1. రచయితగా genre fiction వైపు మిమ్మల్ని ఆకర్షితుల్ని చేసింది ఏమిటి?

ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబోయేముందు కాల్పనిక సాహిత్యాన్ని లిటరరీ ఫిక్షన్, genre ఫిక్షన్ అని రెండుగా వర్గీకరించటంపై నా అభిప్రాయం చెప్పాలి.  ‘genre ఫిక్షన్ కానిదంతా లిటరరీ ఫిక్షన్’ అనే వాదన బహుళ ప్రాచుర్యంలో ఉంది. కానీ నా దృష్టిలో లిటరరీ ఫిక్షన్ అనబడేది కూడా ఒక genre మాత్రమే. తక్కిన అన్ని రకాల కాల్పనిక సాహిత్యానికీ ఉన్నట్లే లిటరరీ ఫిక్షన్‌గా పిలవబడే సీరియస్ సాహిత్యానికీ తనదంటూ ఓ పాఠక సమూహం ఉంది. అంతకు మించి దానికేం ప్రత్యేకత లేదు.

ఇప్పుడు మీ ప్రశ్నలోకి వద్దాం.

నేను రాయటం ప్రారంభించింది నాలుగైదేళ్ల క్రితం. అంతకు ముందు పాతికేళ్లకి పైగా నేను కేవలమో పాఠకుడిని. ఆ పాతికేళ్లలో గమనించిందేమంటే – తెలుగు కథల్లో లిటరరీ ఫిక్షన్ ఆధిపత్యం క్రమంగా పెరుగుతూ పోయి, చివరికి వేరే రకాల కథలు దాదాపు మృగ్యమైపోయాయి (నవలల్లో పరిస్థితి మెరుగ్గా ఉందేమో; నాకు తెలీదు). భావోద్వేగాల ప్రకటనకి, అంతరంగాల ఆవిష్కరణకి ప్రాముఖ్యతనిస్తూ ప్లాట్ డెవలప్‌మెంట్, స్ట్రక్చర్ వంటి శషబిషలు పెద్దగా పెట్టుకోని ఈ తరహా సాహిత్యం మీద నాకు అంతగా ఆసక్తి లేదు. బహుశా నాలో దాగున్న పాఠకుడిలో పసితనపు ఛాయలింకా పోలేదేమో. తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, దాని పోకడల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి కథల్లో చదివి తెలుసుకోవాలనే కోరిక వాడికి లేదు. దానికి మరింత ప్రభావశీలమైన దారులు వేరే ఉన్నాయి. వాడికి తన అనుభవంలోకి రాని, వచ్చే అవకాశం లేని వింతలు, విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. మెదడుకి పదును పెట్టే, అబ్బురపరచే కథలే వాడి ఆకలి తీరుస్తాయి. వాడికి కథల్లో పుష్కలంగా ఇమాజినేషన్ ఉండాలి. అందుకోసం ఊహాశక్తే ఊపిరిగా నడిచే genre కథలని మించినవేవి? దురదృష్టవశాత్తూ తెలుగులో ప్రస్తుతం హారర్, క్రైమ్, మిస్టరీ, చారిత్రకం, సాహసం, థ్రిల్లర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ వగైరా విభాగాలకి చెందిన కథలు దాదాపు రావటం లేదు. అడపాదడపా ఏవన్నా వచ్చినా వాటిలో నాణ్యత నాస్తి. ఈ అసంతృప్తి తరచూ స్నేహితులతో పంచుకుంటుండేవాడిని. ‘ఉత్తినే విమర్శించే బదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా’ అన్న వారి సూచనతో, నేను రాయటం మొదలు పెట్టాను. అంటే – నేను genre fiction రాస్తున్నది ప్రధానంగా నాలోని పాఠకుడిని సంతృప్తి పరచటం కోసం.

2. మీకు ప్రత్యేకించి సైన్స్ ఫిక్షన్ మీదున్న ఆసక్తికి కారణం?

నా విద్యా నేపధ్యం వల్ల సైన్స్ పై చిన్నప్పట్నుండీ ఆసక్తి మెండు. నాకు ఎక్కువ పరిచయం ఉన్న సబ్జెక్ట్ కావటం వల్ల, సహజంగానే కథలు రాయటానికి సంకల్పించినప్పుడు సైన్స్ ఫిక్షన్ వైపు అడుగులేశాను.

