రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి

ఆంధ్రప్రభ‘, 26 సెప్టెంబర్ 2003


 

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ల క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను.

ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టితల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.
నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కళకళలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఇంటి ముందు నుండి ఎవరు వెళ్లినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్లేవారు. విషాదమేమంటే- అలా ఆస్వాదించిన వాళ్లే రెండేళ్లుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్లిపోతున్నారు.

ఇప్పుడు నన్నల్లుకున్న మాధవీలత, కిటికీ దగ్గ రున్న రేరాణి, నా మొదలు దగ్గరున్న డిసెంబరం పొద, రెండు మూడు రకాల తెగులుపట్టిన పండ్ల చెట్లు తప్పించి తోటంతా బోసిపోయింది.

గాలికి అటూ, ఇటూ ఊగుతున్న నేను గేటు చప్పుడుకి అటుకేసి చూసేను. లోపల్నుండి వేసిన గడియని అందుకోవాలని మునివేళ్లపై నిల్చుని తీసే ప్రయత్నంలో ఉంది చిట్టితల్లి.

భుజాలపై వేలాడే పది కేజీల పైనే బరువున్న పుస్తకాల సంచీని, చేతలోని కేరేజ్‌ బుట్టనీ దభీమని వరండా అరుగుపైన విసిరేసింది.

ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడే పడున్న షూ జతల్లో తాళం చెవికోసం వెతికింది. దొరికినట్టు లేదు. గబగబ గేటుదాకా వచ్చి అన్నయ్యకోసం కాబోలు అటూ ఇటూ చూసింది. వాడి అలికిడి ఎక్కడా వున్నట్లు లేదు.

చిట్టితల్లి కన్నా శ్రావణ్‌ మూడేళ్లు పెద్ద. అరగంట ముందే వచ్చిన శ్రావణ్‌ స్కూల్‌ బేగ్‌ని ఇంట్లో పడేసి, బేట్‌ పట్టుకొని క్రికెట్‌ ఆటకోసం పరి గెట్టడం చూసేను. ఇంటికి ఎవరు తాళం వేసినా చెవిని తలుపు పక్కనున్న చెప్పుల అరలోని ఏదో ఒక షూలో రహస్యంగా దాచి వెళ్లడం అలవాటు.

చిట్టితల్లి విసురుగా వెనక్కి వచ్చి వరండా మెట్లపైన కూర్చొని, మోకాళ్ల మధ్యకి తలను వాల్చేసి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం మొదలు పెట్టింది.

ఎంత మారిపోయిందీ పిల్ల! స్కూలు నుండి రావడంతోనే మమ్మల్ని పలకరించి, ముద్దాడి కబుర్లు చెప్పిగానీ వరండా మెట్లెక్కేది కాదు. అలాంటిది, మా ఉనికే తెలీనట్లు ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడ్తూ, కిలకిల నవ్వుతూ గెంతులేసే మా చిట్టి తల్లేనా! ఏదో గాలి సోకినట్లు రోజురోజుకీ ఎలా క్షీణించి పోతోందీ!

నే వచ్చేసరికి చిట్టితల్లి మూడేళ్ల పిల్ల. తేనెకళ్లు, గులాబీ బుగ్గలు, బీరపువ్వులా పసుపు ఛాయతో బొద్దుగా ఉండి, గునగున నడిచేది.

ఇప్పుడు చిట్టితల్లికి పదో ఏడు.

ఛాయ తగ్గి, సన్నబడి, ఒంటరితనంతో దిగులు గా ఉంటోంది.

ఆ ఏడుపు నాకు రంపపుకోతలా ఉంది. నా తల్లిని పట్టంచుకునేవాళ్లేరీ? ఏం చేయాలో పాలు పోవడంలేదు.

“అయ్యో, అలా ఏడవకమ్మా. నా బంగారుతల్లివి కదూ, ఇలారా. నే తొడిగిన మొగ్గలు చూడు. రేపు పూస్తాగా, నే పూచేది నీకోసమేరా,” బతిమాలుతూ పిలవాలనిపించింది.

ఎదురింటావిడ వచ్చి పిల్చింది. అన్నయ్య వచ్చే దాకా వాళ్లింట్లోనే ఉండమంది.

“ఆకలేస్తోంది. మమ్మీ, డాడీ రాత్రి ఎప్పుడొస్తారో తెలీదు. అన్నయ్య ‘కీ’ తీసుకెళ్లాడు. బోల్డంత హోంవర్క్‌ చేసుకోవాలి,” ఆమె మాటకి వెక్కిళ్ల మధ్యే ఆగి ఆగి సమాధానం ఇస్తోంది.

మెల్లగా తన కాళ్లకున్న షూ విప్పి, ఆపైన మేజోళ్లు తీసి వాటిలోనే ఉంచి పక్కకు గిరాటేసింది. కళ్లు తుడుచుకుంటూ లేచి నిల్చుంది. మళ్లీ ఒకసారి గేటువైపు నడిచింది. కాస్సేపు అక్కడే ఉండి, వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, ఆ తర్వాత నా దగ్గరగా వచ్చి నిల్చుంది.

“నన్ను మర్చిపోయావు కదూ.”

నా మాట అర్థ మయినట్టు జవాబుగా తన రెండు చేతుల్తో నన్ను చూడ్తూ తన గుండెలకేసి హత్తుకుంది. ఆ స్పర్శకు ఒళ్లంతా పులకరించింది. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఇద్దరం ఆత్మీయంగా గొప్ప అనుభూతితో చాలాసేపు మౌనంగా ఉన్నాం.

“చూడు నా తోటి మొక్కలన్నీ ఎలా ఎండిపోతు న్నాయో! చిగుళ్లు ఎలా వాడిపోతున్నాయో! మా గురించి ఎవరూ పట్టించుకోరు. చివరకు నీవు కూడానూ, నీ చేతుల్తో నీళ్లు పోసి ఎంత కాలమయిందీ, నేనింకా ఎవరి కోసం బతుకుతున్నానో తెలీదూ? చేమంతులూ, విరజాజీ, పారిజాతం. వాటిలాగే చివరకు నేనూ నీకు దూరం అవుతాను. అదిగో మీ కిటికీ దగ్గరున్న రేరాణి ఎలా కొన ఊపిరితో ఉందో! నీవు స్కూల్లో నుండి రాగానే నీకు పండ్లను అందించే జామకు తెగులుపట్టి ఎన్నాళ్లయ్యిందో.”

నా ఆత్మఘోషను నా చిట్టితల్లికి ఎలా చెప్పను?

చిట్టితల్లి వంక పరిశీలనగా చూసేను. కళ్లల్లో తెలియని భయం, ఎండుతున్న పెదాలు, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మొద్దుబారుతున్న శరీరం.

