రచన: అనిల్ ఎస్. రాయల్
ఫేస్‌బుక్ సాహితీ సమూహం ‘కథ’ గ్రూప్ కోసం వారం వారం ‘కథాయణం’ శీర్షికన కథలు రాయటంలో మెళకువలు వివరించమని ప్రముఖ రచయిత, ‘కథ’ గ్రూప్ వ్యవస్థాపక నిర్వాహకుడు వేంపల్లె షరీఫ్ అభ్యర్ధనతో ఈ వ్యాస పరంపర రూపుదిద్దుకుంది. 2014 సెప్టెంబర్ – నవంబర్ నెలల మధ్య తొమ్మిది వారాలుగా ‘కథ’ గ్రూపులో ప్రచురితమై, ఔత్సాహిక మరియు సీనియర్ రచయితల మన్ననలందుకున్న ‘కథాయణం’ వ్యాసాలని పుస్తకరూపంలో తీసుకురమ్మని నాకు పలు విజ్ఞప్తులు అందాయి. ‘కథ’ గ్రూప్‌లోని ఔత్సాహిక రచయితల ప్రయోజనార్ధం ఈ వ్యాసాలు రూపొందినప్పటికీ, వీటిని ఎక్కువమందికి అందుబాటులోకి తేవటం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఈ ‘కథాయణం’ పరంపరని పుస్తకంగా ప్రచురించాను. ఆ వ్యాసాలని ఈ ‘కథాలయం’ వెబ్‌సైట్‌లో కూడా ఉంచటం వెనకున్న సదుద్దేశమూ అదే.
_________________________________________________________________
చిట్కాలతో మంచి కథలు రాలవు. అంతమాత్రాన నాకు తెలిసినవీ, నేను పాటించేవీ నాలుగు కిటుకులు పదుగురితో పంచుకుంటే పోయేదేమీ లేదు. అందువల్ల ఈ వ్యాసాలు రాయటానికి పూనుకున్నాను. ఇవి ప్రధానంగా కథా రచనలో నేనవలంబించే పద్ధతులు విపులీకరించే వ్యాసాలు. కాబట్టి వీటిలో నా కథల ప్రస్తావన, వాటికి సంబంధించిన తెర వెనక విశేషాలు తరచూ కనిపిస్తుంటాయి. ఇది కథలు ‘ఇలాగే రాయాలి’ అంటూ రుద్దే ప్రయాస కాదు; ‘ఇలాగూ రాయొచ్చు’ అని చెప్పే ప్రయత్నం. ఇందులో వివరించే కిటుకులేవీ నేను కనిపెట్టినవి కావు; నేను పాటించేవి మాత్రమే. అందువల్ల వాటి మీద నాకు అంతో ఇంతో అవగాహనుంది. అన్ని చింతలకీ ఇవే మంత్రాలన్న అజ్ఞానం మాత్రం లేదు. వీటిలో కొన్ని నేను రాసే తరహా genre కథలకి మాత్రమే వర్తించే విషయాలు. మరి కొన్ని అన్ని రకాల కథలకీ పనికొచ్చే సంగతులు. వీటిలో కొన్నైనా మీకెవరికన్నా ఉపయోగపడితే సంతోషమే.
అనిల్ ఎస్. రాయల్
స్పందించండి