ఇక్కడో విషయం చెప్పాలి. మన కథా విమర్శకుల్లో కొందరికి సైన్స్ ఫిక్షన్ అనేది పల్ప్ ఫిక్షన్ అని, అందులో సామాజిక స్పృహ కొరవడుతుందని ఓ దురభిప్రాయం ఉంది. అది సరికాదు. ఈ తరహా కాల్పనిక సాహిత్యం పాఠకులకి శాస్త్రంపై ఆసక్తి పెంచుతుంది. వాళ్లకి ప్రశ్నించటం అలవాటు చేస్తుంది. తర్కాన్ని నేర్పుతుంది. సైన్స్ ఫిక్షన్ విరివిగా చదివి శాస్త్రవిజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకుని కాలక్రమంలో సైంటిస్టులుగా మారి వినూత్న ఆవిష్కరణలు చేసిన మహామహులెందరో ఉన్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని పెను మార్పులకు గురిచేసిన ఆవిష్కరణలెన్నిటికో మూలాలు సై-ఫై సాహిత్యంలో ఉన్నాయి. ఇంటర్నెట్, సెల్‌ఫోన్స్, శాటిలైట్స్, రోబాట్స్, సబ్‌మెరైన్స్, ఎలెక్ట్రిక్ కార్స్, స్పేస్ ట్రావెల్, జెనెటిక్ ఇంజినీరింగ్, సంప్రదాయేతర ఇంధనాలు, వగైరా, వగైరా. స్టార్‌ట్రెక్ నుండి స్ఫూర్తి పొంది తయారైన సాంకేతిక ఉపకరణాలు లెక్కలేనన్ని. అవి ప్రస్తుతం మనమున్న ప్రపంచాన్ని సమూలంగా మార్చివేశాయి. కాబట్టి సమాజాల మీద సైన్స్ ఫిక్షన్ ప్రభావం తీసిపారేయలేనిది. అన్నిటినీ మించి, సైన్స్ ఫిక్షన్ పలు రకాల భవిష్యత్తులని ఊహిస్తుంది. ఏ రకం భవిష్యత్తు కావాలో తేల్చుకోమంటుంది. ఆ కోణంలో చూస్తే, సైన్స్ ఫిక్షన్‌లోంచి ఎంటర్టెయిన్‌మెంటే కాక, కావాల్సినంత ‘సామాజిక స్పృహ’ కూడా రాలిపడుతుంది.

3. మీ రచనల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ ని ఎలా నిర్వచించుకుంటారు?

శాస్త్రీయ విజ్ఞానానికి తగు మోతాదులో కల్పన జోడించి రాసేవి సైన్స్ ఫిక్షన్ కథలు.  ‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ఊహనుండి పుట్టుకొచ్చే స్పెకులేటివ్ ఫిక్షన్ ఇది. ఇందులో ప్రధానంగా టెక్నాలజీ ప్రభావం మానవాళిపై ఎలా ఉంటుందనేది ఇతివృత్తంగా ఉంటుంది. ఒకరకంగా, సైన్స్ ఫిక్షన్ కథలని కాషనరీ టేల్స్ అనొచ్చు.

4. సైన్స్ ఫిక్షన్ రచయిత ఎదుర్కొనే సవాళ్లు ఎలాంటివి?