“చర్మం చూడూ, ఎలా పగిలిపోయి ఉందో, వెన్న రాయమని మమ్మీతో చెప్పమ్మా.”

నా మనసు చదివి నట్టు పగిలిన చర్మంకేసి దిగులుగా చూసుకుంది.

తన ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్లేరీ!

మెల్లగా నిల్చుని, మళ్లీ వరండా మెట్లపైన కూర్చో డానికి వెళ్లింది.

చూస్తుండగానే ఆవలిస్తూ, అలాగే వెనక్కి వాలి ఒరిగి కళ్లు మూసుకుని పడుకొంది. ధనుర్మాసపు చలికి వణుకుతున్నట్లు ముడుచుకుపోతోంది చిట్టితల్లి. చెల్లా చెదురైన చెప్పులు, బాగ్‌లోంచి విడిన పుస్తకాలు, కేరేజీ ఎంగిలి గిన్నెలు- మధ్యలో నా చిన్నారి, అయ్యయ్యో! దోమలు స్వైరవిహారం చేస్తూ, రక్తం పీల్చేస్తున్నాయి కదా… దోమల్ని పారదోలమని గాలిని బతిమాలు కున్నాను.

శ్రావణ్‌ త్వరగా వస్తే బావుణ్ణు.

రాత్రి అయినట్లు తెలుస్తోంది. వీధిలోని ట్యూబ్‌ లైట్‌ కాంతి ఇంటి గోడపైన పడుతోంది. ఆడుకొంటోన్న పిల్లల్ని, ‘ఇక ఆటలు చాలించి, చదివి చావండి,’ అంటూ తల్లుల గర్జనలు విన్పిస్తున్నాయి. అడపాదడపా ఏవో వాహనలు వెళ్తున్న శబ్దం.

తూర్పున చంద్రోదయం అయినట్లు నాకు కొద్ది దూరంలో ఉన్న మామిడిచెట్టు ఆకుల్లోంచి వెన్నెల చిట్టితల్లి మొహంపైన ఊగుతోంది.

ఎంత సందడిగా ఉండే ఇల్లు; ఎట్లా మారిపో యింది!

మళ్లీ ఆ రోజులు వస్తాయా?

నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అంతా కొత్తగా, దిగులుగా ఉండేది. కానీ మేము పూచే పూలలాంటి చిట్టితల్లి ఈ ఇంట్లో ఉందని తెలిసి సంతోషం వేసింది. నాతోపాటే గులాబీ, పారిజాతం వచ్చాయి.

మేం వచ్చేసరికి మామిడి, జామ, సపోట, దానిమ్మ ఆరునెలల వయసువి. తొలకరిలో వచ్చాం. తీరా కార్తీకానికి మల్లి, చేమంతి, రేరాణి, నూరు వరహాలు వచ్చాయి.

అరవింద్‌, సుజాత ఇద్దరూ గునపంతో గుంతలు తవ్వడం, మమ్మల్ని నాటడం, శ్రావణ్‌, చిట్టితల్లి బకెట్లతో నీళ్లు తెచ్చి, చిట్టిచిట్టి చేతులతో మాకు పోయడం… ఎంత సుకుమారంగా పెంచారనీ మమ్మల్ని. మా గురించి అందరూ శ్రద్ధ తీసుకునేవాళ్లే. మేం పూచే పువ్వుల్ని ఫోటోలు తీసి, ‘ఎంత అందంగా వచ్చాయో,’ అంటూ ఇంటికి వచ్చిన మిత్రులకు చూపిస్తూ పొంగిపోయే అరవింద్‌ ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు!

అరవింద్‌ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సొసైటీ తరఫు నుండి కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఎల్‌.ఐ.సి లోనుతో ఆ కాలనీలో దాదాపు వెయ్యి ఇండ్లదాకా కట్టారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్లు ఇంటిని రక రకాలుగా తీర్చిదిద్దుకుంటున్నారట.
నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు గమనించాను. వీధులకు అటు ఇటుగా పూచి ఉన్న తురాయిలూ, దిరిసెనలూ కాలనీకి ఎంత అందంగా ఉన్నాయో!

నేను వచ్చేసరికి ప్రహరీగోడ పూర్తి కావస్తోంది. మేం రాకముందే పది ట్రాక్టర్ల ఎర్రమట్టిని, రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుని పోయించి చదును చేయించాట్ట. అరవింద్‌కి మొక్కలంటే ప్రాణం.

తను మొదటి షిఫ్టులో ఉంటే సాయంత్రం రాగానే బట్టలు మార్చేసుకుని తుండుగుడ్డని తల పాగాలా చుట్టి అచ్చంగా రైతులా పార, గునపం, కత్తెర్లతో పెరట్లోకి వచ్చేవాడు. మాకు కుదుర్లు కడుతూ, గొప్పులు తవ్వుతూ, అడ్డుగా పెరిగే మమ్మల్ని అందంగా కట్‌ చేస్తుండగా లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చేది సుజాత. తనూ పనిలో పాలు పంచుకోబోయేది.
“గార్డెన్‌ వర్కంతా నాదే, కిచెన్‌ వరకే నీ పరిధి,” అంటూ సుజాతని పని చేయనిచ్చేవాడు కాదు. కాస్సేపు ఇద్దరూ సరదాగా ఒకర్నొకరు గిల్లికజ్జాలు పెట్టుకునే వారు. పెరట్లో వాళ్లిద్దరూ అలా చిలకాగోరింకల్లా తిరుగుతూంటే తోటంతా కళకళలాడేది. అంతలో స్కూల్‌ నుండి శ్రావణ్‌, చిట్టితల్లి వచ్చేసి మాకు నీళ్లు పోయడానికి తయారయ్యేవాళ్లు.
ఒక్కోసారి పైపుని కొళాయికి తగిలించి, మాకు స్నానం చేయించేది చిట్టితల్లి. మేం ఆ నీటి వేగానికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, ఉక్కిరిబిక్కిరై అటూ, ఇటూ ఊగుతుంటే కిలకిలమంటూ పడీపడీ నవ్వేది.

నేను వచ్చిన ఏడాదికే పెరడంతా పచ్చగా మెరిసి పోయింది. రాత్రనక, పగలనక మేం పూచే పూలవంక మురి పెంగా చూస్తూ, పండుటాకుల్ని ఏరిపారేస్తూ కబుర్లు చెప్పేది చిట్టితల్లి. ‘పురుగూ, పుట్రా ఉంటాయి. పెరట్లోకి వెళ్లొద్ద’ని మందలించే సుజాత మాటల్ని అంతగా పట్టించుకునేది కాదు.

