదిలిపోయిన నవ్వు. వస్తూ వస్తూ ఏడుపునీ వెంటబెట్టుకొచ్చింది. ఎండిపోయిందనుకున్న గుండెలోనుండి చెమ్మని వెలికి తీసుకొచ్చింది. అతనూ, అతని ఐదుగురు స్నేహితులూ నోళ్లు తెరుచుకుని చూస్తుండగా కళ్ల నుండి నీళ్లు ధారలు కడుతుండగా మనస్పూర్తిగా, తనివితీరా, నవ్వుతూ, ఏడుస్తూ, నవ్వాను.
తర్వాత ఓ అడుగు ముందుకేసి అతని భుజమ్మీద మెత్తగా తడుతూ అడిగాను, “నీ ఉంగరం ఓ సారిస్తావా? అదే చేత్తో ఆ సీసా కూడా”
నా కళ్లలో ఆకర్షణ కట్టిపడేసిందో ఏమో, అతను మారు మాట్లాడకుండా రెండూ ఇచ్చేశాడు.
సీసాలోంచి వచ్చినన్ని మాత్రలు చేతిలోకి వంపుకుని నోట్లో వేసుకున్నాను. ఆ ఆరుగురూ నివ్వెరపోయి చూస్తూండగా వాటిని నమిలి మింగాను. తర్వాత, ఉంగరం వేలికి తొడుక్కుంటూ ముందుకొంగి రహస్యం చెబుతున్నట్లు అతని చెవిలో చెప్పాను.
“ఇప్పుడిక్కడ ఏం జరిగినా, ఎల్లుండి సాయంత్రం ఇదే సమయానికి విశాఖ విమానాశ్రయంలో నాకోసం ఎదురు చూడు. గుర్తుంచుకో …. ఇక్కడ ఏం జరిగినా …. ఎల్లుండి సాయంత్రం …. ఇదే సమయానికి …. ఎయిర్‌పోర్టులో”
నా మాటలు అర్ధం కానట్లు చూస్తున్న అతన్ని అక్కడే వదిలేసి వేదిక మెట్లెక్కటం మొదలు పెట్టాను. ఎక్కుతూ ఓ సారి తలతిప్పి దూరంగా ఉన్న చెట్లకేసి చూశాను. ఆ నా దృష్టి ప్రస్తుతం ఈ వేదిక మీదనే ఉండి ఉంటుంది. ఈ నన్ను ఇలా చూసి ఆ నేను విస్తుపోతూ ఉండి ఉంటాను. అయినా ఫర్లేదు. కాసేపట్లో మర్చిపోయేదేగా.
అప్పుడే కడుపులో కెమికల్ రియాక్షన్ మొదలయిన సూచనలు. నా లెక్క నిజమైతే, అగ్గి రాజుకోటానికి ఇంకో అర నిమిషంకన్నా సమయం లేదు. రెండు శతాబ్దాలకి పైగా డి.ఎమ్.ఎస్.వో లో నానిపోయిన వంట్లో విక్ ఎఫెక్ట్ మొదలవటానికి ఆ కాస్త నిప్పు చాలు. ఆ తర్వాతది విశ్వరూపం దాల్చటానికి, నన్ను దహించేయటానికి, నేను బూడిదవటానికి క్షణాలు చాలు.
స్టేజ్ మీద ఏర్పాట్లు చూస్తున్న వాళ్లెవరో ఇటే వస్తున్నారు – నన్ను వారిస్తున్నట్లుగా చేతులూపుతూ. ఇక ఆలస్యం చెయ్యకూడదు.
నడక వేగం పెంచి వడివడిగా వేదికనెక్కి వణికే చేతులతో మైకందుకుని గొంతు సవరించుకున్నాను.
నేనేం మాట్లాడాలో తెలుసు.
ముందే రాసిపెట్టబడి ఉందది – నేనెరిగిన చరిత్రలో.
స్పందించండి