ఏ రకం కథలకి ఉండే సవాళ్లు వాటికి ఉంటాయి. సైన్స్ ఫిక్షన్‌కి సంబంధించినంతవరకూ అతి పెద్ద సవాల్ స్థలాభావ సమస్యని అధిగమించటం. తెలుగు (అచ్చు) పత్రికల్లో ఓ కథకి సుమారుగా రెండువేల పదాలకన్నా ఎక్కువుండకూడదనే అనధికార నియమం ఉంది. కాబట్టి కథకి క్లుప్తత చాలా ముఖ్యం. లిటరరీ తరహా సాహిత్యానికి ఇదో పెద్ద సమస్య కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కథకి నేపధ్యంగా ఎంచుకున్నప్పుడు ఆ ప్రపంచాన్ని, అందులోని మనుషుల బాధల్ని, వాళ్ల సంతోషాల్ని, వాళ్ల చర్యల్ని, ప్రతిచర్యల్ని, వాడే వస్తువుల్ని, మాట్లాడే మాటల్ని, వాటి అర్ధాల్ని …. ఏవీ ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. పాఠకులెరిగిన లోకమది. దానితోనూ, ఆ పాత్రలతోనూ వాళ్లు వెంటనే కనెక్ట్ అవుతారు. ఇక్కడ రచయిత ఎకాఎకీ పాత్రల వ్యక్తిత్వాల ఆవిష్కరణలోకి, కథ చెప్పటంలోకి దిగిపోవచ్చు. అదే ఏ సుదూర గ్రహమ్మీదనో జరిగే సై-ఫై కథొకటి చెప్పాలనుకోండి. పాఠకుల్ని ఓ కొత్త లోకంలోకి లాక్కుపోవాలి. ఆ వాతావరణానికి వాళ్లు అలవాటు పడేలా చెయ్యాలి. అక్కడ వాహనాలు ఎలా పరిగెడతాయి, రాజకీయాలెలా తగలడతాయి, పిల్లలెలా పుడతారు, ఆ సమాజం ఎలా ఉంది, అక్కడి జీవులు ఎలాంటి సాంఘిక, నైతిక సమస్యలతో సతమతమవుతుంటారు – ఇలాంటివన్నీ కొత్తగా పాఠకుడికి ‘నేర్పాలి’. ఉదాహరణకి – భవిష్యత్తులో బయాట్ల మధ్య జరగబోయే యుద్ధాల నేపధ్యంలో ఓ కథ రాయాలంటే – ఆ భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంది, అసలు బయాట్ అంటే ఏంటి …. ఇత్యాదివి వివరించాలి. మళ్లీ ఇవన్నీ పనిగట్టుకుని చెబుతున్నట్లుండకూడదు. అలా చేస్తే అదో విసుగెత్తించే వ్యాసంలా తయారవుతుంది. వివరణ ఎక్కువైతే అచ్చులో పట్టటంలేదని ఎడిటర్ గగ్గోలు పెడతాడు. తక్కువైతే పాఠకుల తల తిరిగే ప్రమాదం. కత్తి మీద సామన్న మాట.

ఇక రెండో పెద్ద సవాల్, కథలో ప్రస్తావించిన సైన్స్ విశేషాలు పాఠకులకి ఏ మోతాదులో వివరించాలనేది. ఏబీసీడీలనుండి మొదలు పెట్టి విడమర్చాలా, లేక వాళ్లకి అంతా తెలుసని భావిస్తూ వివరాలు వదిలేయాలా, లేక మధ్యస్తంగా పోవాలా? ఇది కూడా కత్తి మీద సామే. దీనికీ పైన ప్రస్తావించిన స్థలాభావ సమస్యకీ ప్రత్యక్ష సంబంధం ఉంది.

5. సైన్స్ ఫిక్షన్ రచనలో సైన్సు పాళ్లూ, కథ పాళ్ల మధ్య సమన్వయం సాధించటం ఎలా?

‘ఇదిగో ఇలా’ అనే సమాధానం చెప్పను. ఆ పని నేను ఎలా చేస్తాను అనేది మాత్రం చెబుతాను.