సాయంకాలం నీరెండలో అరవింద్‌ చిట్టితల్లితో కలిసి ఆడుకుంటున్నప్పుడు, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే కొంగల్ని చూపిస్తూ, అవి ఎక్కడికి వెళ్తున్నాయనీ, చీకటి రాత్రుళ్లలో తళతళ మెరిసే నక్షత్రాల్ని చూపిస్తూ అవి ఎందుకలా మెరుస్తున్నాయని లక్ష ప్రశ్నలు వేసేది.

ధృవుడు, గొరుకొయ్యలు, పిల్లలకోడి, మంచం కోళ్లు. ఒక్కో నక్షత్రం చూపించి, వాటి గురించి చెబుతూ ఉండేవాడు. సప్తరుషి మండలంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపించి ఆమె కథ గురించి చెప్పాడు.

“అది మా స్కూల్‌ మేడమ్ పేరుకదా. ఆ స్టారుకు అరుంధతి అని పేరు ఎవరు పెట్టారు?” అంటూ ప్రశ్నించేది.
స్కూల్‌కి వెళ్లే ముందు వాళ్ల క్లాస్‌ టీచర్ల కోసం ఎక్కువగా గులాబీలు కోసుకెళ్లేది. నేనప్పటికి ఇంకా మొగ్గలు తొడగలేదు.
ఒకరోజు స్కూల్‌ నుండి రాగానే, డ్రస్‌ తీసి, గౌను వేసుకొని, టవల్‌ని చుట్టుకొని కుడివైపు పైటేసుకుంది. లోపల్నుండి కుర్చీ ఒకటి తెచ్చి మా మధ్యలో వేసింది. గేటు బయటికి వెళ్లి రోడ్డు పక్కనున్న కానుగ కొమ్మ విరిచి బెత్తంలా తయారుచేసింది.

నిశ్శబ్దంగా చిట్టితల్లి చేష్టలని గమనిస్తున్నాం. గాలి కుదుపులకు మేమంతా ఒక్కసారిగా అటూ, ఇటూ ఊగేసరికి, “సైలెన్స్‌, సైలెన్స్‌,” అంటూ చేతిలోని బెత్తాన్ని ఊపింది. అచ్చంగా వాళ్ల టీచర్‌ మల్లే, తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో. “నేలకు జానెడుంది. పొట్టి బుడెంకాయ టీచరమ్మ మాకొద్దు.” చిట్టితల్లి బెత్తం దెబ్బకు తమ రెమ్మలు గాల్లోకి ఎగిరాయన్న కోపంతో చిందులు తొక్కాయి దవనం, మరువం.

“ష్‌… తప్పర్రా. ఇదంతా ఉత్తుత్తినేరా,” ఇద్దర్నీ బుజ్జగించాను.

“ఆఁ, ఎవరెవరు హోంవర్క్‌ చేయలేదో చేతులెత్తండి.”

“హోంవర్క్‌ అంటే,” నావైపు వంగి అడగబో యింది మందారం.

“ష్‌… సైలెన్స్‌.”

“ఇదిగో పారిజాతం, నిన్న ఇచ్చిన లెక్కల హోం వర్క్‌ చేశావా?”

“చేమంతీ, నీ సైన్స్‌ హోంవర్క్‌ ఏదీ?”

“మందారం, నీకసలు బుద్ధిలేదు. ఆ బొండు మల్లితో మాటలేమిటీ?”

“డిసెంబరం, నిన్నటి ఇంగ్లీషు గ్రామర్‌ కంప్లీట్‌ చేసావా?” తన చేతిలోని బెత్తంతో సన్నగా చరిచేది.కాస్త నెప్పిగానే ఉన్నా చిట్టితల్లి ఆరిందాతనానికి ముచ్చటేసేది. అది మొదలు రోజూ స్కూల్‌ నుండి రాగానే మాకందరికీ పాఠాల్తోపాటే రయివ్స్‌ు పాడిం చడం, డాన్స్‌లు చేయించడం. ప్రతిరోజూ చిట్టితల్లితో ఆటల్లో పండగే.

పెరట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న బంతులు, లిల్లీలు మా ఆటలు గమనిస్తూ గాలికి లయగా తమ సన్నని నడుములు వయ్యారంగా ఊపుతూ ఆనందంగా డాన్స్‌లు చేసేవి.

శ్రావణ్‌ ఒక్కోసారి గేటు బార్లా తీసి వెళ్లేవాడు. వీధిలోని పిల్లలంతా బిలబిలమంటూ వచ్చేసేవారు. గడుగ్గాయిలు. తిన్నగా ఉంటారా! మమ్మల్ని నలిపి, గిల్లి చిగుళ్లు త్రుంచి నానా రభస. ఇంతలో సుజాత వచ్చి అరిస్తే మమ్మల్ని వదిలి పరిగెత్తేవాళ్లు.

నా గుబుర్లలో ఓ బంగారు పిచిక నారతో గూడు అల్లటం నేను మరవలేదు. ఆవగింజంత మెదడైనా వుందో లేదోగానీ, దాని తెలివేం తెలివనీ! రెండు ఆకుల్ని కలుపుతూ తెల్లని జిగురు పామింది. ఆ ఆకుల మధ్య నుండే నారను తాడులా పేనుతూ, చిన్న వెలక్కాయంత సైజులో గూడు అల్లి రెండు గుడ్లు పెట్టింది. అవి పిల్లలు అయ్యాక చూడాలి నా అవస్థ. ‘కిచకిచకిచకిచ’ క్షణం నిద్రపోనిచ్చేవి కాదుకదా! అప్పుడు నా ఎత్తు మూడు అడుగులే. చిట్టితల్లికి నేను బాగా అందేదాన్ని.

చిట్టితల్లి తడవతడవకీ రావడం, నా గుబుర్లు విడదీసి, పిచిక పిల్లల్ని మురిపంగా చూస్తూ ముద్దా డటం… తొండలు, పిల్లులూ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త గా వాటిని కాపాడేదాన్నో. గూడు మూడో కంటికి తెలీ కుండా కొమ్మల్తో కప్పేసేదాన్ని.
రాత్రుళ్లు మాపైన రాలిన మంచు బిందువుల్ని ముక్కుల్తో పొడిచి నీరు తాగేవి. అప్పుడు మాత్రం భలే కితకితలుగా ఉండేది.

మా పూలలోని మకరందం తాగి తాగి మత్తెక్కిన సీతాకోకచిలుకలు, తుమ్మెదలు కదల్లేక కదల్లేక గాల్లో పల్టీలు కొడ్తూ ఎగిరేవి. మా పూలపుప్పొడి రజన తాప డంతో వాటి శరీరాలు ధగధగ మెరుస్తూ కాంతులీనేవి.

