(రచన: అనిల్ ఎస్. రాయల్)
"సత్యం అనేదొక స్థిర భ్రాంతి"
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
----
చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.
దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో -
దిగ్గున మెలకువొచ్చింది.
ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
ఉదయం పదిగంటల వేళ.
బంగాళాఖాతపు దిక్చక్రం దాటి, పైకెగబాకిన సూర్యుడు విశాఖనగరానికి ఏటవాలుగా వుండి, వేడి శరాల్ని సంధించి ఒదులుతున్నాడు.
జగదాంబ జంక్షన్ హడావుడిగా తిరిగే మనుషులతో, వాహనాలతో సందడిగా వుంది. జూన్ మాసం వచ్చి రెండు వారాలు దాటినా, ఎండలు తగ్గటంలేదు. మధురవాడ నుండి పాత పోస్టాఫీసు వెళ్ళే ఇరవైఐదో నంబరు సిటీబస్సు ఆ సెంటరులో ఆగటంతో దిగింది గురమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలందుంపల గంపని మరొకరి సహాయంతో తల మీదకెత్తుకుని, జగదాంబ సినిమాహాలు ముందున్న బస్స్టాపు ఎడంపక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది.
Continue reading ...
(రచన: ఉణుదుర్తి సుధాకర్)
సుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్ – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ, ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.
Continue reading ...
(రచన: కుప్పిలి పద్మ)
రోజ్‌వుడ్ పెయింట్ చేసిన 2 x 2 నలుచదరపు టేబుల్‌కి అటో కుర్చీ యిటో కుర్చీ. టమోటా చిల్లీ సాస్, వెనిగర్, సాల్ట్, పెప్పర్ చిన్ని చిన్ని పింగాణీ గిన్నెలతో అమర్చిన ట్రే. యుయెస్ పీజా వాసనలు. ప్లాస్టిక్ గ్లాస్‌లోని కోక్, స్పైట్ర్, థమ్సప్ చల్లదనాలు.
ఫ్లైవోవర్ మీది నుంచి యెడతెరిపి లేకుండా సాగిపోతోన్న కార్లు స్కూటర్లు, ఆటోల మధ్య బస్సులు తక్కువగానే కనిపిస్తున్నాయి. యెదురు చూస్తున్న వాహనం మాత్రం కనిపించటంలేదు.
Continue reading ...
(రచన: అఫ్సర్)
“ఆ గదిలోకి మాత్రం తొంగి అయినా చూడద్దు, బేటా!” అని కేకేస్తున్న ఫాతిమా ఫుప్మా (అత్తయ్య) గొంతే వినిపిస్తోంది ఎప్పటిదో గతంలోంచి.
“అబ్బాజాన్ కి పదో రోజు చేస్తున్నాం,” అని మునీర్ భాయ్ మూడు రోజుల క్రిందట ఫోన్ చేసినప్పటి నించీ ఆ కేక ఆ గతంలోంచి ఎన్ని సార్లు వినిపించిందో లెక్క లేదు.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
విజయనగరం దగ్గర్లోని కోరుకొండ సైనిక్ స్కూల్ లో మా రెండో వాడికి సీట్ రావడంతో పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా విశాఖపట్నం మీదుగా వెళ్ళబోతున్నందుకు గొప్ప థ్రిల్‌గా వుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయల్దేరే ముందు కూడా అమ్మానాన్నలిద్దరు వంతపాడినట్లు, "రమణా... ఎట్లాగూ అంత దూరం వెళ్తున్నావు. తిరుగు ప్రయాణంలో నైనా విశాఖపట్నంలో దిగి వరాలత్త ఇంటికి వెళ్ళిరా," అంటూ మరీమరీ చెబుతూ, ఆ ఇంటి గుర్తులు కొన్ని చెప్పారు.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ల క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను.
ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టితల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.
నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కళకళలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఇంటి ముందు నుండి ఎవరు వెళ్లినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్లేవారు. విషాదమేమంటే- అలా ఆస్వాదించిన వాళ్లే రెండేళ్లుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్లిపోతున్నారు.
Continue reading ...
(రచన: చందు తులసి)
"మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గూ రోషం ఉండాల. మాట మీద నిలబడాల. అప్పు తీసుకునేటపుడు తియ్యని ముచ్చట్లు ఎన్ని సెప్పావు. తీరా అప్పు కట్టమంటే మాత్రం పిట్టకథలు శానా సెపుతున్నావు. అంత సేత కాకపోతే ఎవరు నిన్ను అప్పు తీసుకోమన్నాడు? నేనేం నీ ఇంటికి కొచ్చానా? నువ్వే కదా పదిసార్లు నా ఇంటి చుట్టూ తిరిగావు! పోయినేడాది ఏమన్నావు? వచ్చే ఏడాది కడతా సేటూ అన్నావు. మరి కట్టావా? దొంగోని మాదిరి తప్పించుకొని తిరుగుతున్నావు. నిన్ను పట్టుకోవడం చానా కష్టమపోయింది"
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
ఫేస్బుక్ సాహితీ సమూహం 'కథ' గ్రూప్ కోసం వారం వారం ‘కథాయణం’ శీర్షికన కథలు రాయటంలో మెళకువలు వివరించమని ప్రముఖ రచయిత, 'కథ' గ్రూప్ వ్యవస్థాపక నిర్వాహకుడు వేంపల్లె షరీఫ్ అభ్యర్ధనతో ఈ వ్యాస పరంపర రూపుదిద్దుకుంది.
Continue reading ...