నేను రాసే కథల్లో శాస్త్ర విజ్ఞానం అనేది కథ మీద ఉత్సుకత కలిగించటానికి ఉపయోగపడే పనిముట్టు మాత్రమే. అందులో శాస్త్రం పాళ్లు మోతాదు మించితే కథ పల్చబడుతుంది. అప్పుడదో సైన్స్ పాఠంలా కనిపిస్తుంది. కథ ద్వారా పాఠాలు చెప్పటం నా ధ్యేయం కాదు. బిగుతైన కథనంతో పాఠకుల్ని చివరిదాకా కట్టిపడేయటం, చదివాక ఓ చక్కటి అనుభూతికి గురిచెయ్యటం కథకుడిగా నా ప్రధాన లక్ష్యం. విభిన్నమైన, ఊహాతీతమైన కథాంశాన్ని ఎంచుకోవటంలో సైన్స్ నాకు సహకరిస్తుంది. అంతవరకే. ఆ తర్వాతిదంతా కల్పనే. నేను సాధారణంగా ముగింపు నుండి కథ మొదలు పెడతాను. అక్కడ నుండి కథని వెనక్కి ఊహించుకుంటూ పోతాను. మధ్యలో అవసరమ్మేరా సైన్స్ సంగతులు వెదజల్లుతాను. వివరణలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని చోట్ల కథనానికి అవసరమయ్యే హింట్స్ మాత్రమే వదిలి మిగతా వివరాలు పాఠకుల ఊహకే వదిలేస్తాను. ఏం రాసినా, ఎలా రాసినా – నేను రాస్తున్నది కథ మాత్రమే, సైన్స్ పేపర్ కాదు అన్న స్ప్రాహలోనే ఉండి రాస్తాను. నా ప్రధమ ప్రాధాన్యతెప్పుడూ ఆసక్తికరంగా కథ చెప్పటానికే.

6.     తెలుగులో శాస్త్రీయ పదజాలం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కథనంలో వివిధ కాన్సెప్టులను వివరించటానికే ఎక్కువ సమయం తీసుకోవాల్సిన పరిస్థితిని ఎలా అధిగమిస్తారు

శాస్త్రీయ పదజాలానికి తెలుగులో సమానార్ధకాలు లేకపోవటం పెద్ద సమస్య కాదు. అంతకు మించిన సమస్య, చాలామంది పాఠకులకి సైన్స్‌లో పెద్దగా ప్రవేశం లేకపోవటం. ఉదాహరణకి, Many Worlds Interpretation అంటే ఏంటో తెలిసిన పాఠకులెందరు? నా రెండో కథ ‘మరో ప్రపంచం’ దాని చుట్టూ తిరుగుతుంది. సాంకేతిక పదజాలాలతో పటాటోపం ప్రదర్శించకుండా అతి సాధారణ విషయాల సాయంతో సోదాహరణంగా, కథలో సహజంగా అతికేటట్లు, ఇలాంటివి వివరించాలి. ఈ సమస్య అధిగమించటానికి నేను తరచూ వాడే చిట్కా ఒకటుంది. నా కథల్లో కనీసం ఒక పాత్రని సగటు పాఠకుడి స్థాయిలో సృష్టిస్తాను. పాఠకుడికి వచ్చే సందేహాలు ఈ పాత్ర ద్వారా మరో పాత్రని అడిగించటం ద్వారానో, మరే విధంగానో అవసరమైన కాన్సెప్ట్స్ విశదీకరిస్తాను. చిట్కా పాతదే. కానీ ప్రతిసారీ పనిచేస్తుంది.

7. మీ సైన్స్ ఫిక్షన్ కథల్లో టైమ్ ట్రావెల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందనిపిస్తుంది. ఐడియా పట్ల ఎందుకంత ఆసక్తి

మీరన్నది నిజమే. నేనింతవరకూ ఎనిమిది కథలు రాస్తే, వాటిలో మూడు టైమ్ ట్రావెల్ కథలు. మరో రెండిట్లో పరోక్షంగా కాలం ప్రస్తావన ఉంటుంది. ‘టైమెంత?’, ‘నిన్న ఎక్కడికెళ్లావు?’, ‘రేపేం చేస్తున్నావు?’, ‘ముహూర్తం ఎప్పుడు?’, ‘ఎన్ని గంటలకు కలుద్దాం?’, ‘ఎంతసేపు పడుతుంది?’ …. మన దైనందిన వ్యవహారాల్లో రోజుకెన్ని సార్లు కాలం ప్రస్తావనొస్తుందో చూడండి. అది లేని మానవ జీవితాన్ని ఊహించగలమా? మనం ఇంతగా ఆధారపడే కాలం గురించి నిజానికి మనకి తెలిసింది అతి తక్కువ. అదో పెద్ద పజిల్. అసలు కాలం అంటే ఏంటి? అది ఎప్పటి నుండీ ఉంది? ఎందుకు మనం కాలంలో ముందుకే తప్ప వెనక్కి పోలేం? ఎందుకు మనకి గతం గుర్తున్నట్లు భవిష్యత్తు గుర్తుండదు? సమాధానాల్లేని ప్రశ్నలివన్నీ. ఇలాంటి ఊహలని, ఒకవేళ అవి నిజమైతే ఎదురయ్యే paradoxes ని వాడుకుని ఉత్కంఠభరితమైన కథలు చెప్పటం నాకో సరదా. నా కథలు ఎక్కువగా కాలం నేపధ్యంలో సాగటానికి అంతకన్నా వేరే కారణం లేదు. ఐతే, ఈ మోజు వదిలించుకోటానికి ప్రయత్నిస్తున్నాను. మీరు గమనించారో లేదో, నా చివరి మూడు కథల్లోనూ కాలం ప్రస్తావన లేదు.

8. సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ ఫిక్షన్ కి, genre ఫిక్షన్ కి మధ్య రచనపరంగా మీకు తోచిన బేధాలు ఏమిటి

ఆంగ్ల సాహిత్యానికి సంబంధించినంతవరకూ, మెయిన్ స్ట్రీమ్ ఫిక్షన్ అంటే ఎక్కువగా అమ్ముడుపోయే పాపులర్ ఫిక్షన్. ఇది పాత్రల చిత్రీకరణ మీద కూడా కాస్త దృష్టిపెట్టే genre సాహిత్యమన్నమాట. అదే తెలుగులోకొచ్చేసరికి, మనకి ప్రస్తుతం వస్తున్నదంతా దాదాపు లిటరరీ ఫిక్షనే కాబట్టి, అదే ఇక్కడ ప్రధాన స్రవంతి సాహిత్యంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ‘మెయిన్ స్ట్రీమ్ ఫిక్షన్’ అన్నది లిటరరీ ఫిక్షన్ని ఉద్దేశించేనని భావిస్తున్నాను. ఈ రకమైన కథల్లో కథకుడి దృష్టి ప్రధానంగా పాత్రల వ్యక్తిత్వ చిత్రణ మీద, వాటి అంతఃసంఘర్షణ ఆవిష్కరించటమ్మీద, ఏదో ఓ ఫిలసాఫికల్ ఐడియాని వెల్లడించటం మీద ఉంటుంది. ఇక్కడ పాత్రల చేతలకన్నా వాటి ఆలోచనలు, అనుభూతులు, ఆవేశాల వ్యక్తీకరణకి ప్రాధాన్యత ఎక్కువ. అందువల్ల ఈ తరహా కథలు చిక్కటి భాష మరియు చక్కటి శైలి మీద ఎక్కువగా ఆధారపడతాయి. ఎత్తుగడ, ముగింపు, plot, మలుపులు, ఉత్కంఠ ఇత్యాదివి ఇక్కడ పెద్దగా ప్రాముఖ్యత లేని విషయాలు. ఆ కారణంగా, లిటరరీ ఫిక్షన్ ‘ఇలాగే రాయాలి’ అనే కట్టుబాట్లేమీ లేవు. రాయగలిగేవారికి ఈ తరహా కథల్లో ఆకాశమే హద్దు. ఇతర తరహా కథలకి లేని వెసులుబాటిది. ఈ వెసులుబాటే లిటరరీ ఫిక్షన్ కొంప ముంచుతుంది. అదెలాగో సందర్భమొచ్చినప్పుడు మాట్లాడుకుందాం.