ఒకరోజు హఠాత్తుగా పిల్లల్ని తీసుకొని బంగారు పిచుక ఎగిరిపోయింది. చిట్టితల్లి పిచికలు కావాలని పేచీ పెట్టింది.
“వాటికి రెక్కలొచ్చాయి కదా. ఎన్నాళ్లని తల్లి తెచ్చి పెడుతుంది. తిండి ఎలా సంపాదించాలో నేర్పించ డానికి పిల్లల్ని తీసుకెళ్లింది. మళ్లీ వచ్చేస్తాయిగా,” అంటూ అరవింద్‌ ఊరడించాడు. కానీ ఎన్నాళ్లయినా పిచికలు రానేలేదు.
తెలతెలవారుతుండగా జాంపళ్లు కోసం వచ్చే చిలుకల్ని చూయించాడు చిట్టితల్లికి. వాటిని చూస్తూ నెమ్మదిగా బంగారు పిచికల్ని మరిచింది. తూనీగల గాజురెక్కల రెపరెపల్ని చూస్తూ మురిసిపోయేది చిట్టి తల్లి.

మేం ఎందరం ఉన్నా మేడ మీదకి పాకించిన రాధామనోహరాలంటే చాలా ఇష్టం తనకి. పొడవైన కాడల్తో, ఎరుపు, తెలుపు రంగుల్లో గుత్తులుగా పూసే ఆ పూలని అందుకోవాలని ప్రయత్నించేది. గాలికి రాలిన వాటి కాడల్తో జడలల్లేది.
ఉడుతలు మా పొదల్లో దాగుడుమూతలాడుతూ చిట్టితల్లి రాగానే మామిడిచెట్టు ఎక్కేసేవి.

ఇంటికి నైరుతివైపు చాలా అరటి చెట్లుండేవి. అవి గెలలు తొడిగినప్పుడు, అరటిపూలలోని తేనె కోసం గబ్బిలాలు గుంపుగా వచ్చేవి. వాటిని చూస్తూనే చిట్టితల్లి హడలిపోయి, ఇంట్లోకి పారిపోయి దాక్కునేది.

“అరటిపూలల్లో అమృతం దాచుకున్నట్లు మాయ దారి గబ్బిలాలు, దిక్కుమాలిన గబ్బిలాలు, చిట్టితల్లిని జడిపిస్తున్నాయి కదా.” కాయలు పెరిగి, పూత రాలే కొద్దీ… రావడం తగ్గించేశాయి.

చిట్టితల్లిని నేనెంత ప్రేమించేదాన్నో – అంతకన్నా ఎక్కువగా ప్రాణం వదిలేది మేమంటే. ఆరోజు సుజాత, అరవింద్‌ పిల్లల్తో కలిసి తోటలో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈసారి సుజాత వంతు వచ్చింది. కళ్లకు గంతలు కట్టారు. సుజాత దొంగ అన గానే అరవింద్‌ కేరింతలు కొట్టాడు, సరదాగా గిల్లి ఏడి పించవచ్చని. వాళ్లిద్దరి సరాగాలు చూస్తే మాకెంతో ముచ్చటేసింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమని! అరవింద్‌, పిల్లలిద్దరూ దొరక్కుండా చప్పట్లు చరుస్తూ పరుగులు తీస్తున్నారు. అంతలో పక్కనే ఉన్న డిసెం బరం పై కాలు వేసింది సుజాత. అది గమనించిన చిట్టితల్లి, “మమ్మీ, నా డిసెంబరాన్ని తొక్కేశావు. చూడు ఎలా విరిగిపోయిందో,” గట్టిగా అరుస్తూ పైకి లేపింది.

“సారీ డిసెంబరం,” కళ్లకు గంతలు విప్పుతూ అంది సుజాత.

తల్లి వైపు కోపంగా చూస్తూ – శ్రావణ్‌తో గుడ్డ తెప్పించి, తడిపి, విరిగిన కొమ్మ వద్ద కట్టు కట్టింది. చిట్టి తల్లి ప్రేమకు మేమంతా కరిగిపోయాం.

ఇంట్లోని విషయాలు, అరవింద్‌, సుజాతల మధ్య జరిగే సంభాషణలు ఎక్కువగా రేరాణి ద్వారా తెలిసిపోయేవి.  రేరాణి  వాళ్ల  పడగ్గదిని  ఆనుకునే ఉండేది కదా. చెవులు రిక్కరించి మరీ విని, గాలితో కబుర్లు పంపేది.

చిట్టితల్లి రోజూ వాళ్ల మమ్మీడాడీల పైన చేతులు వేసి, అరవింద్‌తో కథలు చెప్పించుకొనిగానీ పడుకోదట. ఏరోజు ఏ కథ చెప్తాడో రేరాణి మళ్లీ ఆ కథ నాకు విన్పించేది.

నా చిట్టితల్లి పుట్టినరోజు వచ్చిందంటే ఎంత సందడనీ, ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలకు దిగివచ్చి నట్లు మమ్మల్ని చిన్నచిన్న లైటు బల్బులతో అలంక రించి అరవింద్‌ ఎంత హడావుడి చేసేవాడో! మా మధ్య రౌండు టేబుల్‌ వేసి, అందమైన ముఖమల్‌ గుడ్డ కప్పి, ఆపైన పెద్ద కేక్‌ కట్‌ చేయించేవాడు.

వీధిలోని పిల్లలు, కంపెనీలో కొలీగ్స్‌ అంతా వచ్చే వారు. వాళ్లు తెచ్చిన బహుమతుల్ని ఎంతో మురిపెంగా మాకు చూపించేది చిట్టితల్లి.

చూస్తుండగానే నేను ఇంట్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. నేను చిట్టితల్లికి అందనంతగా ఎదుగు తున్నాను. మాధవీలతను నా కొమ్మలకు పాకించారు.

మామిడి, దానిమ్మలు అప్పుడప్పుడే పిందెలు వేస్తున్నాయి.

ఈమధ్య అరవింద్‌ డ్యూటీ అవగానే ఇంటికి రావడంలేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఏ పన్నెండుకో వస్తున్నాడు.
మనిషి చాలా అసహనంతో ఉన్నట్లు అనిపిం చింది. పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత అరవింద్‌, సుజాత మాకు దగ్గర్లోనే కుర్చీలు వేసుకొని చాలా రాత్రి వరకు మాట్లాడుకునేవాళ్లు. అవన్నీ కంపెనీకి, ఉద్యోగా నికి సంబంధించిన విషయాలు.

పసుపు కనకాంబరం హఠాత్తుగా ఎండిపోయి చనిపోయిందో రోజు. ఏం జరిగిందో తెలీలేదు. మా రెమ్మలు విరిగితేనే తల్లడిల్లే అరవింద్‌ కనకాంబరం గురించి పట్టించుకోలేదు. చిట్టితల్లి మాత్రం ఏడ్చింది.