ఇక, genre కథలు ప్రధానంగా plot element మీద ఆధారపడతాయి. వీటిలో action ఎక్కువ. కథనాన్ని పరుగులెత్తించాలి. ఊహించని మలుపులుండాలి. పాఠకుల్ని ఊపిరితీసుకోనివ్వకూడదు. ఫిలాసఫీలూ అవీ ఉంటే ఉండొచ్చు కానీ అవి ముఖ్యం కాదు. ప్రతి genre కి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. ‘ఇలా చెయ్యాలి, ఇది చెయ్యకూడదు’ అనే కట్టుబాట్లుంటాయి. ఆ కన్వెషన్స్ పాటిస్తూనే, ఆ కట్టుబాట్లు మీరకుండానే కథలో కొత్తదనమేదో చూపాలి. దానికోసం కథకుడు చాలా కసరత్తు చేయాల్సుంటుంది. రొమాన్స్ వంటి genres వదిలేస్తే, మిగిలినవాటిలో కథకుడు భావోద్వేగాల కన్నా తర్కం మీద ఎక్కువగా ఆధారపడాలి. అంతా పకడ్బందీగా ఉండాలి. ఓ సైన్స్ ఫిక్షన్ కథకి పాఠకుల్ని ప్రిపేర్ చెయ్యటంలో ఉన్న సాధకబాధకాలు ఇందాక వేరే ప్రశ్నకి సమాధానంగా చెప్పాను. అలాగే, ఒక డిటెక్టివ్ కథ రాయాలంటే రచయితకి నేరగాళ్ల, పోలీసుల ఆలోచనా సరళిపై, వాళ్లు పని చేసే పద్ధతులపై అవగాహన ఉండాలి. అవసరమైతే ఆయుధాల గురించి, వాటిని ఉపయోగించే వైనం, ఫోరెన్సిక్స్, క్లూస్ టీమ్ పనిచేసే విధానం …. ఇలా సవాలక్ష విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ చాలనట్లు ఇంతకు ముందెక్కడా మరే కథలోనూ రాని విధంగా ఓ నేర ఘటన సృష్టించాలి. దానికి వీలైనన్ని ముడులు వేయాలి. ఓ పజిల్ తయారు చెయ్యాలి. పాఠకుల్ని ఉత్కంఠకి గురి చేస్తూ ఆ పజిల్‌ని పరిష్కరించాలి. కథ నిండా క్లూస్ వదుల్తూనే వాటి మీదకి పాఠకుల దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం అవసరమైనన్ని red herrings చొప్పించాలి.  చివర్లో పాఠకుడు ‘అర్రెర్రె …. అన్ని హింట్స్ ఇచ్చినా ఈ ముగింపు ఎలా పసిగట్టలేకపోయానా!’ అనుకునేట్టు చెయ్యగలగాలి. లిటరరీ ఫిక్షన్‌కి మాదిరే genre ఫిక్షన్‌కి కూడా భాష ముఖ్యమే. కానీ దాన్ని పాత్రల భావావేశాల వ్యక్తీకరణకి బదులు ఎక్కువగా witty and vivid dialogue కోసం, సంఘటనల, సన్నివేశాల వర్ణన కోసం వాడాల్సుంటుంది.

9. తెలుగులో మీకు నచ్చిన సైన్స్ ఫిక్షన్ రచనలేమన్నా ఉన్నాయా?

చిన్నప్పుడు చదివిన యండమూరి వీరేంద్రనాధ్ ‘యుగాంతం’ అప్పట్లో బాగా నచ్చింది. మళ్లీ ఇప్పుడు చదివితే ఎలా అనిపిస్తుందో తెలీదు. అంతకు మించి గుర్తు పెట్టుకోదగ్గ గొప్ప సైన్స్ ఫిక్షన్ రచనలు తెలుగులో నేను చదవలేదు. మహీధర నళినీ మోహన్ రావ్ గారు సైన్స్ మీద చాలా రాశారని విన్నాను కానీ, ఆయన సైన్స్ ఫిక్షన్ రాసిందీ లేనిదీ తెలీదు.

10. Genre fiction తెలుగులో నిర్లక్ష్యం కాబడిందని భావిస్తున్నారా? కారణాలేమై ఉండొచ్చు?

ఘోరమైన నిర్లక్షానికి గురయింది. ‘ఆ తరహా కథలకి పత్రికా సంపాదకుల నుండి ప్రోత్సాహం ఉండదు. అందుకే అవి ఎవరూ రాయటం లేదు’ అనే వాదనొకటి తరచూ వినిపిస్తుంది. దాన్ని నేను అంగీకరించను. కథలో సరుకుంటే, అది ఏ తరహా కథైనా, ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తుంది.

మరి genre fiction ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతుంది? నాకు తోచినంతవరకూ దానికి ప్రధాన కారణం, అది రాయటానికి అవసరమైన ఓపిక కథకులకి లేకపోవటం. కథ రాయాలంటే పైన చెప్పిన కసరత్తులన్నీ ఏం చేస్తాం అనే బద్ధకం. ఆ గోలంతా లేకుండా రాయటానికి కట్టుబాట్లు లేని లిటరరీ ఫిక్షన్ ఉండనే ఉందిగా.

ఇలా అంటున్నానని, లిటరరీ ఫిక్షన్ రాయటం నీళ్లు తాగినంత తేలికని నా ఉద్దేశం కాదు. ప్లాట్ అనేది లేకుండా కేవలం భావోద్వేగాల మీద ఆధారపడి కథ చెప్పి మెప్పించటం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా చాతుర్యం కావాలి. భాష మీద భీకరమైన పట్టుండాలి. అవి రెండూ ఉన్న వాళ్లు తెలుగులో అతి కొద్దిమందే ఉన్నారు. మిగిలిన వాళ్లతోనే సమస్య. ఇందాకన్నాను కదా – సందర్భమొచ్చినప్పుడు మాట్లాడుకుందామని. లిటరరీ ఫిక్షన్‌కి ఉన్న ఫ్లెక్సిబిలిటీని అలుసుగా తీసుకుని చాలామంది చేతికొచ్చింది రాసేసి అదంతా సీరియస్ సాహిత్యం అంటూ పాఠకుల నెత్తిన కుమ్మరిస్తున్నారు. వార్తా పత్రికొకటి తిరగేస్తే బోలెడంత ముడిసరుకు దొరుకుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో చివరాఖరుకు తెలుసుకున్న నిరుద్యోగి, కొత్తగా కొన్న కారుకు పడ్డ సొట్ట చూసి గుండె తరుక్కుపోయిన చిరుద్యోగి, భార్య పుస్తెలమ్మి వేయించిన బోరులో నీళ్లు పడక భోరుమన్న బక్క రైతు, సాఫ్ట్‌వేర్ జీవుల సంసారాల్లో పదనిసలు, సమకాలీన సాంఘిక సమస్యలపై రన్నింగ్ కామెంటరీ – ఇలాంటి అంశాలతో కథలు రాయటానికి పరిశోధనలు, పరిశ్రమ అవసరం లేదు. కథ రాయాలనే ఆసక్తి, తప్పుల్లేకుండా తెలుగు రాయగలిగే శక్తి ఉంటే చాలు. కుప్పలు తెప్పలుగా రాసిపారేయొచ్చు. ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నదదే. రోజువారీ జీవితాల్లోని చిరాకులు, చిక్కులు తలపోసుకుని ఉసూరుమనే పాత్రల నిట్టూర్పులతో పేజీలు నింపేసి అదే కథంటూ అచ్చోసి వదుల్తున్నారు. డైరీల్లో రాసుకునే సరుకుని ఫిక్షన్ అనేస్తున్నారు. స్వీయానుభవాలనుండి కథలల్లటం తప్పేమీ కాదు. ఐతే కథలల్లటంలో అదో ప్రక్రియ మాత్రమే. అధిక శాతం కథకులెరిగిన ఏకైక ప్రక్రియగా అదొక్కటే మిగలటం తెలుగు కథల్లో భిన్నత్వలేమికి కారణం. పైగా కథలతో సమాజంలో మార్పులేవో తెచ్చేయాలనే ఉబలాటమొకటి! నాకు తెలిసి ఈ ధోరణి తెచ్చిన ఒకే మార్పు – పాఠకులు తెలుగు కథలంటే భయపడి పారిపోవటం. ఐదు కోట్లకి పైగా అక్షరాస్యులున్న భాషలో ఓ కథల పుస్తకం ఐదు వేల కాపీలు అమ్ముడుపోతే సంబరాలు చేసుకునే స్థితిలో ఉన్నాం. ఎవరూ చదవని సాహిత్యం ఎవరిని ఉద్ధరిస్తుంది? సమాజాన్ని మార్చటం ఏమో కానీ, ముందు మన కథకులు మారాలి. అప్పుడే తెలుగు కథ కళకళలాడుతుంది.

11. మీ అభిమాన సైన్స్ ఫిక్షన్ రచయితలు, రచనలు ఎవరో ఏమిటో చెప్పండి?

అభిమాన రచయితలు చాలామంది ఉన్నారు. ఎవరికి వారే గొప్ప రచయితలు. అందర్లోకీ రాబర్ట్ హెయిన్‌లిన్ రచనలంటే ఎక్కువ ఇష్టం.