ఆవేళ రాత్రి ఎనిమిది గంటలప్పుడు అర విందుతో పాటే కంపెనీలో పనిచేసే కొందరు మిత్రులు వచ్చారు. వాళ్లంతా మామిడిచెట్టు కిందున్న పచ్చికలో కూర్చున్నారు. వరండాలోని ట్యూబ్‌లైట్‌ కింద చిట్టితల్లి హోంవర్క్‌ చేసుకుంటోంది. లోపల్నుండి అందరికీ ఏ నిమ్మకాయరసమో తెచ్చినట్టుంది సుజాత.

“అరవింద్‌ రేపు నీవు డైరెక్ట్‌గా మన యూనియన్‌ లీడర్‌ని తీసుకొని సెక్రటేరియట్‌ దగ్గరికి వచ్చేయ్‌. మేం కంపెనీ దగ్గర్నుండే ర్యాలీ తీస్తాం. చూద్దాం. అన్ని యూనియన్‌వాళ్లూ ఒక్కటయితేనేగానీ లాభంలేదు. ఆమధ్య ప్రైవేట్‌కి అప్పగిద్దాం అనుకున్నారా, కానీ నిన్న జరిగిన యూనియన్‌, మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లో ఏకంగా లాకౌట్‌ చేసే ఉద్దేశ్యం ఉందట గవర్న మెంట్‌కి…” వాళ్ల మాటల్లో చిట్టితల్లి వచ్చింది.

మధ్యలోకి ఎందుకొచ్చావని చిరాకుతో కసిరేడు అరవింద్‌. చిన్నబుచ్చుకున్న చిట్టితల్లి నా వద్దకు వచ్చి నిల్చుంది.
రాత్రి ఏ ఒంటిగంట వరకో వాళ్ల చర్చలు సాగి నట్లున్నాయి. ఆకాశంలో గొరుకొయ్యలు నడినెత్తికి వస్తుండగా నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత చాలారోజులు ర్యాలీలనీ, ధర్నాలనీ తిరిగేడు అరవింద్‌. వాటిల్లో తిరుగుతున్నప్పుడు పోలీసుల లాఠీఛార్జ్‌లో దెబ్బలు తగిలి, రెండ్రోజులు హాస్పిటల్‌లో ఉండి వచ్చాడు.

సుజాత కూడా ఏదో లోకంలో ఉన్నట్లుంటోంది. శ్రావణ్‌ ఎక్కువగా క్రికెట్‌ పిచ్చితో బయటే  ఉండేవాడు. పాపం! చిట్టితల్లి ఒక్కర్తీ దిగులుగా బిక్కచచ్చినట్లు మా మధ్య తిరిగేది.

క్రమేపి ఇంట్లోని వాతావరణంలో ఏదో మార్పు చోటు చేసుకుంది. మరికొంతకాలం ఇలాగే మంద కొడిలా సాగింది.
ఏమయ్యిందో తెలీదు. ఈమధ్య చాలా రోజు ల్నుండి అరవింద్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్త మానం ఇంట్లోనే ఉంటాడా, మాకు గొప్పులు తవ్వడం, ఎరువులు వేయడం… కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు.
ఈమధ్య సుజాత ఏదో కాస్మోటిక్స్‌ ఏజన్సీ తీసు కొని మెంబరయ్యింది. సుజాతకు చేదోడుగా ఉంటుం దని అప్పుడప్పుడు పిల్లలకు వంటచేసి, హోంవర్కులు చేయించేవాడు అరవింద్‌. అదీ కొంతకాలమే. ఇంటి పనులు తన వల్ల కావట్లేదని చేతులెత్తేసేవాడు.

మరో ఆర్నెల్లలో అరవింద్‌కు ప్రైవేట్‌లో  చిన్న ఉద్యోగం దొరికింది. ఇక అప్పట్నుండీ మొదల య్యాయి చిట్టితల్లికి కష్టాలు.

సాయంకాలం స్కూలు నుండి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండేది. మొదట్లో ఎదురింట్లో వాళ్లకి తాళంచెవి ఇచ్చేవారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఒక్కతే ఉండేది. శ్రావణ్‌కు ఎప్పుడూ ఆటపిచ్చే.

పెరట్లో నేల బీడుపడిపోతోంది. మా మొదళ్లు నేలలో బిగుసుకుపోయాయి. గాలి అందదు, నీళ్లు పోసే దిక్కులేదు.
చిట్టితల్లి కూడా ఏదో పోగొట్టుకున్నదానిలా మా అవసరాల్ని మరిచిపోసాగింది. చూస్తూ చూస్తూ ఉండ గానే మందారం, చేమంతులు, విరజాజీ, పారిజాతం… ఒక్కొక్కటీ ఆకులన్నీ రాల్చేస్తూ, ఎండిపోయి చచ్చి పోయాయి.

నా తోటి నేస్తాలన్నీ ఒక్కొక్కటీ నన్నొదిలేసి వెళ్లిపో తున్నాయి.

అయ్యో! ఇవన్నీ చూసేందుకే ఇంకా ఉన్నానా? నేనూ వెళ్లిపోతే నా చిట్టితల్లిని ఊరడించే వాళ్లవరూ!
ఏదోవిధంగా తేమని పీల్చుకుంటూ జీవిస్తు న్నాను.

అప్పుడప్పుడు సుజాత రాత్రి పది దాటేక వచ్చేది. వాళ్ల ఆఫీసు మేనేజరు ఒక్కోసారి కారులో డ్రాప్‌ చేసి వెళ్లేవాడు.
అరవింద్‌ మొదట్లో కొంత భరించినా, రాను రానూ సుజాతని క్షమించలేకపోయేవాడు.

ఇద్దరి మధ్యా రభస మొదలయ్యేది. సుజాతని సాయంత్రం ఆరులోపుగా ఆఫీసు వదిలి రమ్మనేవాడు.

“నేను చేసేది ఏజన్సీ కంపెనీ. చాలామంది ఏజెంట్లని కుదర్చాలి. ఎక్కడెక్కడికో తిరగాల్సి వుంటుంది. రాత్రి చాలా పొద్దుపోతే మా బాస్‌ మనింటి దాకా డ్రాప్‌ చేయడం తప్పా… నీ ఇన్ఫీరియారిటీ వల్ల నీకంతా తప్పుగా తోస్తుంది,”
సుజాత చాలా ఎత్తిపొడుపుగా జవాబు ఇచ్చేది. ఆ మాటలకి అరవింద్‌లో అహం దెబ్బతినేది. కోపంతో ఊగిపోయేవాడు. చేతికందిన వస్తువు బద్దలయిపోవడం ఆ సమయంలో అతి మామూలయి పోయింది.

అరవింద్‌కు ఇప్పుడు తెలుస్తోంది ఇంటిపనుల్లోని నరకం.

పాపం సుజాత! ఎంత కష్టపడేది! తెల్లవారింది మొదలు, మేం రాత్రంతా రాల్చిన పండుటాకుల్ని ఊడ్చి ఎత్తడం, గదులన్నీ చిమ్మటం, కల్లాపి, ముగ్గులు, ఉదయం టిఫిన్లు, ముగ్గురికీ కేరేజీలు కట్టడం, గిన్నెలు తోమటం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు, స్కూల్లో దిగబెట్టడాలు. మళ్లీ సాయంకాలం టిఫిన్లు, హోం వర్కు చేయించడం, రాత్రి వంట, పడుకునేవరకు వంచిన నడుం ఎత్తకుండా ఎంత పనిచేసేది!

సుజాత ఎంత పనిచేసినా అలిసినట్లు అనిపిం చేది కాదు. ఇంటి పనంటే తనకెంతో ఇష్టంలా చేసేది.
తనిప్పుడు తీసుకున్న ఏజెన్సీకి సంబంధించి కాస్మోటిక్స్‌ని అమ్మటం, వాటి తాలూకు పాలసీల కోసం తిరిగి తిరిగి వాడిన తోటకూర కాడల్లే రావడం… మళ్లీ బండెడు చాకిరీ గుర్తుకు రాగానే సన్నని వణుకు ప్రారంభమయ్యేది ఆమెలో.
ఇద్దరి మధ్యా అప్పుడు మొదలయ్యేది సన్నని సెగ. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిన తీరల్లే. పిల్లల ముందే మాటా మాటా అనుకుంటూ తమ వివేకాన్ని పూర్తిగా కోల్పోయేవారు.

అరవింద్‌ అమ్మ, నాన్నలు వచ్చారొకసారి. ఇద్దరూ ముసలివాళ్లు. కాస్త జబ్బుల్తో ఉన్నట్టనిపిం చింది. చిట్టితల్లికి కాస్త ఊరటగా ఉంటుందను కున్నాను. తాత, నాన్నమ్మలతో బాగానే కలిసిపోయి కబుర్లు చెబుతోంది.

వాళ్ల నాన్నమ్మని తోటంతా తిప్పుతూ మమ్మల్ని పేరుపేరునా పరిచయం చేసింది.

“నాన్నమ్మా ఈ నీలిగోరింట పువ్వుల్లాంటి జూకాలు చేయిస్తావా?”

“అలాగే తల్లీ.”

“నాన్నమ్మా. మా క్లాస్‌లో అర్చిత తన బర్త్‌డేకి మొగలిపూల జడ వేసుకొచ్చింది. మనం కూడా మొగలి చెట్లు వేసుకుందామా.”

“మొగలిచెట్లు ఇంట్లో పెంచుకోరాదమ్మా, పాములొస్తాయి.”

“అమ్మో! నాకు పాములంటే భయంగా.”

“నాన్నమ్మా! చంద్రకాంతల్ని అల్లి నా సిగచుట్టూ ముడివేస్తావా. మా జానకి టీచర్‌ అలాగే పెట్టుకొని వస్తుంది.”

“చంద్రకాంతలేం ఖర్మ తల్లీ, మన తోటంతా కన కాంబరాలు, డిసెంబరాలు ఉంటేనూ, ఎంచక్కా వాటిని అల్లిపెడ్తానేం.”

చిట్టితల్లి కోసం మామిడిచెట్టుకు కొబ్బరితాళ్లతో ఊయల కట్టేడు తాతయ్య. తాళ్లు గుచ్చుకోకుండా పాత దుప్పటి మడతపెట్టి వేసింది నాన్నమ్మ.

చిట్టితల్లిని ఊయలలో ఊపడం, తనకొచ్చిన పాటలు పాడి కథలు చెప్పడం నాన్నమ్మ పని.

చిట్టితల్లికి మంచి స్నేహితులే దొరికారు కాల క్షేపానికి. మళ్లీ కొద్దికొద్దిగా చిట్టితల్లి ముఖంలో కళ రావడం చూస్తుంటే తృప్తిగా ఉంది.

అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి వాళ్లను హాస్పిటల్‌కి తీసుకెళ్లేవాడు అరవింద్‌.

ఆరోజు బెడ్‌రూవ్‌ులో తెల్లవార్లూ లైట్‌ వెలుగు తూనే ఉంది. అరవింద్‌ సుజాతల మధ్య ఏదో వాగ్వి వాదం నడుస్తోందని అనిపించింది. రేరాణితో విషయం తెలుసుకొని బాధపడ్డాను.

“మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నారల్లే ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో మీకు తెలీదా! మరో గది కట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. మీకు వి.ఆర్‌.ఎస్‌. కింద వచ్చిన లక్షా ఈ ఆరు నెలల్లో ఎలా మాయం అయ్యాయో తెలీదు. ఇప్పుడు మీరు డ్యూటీకి లీవులు పెట్టి వీళ్లను హాస్పిటల్‌ చుట్టూ తిప్పితే జీతం ఎంత తగ్గుతుందో ఆలోచించారా?”

“నేను సరదాగా తీసుకెళుతున్నానా, నిన్ను తీసు కెళ్లమని చెప్పలేదే.”

“ఎంతకూ మీ ధోరణి మీదేనా. హాస్పిటల్‌ ఫీజులు, మందుల ఖర్చు ఎంతవుతుందో తెలీదా?”

“వాళ్లకు వచ్చే పెన్షనులోంచే ఖర్చు పెడుతు న్నాను. నీవు సంపాదించేది అడిగితే అప్పుడు అడుగు.”

“వాళ్ల పెన్షను ఎంతనీ, రెండురోజులు హాస్పిటల్‌ ఫీజు, మందులకే సరి. రోజురోజుకూ ధరలు ఎలా మండిపోతున్నాయని! ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్న మాటేగాని, రాబడి ఎంత తక్కువగా వస్తుందో తెలి యదా? ఇద్దరు మనుషుల భోజనం కనీసం రెండు వేలయినా నెలకు అదనపు ఖర్చు. మనకు జరుగు బాటుగా ఉంటే ఇలా అంటానా. పైగా ఇద్దరూ అనారో గ్యంతో ఉన్నారు. వీళ్లను కనిపెట్టుకుని ఇంట్లో ఎవరుం టారు? నిన్ను ఒక్కడ్నే కన్నారా? మీ అన్నయ్య ఉన్నారు కదా… అక్కడికి వెళ్లమనండి.”

“నీకసలు మతుండే మాట్లాడుతున్నావా?”