12.  సైన్స్ ఫిక్షన్ రచయిత లాంటి ముద్రలు ఎపుడన్నాపరిమితులుగా మారే సందర్భాలుండొచ్చా

లిటరరీ ఫిక్షన్ మాత్రమే రాసే వారికి లేని పరిమితులు నాకెందుకు ఏర్పడతాయనుకుంటున్నారు?

ఇంతకీ, ‘పరిమితి’ అంటే – సైన్స్ ఫిక్షన్ రచయితగా ముద్ర పడితే ఇక వేరే రకం కథలు రాయలేకుండా పోతాననా, రాసినా ఎవరూ పట్టించుకోరనా? నాకైతే అలాంటి భయం కానీ అనుమానాలు కానీ లేవు. ‘శిక్ష’ సైన్స్ ఫిక్షన్ కథ కాదు. దానికీ మంచి గుర్తింపే వచ్చింది కదా. కాకపోతే, అలాంటి కథలు ఆటవిడుపుగా రాస్తేనే బాగుంటుంది. అన్ని రకాలూ రాసి సవ్యసాచి అనిపించుకోవాలనే దుగ్ధతో ఆసక్తి లేని సాహిత్యం జోలికెళ్లటం వల్ల ఆ తరహా సాహిత్యానికి కానీ, నాకు కానీ ఒరిగేదేమీ ఉండదు. అదీ కాక, లిటరరీ ఫిక్షన్ అద్భుతంగా రాయగలిగేవాళ్లు వేరేవాళ్లున్నారు. కాబట్టి ఆ తరహా కథలకి నా అవసరం లేదు. నేను రాయటానికి సైన్స్ ఫిక్షన్‌లోనే లెక్కలేనన్ని ఉపవర్గాలున్నాయి: space opera, మెడికల్ థ్రిల్లర్, టైమ్ ట్రావెల్, మిలిటరీ ఫిక్షన్, alien invasion, సైబర్‌పంక్, రోబాటిక్ ఫిక్షన్, మొదలైనవి. వీటిలో ఇప్పటిదాకా నేను స్పృశించినవి రెండో మూడో. ఈ మార్గంలో నా ప్రయాణం ఇంకా మొదట్లోనే ఉంది. చేరాల్సిన మజిలీలు చాలా ఉన్నాయి. కాబట్టి నన్నిలాగే సై-ఫై బావుటా పట్టుకుని పరుగెత్తనీయండి.

ఒకవేళ, మీ ప్రశ్నకి అర్ధం – సై-ఫై కథలే రాస్తూ కూర్చుంటే సాహితీరంగంలో పైకెదగడానికి పరిమితులు ఏర్పడతాయనా? ఆ భయం అసలే లేదు. ఏ తరహా కథలు రాసినా, వాటిలో సత్తా ఉంటే గుర్తింపు వద్దన్నా వస్తుంది. చెత్త రాస్తే ఎంత మొత్తుకున్నా రాదు. కాబట్టి ఈ ముద్రల్నీ వాటినీ నేను పట్టించుకోను.

13.  మీ కథల్లో మీకు నచ్చిన కథ

‘శిక్ష’. ఇప్పటిదాకా నేను రాసిన కథల్లో సైన్స్ ఊసులేనిది ఇదొక్కటే. అన్నిట్లోకీ ఈ కథే నచ్చటానికి కారణం మాత్రం అది కాదు. ఎంచుకున్న ఇతివృత్తాలకి అనుగుణంగా, మిగిలిన కథలన్నిట్లోనూ భావ వ్యక్తీకరణ, కథనం, భాష వంటి విషయాల్లో నా సహజ శైలికి చాలా దూరం జరిగి రాయాల్సొచ్చింది. ‘శిక్ష’లో మాత్రం నేను స్వేఛ్ఛగా కలం కదిలించగలిగాను. అందుకే ఈ కథ నేను ఇప్పటిదాకా రాసినవాటిలో నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైనది.

నా సై-ఫై కథల్లోనైతే ‘ప్రళయం’ బాగా నచ్చింది.


‘కినిగె’, మే 2014