తెల్లవార్లూ ఇద్దరి మధ్యా చాలా రభస జరిగిందని చెప్పింది.

“నాన్నమ్మ, తాత అచ్చంగా ఇక్కడే ఉండిపోతా రంట తెలుసా,” ఎంతో సంతోషంతో చిట్టితల్లి వాళ్ల స్నేహితులతో చెప్పడం విన్నాను. కానీ, ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవకుండానే ఆ ముసలి దంపతులిద్దరూ కళ్లు తుడుచుకుంటూ, తమ సామానుతో వెళ్లిపోవడం చూసిన నేను బాధతో తల్ల డిల్లాను.

వాళ్లు వెళ్లిన రోజు అరవింద్‌, సుజాతల మధ్య చిన్న యుద్ధమే జరిగింది. వాళ్ల వాదులాటల్లో పిల్ల లిద్దరూ చెరో మూలకీ నక్కి బెదిరిపోయి చూస్తారట.

ఇప్పుడు చిట్టితల్లి మళ్లీ ఒంటరిదయిపోయింది.

కథలూ, కబుర్లూ చెప్పేవారు ఎవరూ లేరు.

మంచానికి ఆ చివర్నొకరు, ఈ చివర్నొకరు పడు కోవడంతో వారిద్దరి మధ్యలో పడుకునే చిట్టితల్లికి చేతులు వేద్దామనుకుంటే ఎవరూ అందటంలేదు. పల కరిస్తే కసురుతున్నారు. ఒక్కోసారి చేయి చేసుకుంటు న్నారు. ఆ దృశ్యం చూళ్లేకపోతున్నానని దుఃఖిస్తూ గాలితో చెప్పి పంపింది రేరాణి.

ఓసారి మార్కులు తక్కువగా వచ్చాయని చిట్టి తల్లిని, శ్రావణ్‌ని గొడ్డును బాదినట్లు బాదింది సుజాత. ఆవేళ ఎంత కన్నీరు మున్నీరయ్యానో.

పిల్లలు రోజూ సాయంత్రం స్కూల్‌ నుండి రాగానే వారికిష్టమైన టిఫిన్‌ చేసిపెట్టి తరువాత వరండా లో కూర్చోబెట్టి చదువు గురించి శ్రద్ధతో కనీసం గంటకు పైగా సమయాన్ని కేటాయించేది సుజాత.

మరిప్పుడు – అసలు వారి చదువుల్లో తలదూర్చక ఎన్నాళ్లయిందీ? అరవిందు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ పట్టించుకోవడం చూడనేలేదు!

చిట్టితల్లిని ఊరడిద్దాం అని ఎంతగా ప్రాణం కొట్టుమిట్టాడిందో. కానీ చిట్టితల్లి సుజాత భయానికి ఇంట్లోంచి కదల్లేదు, పుస్తకాన్ని వదల్లేదు.

అప్పుడప్పుడు సుజాత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అరవింద్‌ పడుకున్న తర్వాత ఒక్కర్తీ మేల్కొని నిద్రపోతున్న పిల్లల్ని స్పృశిస్తూ మౌనంగా కన్నీరు పెట్టేది. ఆమెలో ఏదో చెప్పుకోలేని అలజడి కనిపించేది.
పిల్లల్ని కొట్టినరోజు రాత్రి ఆరుబయటకు వచ్చి మామధ్య కూర్చుని వినీవినబడనట్లుగా దుఃఖిస్తూ తన తలరాతని తిట్టుకుంటూ తనలో తాను గొణుక్కోవడం చూసి, అంతకుముందే ఆమెపై కోపంతో ఉన్న నాకు ఆ క్షణంలో చాలా జాలి కలిగింది.

స్కూల్‌ నుండి వచ్చిన పిల్లలకు సేమియా పాయసం మొదలుకొని, మెత్తని పకోడీల వరకు వాళ్ల కిష్టమైన పిండివంటలు చేసిపెట్టేది. తోటలోని పండ్లే కాక, బయట నుంచి తెచ్చినవీ తినిపిస్తూ, పోషక విలువ లతో పిల్లల్ని పెంచాలని పరితపించే సుజాత తనిప్పుడు పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నానని బాధపడేది చాలా సార్లు.

తన జీతంలోంచి చిట్స్‌ వేస్తానంటోంది సుజాత. “ఇద్దరి జీతం ఇంటి ఖర్చులకే సరిపోతే మరి భవిష్యత్‌ లో పిల్లలకు కూడబెట్టేదెప్పుడూ కాలేజీ చదువులప్పుడు డొనేషన్స్‌ కట్టేదెలా?”

“వాటర్‌, కరెంట్‌, టెలిఫోన్‌ బిల్‌, స్కూల్‌ ఫీజ్‌… వీటితో నాకు సంబంధం లేదు. అవన్నీ నీ జీతం లోంచే,” అరవింద్‌.

“ఇంటికి ఎల్‌.ఐ.సి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది ముందుగా అది కట్టాకే, మిగతా ఖర్చులు,” సుజాత.

ఒకటి, ఒకటీ. మాటా మాటా. పంతాలు, వాదనలు, తర్కాలు, అలకలు, అరుపులు. ఇద్దరి మధ్య అన్యోన్యత అంతరించి అనురాగం సన్నగిల్లి, అవగాహనారాహిత్యం బలపడుతోంది. “ఇదేమి సంసారం? ఇంకా ఎంత కాలమో? మధ్యలో బిక్కచచ్చే చిట్టితల్లి బాధ చూడ లేకున్నాను. ఎడమొహం పెడమొహాలతో ఉంటే నా సౌరభాన్ని ఆస్వాదించేదెవరూ? నాకు తేమ అందటం లేదు. జీవపదార్థం నాలోనూ ఎండిపోతోంది,” రేరాణి ఏడుస్తూ మొరబెట్టుకుంది.

మామిడి, జామ మిగతావి అందనంత ఎత్తుకు వెళ్లాయి.జామకు పట్టిన తెల్లదోమ గాల్లో చెల్లాచెదురై చిరాకు తెప్పిస్తోంది.

వాళ్లిద్దరి మధ్య మాటలు ఆగిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. కొన్ని విషయాల్లో పిల్లలే మధ్యవర్తులు. మొదట్లో  పిల్లలకు  కొత్తగా ఉండేది. “మీ ఇద్దరికీ మాటలు వచ్చుకదా, మధ్యలో మేమెందుకు,” ఒకసారి శ్రావణ్‌ అనుమానం ప్రకటిం చాడు. తర్వాత్తర్వాత పిల్లలకే వాళ్ల మధ్య దూరం కొలవడం అలవాటైపోయింది. చూస్తుండగానే టెలిఫోన్‌ కనెక్షన్‌ కట్‌ అయిపో యింది. ఫ్రిజ్‌ ఉన్నా వాడకంలో లేదు. కార్టూన్‌ సినిమాలు చూస్తూ సరదాపడే పిల్లలు కేబుల్‌ కనెక్షన్‌ తీయించేస్తున్నప్పుడు ఎంత విలవిల్లాడారనీ!

ఎంతో ఆదర్శంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటనీ, కులాంతరమనీ ఇంటికి వచ్చిన మిత్రులు అప్పుడప్పుడు పొగడ్డం విన్పించేది నాకు. ఈ ప్రేమలకు, ఆదర్శాలకు లొంగని అతీతమైన శక్తి ఏదో పట్టి పీడిస్తోందని నా అనుమానం.

ఇప్పుడు ఇంటికి ఎవరూ రావడంలేదు. అరవింద్‌ అమ్మానాన్నలు ఇప్పుడెక్కడున్నారో, ఎలా ఉన్నారో?

మళ్లీ ఈమధ్య ఏవో అసహనాలు రేగుతున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టనంతగా దూరం అవుతున్నారనిపించింది. వాళ్ల మాటల్లో విడిపోవడాలు, విడాకులు, ఒకర్ని మరొకరు దగా చేసారని దెప్పుకోవడాలు! రేరాణి పంపే పిడుగులాంటి వార్తలు నాలో ఫిరంగులు పేలుస్తున్నాయి. దేశాల మధ్యే కాదు యుద్ధాలు సంసారాలలోను జరుగుతాయనిపించింది. ప్రాణాలు కోల్పోయేదెప్పుడూ అమాయకజీవులే. ఈ ఇంట్లో జరిగిన యుద్ధంలో అన్నీ అలా అంతరించిపోగా దిక్కుతోచని స్థితిలో క్షతగాత్రు లమై మిగిలి ఉన్నాము. మాతోపాటు శ్రావణ్‌, చిట్టి తల్లీనూ.

ఈ క్రమం ఇలా సాగాల్సిందేనా! తడారిపోతున్న జీవపదార్థంతో కన్నీరు కూడా రాల్చలేని పరిస్థితి నాది.

గేటు చప్పుడవుతోంది. శ్రావణ్‌ వచ్చినట్టున్నాడు. వరండాలో పడుకున్న చిట్టితల్లిని బేట్‌తో పొడుస్తూ నిద్రలేపాడు. నిద్రమత్తులో ఊగుతూ లోపలికి వెళ్లింది.

రాత్రి ఎనిమిది దాటే వుంటుంది. అరవింద్‌, సుజాతలు ఇంకా రాలేదు. చిట్టితల్లి అప్పుడే ఆకలని ఏడ్చింది. నిద్రలో ఆకలి మర్చిందేమో. సన్నని బాధ సుళ్లు తిరుగుతూనే వుంది నాలో.

చిట్టితల్లి ఆలోచనల్లోనే చిన్నగా కునుకుపట్టింది.

ఎల్‌.ఐ.సి. లోను కట్టడం చేతగావట్లేదని చేతులెత్తేసాడు అరవింద్‌. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఎవరో ఇల్లు చూసేందుకు వచ్చారు. మొక్కలన్నీ నరికేసి అపార్ట్‌మెంట్‌ కట్టాలని ఆలోచనట.

ఆ మాట వినగానే నాతోపాటు మిగతా చెట్లన్నీ గజగజ వణికిపోయాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను వదల్లేక చిట్టితల్లి ఒకటే ఏడుపు. సుజాత చిట్టితల్లి చేయి పుచ్చుకొని బరబర ఈడ్చుకుపోతోంది.

చిట్టితల్లి రోదన రంపపుకోతలా విన్పిస్తోంది. గుండె తరుక్కుపోతోంది. చిట్టితల్లిని వదిలేసి నేను బతకగలనా?

ఎక్కడో బాంబులు పేలినట్లు నేల అదురుకు ఒక్కసారిగా కంపిస్తూ కళ్లు తెరిచాను.

పీడకల! ఒళ్లంతా చెమటలు.

ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. వస్తువులేవో ఎగిరిపడుతున్న శబ్దాలు.

రాత్రి పన్నెండు దాటిందేమో.

ఉండుండి అరవింద్‌, సుజాతల అరుపులు; పిల్లల ఏడుపులు విన్పిస్తున్నాయి.

ఇంటికి ఏ శని పట్టిందో!

ఏడుస్తూ, ఇంట్లోంచి దూసుకువచ్చింది చిట్టితల్లి. వస్తూనే నన్ను చుట్టే సింది.గౌను మడతల్లో దాచిన వస్తువేదో నా మొదలు దగ్గరున్న డిసెంబరం కొమ్మల్ని పాయలుగా తీసి గుబుర్ల లో దాచింది.

ఎలా ఊర డించను?

“ఏం జరిగిందమ్మా,” అంటూ రేరాణిని అడిగాను.

తను చెప్పింది విని అవాక్కయిపోయాను.

వీరి మధ్య శతృత్వం చాపకింద నీరులా పాకు తోందని తెలుసుకానీ, పరాకాష్ఠకి చేరిందని ఇప్పుడే తెలి సింది.

ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చు కున్న కానుకల్ని, కలిసి తీయించుకున్న ఫోటోల్ని చింపేస్తూ, కాల్చేస్తున్నారట!

వణికిపోతూ వెక్కిళ్లతో బెక్కుతూనే ఉంది చిట్టితల్లి.

ఒకప్పుడు తమ పిల్లలతోపాటే మమ్మల్నీ, వెన్నె లనీ అపారంగా ప్రేమించిన వీళ్ల మధ్య అంతర్యుద్ధం ఎలా మొదలయిందని మూలాలు వెతకసాగేను.

మూలం ఏదైనా కానీ – తెగులు పట్టిందని చెట్టు మొదలు నరుక్కుంటారా!?

భగవాన్‌! దిక్కులు పిక్కటిల్లేలా నా బాధను అరిచి చెప్పడానికి నా స్వరాన్ని పలికించు.

చాలాసేపటికి సుజాత వచ్చింది. నన్ను కావలించుకున్న చిట్టితల్లిని నా నుండి విడదీసి, ఇంట్లోకి తీసుకెళ్లింది.
అప్పుడు గుర్తొచ్చి చూసేను, డిసెంబరం గుబుర్లలో చిట్టతల్లి దాచిందేమిటని? వెన్నెలకాంతిలో కన్పించింది.

మూడేళ్ల క్రితం మా అందరి మధ్య తీయించుకున్న ఫోటో.

మమ్మీ, డాడీల భుజాలపై కూర్చొని వాళ్ల మెడ చుట్టూ చేతులు బిగించి, నవ్వులు చిందిస్తూ – శ్రావణ్‌, చిట్టితల్లి.